స్వాతంత్య్ర పూర్వ దళిత ఉద్యమ ఘట్టాలు – సాహిత్య ప్రతిఫలనాలు

(నీలీ రాగం – 6 )

30వ దశకం వరకు దళిత ఉద్యమం అణగారిన మాల మాదిగల స్వీయ అస్తిత్వ ఆకాంక్షల నుండి, వారి చొరవతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రారంభంలో క్రైస్తవ మిషనీరీలు, తరువాత ఉదారవాద హిందూ సంస్కర్తలు వారికి మద్దతుగా నిలబడటం చూస్తాం. పౌర ప్రభుత్వ పరిధి లోకి వచ్చే బావులు, చెరువులు, బడులు, గుడులు అన్నింటిలో అస్పృశ్యులుగా ఇంతకాలం ప్రవేశమే లేకుండా ఉపాంతీకరణకు గురైన వాళ్లందరికీ ప్రవేశం కోసం ఉద్యమాలు నడిచాయి. బాబాసాహెబ్ నాయకత్వంలో కొలబ జిల్లాలో జరిగిన మహద్ ఉద్యమం (1927), నాసిక్ జిల్లా లోజరిగిన కాలారామ్ దేవాలయ ప్రవేశ సత్యాగ్రహం(1930) ఆ తరువాత దేశవ్యాప్తంగా ఎన్నో మహద్ పోరాటాలకు, దేవాలయ ప్రవేశ ఉద్యమాలకు నమూనాగా నిలిచాయి.

రెండవ రౌండ్ టేబిల్ సమావేశం తరువాత దళిత మైనార్టీ వర్గాలకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటుకు అంగీకరిస్తూ కమ్యూనల్ అవార్డు ప్రకటించ బడటం, హిందూ సమాజంలో చీలికలకు కారణమవుతుందని దానిని నిరసిస్తూ గాంధీ నిరాహార దీక్ష చేపట్టటం ఫలితంగా ‘పూనా ఒడంబడిక’ రావటం 1932 ఘటనలు. ఈ పరిణామాల తరువాత అస్పృశ్యతా నిర్మూలన కొరకు గాంధీ ఏర్పరచిన సంస్థ హరిజన సేవక్ సంఘ్. దాని పని తీరుపై విమర్శనాత్మక సాహిత్య ప్రతిఫలనం శ్రీపాద వారి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ కథ.

మాల మాదిగలు మిషనరీల ప్రభావంతో క్రైస్తవం తీసుకొనటం అప్పటికే ఉంది. ఈ కథలోనూ క్రైస్తవం తీసుకొన్న దళిత పంతులు పాత్ర ఉండనే ఉంది. మంచినీటి చెరువులో దిగే హక్కును వాళ్ళు ఉపయోగించుకొనటానికి వాళ్ళ ప్రతినిధిగా పనిచేసిన వాడూ అతనే. అయితే అన్ని సంస్థలు అసలు సమస్యను నిర్లక్ష్యం చేస్తే తమ సమస్యను తామే పరిష్కరించు కొనటానికి ఈ కథలో మాదిగ విస్సిగాడు ముస్లిం మతం తీసుకొనటమే సరిఅయిన మార్గంగా ఎందుకు ఎంచుకొన్నట్లు? ‘మతం మారదలచుకొంటే ముస్లిం మతంలోకి మారమని’ దళితులకు పిలుపు ఇస్తూ అంబేద్కర్ ‘బహిష్కృత భారత్’ పత్రిక( మార్చ్ 15, 1929 ) లో వ్రాసిన సంపాదకీయం ఆయన చదివి ఉండే అవకాశమైతే లేదు కానీ ఆ నోటా ఈ నోటావినిఉండవచ్చు. తెలుగు వార్తాపత్రికలు చదివి తెలిసి కొని ఉండవచ్చు.ఏమైనా ఆయన దానిని ఇతివృత్తంలో భాగం చేయటం విశేషం.

నిజానికి ఈ కథ వచ్చిన ఏడాది తరువాతగానీ మాలమాదిగల మతాంతరీకరణ గురించి అంబేద్కర్ సీరియస్ చర్చ ప్రారంభించలేదు. తన సామాజిక రాజకీయ ప్రయత్నాలు ఏవీ హిందూ సమాజంలోని కులవ్యవస్థ స్వభావంలోకానీ అంటరాని వాళ్లుగా చేసి నిమ్నవర్గాల పట్ల అగ్రవర్ణాలు చూపించే ద్వేషంలో కానీ ఏ మాత్రం మార్పు తీసుకు రాకపోవటంతో విసిగిపోయిన అంబేద్కర్ 1935 అక్టోబర్ 13 న నాసిక్ జిల్లాలోని యోలా (yeola) లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ “నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావదలచుకోలేదు” అని ఒక ప్రకటన చేసాడు. దానికి ప్రతిస్పందించి ముస్లిం, క్రెస్తవ శిక్కు బౌద్ధ మత పెద్దలు అతనికి – అస్పృశ్యులు అందరికీ పూర్తి రాజకీయ సామాజిక ఆర్ధిక మత హక్కులకు హామీ ఇస్తూ- తమ తమ మతాలలోకి మారమని ఆహ్వానాలు పంపారు. ( బిమలేందు మొహంతీ – Ambedkar embracing buddhism: A social event of major significance 14,April 2014, The Pioneer , చూడు ; htpps ://www.dailypioneer.com /2014/state editions) ఆ నేపథ్యంలో అంబేద్కర్ 1936 మే30- జూన్1 మధ్య జరిగిన ముంబయి ప్రాంత మహర్ పరిషత్ మహాసభలో చేసిన విస్తృతోపన్యాసంలో దళితులు మతం ఎందుకు మారాలో వివరంగా చర్చించాడు. అదే తరువాత ముక్తిమార్గం ఏది అన్న శీర్షికతో పుస్తకం గా వచ్చింది. తరువాత ‘కులనిర్మూలన’ గురించి వ్రాయటానికి ఇది భూమికను సిద్ధంచేసింది.


స్పృశ్యులకు, అస్పృశ్యులకు దూరం, సంఘర్షణ ఎప్పటికీ అంతరించేది కాదు అంటాడు అంబేద్కర్. ఎందుకంటే హిందువుల అభిప్రాయంలో మతమే ఆ పాత్రలను, స్థాయిని వాళ్లకు ప్రసాదించింది కనుక. దళితులకు దీనిని ఎదుర్కొని మార్చే సంఖ్యాబలంకానీ, సంపద బలం కానీ, బౌద్ధిక మానసిక శక్తిగానీ లేవు అంటాడు ఆయన. అనేక ఉపకులాలుగా విడిపోయి గ్రామాలలో చెల్లాచెదురై ఉన్నారు కనుక సంఖ్యాబలం లేదు. భూమిలేదు,వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు కనుక సంపదలేదు. నిత్యం వేధింపులకు, అణచివేతకు గురవుతుంటారు కనుక మానసిక స్థైర్యం ఉండదు. దళితులవలెనే మైనారిటీలే అయిన ముస్లిములతో పోల్చి ముస్లిములకు ఉన్న కమ్యూనిటీ బలం దళితులకు లేదు అని స్పష్టం చేసాడు. దళితులు హిందూ మతంలో భాగంగా ఉంటూ హిందూ సవర్ణుల అణచివేతకు గురవుతున్నవాళ్ళు కనుక వాళ్లకు కమ్యూనిటీ బలం ఎప్పటికీ అందరాని ఆకాశ పుష్పమే. అటువంట ప్పుడు వాళ్ళు మతం మారక తప్పదు అన్నది అంబేద్కర్ అభిప్రాయం. వ్యక్తి అభివృద్ధికి కీలకమైన దయ, సమానత్వం, స్వాతంత్య్రం హిందూ మతంలో లభించనప్పుడు మతం మారాల్సిందేనంటాడు.

క్రైస్తవ, ముస్లిం, సిక్కు మతాలు పరిగణనలోకి తీసుకోదగినవి అని చెప్పిన ప్పటికీ ఇస్లాం ఎంచుకోదగినది అంటాడు. క్రిస్టియానిటీ కూడా భారత దేశంలోని కులవ్యవస్థనుండి తప్పించుకోలేకపోయిందన్నఅనుభవం నుండి ఆయన చేసిన సూచన అది. ( excerpt from ఆనంద్ తేల్ టుంబే వ్యాసం “ Strategy of conversion to Buddhism :Intent and Aftermath. “The radicle in Ambedkar, critical reflections” పుస్తకం నుండి, చూడు; https://scroll.in / article / 898332/ why- ambedkar – considered -Islam -the religion -of choice -for Dalits- before – opting- buddhism) ఈ నేపథ్యంలో అంటరానివాళ్ళు ముస్లిం మతంలో చేరటం భావ్యం అన్న వాదన బలంగా ముందుకు వచ్చింది. తెలుగు సమాజంలో దళిత ఉద్యమ నాయకుడు, రచయిత అయిన కుసుమధర్మన్న ఈ వాదానికి బలమైన ప్రతినిధి. జయభేరి పత్రికలో ఆయన ఆ మేరకు దళితులకు పిలుపునిస్తూ వ్రాసాడు కూడా. (యాగాటి చిన్నారావు , ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర ) ఈ సామాజిక సాంస్కృతిక పరిణామాలకు సమాంతరంగా శ్రీపాద మాదిగ విస్సిగాడిని సామాజిక సమానత్వ హక్కును సంపాదించుకొనేందుకు ముస్లిం మతం లోకి మార్చటమే వాస్తవికంగా ఉంటుందని భావించాడంటే సామాజిక చలన సూత్రాలను సరిగా అర్ధం చేసుకో గలిగాడన్న మాట. ఆ అవగాహనే ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ కథను దళిత రాజకీయ కథగా చేసింది.

ఈ కథలో తురకల ఇళ్ళు ఊళ్లోనూ, క్రైస్తవం తీసుకొన్న పంతులు పూరిగుడిసె మాదిగపల్లెలోనూ ఉండటం లోని వైరుధ్యాన్ని పాఠకుల దృష్టికి తెస్తాడు రచయిత. ‘మతంలో కలియటంవల్ల మాదిగలకు వచ్చిన కొత్త పరపతి యేమీ లేదు’ అని సూటిగానే చెప్తాడు. మతమూ, పేరూ మార్చుకొని, మతమూ మార్చుకొని క్రాపింగ్ పెట్టుకున్నా బ్రాహ్మలు తారసపడితే గోడ వారకు ఒదిగి నిల్చోటం పెంటకుప్పల మీదుగా తప్పుకొని పోవటం తప్పమరొక మార్గం లేని పరిస్థితులలోనే మాదిగపెద్దలు ఉండటం కిరస్తానీ పంతులు గుర్తించాడు. ఊరి పెద్ద చెరువులో దిగటానికి ఇస్లాం మతస్తులకు ఉన్నఅధికారం క్రైస్తవం తీసుకొని చదువుకున్న తనకు ఎందుకు లేకపోవాలన్న ప్రశ్న అతని లోలోపల సుడులు తిరుగుతూనే ఉంటుంది. ఇస్లాం మతంలో కలిసిన వారు హిందువులుగా ఏ కులానికి చెందినవాళ్లయినా మతం పుచ్చుకోగానే అందరూ ఒకటికావటం, పరస్పర సంబంధబాంధవ్యాలు నెరపటం జరుగుతూ ఉంటే మతం మారినా ఇటు పూర్వ అస్పృశ్యత, ఊరిబయట ఆవాసం కొనసాగుతుండగా అదనంగా క్రైస్తవ మిషనరీలు తమకు సహపంక్తి గానీ, బంధుత్వం కానీ ఇయ్యకపోవటం ఆయన గ్రహించాడు. విస్సన్న తురకమతం తీసుకొంటానంటే అందుకే అభ్యంతరం చెప్పలేకపోయాడు.

తురకమతం తీసుకొంటే అతనికి కలిగే స్వేఛ్చ ను చూసి తక్కిన మాదిగలు కిరస్తానీమతాన్ని చులకన చేస్తారేమో అన్న అనుమానం కలిగినా ‘పెద్దకులం’ కావటానికి వాళ్లకున్న అవకాశాన్ని స్వజాతి అభిమానంతో కాదనలేకపోయాడు. శరీరమూ మారక, బుద్ధీ మారక , ఆత్మా మారక అదే మనిషి కాస్త వేషం మర్చి ముస్లిం అయితే పెద్ద చెరువులోకి దిగటానికి అర్హుడు అవుతుంటే చూసే పెద్దకులాలవారి పెద్దతనపు లేమిని, జ్ఞానరాహిత్యాన్ని, అనవసరపు అసూయను, అర్థరహిత ద్వేషాన్ని కిరస్తానీ పంతులు ఆలోచనల ద్వారా, సాటివాళ్లతో చేసిన సంభాషణల ద్వారా విమర్శకు పెట్టాడు రచయిత. “… తెగల పేరు చెప్పుకునీ, కులాలపేరు చెప్పుకునీ, వర్ణాలపేరు చెప్పుకునీ, విశేషించి రాజకీయాల పేరు చెప్పుకునీ తమలోతాము కుమ్ములాడుకుంటారు పెద్ద కులాల వారు. అది చాలటం లేదు వారికి. తమజాతిని బద్దలు కొట్టుకుంటున్నారు వారు. తమపోటీదారులను పెంచుకుంటున్నారు. తమగోతులను తామే తవ్వుకుంటున్నారు కూడా.” ఇది హిందూ సవర్ణ సమాజం మీద ఒక మాదిగ క్రైస్తవుని వ్యాఖ్యానం. ఆ రకంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సమకాలీన సాంఘిక రాజకీయ సంఘాలను, కుల రాజకీయాలను దళిత అనుభవ కోణంనుండి, ఆలోచనా కోణం నుండి ప్రదర్శనకు పెడ్తూ వ్రాసిన కథ ఇది.

1930 లలో కథా రచన ప్రారంభించిన వేలూరి శివరామశాస్త్రి శ్రీపాద వలెనె క్రైస్తవం లో దళితుల పట్ల అమలవుతున్న వివక్షను గుర్తించి ‘వ్యత్యయం’ కథలో దానిని భాగం చేయటం చూస్తాం. ఎరుకగలవారు విద్యావినయం గల బ్రాహ్మణుడిని , ఆవును, ఏనుగును, కుక్కను, మాల వానిని సమబుద్ధితో ఉంటారని చెప్పే భగవద్గీతను వల్లించే సోములు దళితుడు పేద వాడు అయిన రాముడి పట్ల ఎంత అమానుషంగా ఉన్నాడో క్రైస్తవం ఇచ్చిన ఫాదరీ కూడా అతనిపట్ల అలాగే ప్రవర్తించాడు. రెబెకా,ఆమె ను పెళ్లి చేసుకొనటానికి మతం తీసుకొని జకరయ్య అయిన రాముడు బడి పాఠాలు చెప్పే పంతులు ఉద్యోగాలు పొందారు. ఏసు పేరా ప్రతిఆదివారం , పండుగలప్పుడు ఫాదరీ కి ఇయ్యవలసిన కానుకలు, నెలనెలా కొనవలసిన మత వాఙ్మయపు ఖర్చు లకు జీతమంతా హారతి కర్పూరం అవుతుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించిన రాముడికి ఫాదరీ తెలియచెప్పిన వాస్తవం ఏమిటంటే క్రైస్తవం తీసుకొన్న మాల మాదిగలు తమవలే యేసుకులము వారు కాదు, తమ ద్వారా యేసుగుడి ముందుకు పోగల రెండవ స్థాయి పౌరులు వాళ్ళు. బానిసలుగా తప్ప వారికి మరొక అస్తిత్వం లేదు. భగవద్గీతను వల్లెవేసే సోములు అయినా, బైబిల్ వల్లెవేసే ఫాదరీ అయినా దళితుల పట్ల పీడకులే. మతంలో కాక మానవుని స్వార్ధంలో దోషాన్ని చూడగలిగిన రచయిత దళితులకు విముక్తిమార్గం ఏదో వాళ్ళే వెతుక్కోవలసి ఉందని సూచించాడు ఈ కథ ముగింపులో.


అనేక వ్యతిరేకతల మధ్య, మినహాయింపుల మధ్య ప్రారంభమైన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో ఒక ఘట్టం 1932 లో మద్రాస్ ప్రభుత్వం దళితులకు దేవాలయాలలో ప్రవేశించే హక్కును గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెట్టటం. అయితే ప్రభుత్వాలు మతవిషయాలలో జోక్యం చేసుకొనటాన్ని నిరసిస్తూ పెద్దఎత్తున వ్యతిరేకత రావటంతో ఉపసంహరించబడింది.( యాగంటి చిన్నారావు,ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర ) హరిజన సేవక్ సంఘ్ ప్రత్యేకంగా టెంపుల్ ఎంట్రీ కమిటీ ఒక దానిని ఏర్పరచి పనిచేయటం మొదలుపెట్టింది. కేరళలో 1928 వరకు జీవించిన నారాయణగురు కులవ్యవస్థలోని అన్యాయానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం సంస్కరణ ఉద్యమాన్ని నడిపాడు. ఆయన బోధలచేత ప్రభావితులైన – హరిజన సేవక్ సంఘ్ పంపిన – ఆరుగురితో కూడిన బృందం ట్రావెన్కూరు స్టేట్ లో పర్యటించి హరిజన దేవాలయ ప్రవేశానికి హిందువుల మద్దతు కూడగట్టారు. మహారాజ చితిర తిరునాల్ బలరామ శర్మ 1936 డిసెంబర్ 12 న ట్రావెన్కూరు లో హిందూ దేవాలయాలలోకి హరిజనుల ప్రవేశానికి ఉన్న నిషేధాన్నిరద్దుచేస్తూ చట్టం చేసాడు. తిరువనంతపురం దేవాలయ ప్రవేశ చట్టం గా అది ప్రసిద్ధం. కొచ్చిన్ మహారాజు దీనిని వ్యతిరేకిస్తూ మొత్తం ట్రావెన్కూర్ ప్రజలంతా అస్పృశ్యులే అని ప్రకటించేంత వరకు వెళ్ళాడు. అయితే ఈ చట్టం ఇచ్చిన ఉత్సాహం దేశమంతా దేవాలయ ప్రవేశ ఉద్యమాలు విస్తరించటానికి దోహదపడింది. అదే స్థాయిలో సం ప్రదాయ హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించే వర్గం వీటిని వ్యతిరేకిస్తూ, వాదిస్తూ వచ్చింది. కాంగ్రెస్ ను గాంధీనీ తీవ్రంగా నిరసించింది. సంస్కరణకు, సంప్రదాయానికి మధ్య సంఘర్షణ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో చూస్తూ కూర్చోకుండా సంస్కరణల పక్షం వహించి సంప్రదాయ వాదుల స్వార్ధాన్ని, ద్వేషాన్ని విమర్శకు పెడుతూ కథలు వ్రాసినవాడు కరుణకుమార.

కరుణకుమార అన్నది కలం పేరు. అసలు పేరు కందుకూరి అనంతం. తెనాలి నుండి నెల్లూరువరకు వివిధప్రాంతాలలో రెవిన్యూ ఉద్యోగిగా పనిచేసిన ఆయన కథలు గ్రామీణ దళిత జీవిత సమస్యలను చిత్రించాయి. అస్పృశ్యత అనే సామాజిక వివక్ష తీవ్రమైనదే అయినా అంతకుమించి వాళ్ళది ఆర్ధిక వ్యత్యాసాలకు సంబంధించిన సమస్య అన్న అవగాహనతో ఉంటాయి ఆయన కథలు. ‘పోలయ్య’ అనే కథ ( భారతి, జనవరి, 1937 ) అందుకు మంచి నిదర్శనం. విఠలాగ్రహారపు వైదిక బ్రాహ్మడు వెంకట శాస్త్రిని పరిచయం చేయటంతో ప్రారంభం అవుతుంది ఈకథ. అతను ఎటువంటివాడు? ‘సనాతన ధర్మం అన్నా, వర్ణాశ్రమ ధర్మం అన్నా చెవి కోసుకొంటాడు’. పంచములంటే సరిపడదు. అలా సరిపడని బ్రాహ్మలు అనేకమంది ఉన్నాఇతని సరిపడకపోవటం వ్యక్తిగత స్థాయిలో ఆగలేదు. గాంధీ అస్పృశ్యతా నివారణోద్యమం ప్రారంభించినప్పటి నుండి, దానికి ప్రతిక్రియ అన్నట్లుగా తన పదేళ్ల కాశీ శాస్త్ర పఠన జ్ఞానమంతా వినియోగించి పంచములు హిందువులు కారని కొత్త సిద్ధాంతాలు లేవదీశాడు. పంచములకు హరిజనులని పేరుపెట్టి దేవాలయ ప్రవేశానికి ఉద్యమాలు, ఉపన్యాసాలూ, బిల్లులు వస్తుంటే భరించ లేకపోయాడు. సనాతన ధర్మం చచ్చిపోతుంటే తనలాంటివాడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చొనటం భావ్యం కాదని మాలమాదిగలను పైకి రాకుండా చేసే కృషి మీద బయలుదేరి దేశమంతా తిరిగి కొడుకుకు కొడుకుపుట్టి బారసాల జరుగుతున్నదని వార్త తెలిసి స్వగ్రామానికి రావాలని రెండేళ్లకు నెల్లూరు దగ్గర పూంజూరు స్టేషన్లో రైలు దిగిన వెంకట శాస్త్రి పరిచయం ఇది.

వెంకట శాస్త్రి దేవాలయ ప్రవేశ బిల్లులకు, ఉద్యమాలకు వ్యతిరేకంగా పనిచేయటానికి సంసారం కొడుకుకు అప్పగించి వెళ్లాడంటే అది 1932 తరువాత 1934, 35 లలోనో అయివుంటుంది. ఈ కథ రచనా కాలం 1937 జనవరి. ట్రావెన్కూర్ హరిజన దేవాలయ ప్రవేశచట్టం వచ్చిన తక్షణమే వ్రాయబడిన కథ అన్నమాట. సంప్రదాయవాదులు ఎంత వ్యతిరేకిస్తున్నా మార్పు దిశగా చలనం లో ఉన్న సమాజాన్ని ఆపతరం కాదన్న సూచన దేవాలయ బిల్లులను వ్యతిరేకిస్తూ వెళ్లినవాడిని, రెండేళ్లకు దేవాలయచట్టం వచ్చిన సందర్భంలో తిరిగి ప్రవేశ పెట్టటం ద్వారా సూచించినట్లయింది రచయిత. తెల్లవారేసరికి మనుమడి బారసాలకు అందుకునేట్లు స్వగ్రామం చేరాలి కనుక, స్టేషన్ ముందు కనపడ్డ ఒకేఒక బండి వాడిని బతిమిలాడి బండి కట్టించుకున్న వెంకటశాస్త్రికి ఆ రాత్రి ప్రయాణంలో బండి తోలే పోలయ్యతో జరిగిన సంభాషణ తాను విడిచివెళ్లిన రెండేళ్లలో ఊళ్ళెంత మారిపోయాయో తెలియచెప్పింది.


ఆ మార్పు ఏమిటి? చెంచునాయుడు వంటి ఆసాములు వ్యాపారాలలోకి దిగారు. పరపతి సంపాదించారు. రైలు స్టేషన్ నుండి గ్రామాలకు మోటార్లు నడిపే పర్మిట్లు సంపాదించి బాడుగకు బండ్లు నడిపే వాళ్ళ పొట్టగొట్టారు. బండ్లు నడిపేవాళ్ళంతా తురకలు. వాళ్ళ బతుకుతెరువు పోవటం వాళ్ళతో ఆగలేదు. ఆగదు. బళ్ళుచేసే వడ్రంగులు, బండి కొయ్యలు అమ్మేవాళ్లు, బండిగూడు కట్టే మేదరి వాళ్ళు, ఎద్దుల బేరగాళ్లు, ఎద్దులకు పచ్చిగడ్డి దోక్కొనివచ్చి అమ్మి అణా డబ్బులు సంపాదించుకొనే మాలమాదిగ ఆడవాళ్లు అందరూ అందువల్ల ఉపాధులు కోల్పోయినవాళ్ళే. అందరినీ కలుపుకొని బతుకుగడవని బండ్లవాళ్ళు చెంచునాయుడి ఇంటి మీద ఆకలి దాడి చేసి తలా కాసిని ధాన్యం తీసుకొని పోయినారు. చెంచునాయుడు పోలీసులను పట్టుకొని కేసులు పెట్టించి వాళ్ళను జైళ్లకు పంపాడు.

పోలయ్య చెప్తున్నదంతా వింటూ వెంకటశాస్త్రి చెంచునాయుడికి వచ్చిన కష్టానికి లోలోన ఎందుకు బాధ పడ్డాడు? తిరగబడ్డవాళ్లమీద అతనిదే పైచేయి అయినందుకు ఎందుకు సంతోషపడ్డాడు? అతను తనకు స్నేహితుడు కనుక. ఆ స్నేహం అతను తనను బ్రాహ్మడు అని గురుత్వం చూపుతున్నందువల్ల, తనకు ఇల్లు కట్టించి ,పొలం రాసిచ్చి, అవసరాలకు డబ్బు ఇస్తున్నందువల్ల ఏర్పడినది. అందువల్ల అతని కష్టం తనకు బాధను, అతని విజయం తనకు ఆనందాన్ని ఇచ్చాయి.

ఊళ్ళో వచ్చిన అతిముఖ్యమైన మార్పు కులమతాలతో సంబంధంలేకుండా పేద శ్రామిక వర్గం అంతా ఏకం కావటం. ఆకలిదాడికి దిగటం. ఇది సాధారణమైన తిరుగుబాటు కాదు. ఊళ్లను, ఉత్పత్తిసంబంధాలను సమూలంగా మార్చే దిశగా సమాజ చలనాన్ని సూచించే ఘటన. నిచ్చెన మెట్ల వర్ణవ్యవస్థ యధాతథంగా కొనసాగాలని ఆశించి అందుకు దోహదం చేయాలని ఊరువదిలిన వెంకటశాస్త్రి తిరిగివచ్చేసరికి అసమ ఆర్ధిక సంబంధాలలో కుదుపు ప్రారంభం అయినట్లు ఒక ఘటనను కల్పించటం ద్వారా రచయిత యథాతథవాదుల ప్రయత్నాలను హేళనకు గురిచేసినట్లయింది.

ఈ కథలో మరొక ముఖ్యాంశం బండి నడుపుతున్న పోలయ్య మాలవాడని తెలియటంతో వెంకటశాస్త్రికి కలిగిన ఆగ్రహం, అవమానం. అస్పృశ్యత ను మతధర్మంగా మన్నించి, దానికి సంబంధించిన కొత్త జ్ఞాన సంపాదనకు ఉత్తరదేశం వెళ్లి వచ్చిన ఆయన రాగానే ఒక అస్పృశ్యుడు నడిపే బండిలో అతనిని తాకుతూ ప్రయాణం చేయవలసి రావటం ఒక ఐరనీ. ఒక మాలవాడి బండి లో ప్రయాణం చేసి రావటంవల్ల కలిగిన పరాభవానికి వెంకట శాస్త్రి ప్రతీకారం చేయదలచుకొన్నాడు. ఊళ్లోకి వెళ్ళగానే ఇంట్లోకి అయినా అడుగుపెట్టక , చెంచునాయుడిని పిలిపించి అందుకు పురమాయిస్తాడు. తన అక్కరకు తాను బతిమిలాడి అర్ధరూపాయి అదనంగా బాడుగ ఇస్తానని నిద్రపోదామనుకొని చాప పరుచుకొన్న పోలయ్యను లేపి మరీ బండి కట్టించి బయలుదేరదీసిన వెంకటశాస్త్రి బ్రాహ్మడికి బండికట్టిన నేరం అతనిమీద మోపాడు. “నేను చెప్పరానివాణ్ణి సామీ” అని చెప్పుకొనక వర్ణాశ్రమ ధర్మాలు నాశనం చేయటానికి తయారైనాడని నిందించాడు. అతని ఆగ్రహానికి తన మోటారు సర్వీస్ వ్యాపారానికి అడ్డుగా ఉన్న ఒంటెద్దు బండ్ల వాళ్ళమీద చెంచు నాయుడికి వున్న ద్వేషం తోడైంది. శిక్ష ఏమిటో చెప్పమని అతను వెంకటశాస్త్రినే అడిగాడు. నేరారోపకుడు, న్యాయవాది, తీర్పు చెప్పే న్యాయాధికారి అన్నీ ఆయనే ఆయిన వ్యవస్థలో పోలయ్యకు విధించబడ్డ శిక్ష వొళ్ళంతా తెగ్గాల్చటం. ఆ శిక్షకు అంతా సిద్ధం చేయబడుతుండగా పోలయ్య , క్రైస్తవం తీసుకున్న తన మీద జరిగే అత్యాచారాన్ని ఫాదరీ దొరలు చూస్తూ ఊరుకోరని అరిచిచెప్పి తనపేరు పౌలయ్య కానీ పోలయ్య కాదని చెప్పి ఉపాయంతో ఆపద నుండి తప్పుకొన్నాడు పోలయ్య, ఫాదరీలకు సర్కారువారికీ ఉన్న దోస్తీ రీత్యా అతనిని శిక్షిస్తే వచ్చే పరిణామాల గురించి ఆలోచించి , క్రైస్తవుడైతే మనకంత పట్టింపులేదు అని సర్దుబాటు చేసుకొని ప్రభువుల మతం అదే అయినప్పుడు ఆ మతాన్ని నిందిస్తే ప్రభువులను నిందించినట్లే అని సమాధానపడి వెంకటశాస్త్రి , చెంచునాయుడు పోలయ్య కట్లువిప్పి అన్నం పెట్టి బండిబాడుగ కూడా ఇప్పించి పంపించటం ఈ కథకు ముగింపు.

కథ ప్రారంభంలో పంచములు హిందూ మతం వదలి అన్యమతాల్లో కలుస్తామని తీర్మానించుకున్నట్లు వదంతి పుట్టేవరకు పీడవదిలిందని వెంకటశాస్త్రి బ్రహ్మానంద పడ్డాడని చెప్పబడింది. అది వదంతి కాదు. వాస్తవమే. 1936 నాటికి అంబేద్కర్ ఇచ్చిన పిలుపు అది. పంచములు అన్యమతాల్లో కలవటం వల్ల సవర్ణులకు వదిలిన పీడ ఏమిటోగానీ, అందువల్ల పంచములకు మాత్రం వివక్ష అన్న పీడ ఒక మేరకైనా తగ్గింది. దానిని సూచించటం ముగింపులోని విశేషం.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply