నువ్వెటు వైపు?

వర్గం, కులం, మతం, జెండర్, ప్రాంతం… ఎన్నెన్నో విభజన రేఖల నడుమ కుదించుకుని బతుకుతున్న మానవ సమూహమే సమాజం. ఈ మనుషుల్లో స్థూలంగా మూడు రకాలను గుర్తించవచ్చు-

అసమానతలు పునాదిగా ఆధిపత్య వ్యవస్థలను సృష్టించే శక్తులు ఒకవైపు – వాటిని పెకలించటానికి పోరాడే మనుషులు మరొక వైపు. ఈ రెండు రకాల వాళ్లకూ స్పష్టమైన, స్థిరమైన లక్ష్యాలున్నాయి.  వారి నడుమ యుగాలుగా ఎడతెగని పోరు!

ఈ రెండు శక్తుల నడుమ అసంఖ్యాకమైన జనసమూహం.

వీళ్లకు జీవితం గురించి స్పష్టమైన ఎజెండా లేదు. అసలు దాన్ని గురించి ఆలోచించుకునే పరిజ్ఞానమూ, వెసులుబాటూ కూడా దొరకవు. జీవితపు సుడిగాలిలో కొట్టుకుపోతూ తమను బలంగా ప్రభావితం చేయగల శక్తులను వాటేసుకుంటారు. ఆ శక్తులు వారిని ఎటువైపు నడిపిస్తాయనేదాన్ని బట్టి సమాజ భవితవ్యం – అంటే పేదలు, దళితులు, ఆదివాసులు, మత మైనారిటీలు, స్త్రీలు వంటి పీడిత ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

ఇంత విస్తృతమైన సబ్జెక్ట్ లోని ఒక అంశాన్ని గురించి ఒక చిన్న కథలో మాట్లాడుతున్నాడు మహమ్మద్ ఖదీర్ బాబు. ఈ దేశంలో ముస్లిం మైనారిటీలు భద్రంగా, గౌరవంగా, సమానులుగా జీవించటానికి తగిన వాతావరణాన్ని కల్పించటానికి, మెజారిటీ సామాన్యులను అందుకు సన్నద్ధం చెయ్యటానికీ బుద్ధిజీవులు కొందరైనా సిద్ధపడుతున్న ఆశావహ దృశ్యాన్ని చూపుతూ, “డూ యూ జాయిన్?” అని ప్రశ్నిస్తోంది ఈ కథ.

*

కథాస్థలం జైపూర్ లిటరరీ ఫెస్టివల్. హైదరాబాద్ నుండి వెళ్లిన ఒక ముస్లిం జర్నలిస్టు, అతడికి పరిచయమైన దర్పణ్, రిజ్వీ, సుచైతా అనే మరో ముగ్గురు జర్నలిస్టుల నడుమ జరిగే కథ. చాలా క్యాజువల్ గా అనిపించే వాళ్ళ సంభాషణలు, ఎంతో సీరియస్ సమస్యలను పరోక్షంగా సూచిస్తాయి. వాళ్లు హాజరయిన సెషన్స్ లో జరిగిన చర్చలు జవాబు దొరకని ప్రశ్నలను మనముందు పెడతాయి. “స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే దేశంలో అదే స్త్రీలపై వ్యవస్థీకృత హింస ఎలా ఆమోదనీయం అయింది?” అని ఒక వక్త అడిగిన ప్రశ్న రిజ్వీని ఆలోచనలో పడేసింది.

ఇరవయ్యారు అక్షరాల ఇంగ్లిష్ వర్ణమాలలోని ఐదు అచ్చుల మూలంగా తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని అభద్రతలో పడిన ఇరవైఒక్క హల్లులు అచ్చులను నిర్మూలించాలని ప్రయత్నం చెయ్యటమనే కథాంశంతో కౌషిక్ రాయ్ రాసిన వ్యంగ్య రచన ‘అల్ఫాబెటిక – ఎ సెటైర్ ఆన్ మెజారిటేరియనిజం ‘.  సంఖ్యా బలం కలిగిన హల్లులు అల్పసంఖ్యాకమైన అచ్చులను తుడిచేస్తే, అన్ని అక్షరాలూ కలిసి సృష్టించిన అందమైన భాష గతేమిటి? అని ఆ రచయిత వేసిన ప్రశ్న ఈ నలుగురు జర్నలిస్టుల్లో ఏ అశాంతిని రేపిందోగానీ, వివిధ సంస్కృతులను చేతులుచాచి ఆలింగనం చేసుకున్న అజ్మీర్ సూఫీ దర్గాను సందర్శించి స్థిమిత పడాలనే ఆలోచనతో నలుగురికీ ఏకాభిప్రాయం కుదిరింది.

“అజ్మీర్ దర్గా గొప్ప హ్యూమన్ ఇంటరాక్షన్ జరిగే క్షేత్రం. దేశం నలుమూలల నుంచి రకరకాల వాళ్లు వచ్చి మనందరం దాదాపు ఒకేలాంటి వాళ్ళం అని తెలుసుకుంటారు.” అని వివరించాడు రిజ్వీ.

ఐతే, ఒక సామూహిక ప్రయాణాన్ని సవ్యంగా సాగించటం ప్రస్తుత కాలంలో అంత సులభమేమీ కాదు. మనుషులను కలిపే అంశాలకన్నా విభజించే లక్షణాలే సమాజంలో స్థిరపడ్డాయి. అజ్మీర్ బయల్దేరిన ఈ నలుగురివీ నాలుగు నేపథ్యాలు. దర్పణ్, సుచైతా హిందువులు. అయితే మాత్రం? స్త్రీలూ, పురుషులూ సమానులు కావటానికి ఇంకెంత దూరం నడవాలో కదా! కథ చెబుతున్న జర్నలిస్టు, రిజ్వీ కూడా ముస్లింలే. కానీ, ముస్లింలందరూ ఒకటి కాదని చెప్పే సంప్రదాయాలు బోలెడన్ని! ఒకరిది దర్గాలకు వెళ్లే ఆనవాయితీ అయితే, మరొకరిది అడుగైనా పెట్టకూడని ఆచారం. గట్టిగా ప్రయత్నించాలే కానీ వీళ్ళను తలొక దారికీ మళ్లించటం కష్టమేమీ కాదు.

అలాంటి చొరవ, సామర్థ్యం కలిగిన అనుభవజ్ఞుడు దివేకర్. సీనియర్ పాత్రికేయుడు మాత్రమే కాదు,  ఈ దేశ సంస్కృతికి ఒక నమూనాను రూపొందించే వ్యవస్థలపై పట్టు సాధించిన శక్తులకు అతడొక ప్రతినిధి.  తను ధరించిన జాకెట్ ను ఇప్పుడిక నెహ్రూ జాకెట్ అనొద్దనీ అది “దేశీ జాకెట్, లేక దేశ్ ప్రేమీ జాకెట్ “ గా మారిపోయిందనీ సరదాగా, స్నేహ పూర్వకంగానే చెబుతూ వాళ్లు బయల్దేరిన వెహికిల్ లోకి ఎక్కిన దివేకర్, వాళ్ళ ఆలోచనలను నిర్దేశించే చొరవ తీసుకునేందుకు ఎంతో సేపు పట్టలేదు. వాళ్లలో ఆలోచనలు రేపిన సెషన్స్ తనకు చప్పగా ఉన్నాయని కొట్టిపారేశాడు. ఈ దేశంలో భాష, సంస్కృతి ఇకపై ఎలా ఉండాలో పరోక్షంగానే హెచ్చరించాడు. గాంధీ శకం ఇక అంతరించిందనీ, ఇప్పుడు నడుస్తున్నది సావర్కర్ సీజన్ అనీ తేల్చిచెప్పాడు. రేపు జరగబోయే సావర్కర్ సెషన్ కు వాళ్ళందరూ హాజరై రిపోర్ట్ చెయ్యాలని ఆదేశించాడు.

ఆ సమయానికి వాళ్లు అజ్మీర్ వెళ్తున్నారని తెలిసి దివేకర్ అసహనం హద్దులు దాటింది.  బండిలో ఉన్న వాళ్లలో హిందువులదే మెజారిటీ సంఖ్య అయినప్పటికీ ఇద్దరు ముస్లింలు దర్గాకు వెళ్తున్నామని చెప్పగలగటం తమ ఔదార్యమేనని ఎద్దేవా చేశాడు. ఈ దేశం తమది మాత్రమేనని నిర్మొహమాటంగా ప్రకటించాడు. హిందువులు జాగృతం కావాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

అతడి బెదిరింపులకు జవాబిచ్చాడు రిజ్వీ. పరమత సహనం పేరిట చూపించే దయ తమకు అవసరం లేదనీ, మత సహజీవనాన్ని కోరుతున్నామనీ స్పష్టంగా చెప్పాడు.  దివేకర్ తో కలిసి ఇంకా ప్రయాణం చెయ్యటమంటే అతడి విద్వేష భావజాలానికి పరోక్షంగా మద్దతు పలకటమేనని గ్రహించిన దర్పణ్, బండిని ఆపించి వెలుపలికి స్థిరంగా తొలి అడుగు వేశాడు. అతడి వెంట సుచైత, వారితోబాటు ఇద్దరు ముస్లిం జర్నలిస్టులూ. ఈ పరిణామంతో ఖంగుతిన్న దివేకర్, “ఒక్కరైనా రండి”, అని ఆహ్వానించే స్థితిలో పడ్డాడు. వాళ్లు రాకపోగా అతడితోబాటు వచ్చి, ఇంతసేపూ మౌనంగా కూర్చున్న వేద అనే జర్నలిస్టు కూడా అతణ్ణి వదిలి ఆ నలుగురినీ అనుసరించింది.

*

ఈ కథ నడుస్తున్నంత సేపూ దీనికి సమాంతరంగా కొన్ని దృశ్య శకలాలను చూపుతూ ఉంటాడు రచయిత. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఈ దేశంలోని ముస్లిం ప్రజలను అంచులకు నెట్టివేస్తున్న పరిణామాలను గుర్తు చేస్తున్న దృశ్యాలవి. జైపూర్ లో జర్నలిస్టుల మధ్యన జరుగుతున్న చర్చలకు మరింత గాఢతను అద్దుతాయి ఈ వివరాలు. వాతావరణం చిక్కబడుతూ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత వైపుకు పాత్రలూ, పాఠకులూ చేరుతారు.  ఇంతకూ నువ్వెటువైపు? అనే ప్రశ్నకు పాఠకులు జవాబు వెదుక్కుంటారు.  కథలో క్లుప్తతకు, విషయాన్ని బలంగా చెప్పటానికీ చక్కగా అమరిన శిల్పం ఈ కథలో ఒక ప్రత్యేకత.

*

ఆ రాత్రి వేళ దివేకర్ ను వదిలేసి రోడ్డు మీద నడక సాగిస్తున్న ఆ ఐదుగురూ గమ్యం చేరుతారా? వాళ్ళ నడుమనున్న విభజన రేఖలను చెరిపి వేస్తారా? రిజ్వీ కోరుకున్న సాంస్కృతిక సహజీవనం సాధ్యమేనా?

ఈ సవాళ్లకు తక్షణమే జవాబులు దొరకక పోవచ్చు. కానీ సమాధానాలు వెదికే దిశగా ఒక అడుగు పడింది.

విరుద్ధ శక్తుల నడుమ జరుగుతున్న తరతరాల పోరాటంలో తాము ఎటువైపు నిలబడాలో గ్రహించిన బుద్ధిజీవులు వాళ్లు. వీళ్ళ సంఖ్య మరింత పెరిగేకొద్దీ అస్పష్టంగా, అగమ్యం గా నిలబడిన అసంఖ్యాక ప్రజలకు ఆసరా దొరుకుతుంది. విద్వేషాలు, విభజనలు నిండిన ఆధిపత్య రాజకీయ శక్తులను వాళ్లు తిరస్కరిస్తారు.

ఈ దిశగా జరిగే ఎంత చిన్న ప్రయత్నాన్ని అయినా ఆహ్వానించి, సెలిబ్రేట్ చేసుకోవాల్సిందే.

ఆ రాత్రి వేళ, ఎటూకాని నడి రోడ్డు మీద “గరం గరం జిలేబీ” దొరికితే బావుండునని దర్పణ్ ఆశ పడటంలో తప్పేముంది?

(మహమ్మద్ ఖదీర్ బాబు కథ “డూ యూ జాయిన్?”)

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

3 thoughts on “నువ్వెటు వైపు?

  1. డూ యూ జాయిన్ కథ రొటీన్ కథనానికి భిన్నంగా ఉందని ఈ సమీక్ష ద్వారా అర్థమైంది. కుల మతాల మధ్య ఉన్న వైరుధ్యాలను, ఓకే మతంలోనూ స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను, నేడు చలామణి అవుతున్న ‘ మెజారిటీ’ మొరటు సిద్ధాంతాన్ని అందులో పడి కొట్టుకుపోతున్న సామాన్య జనాన్ని ఉద్దేశించి రచయిత ఈ కథను సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ కథ ఎక్కడ అచ్చయ్యింది. దీన్ని పరిచయం చేసి ఈ కథ గురించి తెలియజేసినందుకు థాంక్స్ కాత్యాయని. ఈ కథను నేనింకా చదవలేదు కానీ ఈ సమీక్ష ద్వారా చదవాల్సిన మంచి కథ అని అర్థమైంది. అందుకు రచయిత ఖదీర్ బాబు కు అభినందనలు.

  2. డూ యూ జాయిన్ కథ రొటీన్ కథనానికి భిన్నంగా ఉందని ఈ సమీక్ష ద్వారా అర్థమైంది. కుల మతాల మధ్య ఉన్న వైరుధ్యాలను, ఓకే మతంలోనూ స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను,నేడు చలామణి అవుతున్న ‘ మెజారిటీ’ మొరటు సిద్ధాంతాన్ని అందులో పడి కొట్టుకుపోతున్న సామాన్య జనాన్ని ఉద్దేశించి రచయిత ఈ కథను సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ కథ ఎక్కడ అచ్చయ్యింది. దీన్ని పరిచయం చేసి ఈ కథ గురించి తెలియజేసినందుకు థాంక్స్ కాత్యాయని. ఈ కథను నేనింకా చదవలేదు కానీ ఈ సమీక్ష ద్వారా చదవాల్సిన మంచి కథ అని అర్థమైంది. అందుకు రచయిత ఖదీర్ బాబు కు అభినందనలు.

  3. థ్యాంక్యూ కాత్యాయని గారు. దాదపు నెల రోజులు ఈ కథ రాసినట్టున్నాను. ముగింపులో ఏం జరుగుతుందో ఆ జరిగే సన్నివేశం కోసం ఎదురు చూస్తూ కథను పూర్తి చేశాను. ఆ ముగింపులోని ఆశే ఇప్పుడు కావాల్సింది.

Leave a Reply