నా చందమామని వెతుక్కోవాలిప్పుడు

నిన్నిలా గాయాలతో వదిలి వెళ్లాలని ఉంది
నీ గాయానికి నువ్వే కట్టు కట్టుకుంటూ
నీ నొప్పిని నువ్వే ఓదార్చుకొంటూ
నువ్వూ … నేనుండి కూడా
ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే
ఒంటి పక్షిలా కన్నీరు కారుస్తుంటే
నాకూ చూడాలని ఉంది

నా కన్నీటి బొట్లకి
బొట్టు బొట్టు కీ నువ్వు ఇచ్చిన క‌న్ఫెష‌న్స్‌
ఒట్టి క‌న్సెష‌న్స్‌ గా మిగిలిపోయి వెక్కిరిస్తుంటే
ఇక ఈ ఒంటరితనపు రెక్కలతో ఎగిరి పోవాలని ఉంది
నువ్వు నా చేతుల్ని ముద్దు పెట్టుకుంటే
కవిత్వం రాసిన చేతులు కదా
అందుకే అనుకున్నా
కానీ, ఆ ముద్దులన్నీ నా చేతులు నీకు వండి పెడుతున్నందుకు అన్నావు
నువ్వు స్పర్శించిన నా దేహమంతా
నీ ప్రేమ సముద్రమే అనుకున్నా
కానీ నీ కుటుంబం మొత్తానికి
నేను వంటిల్లు గా అయిపోయినందుకే అని తెలుసుకున్నా

నాకు బాగోలేనప్పుడు
అస్సలు బాగోలేనప్పుడు
టాబ్లెట్ వేసుకొని
జ్వరం తగ్గించుకొని వంట చేయమన్న నువ్వు
టీవీ మోడల్ భర్తలా
కోరలు దాచుకున్న రాక్షసుడిలా కనిపిస్తే భయపడి పోయాను
నువ్వు
అనేకానేక సార్లు
కొన్ని వేల సార్లు
నా నొప్పుల్ని గాయాలను నాకొదిలేసి
నా ఒంటరితనాలను మరింత ఒంటరి తనాన్ని చేసేసి
నా జీవితానికి
ఒక అపరిచితుడిగా మిగిలిపోతే
నిన్నిలా గాయాలతో వదిలి వెళ్లిపోవాలని నాకూ ఉంది
ఒక్క రాత్రి
ఒకే ఒక్క రాత్రి
అనేక వేల రోజుల తర్వాత
నువ్వూ పిల్లలూ లేకుండా
ఇల్లూ.. వంటిల్లు లేకుండా
వెన్నెల రాత్రిని స్నేహాల ముచ్చట్ల లోనో
అమ్మ ఒడిలోనో సేద తీరాలని నే వెళ్లిపోయినప్పుడు
రావూ.. అన్న నీ ఒక్క వేడుకోలులో
ఎంత ప్రేమో అనుకుని రెక్కలు కట్టుకుని వాలిపోయానా…?
ఆ పిలుపు నీ ఒంటికీ-వంటకీ మాత్రమే అని తెలిసాక
భర్తా
భర్తగా మారినాక
మనిషిగా కాకుండా పోయిన ముసుగు మనిషీ
కవీ… రచయితా…
ఉద్యమ కారుడా…మేధావీ…
నీ అబద్ధపు క‌న్ఫెష‌న్స్‌ని
మళ్లీ మళ్లీ ఎలా నమ్మను?
ప్రతీ సారీ నువ్వు చేసే బూటకపు ఎన్కౌంటర్లో మనిషిగా చనిపోతూ
మళ్ళీ మళ్ళీ భార్యగా మాత్రమే ఎలా బతకను?
నీ ఒక్కో ముసుగునీ తిరస్కారంతో కాల్చేస్తానా…
మళ్ళీ మళ్ళీ నీ చర్మం నుంచి తొలుచుకు వచ్చే ముసుగులని ఏం చేయను?
నా నుంచి కలాన్ని- నా కాలాన్ని లాగేసుకొని
నన్నొక వంటింటిగా మార్చేసాక
నన్ను చంపేసాక
నీ ఆదర్శ స్త్రీ వెతుకులాట ముసుగు లోని అరాచకాన్ని కామం అనకుండా
అసంతృప్తీ, ఆదర్శం అన్న నీ ముసుగుల్ని
ఎన్నెన్ని తొలగించాలి ?
నీ చేతులు మోసేవి
మార్క్స్ , చలం పుస్తకాలు
నువ్వు వేదిక మీద వాగేవి సమానతా ఉపన్యాసాలు
ఇంట్లో చదివేవి మాత్రం
గాయత్రీ మంత్రాలు
రాసేది శ్రీరామ నామాలు

ఇక నా వల్ల కాదు
ఇన్నేసి ముఖాలను ఎక్కడ్నించి పుట్టిస్తావసలు?

అందుకే…
సహ-అనుభూతి ఏ మాత్రమూ లేని ఈ సుదీర్ఘ దాంపత్య జీవితంలోని కుహనత్వాన్ని నీకే వదిలేసి
నీ గాయాలతో నిన్ను నీకు వదిలేసి
నీ ముసుగుల్ని నీకే వదిలేసి వెళ్లిపోవాలని ఉంది
నీ నొప్పిని నువ్వే ఓదార్చుకొంటూ ఉంటే
నీ గాయపు నెత్తుటిని నువ్వే తుడుచుకొంటూ ఉంటే
అచ్ఛం.. నువ్వు నాలా విల విల లాడుతూ ఏడుస్తుంటే
చూడాలని ఉంది

గరిటెల్ని వదిలేసి, కలాల్ని పట్టుకోవాలిప్పుడు
అసలు నువ్వు గుంజేసుకొన్న నా కలాన్ని వెతకాలిప్పుడు
నీ ఎనిమిది వందల గజాల ఇంటి పైకప్పు కింద నించి పరిగెత్తుకొచ్చి
నా ఆకాశం కింద నాదైన భూమి మీద నిలబడాలిప్పుడు
చూడూ… నా చందమామని వెతుక్కోవాలిప్పుడు
మరింకేం…?
తలుపేసుకో
వెళుతున్నా మరి

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

19 thoughts on “నా చందమామని వెతుక్కోవాలిప్పుడు

 1. చాలా బాగా రాశారు . ఏ ముసుగులో ఉన్నా మగ దౌర్జన్యం ఒకలాగే ఉంటుందన్న విషయాన్నీ ఆలోచింపచేసేలా రాశారు. “గరిటెల్ని వదిలేసి, కలాల్ని పట్టుకోవాలిప్పుడు
  అసలు నువ్వు గుంజేసుకొన్న నా కలాన్ని వెతకాలిప్పుడు
  నీ ఎనిమిది వందల గజాల ఇంటి పైకప్పు కింద నించి పరిగెత్తుకొచ్చి
  నా ఆకాశం కింద నాదైన భూమి మీద నిలబడాలిప్పుడు
  చూడూ… నా చందమామని వెతుక్కోవాలిప్పుడు
  మరింకేం…?
  తలుపేసుకో
  వెళుతున్నా మరి” బావుంది

 2. గీతా…కవిత బా గుందివ్యక్తిగతన్ని సామూహికంగా చేస్తూ ఒంటరి వొంటగడుల్లో తప్పిపోయిన కలా న్ని వేతు క్కొడం బాగుంది.నిన్ను వింటున్నట్టు చూస్తున్నట్టు వుండి…miss you…Suhasini

  1. థాంక్స్ సుహాసినక్కా…

 3. గీతక్కా, చాలా చాలా బాగుంది.

  1. థాంక్స్ మెహమూద్ గారు

 4. మీ కవిత … ఫెమినిస్ట్ కవితలలో ‘మాస్టర్ పీస్’ ! కంగ్రాట్స్ అమ్మా !

 5. Both men n women are conditioned by their own awareness.Hence an awakened woman may not get the space to expand an alternative reality.Any thing to wakeup n maje the couple explore new world’s

 6. ప్రతి రోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీ పడుతున్న మనోవేదన, కళ్ల ముందే జరుగుతున్న మానసిక హింసను నిజమైన నిజాన్ని చాలా చక్కగా రాసారు…

 7. So powerful….but what about practicability. Everywhere the same situation. One should wait for some more time to move next level.

 8. Excellent Poem Madam, Your poem provides that ounce of courage for all those women out there who started to question the status quo of marriages/at the verge of getting out/looking to get out of what familiar but Miserable life into a life with maybe uncertainty but to be able to live independently with that bold choice they made.

Leave a Reply