నల్ల పూసల సౌరు గంగలో కలిసే

రాత్రి డ్యూటీ ముగించుకోని పొద్దున్నే నిద్రకళ్ళతో బస్సులో ఇంటికి బయలుదేరాను. సీటు దొరకడంతో నా ప్రమేయం లేకుండానే కునుకు పట్టింది.
నా చుట్టూ ఏదో అలికిడిగా గోలగోలగా వుంటే మెలుకువవచ్చి చూసాను.
బస్సు ఆ ఊరు బస్టాండు లో ఆగింది. బస్సునిండా జనం కితకితలాడుతున్నారు.
మనిషి దూరడానికి కూడా సందులేదు.
ఆ ఊరు ఎప్పుడూ అంతే గ్రానైట్ కార్మికులు, వ్యాపారస్తులతో నిండి నిత్యం రాకపోకలకు రద్దీగా ఉంటుంది. చాలా తక్కవ కాలంలో సాధారణ వ్యక్తులను సైతం కోటేశ్వరులుగా మార్చిన ఊరది.

గిలాక్సీపురం అంటే రాష్ట్రంలో దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు గుర్తించిన ఊరది.
ఆ రద్దీలో నన్ను తగిలీ తగలనట్టుగా ఓ యువతి నుంచొనివుంది.
అది నాకు చాల ఇబ్బందిగా వుంది. నిద్రమత్తు లో చూస్తే ఆమె అటు వైపు తిరిగి వుంది.
ఆమె ప్రక్కనే ఎనిమిదేళ్ల పాప కూడ వుంది.
ఆ పాప నన్ను ఆకర్షించింది ఎర్రగా గుండ్రని ముఖం…
ఎక్కడో చూసిన‌ట్ట‌నిపించింది.
నన్ను నిద్రమత్తు వదిలించింది.

పాపను దగ్గరకు తీసుకుంటూ ”ఇలా రామ్మా…కూర్చుందువుగానీ” అంటూ చేయిపట్టుకున్నాను.
నేను రానంటూ చెయి వెనక్కి లాక్కుంది.
”నీ పేరు ఏమిటమ్మా” అని అడిగాను దగ్గరకు వంగి
”జ్యోత్స్న” అని బిడియంగా చెప్పింది.
”ఏ ఊరు పోవాలి”…అలా మాటల్లో పెట్టాను.

అంతలో….
”బాగున్నావా సత్యన్నారాయణ….” అంటూ ప‌క్కన నుంచున్నావిడ పలకరిస్తే…అటు చూసాను.

ఆమెను గుర్తుపట్టి
ఆ…ఆ…బాగున్నాను!
”మీరు బాగున్నారా శాంతమ్మ అక్కా…”! అంటూ లేచి నిలబడ్డాను ఆమెని సీట్లో కూర్చోమని…!
”ఫరవాలేదయ్యా అమ్మాయిని కూర్చోబెట్టుకో”…!
”లేదక్కా… నువు కూడ కూర్చో”!
‘వద్దు…వద్దులేయ్యా….”! అంటూ అలాగే నిలబడింది.
” పిల్లలు ఏం చదువుతున్నారు? ఎక్కడ వుంటున్నారు?” అడిగాను.
”ఇక్కడే ఉంటున్నామయ్యా”! అంది
”జోత్స్న అచ్చం జోసఫ్ లాగే వుందక్కా. ఆ మాట్లాడే తీరు… ఆ కళ్ళు తిప్పేతీరు… నవ్వినప్పుడు”….
అలా అక్కతో పాపతో మాట్లాడుతుండగానే నేను దిగాల్సిన స్టేజీ వచ్చింది.
బస్సు దిగి వారిద్దరికి నవ్వుతూ… వీడ్కోలు చెప్పి కదిలేను కానీ,
నామనస్సు నా దగ్గర లేదు.
ఇంటికి నడుస్తున్నంత సేపు ఆ అమ్మ కూతుళ్ళే మదిలో మెదిలారు.

 • * *

మా క్వారీ లో జోసెఫ్ అనే ముప్పై ఏళ్ల సీనియర్ డంపర్ ఆపరేటర్ పనిచేసేవాడు,
స్నేహశీలి. మంచి మాటకారి కూడ.
ఆయన ప‌క్కనున్నాడంటే చుట్టూ పదిమంది ఉన్నట్టే!
ఆయన జోకులు వేయడుగానీ తను మాట్లాడే తీరే హాస్యంగా, వ్యంగ్యంగానూ ఉంటుంది.

నేను అప్పటిదాక క్వారీలో రిగ్గు (వేగన్ డ్రిల్) వేస్తూ… నైట్ డ్యూటీలో పనిలేనప్పుడు జోసఫ్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకుని డంపర్ తోలుతుండేవాడిని… అలా నేను జోసఫ్ దయవల్ల అదే క్వారీలో డంపర్ డ్రైవర్ని అయిపోయా!
క్రిష్టియన్ గా జోసఫ్ చాలా నిబద్ధతగా నిష్టగా ఉండేవాడు. ఆదివారం వస్తే ఎన్ని పనులున్నా సరే సెలవు పెట్టేవాడు.
చర్చికెళ్ళడం డ్రమ్స్ కొట్టడం పాటలు పాడడం చేసేవాడు. బైబుల్లోని నీతి వాక్యాలు సందర్భం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మాకు చెబుతుండేవాడు.

మేమిద్దరం ఒకరిళ్లకు ఒకరం వెళ్లేవారం. ఒకరి సాంప్రదాయాల్ని మరొకరం గౌరవించుకొనేవారం. కానీ ఒక్క విషయంలో మాత్రం జోసఫ్ చాలా గట్టిగా ఉండేవాడు. అది నేను గానీ… క్వారీలో మరే కార్మికుడైనాగానీ, తిరుపతికి వెళ్లి గుండు కొట్టుకొని లడ్డు ప్రసాదం తెచ్చి అందరికి పంచేవాళ్ళం. అందరూ తీసుకునేవారు కానీ జోసఫ్ మాత్రం వద్దనే వాడు, కారణం ప్రార్ధనకు పోయేవాళ్ళం తినకూడదనేవాడు. అదేమిటి మీ ఫలహారం మేము తింటున్నాం కదా నువ్వెందుకు తినకూడదని చాలాసార్లు వాదించాం.
అయినా ఫలితం లేకుండ పోయింది.

క్వారీలో యాజమాన్యానికి చాలా అనుకూలంగా జోసఫ్ ఉండేవాడు. సహజంగా పెద్ద బండి డంపర్ తోలే డ్రైవర్లు, కారు, స్టాఫ్ బస్సుల లాంటి చిన్న బండ్లు తోలరు. ఎందుకంటే వాటికి సపరేట్ డ్రైవర్లు ఉండేవారు. కానీ, జోసఫ్ అన్ని బండ్లు తోలేవాడు. ఎవరు చెప్పినా కాదనడు.

వ్యక్తిగతంగా జోసఫ్ను ఎవరు అవమానించరు. ఎరుపు రంగుతో గుండ్రని ముఖంలో ఉంగరాల జుట్టుతో మనిషి ఎప్పుడు సుభ్రంగా నీటుగా ఉండేవాడు. ఎప్పుడూ ఇస్త్రీ బట్టలే వేసేవాడు. వీటన్నికి మించి మంచి డ్రైవర్. అది ఏ రకం బండైనా ఈజీగా నడపగలడు. తన పదిహేనేళ్ళ డ్రైవింగ్ ఫీల్డులో ఒక్క యాక్సిడెంటు కూడా చేయలేదని చాల గర్వంగా చెప్పుకునేవాడు.

నైట్ డ్యూటీలయితే రాత్రి తొమ్మిది గంటలకు అన్నం తిని కాసేపు బయట బండలు మీద కూర్చునేవాళ్ళం. ఆ అరగంటలో ఆయన మాటలతో, పాటలతో సరదాగా గడిపేవాళ్ళం,

ఒక రోజు యేసు క్రీస్తు పాటలు పాడితే… మరొక రోజు ‘హరిశ్చంద్ర’ పద్యాలు పాడేవాడు.
ముఖ్యంగా ‘కాటి సీను’ లోని జాషువా రాసిన ”ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలోకలిసే…”
ఆ నాలుగు లైనులను పదే పదే రిపీట్ గా పాడించుకునేవాళ్ళం.
అప్పటిదాక సత్య హరిశ్చంద్ర నాటకం పైన, ఆ పద్యాలపైన నాకున్న ఒక దురాభిప్రాయం ఆ రోజుతో గంగలో కలిసింది.

 *     *      *

క్వారీలో ప్రొడక్షన్ పెరగడం లేదనీ ఓనర్ నుండి వత్తిడి పెరుగుతుంది. ఉత్పత్తి ఎలా పెంచాలి, లేకుంటే ఖర్చులు ఎలా తగ్గించాలనే చర్చ యాజమాన్యం చేస్తుంది. ఆ క్రమంలో కార్మికుల మీద వత్తిడి పెరుగుతుంది. కార్మికులతో నిర్భంధంగా పని చేయించాలి.
అది పని గంటలతో సంబంధం లేకుండా చెప్పిన పని చేసేవారినే క్వారీలో ఉంచుకోవాలి. లేకుంటే ఏదోక కారణం చూపి ముందుగా మెమోలిచ్చి, ఆ తర్వాత ఉద్యోగం నుండి తొలగించాలనీ మేనేజమెంట్ తీర్మానించారు. అలా ఒక్కొక్కరిని ఏరి… ఏవేవో కారణాలతో ముప్పైఅయిదు మంది కార్మికులను తొలగించారు. కార్మికుల డ్యూటీ కి వచ్చిన దగ్గర నుండీ చేసే పనికంటే ఇన్చార్జీలను చూచి భయపడాల్సివస్తుంది. ఎక్కడ ఏ తప్పులు వెతికి మెమోలిస్తారోనని భయపడాల్సివస్తుంది. వీలైనంత వరకు వారికి కనబడకుండా బతకాల్సివస్తుంది.

ఒక రోజు కారు డ్రైవర్ సెలవులో వుంటే మా డంపర్ డ్రైవర్ శివ కారు నడుపుతూ ఊళ్లో యాక్సిడెంటు చేసారు. ఒక వ్యక్తి మరణించాడు. శివ యాక్సిడెంటు చేసి ప్రాణ భయంతో కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. పోలీసు కేసయ్యింది. చనిపోయిన కుటుంబానికి కంపెనీ నష్టపరిహారం ఇవ్వాల్సివచ్చింది.

ఆ కోపంతో యాజమాన్యం శివ కోసం వెతికారు. కానీ జాడ లేదు. చివరకు ఎలాగోలా శివ ఆచూకీ కనిపెట్టి స్టేషన్ లో లొంగిపొమ్మని యాజమాన్యం మమ్మల్నిఅభ్య‌ర్థించింది. శివ జాడ తెలుసుకొని మాట్లాడి ఒప్పించి స్టేషన్లో లొంగిపోయెట్టుగా చేశాము. షూరిటీగా మేము సంతకాలు పెట్టాం. కానీ, యాజమాన్యం కక్ష గట్టి శివ ని కంపెనీ నుండి తొలగించారు.

కేసులో వున్న డ్రైవర్ని తొలగిస్తే జీతం లేకుండా అతను ఎలా బ్రతకాలి… కోర్టు వాయిదాలకు ఎలా తిరగాలి… శివ ని ఉద్యోగంలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని మేము నిలదీశాం.

యాజమాన్యం మొండిగా వుంది. చివరకు ఎన్ని చర్చలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఒకరోజు మెరుపు సమ్మె చేశాం. సాయంత్రానికి కొందరు మధ్య‌వర్తుల ద్వారా చర్చలు జరిగాయి. ఉద్యోగం నుండి తొలగించిన శివ ని డ్యూటీలోకి తీసుకున్నారు.

ఈ సంఘటన తరువాత కార్మికులపై మరింత వత్తిడి పెరిగింది. ప్రత్యేకంగా ఆ సమ్మెకు నాయకత్వం వహించిన మా మీద నిఘా, వత్తిడి పెరిగింది. నన్ను డంపర్ సెక్షన్ నుండి తొలగించి ఇదివరకటి పని రిగ్గు (వ్యాగిన్ డ్రిల్) వేయమన్నారు. అలా ఒక్కక్కరికి విపరీతమైన వత్తిడి పెంచుతున్నారు.

ఇలాంటి సమయంలో కూడా…. అలాంటి వత్తిలో కూడా…. జోసఫ్ చాలా కూల్ గా పని చేసుకుపోతుండేవాడు.
ఎప్పటిలాగే సరదాగా కబుర్లు చెబుతుండేవాడు. ఆ మధ్య ఆర్.టి.సి.లో డ్రైవర్లకు పోస్టులు పడ్డాయనీ… నిన్ననే వెళ్లి అప్లికేషన్ పెట్టివచ్చానని….ఈ సారి గ్యారంటీగా పోష్టు కొట్టేస్తానని చెప్పాడు.

అది డిసెంబర్ నెల కావడంతో చలితో పాటు వర్షాలు పడుతున్నాయి. క్వారీలోకి నీళ్లు చేరి పనులు సాగడంలేదు.
క్వారీ గుంతలోకి నీరు చేరితే పంపుల ద్వారా బయటకు కొడుతున్నారు.

ఒక రోజు జోసఫ్ నాతో మాట్లాడుతూ “దేవుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చినా…. ఏ కొదువలేకుండా చేసాడు సత్యనారాయణ… ఆయన దయవల్ల క్రిస్మస్ కి పిల్లలకు, మా ఇద్దరికీ బట్టలు తీసాను” అని చెప్పాడు.
అచ్చంగా ఇద్దరూ ఆడపిల్లలని కాస్త బాధపడేవాడు.

అలా ఏ వత్తిడికి లోనుగాకుండ పని చేసుకుపోయే జోసఫ్ అంటే నాకు చాలా ముచ్చటేసేది.

ఆ రోజు ఎప్పటి లాగే నైటు డ్యాటీకి వచ్చిన జోసఫ్ ను ఐదున్నరకు స్టాఫ్ ను వదిలి బస్సును తీసుకురావడానికి వెళ్లి వచ్చిన జోసఫ్ ను పంపారు.
ఆరున్నరకు బస్సును తీసుకొని వచ్చాడు.
మేమందరం ఆరుగంటలకే డంపర్లు తీసుకొని పిట్ లోకి వెళ్లాము.

పైనే వున్న ముగ్గురు ఇన్చార్జీలు జోసఫ్ ను త్వరగా డంపరు తీసుకొని పిట్టు లోకి పొమ్మని… లోడింగ్ పెట్టాలనీ తొందరచేసారు.
అలా డంపర్ తీసుకొని లోపలికి వచ్చిన జోసఫ్ లోడింగ్ పాయింట్ రెడి కాకపోవడంతో డంపరుకు హ్యాండ్ బ్రేక్ వేసి ర్యాంపులో బండిని ఆపి ఎప్పటిలాగే…అలా కిందికి దిగాడు.
హ్యాండ్ బ్రేక్ వేసిన డంపరు టైర్ల కింద‌ రాళ్లు పెట్టక పోవడంతో బండి ముందుకు కదులుతుంది.
గమనించిన జోసఫ్ బండి ఎక్కి ఆపే ప్రయత్నం చేసాడు.
ఇంజన్ స్టార్టింగ్ లో లేకుండా ఆఫ్ లో వున్నప్పుడు బ్రేకులు స్టీరింగ్ పని చేయలేదు, ఇంజను స్టార్ట్ కాలేదు.
ప‌క్కనే చూస్తున్న మేమంతా అరుస్తూనే ఉన్నాము.

బండి అలా కదులుతూ…. ఊపందుకొని ర్యాంపు మార్జిన్ లో పెట్టే రాళ్లను సైతం ఢీ కొట్టింది.
ఒక్క నిమిషంలోనే మేమందరం చూస్తుండగానే దాదాపు వందడుగుల ఎత్తు నుండి లోపల క్వారీ గుంతలో పడి మునిగిపోయింది.
డంపర్ తో పాటు జోసఫ్ కూడా జల సమాధి అయ్యాడు.

ఈ హఠాత్ పరిణామానికి నాకు గుండె ఆగినంత పనయ్యింది. పరుగెత్తి కెళ్ళి జోసఫ్ ను కాపాడగలమేమో అనే ఆశతో ఆ బురదలో, రాళ్లల్లో నడిచి యాబై అడుగుల లోతు నీళ్లలో వెతికాము.
కరెంటు తీగలు తెగి, గాడాంధకారంలో సెల్ ఫోన్ లైటుతోనే వెతికితే…. డంపరు మునిగిన చోట నల్లగా తెట్ల తెట్లగా తేలి కనబడే ఆయిల్స్ తప్ప మరే జాడలేదు.
ఎర్రి కేకలు వేస్తూ… దుఃఖంతో అరుస్తూ ఏదైనా చేయాలనీ, చివరకు ఏమి చేయలేక కాపాడలేక, అంతలోతు నీళ్లలో దిగే సాహసం చేయలేక నిస్సహాయులు మిగిలిపోయాం.

జోసఫ్ ఎంత సీనియర్ డ్రైవర్, బండి అంత దూరం ప్రయాణం చేసి ఆగనప్పుడు వదిలేసి బండిలోంచి దూకి ప్రాణాలు రక్షించుకోకూడదా!
అంత కాన్ఫిడెంట్‌గా బండిని ఆపే ప్రయత్నం ఎందుకు చేశాడు.

తనకు గట్టి నమ్మకం… బండిని తను ఎలాగైనా అదుపు చేయగలనని, తను దూకి బండిని వదిలేస్తే బండి కి ఏమైనా కావచ్చు,
అయినా తన చేతిలో స్టీరింగ్ ఉండగా బండి తనది కాకుండా ఎలా పోతుంది.
త‌న వ‌ల్ల‌ కంపెనీకి ఎలాంటి నష్టం జరగకూడదు. ఆ ఉద్దేశంతోనే బండిని అదుపుచేసే ప్రయత్నాలు చేసి… చివరకు తన ప్రాణం మీదికి తెచ్చుకంటున్నారు.

ఇలా ఎన్నో ఆలోచనలు ముసిరాయి నాకు…. దుఃఖం పొంగుకొస్తుంది.

వెంటనే ఫోన్ తీసి జోసఫ్ ఇంట్లో వాళ్లకి చెప్పాలన్నా…. దైర్యం చాలలేదు. వాళ్లింటి దగ్గర మిత్రుడికి ఫోన్ చేస్తూ బావురమంటూ ఏడ్చాశా…?

ఈ వార్త తెలియగానే బంధువులు గ్రామస్తులు క్వారీ దగ్గరకు వచ్చారు. వారికంటే ముందే పోలీసులు వచ్చారు.
సంఘటనా స్థలానికి ఎవరినీ రానీయకుండా అడ్డుకొని బెదిరిస్తున్నారు.

రెండు ప్రొక్లయిన్ల సాయంతో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి ఎలా గోలా నీళ్లలో నుండి డంబర్ ను పైకి లాగారు.
కానీ అందులో జోసఫ్ లేడు. నీళ్ల లోనే ఉండిపోయాడు.
రెండు ఇంజన్లతో నీళ్లు బయటకు తోడేస్తున్నారు.
నీళ్లన్ని పోయాక తెల్లారిన తర్వాత వెతుకులాటనీ…. పోలీసులు చెప్పారు.
ఆ రాత్రంతా మేమంతా నీళ్లు తోడే పనిలో ఉండిపోయాము.

తెల్లారింది ఇంకా చాలా నీళ్లు ఉన్నాయి. చుట్టు ప్రక్కల క్వారీ వాళ్లు పనులు ఆపేసి మా క్వారీ చుట్టూ మూగారు.

పది మంది గజ ఈతగాళ్ళను తెప్పించి గాలింపు చేపట్టారు. బురద, పెద్ద పెద్ద రాళ్ల గుట్టల్లో నీళ్లతో మునిగిపోయి ఉండడంతో
గాలింపు కష్టమవుతున్నాయి.
మధ్యాహ్నం రెండు గంటలకు బాడీ దొరికింది… చేతులు రెండు ముందుకు వచ్చి కాళ్లు కూడ వంగిపోయి అచ్చం డ్రైవర్ పొజిషన్ లాగానే నీలుక్కుపోయాడు జోసఫ్.
నీళ్లల్లో నుండి రాళ్ళు తప్పించుకుంటూ ఒడ్డుకు తీసుకువచ్చారు బాడీని.

వెంటనే పిట్ లోనుండి పోలీసులు పోష్టు మార్టం అంటూ బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకొని ఆఫీసు దగ్గర బండిని ఆపమన్నాం.

బాలింతరాలైన భార్య శాంతమ్మతో… సహా బంధువుల రోధనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.
చుట్టు ప‌క్క‌ల‌ కార్మికులందరు అక్కడ మూగారు.

అంత మందిలో శాంతమ్మ నన్ను పట్టుకుని ఏడుస్తూ… “చెప్పు సత్యనారాయణ అసలేం జరిగింది? ఆయన ఎందుకు అలా చనిపోయాడు. ఎందుకు ఆయనకు ఇలా జరిగింది? ఎవరికి అపకారం చేసేవాడు కాదే… దేవుడు ఎందుకు మాకు అన్యాయం చేశాడు. రోజా డ్యూటీకి వచ్చేటప్పుడు నాకు చెప్పి వ‌చ్చేవాడు. రాత్రి చెప్పకుండానే వచ్చాడు” అంటూ నెత్తినోరు బాదుకుంటుంది.

అలా జోసఫ్ గురించి ఆమె మాట్లాడుతుంటే….ఆమెకు ఎలా నచ్చ చెప్పాలో…. ఎలా ఓదార్చాలో తెలియలేదు నాకు.

నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా కంపెనీ ఇన్చార్జీల వత్తిడి వల్లే అలా జరిగింది. అస్తమానం వాళ్లు వెంటబడి తరమటం వల్లే ఇలా జరిగింది. ఈ ప్రైవేటు సంస్థలో ఉద్యోగమే ఇలాంటిది.
కార్మికుల సంక్షేమం వదిలేసి కంపెనీ సంక్షేమమే చూడమంటుంది.
ప్రభుత్వం, కార్మిక చట్టాలు అన్నీ గనుల యజమానులకే ఉపయోగపడుతున్నాయి.

ఇక్కడి సంగతులు, మా బాధలు శాంతమ్మకు ఎలా చెప్పాలి.

ఈ స్ధలంలోనే రాత్రి పూట డ్యూటీ లో భోజనాలు అయ్యాక మేమంతా కూర్చొన్నప్పుడు జోసఫ్ పాడే ‘హరిశ్చంద్ర’ కాటిసీను పద్యం
”ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసే..”
నిజంగానే శాంతమ్మ నల్లపూసల సౌరు ఈ రోజు గంగలో కలిసింది.

క్వారీ యాజమాన్యం పూర్తిగా పోలీసుల మీద ఆధారపడ్డారు.
ఏమైన గొడవలు జరుతుందేమోనని పోలీసులు అందర్ని చెదరగొడుతున్నారు.

“అయ్యా చిన్న పిల్లలున్నారు ఏమైనా సాయం చెయ్యండయ్యా! అరవై సంవత్సరాలకు ఎవరైనా రిటైర్డ్ అవుతారయ్యా కానీ వీడు ముప్పై ఏళ్లకే జీవితం నుండి రిటైర్డ్ అయ్యాడయ్యా…. ఏదన్నా సాయం చెయ్యండయ్యా” అంటూ బంధువులు అడుగుతున్నారు.

గనులను తవ్వుకుంటూ కోట్ల వ్యాపారం చేస్తున్న యాజమాన్యం పోలీసు అండ చూసుకొనీ, లక్షనీ, రెండు లక్షలనీ బేరసారాలకు దిగారు.
వాళ్ళ పోకడలు చూస్తుంటే జోసఫ్ కుటుంబ పసిబిడ్డలకు అన్యాయం జరిగేటట్లు కనిపిస్తుంది.

ఆ క్వారీ కార్మికులుగా మమ్మల్ని మాట్లాడనీయడం లేదు. పోలీసులు ముందు మాట్లాడే పరిస్థితి లేదు.
మా శక్తి చాలడం లేదు. పైగా స్థానిక నాయకులు దళారీలు కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడి ఎంతో కొంత ఇచ్చి రాజీ కుదుర్చబోతున్నారు.

మేము మా యూనియన్ నాయకుడ్ని తీసుకొచ్చాము. ఆయన అందరినీ సమన్వయం చేస్తూ ఆయన మాట్లాడితే యాజమాన్యం అంగీకరించలా!
పోలీసులు జోక్యం చేసుకొనీ యాజమాన్యం కుటుంబ సభ్యులు మాత్రమే మాట్లాడుకోవాలనీ ఇతరులు జోక్యం వద్దని బెదిరిస్తున్నారు.

కార్మికులందరు ఆగ్రహంతో… “ఇందులో మీ జోక్యం ఏమిటనీ” పోలీసులను ఎదిరించారు.
తోటి కార్మికుడికి జరిగిన అన్యాయం పై మేము మాట్లాడకుండా ఎలా ఉంటామనీ, ఇందులో మీ జోక్యం వద్దని అందరం చుట్టుముట్టే సరికి ఎస్ఐ వెళ్లి ఒక రూములో కూర్చున్నడు.

న్యాయమైన నష్ట పరిహారం ఇచ్చే వరకు బాడీని కదలనీయ్యమని అందరం అక్కడే ఆందోళన దిగి కూర్చున్నము.
లాఠీచార్జి చేసి బాడీని బయటకు పంపాలని ఎస్ఐ మరింత మంది పోలీసులను తెప్పించాడు.
జోసఫ్ కుటుంబ సభ్యులు సహకారంతో కార్మికులందరు ఆందోళనకు గట్టిగా నిలబడడంతో యాజమాన్యం దిగిరాక తప్పలేదు.

ఇన్సురెన్స్, పి.ఎఫ్ తో కలిపి మొత్తం నాలుగు లక్షలు సెటిల్మెంట్ కుదిరింది.

పోష్టు మార్టం తతంగం ముగిసి, ఇంటికి తీసికెళ్ళి అంత్యక్రియలు ముగిసే సరికి ఆ రాత్రి చాలా పొద్దుపోయింది.

జోసఫ్ జ్ఞాపకాలను, తన ఇద్దరు చిన్న పిల్లలను తలచుకుంటూ… విషాదంతో ఇంటికి వెళ్లాం.

తర్వాత కొన్నాళ్లకి…


ఇన్సూరెన్స్‌ డబ్బులు వచ్చాయని కంపెనీ కబురు పెట్టమంటే శాంతమ్మక్క పుట్టిల్లు వెతుక్కుంటూ వెళ్లాను.

జీవచ్ఛ‌వంలా వున్న ఆమెను చూసే సరికి గుండె బరువెక్కింది. నన్ను చూసి బోరుమని ఏడ్చింది. నాకు కన్నీళ్లు ఆగలేదు, ఆమెను ఆ స్ధితిలో చూడలేక…వచ్చిన విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పి తిరిగి ప్రయాణమయ్యాను.

పుట్టింది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, చవటపాలెం. తాను ప‌నిచేస్తున్న‌చోట స‌హ‌చ‌ర కార్మికుల జీవితాల‌ను క‌థ‌లుగా మ‌లుస్తున్న‌క‌థ‌కుడు. ప్ర‌స్తుతం మైనింగ్ ఫోర్ మ‌న్ గా ప‌నిచేస్తున్నాడు.

One thought on “నల్ల పూసల సౌరు గంగలో కలిసే

Leave a Reply