నాన్నా కత చెప్పవూ

యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే. నాకు జ్ఞాపకం వున్న కతలన్నీ చెప్పాను. ఊహించి చెప్పాను. అయినా నిద్రపోడే. నాకయితే కళ్ళమీద కూర్చోనుంది నిద్ర. పొద్దున్నుండి చాకిరి చేయ డమే నా కత. నా కత ముందు మీ కతలెంత అన్నట్టు నిద్ర పోతోంది మా ఆవిడ.

కతలు వదలని యీ బాల విక్రమార్కున్ని వదిలించుకొని నిద్రపోడం దుర్లభం. ఆలోచించి ఆలోచించి అడుగు పొరల్లో దాగిన కతనొకదాన్ని బయటికి తీశాను. అమాంతం కత మొదలు పెట్టకుండా, కత అయిపోగానే నిద్రపోవాలనీ, లేకపోతే రేపటి నుండి కతలే చెప్పననీ మావానితో అన్ని రకాల ప్రామిస్ లు చేయించుకొని గొంతు సవరించుకున్నాను.

మొదటి పదం గొంతులోకి వచ్చిందో లేదో What title daddy ? అని తన కాన్వెంట్ లాంగ్వేజ్ లో అడిగాడు.

The magic paint brush అని చెప్పాను.

మాజిక్ ప్పెయింట్ బ్రష్షా? పక్కన పడుకున్నవాడు లేచొచ్చి నా రొమ్ముల మీద పడుకుని నా కళ్ళలోకి చూశాడు.

వాని కళ్లు విప్పారి విరబూసిన తెల్ల చామంతుల్లా వున్నాయి.
మధ్యలో నల్లటి గుండ్రని కనుపాపల నుండి స్వచ్ఛమైన కోటి కాంతి రేఖల పరిమళాలు నా వొంటిని హాయిగా తాకుతున్నాయి.

వాని నిశ్వాసాలు వెచ్చగా నా మొహాన్ని తాకి నన్నో అలౌకికానందానికి గురి చేస్తున్నాయి. ఆ అనుభవాన్ని అలాగే పదిలపరచుకుందామన్నంత ఆశగా వాని చుట్టూ నాకౌగిలిని కప్పి కత మొదలెట్టబోయాను.

డాడీ నా దగ్గరుందే పెయింట్ బ్రష్ అట్లాంటిదేనా ? అని అడ్డొచ్చాడు.
వానికన్నీ ప్రశ్నలే!
వానికన్నీ ఆశ్చర్యాలే!
ప్రపంచంలో ప్రతిదీ తనది కావాలనుకునే అమాయకత్వం.

అవును అలాంటిదే. వొక పెయింట్ బ్రష్. నీ యంత వయసున్న వొక boy దగ్గరుంది. ఆ boy పేరు హన్. అది మామూలు బ్రష్ కాదు. మాజిక్ బ్రష్. దాంతో యేం చిత్రించినా అది నిజమైనది అయిపోతుంది.

‘చిత్రంచినా’ అంటే? డౌట్ express చేశాడు.
యీ కాన్వెంట్ క్రియేచర్ కి మనిషంటే అర్థం గాదు. మేన్ అనాలి.

చిత్రించినా అంటే draw చేయటం. ఆ బ్రష్ దేన్ని draw చేస్తే అది real అయిపోతుంది. Elephant చేశావనుకో elephant అయిపోతుంది.

డాడీని draw చేస్తే యింకోడాడీ అయిపోతాడా? మళ్ళీ అడొచ్చాడు.

నాకు భలే నవ్వొచ్చింది… యింకో డాడీ అయిపోతాడు అన్నాను.
డాడీ డాడీ ఆ హాగానికి ఆ బ్రష్ వాళ్ళ డాడీ కొనిచ్చాడా ? అని అడిగాడు.

ఆమ్మో ….. వీడు అలాంటి బ్రష్ కోసం టెండర్ వేస్తున్నాడు. చచ్చాను. వచ్చే ప్రమాదం పసిగట్టలేదు… లేదు... వాళ్ళ డాడీ కొనివ్వలేదు.
అసలు వానికి మమ్మీ డాడీయే లేరు. వొక చెప్పుల కొట్లో పని చేసేవాడు. అప్పుడప్పుడూ యజమాని యింట్లో కూడా పనిచేయాలి. యజమాని భార్య వాన్ని యెప్పుడూ తిట్టేది. కొట్టేది కూడా. తిండి కూడా సరిగా పెట్టేది కాదు.

వొక రోజు రాత్రి హన్ దుఖంతో యేడుస్తూ… ఎవరయినా తనను తీసికెళ్ళి యే పనీ చెప్పకుండా, మంచిగా తిండి పెట్టి బట్టలూ, బొమ్మలు కొనిస్తే చక్కగా ఆడుకోవచ్చు అనుకున్నాడు.

ఆ పిల్లవానికి బొమ్మలేయడం అంటే చాలా యిష్టం కానీ white paper, colour pencils ఎవరు కొనిస్తారు ?

అలాగే యేడుస్తూ నిద్రపోయాడు. కల వచ్చింది. కలలో ఒక తాత కనిపించి ఆ పిల్లవానికి వొక మాజిక్ పెయింట్ బ్రష్ యిచ్చాడు. నీకేం కావాలంటే దాన్ని గోడమీద గానీ, పేపర్ మీదుగానీ draw చెయ్. అది నిజమైనది అయిపోతుంది. దాన్ని తీసుకొని హాయిగా బ్రతుకు అని చెప్పాడు.

కానీ యీ బ్రష్ తో ధనవంతులకీ, సోమరులకీ సహాయం చేయకు. కష్టాల్లో వున్న పేదలకి మాత్రమే సహాయం చెయ్. దీన్ని నీ చేతులతో వుపయోగిస్తేనే పని చేస్తుంది. యితరుల చేతిలో పని చేయదు. అని కండీషన్ పెట్టి disappear అయ్యాడు.

ఉదయమే నిద్ర లేచాడు హన్. ప్రక్కనే వున్న బ్రష్ చూశాడు. వానికి భలే ఆశ్చర్యమేసింది. రాత్రి కలంతా గుర్తొచ్చింది. తనకొక మమ్మీని, డాడీని, హౌజ్ ని draw చేశాడు. అవన్నీ నిజమైపోయాయి.

ఆకలితో వున్న వాళ్లు వచ్చి అడిగితే అన్నం draw చేసిచ్చాడు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు చేసిచ్చాడు. యిల్లులేనివాళ్ళకి యిల్లు చేసిచ్చాడు.
రోగాలతో బాధపడేవాళ్లకి మందులు చేసిచ్చాడు. హన్ అంటే అందరూ యెంతో యిష్టపడేవాళ్ళు.

ఆ వూరంతా తిరిగి షాపులల్లో, యిళ్ళల్లో, పరిశ్రమల్లో, కార్మాగారాల్లో చాకిరీ చేసే బాల కార్మికులనందరినీ పిలిచి వాళ్లకి కావలసినవన్నీ draw చేసిచ్చాడు.
వాళ్లకోసం వొక మంచి స్కూలు, కొట్టకుండా చదువు చెప్పే టీచర్లు, పెద్ద ప్లే గ్రౌండ్, టాయిస్ అన్నీ draw చేశాడు. వాళ్ళంతా సుఖంగా, ఆనందంగా వున్నారు. కొన్నాళ్ళు గడిచింది.

పనిచేసే పిల్లలే దొరకక ధనవంతులకి, యజమానులకి మహా కష్టాలొచ్చాయి. వాళ్ళంతా కట్టగట్టుకొని వచ్చి హన్ని కొట్టబోయారు. మిగతా పిల్లలూ, పేదలు యేకమై, వాళ్ళనందర్నీ తరిమేశారు.

మరుసటి రోజు పోలీసులొచ్చారు. వాళ్ళ వెనుకే ధనవంతులు. హన్ని పట్టుకుని బ్రష్ లాక్కున్నారు. దాన్ని సగానికి విరిచి పడేశారు. బొట బొటా రక్తం కార్చింది. బ్రష్ దాని కుంచెనుండి కన్నీళ్ళు జలజలా రాలాయి. తెగిన బల్లి తోకలా గిలగిలా కొట్టుకుంది. బాధతో.

హన్ ని అక్కడికక్కడే కాల్చి పడేశారు. వాళ్ళ యిళ్ళన్నీ ధ్వంసం చేశారు. స్కూలునీ, బొమ్మలనీ మంటలకి ఆహుతి చేశారు. మళ్ళీ పిల్లలందర్నీ పట్టుకుని పనుల్లోకి లాక్కెళ్ళారు…

నేనింకా కత ముగించకనే మా వాని కళ్ళల్లో నీళ్ళు తిరిగి వెక్కి వెక్కి యేడ్వడం మొదలు పెట్టాడు.

అయ్యో ! వూరికే వాన్నేడిపించానే అని నాకూ బాధయింది.

నిద్రబుచ్చే కతలు చెప్పలేక పోవడం నా బలహీనత.

బిడ్డల్ని డాక్టర్లుగా, యింజనీర్లుగా, బిల్ గేటట్లుగా, డబ్బు సంప యంత్రాలుగా కని పెంచుతున్న లోకంలో నా బిడ్డని తడివున్న మనిషిగా పెంచు నా తపన.

చాలా సేపు వాన్నలాగే నా రొమ్ములపై బుజ్జగిస్తూ జోగొట్టాను. నా యెద భాగమంతా వాని కన్నీళ్ళతో కాలువలు గట్టాయి. ఆ కాలువల్లోనే మొగమాన్చి నిద్రపోయాడు. అన్నింటికీ యెంతో సహజంగాస్పందించే వాని తడి యెన్నటికీ యింకిపోకుండా కన్నీటి కాలువలన్నీ తిరిగి వానిలోకి ప్రవహిస్తున్న అనుభూతితో కౌగిలిని మరింత వెచ్చగా వానినిండా కప్పాను.

(జనవరి – ఫిబ్రవరి 1999, అరుణతారలో ప్రచురితం…)

రాప్తాడు, రాయలసీమ. కవి, కథకుడు, అధ్యాపకుడు, విరసం సభ్యుడు. ఇంగ్లిష్ లిటరేచర్ లో పీజీ చేశాడు. కొంతకాలం కర్నూల్ లో లెక్చరర్ గా చేరి, అక్కడ పిల్లలపై అమలయ్యే హింస, అణచివేత సహించలేక బయటికి వచ్చాడు. 1994లో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చేరాడు. కొద్దికాలంలోని మళ్లీ రాయలసీమకు వెళ్లాడు.  బెత్తాలు,  హోం వర్క్ భారాలు, అర్థంకాని వర్ణింపుల్లేని బోధన అతని ఆశయం. పాఠశాలల్లో పిల్లలపై కొనసాగే హింసను ద్వేషించాడు. కర్నూల్ జిల్లా కథా సాహిత్యం కోసం తపనపడ్డాడు. పల్లె మంగలి కతలు, ఫ్యాక్షన్ కతలు తీసుకువచ్చాడు. రచనలు: `యేదీ యేక వచనం కాదు`(కవిత్వం), `అతడు బయలుదేరాడు` (కథలు). 9 సెప్టెంబర్ 1999లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply