నిజం

ఊరు గుర్తుకు వచ్చినప్పుడంతా స్నేహే గుర్తుకు వస్తుంది. మనసును ఎవరో పిండేస్తున్నట్టు ఊపిరాడదు కొద్దిసేపు. స్నేహ… నా ప్రాణ స్నేహితురాలు. తన పేరులాగే.. తన స్నేహం కూడా ఎంతో స్వచ్ఛమైనది. స్నేహ అంటే నాకే కాదు ఊరిలో అందరికీ కూడా ఎంతో ప్రేమ, అభిమానం. అందరి నోట్లో నాలుకలా ఉండేది. సున్నితమైన మనసుతో పాటు ఆత్మాభిమానమూ ఎక్కువే.

వాళ్ళ ఇంట్లో ఒక్కగానొక్క కూతురు స్నేహ. ఒకే కూతురవటంతో.. ఒక్క క్షణం కూడా తనను వదలి ఉండలేనంత ప్రేమ. అందుకే ఉండూరులోనే స్నేహకు వరసైన అబ్బాయికి ఘనంగా కట్నకానుకలు ఇచ్చి పెళ్ళి చేశారు. కూతురుకు ఏలోటు రాకూడదని. ఊరిలో అందరూ చూడ చక్కని జంటని సంబరంగా ఆశీస్సులు అందించారు. అందరి చేతుల మీదుగా.. ఎంతో సందడిగా, సంబరంగా జరిపోయిందా పెళ్ళి. నాకు మాత్రం దిగులు మొదలైంది.. స్నేహకు పెళ్ళైపోయిందిగా…!

అత్త గారింటికి వెళ్ళి పోతుంది. ముందులా ఇద్దరం కలుసుకోవడం కుదరదు. అక్కడ ఎన్నో పనులు తనకు. ఎన్నో బాధ్యతలు. అలాగే ఎన్ని ఆంక్షలు, హద్దులు ఉంటాయో…!

ఇకనుంచి తనను బయటికి రానిస్తారా?

నేను అనుకున్నట్లుగానే స్నేహను చూడడానికి వీలయ్యేది కాదు. ఎప్పుడైనా అమ్మగారింటికి వచ్చినప్పుడు మాత్రమే ఇద్దరం కలిసి మాట్లాడుకోను వీలయ్యేది.

ఆ తర్వాత కొద్ది రోజులకు నాకూ ఒక సంబంధం రావటం, వాళ్ళకు నేను నచ్చటం, ఆ వెంటనే పెళ్ళి- నేను అత్తగారింటికి వెళ్ళిపోవడం.. అంతా ఒక కలలా జరిగిపోయింది.

స్నేహకు నాకు ఇంకా చాలా దూరమే పెరిగింది. అప్పుడప్పుడు ఏదైనా శుభ సందర్భాన మాత్రమే ఊరికి వెళ్ళివస్తున్నాను. దసరా పండుగ మా ఊరిలో చాలా బాగా జరుగుతుంది. అందుకే పండుగకు ఊరు వెళ్ళాను. నవరాత్రులవటం వల్ల గుడికి వెళ్ళాను.

ఒక సాయంత్రం స్నేహను రమ్మంటే వచ్చింది. గుడికి ఆరోజు. దేవుడి దర్శనం తరువాత ఇద్దరం గుడి ప్రాంగణంలో ఒక చెట్టు కింద కూర్చున్నాము.

అప్పుడు స్నేహను అడిగాను.. “ఏంటే విషయాలు?” అని.

“ఏముంటాయే.. మామూలే” అంది నీరసంగా.

“ఎన్నో సార్లు నీతో చెబుదామంటే సమయం దొరకక వీలుకాలేదు…” అంటూ తన బాధను చెప్పడం మొదలు పెట్టింది.

“మా అత్తగారింటి వాళ్ళకు మనుషుల కన్నా డబ్బులే ముఖ్యం. ఎంత కట్నకానుకలు ఇచ్చినా, ఇంట్లో ఎంత చాకిరీ చేసినా, పూట పూటకు వాళ్ళకు ఏమీ తక్కువ కాకుండా వండి పెడుతున్నా… వాళ్ళే ఏదో అప్పనంగా తిండిపెడుతున్నట్టు. నేను ఖాళీగా తిని కూర్చుంటున్నట్టు బాధ వాళ్ళకు. ఆ మాటలు వినాలంటేనే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది.. అదే కాక వాళ్ళు అడిగినప్పుడంతా.. అమ్మ, నాన్నను అడిగి డబ్బులు తెచ్చి ఇవ్వాలి. ఇలా ఎన్ని రోజులని ఎంతని తెచ్చివ్వగలను? వాళ్ళు మాత్రం ఎంతని ఇవ్వగలరు? అక్కడేమీ డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఈమధ్య పంటలు కూడా సరిగా పండక నాన్నే నష్టం లో ఉన్నారు. అది తెలిసి కూడా మాటి మాటకి నాన్న ముందుకు చెయ్యి చాపి ఎలా అడగగలను? ఎంత ఆత్మాభిమానంతో పెరిగాము! ఏ రోజూ అమ్మ, నాన్నను నాకు ఇది కావాలి అని అడగిందీలేదు. వాళ్ళు కూడా నాకు ఏలోటూ చేయలేదు. ఇప్పుడు అదేపనిగా అడగాలంటే ఎంత నామోషీగా ఉంటుంది. మనసును చంపుకుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి…? నాకైతే విరక్తిగా వుంది జీవితమంటే. అదే అడిగితే ఇంట్లో చెయ్యి లేస్తుంది, నోరు లేస్తుంది. అందరూ ఒకటై విరుచుకు పడతారు. ఒక్కోసారి ఇదంతా భరిస్తూ బ్రతకడం అవసరమా అనిపిస్తుంది” అంది.

ఆ మాట వినగానే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. దుఃఖం ముంచుకు వచ్చింది.

నేను ఏడిస్తే తనూ ఇంకా శక్తిహీనురాలవుతుందని బిగపట్టుకొని, ముందు తనను ఓదార్చడానికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. ఇంచు మించు నా జీవితమూ అలాగే ఉంది. చదువు మధ్యలోనే పెళ్ళి చేసి పంపించేశారు. ఇద్దరం రెక్కలు కత్తిరించిన పక్షులమేగా…!

నాకూ తనను ఓదార్చే శక్తి చాలట్లేదు. మాట పెగలటం లేదు. అక్కడికీ ఎలాగో “చీ… పిచ్చిదాన ఎందుకు అంత అధైర్యపడతావు? ఏదో ఒకరోజు వాళ్ళలోనూ మార్పు వస్తుందిలే. భగవంతునిపై భారం వెయ్యి. జీవితంలో కష్టం వస్తే చావేనా మార్గం ? వాటిని ఎదురుకునే శక్తి, యుక్తి ఉండాలి. లేదంటే మరీ ఆ మూర్ఖులతో ఏగను చేతకాని రోజు.. భరించలేని రోజు…ఆ రొంపిలో బ్రతకవలసిన అవసరమే లేదు. ఎలాగు ప్రాణం పెట్టే అమ్మా నాన్నా ఉన్నారుగా…! వాళ్ళతో జీవించు.. వాళ్ళ కోసం” అన్నా.

అందుకు స్నేహ… “ఏమో నాకయితే వాళ్ళలో మార్పు వస్తుందనే ఆశ, నమ్మకం సడలిపోయింది” అంది.

తనను అంత దీనంగా చూడటం చాలా కష్టంగా అనిపించింది. అంతకంటే ఏమి చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం.

“చాలా టైమ్ అయ్యింది… బయలుదేరదామా…? మళ్ళీ ఇంట్లో ఏ సమస్యను లేవనెత్తుతారో.. అదంతా భరించను నావల్ల కాదు…” అంటూ లేచింది స్నేహ.

నేను పరధ్యానంగా.. ఊ.. ఊ.. అంటూ లేచి ఎవరింటికి వాళ్ళం వచ్చేశాము. గుండెలో మోయలేనంత దుఃఖాన్ని మోసుకుంటూ…

ఇంటికి వచ్చాననే కానీ, స్నేహ మాటలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకు స్త్రీలకే ఇలాంటి కష్టాలు! ఎన్నో ఆలోచనలతో ఆరాత్రంతా నిద్ర పట్టలేదు. ఎంతో సేపు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోయాను.

“అమ్మ… లేమ్మా, చాలా పొద్దెక్కింది మొఖం కడిగి స్నానం చేసి టిఫిన్ తిందువుగాని…” అంటుంటే..

కళ్ళు నులుముకుని గడియారం వంక చూశాను. ఎనిమిది పైనే అయ్యింది. అయ్యో… ఎప్పుడూ లేనిది ఈరోజు ఇలా నిదురపోయానేంటి…?

అమ్మ కూడా ఏమీ అనకుండా ఇంత సేపూ పడుకోనిచ్చింది.

ఎప్పుడైనా కొంచెం లేటుగా లేస్తేనే “ఆడపిల్ల ఇంత సేపు పడుకుంటె ఎలా…! ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారు అని.. రేపు ఒకరింటికి పంపినప్పుడు మేమే కదా మాట పడాలి…” అంటూ మందలించేది..

అమ్మాయంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో చెప్పే అమ్మ ఇప్పుడు అలా ఏమీ చెప్పట్లేదు. అంతే కాదు, అన్నీ దగ్గరకే అందిస్తోంది. అంటే ఇప్పుడు నేను పుట్టింటికి వచ్చిన చుట్టాన్నేమో…! లేక రెండు రోజులు ఉండి వెళ్ళే బిడ్డను సంతోషంగా చూసుకోవాలనో…!

హమ్మ్… ఏంటో ఇలాంటి ఆలోచనలు. అనవసరంగా బూతద్దంలో చూస్తున్నాను… అనుకొని లేచి మొఖం కడుక్కొని వచ్చాను.

అంతలో అమ్మ కాఫీ ఇస్తే తాగి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ “అమ్మా ఏం టిఫిన్ చేశావు?” అంటుండగానే..

జొన్నరొట్టె , వంకాయ కూర పెట్టుకుని వచ్చింది అమ్మ ప్లేట్లో. అది చూడగానే ఆహా అనిపించింది ప్రాణానికి.

“అమ్మా నీ చేతే రొట్టెను ముక్కలు చేసి కూరను కలిపి ఇవ్వమ్మా. ఎన్ని రోజులైందో అలా తిని” అంటే..

పాపం అమ్మ అలాగే కలిపి తెచ్చి ఇచ్చింది.

టీవీ ముందు హాల్ లో దివాన్ పై కూర్చొన్న నాకు..

టీవీలో ఏదీ నచ్చక ఊరికే చానల్స్ మారుస్తూ తింటున్నాను. కానీ నా ఆలోచనలన్నీ స్నేహ చుట్టూనే తిరుగుతున్నాయి. తినడం అయిపోయాక ప్లేట్ ను సింక్ లో పెట్టేసి వచ్చి టీవీ చూస్తుంటే మళ్ళీ స్నేహ గురించే ఆలోనలు కందరీగల్లా ముసురుకుంటున్నాయి.

“అమ్మేమో వంట గదిలో ఒకతే.. మధ్యాహ్నంకు వంట చేస్తోంది. నన్నేమీ సాయం అడగడంలేదు ఈమధ్య. పెళ్ళి కాకముందు అయితే “అది అందివ్వు, ఇది అందివ్వు, ఆ కూరలు తరిగివ్వు” అంటూ చెప్పేది. ఇప్పుడు అలాంటి పనుల్లోకి నన్ను పిలవటం లేదు. ఆలోచనల నుండి తప్పించుకోను బలవంతంగా కళ్ళు మూసుకున్నాను.

రాత్రంతా నిదుర లేనందుకేమో నాకు తెలీకుండానే నిద్ర పట్టేసింది. బయటి నుండి ఇంట్లో పని చేసే మద్దులు గొంతు కంగారు, కంగారుగా.. ‘అమ్మా.. అమ్మా…’ అంటూ పిలుస్తోంది.

నేను ఉలిక్కిపడి లేచి ‘ఏంటి మద్దులు! ఏమైంది?’ అంటూ అడిగా. అంతే కంగారుగా.

“అయ్యో అమ్మా… స్నేహమ్మ ఎంత పిచ్చి పని చేసిందో తెలుసా…?”

“అబ్బా.. ముందు నువ్వు చెబితే కదా మద్దులు తెలిసేది…! నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది అన్నా కాస్త కసురుకున్నట్టుగా.

ఏడుస్తూ ఏడుస్తూనే, ముక్కు చీదుకుంటూ చెప్పింది మద్దులు.

“స్నేహమ్మ చనిపోయిందమ్మా. కిరోసిన్ పోసుకొని అంటించుకుందంటా…”

ఆ మాట వినగానే నాకు కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా.. కంపించిపోయాను. ఒక్క పరుగులో స్నేహ అత్తవారింటికి పరిగెత్తాను. గుమ్మం ముందుకు వెళ్ళగానే… ఎదురుగా వంట గది గోడకు ఆనుకొని కూర్చొని వున్న స్నేహ శవం. నల్లగా మాడిన మసి బొమ్మలా.

ఆ దృశ్యాన్ని చూడగానే.. నాకు వెన్నులో నుండి జలదరింపు. భయం. విపరీతమైన దుఃఖం ముంచుకు వచ్చాయి.

స్నేహను ఇలాంటి స్థితి లో చూసి నా మనసు కూడా మంటల్లో కాలుతున్నట్టు విలవిలలాడాను. ఒకే ఆత్మతో రెండు పక్షుల్లా బతికాము. ఇప్పుడు ఒకపక్షి పూర్తిగా మంటల్లో కాలి బూడిదై పోయింది. ఇంకోపక్షి బ్రతికివున్నా ఏమీ చేయలేని నిస్సహాయతలో… బూడిదైన పక్షిని చూడలేక అమ్మ చెంతకు చేరింది..

పుట్టెడు దుఃఖంతో ఇంటికి చేరిన నేను అమ్మను పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను.

“అమ్మా… స్నేహ ఇలా నాకు శాశ్వతంగా దూరమవుతుంది అనుకోలేదు…”

“పిచ్చిదాని జీవితం బూడిదై పోయింది… ఎంత అన్యాయమో కదూ…!”

“అప్పుడే, నూరేళ్ళు నిండిపోయాయి”..

“అమ్మా, అక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటున్నారు”..

స్నేహ, తనకు తానుగా చనిపోలేదని..

తనే కాల్చుకొని ఉంటే ఆ మంటల వేడికి తట్టుకోలేక అటూ ఇటూ పరిగెత్తిండాలి..

అలాంటి ఆనవాళ్లు ఏవీ లేవు.

తను కూర్చున్న చోట మాత్రమే మసి మరకలు ఉండటం వల్ల కొందరి అనుమానం, చంపేసి కాల్చారేమోనని.

ఇంకొందరు కాల్చుకోగానే.. మంటల వేడిని భరించలేక.. ఒక్కసారిగా గుండె పగిలి చనిపోయి ఉంటుందని.

పోలీసులు వచ్చారు విచారణకై. అక్కడ ఉన్న వారిలో ఎవరు నోరు మెదపలేదు. ఇక స్నేహ పుట్టింటి వాళ్ళు ఏమైనా చెబుతారేమో అంటే స్నేహ అమ్మ కూతురుని అలా చూసి తట్టుకోలేక సృహతప్పి పడిపోయారు. స్నేహ నాన్న అస్సలు ఆ పరిసరాలకే రాలేదు. నా బంగారు తల్లిని ఆ స్థితిలో చూడలేనంటూ…

అత్తగారింటి వాళ్ళు మాత్రం “మేము ఎవరము ఇంట్లో లేము. తను వంట చేస్తున్నప్పుడు పరధ్యానంగా ఉండి కొంగు అంటుకొని ఇంత ప్రమాదం జరిగిందని” చెప్పారు..

వాళ్ళు అదే రాసుకొని వెళ్ళిపోయారు.

‘అమ్మా… నాకు ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కావట్లేదు. నిన్న గుడికి వెళ్ళినప్పుడు స్నేహ అత్తగారింటి బాధలు చాలా చెప్పుకొని ఏడ్చింది. నాకు వినటానికే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా! ఇక అదంతా భరిస్తున్న స్నేహ ఒక అగ్ని గుండమే అనిపించింది. నేను ఊరెళ్ళే లోపల.. మీతోనూ, స్నేహ అమ్మా, నాన్నా తోనూ మాట్లాడి, తనను ఆ కష్టాల వలయం నుండి బయటికి తీసుకురావాలనుకున్నా. పిరికిది. తనకు తానుగా ధైర్యం చేయలేదని రాత్రంతా చాలా ఆలోచించాను. తన ఆలోచనలతో రాత్రంతా నిద్ర కూడా పోలేదు. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది’ అన్నా

అమ్మ కూడా స్నేహ చావుకు ఎంతో బాధపడుతూ..

“కళ్ళ ముందు తిరిగిన పిల్ల ఇలా అర్థాంతరంగా పక్షిలా రాలిపోతుంది అనుకోలేదు. అన్యం పుణ్యం ఆ భగవంతునికే ఎరుక. నిందలేనిదే బొందె పోదంటారుగా! స్నేహకు ఈ భూమి మీద ఇంతే రాసిపెట్టి ఉందేమో” అంది.

‘అమ్మా… స్నేహ చనిపోవడాన్ని నా మనసు అస్సలు తట్టుకోలేకుంది. ఇక నుండి తన అందమైన రూపం బదులు తనను చివరిసారిగా చూసిన ఆ ఘోరమైన రూపమే గుర్తుకు వస్తుంది.. కదా’ అంటూ గట్టిగా ఏడ్చేశాను.

అక్కడ ఉన్నన్ని రోజులు నాకు ఏమీ తినాలనిపించలేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ఊరంతా కూడా విషాదం అలుముకుంది.

ఎక్కడ చూసినా నిశ్శబ్దం.

మౌనం.

స్నేహ చావు చూసి దసరా పండుగ కూడా ఎటో వెళ్ళిపోయింది. నాకు ఒకటే స్నేహ ఆలోచనలే ఊపిరాడనివ్వకుండా. అస్సలు స్నేహ ఎలా చనిపోయింది? తనే ఇంతటి నిర్ణయం తీసుకుందా? లేక అందరూ అనుకుంటున్నట్టుగానే అత్తగారింటి వాళ్ళే దాని బంగారు జీవితాన్ని బూడిద చేశారా? అస్సలు గుడి నుండి ఇంటికి వెళ్ళాక ఏమి జరిగింది వాళ్ళు ఏమైనా గొడవ పెట్టుకున్నారా? తను కూడా కోపంతో వాళ్ళతో వాదన పెంచు కుందా?

మొత్తానికైతే ఆ రాత్రి ఏదో జరిగింది.

అందుకే మరు రోజే స్నేహ శవమైంది. పిచ్చిది అంత బాధ పడుతూ అక్కడే ఎందుకు ఉంది?అమ్మా, నాన్నా దగ్గరకు వచ్చేసి ఉండొచ్చుగా…!

ఈ రోజు వాళ్ళకు ఈ గుండె కోత ఉండేది కాదు కదా. స్నేహా… నీ పిరికితనమే నీ చావుకు కారణమైందేమో? ఆడపిల్ల అంటే అబలలా జీవించడమేనా? మనలోనూ దేన్నైనా ఎదురుకునే శక్తి ఉండాలి కదా!. అస్సలు ప్రాణాన్ని మనసును చంపుకుంటూ ఆ ఊబిలోనే బ్రతకవలసిన అవసరం ఏమొచ్చింది?

ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు అక్కడ ఉండవలసిన అవసరమూ లేదు. ఎంతో నువ్వు ఆలోచించి జాగ్రత్త పడవలసింది. నిన్ను అక్కడ ఒక మనిషిలా చూడలేనప్పుడే నువ్వు ధైర్యం చేయవలసింది. అమ్మా, నాన్నకు ఆసరాగా నిలవవలసింది. ఇప్పుడు చూడు… వాళ్ళు కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎంత ఆశపెట్టుకొని ఉంటారు! అల్లుడు, కూతురు చివరిదశలో అండగా ఉంటారని. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం జీవించాలి? వాళ్ళను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.

స్నేహా… నీలాంటి కష్టాలు ఏ ఆడపిల్లకు రాకూడదు. ఏ ఆడపిల్ల జీవితంలోనే కాదు. నా జీవితంలో కూడా రానివ్వను. అనుకుంటూ… అలా రాకూడదు అంటే నేను ముందు మేల్కోవాలి… ప్రతి క్షణాన్ని నా కోసమే ఉపయోగించుకోవాలి. ఇంకొకరిపై ఆధారపడటం కాకుండా స్వశక్తితో బ్రతకాలి. అవును. ముందు నాకోసం నేను స్వతంత్రంగా బతకగలను అనే ధైర్యం కావాలి.. అని నాకు, నేను ఎంతో ధైర్యం చెప్పుకుంటూ.. ఆ తర్వాత నేను తిరిగి అత్తవారింటికి వచ్చేశాను.

ఊరి నుండి వచ్చాననే కానీ.. గుబులు గుబులుగా మనసంతా అల్లకల్లోలం. విలవిలలాడుతున్న మనసు. తుఫానులో చిక్కుకున్న పక్షిలా.

నా మనసు ప్రతి క్షణం హెచ్చరిస్తోంది. చదువు లేక పోయినంత మాత్రం చేత ఇక్కడే ఆగిపోవాలా జీవితం. స్వశక్తితో బ్రతకడానికి ఎన్నో చేతి వృత్తులున్నాయి. వాటినే ఆసరా చేసుకొని ఆత్మాభిమానంతో ఎంతో మంది బ్రతుకుతున్నవాళ్ళు ఉన్నారు.

అవును. ఎవరి ముందుకు చెయ్యి చాపే పరిస్థితి తెచ్చుకోకూడదు. వీలైనంతవరకు ఇంకొకరికి సాయం చేసే స్థాయికి ఎదగాలి.. అన్న బలమైన ఆలోచనలతో నన్ను నేను మార్చుకోవడం మొదలు పెట్టాను. నాకు వచ్చిన విద్యలు.. పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ నే మరింత మెరుగుపరచుకొని దానినే నా జీవితానికి ఉపాధిగా చేసుకున్నాను. అందులోనే ఎంతో మంది ఆడపిల్లకు శిక్షణనిస్తూ వాళ్ళ వాళ్ళ జీవితాలకు కూడా ఆసరా అవుతుంటే నాలో ఆత్మ విశ్వాసం పెరగటమే కాక నాకు ఎంతో ఊరట ఇచ్చింది. నిజం.

నివాస ప్రాంతం కర్నూలు. కవయిత్రి, కథా రచయిత. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు ప్రచురితమయ్యాయి. రచనలు: 'రెప్పచాటు రాగం'(మొదటి కవితా సంపుటి).

12 thoughts on “నిజం

  1. బాగుంది మా.. స్త్రీ సాధికారత స్వావలంబన దిశగా ఎలా అడుగులు వేయాలో తెల్పిన కథ.. బాగుంది పోసిటివ్ అప్రోచ్👍👍👌👌💐💐

  2. మంచి కథ. మహిళా సాధికారత అవసరం. బేలగా ఉండిపోవాల్సిన అవసరం లేదని చెప్పిన కథ

  3. వాస్తవంగా కళ్ళు ముందు కదలాడింది… చాలా బాగా కథను నడిపించావు..అభినందనలు

  4. చాలా బాగారాశారు స్నేహ జీవితం. చివరలో ముగింపు చాలా బాగుంది. “అవును. ఎవరి ముందుకు చెయ్యి చాపే పరిస్థితి తెచ్చుకోకూడదు. వీలైనంతవరకు ఇంకొకరికి సాయం చేసే స్థాయికి ఎదగాలి.. అన్న బలమైన ఆలోచనలతో నన్ను నేను మార్చుకోవడం మొదలు పెట్టాను. నాకు వచ్చిన విద్యలు.. పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ నే మరింత మెరుగుపరచుకొని దానినే నా జీవితానికి ఉపాధిగా చేసుకున్నాను. అందులోనే ఎంతో మంది ఆడపిల్లకు శిక్షణనిస్తూ వాళ్ళ వాళ్ళ జీవితాలకు కూడా ఆసరా అవుతుంటే నాలో ఆత్మ విశ్వాసం పెరగటమే కాక నాకు ఎంతో ఊరట ఇచ్చింది. నిజం” సరి అయిన నిర్ణయం

  5. దాదాపు ఆరేళ్ళ క్రితం ఇలాంటి కథే నేను రాశాను. (నా స్నేహితురాలి కథే) ముగింపు అసంతృప్తిగా అనిపించి పక్కన పెట్టేశాను. ఇప్పటికీ అలాగే ఉంది. నాకు నా స్నేహితురాలే గుర్తొచ్చింది, మీ కథ చదువుతుంటే. అభినందనలు

Leave a Reply