‘నీల’ కథ నేపథ్యం

ఈ కథ ‘అరుణతార’ మాస పత్రికలో జూన్-జూలై 1987 సంచికలో అచ్చయ్యింది. ఈ కథ నాకు పదేండ్ల వయసు నుండి లోలోపల గడ్డకట్టుకపోయిన కథ. మా ప్రాంతంలో ముఖ్యంగా బహుజన కుటుంబాల్లో దాదాపుగా తొంబై శాతం బాల్య వివాహాలే ఉండేవి. వరుడు పద్నాలుగు సంవత్సరాలు, వధువుకు పది దాటనిచ్చేవారు కాదు. పది సంవత్సరాల పిల్ల పెళ్లి పేరుతో మొట్టమొదటి సారిగా తను పుట్టిన కుటుంబాన్ని, ఊరును ఒదిలి వేరే ఇంటికి, ఊరికి పెళ్లి పేరుతో వెళ్లడం ఎంత యాతనో? అంతే కాకుండా కుటుంబంలో కోడలిది చిట్టచివరి స్థానం. జీతం లేని బానిస. అరవ చాకిరి. స్త్రీలుగా తాము అనుభవించిన పీడన, హింసనంతా అత్తలు కోడండ్ల మీద వెళ్లదీసేవారు. నేను నాలుగవ తరగతి చదువుతున్న సమయంలో మా మేనత్త ఒక అడివంచు పల్లెనుండి బెరుకు బెరుకుగా, భయం భయంగా మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆమెకు వాళ్ల ఊరికి దారి తెలువదు. ఏడేండ్ల వయసులో ఉదయం నాలుగు గంటలకు లేస్తే రాత్రిదాకా పనిచేసి రాత్రంతా చప్పుడు కాకుండా ఏడ్చేది. ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు.

ఇలాంటి పెళ్లిల్లు రకరకాల గొడవలకు, రెండు ఊళ్ల మధ్య కొట్లాటలకు కారమణమయ్యేవి. వాళ్ల ప్రమేయం లేకుండానే మొగడు, పెళ్లాలిద్దరూ ఈ కొట్లాటల్లో నలిగిపోయే వారు. ముప్పైశాతం విడాకులయ్యేవి. వశపడని కుల పంచాదులు, తాగడం, అన్ని రకాల భూస్వామిక రాజకీయాలు ఇలాంటి బాల్య వివాహాల్లో చోటు చేసుకునేవి.

1954 తరువాత అనేక గ్రామాలకు స్కూల్లు వచ్చాయి. ఎక్కువ భాగం పురుషులే చదువుకునే వారు. పెళ్లైన ఆడ పిల్లలు చదవడం దుర్లభం. మా కాలానికొచ్చే సరికి క్లాసులో సగం మంది బహుజన పిల్లలు బాల్య వివాహ బాధితులే ఉండేవారు. అందులో సగంమంది చదువురాని పిల్లలను బాల్యవివాహాలు వద్దని విడాకుల కొట్లాటల్లో సతమతమయ్యేవారుండేవారు.

1977 అత్యయిక పరిస్థితి ఎత్తేసిన తరువాత కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల్లో రైతాంగ పోరాటాలు లేచాయి. ప్రతి ఊరిలో రైతుకూలీ సంఘాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా కూలి రేట్ల పోరాటంలో వేలాది మంది మహిళలు పోరాటంలో ముందు భాగంలో నిలిచారు. గ్రామంలోని భూస్వామిక సంబంధాల్లో ఒక కుదుపు ఆరంభమయ్యింది. ప్రతి గ్రామంలో అత్యంత క్రూరంగా మహిళల మీద జరుగుతున్న లైంగిక హింస కుటుంబంలో మహిళల పట్ల జరుగుతున్న హింస అనేక ప్రజా పంచాయితీల్లో ముందుకు రావడం ఆరంభమయ్యింది. కొన్ని గ్రామాల ఆడ పిల్లలను బయటి గ్రామాల మొగ పిల్లలు పెండ్లి చేసుకునేవారు కాదు. కారణం యుక్త వయసు వచ్చిన ప్రతి ఆడపిల్లను దొరలు, పూజారులు అనుభవించేవారు. ‘‘ఏ ఇంట్లో కోడి కూసినా ఆ యింటి కిందా?’’ అనె సామెత వచ్చింది. ఇలాంటి అనేకానేకం బయటకు వచ్చాయి.

మహిళలు అన్ని రకాల అణచివేతలతో పాటు అదనంగా పితృస్వామిక అణచివేతను కూడా అనుభవించేవారు. గ్రామాలల్లో నుండి పదుల సంఖ్యలో యువతులు కుటుంబాలు, చంటి పిల్లలనొదిలి పూర్తి కాలపు కార్యకర్తలుగా విప్లవోద్యమాలల్లోకి వచ్చారు.

చిన్నచిన్న దళాలుగా పనిచేస్తున్నచోట ఆడవాళ్లు పనిచేయడం అప్పటికి కష్టసాధ్యం. వసతి గలిగిన పెద్ద భూస్వాములు గ్రామాలు ఖాళీచేసి పట్టణాలకు వెళ్లారు. దాదాపుగా వారి భూములన్ని పడావు పడి ఉన్నాయిగాని రైతులకు పూర్తిగా పంపకం కాలేదు.

కరుడుగట్టిన భూస్వామ్యాన్ని అనేక గ్రామాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కదిలించారు గాని అందుకు తగిన నిర్మాణాలు వెంటవెంటనే రూపొందలేదు. రూపొందినా పెద్ద ఎత్తున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్భందం వలన కూడా నిలబడడం కష్టమైంది. ఇలాంటి నిర్మాణాత్మక మార్పులను, గుణాత్మకంగా మార్చడానికి గ్రామాలల్లో భూమి పంపకాలు చేయడం బహుజన, దళిత మహిళలతో ప్రజా సంఘాలైన రైతుకూలి సంఘాల స్థానంలో ప్రజారాజ్య కమిటీ లాంటి రాజకీయ నిర్మాణాలు నిర్మించడం ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మార్చుకుంటూ కార్మిక, కర్షక రాజ్యాధికారం కోసం అంటే వ్యూహం కోసం ప్రజలను రాజకీయంగా తర్ఫీదు చేయడం, అందుకనుగుణంగా గ్రామాలల్లో రక్షణ, ఉత్పత్తి అటవీ ఉద్యమాల నిర్మాణాలు ఏకకాలంలో చేయవల్సిన స్థితిలో విప్లవోద్యమాలు పాతకొత్త భావజాల యుద్దంలో తల మునకలయ్యాయి.

1986 నాటికి పోరాటాల ప్రాంతాలను కొత్త నిర్మాణాలతో కాపాడుకోవడం ఆటవీ ఉద్యమం పర్ స్పెక్టివ్ రచించుకొని గుణాత్మక మార్పును ఆరంభించింది.
పాత పోరాట ప్రాంతంలో క్రూరులైన అగ్రకుల దొరల పార్టీ కాంగ్రెసుకు మనజాలని స్థితిలో నక్సలైట్లే దేశభక్తులని ఎన్.టి రామారావు అధికారంలోకి వచ్చాడు. ఆ తరువాత పాత భూస్వామిక అధికార కేంద్రాలైన పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి మండలాలు వ్యవస్థ తెచ్చాడు. తీవ్ర నిర్భందం తెచ్చి తెలంగాణలో ఒక భీతావహ వాతావరణాన్ని తెచ్చాడు. వీలైనంతకాడికి గ్రామాలల్లో భూస్వాములు ఒదిలేసిన భూములను పేదలకు దక్కాల్సిన భూములను వసలవాదులకు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం ఆరంభమయ్యింది. మొదటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పట్టణాలల్లో ఆరంభమయ్యింది.

ఈ వాతావరణాన్ని ఉపయోగించుకొని పాతదొరలు కొత్త రూపంలో ప్రత్యక్షమయ్యారు. బహుజనులు కొందరు తెలుగుదేశం అండతో రాజకీయంగా ఎదిగి ఆస్తులు సంపాదించారు.

మొదటి నుండి విప్లవోద్యమంతో బాహాబాహి తలపడుతున్న భూస్వాములు, దొరలు బీజేపీలో చేరి కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఖాళీ చేసిన గ్రామాలల్లో చేరడానికి ఎత్తులు వేశారు. రకరకాలుగా ఈ గొడవల్లో అటుయిటు తేల్చుకోని వాళ్లను కొందరిని చేరదీసి ఇన్ ఫార్మర్ వ్యవస్థను రాజ్యం స్వయంగా ఏర్పాటు చేసింది.

అన్ని రకాల వైరుధ్యాలు పరిష్కారం కోసం పోరాట ప్రాంతంలో విప్లవోద్యమాన్ని డిమాండు చేశాయి. అనేక పరిణాత్మక పోరాటాలు గుణాత్మక పోరాటాలుగా పరిణామం చెందాల్సిన దశ అది. ఇప్పటికి కూడా మహిళలు పెద్ద ఎత్తున విప్లవోద్యమాల్లోకి వస్తున్నా కూడా పితృస్వామిక అణచివేతను ఎదుర్కోక తప్పని పరిస్థితులు అటు గ్రామాలల్లోను, పట్టణాలల్లోను తీవ్రమయ్యాయి. గ్రామాలల్లో విప్లవోద్యమాలు బలంగా ఉన్న దశలో అలాంటి పంచాయతులను రకరకాలుగా పరిష్కరించారు. అవన్ని తాత్కాలిక పరిష్కారాలే. ఉద్యమాలల్లోకి వచ్చిన మహిళలు పితృసామ్య అణచివేత, విప్లవోద్యమాలల్లో తమ పాత్ర గురించిన అన్వేషను ఆరంభించారు.

ఫలితంగా మహిళా ఉద్యమాలు భారతీయ సమాజంలో పితృసామ్య వ్యవస్థ యేయే దశల గుండా ప్రయాణం చేసింది. ఇవ్వాల్టి సమాజంలో పితృస్వామిక భావజాలం ఏ విధంగా వ్యక్తమవుతున్నది? దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి? అన్న ప్రశ్నలకు మహిళలు విప్లవోద్యమం దారులు వెతక సాగింది.

ఇదే సమయంలో ఏడుగురు మహిళలు కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల అనుభవాలను ‘మనకు తెలియని మన చరిత్ర’ (1986) పుస్తకంగా తెచ్చారు. శ్రామిక, దళత, బహుజన మహిళల ద్రుష్టి కోణం కాదని దళిత, బహుజన మహిళలు కొందరు వాదించారు. మొత్తానికి విప్లవోద్యమం మహిళలు అనే అంశం పెద్ద ఎత్తున రంగంమీదికి వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా వచ్చిన అన్ని రకాల మహిళా ఉద్యమాల గురించి సామ్రాజ్య వాదానికి దాని తాత్వికత, దాని నిర్మాణాలు దానికున్నాయి.

భారతదేశంలో దాదాపు మూడువేల సంవత్సరాలకన్నా ఎక్కువగా అత్యంత అమానవీయంగా దోపిడి, హింసలు ప్రయోగిస్తున్న భారతీయ పితృసామ్యం మూలాల గురించి తప్పని సరిగా అధ్యయనం చేసి పురుషులతో సమానంగా కొన్నిచోట్ల ఎక్కువ సంఖ్యలో విప్లవోద్యమాలల్లోకి వస్తున్న మహిళలు ఈ పనిని ఆరంభించారు.

అందులో భాగంగా ‘కుటుంబం వ్యక్తిగత ఆస్తి’ దాదాపుగా అందరు అధ్యయనం చేశారు. ఆనాడు ప్రధానంగా చర్చించిన విషయాలు తాత్విక నేపధ్యం మాతృసామ్యం: స్త్రీలు చేసే ఆహారసేకరణ గ్రుహ నిర్వహణ వంటి కార్యకలాపాలే ప్రధానమైనవి కావడం వలన తల్లి పాత్ర కీలకమైనదిగా వుండేది. ఆనాటి కుదురు సంబంధాలలో పిల్లలు సహజంగానే తల్లి కుదురుకే చెందేవారు. దీనినే తల్లి హక్కు అనేవారు. తల్లి నుండే వావి వరస లెక్క నిజానికి జంటపెళ్లి అమలులోకి రావటానికి ముందు తండ్రి ఎవరో తెలిసేదికాదు. అందువలన సహజంగానే తల్లికేంద్రంగా మాతృసామ్యం అమల్లో ఉండేది.

ఉత్పత్తి కార్యకలాపాలు అనేక రకాలుగా విస్తరించే క్రమంలో సమిష్టిగా ఉపయోగించే పనిముట్లు, సాధనాలతో పాటు వ్యక్తిగతంగా వుపయోగించే పనిముట్లు, సాధనాలు కూడా వుంటూ వచ్చాయి. ఈ రూపంలో వుండిన సొంత వ్యక్తిగత ఆస్తి కుదురు నియమాల ప్రకారం ఆ కుదురులోనే వుండాల్సి ఉండేది. తరువాతి కాలంలో జంటపెళ్లి అమలులోకి వచ్చినంక పురుషుడు తన సొంత పిల్లలను గుర్తించగలగడం మొదలైంది. తన జీవిత కాలంలో కూడబెట్టిన పనిముట్ల వంటి వ్యక్తిగత ఆస్తిని వేరే కుదురులో వున్న తన పిల్లలకు యివ్వాలన్న కాంక్ష ప్రారంభమైంది. అంతవరకు కుదురు నియమాల ప్రకారం పురుషుని వ్యక్తిగత ఆస్తి అదే కుదురులో వున్న తన అక్కచెల్లెళ్ళ పిల్లలకు చెందేది. నిజానికి ఆ కుదురులోని పిల్లలంతా అందరి పిల్లలుగానే వుండేవారు. అలా జంట పెళ్ళి పురుషుడిని మాతృస్వామ్యానికి, తల్లిహక్కుకు వ్యతిరేకంగా నిలిపింది.

వ్యవసాయం, పశు పోషణల మధ్య మొట్టమొదటి సామాజిక శ్రమ విభజన జరిగి వ్యవసాయక తెగలు, పశుపోషక తెగలు విడివడ్డాయి. ఆదిమ సమాజం చివరి దశలో వ్యవసాయం, పశు పోషణ నుండి చేతి వృత్తులు విడిపోయి రెండవ పెద్ద సామాజిక శ్రమ విభజన జరిగింది. ఈ పరిణామాలన్నీ సామాజిక ఉత్పత్తిలో స్త్రీ పాత్రను పరిమితం చేయసాగాయి. గణ నాయకత్వం పైన తల్లి నాయకత్వం మాతృస్వామ్యం క్షీణించసాగాయి. అయితే పురుషుని చేతిలో పోగుపడిన వ్యక్తిగత సంపద, అటు తరువాత ప్రబలమైన అంశంగా మారిన ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తిగత యాజమాన్యం, బానిసత్వం కలిసి పితృస్వామ్యానికి పరివర్తన చెందడానికి ప్రధానమైన కారణాలుగా పనిచేసాయి.

వ్యక్తిగత ఆస్తి, వర్గ సమాజాల ఆవిర్భావం మొత్తంగా చూస్తే ఆదిమ సమాజం చివరికల్లా ఉత్పత్తి కార్యకలాపాలు బహుముఖంగా విస్తరించాయి. ఉత్పత్తి శక్తులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. సమాజం మిగులు ఉత్పత్తి దశకు చేరుకుంది. శ్రమ చేయకుండా బతకడం కొందరికి సాధ్యమైంది. గణనాయకుడు, పూజారివంటి కొందరు శ్రమనుండి, ఉత్పత్తి నుండి దూరమయ్యారు.

ఇతరుల శ్రమపై ఆధారపడి జీవించడం ప్రారంభమైంది. సమాజపు మిగులును యిలా శ్రమనుండి దూరమైన నాయకత్వం స్వంతం చేసుకోసాగింది. ఇలా ఆదిమ సమాజం చివరికల్లా ఆ సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయగల శక్తులు ఆ సమాజ గర్భంలోనే అభివృద్ది చెందాయి. ఇదే సమయంలో మరొక పరిణామం కూడా సంభవించింది. ఆదిమ సమాజం మొదట్లో తెగల మధ్య జరిగే యుద్ధాల్లో ఓడిపోయిన వారినందరినీ హతమార్చేవారు. శ్రామిక ఉత్పాదకత పెరిగి మిగులును సృష్టించ గలుగుతున్నందున, ఓడిపోయిన వారిని బానిసలుగా మార్చడం సాధ్యమైంది. ప్రారంభమైంది. అంటే ఆదిమ సమాజ గర్భంలోనే బానిస బానిస యజమాని అనే ఉత్పత్తి సంబంధాలు మొలకెత్త సాగాయి.

అంటే ఆదిమ సమిష్టి ఆస్తి పక్కనే స్వంత ఆస్తి ఉత్పత్తి సాధనాలపై వ్యక్తిగత యాజమాన్యం, ఆదిమ సమిష్టి ఉత్పత్తి సంబంధాలపక్కనే శ్రమ దోపిడి ప్రాతిపదిక పైన ఏర్పడ్డ వర్ణ సంబంధాలూ బీజ రూపంలో పుట్టుకొచ్చాయి. ఇలా ఆదిమ సమాజ గర్భంలోనే ఆ సామాజిక, ఆర్థిక నిర్మాణానికి పునాదిగా వుండిన, ఆదిమ సమిష్టి ఉత్పత్తి సంబంధాలను విచ్ఛిన్నంచేసే నూతన సామాజిక శక్తులూ, ఉత్పత్తి సంబంధాలూ అభివృద్ధి చెందసాగాయి.


ఆదిమ సమాజం రక్త సంబంధాలపైన ఆధారపడిన, సంకుచిత పరిధిగలిగిన సామాజిక నిర్మాణం. ఈ సామాజిక నిర్మాణపు పరిధిలో ఉత్పత్తి శక్తులు ఏ మేరకు అభివృద్ధి చెందడానికి అవకాశం వుందో అంతవరకూ అవి అభివృద్ధి చెందాయి. ఇక ఆ తరువాత, అంతవరకూ ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి దోహదంచేసిన సమిష్టి ఉత్పత్తి సంబంధాలే సంకెళ్ళు కాసాగాయి. ఆదిమ సమాజం చివరికల్లా లోహాల వాడకం మొదలైంది. వ్యవసాయం విస్తరించసాగింది. ఇక ఉత్పత్తి శక్తుల తదుపరి అభివృద్ధి అంతా వ్యవసాయం, లోహపరిశ్రమల అభివృద్ధిపైనే ఆధారపడివుంది. పెద్దెత్తున అడవులను నరికి సాగు యోగ్యం చేయడమూ, నదీ ప్రవాహాలను మళ్ళించి సాగు నీటి సదుపాయలను కల్పించడమూ, గనులు లోహ పరిశ్రమలను అభివృద్ధి చేయడమూ తద్వారా శ్రమ పరికరాలన్నింటినీ మెరుగు పరచుకోవడమూ జరగవలసి వుంది.

“మానవ శ్రమ కనీస జీవితావసరాలకు పోగా కొద్దిగా మిగులును మాత్రమే యివ్వగలిగేటంత తక్కువ ఉత్పాదకత కలిగి వున్నంతకాలం, ఉత్పత్తి శక్తులు పెంపొందడం, వర్తకం విస్తరించడం, రాజ్యం, చట్టం అభివృద్ధి చెందడం, కళ విజ్ఞానశాస్త్రాలకు పునాది. ఏర్పడడం శ్రమ విభజన పెంపొందడమనే మార్గం ద్వారానే సాధ్యమనేది స్పష్టమే. అలాంటి శ్రమ విభజనకు ఆవశ్యకమైన ప్రాతిపదిక సరళమైన శారీరక శ్రమను అందించే ప్రజా రాశులకూ, శ్రమకు నిర్దేశకత్వం వహించే వర్తకం, రాజ్య వ్యవహారాలను నిర్వహించే, తరువాతి కాలంలో కళా విజ్ఞాన శాస్త్రాలకు అంకితమయ్యే కొందరు ప్రత్యేక హక్కులు కలిగిన వ్యక్తులకూ మధ్య గొప్ప శ్రమ విభజనే. అలాంటి శ్రమ విభజన యొక్క అత్యంత సరళమైన అత్యంత సహజమైన రూపం నిజానికి బానిసత్వమే.” (యాంటీ రూరింగ్, పే. 232)

గణ సమాజంలో నాయకులు, పూజారులు తదితరులతో కూడిన చిన్న ఉన్నత వర్గం (అరిస్టోక్రసీ) ఏర్పడసాగింది. వారు గణం పశువుల మందలను, ఆస్తిని సొంతం చేసుకోవడం పెరిగింది. క్రమంగా గణంలో బానిసల సంఖ్య పెరిగిపోసాగింది. ఈ విధంగా ఉత్పత్తి సాధనాల వ్యక్తిగత యాజమాన్యం ప్రాతిపదికగా కలిగిన నూతన శకం వర్గ సమాజం ఆవిర్భావానికి అంకురార్పణ జరిగింది. అయితే కుదురు ప్రాతిపదికగా కలిగిన సమిష్టి ఆస్తి ఉత్పత్తి సంబంధాలు విచ్ఛిన్నమైపోయే క్రమం వాస్తవానికి పితృస్వామ్యానికి పరివర్తనతో ప్రారంభమై పితృస్వామిక సమిష్టి కుటుంబం ఏర్పాటుతో ముగిసింది.. పితృస్వామ్యానికి పరివర్తన ఆనాటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం అమలులో వుండిన కుటుంబంలోని శ్రమ విభజన కారణంగా పురుషుడు పశువుల మందలకు, తరువాతి కాలంలో నూతన శ్రమ సాధనాలైన బానిసలకు యజమానిగా వుండేవాడు. పురుషుని చేతిలోని సంపద పెరగడంతో అతడు తల్లి హక్కను కూలదోసి తండ్రి హక్కును నెలకొల్పాడు.

“ఇంటిలో పురుమని వాస్తవ ఆధిక్యత ప్రారంభం కావడంతో, అతడి అవిచ్చిన్నమైన అధికారానికి వున్న ఆఖరి అడ్డంకి కూలిపోయింది. తల్లి హక్కును కూలదోయడం, తండ్రి హక్కును ప్రవేశపెట్టడం, జంట వెళ్ళి నుండి దంపతి వివాహానికి క్రమంగా పరివర్తన చెందడం అనేవి పురుమడి యీ అవిచ్చిన్నమైన అధికారాన్ని ధ్రువపరిచాయి, పెంపొందింపజేసాయి.” (ఎంగెల్స్, కుంటుంబం, వ్యక్తి గత ఆస్థి, పే. 196)

“తల్లి హక్కు కూలదోయబడడమనేది స్త్రీ జాతి ఎదుర్కొన్న ప్రపంచ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఓటమి. పురుషుడు ఇంటిలో కూడా ఆధిపత్యాన్ని చేపట్టాడు. స్త్రీ హీనపరచబడింది. బానిసత్వంలోకి నెట్టబడింది. ఆమె అతడి వాంచకు బానిసగా, కేవలం పిల్లలను కనే సాధనంగా మారిపోయింది.”
“పురుషుని తిరుగులేని ఆధిపత్యం ఫలితాలు ముందుగా పితస్వామిక కుటుంబంలో కనబడతాయి…..” (అదే పుస్తకం, పే. 65)

పితృస్వామిక సమష్టి గ్రుహం అనే రూపంలోని నూతన సామాజిక వ్యవస్థలో స్త్రీ బానిసలతో పాటుగా పురుషుని సొంత ఆస్తిగా మారింది. సమష్టి ఆస్తి, సంబంధాలు అనివార్యంగా పతనం కానుండడంతో యీ నూతన సామాజిక వ్యవస్థ స్వల్పకాలికమైనదిగానే నిలిచి, దంపతీ వివాహం ప్రాతిపదిక పైన వ్యక్తి కుటుంబం (single family) అమలులోకి వచ్చింది. “ఇది సహజ ప్రాతిపదికపై కాక ఆర్థిక పరిస్థితుల ప్రాతిపక పైన – వ్యక్తిగత ఆస్తి అదిమమైన, సహజంగా ఏర్పడిన సమష్టి ఆస్తి పై సాధించిన విజయంపైన ఆధారపడి ఏర్పడిన మొట్టమొదటి కుటుంబ రూపం.” (అదే పుస్తకం, పే.4)

“ఆడమగలలో ఒకరు మరొకరికి లోబడడంతో దంపతీ వివాహం రంగ ప్రవేశం చేసింది. అది, అంతకు మునుపటి చరిత్ర పూర్వకాలం అంతట ఎన్నడూ ఎరుగని ఆడ మగ సంఘర్షణను ప్రారంభించింది. చరిత్రలోని మొట్టమొదటి వర్గ వైషమ్యం తలెత్తడంతో పాటుగానే దంపతీ వివాహంలో ఆడ, మగ మధ్య శత్రుత్వం అభివృద్ధి చెందింది.

మొట్టమొదటి వర్గ అణచివేతతో పాటుగానే ఆడ సెక్స్ పైన మగ సెక్స్ అణచివేత కూడా తలెత్తింది. దంపతీ వివాహం గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగిన ముందడుగు. అయినప్పటికి అది ప్రతి ముందడుగు సాపేక్షికంగా ఒక వెనుకడుగ కూడా అయ్యేటటువంటి, యిప్పటికీ కొనసాగుతున్న నూతన యుగాన్ని – కొందరి సౌభాగ్యం, అభివృద్ధి మరికొందరి దౌర్భాగ్యం, నిస్సహాయతల ద్వారా సాధించుకోబడే యుగాన్ని ప్రారంభించింది.” (అదే పుస్తకం, పే. 75)

“అయితే యిది పాత కుదురు వ్యవసను విచ్చిన్నం చేసింది. వ్యక్తి కుటుంబం ఒక శక్తిగా మారింది. కుదుళ్ళను కూలదోసేదిగా వృద్ధి చెందింది.” (అదే పుస్తకం, పే. 196)

పితృస్వామిక సమష్టి కుటుంబం నుండి పుట్టిన దంపతీ వివాహం దాని సారంలో పితృస్వామికమైనది. అయితే దానికి పునాది పితృస్వామిక వ్యక్తిగత ఆస్తి. నేటికీ అది పితృస్వామిక సంస్థగానే స్త్రీని బానిసను చేసి అణచివేసే సంస్థగానే కొనసాగుతున్నది.

ఇలా ఆదిమ సమాజ గర్భంలోనే పుట్టి పెరిగిన సొంత ఆస్తి, వరాలు గణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసాయి. బానిస సమాజం దిశగా, “నాగరికత” దిశగా సమాజం సాగిపోయింది. వర్గ సమాజం సమాజపు గత చరిత్రంతా భిన్న, యుగాలలో భిన్న రూపాలను ధరించిన వర్గ వైషమ్యాల అభివృద్ధితో కూడివుంది. అయితే అవి ధరించిన రూపం ఏదైనప్పటికీ సమాజంలోని ఒక భాగం మరొక భాగాన్ని దోచుకోవడమనే ఒక వాస్తవం గత యుగాలన్నింటికి సాధారణమైనదిగా వున్నది.” (కమ్యూనిస్టు మానిఫెస్టో, పే. 8)

సొంత ఆస్తి పునాది పైన పుట్టి పెరిగిన స్త్రీ పురుష వైరుధ్యం సోషలిజంలో కూడా కొనసాగుతుంది. అయితే స్త్రీ వంటింటి నుండి బయటపడి సామాజిక ఉత్పత్తిలో భాగస్వామి అవుతుంది. స్త్రీ సకల విధాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించ బడతాయి. సకల రంగాలలోనూ స్త్రీ పురుష సమానత్వం నెలకొనడానికి భౌతిక ప్రాతిపదిక సృష్టించడానికి చైతన్యయుతమైన కృషి జరుగుతుంది.

ఈ నేపథ్యంలో -1967 నుండి జరిగిన విప్లవోద్యమాలు మహిళల పాత్ర గురించి సుధీర్ఘంగా మహిళలు అధ్యయనం చేశారు. చర్చించారు. వైరుధ్యాలు పరిష్కరించడంలో విప్లవోద్యమాలు నడపడంలో మహిళలు అనేక ప్రతిపాదనలు చేశారు. ఇదే సమయంలో జగిత్యాల ప్రాంతంలో అమరుడైన ఒక కామ్రేడు జీవితం గురించి తెలిసింది. 1986 విప్లవోద్యమం స్థల కాలాలనే నేపథ్యంలో కుటుంబంలో పితృసామ్యం సామాజిక ఉద్యమాలతో పాటు అది ఎట్లా ఉంటుందో ఆ అమరుడి జీవితం ఒక ఉదాహారణ. నా అవగాహన మేరకు చర్చించిన కథ.

మహిళలు అమ అస్తిత్వ చైతన్యం గురించి అది ఎన్నిరకాలుగా పీడనలకు హింసకు గురౌతున్నాదో? ఈ మొత్తం పితృస్వామిక వ్యవస్థ అన్ని వ్యక్త రుపాలను గతితార్కికంగా, చారిత్రకంగా అధ్యయనం చేయడం అస్తిత్వ చైతన్యాన్ని గతితార్కికం చారిత్రక చైతన్యంగా రెండోదశకు సమిష్టిగా విప్లవోద్యమ ఆచరణ నుండి ఎదిగించుకోవడం లక్షనంగా సమాజంలో పోరాటంలో మహిళలు గణనీయమైన మార్పులు, ఎత్తుగడలు నిర్మించడం ఆరంభమయ్యింది. అలాంటి సాహిత్యం, కథలు, దండకారణ్య రచయిత్రులు రాసిన వాటిలో మనం చూడవచ్చును. ఇప్పుడు చాలా సాహిత్యం వస్తోంది.

ఇలాంటి సాహిత్య కృషిలో ఈ కథలో ఒక చిన్న అంశం నామట్టుకు నేను చాలా కథలు రాసినా ఇప్పటికి ఈ కథ చదువుతుంటే మా అమ్మమ్మ, నాయనమ్మల నుండి మా బిడ్డలు, మనుమరాండ్లు అనేక మంది మహాద్భుతమైన మిత్రురాళ్లు, సహచరులు వాళ్ల దైనందిన వీరోచిత పోరాటాలు వైఫల్యాలు ఈ పోరాటాలల్లో హత్యకావించబడిన అనేకమంది మహిళలు బహశా చరిత్ర పొడుగూతా మహాద్భుతమైన, శక్తివంతమైన మహిళలను భారతదేశపు క్రూర హంతక బ్రాహ్మణీయ సమాజం కోట్లాది మందిని సంహరించిన చరిత్ర ఇంకా మన చరిత్ర పుటల్లోకి ఎక్కనేలేదు. మహిళల గతితార్కిక చారిత్రక పోరాట చరిత్ర నిర్మించవలిసి ఉన్నది.

భారతదేశంలో మహిళా పోరాటాలు పదునెక్కుతున్నాకొద్ది వాళ్ల పట్ల హింస పెరుగుతూ ఉంటుంది.

ఈ కథ ఎప్పుడు చదివినా నా కళ్లు దారలు కట్టుతూనే ఉంటాయి. పురుషుడిగా ఈ మొత్తం హింసలో నేను భాగమైనందుకు ఒళ్లు జలదరిస్తుంది. నీలను నేనెప్పటికైనా సంపూర్ణంగా తెలుసుకుంటానా?

  • 22. 02. 2020

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply