నల్లమల

కల్లపెల్ల ఉడుకుతున్ననల్లమలా
కళ దప్పి పోనున్నద బతుకెల్లా

నింగి కొనల తాకె పచ్చని చెట్లు
పక్షి పిల్లల దాపు వెచ్చని గూళ్లు
ముద్దుమోముల సూపే నీటి చెలమల్లు
గొంతుల్ల తడిపేటి దోసిట్ల నీళ్లు
కొమ్మల్ల వూగేటి కోతుల వుయ్యాల
కొండెంగ మర్నాగుల కొత్తొత్త విద్దెలు
చారల పెద్దపులి నడక జోరుదారి
ఆకలికే వేట నీతి దప్పదే పూట
తల్లేనుగెంట గున్న గునగున పరుగు
అంబారి బలశాలి ఏనుగెక్కిన గొప్ప

ఏ యవ్వారమున కివి యమశరల పడునో
ఏ రాక్షసానికివి ఆహారమగునో॥

గగన సూర్యుడు కిరణాలు గుప్పించు
వరుణ దేవుడు వానలతో విహరించు
గాలి పరవశంచి మేను నాయిగ వూపు
సుక్కలు మిలమిల నేలరాళ్లు తళతళ
వంకలు డొంకలు వాలులు ఎత్తులు
దుప్పులు జింకలు దృష్టి తిప్పనియ్యవు
తేనెటీగల పుట్ట తూనీగల వేట
వంకర టింకరల మట్టిగంధాల బాతలు
యిప్పపూల సారం ఈత తాటి పానకం
ఆకులలములు నమిలిన ఆయుష్షు మాన్ భవ

చీలినా వెదురుతో
వేణువైన నేల
అణువులెవ్వరి పాశమో॥

కొమ్ముబూరల నూదే గానాలు
చెట్టు పుట్టల తిరిగే పానాలు
విల్లంబుల వీర ప్రతాపాలు
డిల్లం బల్లెం చిందు విన్యాసాలు
శ్రమస్వేదంల పులకించే దేహాలు
యాపారం తెలియని మానసాలు
కలోగంజో తాగే సంతృప్తులు
కళలు నేర్వని కళాకారులు
వెర్రితలల ఆధునికతకు ఆమడ దూరాలు
అభివృద్దికి అంటరానివారు

గోండు చెంచు సంస్కృతులు
తోడి పారేస్తారంట
యురేనియం మంటబెట్టి
చలి కాచుకుంటరంట॥

ఏది అవలోకన? ఏది ఆచరణ?
ఏది విధ్వంసం? ఏది వినిర్మాణం?
ఏది పాపం? ఎవరికి శాపం?
ఎవరు ఏ పక్షం? ఎందుకెందుకా పక్షం?
పాలితులెటు? పాలకులెటు?
ప్రకృతి మెడల విస్ఫోటన దండ
చరిత్రలు మాయం వికృతాల నిలయం
పంచభూతాలకు ప్రాణగండాలు
జీవరాసులన్ని జీవచ్ఛవాలు
అణుబాంబులతో ఆటాడుతరట

శ్రీశైల మల్లన్న నడుగు
మూడో కన్ను
చిరుత పంజాదెబ్బ
మనసున పెట్టు॥

జననం: సిద్ధిపేట. విశ్రాంత ఉపాధ్యాయుడు. రచనలు: 'గోరుకొయ్యలు', 'పట్టు కుచ్చుల పువ్వు', 'విరమించని వాక్యం' (కవితా సంపుటాలు). మంజీరా రచయితల సంఘం సభ్యుడు.

Leave a Reply