నా జ్ఞాపకాల్లో చెరబండరాజు

తన చుట్టూ ఉన్న పీడిత జన జీవన్మరణ సమస్యలే తన కవితా ప్రేరణలు అన్నాడు చెరబండరాజు. శాస్త్రీయమైన మార్క్సిస్టు అవగాహన తనకు స్పష్టతను చేకూర్చిందనీ అన్నాడు.

తన గ్రామం అంకుశాపురం, నల్లగొండ జిల్లా అనీ పుట్టింది 1944వ సంవంత్సరమనీ గ్రామంలోని తన కుటుంబం, కుటుంబ పరిస్థితులు, గ్రామ రాజకీయాలు, మిత్రుల ప్రేమలు ముచ్చటగా చెప్పేవాడు. బొల్లారం నుంచి శ్యామలను చిన్నతనంలోనే తనకు పెళ్లి చేశారనీ అప్పుడు తనది విద్యార్థి దశేననీ చెప్పి ఆ రోజుల్లో జరిగిన పెళ్లి సందడి, పెట్టిపోతలూ గుర్తులేక మూడు మాటల్లో ముచ్చటించేవాడు.

గ్రామానికి వచ్చే జానపద కళాకారుల ఆట పాటలతో తనకు పాటమీద, కథలమీదా పట్టు చిక్కిందనీ పిచ్చిగా నోటికొచ్చిన పాట దరువుతో పాడుకునేవాడినన్నాడు చెర.

చెరబండరాజును మేము చిన్నప్పటి జ్ఞాపకాల ముసురులో ముంచితే ఎన్నో అనుభవాలు ఉరుములు, మెరుపులు మాకు (నాకు, డి. అంజయ్య అనే మిత్రునికి) వినిపించేవి.

చెర – అధ్యయనం:

1965 దిగంబర కవిగా సాహిత్య ఎజెండాతో ముందుకొచ్చిన చెరబండరాజు మూడు సంవత్సరాల కాలం అందులోనే ఉన్నాడు. సాగుతున్న సాహితీ మదనంతో పాటు మార్క్సిస్టుగా దృష్టి మర్లుతున్న కాలంలో కొన్నేళ్లుగా విస్తృతంగా ప్రపంచాన్ని చదివినట్టు తానే చెప్పాడు. 1970 వరకే ఫ్రెంచ్ విప్లవం చికాగో మేడే పనిగంటల పోరాటం; రష్యన్ బోల్షివిక్ విప్లవం, చైనా లాంగ్ మార్చ్ అనుభవాలు అధ్యయనం చేస్తూనే దేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర, గదర్ వీరులు, చిటగాంగ్ వీరుల చరిత్రలు చదివాడు.

తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలు, వివిధ రాష్ర్టాలలో జరిగిన తిరుగుబాట్లు, పితూరీలు విని, చదివి అర్థం చేసుకున్నానని ఒక సందర్భంలో చెప్పాడు చెరబండరాజు. దేశంలోని పరిస్థితులు, నిత్యనూతనంగా మారుతున్న సమాజ తీరుతెన్నులు గమనిస్తూ కవిత్వీకరించే ప్రయత్నాలు చేయసాగాడు.

భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర , 1928 నుండి పార్టీలో వస్తున్న మార్పులు, ఎర్రజెండా రెపరెపలు, 1948-52 నాటికి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో ప్రజలను నడిపించిన తీరు తర్వాత పోరాటం ఆపిన వైనం… చీలికలు… సిద్ధాంతాలు కకావికలం కావడం గమనించాడు. ఉండబట్టలేక వ్యంగంగా

చెట్టూ నీ పేరుచెప్పి కాయలమ్ముకుంటోళ్లు
కొమ్మా నీ పేరుచెప్పి రెమ్మలమ్ముకుంటోళ్లు
మందను మందను తీసుకెళ్లి-కసాయికిచ్చేరు
కైమా చేసేరూ… అంటూ పాట పాడినాడు.

విప్లవ రచయిత:

దిగంబర కవిత్వం నుంచి బయటపడిన చెరబండరాజు 1970 జూలై 4 నాడు సంస్థాపక సభ్యునిగా విప్లవ రచయితల సంఘంలో శాశ్వతంగా ఉండిపోయాడు. పూర్తి అంకితభావంతో నమ్మిన విప్లవ సిద్దాంతాలను ఉపాన్యాసాల ద్వారా, రచనల ద్వారా ప్రజలకు చేరువయ్యాడు. చెరబండరాజు తన దైనందిన జీవితంలో అరటిపండు తొక్క తీసి తినిపించినంత తేలికగా…. 8 కవిత్వం, పాటల పుస్తకాలు, 4 నవలలు, నాటికలు, నాటకాలు, ఏకాంకికలు, కథలు ఎన్నో రాశారు.

1971 నుండే జైళ్లలో బంధించబడ్డాడు. పీడీ యాక్టు చట్టం, మీసా చట్ట ప్రయోగం, సికింద్రాబాదు కుట్రకేసు, ఎమర్జెన్సీ అంతా జైలు జీవితమే.

1977లో మొదటి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది. 1979 నవంబర్లో 14 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి డాక్టర్ రాజారెడ్డి ట్యూమర్ తొలగించారు.

కోమాలో నుండి బయటకు వచ్చిన చెర ముఖం మీద చిరునవ్వు తొనికిసలాడేది. జనరల్ వార్డుకు మార్చిన తర్వాత నేను మరోసారి పలకరిద్దామని వెళ్లాను. మాట్లాడే స్థితిలో లేడు. అయినా జ్ఞాపకశక్తిని పరిశీలిద్దామని నాపాట ఒకటి సినిమాకి ఒక డైరెక్టర్ అడిగిన సంగతి చెప్పాను. మాట్లాడలేని తాను నా చేతనున్న డైరీలో ‘వద్దు బాబు… ఇవ్వొద్దు… వాళ్లను నమ్మొద్దు’ అని రాశాడు.

కుటుంబం- వ్యవసాయం:

కరకు చుట్టలు తాగి – బండి బరువులు లాగి
ఏడాది పొడుగునా – ఏతాము లెత్తినా
మా ఊరు మారలేదన్నా- అయ్యో
మా కరువు తీరలేదన్నా…
ఈ గట్టు మీదనే – ఈ చెట్టు కిందనే
మా అయ్య కాలిరిగి – నవిసి సచ్చినగాని
భూస్వామి మారలేదన్నా….

ఆ గట్టూ చెట్టూ ఆ పొలాలు… బడిసెలవుల సమయాల్లో బాలనర్సింహ అనే బద్దం భాస్కర్ రెడ్డి, బుద్ధి తెలిశాక ‘‘చెరబండరాజు’’ తిరిగిన పొలాలన్నీ చూశాను. ఆ గట్టు, ఆ చెట్టు ఎక్కడున్నయో ఆ చెట్టుకింద అయ్య కాలిరిగి నవిసి చచ్చిన రైతుకు ప్రతీక. పొలాలలో పని చేస్తేనేగాని రైతు హృదయం ఏ రచయితకు అంతుపట్టదు. బాధ అవగతం గాదు. చెరబండరాజు నివసించిన ఇల్లు, పసులుగాసి పని చేసిన మల్లు కనిపించాయి. చెరబండరాజుది వందశాతం రైతు కుటుంబం. తల్లీ, తండ్రీ, అన్నలు-బాలమల్లయ్య, బాలదానయ్య రైతులే. ఘట్కేసర్లో చాయ్ పత్తా ఫ్యాక్టరీ పడ్డాక బరువులు మోసే కార్మికుడిగా పెద్దన్న బాలమల్లయ్య అందులో చేరాడు. అందుకు కారణం సరిపోను వ్యవసాయ భూమిలేని పరిస్థితే కావొచ్చు.

చెరబండరాజు 1974లో అరెస్టు తర్వాత వాళ్ల ఊరు అంకుశాపురం వెళ్లిన సందర్భం. అంతకు ముందే నేను పరిచయం చెర తల్లి బాలనర్సమ్మకు… ఆమె పొట్టిగా ఉండేది. గున్నలెక్కుండి నిలువునా కట్టూ బొట్టూ రైతు తల్లే. పొలం పనుల్లో రాటుతేలిన ఆ కాళ్లు చేతులు వేళ్లు…

అప్పుడు నాతో చెరబండరాజు మేనల్లుడు బుచ్చిరెడ్డి ఉన్నాడు. బాలనర్సమ్మతో సరదాగ మాట్లాడుతూ… ‘నీ కొడుకు బాలనర్సంహను జైల్లో పెట్టిండ్రు ఎందుకూ?’ అనడిగాను… నాకేం తెలుసు కొడుకా… ఎందుకో ఏమో… దొంగతనం చేసిండో… ఎవరినన్న సంపబోయిండో ఏమో… అన్నది.

‘ఎవర్ని కొట్టబోలే… సంపబోలేగనీ, పాటలుగట్టి పాడుతున్నడు’ అన్నడు అక్కడే ఉన్న బుచ్చిరెడ్డి. పాటగడ్తే జైల్లేస్తరా… ఎవడాడు..? నేను అడుగుత పదు… అన్నది అమ్మ బాలనర్సమ్మ.

వివాహం:

అంకుశాపురంలో ఒకటి రెండు ఇల్లు మినహాయించి కులం పట్టింపులు లేకుండా అన్ని ఇల్లతో సంబంధాలుండేవి చెరబండరాజుకు. 1960లో తన 16వ ఏటనే పెళ్లి జరిగింది శ్యామలతో… వీళ్లిద్దరినీ ఆ ఊరి యువకులు తాతా, అవ్వా అని పిలిచేవారు. చిన్న వయసు, పరిమితమైన తెలివి, అమాయకత్వం, అత్తవారింటిలో పనిచేయాలన్న నియమం కట్టుబాట్లతో వెళ్లిన శ్యామలకు పనులే పనులు. అందంగా, లేతగా, అతి సున్నితమైన ఆ పిల్లకు చాలా వరకు మోటు పనులు చేప్పేవాళ్లు కారు ఇద్దరు బావలు. అయినా చెలకలు తిరిగి పిడకలు ఏరుకురావడం, పసులగాయడం, ఒక్కోసారి నాట్లు వేయడం తప్పేదికాదు. వంట పనుల్లో యారాన్లకు, అత్తకు చేదోడుగా వుండేది. పిలగాడు బాలనర్సింహ పొరుగూరిలో చదువు… బడి ఎగ్గొట్టి ఆటలు, పాటలు. పెళ్లి తర్వాతే బాలనర్సింహకు బడిలో చదవుకోవాలన్న పట్టుదల పెరిగింది. అట్లా పెళ్లైన సంవత్సరంలోనే రవీంధ్రనాధ్ ఠాగూర్, శరత్‌చంద్ర చటర్జీల సాహిత్య ప్రభావంలో ఒకసారి వెళ్లి శాంతినికేతన్ చూడాలన్న తపనతో ఎవరికీ చెప్పకుండా రైలెక్కి వెళ్లిపోయాడట. అక్కడ తను అనుకున్న దానికి భిన్నమైన వాతావరణం కనిపించింది. ఇక ఉండలేక తిరిగి వచ్చిండు. రాజకీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ రవీంధ్రుని మీద అభిమానం సన్నగిల్లిందని చెప్పాడు చెర. శరత్ ను మాత్రం ఏమీ అనలేదు. చలం సాహిత్యమంటే ఇష్టమని చెప్పేవాడు.

‘‘శ్యామల మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చింది. ఎక్కువగా చదువుకోలేదు. చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ప్రపంచాన్ని మనం అర్థం చేసుకున్నంత తను అర్థం చేసుకోలేదు. ఆ అవకాశం లేదు. అయినా నాతో కష్టాలు పడుతూ, నష్టాలు భరిస్తూ నడుస్తూనే ఉంది.’’ అనేవాడు.

తను చదువుకున్న ఊర్లోనే స్కూల్లో ఉద్యోగం దొరికింది. కొంతకాలం తర్వాత కొర్రెముల, చౌటుప్పల్లో స్కూల్లలో పనిచేసి 1962లో అంబర్ పేటలో అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. అప్పుడే BOL, MOL చదువులు పూర్తిచేశాడు. మలక్‌పేట స్కూల్లో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు.

అంబర్‌పేటలో ఉన్న కారణంగా నాకు, నా మిత్రడు డి. అంజయ్యకు స్నేహితుడయ్యాడు చెర. మా ఇద్దరికన్నా ఎనిమిది సంవత్సరాలు పెద్ద కనుక మమ్మల్ని విద్యార్థులుగానే చూసేవాడు చెర. మేము సార్ అనే పిలిచేవాళ్లం.

పరిచయం:

1968 నుంచే నేను అతని గురించి వింటున్నాను. ఒకే బస్తీలో ఉంటున్నా అప్పుడప్పుడు చూసుకుంటున్నాం. అతని గురించి కొంత తెలుస్తూనే ఉండేది. నాకు పరిచయం చేసుకోవాలని ఉండేది కానీ ధైర్యం చాలకుంది. ఎందుకంటే నేనూ ఊరివాన్నేకదా. అతను ఎత్తు మనిషి. సూటిగా చూస్తాడు. చిరునవ్వులు చిందిస్తాడు. తెల్లని రూపం… బట్టతల… హాఫ్ షర్టు… లుంగీ, పంచ ఉంటుంది. తెల్లదో లేదా పువ్వుల డిజైనులో ఉంటుంది. ఇంటి దగ్గర ఈ డ్రస్సు. కిరాణ దుకాణం, మాంసం దుకాణం, కూరగాయల దుకాణం దగ్గరో ఉదయం పూటే కనిపిస్తుంటాడు. నేను హెయిర్ కటింగుకు వెళ్లే నారాయణ దగ్గరకే తనూ వస్తుంటాడు. నాకు వేరే గత్యంతరం లేక మంగలి నారాయణను అడిగాను. ఆ సార్ను నాకు పరిచయం చేయమని. అతను రెండు రోజుల తర్వాత ఉదయమే రమ్మన్నాడు. వెళ్లాను. ఈ రెడ్డిసాబ్ ది గుడి ముందటి ఇల్లు. అని నా పేరుచెప్పి ఎప్పుడైనా చూసిండ్రా సార్ అన్నడు. చెరబండరాజు నన్ను చూసి మందహాసం చేసి ఏవో రెండు ప్రశ్నలడిగి సాయంకాలం ఇంటికి రమ్మన్నాడు. అది 1971.

అక్కడి నుంచి చెరబండరాజు అంతిమ గమనం వరకు మా స్నేహం కొనసాగింది. 1978లో జరిగిన జననాట్యమండలి చేసిన నా పెళ్లికి ఆయన్ని పిలువలేకపోయాను. ఏవో మనస్పర్థలు వచ్చాయి. అవి తాత్కాలికమైనవే.

1971లోనే నేనింకా బూర్జవా భావజాలాన్ని వదిలీ వదలని దశలో ఉగాది సందర్భంగా ఎవరో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ పద్యాలు, పాటలు రాసే నేను అపుడు ఒక వచన కవిత రాశను. ఉగాది ముందురోజు చెరబండరాజు ఇంటికి వెళ్లి చదివి వినిపించాను. ఏవో రెండు సలహాలు ఇచ్చాడు. పద్యం బాగానే వుంది. “విప్లవ భావాలు ఉన్నాయి, విప్లవ సాహిత్యంలో అభ్యుదయ భావంగల సంకేత పదాలుంటాయి. వాటిని గమనించాలి. ఉదా. ప్రగతి, అభ్యుదయం, శాస్ర్తీయత, సూర్యుడు, కాగడా, మంట, వెలుగు, ఇలా చాలా ఉంటాయి” అన్నాడు.

పద్యం అన్నమాట నాకు రుచించలేదు. “వచన కవిత్వమెలా పద్యమౌతుంది. దీనికి చందస్సు లేదుకదా?” అన్నాను. చందస్సు లేకున్నా ఇది వచన పద్యమే అన్నాడు.

మరునాడు తెల్లవారే ఇంటికొచ్చి తన సైకిల్ మీద కూర్చొనే నన్ను పిలిచి నిన్నటి పద్యంలో చివరన ఉన్న ఆ పదం మార్చి వేరే పదం పెట్టు బాబూ బాగుంటుంది అని ఏదో పదం సూచించాడు. అదేదో నాకు ఇప్పడు గుర్తుకు రావడం లేదు. ఇది చెరబండరాజు పద్యాల, పాటల అల్లిక, సాధనలో ఒక ఉదాహరణ.

అట్టడుగు మనిషి:

చెరబండరాజు నెల జీతం చాలా తక్కువగా ఉండేది. తరుచుగా చిన్నచిన్న అప్పులు చేసేవాడు. అదీగాకుండా సంస్థ విషయంలో సభలకు తిరగడం వల్ల ప్రయాణపు ఖర్చులు అదనంగా వచ్చేవి. పైసల కోసం ఇబ్బందులు పడుతున్నాడని తెలిసిపోయేది.

ఇన్నేండ్ల స్నేహంలో నేనెప్పుడూ చెరను స్కూటర్ మీద ఎక్కంగా చూడలేదు. స్కూటర్ నడిపించడం ఎలాగూ రాదు కానీ, స్కూటర్ వెనకనైనా కూర్చొని వెళ్లడం నా కళ్లలో పడలేదు. ఒక్క సైకిల్ మాత్రమే తన వాహనం. దాన్ని మంచి కండీషన్ లో ఉంచుకునేవాడు. దంపతులిద్దరూ బైటకు వెళ్లాలంటే రిక్షా బిక్షపతిని రమ్మని పిలిచేవాడు. అతనే ఎప్పుడూ వచ్చెటోడు. సైకిల్ మీద కాకుండా ఎటు వెళ్లినా బిక్షపతే… పోలీసు స్టేషన్ వెళ్లినా, వచ్చినా బస్ డిపో వెళ్లాలన్నా, మరెక్కడికైనా… బిక్షపతే వచ్చేవాడు.

పోలీసు డిపార్టుమెంటులో ఒకాయన ఒక పోలీసు అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేసేవారు. మా బస్తీలోనే అతను అద్దెకుండేవాడు. చెరబండరాజును రేపు అరెస్టు చేస్తారనగా ఈ రోజే వచ్చి చెప్పేవాడతను. చెర తన బట్టలు బ్యాగు సిద్ధం చేసుకొని శ్యామలమ్మను ఓదార్చి, ధైర్యం చెప్పి పోలీసుల కోసం ఎదిరి చూసేవాడు.

తనవల్ల ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే ఒప్పుకొని సరిదిద్దుకునే చక్కని మనస్తత్వం చెరబండరాజుది. అప్పుడు పసిపిల్లవాడుగా తల ఊపి సరిచేసుకునేవాడు. ఒకానొక సందర్భంలో పసిపిల్లవాడిగా చిన్న తప్పుల్ని ఒప్పుకున్నా తను నమ్మిన సిద్దాంతం యెడల, నమ్మిన వ్యవహారం పట్ల నిక్కచ్చితనం ఉండేది. ప్రాణం పోయినా తన అవగాహన కొచ్చిన పరిజ్ఞానాన్ని వదిలేవాడుకాదు. విప్లవ సిద్ధాంత పని విధానంలో అంతే. చెప్పింది ఏదో చేసిందీ అదే. ఆచరణే అన్నిటికీ గీటురాయి కదా అన్నాడు. అందుకే చెరబండరాజుకు అంబర్‌పేటలో అందరూ తనవాళ్లుగానే తోచేవారు. తానెప్పుడూ ఒకరితో పొట్లాడడం, మాటలు అనుకోవడం మేము చూడలేదు. ఎవరన్నా తనను విమర్శించినా తన భావాలకు వ్యతిరేకంగా మాట్లాడినా అదికాదు ఇది అని మెత్తగా చెప్పి చూసేవాడు. వినకున్నా అతను తన మనిషే… ఇపుడుగాకున్నా రేపన్నా అర్థం చేసుకుంటాడన్న ధీమా చెరది.

సైకిల్ మీద వెళ్తూ ఎవరన్నా తనకు ఎరిగిన మనిషి కనబడితే సైకిల్ ఆపి తన బ్యాగ్ లో నుండి పుస్తకం తీసి ఇస్తూ… నాది కొత్త పుస్తకం వచ్చింది. చదవండి. అని చేతికిచ్చి… ఉంటే దీని వెల డబ్బు ఇస్తే సంతోషిస్తా అనేవాడు. పుస్తకం చేతికందుకున్న ఆ వ్యక్తి గిట్టినవాడైనా, గిట్టనివాడైనా చెర చొరవ జూసి ఆ పదో, పదిహేనో డబ్బులిచ్చి పుస్తకం కొనుక్కునేవాడు. చెరది ఉదార స్వభావం. ఒకసారి నేను, డి.అంజయ్య చెర ఇంటికి వెళ్లేసరికి ధీర్ఘంగా ఆలోచిస్తూ భాధ పడుతున్నాడు. ఎందుకట్ల ఉన్నారని మేము అడిగాము. ‘‘ఏం చేయను బాబూ… అతను నా పాట కొట్టేశాడు. ఏదో ఊరుకోలేక రాయబోయే పాట, పల్లవి చెప్పాను. నాలుగు మాటలు విషయం కూడా చెప్పాను. అంతే అది విని అతను తెల్లారే సరికి పాట రాసినాడు. ఛ… నా పాట కొట్టేశాడంటూ’’ బాధ పడ్డాడు. తర్వాత ఆ పాట చాలా ఫేమస్ అయింది. ఎప్పుడూ అతన్ని చెరబండరాజు ప్రశ్నించలేదు. అతనూ ఇతని దగ్గరికీ రాలేదు.

జననాట్యమండలితో:

జననాట్యమండలి పాటలంటే, ప్రదర్శనలంటే చెరకు చాలా ఇష్టం. నాటకరంగమంటే, ప్రజా కళారూపాలంటే జననాట్యమండలిలాగ ఉండాలని తరుచూ చెప్పేవాడు చెర. ప్రదర్శన జరుగుతున్న ప్రతి ప్రాంతానికి పనిగట్టుకొని వచ్చి జేఎన్ఎం లో ఒకనిగా కలిసిపోయేవాడు. ప్రదర్శన ఇస్తున్న క్రమంలో పాటల్లో కోరస్ పాడడం, ఏ పాత్రదారుడన్నా లేని సందర్భంలో తను ఆయా చిన్న పాత్రలకు సిద్ధమై స్టేజి ఎక్కేవాడు. రైతు పాత్ర కావాలంటే వెంటనే ప్యాంటు వదిలేసి ధోతి కట్టుకొని నాటకంలోకి అడుగు పెట్టిన సందర్భాలున్నాయి.

1973లో చెర కొండలు పగిలేసినం పాట రాసినాడు. నేను దాన్ని నృత్యరూపకంగా 1975లో జననాట్యమండలిలో తీర్చిదిద్దినాను. ఆ రూపకం చూసిన చెరబండరాజు ‘‘భూపాల్ నేను శిల్పం చెక్కాను. దానికి జీవం పోసింది నీవు’’ అని కౌగిలించుకున్నది నాకు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంటుంది.

ప్రజలపాట:

చెరబండరాజు కౌమార్యంలో తనకున్న భాషా పరిజ్ఞానంతో ఛందోబద్ద పద్యాలు, జానపద పక్కీలో పాటలు అల్లుకున్నట్టు చెప్పుకున్నాడు. తర్వాత వచన కవిత్వం కుందిర్తి గారి ప్రభావంతో చక్కగా అబ్బింది. వచన కవిత్వం రాస్తున్న క్రమంలోనే చదువూ, ఉద్యమం, దిగంబర కవుల సాంగత్యం ఏర్పడింది. ఐదుగురిలో తానొక్కడిగా నిలిచారు. అయితే విరసంలో చేరిన తర్వాత ఒక సంవత్సరం వరకు వచన కవిత్వంతోనే ఉన్నాడు. 1971లో గానీ పాట బలమైన ఆయుధమని తను అనుకోలేదు. “కొలిమంటుకున్నాది- తిత్తినిండా గాలి- పొత్తంగ ఉన్నాది. నిప్పారి పోనీకు- రాజన్నా. పొద్దెక్కి పోనీకు లేవన్నా” పాట తన మొదటి పాట అనీ చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో పాటలు రాశాడు. అన్నీ ప్రజాదరణ పొందినవే…

స్కూల్లో పాఠాలు:

బడిపిల్లలన్నా, చంటి పిల్లలన్నా చెరకు చాలా ఇష్టం. తను పాఠాలు చెప్పిన స్కూల్లలోని పిల్లలు చెరబండరాజు సార్ ను ఇప్పటికీ జ్ఞాపకం చేస్తుంటారు. ‘‘ఆ సార్ క్లాసు పుస్తకంలోని పాఠాలే కాదు జీవిత పాఠాలు ఎన్నో చెప్పేవాడు’’ అనీ ఆ నాటి విద్యార్థులు ఈ నాటి పెద్దలూ అంటుంటారు.

ఒకసారి ఆరుమాసాల పరీక్షలు అయిపోయినాయి. వాళ్ల పరీక్ష్ల పేపర్లు దిద్దిన సార్ చెరబండరాజును పిల్లలంతా కలిసి ‘‘ మార్కులు చెప్పండి సార్… మార్క్స్ చెప్పండి’’ అని అడిగారు. ‘మార్క్స్’ అంటే మీకు తెలుసా అని పాఠం ప్రారంభించాడు సార్ చెరబండరాజు… ఇలా సందర్భం ఏది దొరికినా పిల్లలకు రాజకీయ అవగాహన కలిగించడం, జీవితాల గురించి వివరించడం ఈ సార్ కు వెన్నతో పెట్టిన విద్య.

నవోదయ సంస్థ ‘జీవనాడి’ పత్రిక:

అస్తవ్యస్థంగా ఉన్న నా ఆలోచనలకు ఒక రుజు మార్గం చూపింది నవోదయ సంస్థ, జీవనాడి పత్రిక. ఈ నవోదయ సంస్థకు పరిచయం చేసి అక్కడికి తీసుకెళ్లింది చెరబండరాజే. ఈ సంస్థ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, కా. తరిమెల నాగిరెడ్డి, కా. దేవులపలిల వెంకటేశ్వర్ రావు గార్ల ప్రపంచ పరిజ్ఞానం, మార్క్సిజం అవగాహనతో నడిచింది. దీన్ని ఆంధ్రరాష్ర్ట విప్లవ కమ్యూనిస్టు కమిటి అనేవారు. దాని అనుబంధ సంస్థ ఈ నవోదయ. అక్కడే చర్చోపచర్చలు, అవగాహన లోపాలు నాలో, నా మిత్రులలో సరిచేసుకోబడ్డాయి. అది 1972వ సంవత్సరం. ఒకసారి శ్రీ కృష్ణదేవరాయల గ్రంధాలయం (సుల్తాన్ బజార్)లో ఏదో సాహిత్య సభ జరుగుతుంది. అందులో వక్తగా చెరబండరాజు ఉన్నాడు. నేనూ సభలో ఉన్నాను. చెర మాట్లాడుతూ నేను రాసిన ‘‘కోడికూసింది అప్పుడే – తెల్లార పోతుంది అప్పుడే… సలిలేదు, గిలిలేదు’’ అనే పాటను ఎంతో మెచ్చుకుంటూ మాట్లాడాడు. దాంతో నవోదయ సంస్థ సభ్యుల్లో నా యెడల గౌరవం పెరిగింది.

‘జీవనాడి’ మాస పత్రికలలో చాలా వరకు నా పాటలు రకరకాల పేర్లతో వచ్చేవి. నేను నా కవిత ఒకటి చెరతో పరిచయమైన కొత్తలో చూపించానని చెప్పానుగదా ఆ తర్వాత ఏదీ ఆయనకు చూపలేదు. ఆయన్ను గురువుగా తీసుకోలేదు. నవోదయ తర్వాత జననాట్యమండలి, ఇంకా ప్రజలే నాకు గురువు స్థానంలో నిలిచారు.

ఒకసారి నవోదయ కళా బృందం నేను రాసిన, నటించిన ‘‘కరువు కథ’’ బ్యాలే ప్రదర్శించింది. అంబర్‌పేటకు దగ్గరే ఉన్న నల్లకుంటలో జరిగిన ఈ ప్రదర్శనకు చెరబండరాజు వచ్చారు. ప్రదర్శన చాలా బాగా నచ్చింది. అయితే బ్యాలే ముగిసినంక నా బాల్య మిత్రుడు బి. కృష్ణ అనే అతను నా పూర్వం పాట ఒకటి పాడినాడు. అది ‘సల్లగాలి వీచింది – పిల్లగాలి సోకింది, సుక్కలాంటి చిన్నదొకటి చిటికేసి రమ్మంది’ అని ఉంటుంది పల్లవి. ఆ పాటను ప్రేక్ష్లకులందరూ విన్నారు. ప్రదర్శన ముగియగానే చెరబండరాజు మా బృందం దగరకొచ్చాడు. ‘‘అబ్బ ఎంత చక్కటి ప్రదర్శన, ఎంత బాగా చేశారు. సబ్జెక్టు కూడా అద్భుతం’’ అంటూనే” అంతా బాగుంది… కానీ చివర పాడిన ఆ పాట అందరి మంచి మూడ్ ను పాడు చేసింది. ఈనగాసి నక్కల పాలు చేసినట్టు ఎందుకు పాడారు. పాడకుంటే బాగుండేది.’’ అన్నాడు. మా అందరికి నిజమే అనిపించింది. అట్లా నవోదయకు పరిచయం చేసి అవగాహన కల్పించిన చెరబండరాజు మరో దశలో 1973లో నవోదయ సంస్థ నుంచి జననాట్యమండలికి నన్ను తీసికెళ్లాడు. నవోదయకు అప్పట్లో కాలంచెల్లిందని విమర్శించాడు.

చివరగా:

పాట ఏది రాసినా ప్రజల బాణీలో ఉండేది చెరబండరాజుది. మాట అరమరికలు లేని, కల్లాకపటం లేనిదై ఉండేది. పరిచయమున్న ప్రతివారినీ తానే ప్రేమగా పలకరించేవాడు. ప్రజల జీవితాలతో, ప్రజా సమస్యలతో, ప్రజా పోరాటాలతో మమేకమైనదే చెరబండరాజు సాహిత్యం అంతానూ.

కథల్లో, నవలల్లో, నాటకంలో పాత్రలన్నీ మన కళ్లముందు ఉన్నట్టే ఉంటాయి. ‘‘మన సృష్టి ఒక పాత్ర అనుకుంటే అది మన సొంతమేకదా. అది ఆకాశం నుంచి ఊడిపడలేదు. మనమూ సమాజంలోని పాత్రనే మనదిగా రాస్తాము.’’ అనేవాడు చెర.

చెరబండరాజు నాతో తరుచుగా అనే మాట. ‘‘నేను బులెట్ గాయంతో చస్తాను బాబూ… నా చావు గన్ తో ముడిపడి ఉంది’’ అని. అట్లెందుకు అనేవాడో తెలియదు కానీ, తన బ్రేన్ ట్యూమర్ మూడోసారి ఆపరేషన్ 1981 తర్వాత ఒక సంవత్సరం బతికి 1982 జూలై 2న కన్ను మూశాడు. చెరబండరాజు బతికింది 38 సంవత్సరాలే కానీ, వందల సంవత్సరాలు బతికుండే సాహిత్యాన్ని సృష్టించి పోయాడు.

జ‌ననం: హైద‌రాబాద్‌. 'జ‌న‌నాట్య మండ‌లి' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు. 'విర‌సం' స‌భ్యుడు. నాలుగు క‌థా సంపుటాలు, మూడు న‌వ‌ల‌లు, బాల‌సాహిత్యంలో 12 పుస్త‌కాలు, కొన్ని పాట‌ల పుస్త‌కాలు, ఆరు బ్యాలేలు రాశారు. 'మా భూమి', 'దాసి', 'కొమురం భీం' తదితర చిత్రాల్లో న‌టించారు. 'పొట్ల‌ప‌ల్లి రామారావు సాహిత్యం' పై పీహెచ్‌డీ చేశారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం, రచనావ్యాసంగం, అడపా దడపా సినిమాల్లో పని చేస్తున్నారు.

2 thoughts on “నా జ్ఞాపకాల్లో చెరబండరాజు

Leave a Reply