నువ్వు సైతం

చట్టం వెలుతురు
అంత తేలిగ్గా..చొరబడనీకుండా
లోపల్లోపలెక్కడో

గొంతు తెగేసిన దృశ్యమో
గుండెల్లో దిగిన కత్తి లాఘవమో
ప్రదర్శిస్తుంటారు

చూసీ చూడనట్లుగా ఉండకు
ఒక్కసారైనా
కలుగులోంచి బయటకు తొంగి చూడు

తలుపులు తెరిచే పనిలేకనే
అమానుషం జొరబడి పోతుంది

చిందరవందరైన సిగ్గు గూర్చో
నడి రోడ్డుపై విసిరేసిన ఆడ దేహాల గూర్చో
ఎర్రగా ప్రవహించే నెత్తురు గూర్చో-
మానం మరకల గూర్చో
గడ్డకట్టిన మానవత్వం గురించో మాట్లాడు

ఇంతకూ
పరువును..కులాన్ని అంటగట్టింది
దేహానికో మనసుకో.. నీకు తెలియదు

ఎన్నో..ప్రశ్నల్ని వేలాడదీసారు
ఏ ఒక్క జవాబైనా చెప్పు

జీవనది లాంటి న్యాయం
దిగవకు పారకుండా
అనుమతి లేని ఆనకట్టలెన్ని కట్టలేదు

గుండె దిటవు చేసుకోవాల్సిన సందర్భాలను
గదమాయిస్తూనే బతుకు జోలెలో ఎన్ని వేయలేదు

ఉగ్గబట్టుకునో.. ఉసూరుమంటూనో
ఊకొడుతూనో.. ఇంకెంత కాలం..?

ధైర్యం చెయ్యాల్సిన సమయాల్ని
ఇంకా మండుతున్న
మంటలను ఉపేక్షిస్తే ఎలా..?

మనిషి పరిణామక్రమం లో
ఎక్కడ పారేసుకొచ్చావో నీలోని మనిషిని

నలగ్గొట్టబడి
నెత్తురోడుతున్నపుడు నీ గుండెను హత్తుకునేందుకూ
నీ రోజువారీ జీవితాన్ని ఎత్తుకునేందుకూ
ఎవరో రావాలని అనుకుంటావు

ఎర్రగా ప్రశ్నించాల్సింది..
ఎదుర్కోవాల్సింది.. నువ్వే..

ఎప్పుడో ఒకప్పుడు
నువ్వే కొన్ని ఉదయాలను మోసుకురావాలి
వెలుగులను నువ్వూ వొంపగలగాలి

నువ్వు జీవించడమంటే..
అందరూ సమానంగా జీవించడమే !

One thought on “నువ్వు సైతం

Leave a Reply