సాహస్,
నీ ఉత్తరం నన్ను
నీ అద్భుత లోకంలోకి తీసుకువెళ్లింది
నీ కథలోని భూతగృహం
నా వంటి స్వాప్నికులకు చిరపరిచితమే
నీ కథల నాయకుల లాగనే
జీవితపు కర్కశత్వాల మధ్య
చీకట్లో తడుములాడుతుంటాం
స్వేచ్ఛా సాహసమూ నిండిన
మరో ప్రపంచం లోకి మారి పోదలచుకుంటాం
చుక్క నాలుక కంటగానే స్పృహ పోగొట్టే
పానీయాలను గుటకలేస్తూ ఉంటాం
భయానక రాక్షసాకారం మీద
కిచకిచలాడే పక్షి
భూగోళమంతా ద్వేష విష సవ్వడి వెదజల్లుతుంది
ప్రచ్ఛన్న యుద్ధపు పాత రంగస్థలం
కొత్త ఆటలు ఆడుతుంటుంది
అణ్వాయుధాలు పెరుగుతాయి
మృదు హృదయాలు తగ్గుతాయి.
కొంటెపనుల ఆశ్చర్యలోకం
యుద్ధాలలో మహాయుద్ధాలలో ఆటలాడుకుంటుంది
ఇక్కడ ప్రజాస్వామ్యాలు కార్ఖానాలో తయారై ఎగుమతి అవుతాయి
ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పటికప్పుడు ముగిసిపోతూనే ఉంటుంది
మళ్లీ ఫెళఫెళార్భాటాలతో మొదలవుతుంది.
భూగోళమే చెరసాలగా మారి
‘వైభవోజ్వల శకాలు వల్లకాటి అధ్వాన్నపు దినాలు’
నేల మీద పరచుకుంటాయి
దిగంబర సామ్రాజ్యం
అణ్వస్త్రాల వస్త్రాలే ధరిస్తుంది
మెరిసిపోయే సైబర్ ఆయుధాలు చేపడుతుంది.
పెద్ద మీట మీద వేలు పెట్టిన వాడు
తూర్పున శాంతిని నెలకొల్పుతాడు
చిన్న మీట మీద వేలుపెట్టిన
చిన్నారి రాకెట్ మనిషిని కౌగిలించుకుంటాడు
మతి చలించిన ముసలివాడు
ద్వేషపు గోడలు నిర్మించడానికి ఉవ్విళ్లూరుతాడు
ఈ యంత్రాన్ని పైనుంచీ నింపొచ్చు
ముందు నుంచీ నింపొచ్చు
కింది నుంచీ నింపొచ్చు
మార్కెట్ దేవతలు
నెత్తురు కోరుతారు
నరబలి కోరుతారు
వారి వ్యాపార యుద్ధాల తర్వాత
నలుమూలలా అణుయుద్ధాలూ
జనహననాలూ
అణుయుద్ధ క్షేత్రాలలో
డిజిటైజ్ కాని అంగుళం నేల
భూస్థలమంతా వెదికిన దొరకదు
అంతర్జాతీయ విపణిలో వారు అమ్ముకునే
ఒకానొక సరుకు ప్రజాస్వామ్యం.
(నువు రాయదలచుకున్న అద్భుతాల సాహసాల పుస్తకం గురించి నీ ఉత్తరంలో చదివి)
అమెరికా నుంచి తనకు ఉత్తరం రాసిన పదేండ్ల సాహస్ కు నాగపూర్ జైలు నుంచి సాయిబాబా 2019 జనవరి 16న రాసిన జవాబు.
- జి. ఎన్. సాయిబాబా (అనువాదం ఎన్. వేణు గోపాల్)
సాయిబాబా తీక్షణ ప్రజాస్వామిక వీక్షణాన్ని తట్టుకోలేని సకలాంగాలూ వైకల్యం అయిన ప్రభుత్వాలు అండా సెల్ శరణు జోచ్చాయి!
సాయిబాబా గారి ఆలోచనలన్నే ఉన్నాయి. “అణుయుద్ధ క్షేత్రాలలో
డిజిటైజ్ కాని అంగుళం నేల
భూస్థలమంతా వెదికిన దొరకదు
అంతర్జాతీయ విపణిలో వారు అమ్ముకునే
ఒకానొక సరుకు ప్రజాస్వామ్యం”
Could you please explain the second and the third stanza refers to which part of the globe….. I couldn’t get them….