నీటిలో నిప్పు

దేశమంతా అబద్ధాల వూబిలో కూరుకుపోయి వున్నప్పుడు వొక సత్యవాక్కు పలకటానికి పిడికెడు ధైర్యం కావాలి. సమాజం   మత మౌఢ్యంతో అంధకారంలో మగ్గిపోతున్నప్పుడు వెలుతురుకి స్వాగత నినాదం పలికే  మెలకువ గంట మోగించటానికి వుక్కు పిడికిలి కావాలి. దేశంలో అసహనం విద్వేషం రాజ్యమేలుతున్నప్పుడు తోటి మనిషిని ప్రేమారా కౌగిలించుకోవటానికి నిండు గుండె కావాలి. మధ్య యుగాల నాటి అమానవీయ ధార్మిక సూత్రాల్ని నెత్తికెత్తుకుని న్యాయ వ్యవస్థ కునారిల్లుతున్నప్పుడు కళ్ళ గంతలు విప్పి రాజ్యాంగ నైతికతని గుర్తుచేసేందుకు బలమైన గొంతు కావాలి. భిన్న స్వరాల్ని అణచివేసి వైవిధ్యాన్ని నాశనం చేసి దేశాన్ని బహిరంగ చెరసాలగా మార్చి అప్రకటిత ఎమర్జెన్సీని రాజ్యం అమలు  చేస్తున్నప్పుడు   అప్రజాస్వామిక రాజకీయాల్ని యెండగట్టడానికి పదునైన వాక్యం కావాలి.  అభిప్రాయాలు కలిగి వుండటమే  నేరమైన కాలంలో మౌనాల్ని ఛేదించే మాటకోసం యెదురు చూస్తుండగా అరణ్యకృష్ణ పంచుకున్న కొంచెం నీరు  నిప్పు దొరికింది. వేలెత్తి చూపడానికి అవకాశమివ్వని తనదైన వాదనా పటిమతో  రచనా  వైఖరితో  తీక్ష్ణ స్వరంతో సమకాలీన సామాజిక సాంస్కృతిక రాజకీయ స్థితి గతులపై చేసిన నిశిత  వ్యాఖ్యానం ‘కొంచెం నిప్పు కొంచెం నీరు’.  

‘వ్యక్తిగత జీవితం అభద్రంగా, సామాజిక జీవితం కల్లోలంగా, భవిష్యత్తు సందిగ్ధంగా పరిణమించిన’ వొకానొక రాజకీయ సందర్భంలో వెలువడుతున్న వ్యాస సంపుటి ‘కొంచెం నిప్పు కొంచెం నీరు’. హక్కుల వుద్యమంలో  పనిచేసిన కార్యకర్తగా  సాహిత్య నిబద్ధత గల  రచయితగా సామాజిక  బాధ్యత నెరిగిన పౌరుడిగా అన్నిటికీ మించి హృదయమున్న మనిషిగా సమాజంతో అరణ్యకృష్ణ  చేసిన సమకాలీన సంభాషణ యిది.  అడవులు సాగర తీరాలు  గనులు పరిశ్రమలు వంటి ప్రాకృతిక – సామాజిక సంపదలతో పాటు  విద్యా వైద్యం రవాణా బీమా బ్యాంకింగ్ వంటి సమస్త సేవారంగాల్ని  ప్రయివేట్ పరం గావించి ధనిక స్వామికి దాస్యం చేసే  పాలకుల అవినీతి పాలనపై యెక్కుపెట్టిన ఆయుధమిది.   జి.ఎన్. సాయిబాబా, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి స్వతంత్ర  మేధావుల్ని  తమ దారి నుంచి తొలగించుకోడానికి  ‘పాలకులు  దుర్మార్గపు   చట్ట ముఖం, చట్ట వ్యతిరేక ముఖం’ రెండూ తామే తొడుక్కుని క్రూర హింసకి పాల్పడినప్పుడు వ్యక్తం చేసిన ఆవేదన యిది.  మతమూ రాజకీయమూ కలిసి వ్యవస్థీకృత   గూండాగిరి చెలాయిస్తూ స్వామి అగ్నివేశ్ లాంటి లిబరల్ డెమొక్రాట్స్ మీద  దాడి చేసినప్పటి రాజ్యాంగ  వ్యవస్థల   వుదాసీన వైఖరిపై విసిరిన నిరసన  యిది.  భీమా కోరెగావ్ కుట్ర కేసులో   వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరారా, వెర్నన్ గొంజాల్వజ్, స్టాన్ స్వామి, రోనా విల్సన్, గౌతం నవ్లాఖ వంటి రచయితలపైన  సామాజిక కార్యకర్తలపైన న్యాయవేత్తలపైన అమలు చేస్తున్న అక్రమ నిర్బంధంపై  వెలిబుచ్చిన ఆగ్రహ ప్రకటన యిది.  

రాజ్యం తాను హామీ ఇచ్చిన శ్రేయో స్వభావానికి విరుద్ధంగా తాను  నిర్మించిన చట్టాలనే తుంగలో తొక్కి పౌర హింసకు పూనుకోవడంపై అరణ్యకృష్ణ యీ వ్యాసాల్లో నిప్పులు చెరిగాడు. రాజకీయ నాయకుల హిపోక్రసీని యెండగట్టడానికి అతను యెక్కడా  జంకలేదు.  గుడ్డి అభిమానుల హారతులందుకొంటున్న  ‘తుప్పు పట్టిన వెండితెర’ల సినిమారంగాన్ని  పురుషాధిపత్యపు  డ్రైనేజీగా పోల్చడానికి వెనుకాడలేదు. తన పురుష నైజాన్ని అధిగమించి  జెండర్ రాజకీయాల్ని యెత్తి చూపడానికి సంకోచించలేదు. చీకట్లో నల్లపిల్లి లాంటి న్యాయాన్ని వెతికిపట్టి ప్రజాకోర్టులో నిలపడానికి నిర్భీతితో పూనుకున్నాడు. వేల ఎకరాల్లో రాజధానుల నిర్మాణం, వందలకోట్లతో ఆలయాల పునరుద్ధరణ, వందల  అడుగుల యెత్తైన విగ్రహాల స్థాపన కొత్త పార్లమెంట్ సెక్రటేరియట్ ల కట్టడం  అభివృద్ధి కాదనీ  మానవ వికాస సూచీ పై అభివృద్ధిని కొలవాలనీ హితవు చెప్పడానికి సంశయించలేదు. ఇరవై నాలుగ్గంటలూ వీక్షకులలో సున్నితత్వాన్ని హరించివేస్తూ,  తీర్పరి  స్థానాన్ని స్వీకరించి బాధితుల్నే నేరస్తులుగా చిత్రీకరించి, ప్రజల మెదళ్ళు అందుకు అనుగుణంగా ట్యూన్ చేసి,  న్యాయ ప్రక్రియపై ప్రభావం చూపి న్యాయాన్ని పక్కదారి పట్టించే ‘మాఫిడియా’ (మాఫియా+మీడియా) దుర్మార్గాన్ని  విప్పిచెప్పడానికి తడబడలేదు. మెజారిటీ మతతత్త్వవాదుల యేకధ్రువ సాంస్కృతిక జాతీయవాదాన్నీ – దాన్ని పాదుగొల్పడానికి  అందుకు వాళ్లనుసరిస్తున్న వున్మత్త హింసా చర్యల్నీ   నిర్ద్వంద్వంగా ఖండించడానికి నీళ్లు నమలలేదు. తాను విశ్వసించిన సత్యాన్ని యెలుగెత్తి చాటడానికి యెన్నడూ   వెరవలేదు.

 అందుకు కారణం రచయితగా అతను బాధితుల పక్షంలో నిలవాలకున్న సాహిత్య –  సామాజిక నిబద్ధతే.     

***

సాహిత్యంలోకి  అరణ్య కృష్ణ రెండో రాకడ  యిది. కానీ యిరవై సంవత్సరాల కాలం యేర్పరచిన  ఖాళీ అతని రచనలో యెక్కడా కనపడదు. అంటే అప్పుడు కూడా అతనేదో సామాజిక ఆచరణలోనో సాహిత్య ప్రయాణంలోనే వుండే వుంటాడు.  లేకుంటే అతని రాతలో యింత వాడి వుండదు. అరణ్య కృష్ణ ఆలోచనల్లో స్పష్టత వుంది. గాఢత  వుంది.  వ్యక్తీకరణలో వైశద్యం వుంది. అవసరానుగుణంగా వొక్కోసారి అది కవితాత్మకంగా వుంటుంది.  అతని సామాజిక చింతన హేతుబద్దంగా ఉంటుంది. అందులో తాత్త్వికత నిండుగా వుంటుంది. అరణ్య కృష్ణ వచనం నిశితంగా  తర్కబద్ధంగా వుంటుంది.  ఒక theoretical approach వుంటుంది. అందుకు అవసరమైన hypothesis ని అతను   స్వయంగా నిర్మిస్తాడు. దాన్ని పూర్వపక్షం చేసి ఖండించి వూరుకోడు. ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిస్తాడు.  మూల్యాంకనం  చేస్తూ   తనదైన సిద్ధాంతాన్ని ప్రకటిస్తాడు. కొండొకచో అందుకు వ్యంగ్యాన్నీ అధిక్షేపాన్నీ ఆశ్రయిస్తాడు. అంతిమంగా తన దృష్టికోణం నుంచి  రాజకీయ ఆచరణని సైతం అతను సూచిస్తాడు. ఇదంతా ప్రజాస్వామిక స్థలంలోనే నిర్వహిస్తాడు. అర్థవంతమైన చర్చకి పురిగొల్పుతాడు. అదే యీ వ్యాసాల బలం.  వ్యాస రచనలో అతను  సాధించిన పరిణతి యిది. సామాజిక చర్చ  కావొచ్చు సాహిత్య విమర్శ కావొచ్చు వ్యాసం కూడా సృజనాత్మక ప్రక్రియే అని  ‘కొంచెం నిప్పు కొంచెం నీరు’ నిరూపిస్తుంది. 

లాయరో జర్నలిస్టో కావాల్సిన అరణ్య కృష్ణ రచయిత అయి మూడు పనులు భుజాన వేసుకున్నట్టున్నాడు. అతని వచనంలోని  వాదనా పటిమ అబ్బురపరుస్తుంది. విషయ ప్రతిపాదనకు కొన్ని సార్లు అతనిలోని లాయర్  devil advocating చేస్తాడు. జర్నలిస్ట్ తానే report చేస్తాడు తానే rejoinder  యిస్తాడు. అది కవితాత్మకంగా వున్నా శుద్ధ వచనంలా వున్నా వ్యాస నిర్మాణంలో అరణ్య చూపే శ్రద్ధ ముచ్చటగొలుపుతుంది. వ్యాసం యెత్తుగడ  ముగింపులతో పాటు వ్యాసాన్నంతటినీ చిక్కగా కలిపి ముడివేసే దారపు అల్లిక వొకటి వుంటుంది. వాక్యానికీ వాక్యానికీ  మధ్య కంటిన్యుటీ చెడని అంతర్గత సంబంధం వొకటి కనిపించని ధారలాగా దాగి  వుంటుంది.  ఆ ప్రవాహ శైలి అతని వచనానికి  వేగాన్నీ పఠనీయతనీ సాధించింది. వ్యాసానికి వుండాల్సిన వచన శిల్ప రహస్యం పట్టుకున్నాడితను. చెప్పదల్చుకున్న సారం నేరుగా యెదిరి బుర్రలోకి బట్వాడా చేసే విద్య అది.  

రాసే విషయం పట్ల వున్న అవగాహన రాతలో సాధికారతకు తోడ్పడుతుంది. రాయడానికి ముందు చేసే అధ్యయనం పరిశోధన అవగాహనలో స్పష్టతకు దోహదం చేస్తాయి. ఆలోచనలో అస్పష్టత వున్నప్పుడు రాతలోకి సైతం అది ప్రసరిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సరైన ప్రాపంచిక దృక్పథమే రచనకి జీవధాతువు. దృక్పథ బలం లేని రచన యేదైనా పేలవం కాక తప్పదు. సత్యావిష్కరణకి  ముక్కుసూటిదనం అవసరం. అది ద్రావిడ ప్రాణాయామం కోరుకోదు. ఈ రహస్యాన్ని అరణ్యకృష్ణ గ్రహించాడు. విషయాన్ని అతను నేరుగా సూటిగా ప్రస్తావిస్తాడు. శాఖా చంక్రమణం చేయడు. నొక్కి చెప్పడానికి అవసరమనుకుంటే పునరుక్తమౌతాడు గానీ వక్రోక్తిని ఆశ్రయించడు. ఉద్వేగ ప్రధానమైన అంశాల్ని వ్యాఖ్యానించవలసినప్పుడు అరణ్యకృష్ణ ఆ వుద్వేగంలో తాను  కొట్టుకుపోకుండా జాగరూకుడై వుంటాడు. అలా అని వుద్వేగాల్ని  చంపుకోడు. వాటిని సంయమనంతో  మూడో వ్యక్తిగా పరిశీలిస్తాడు. బలమైన వుద్వేగం వూపిరాడనివ్వనప్పుడు అనివార్యంగా కవిత్వాన్ని ఆశ్రయిస్తాడు. అప్పుడతను పైకెగసే జలపాతమే. గమనించండి.    

సాధారణంగా విమర్శలో  నిష్పక్షపాతం అన్న పదాన్ని అలవోకగా వాడుతూ వుంటాం. అదొక సుగుణంగా కూడా ప్రస్తుతిస్తాం. నిజానికి బాధితుల పక్షంలో నిలబడని నిపాక్షికత నిందార్హమే. గొంగళి పురుగునీ పువ్వునీ సమంగా ప్రేమించలేం కదా! నిర్దిష్టంగా అభిప్రాయాలు ప్రకటించాల్సిన సందర్భంలో పాటించే తాటస్థ్యం గానీ మౌనం గానీ బలహీనులకు మేలు చేయవు. కీడు చేస్తాయేమో కూడా.  Underprivileged/unprivileged  సమూహాలకి అండగా నిలవని తటస్థ వైఖరి నేరమే. దాన్ని రచయితగా అరణ్యకృష్ణ గ్రహించాడు.  అందుకే అతను తన మాటని బాధితులకు బాసటగా నిలిపాడు. 

***

అరణ్య కృష్ణ అన్నివిధాలా ఆధునిక మానవుడు. రాజ్యాంగంలో పొందుపరచుకున్న   స్వేచ్ఛా సమత్వ లౌకిక భావనల్ని త్రికరణంగా నమ్మినట్లు ‘కొంచెం నిప్పు కొంచెం నీరు’ 

లోని ప్రతి వ్యాసం రుజువు చేస్తుంది. అతని రాతలో వాదనలో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశాలు వుండవు.  ‘దేవతా వస్త్రాల్ని తగలబెడదాం’ వ్యాసం వొక్కటి చాలు రచయితగా సామాజిక చింతనాపరుడిగా రాజకీయ విశ్లేషకుడిగా అరణ్య కృష్ణ యెక్కడ నిలబడ్డాడో తెలియజెప్పడానికి. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తిపై అరణ్య కృష్ణ వేసిన గొడ్డలి వేటు అది. సామాజిక ఆదర్శాల్లేని జాతి నిర్వీర్యమౌతోందనీ మనుషుల స్వార్థ ప్రవృత్తి జాతి భావనకి విఘాతం కలిగిస్తుందనీ ఆ వ్యాసంలో ఖరాఖండిగా పేర్కొన్నాడు.  కాస్టింగ్ కౌచ్, శబరిమలలో స్త్రీల ప్రవేశం, ప్రణయ్ కుల/పరువు  హత్య,  సత్యంబాబుపై బనాయించిన అక్రమ కేసు, మీ టూ నినాదంతో వెలికి వచ్చిన అనేక లైంగిక  అత్యాచారాలు, టూరిజం అభివృద్ధిలో బలయ్యే స్ర్తీల పరిస్థితి,  వాట్సాప్ యూనివర్సిటీల అసత్య వార్తా ప్రచారం, దేశభక్తి పేరున అమలయ్యే ఫాసిజం, ప్రగతిశీల వుద్యమాల్లో క్రియాశీలంగా వుండే మహిళలపై భిన్న మాధ్యమాల్లో ట్రోలింగ్,  చానళ్ల సుందర ముదనష్టం … యిలా సమకాలీనంగా తనను కల్లోలపరచిన ప్రతి అంశాన్నీ వార్తా పత్రిక సంపాదకీయంలోలా  అరణ్యకృష్ణ చర్చకు పెట్టాడు. అన్ని సందర్భాల్లోనూ స్థిరీకృతమైన సాంస్కృతిక విలువల్నీ వాటిని పాటించడంలోని ద్వంద్వ వైఖరినీ దుయ్యబట్టాడు. ప్రతి పదంలోనూ  ప్రాకృతిక న్యాయం కోసం డిమాండ్ చేశాడు. 

తెలుగు సినిమా తెర వెనక బూతుని బహిర్గతం చేస్తూ శ్రీరెడ్డి లేవదీసిన ప్రశ్నలు సమాధానాల్లేకుండా ‘సభ్య’ సమాజాన్ని ఇంకా వెక్కిరిస్తూనే ఉన్నాయి’ అంటాడు అరణ్యకృష్ణ.  శ్రీరెడ్డి అశ్లీల ‘అసాంస్కృతిక’ భాషలో అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వకుండా ముఖం చాటేసిన సినీ ‘పెద్దలు’ యీ రచయిత సంస్కారయుతంగా అడిగేవాటినన్నా పట్టించుకుంటారా ? అనుమానమే.  

‘మన విద్యావ్యవస్థ ఎంతవరకు ఇంగ్లీష్ నేర్పిస్తుందంటే  వినిమయ సంస్కృతి డిమాండ్ చేసేంత వరకే. మన ఇంగ్లీష్ కె.ఎఫ్.సి.లో బర్గర్ ఆర్డర్ ఇచ్చేంత ఉంటే చాలు. అమెజాన్ పోర్టల్లో శాంసంగ్ లేదా ఆపిల్ ఫోన్ బుక్ చేసుకునేంత ఉంటే చాలు.’ అంటాడు మరో వ్యాసంలో. అందులో ఇంగ్లీష్  మోజుని తప్పు పట్టకుండానే మూడో ప్రపంచ దేశాల్లో ఇంగ్లీషుని   గ్లోబల్ భాషగా  ప్రచారం చేసి రుద్దటం వెనక వున్న వ్యాపార రహస్యాన్ని విప్పిచెప్పాడు. అలాగే యింకో సందర్భంలో స్థానిక భాషలపై హిందీ రుద్దే వుత్తరాది ఆధిపత్యాన్ని సైతం ఖండించాడు. భాషా సామ్రాజ్యవాదం గురించి కొత్త చూపుకు దోహదం చేసే ఆలోచనలివి.  పాతుకుపోయిన సాంస్కృతిక విలువలన్నీ పురుష నిర్మితాలే వీటికి బాధితులు అన్నివేళలా స్త్రీలే అన్న స్పృహతో రాసిన వ్యాసాలు యీ  సంపుటిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్నాయి. కవిత్వంలో  స్త్రీవాదిగా  అరణ్యకృష్ణ అవ్యక్తంగా చెప్పకుండా విడిచిన యెన్నో ఆలోచనలు యీ  వ్యాసాల్లోకి పొంగి అలుగులు  పారాయి. 

ఇంటా  బయటా స్త్రీని నియంత్రించే యేకపక్ష సాంస్కృతిక విలువల్ని ఖండించినప్పుడు గానీ స్త్రీ పురుష సంబంధాలే కాదు మొత్తం కుటుంబ సంబంధాలు అమానవీయంగా అప్రజాస్వామికంగా వున్నాయని తెగేసి చెప్పినప్పుడు గానీ ఇంటిని బిగ్ బాస్ రియాల్టీ షోగా హాస్యాన్ని జబర్దస్త్ అశ్లీలంగా మార్చిన చానళ్లని అసహ్యించుకున్నప్పుడు గానీ దిశా అత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ సమయంలో సత్వర న్యాయం పేరుతో జరిగిన విషాద నాటకాన్ని విమర్శకు పెట్టినప్పుడు గానీ ‘సమాజంలో సగ భాగాన్ని అణచి, హింసించే సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర వుంది’ అని తీర్మానించినప్పుడు గానీ మన సినిమా హీరోయిజం పేరుతో హింసని గ్లోరిఫై చేసి ప్రేక్షకుల్ని పాశవికానందంలో ముంచే  సంఘ విద్రోహక శక్తిగా పరిణమించిందని చీదరించుకున్నప్పుడు గానీ నియంత్రణ కొరవైన మెజారిటేరియనిజం ఫాసిజంగా పరిణమిస్తుందని హెచ్చరించినప్పుడు గానీ లైంగిక స్వేచ్ఛని నియంత్రించే  సమాజంలో హింస ప్రబలుతుందని సిద్ధాంతీకరించినప్పుడు గానీ   ఆత్మహత్యలకూ  అసమర్థతలకూ కారణమౌతున్న కార్పొరేట్ – చై.నా. – చదువుల్నీ  వాటికి దళారీలుగా వ్యవహరిస్తోన్న పాలకుల వంచననీ దుయ్యబట్టినప్పుడు గానీ మహిళా సాధికారతకు ఆటంకంగా వున్న వివిధ అంశాల్ని చర్చించినప్పుడు గానీ  మైనారిటీలపై మత విద్వేషాన్నే  దేశభక్తిగా  చెలామణి చేస్తున్న ఫాసిస్టు భావజాలాన్ని తిరస్కరించినప్పుడు గానీ  మాతృత్వాన్ని అత్యున్నత త్యాగానికి పర్యాయ పదంగా ప్రచారం చేసి స్త్రీల వ్యక్తిత్వాన్ని మూసల్లోకి కుదించిన కుహనా విలువల్ని బహిర్గతం చేసినప్పుడు గానీ బూటకపు ఎన్నికల  పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని  పరిహసించినప్పుడు గానీ క్రీడల్లో సాఫల్య వైఫల్యాలకు కులం  ప్రత్యక్షంగా పరోక్షంగా యెలా కారణమౌతుందో రుజువు చేసినప్పుడు గానీ మన వ్యవస్థలో లైంగిక సంబంధాలతో సహా అన్ని మానవ సంబంధాల్లోనూ ప్రజాస్వామికత లోపించిందని నిర్ధారించినప్పుడు గానీ సామాజిక వైఫల్యమే వ్యక్తుల ఆత్మహత్యలకు కారణంగా పేర్కొని మనుషుల్లో మానవత్వం మాయమైపోతున్నందుకు ఆవేదన చెందినప్పుడు గానీ అరణ్యకృష్ణ యెక్కడా యేకపక్ష వాదన చేయలేదు. వితండానికి దిగలేదు. సమస్యల్ని సామాజిక సాంస్కృతిక రాజకీయ  మూలాల్లోకి వెళ్లి పరిశీలించి  సమన్వయ ధోరణిలో పరిష్కారాల్ని ప్రతిపాదించాడు. చాలా సందర్భాల్లో రచయితగా తనవైన అభిప్రాయాలు బలంగా చెప్పినప్పటికీ అంతిమ తీర్పులు యివ్వకుండా పాఠకుల ఆలోచనల్ని ట్రిగ్గర్ చేసి వదిలేశాడు.  

ఆ యా సందర్భాల్లో  అరణ్యకృష్ణ లేవనెత్తిన ప్రశ్నలు అనేక నిశ్చిత నిశ్చయాల్ని ధ్వంసం చేస్తాయి   అతను ప్రశ్న దగ్గర ఆగిపోవడం లేదు. సమాధానాల కోసం అన్వేషిస్తున్నాడు. ధ్వంసం చేసిన చోటే నిర్మాణాలు చేయడానికి అవసరమైన ఆలోచనలకు పునాది వేస్తున్నాడు. యథాతథస్థితిపై  తీవ్ర ఆగ్రహం చూపి వూరుకోక  ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఒక  సామాజిక  బాధ్యతగా  అతను  ప్రతిపాదిస్తున్న తీర్మానాలు కొందరికి  కటువుగా వినిపించవచ్చు గానీ అవి ప్రజాస్వామిక స్వభావం కలిగి వుంటాయని  గమనించగలం. అలాంటి సందర్భాల్లో గొంతులో కాఠిన్యాన్ని సంయమించుకొని మార్దవంగా వుండడానికి ప్రయత్నిస్తాడు. మొఖం తిప్పుకుపోయేవాళ్ళని సైతం వొక సంభాషణకు పురిగొల్పుతాడు. శత్రువునేమో గానీ తటస్థుల్ని ఆలోచింపజేయడానికీ  సెన్సిటైజ్ చేయడానికీ  అతనీ వ్యూహాన్ని పాటిస్తున్నట్టు అనిపిస్తుంది. అందర్నీ మెప్పించడం సాధ్యం కాదనే గ్రహింపు కూడా అవసరమే. 

మన సమాజంలో చోటుచేసుకున్న అనేక ఘటనలపై రాజకీయ వ్యాఖ్యానాలివి. ‘లక్షలాది వేదనామయ బతుకులకి ప్రతినిధి’ గా వెలిబుచ్చుతున్న ఆందోళన యిది. సమాజంలో  మధ్య తరగతి విలువలపై వొక ఆందోళన జీవి విసురుతున్న సవాళ్లివి. అర్ధ సత్యాలు ప్రచారం చేసి ప్రజల్లో విభేదాలు సృష్టించే పాలకుల వంచనాత్మక  కూటనీతిని  ప్రజా కోర్టులో బహిరంగంగా విచారణ చేసే ప్రక్రియ యిది. 

అరణ్య కృష్ణకి సమాజంలోని బహుళత్వం పట్ల భిన్న అస్తిత్వాల పట్ల గౌరవం వుంది. ప్రజాస్వామిక విలువల పట్ల వాటి ఆచరణపట్ల అపారమైన నమ్మకం వుంది.  ఆ కారణంగానే ‘ఒక పౌరుడి మీద మరో పౌరుడి ఆధిపత్యం జాతీయవాదం అవుతుందా లేక దాష్టీక జాతివాదం అవుతుందా? అసలు ఒక వర్గం మీద మరో వర్గం పెత్తనం చేయటం ప్రజాస్వామికం అవుతుందా లేక ఫాసిజం అవుతుందా?’ అని బలంగా ప్రశ్నించగలిగాడు. 

సాధారణంగా కాలిక రచనలు సమయం గడిచే కొద్దీ ప్రాసంగికత కోల్పోతాయి. సంఘటనలపై వ్యాఖ్యని తాత్త్విక స్థాయికి తీసుకెళ్లినప్పుడే నాలుగు కాలాలపాటు నిలబడి వుపయోగపడతాయి. వాటి ఔపయోగికత తీరినప్పుడే సమాజంలో గుణాత్మకమైన మార్పు జరిగినట్టు.  నిజానికి సామాజిక సమస్యలపై రాసే రచయిత తన రచనలు ప్రాసంగికతని కోల్పోవాలనే కోరుకోవాలి. కానీ అలా జరగడం లేదు. రచయితల్నీ పాఠకుల్నీ కల్లోలపరిచే  చేదు వాస్తవం యిది.  దశాబ్దాలు గడిచినా అయేషా లాంటి అత్యాచార – హత్య కేసులు  యెప్పటికీ పరిష్కారం నోచుకోవు. ఏ రాజకీయ వొత్తిడి వల్లనో  సత్యం బాబు లాంటి అమాయకులో అభాగ్యులో నిరంతరం బలవుతూనే  వుంటారు. నిర్భయానో దిశానో ఆసిఫానో .‌.. రోజుకో కొత్త ఘటన సమాజాన్ని కుదుపుతూనే వుంటుంది. వాకపల్లి లాంటి ఘటనలకి అంతూ అడ్డూ అదుపూ వుండవు. మన అస్తవ్యస్త సమాజంలో యిటువంటి రచనల అవసరం యెప్పుడు తీరుతుందో! 

‘ఒక మానవీయమైన నవ సమాజాన్ని నిర్మించడానికి’ అవసరమైన అనేక ప్రతిపాదనలు సూత్రీకరణలు తీర్మానాలు సూచనలు జీవన సత్యాలు ప్రతి అడుగులోనూ యీ వ్యాసాల్లో తారసపడి గల్లా పట్టుకు నిలేస్తాయి. ఆలోచనలకి పురిగొల్పుతాయి. అంతర్ముఖుల్ని చేస్తాయి. ఆత్మవిమర్శకి ప్రేరేపిస్తాయి. గడ్డకట్టిన  మౌనాల్ని బద్దలుకొడతాయి. మచ్చుకి కొన్ని: 

  • అందరూ గోవుల గోపన్నలే. కానీ దూడకి న్యాయంగా మిగలాల్సిన పాలని పొదుగు కోసి తాగే దొంగలే!
  • దేహాల్ని అద్దెకి తీసుకునేవాడెప్పుడూ బాధితుడు కాలేడు.
  • సినిమాల్లో హీరోలందరూ నిజ జీవితంలో ఐతే జీరో అన్నా అయివుండాలి లేదా విలన్లన్నా అయివుండాలి 
  • రాజకీయం అంటే దొంగ పోరాటాలు, దొంగ ఏడుపులు, దొంగ నాటకాలు, దొంగ ప్రేమలు రంగరించిన ఓ గజదొంగాత్మక కళ!
  • మన కుటుంబ వ్యవస్థలోని జడత్వాన్నే మనం పటిష్ఠతగా భావించి మురిసిపోతుంటాం. ఏ మాత్రం సడలింపు లేకుండా వ్యవహరించటాన్ని సాంస్కృతిక విలువగా భావించి చప్పట్లు కొట్టుకుంటాం. 
  • నిజమైన రాజకీయ తాత్వికతకి స్థానం లేని ప్రజాస్వామ్యం కదా మనది.
  • మనిళ్ళల్లోని వాతావరణంలో ఎంత మొరటుతనం వుందో, మనం మానసికంగా ఎంత నెత్తురు తాగుతామో, ఎంత నెత్తురోడుతామో పట్టించుకోం
  • భారీ కంచు విగ్రహాలు, సెజ్ లు, బుల్లెట్ ట్రైన్లు, స్మార్ట్ సిటీలు అభివృద్ధికి గీటురాళ్ళుగా వున్నంత కాలం ఈ దేశంలో సామాన్యులు సంచరించే రహదార్లు నల్ల తాచుల్లా భయపెడుతూనే వుంటాయి.
  • ఇల్లంటే మౌలికంగా జననం నుండి మరణం వరకు కలసి సాగే అనివార్య సామాజిక, తాత్విక నిర్మాణం. ఇల్లంటే కొంతమంది వ్యక్తుల జీవితకాలాల సామూహిక భావోద్వేగ ప్రయాణం.
  • చానెళ్లకి దూరంగా వుందాం.  అది మన కళ్లకే కాదు, గుండెలకి కూడా మంచిది.
  •  నిజమైన ప్రేమ వున్న చోట ఆధిపత్యానికి, హింసకి తావు లేదు. ఒకరి పట్ల ప్రేమంటే ఆ వ్యక్తి ఆత్మగౌరవాన్ని కలిగివుండే హక్కుని గౌరవించటం. ప్రేమంటే ఒక ప్రజాస్వామిక ప్రవర్తన.
  • మనం చెప్పుకునే ఆదర్శాలేవీ కూడా ఆచరణకి సంబంధించినవి కావు.  చేతులకి మట్టి అంటించని ఆదర్శాలే మనవి. 
  • ప్రజల్ని సంఘటిత పరిచి ఒక దిశానిర్దేశం చేయగల సానుకూల సామాజిక మార్పుల్ని తీసుకురాగల ఉద్యమ నాయకత్వం లేనప్పుడు  మూక మనస్తత్వం ప్రబలుతుంది
  • ప్రతి కుల హత్య వెనుక పరువు వుంటుంది. ప్రతి పరువు వెనుక జెండర్ రాజకీయాలు, ఆస్తి రాజకీయాలు వుంటాయి.
  • ఈ దేశంలో రోడ్ల మీద డ్రెయినేజి గుంతల నుండే కాదు, పురుషాధిక్యపు అశ్లీల మెదళ్ళ నుండి కూడా దుర్వాసనల మురుగు బైటికొస్తుంది.
  • సామాజిక సంబంధాల్లోని పితృస్వామ్యానికి సంబంధించిన ఆధిపత్య విలువలు ముందుగా కుటుంబంలోనే అధికంగా పొడసూపుతాయి.
  •  రాజ్యం దృష్టిలో నిర్భయంగా రాసే కలం మారణాయుధమే. హక్కుల గురించి మాట్లాడే నాలికలన్నీ రాజద్రోహులే.
  • ఇప్పుడు బతుకంతా ప్రయివేటు రంగం కౌగిట్లోకి చేరిపోయింది. మన పబ్లిక్ లైఫ్ మొత్తం ప్రైవేటుపరం అయిపోయింది. మన చేత పన్నులు కట్టించుకునే ప్రభుత్వం కనబడాల్సిన చోట, నేనున్నానని భరోస ఇవ్వాల్సిన చోట ప్రైవేటు రంగం పళ్ళికిలిస్తూ సాక్షాత్కరిస్తున్నది. 
  • మతం ఒక్కటే జాతిని నిర్ధారించదని, ఒకే మతాన్ని ఒకటి కంటే ఎక్కువ జాతులు అవలంబించవచ్చని, ఒకే జాతి ఒకటి కంటే ఎక్కువ మతాల్ని అనుసరించవచ్చని, భాషల్ని పలకొచ్చని తెలియని స్వాతిముత్యాలం.
  • మత సంస్కరణ ఒక్కటే కులాన్ని నిర్మూలించలేదు. కుల రహిత సమాజానికి సంస్కరణ ఒక్కటే సరిపోదు. అంతకు మించిన సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ దృక్పథముండాలి.

ఇలా చెప్పుకుంటూ పొతే యీ పుస్తకాన్నంతటినీ యిక్కడ quote చేసే ప్రమాదం వుంది. ఆ అసంగతాన్ని యిక్కడితో విరమిస్తా. 

***

2018 ఏప్రిల్ నుంచి 2022 మార్చి  వరకు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సారంగ వెబ్ మ్యాగజైన్ లో కాలమ్ గా వచ్చిన వ్యాసాలనూ, సామాజిక మాధ్యమంలో అప్పుడప్పుడూ వెలిబుచ్చిన అభిప్రాయాలనుంచి యెంపిక చేసిన రాతలనూ వొకచోట కూర్చిన సంకలనం ‘కొంచెం నిప్పు కొంచెం నీరు’.   ఈ కూర్పులో నా చేతివాటం యేం లేదు; మార్పులు చేర్పుల విషయమై  ‘మాటసాయం’ తప్ప. అది కూడా వొక ప్రజాస్వామిక స్థలంలో జరిగిన అభిప్రాయ  వినిమయమే. ఈ వ్యాసాల్లో చుట్టూ చోటుచేసుకుంటున్న అపసవ్యతల పట్ల అసమంజసతల పట్ల అన్యాయాల పట్ల యేకకాలంలో వ్యక్తం చేస్తున్న  దు:ఖం వుంది – క్రోధం వుంది.  ‘కొంచెం నీరు కొంచెం నిప్పు’ అనడంలోనే అది సూచ్యం. కవిగా రచయితగా అరణ్య కృష్ణ వెలిబుచ్చుతున్న సాంద్రమైన భావాల పట్ల నాకు సారూప్యత వుంది. అదే నన్నీ రచనలను  హత్తుకునేలా చేసింది.  

సత్యం నీటిలో దాగి వున్న నిప్పులాంటిది. జ్వలించే/దహించే నిప్పులాంటి నిజాల్ని అరచేతిలో యెత్తిపట్టి చూపుతున్నందుకు మిత్రుడు అరణ్య కృష్ణకి అభినందనలు. సంపాదకుడు రచయితని అందజేస్తాడు. మదింపు వేయడు. ఆ పని పాఠకులదే.  రచయితకీ మీకూ మధ్య సంభాషణలో   మూడో వ్యక్తిగా  నా యీ  మాటలు అధిక ప్రసంగం కాకుండా యిక్కడితో ముగిస్తాను. 

సెలవ్. 

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply