నీ ఉత్తరం

ఇక్కడ దోమలు అయినంతగా
తోబుట్టువుల పిల్లలు కూడ రక్తబంధువులు కారు
కనుక నీకోసం నిరీక్షించడం జైల్లో
నాలుగునెలల క్రితమే మానేసాను
ఎవరి వెంటనయినా జైలు బయట
ఎంత వేళ్లాడూ, కలవనివ్వరని తెలుసు
భ్రమలు లేవు గనుక ఆశలూ లేవు
కాని మా బ్లాకు ప్రవేశం లోపలి ద్వారం దగ్గర
రోజూ ఉదయం పదకొండు నుంచి ఐదున్నర దాకా
నీ లేఖ కోసం నిరీక్షిస్తూ అటూ ఇటూ
తిరుగుతున్న నా మనసు చూపులు 
నువు చూడలేవు కదా –

నీ ఉత్తరం రావడమంటే నా చేతుల్లోకి నువు రావడం
నడుస్తూ నడుస్తూ నా చేతుల కౌగిట్లో
నువు నా గదిలోకి రావడం
నా హృదయంలోకి రావడం
పడుకొని చదువుకొనే నీ ఉత్తరంలో
నాలోకి నదుల్ని మళ్లించడం
అక్షరాల చాలు వెంట ఆకాంక్షలు వెదజల్లడం
అక్షరాల దారులవెంట మనుషుల్ని ప్రవేశపెట్టడం
నీ ఉత్తరం రావడం అంటే 
నువ్వు ఒక్కనివి రావడమా
ఎంతమందిని వెంటబెట్టుక రావడం
ఎన్ని భూఖండాల్ని మోసుక రావడం
ఎన్ని సముద్రఘోషలు
ఎన్ని అరణ్యగర్జనలు
ఎన్ని మైదానాల గడ్దిపోచల ధిక్కారాలు –
ఎన్ని కన్నీళ్లు ఎన్ని కలలు 
ఎన్ని ఆశాభంగాలు ఎన్ని కొత్త ఆశలు
ఎన్ని ఓటములు ఎన్ని ఆయత్త పోరాటాలు

అవును మనమధ్యనే కాకపోవచ్చు
మన భాష కాకపోవచ్చు
ఎన్నో చేతులు మారి ఉండవచ్చు
మనిద్దరమే హృదయం విప్పి చెప్పుకోవలసినవి
శత్రువు ముందు ముందుగా విప్పి పరచినవే కావచ్చు
ఆకాంక్షల్ని కలల్ని దాచేదేముంది
నిషిద్ధ భాష మాట్లాడాలనే కదా నిశ్చయించుకున్నాం
ప్రజల కోసం మాట్లాడుతుంటే
శత్రువు రాసుకుంటూనే ఉన్నాడు
ప్రజల కోసం రాస్తుంటే
శత్రువు చదువుతూనే ఉన్నాడు
మన భావాలన్నీ భద్రంగా శత్రువు ఆర్కైవ్స్ లో
పోగులు పడుతూనే ఉన్నాయి

నిర్మాణాలకు రహస్యమేమో కానీ
మానవ హృదయానుబంధాల నిర్మాణాలకు
నిర్మాణ వ్యక్తీకరణకు 
రహస్యమేమున్నది
ప్రేమలో యుద్ధంలో ఏ నియమమూ లేదు
ప్రేమ జయించే యుద్ధంలో దిగక తప్పలేదు
ప్రేమ మాత్రమే యుద్ధాలను గెలిచి
ద్వేషాన్ని గెలిచి, అసమానతల్ని గెలిచి
అమానవీయతను గెలిచి, అవనినంతా ఆవరిస్తుంది
లేఖలు ప్రేమలేఖలు స్నేహలేఖలు
ఒక మనిషి నుంచి మరొక మనిషికి
మనుషుల వంతెన
మనసుల వంతెన
స్నేహ ప్రవాహంపై తేలివచ్చే ఉత్తరం

2 thoughts on “నీ ఉత్తరం

Leave a Reply