నల్ల బల్ల

వందల ఏళ్లుగా ఊరికి దూరంగా
వెలివేయబడ్డ మాదిగ లందలో
ఉదయించిన నల్లపొద్దతను!

మనువు డొక్కచీరి డప్పు కట్టి
ఆకలిమంటలపై కాపి
వాడవాడల సిర్రా చిటికెన పుల్లతో
దరువేస్తున్న దండోరా శబ్దం!

నల్లమల వీచిన గాలుల్ని పసులకాడ పిల్లనగ్రోవిపొత్తిలో నింపుకొని
రేలపాటల్లో ఓనమాలు దిద్దిన
శంభూకుడతడు!

తెగ్గోయబడ్డ గొంతుకలకు
చూపుడు వేలెత్తే
జ్ఞానాయుధాన్ని అందించిన
తధాగతుడతను!

అంటరానిగాలి నేరమయినచోట
సుద్దముక్కలతో సుద్దులు బోధించే నల్లబల్లతను!

బాధల కొలిమిలో భావానికి ఫుటంబెట్టి చేతిలో
కరవాల కాలంతో
నడుస్తున్న తెలంగాణతను!

(విరసం కార్యదర్శి కాశీంపై కుట్ర కేసుకు నిరసనగా…)

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

Leave a Reply