నీళ్ళ బండి

అనగనగా ఒక ఊరు. ఊరి పేరేదైతేనేం లెండి. దేశంలో అలాంటి ఊళ్లు కోకొల్లలు. అయినా సరే పేరు తెలియల్సిందే నంటారా? పోనీ ముకుందాపురం అనుకుందాం. ఊళ్ళో రైల్వే స్టేషనుందో, స్టేషన్ను ఆనుకొని ఊరుందో చెప్పలేం గానీ, ఊళ్ళో ఆ వాడ మాత్రం రైల్వే స్టేషన్ ను ఆనుకునే వుంటుంది. చాలా రైళ్ళు ఆ స్టేషన్ మీదుగా పోతుంటాయి, ఆగేది మాత్రం ఒక్కటే. ప్యాసింజర్ బండి. అది ఆ పక్క చానా దూరం నుంచి వస్తుందట. ఈ వైపు మాత్రం పది కిలోమీటర్ల దూరంలో ఉండే అవంతీ నగరం ఆఖరి స్టేషను. ఆ స్టేషనుకు పోవడానికి ఈ ప్యాసింజర్ బండి ఈ వాడ జనాలకు చాలా అవసరం. పదేండ్ల పిల్లల నుంచీ యాభై యేండ్ల పెద్దల వరకు ఆడామగా ముప్పయి మందికి పైనే ఆ బండి కోసం ప్లాస్టిక్ బిందెలు, క్యాన్లు పట్టుకొని ఎదురు చూస్తున్నారు, ప్లాట్ ఫాం మీద కాదు, పట్టాలకు రెండో వైపు కింద. మధ్యాహ్నం మూడున్నరకు రావాల్సిన బండి గంట దాటిపోయినా రాలేదు. ప్యాసింజర్ బండి ఎప్పుడు గనక టైముకొస్తుంది?

“బండొస్తాంది రోయ్!” ఎవరో అరిచారు.

పిల్లా, పెద్దా అంతా తమ తమ వస్తువులతో అటెన్షన్ లోకి వచ్చారు. వాళ్ళల్లో ఆరో తరగతి చదువుతూ బడి మానేసిన పదకొండేళ్ళ వీరేశూ ఉన్నాడు. వాడి చేతిలో సుమారైన క్యాను. వాడితో పాటు వాడికంటే రెండేళ్ళు పెద్దదయిన పద్మ కూడా బిందె పట్టుకొని రెడీగా నుంచుంది. ఇద్దరినీ రైలెక్కించడానికి వాళ్ళమ్మ చంకలో చంటిబిడ్డతో నిలబడింది. హైస్కూల్లో టీచరుగా పనిచేస్తూ, అవంతీనగరం నుంచి రోజూ వచ్చిపోయే గోవిందు రైలు కోసం హడావుడిగా పోతూ వీరేశును చూశాడు.

“ఏరా వీరేశూ బడికి రావడం లేదు?”

గోవిందు ప్రశ్నకు వీరేశు తల్లి జవాబందుకుంది.

“వాడు బడికొస్తే నీళ్ళు నువ్వు మోసకొస్తావా అయివారూ?”

చెంపదెబ్బలా తగిలిన సమాధానంతో గోవిందు “అదిగాదమ్మా…” అంటూ చెప్పబోయాడు.

“సాల్సాల్లే అయివారూ, బండొస్తాందట గానీ నువు బెరీన పో.” గోవిందు నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు.

రైలు కూత విని అంతా అప్రమత్తమై పట్టాల దగ్గరికి పరిగెత్తారు. ఆ స్టేషన్లో రైలు కేవలం ఒక్క నిమిషం మాత్రమే నిలబడుతుంది. ఆ ఒక్క నిమిషంలో అదీ ప్లాట్ ఫామ్ మీద నుంచి కాకుండా రెండో వైపు కింది నుంచి తమతమ సరంజామా పట్టుకొని ప్రమాదాలకు తెగించి అంతమంది కిందా మీదా పడుతూ రైలెక్కుతున్నారు. వాళ్ళల్లో పిల్లలే ఎక్కువ. వీరేశు పరిగెత్తుతూ రాళ్ళు తట్టుకొని కింద పడ్డాడు. చేతులకు దెబ్బలు తగిలి రక్తం కారసాగింది. తల్లి అది పట్టించుకోకుండా అరిచింది.

“క్యాను బద్రం రేయ్.”

అవసరం అనేది తల్లి ప్రేమను కూడా మించిపోతుంది కాబోలు. వీరేశు దెబ్బ తగిలిన చేత్తో క్యాన్ పట్టుకొని, రెండో చేత్తో దెబ్బపై గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అప్పటికే రద్దీగా ఉన్న రైల్లోకి తోసుకొని ఎక్కి క్యాన్లూ, బిందెలూ అలాగే పట్టుకొని డోర్లో నిలబడ్డారు కొందరు. నిలబడిపోయి చూస్తున్న చంటిబిడ్డల తల్లులకు, చేవ తగ్గిన ముసలోల్లకు, చేతకాని పసిపిల్లలకు టాటా చెబుతున్నట్లు కూతపెడుతూ రైలు బయలు దేరింది.

ఇంతకూ ఈ బిందెలూ, క్యాన్లు పట్టుకొని వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారనే కదా మీ అనుమానం. ఇది నీళ్ళ ప్రయాణం. నీళ్ళ కోసం ప్రయాణం. వీళ్ళున్న వాడలో నీళ్ళు రావు. బోర్లెండిపోయాయి. బావులెప్పుడో మూసుకుపోయాయి. మునిసిపాలిటీ కొళాయిలకు నీళ్ళు రావు. ఇంకేరకమైన నీటి ఆధారమూ లేదు. తాగడానికి నీళ్ళు కొనుక్కోవాలంటే రోజుకు అరవై రూపాయలు ఖర్చు చేయాలి. రోజుకూలికి పోయే వాళ్లకు అరవై రూపాయలు బరువే. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అవంతీనగరం రైల్వే స్టేషన్లో రైళ్ళ టాయిలెట్లలోకి పంపించే నీళ్ళు పట్టుకొచ్చుకోవడానికి ఇలా ప్రమాదకరమైన ప్రయాణం చేస్తుంటారు. ఈ నీళ్ళ కోసమే పిల్లల చదువులూ అటకెక్కుతుంటాయి. పెద్దవాళ్ళు పనికెళ్ళాలి మరి.

“రేయ్ రోంత తావీరా, కాల్లిగ్గుతాండాయి. రోన్సేపు కూచ్చుంటా.” సీటు సంపాదించుకున్న శీనుగాణ్ణి అడుక్కుంటున్నాడు వీరేశు.

“యాడుందిరా తావు, ఈతలికే ఎనిమిదిమందిమి కుచ్చున్నామీడ?”

శీనుగాడు కసిరేసరికి మెల్లగా డోర్లోకొచ్చి రైలు బయటికి కాళ్ళేసుకొని కింద కూచున్నాడు వీరేశు. వాడితో పాటు కూచోవాలని వచ్చిన తొమ్మిదేళ్ళ నాగేషు తూలి కింద పడిపోబోయి వీరేశును పట్టుకున్నాడు. వీరేశు పడబోయి తలుపు కమ్మీని పట్టుకొని తమాయించుకున్నాడు.

“నన్ను గుడక పడేస్తాంటివి గదరా నాకొడకా, అంత మటుకు సోదీనం లేదా?” తిట్లకు లంకించుకున్నాడు.

క్యాన్ కింద పెట్టి దానిమీద కూచుంది పద్మ.

“ఈడ నిలబడేకే తావు ల్యాకుంటే నువు క్యాన్ కిందపెట్టి దాని మింద కుచ్చుంటే ఎట్లమే. క్యాను పట్టుకొని లేసి నిలబడు.” పక్కింట్లో ఉండే ఉసేనమ్మ అరిచింది. పద్మ వినబడనట్లే ఉంది.

“ఏమ్మేయ్ నీగ్గాదూ సెప్పేది. లెయ్యి, లేసి నిలబడు.”

ఇంకొకామె అరిచే సరికి లేచి నిలబడి, క్యాన్ చేత్తో పట్టుకుంది పద్మ. రైలు పెట్టెంతా కాసరబీసరమని గోల. టాయిలెట్ల వాసన భరిస్తూ డోర్ దగ్గర కొందరు, పైన బెర్తుల్లో ఇరుక్కొని కొందరు, సీట్లమధ్య నిలబడి పట్టుకునే ఆధారం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ; తిడుతూ, తిట్టించుకుంటూ పది కిలోమీటర్ల దూరాన్ని గంట సేపు రైల్లో లాక్కెళ్ళారు.

“టేసనొత్తాంది రేయ్. దిగండింక.”

రైలు పూర్తిగా ఆగకముందే కేకలు, తోపులాటలతో తమతమ వస్తువులను భద్రంగా పట్టుకొని దిగారు, ప్లాట్ ఫాం మీద కాకుండా రైలుకు రెండోవైపునే. ఈ తోపులాటలో వీరేశు పోయి పట్టాల మధ్య నున్న విసర్జితాలపై పడ్డాడు.

“ఒరే గబ్బు నాయాలా నన్న్యాల దొబ్బుతావు?”

అసహ్యంగా ముఖం పెట్టి తిట్టుకుంటూ స్టేషన్ చివరికెళ్ళి శుభ్రం చేసుకున్నాడు. రైలు తిరిగి బయల్దేరడానికి ఇంకా గంటన్నర టైముంది. బోగీల్లో టాయిలెట్ల కోసం వదిలే నీటిని పైపుల్లోంచి బిందెలు, క్యాన్లూ నింపుతున్నారు. నింపిన వాటిని మెల్లగా బోగీలోకి ఎక్కిస్తున్నారు. ఎంత కనబడకూడదనుకున్నా ఇద్దరు రైల్వే పోలీసులు చూడనే చూశారు.

“రేయ్ ఎదవ నాయాల్లారా, టికెట్టు కొనేది లేదు గానీ, రైలు నీళ్ళ కొస్తిరేమిరా. మీ బాబేమన్నా పైపు లైనేసినాడా?” లాఠీలకు పని చెప్పారు.

వీపు పగిలిన శీనుగాడు “అబ్బా” అంటూ రుద్దుకుంటూ పరిగెత్తాడు. వీరేశు ఎంత తప్పించుకోవాలని చూసినా కాలికి తగలనే తగిలింది లాఠీ దెబ్బ. చేతికందిన బిందెను ఎత్తి పడేయబోయాడు ఓ కానిస్టేబుల్.

“సార్… సార్… పడెయ్యాకు సార్, మాయమ్మ సంపుతాది సార్.” నాగేషు కాళ్ళు పట్టుకున్నాడు.

“రేయ్ ఇడుసురా నాయాలా.” బిందె కింద పెట్టి విడిపించుకున్నాడు కానిస్టేబుల్.

స్టేషన్ చివరి వరకు అందరినీ పరిగెత్తించి, అందినంత మందిని చితకబాది, పోలీసులు తమ డ్యూటీ పూర్తయిందన్నట్లు వెళ్ళిపోయారు. పోలీసులు ఇక రారని నిర్ధారించుకున్నాక జనం మళ్ళీ తమ వస్తువుల దగ్గరికొచ్చి, నీళ్ళు నింపిన వాటిని మెల్లగా రైలెక్కించారు. నీళ్ళకు కరువున బడిన పిల్లలు ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటూ, ఆడుకుంటూ అంతవరకూ పడిన కష్టం మరచిపోతున్నారు.

రైలు బయలుదేరటానికి ఇంకా టైముందని ప్లాట్ ఫాం మీద అటూ ఇటూ తిరుగుతూ దిక్కులు చూస్తున్నాడు వీరేశు. సుమారు ఓ ఇరవై మంది పిల్లలు గుంపుగా చేతుల్లో బాటిళ్ళు పట్టుకొని ప్లాట్ ఫాం మీదికొచ్చారు. వాళ్ళతో పాటు ఇద్దరు మహిళలు, వాళ్ళ టీచర్లలా ఉన్నారు. వీరేశు ఎనిమిదేండ్ల పిల్లాణ్ణి దొరకబుచ్చుకున్నాడు.

“ఎవరు మీరంతా? యాడికన్నకన్న టూరు పోతాండరా?” వాడు తల అడ్డంగా ఊపాడు. “పోయి వస్తాండమన్నా. బస్సులో బెంగుళూరు పిలచక పోయింట్రి మా మేడమోల్లు. ఇంగా దూరం బోవల్ల. ఈ వూరి కాడి కొచ్చేతలికి బస్సు పంచరయింది. తాగేకి నీళ్ళు లేవు. స్టేషన్ దగ్గరే అంటే ఈడికొచ్చినాము.” వాడు అడిగినవి, అడగనివి అన్ని వివరాలు చెప్పాడు.

“ఏం చూసినార్రా బెంగులూరులో?” వీరేశు వాడిని వదల్లేదు.

“కబ్బన్ పార్కు, విశ్వేశ్వరయ్య మ్యూజియం, వాటర్ వల్డ్, ఇంకా…..” వాడిని మధ్యలోనే అడ్డుకున్నాడు వీరేశు.

“ఏందిరా, వాటర్ వరల్డా? అదేంది నీల్లగ్గూడా ఓ పెపంచముంటాదా?” ఆసక్తిగా అడిగాడు వీరేశు.

“కాదన్నా. ఆడ దండిగా నీళ్ళుంటాయి. రకరకాల ఆటలు ఆడుకోవచ్చు. ఒక్కో మనిషికి ఐదొందలు టికెట్టు.”

“ఏందీ, నీళ్ళల్లో ఆడేకి ఐదు నూర్లా? మా నాయన సిన్నప్పుడు సెరువులో ఈతగొడతా ఆడే వాల్లంట. ఇప్పుడు సెరువులూ లేవు, నీల్లూ లేవు. మీరు గూడా అట్టాంటి సెరువుల్లో ఆడినారా?”

“కాదన్నా, ఉండు మా అన్న ఫోన్లో వీడియో తీసినాడు, చూపిస్తా.” అంటూ పరుగెత్తుకెళ్ళి ఫోన్ తెచ్చాడు. “ఇదుగో ఈడ పైనుంచి జారితే వచ్చి ఈ పూల్ లో పడతాము.” వీడియో చూపించాడు.

“ఇదేందప్పా, జారే బండ గదా, మా బళ్ళో గూడ ఉంది, కాకుంటే చిన్నదనుకో. అదీ తుప్పు పట్టీ, ఇరిగిపోయింది.”

“ఇది మామూలు స్లయిడ్ కాదన్నా. ఎంత పైకి ఉందో, ఎన్ని మెలికలు తిరిగిందో చూడు. దాని మీద నీళ్ళు వొస్తా ఉంటాయి. నీళ్ళలోనే ట్యూబ్ మీద జారతావచ్చి, కింద పూల్ లో నీళ్ళల్లో పడతాము. ఇదిగో ఇది చూడు వేవ్ పూల్. దీంట్లో సముద్రంలో తిన్ననే అలలు వచ్చేటట్లు చేస్తారు.”

వీరేశు ఆశ్చర్యపోయాడు. “బోగు సెప్పినావు లేప్పా. సముద్రంలో అలలు ఈడకెట్లా వస్తాయి. అయినా సముద్రం నీల్లు ఉప్పగా ఉంటాయి గదా.”

“ఈడ అలలు మటుకే వస్తాయన్నా. (అవెట్ల వస్తాయో వాడికి కూడా తెలీదు) నీళ్ళు ఉప్పగా ఉండవు. మంచి నీళ్ళే. ఈ అలల్లో ఆడుతుంటే భలే తమాషాగా ఉంటాది. బయం కూడా అయితాదనుకో. ఇంగ ఇదేమో రెయిన్ డాన్సు.”

“అంటే వానలో డ్యాన్సా? మేం గూడా వాన పడితే వానా వానా వల్లప్పా అని పిల్లోల్లమంతా ఆడతాంలే. అయినా వానపడక ఎన్ని దినాలయిపాయె. ఆడ పడిందా వాన?”

“ఇది నిజం వాన గాదన్నా. పైపులు పెట్టి వాన పడేతట్లు చేస్తారు.”

ఆ కృత్రిమ వర్షానికి, డెక్ లో వచ్చే హిందీ సినిమా పాటకు తగినట్లు పిల్లా, పెద్దా ఊగిపోతూ డ్యాన్సు చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూసి నోరెళ్ళబెట్టాడు వీరేశు.

“ఇంకా ఇదేమో…” పిల్లాడు చెప్పబోతుంటే వాళ్ళన్న కాబోలు వచ్చాడు.

“బస్సు పోతాందంట పోదాం పారా.” అంటూ లాక్కెళ్ళిపోయాడు.

వీరేశుకు తాగునీటి వ్యాపారం తెలుసుగానీ, ఈ ఆట నీళ్ళ వ్యాపారం తెలీదు. “మేం తాగేకి, కడుక్కునేకి నీల్లు ల్యాక తనకలాడతాండం, ఇంతింత దూరం బిందెలెత్తుకొని అంగలారస్తాండము. ఈల్లేమో నీల్లన్నీ దొబ్బేసి, పిల్లా పెద్దా ఎగల్లాడేకి నీల్ల యాపారం జేస్తాండరు.”

వీరేశు మనసులో అశాంతి. ఈ అశాంతిని ఎక్కడో ఒకచోట వెళ్ళగక్కాలి. ప్లాట్ ఫాం మీద వాకింగ్ చేస్తున్న టీచర్ గోవిందును చూశాడు. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యాక సాయంత్రం వాకింగ్ చేయడం గోవిందు అలవాటు.

“సా…. సా…” పరుగెత్తుకొచ్చాడు వీరేశు.

“ఏరా వీరేశూ నీళ్ళు పట్టుకున్నావా?” జాలిగా అడిగాడు గోవిందు.

అది వినిపించుకోకుండా, “సార్, మొన్నోపాలి నువ్వు అదేందో ఎన్నికలని సెప్తివి గదా, దేశమంతా ఒకే తూరి, ఒకటే ఎన్నికలొస్తాయని.”

“ఆ… వాటిని జమిలి ఎన్నికలు అంటారు. స్వాతంత్రం వచ్చిన డెబ్భై అయిదేండ్లకు అంటే 2022 లో అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి ఎన్నికలు జరపాలనుకుంటోంది ప్రభుత్వం.” గోవిందు వివరించి చెప్పాడు.

“మల్ల అట్లయితే ఆ ఎన్నికలొత్తే నీల్లు గూడ దేశంలో అంతమందికీ ఒకే తిన్న దొరకతాయా సార్?” ఆశగా అడిగాడు వీరేశు.

శిష్యుడు నిలదీస్తున్నట్లు అనిపించింది గోవిందుకు. ఏం చెప్పాలో తోచలేదు. అతన్ని కాపాడ్డానికన్నట్లు రైలు బండి కూత పెట్టింది “నేను బయల్దేరుతున్నా.” అంటూ.

జవాబు కోసం చూడకుండానే పరిగెత్తాడు వీరేశు. వెనక్కి చూస్తూ పరిగెత్తడంలో ఎవరిదో బిందె తగిలి కింద పడ్డాడు. నీళ్ళు తొలికిపోయాయి. నుదురు నేలకు తగిలి బొప్పికట్టింది. అది పట్టించుకోకుండానే పరిగెత్తి, రైలెక్కాడు.

బిందె తాలూకు ఆడమనిషి “నీల్లన్నీ నేలపాలు జేస్తివి గదరా ఎదవ నాకొడకా.” అంటూ వీరేశును తిట్టిపోసింది.

“నీళ్ళే కాదు, కూడూ, గుడ్డా, గూడూ అందరికీ సమానంగా అందేరోజు ఇంకో డెబ్బయి అయిదేళ్ళకయినా వచ్చేనా? అయినా ఈ వ్యవస్థలో ఎన్నికలతో సమానంగా అందవురా వీరేశూ, మీలాంటి వాళ్ళు బలవంతంగా లాక్కోవాల్సిందే ప్రభుత్వాన్ని, వనరుల్నీ అన్నిట్నీ. ఇకనుంచీ ఈ కొత్త పాఠం చెప్తాన్రా మీ కోసం.” గోవిందు స్థిరంగా అనుకున్నాడు.

అనంతపురం. రచయిత్రి, అధ్యాపకురాలు.  ఎం.ఎస్సి., పిహెచ్.డి. చదివారు.  వృత్తి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర బోధన. సాహిత్య కృషి: విజ్ఞాన శాస్త్ర బోధన, పరిశోధన నాకు వృత్తిగతమైతే, సాహిత్యం అత్యంత ప్రియమైన ప్రవృత్తి. హైస్కూల్లో చదువు తున్నప్పుడు చిన్నగా కవిత్వం మొదలైంది. కాలేజీ రోజుల నుంచి ఈనాటి వరకూ విజ్ఞాన దాయకమైన, సామాజిక, సాహితీ అంశాల గురించి వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు చేశారు. 2013 నుంచి కథా రచన మొదలయింది. మొదటి కథ సాహిత్య ప్రస్థానం పత్రికలో ప్రచురించిన మరణ వాంగ్మూలం. ఇంతవరకూ దాదాపు 35 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. 18 కథలతో ‘కోయిల చెట్టు’ పేరుతో కథాసంకలనం ప్రచురితమైంది.

Leave a Reply