నువ్వెళ్ళిపోయాక కూడా…

నువ్వెళ్లిపోయాక కూడా
నీ కలల చెట్టు పూలు పూస్తుండాలి
కాలం ఒడ్డున
నీ అడుగుజాడలు మెరుస్తుండాలి
నీ మాటల తోరణాలు
గుమ్మానికి పచ్చగా వేలాడుతుండాలి
నువ్వు జీవితం గురువు దగ్గర
నేర్చుకున్న పాఠాలన్నీ
కోయిల పాటలై
వనాల గొంతుతో వసంతాల్ని పిలుస్తుండాలి

ఏ ఒంటరి సాయంత్రానో
లైబ్రరీ మెట్ల మీద కూర్చొన్నప్పుడు
దూరాన విరిసే
ప్రతి చిర్నవ్వు రంగులచాపంలోనూ
నువ్వే ప్రతిఫలిస్తుండాలి

ఏ అర్ధరాత్రో నిద్రపట్టక
డాబా మీద కెళ్లినప్పుడు
గాలికి ఊగే మొక్కగానో
వెన్నెల నీడగానో
నీ పలకరింపు వినిపించాలి

ఏ పార్కు బెంచీ మీదో చేరబడి
కళ్ళుమూసుకుని జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు
నీ జ్ఞాపకాల సీతాకోకచిలుకతో
గుండె పూలతోటై పరవశించాలి

నువ్వెళ్లిపోయాక కూడా
నీలోంచి తవ్వుకొనీ తవ్వుకొనీ
ప్రపంచం
తలపాగాలా చుట్టుకోవడానికీ
గుండెల మీద
గర్వంగా ముద్రించుకోవడానికీ
బతికున్నప్పుడే నేలలో లోతుగా
నీదైన ఏదో నిధిని పాతిపెట్టాలి!

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply