నిర్బంధం నీడలోకి…

వెలుతురు సోకని దండకారణ్యంలో
నిప్పురవ్వలు రాజుకుంటున్నాయి
పచ్చటి ఆకుల గొడుగు కింద
సనసన్నటి వెలుతురు ముక్కలు పరుచుకుంటున్నాయి
రక్తం రుచి మరిగిన పులి
తోటి జంతువుల పాదముద్రలను
జన్యు పరీక్ష చేస్తున్నాయి

చీమ చిటుక్కుమన్నా
అప్రమత్తమయ్యే శిబిరం
ఇనుపబూట్ల కదలికలకు
పరపరమంటున్న ఎండుటాకుల శబ్దం అందక
ఆలోచనలు అంతర్మధనం చేసి చేసి అలసిపోయాయి

వసంతం వెంటతెచ్చుకున్న వేసవి
పసరు ఆకుల గుబురు పొదల
రహస్య స్థావరాల జాడకోసం
డేగ కన్నుల తుపాకీ అన్వేషణ
దూరంగా
మౌనంగా ప్రవహిస్తున్న గోదారి
ఒక్కసారిగా వెల్లువెత్తి
బుల్లెట్ల శబ్దాన్ని వినిపించింది
కమ్మటి వాసన మోసుకొస్తున్న
అడవిపూల గాలి అదిరిపడింది

రక్తం చిమ్ముతూ శవాలైన అన్నలపై
కన్నీటి పూలు రాలుస్తూ
చెట్లు భోరున ఏడుస్తున్నాయి
పేగు తెగిన అల విసురుగా వచ్చి
శవాల ముందు మోకరిల్లింది
కన్న కల చెదిరి
విరిగిన కొమ్మపై వ్రేలాడుతోంది
ముక్కలైన ఆశయం
పగిలిన అద్దం పెంకులపై వాలి
రక్తం చుక్కల ప్రతిబింబాలను ప్రశ్నిస్తోంది

పోరాటం అలికిన
అమరుల ఆత్మ ముందు
సాకిలాపడిన అడవి
నిర్బంధం నీడలోకి జారుకుంటోంది…

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో పనిచేసి రిటైర్ అయ్యారు. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్. 360 డిగ్రీస్‘ పేరుతో వ్యాస సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల వారీగా సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్ర రాస్తున్నారు.

Leave a Reply