నల్లమల గుండెలపై అణుకుంపటి

నల్లమల అడవి గుండెపై అణు కుంపటి రగులుతోంది. అడవి బిడ్డల మెడకు బిగిసేందుకు యురేనియం ఉరి పొంచి ఉన్నది. అడవినీ, అటవీ సంపదనీ కొల్లగొట్టేందుకు సామ్రాజ్యవాద మల్టీనేషనల్‌ రాబందులు వాలుతున్నయి. డిబీర్స్‌ వజ్రాల వేటగాళ్లు, యురేనియం తలారీ దళారీగాళ్లు, రాజకీయ రాకాసులు కలిసి నల్లమలను వల్లకాడుగా మార్చేందుకు సిద్ధమైండ్రు. అక్కడి వన సంపదనూ, భూగర్భంలోని అపారమైన ఖనిజ నిక్షేపాలను తవ్వుకొని నల్లమలను బొందల గడ్డగా మార్చి ఏమార్చే పనిలో పాలక వర్గాలు పావులు కదుపుతున్నయి. దీంతో తరతరాలుగా అడవినే నమ్ముకుని బతుకుతున్న చెంచుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నయి. అడవిని వదిలి అరక్షణమైనా బతకలేని మూలవాసులు వాళ్లు. ఈ యురేనియం తవ్వకాలు జరిగితే నల్లమల జనమంతా ఊపిరాడక ప్రాణాలొదులుతరు. అడవి, చెట్లు, పుట్టలు, వాగులు, వంకలు, సెలయేళ్లు, సమస్త జీవరాసులు చరిత్ర పుటల్ల కలిసిపోతయి.

ఎక్కడ ప్రకృతి పచ్చగ కన్పిస్తే అక్కడ మల్టీ నేషనల్‌ రాబందుల కన్ను పడ్తది. వాటి కన్నుపడినంత మేరా అగ్గి అంటుకున్నట్టే ఇక. ఇప్పుడు ఆ కన్ను నల్లమల అడవులపై పడింది. అందినంత మేరా దోచుకుని, అగ్గిపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ మట్టికాళ్ల మహారాక్షసి కళ్లు అమ్రాబాద్‌ ప్రాంతంపై పడ్డయ్‌. అమ్రాబాద్‌ ప్రాంతం ఇప్పుడు ఆగమవుతున్నది. చెంచుల గుండె నిండా దిగులే. వాళ్లు మరణపు అంచున నిలబడి ఆర్తనాదాలు చేస్తున్నరు. వాళ్ల గుండెగోసనెవరూ పట్టించుకుంటలేరు.

యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అన్ని అనుమతులూ ఇచ్చింది. ఇప్పుడు పచ్చని అడవుల్లోకి భారీ యంత్రాలు రాబోతున్నయి. బుల్డోజర్‌లు, స్టోన్‌ క్రషర్‌లతో పర్యావరణం ప్రాణం తీసేందుకు ప్లానేసిండ్రు. ఎక్స్‌ప్లోజివ్‌ బాంబుల మోతల్ల నల్లమల దద్ధరిల్లనున్నది. తవ్వకాలు మొదలైతే అక్కడ పక్షుల కిలకిలా రావాలుండవు. పాలపిట్టల పాటలుండవు. నెమళ్ల నాట్యముండదు. లేళ్లు, జింకలు, దుప్పులు, పులులు కనుమరుగయితయి. అడవి మల్లెల పరిమళాలుండవు. మోదుగు పూల మెరుపులుండవు. పచ్చని అడివంతా అగ్గిపాలయితది. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ కాలుష్య కోరల్ల చిక్కి విలవిల్లాడుతది. విల్లంబులతో వేటాడే చెంచులు ఆనవాళ్లు లేకుండ పోతరు.

దేశాన్ని నిలువునా తాకట్టుపెట్టే రాజ్యం బహుళజాతి సంస్థల లాభాల కోసం దళారీగ మారింది. రాజ్యానికి ప్రజలతో, ప్రజల సంస్కృతి, చరిత్రలతో ఏమాత్రం పనిలేదు. దానికి కావాల్సింది పెట్టుబడి. లాభాలు. తరతరాలుగా నల్లమలతో సహజీవనం చేస్తున్న చెంచుల బతుకుల్లో చీకట్లు నింపుతున్నది. నల్లమల అడవుల్లోంచి చెంచులను తరిమేందుకు టైగర్‌జోన్‌ పేరుజెప్పిండ్రు. పులుల రక్షణ కోసం గొంతులేని అమాయక చెంచులను వాళ్ల భూముల నుంచి బేదఖల్‌ చేసిండ్రు. టైగర్‌జోన్‌ కథ ఒడిశిందిప్పుడు.

ఆదివాసీల భూములపై ఇతరులెవరికీ హక్కు లేదన్న చట్టాలను రాజ్యం గంగల కలిపింది. ప్రజల హక్కుల్ని, ప్రాణాల్ని కాపాడాల్సిన న్యాయస్థానాలు ఇప్పుడు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నయి. ఆదివాసీల కాళ్లకిందున్న ఖనిజ సంపదను దళారీలకు దోచిపెట్టే కుట్రలకు తెరలేపింది రాజ్యం. ఆదివాసీలంతా అడవుల్ని ఖాళీ చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. అడవుల్ని దశలవారీగా ఆక్రమించేందుకు ఏసిన ఎత్తుగడ ఇది. ఈ తవ్వకాలు మొదలైతే అంచెలంచెలుగా అడవుల్లోకి సైన్యాన్ని దించుతది. సైన్యం పహారాలో మల్టీ నేషనల్‌ కంపెనీలు నల్లమలను కబళిస్తయి. అక్కడ పెను విధ్వంసాన్ని సృష్టిస్తయి. వందల ఏండ్ల దాకా అక్కడ గడ్డిపోచ కూడా మొలవదు.

నల్లమలలో సుమారు 83 చదరపు కిలోమీటర్ల అడవిని విధ్వంసం చేసేందుకు అధికారులు సిద్ధమైండ్రు. నాలుగు వేలకు పైగా బోర్లు వేసి యురేనియం ఖనిజాన్ని తవ్వేందుకు కేంద్ర అణు ఇంధన శక్తి సంస్థ అడుగులు వేస్తున్నది. వాస్తవానికి 1995 నుంచే నల్లమలలో యురేనియం కోసం అన్వేషణ మొదలైంది. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) నల్లగొండ జిల్లా దేవరకొండ పరిధిలోని కృష్ణా పరీవాహక ప్రాంతమైన పెద్దగట్టు వద్ద అటవీ ప్రాంతంలో అన్వేషణ సాగించింది. ఈ ప్రాంతంలో 18వేల టన్నుల యురేనియం ఖనిజం ఉన్నట్లు గుర్తించింది. దేవరకొండ రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని దేవరకొండ, చందంపేట, పెద్ద అడిశర్లపల్లి, నేరేడుగొమ్మ ప్రాంతాల్లో యూసీఐఎల్‌ అధికారులు నిక్షేపాలను గుర్తించిండ్రు. 2000-2003 వరకు పలుచోట్ల తవ్వకాలు జరిపి యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు కేంద్రానికి సమాచారం పంపిండ్రు.

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి, ముదిగొండ పరిధిలో 200 ఎకరాలు, చందంపేట మండలం చిత్రియాల, పెద్దమునిగల్‌ గుట్టల్లో 2500 ఎకరాలు, పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం, పెద్దగట్టు పరిసర గ్రామాల్లో 210 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు అప్పట్లో కనుగొన్నరు. యురేనియం కోసం తవ్వకాలు చేపడితే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కృష్ణా జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించిండ్రు. దీంతో స్థానికులు ఆ తవ్వకాలను అడ్డుకున్నరు. 2003 ఆగస్టులో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఆర్‌పీ సిసోడియా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిండు. ఈ ప్రయత్నాలను ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకించిండ్రు. 2005లో శేరిపల్లి వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిండ్రు. ఇట్లాంటి ప్రజావ్యతిరేక చర్యల్ని మావోయిస్టు పార్టీ వ్యతిరేకించింది. అధికారులను హెచ్చరించింది. దీంతో వెనక్కి తగ్గిండ్రు.

ఆ కాలంలనే రాజ్యం నల్లమలలో నెత్తురు పారించింది. మావోయిస్టులే టార్గెట్‌గా నల్లమలను జల్లెడ పట్టింది. రాజ్య రక్తదాహానికి ఎందరో విప్లవకారులు అమరులైండ్రు. నల్లమలలో విప్లవోద్యమం వెనక్కి తగ్గింది. దీంతో రాజ్యానికీ, సామ్రాజ్యవాద మల్టీనేషనల్‌ కంపెనీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అమ్రాబాద్‌ ప్రాంతంలో అగ్గిపెట్టేందుకు రంగం సిద్ధమయింది. ఈ తవ్వకాలతో అమ్రాబాద్‌ మండంలోని బీకే ఉప్పునూతల, మారేడు, ఉడిమిళ్ల గ్రామాలకు అత్యధికంగా యురేనియం ప్రభావం పడనుంది.

అక్కడ ఎవరిని కదిలించినా కన్నీళ్లే. వాళ్ల కళ్లల్లో విషాదఛాయలు. పసిపిల్లల కళ్లల్లోనూ వెలుగు లేదు. విలపిస్తున్న వృద్ధులు, మహిళలు, యువకులు… ఊపిరి పోయినా ఈ జాగనిడిసేది లేదంటున్నరు. నల్లమలను కాపాడుకుంటమనే ఆశే ఆ కళ్లనిండా.

పొక్కిలైన నేలపై నిలబడి 55 యేండ్ల చెంచు మహిళ మంగ్లి అంజమ్మ మాట్లాడుతున్నది. ‘మాకు ఆదార్ కారట్లేదు. ఏం లేదు. కారటడిగితె రేపిత్తం, మాపిత్తం అంటుర్రు. ఆదార్ కారట్లేదని బియ్యమిత్తలేరు. ఏం తిని బత్కాలె? ఇగో మా చెంచోళ్లందర్ని ఈన్నించి బలంతంగ ఎల్లగొడ్తరట. మీమెందుకు వోతం? ఇది ఆనయ్య జాగీరా? మమ్ముల ఈన్నించి లేపనీకి ఆడెవడు?’ అంటూ బురద పాదాల్తో నడుచుకుంటూ పోయింది.

భుజాన గొడ్డలితో అడవి నుంచి వస్తున్న మగావత్ లింగమ్మ అనే లంబాడీ మహిళను కదిలిస్తే… ‘మా బత్కేదో మీం బత్కుతున్నం. ఆల్ల కండ్లల్ల అగ్గివెట్టినట్టయితాందేమొ. మమ్మల ఈ జాగ నించి ఏడికో పొమ్మంటె మీమెందుకు వోతం? ఈ గొడ్డలి ఏం జేత్తదో తెల్సా?’ అని యుద్ధానికి సిద్ధమన్నట్టు చూసింది.

‘మా ఓట్లతోటి గెల్సినోడు మమ్ముల్నే అడివిల్నించి ఎల్లిపొమ్మంటాండు. గిదేం నాయం? ఈ అడివి వానయ్య జాగీరా? మమ్ముల ఎల్లగొడ్తాన్కి వానికేం అక్కున్నది? ఈ అడివి మాది. ఈ చెట్లు మాయి. మా తాత ముత్తాతల సంది ఇక్కన్నే ఉంటన్నం. ఈన్నే సస్తం. ఈ అడవిల్నే మా బత్కున్నది. ఈ అడివే మాకు కన్నతల్లి. మా తల్లినొదిలిపెట్టి మేమేడికి పోవాలె? ఎట్ల బత్కాలె? అడివి లేకుంటె మేం బత్కుతమా? వాడిచ్చే లచ్చలొద్దు. వాని ఉజ్జోగాలొద్దు. సర్కారోల్లొచ్చి బలంతంగ ఎల్లగొట్టినా ఈన్నించి కదలం. ఈన్నించి ఏడికి తోల్కపొయినా ఒక్కరోజు సుత ఉండలేం. టెంక పోలీసోల్లొచ్చినా ఈన్నించి కదిలేది లేదు. రడం జేసుడు మాకేం కొత్తగాదు. ఈడ అన్నలున్నపుడు సర్కారోల్లకు శెమ్టలు బట్టినయ్‌. ఒనికిర్రు. ఆల్లున్నప్పుడు ఈ జాగల ఎవడు అడుగుబెడ్తానికి దైర్నం జెయ్యలేదు. ఇప్పుడు అన్నల్లేరనే గదా! ఈ సర్కారు గాడ్ది కొడ్కులు మా మీన జులుం జేస్తార్రు. వాడెన్ని ఇకమతుల్జేసినా ఇగ కొట్లాడుడే. వాడో మీమో అంతు దేల్సుకుంటం. రోకలి బండ, కారంపొడి గుప్పుకుంట కొడుకుల్ని తరిమి తరిమి కొడ్తం. మా బత్కుల నిప్పు బోసెటోన్ని మీమెందుకొదిలిపెడ్తం?’ అంటూ 88 ఏండ్ల ముసలి తల్లి ధర్మాగ్రహం ప్రకటించింది.

పత్తిచేన్లో కలుపు తీస్తున్న చెంచు మహిళల్ని కదిలిస్తే… ‘ఈన్నించి అంద్రం ఎల్లిపోవాల్నట. మీమెందుకు వోతం? మా అడివికి ఎవడొత్తడో సూత్తం. అచ్చంపేట మూల తిరిగొస్తె వాని సంగతి జెప్తం. ఈ రాజ్యానికి మా మీన అక్కులేదు. ఇక్కడికెవడొచ్చినా కొడ్వల్తోటి తల్కాయ తెగనర్కుతం’ అంటూ కొడవలెత్తి చూపిండ్రు.

యూసీఐఎల్‌ అధికారులు ఒక్క తిర్మలాపూర్‌లోనే 600కు పైగా బోరు పాయింట్లు పెట్టిండ్రు. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రుల్లో వచ్చి దొంగచాటుగా 36 గంటల్లో 25 బోర్లేసిండ్రు. యురేనియం శాంపిల్స్‌ తీసుకెళ్లిండ్రు. దీంతో అక్కడి ప్రజల్లో భయం గూడుకట్టుకున్నది. ఎప్పుడేం జరుగుతదో తెల్వక బిక్కుబిక్కుమంటున్నరు. ఇది తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలంతా మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నరు.

తరతరాలుగా అడవుల్లో పెనవేసుకున్న చెంచులు అంతర్థానం కానున్నరు. ‘ఈ భూమిపై నల్లమలలో ఒకప్పుడు చెంచుజాతి మనుగడ సాగించింది’ అని చరిత్ర పాఠాలు చదువుకోవాల్సిన దుస్థితి రానున్నది. అమ్మలా బువ్వపెట్టిన అడవి, నీడనిచ్చిన చెట్లు కండ్లెదుటనే విధ్వంసమైతున్నయని తెలిసి విలవిల్లాడుతున్నరు.

‘ఏం చదువుతున్నవు బాబూ…?’ అని ఒక స్కూల్‌ పిల్లవాణ్ని అడిగితే… వాడి కండ్లనిండా నీళ్లు. తాను అక్షరాలు దిద్దిన ఈ బడి, ఆడుకున్న చెట్లూ చేమలూ, అడవి బాటల్ల కలెదిరిగిన గురుతులు మాయమైతయని తెలిసి వాని గొంతు దు:ఖంతో నిండిపోయింది.

అడవిని ఖాళీచేయమంటున్నరని ఓ 90 ఏండ్ల ముసలి తల్లి నెల రోజులుగా తిండి మానేసింది. తమకు బతుకునిచ్చిన అడవి తల్లినుంచి విడదీస్తరని తల్లడిల్లుతున్నది. అక్కడ ఏ మనిషిని కదిలించినా కన్నీళ్లే. అడవితో పెనవేసుకున్న పురాజీవ స్మృతులేవో వాళ్లను కలవరపెడుతున్నయి.

అక్కడ పీపుల్స్‌వార్‌ తిరిగిన గురుతులున్నయి. వాళ్లందించిన చైతన్యం ఉన్నది. కొండ కోనల్లో ఎగిరిన ఎర్రజెండా రెపరెపలున్నయి. నల్లమల కొండల్లో ప్రతిధ్వనించిన వసంత మేఘ గర్జనలున్నయి. వాళ్లు చూపిన తొవ్వ వెలుగై పరుచుకుంటున్నది. ఆ వెలుగు దారే వాళ్లకిప్పుడు దిక్సూచి. వాళ్లకిప్పుడు పోరుతప్ప మరో దారిలేదు.

ఈ యురేనియం ప్రాజెక్టుతో వాతావరణం అగ్ని గుండంలా మారనున్నది. వందల కిలోమీటర్ల మేర పెను విధ్వంసం జరుగుతది. కలుషితమైన విషపు గాలులతో ప్రజల ప్రాణాలకు ముప్పు రానున్నది. ఈ సమస్య ఒక్క చెంచులు, ఆదివాసీలదే కాదు. మనందరిదీ. యురేనియం ప్రాజెక్టును వ్యతిరేకిద్దాం. జీవ వైవిధ్యాన్ని, జీవించే హక్కును కాపాడుకుందాం. నల్లమలను కాపాడటానికి చెంచులు, ఆదివాసీలు చేసే పోరాటానికి అండగా నిలుద్దాం.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

3 thoughts on “నల్లమల గుండెలపై అణుకుంపటి

  1. historically,poetrically article writen good.

  2. Super sudha …నీ గుండెల నుండ నిండివున్న మానవత్వం వారి కన్నీటి బొట్టునైన తుడవాలే

  3. గోర శ్యామ్సుందర్ గౌడ్. తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ. వ్యవస్దాక అద్యక్షుడు. says:

    యురేనియం వేలికీతవల్ల నల్లమల ప్రజలు చనిపోయిన తారువాత నరకం చుస్తారు అంటారు కాని ఇక్కడ యురేనియం వేలికితీతలవల్ల బ్రతికి ఉండగానే నరకం చుస్తారు.

Leave a Reply