నువ్వింతకు ముందే బాగుండేవాడివి

నాన్నా
నువ్వింతకు ముందే బాగుండేవాడివి
మొక్కలుగా ఉన్న మేం
వృక్షాలై పెరిగిపోతున్న కొలదీ
వ్యాపార కుబేరులు తవ్వుతున్న
బంగారుగనిలా తరిగిపోతున్నావేమిటి

నాన్నా
నువ్వింతకుముందే బాగుండేవాడివి
విశాల మైదానాలు పూచిన మనస్సుతో
మాలో వేకువల్ని నాటేవాడివి
ఏదో ఒక సబ్జెక్టులో
ఎక్స్ పర్ట్ వైతే చాలులేరా
అన్నప్పుడే చాలా అందంగా ఉండేవాడివి
నెమలీకల కన్నులై మిన్నులో మెరిసేవాడివి
ఇప్పుడెందుకో
ఇరుకిరుకు సందుల్లో పడి
ఉరుకుతూ ఉలికులికి పడుతున్నావేమిటి
హ్యూజ్ ఎక్స్ పెక్టషన్స్ తో
లార్జ్ బండరాళ్లను
మా లేతయవ్వన భుజాలతో మోయిస్తూ
నీ కలల బోయింగ్ విమానాల్ని
మా బతుకు మీద లాండ్ చేయిస్తున్నావేమిటి
మహాంధకారం లో పడి మరుగుజ్జవుతున్నావేమిటి

నాన్నా
నువ్వింతకుముందే చాలా బాగుండేవాడివి
ప్రశాంత సముద్రంలా వుండి
ఎంతటి దు:ఖాన్నైనా నమిలి మింగేసినప్పుడే
నువ్వొక సూపర్ మ్యాన్ లా కనిపించేవాడివి
మరి ఇప్పుడో…
అయినదానికీ, కానిదానికీ
చీటికీ మాటికీ చిర్రెత్తుకుపోయి
మూడోకన్ను తెరిచే తిక్కశంకరుడై పోతున్నావేమిటి

నాన్నా
మీరే మాకు వెలకట్టలేని ఆస్తులు
అన్నప్పుడే, చిన్నప్పుడే
మా కన్నుల్లో బ్లూమూన్ లా నిండేవాడివి
ఇప్పుడేమిటో…
మమ్మల్ని మినీ కుండీల్లో మనీ ప్లాంట్లలా కలగంటూ
అప్పుడప్పుడూ పండే మా నవ్వులపంటల్ని నిషేధిస్తూ
కర్కశకర్కోటకుడయ్యా వేమిటి
యూజ్‌లెస్ గా యూటర్న్ తీసుకున్నావేమిటి

అనునిత్యం భవిష్యత్ భయాల్తో
ఆవలితీరం చేరే అత్యాశల్తో
నడివయస్సు లోనే పండుముసలాడి లా
దగుల్బాజీలు సృష్టించిన దిగుల్బావుల్తో
చాదస్తాల బూజు పట్టిన ప్లాస్టిక్ గుల్దస్తాలా
ముక్కవాసన వేస్తున్నావు నాన్నా
మృదుత్వం పోయి మృగత్వం తో
మృత్యువాసనవేస్తున్నావు నాన్నా
నిజం చెప్తున్నా
నువ్వింతకుముందే బాగుండేవాడివి
కవిత్వమై ప్రవహిస్తున్నప్పుడే
మనిషిలాగుండేవాడివి
మా మది కుండల్ని నింపే చల్లటి మజ్జిగలాగుండేవాడివి…

మహబూబ్ నగర్ జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు : పక్షులు (దీర్ఘ కవిత), అతను వ్యాపిస్తాడు
(కవితాసంకలనం). జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇప్పటూర్(మహబూబ్ నగర్ జిల్లా)లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

5 thoughts on “నువ్వింతకు ముందే బాగుండేవాడివి

  1. అధునాతన జీవితంలో గొప్ప గా బతుకుతున్నామని అనుకుంటున్నాము గానీ మనం నిజంగా ఏమి కోల్పోతున్నాం అనేది కవిత గా చాలా బాగా రచించారు.
    మంచి కవిత పాఠకులకు అందించినందుకు కృతజ్ఞతలు.

Leave a Reply