యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

(2019 ఆగస్ట్ 2, 3 తేదీలలో నల్లమల పర్యటన సందర్భంగా ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ విడుదల చేసిన కరపత్రం)

యురేనియం అణు ధార్మిక శక్తిగల భార ఖనిజం. విద్యుత్ ఉత్పత్పత్తికి, అణుబాంబుల తయారీకి ఉపయోగపడుతుంది. విద్యుత్ అవసరాలకు,ఆయుధ అవసరాలకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలనుండి యురేనియం దిగుమతుల మీద ఆధారపడిన పరిస్థితులలో భారతదేశ భూభాగాలలోనే యురేనియం నిల్వలు విస్తారంగా ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకొనటానికి తవ్వకాలు చేపడితే తప్పేమిటి? 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాలు అన్నీ తీరేలాగా అణుశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచటం తన లక్ష్యం అని కేంద్రప్రభుత్వం చెబుతుంటే దానిని తప్పు పట్టటం, యురేనియం తవ్వకాలను వ్యతిరేకించటం అంటే అభివృద్ధిని అడ్డుకొనటం కాదా! అని ఎవరైనా అనవచ్చు.

కానీ ఈ రోజు స్థానిక ప్రజలైనా, ప్రజా సంఘాలైనా,బాధ్యతగల పౌరులెవరైనా నల్లమల లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించటం విద్యుత్ వల్ల పొందగలిగిన ప్రయోజనాలను మించిన తీవ్రమూ, దీర్ఘకాలికమూ అయిన మానవ జీవ పర్యావరణ నష్టాలను గురించిన ఎరుకవల్లనే. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ వంటి పద్ధతులలో భూమిపొరలలోని యురేనియం ముడి ఖనిజాన్ని తవ్వి వెలికి తీయటం, క్రషింగ్ ప్లాంట్ల దగ్గరకు చేరవేయటం, పొడి చేసిన ముడి ఖనిజం నుండి యురేనియంను వేరుచేసి విద్యుత్ ఉత్పత్తికి, అణుబాంబుల తయారీకి పనికి వచ్చే విధంగా శుద్ధిచేయటం – ఈ మొత్తం క్రమంలో అణుధార్మికత గాలిలో, నేలలో, నీటిలో, ప్రకృతి పరిసరాలలో వ్యాపించి విషపూరితం చేస్తుంది. చివరగా వ్యర్ధపదార్ధాల స్థావరాల నుండి వచ్చే అణుధార్మిక ప్రమాద వాయువు చేసే హాని కూడా తక్కువది కాదు. వృక్ష పక్షి జంతుజాతుల శరీరాలలోకి, వాటి ఉత్పత్తులను ఆహారంగా తీసుకొనటం వల్ల మనుషుల శరీరాలలోకి కూడా ప్రవేశించి విధ్వంస కారకమవుతుంది. సాగు నీటికి, తాగు నీటికి కటకట ఏర్పడుతుంది. కరువు కాటకాలు ప్రబలి ప్రజాజీవితం దుర్భరమవుతుంది.

అణుధార్మికత మానవ కణజాలమీద చేసే దాడి వల్ల రకరకాల కాన్సర్ వ్యాధులు సంక్రమిస్తాయి. మహిళలలో పునరుత్పత్తి శక్తిమీద విపరీత ప్రభావాలు ఉంటాయి. గర్భస్రావాలు, రకరకాల వైకల్యాలతో పిల్లలు పుట్టటం, పిల్లలలో ఎదుగుదల లేకపోవటం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. పురుషులలో వంధ్యత్వం ఏర్పడుతుంది. మొత్తం మీద జీవ మానవ పునరుత్పత్తిశక్తి బలహీనపడుతుంది అన్నది వాస్తవానుభవం. 1945 హిరోషిమా, నాగసాకీ నుండి 2011 లో జపాన్ లో ఫుకుషిమా ఘటన వరకు ప్రపంచదేశాల అనుభవం ఇది. 1967 లో జార్ఖండ్ లోని జాదూగూడలో యురేనియం మైనింగ్ ప్రారంభమైనప్పటి నుండి భారతదేశ ప్రజల అనుభవం కూడా అదే. రాజస్థాన్ , తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మొదలైన న్యూక్లియర్ రియాక్టర్లు పనిచేస్తున్న అన్ని చోట్ల ప్రజల అనుభవాలు కాస్త కుడి ఎడమగా ఇవే . అందువల్లనే ప్రతిచోటా మైనింగ్ కు, అణుధార్మిక పారిశ్రామీకరణకు వ్యతిరేక ఉద్యమాలు.

ఇప్పుడు నల్లమలలో యురేనియం తవ్వకాలు తక్షణం స్థానిక ఆదివాసీతెగలను, ప్రధానంగా చెంచులను నిర్వాసితులను చేస్తాయి. దట్టమైన అడవిని ధ్వంసం చేస్తాయి.అడవి ధ్వంసం అయిందంటే పులులు మొదలైన అరుదైన జీవ వైవిధ్యం ప్రశ్నార్థకమే అవుతుంది. అడవి అంతరిస్తే వానలు ఉండవు. నీటికొరత ఏర్పడుతుంది. పచ్చగడ్డి మొలవదు. చుట్టుపక్కల మైదాన ప్రాంతాలలో పశువుల మేత కరువైనప్పుడు గ్రామాలనుండి మేకలను ,గొర్రెలను మేపుకొనటానికి నల్లమల కొండలకు వచ్చి రెండు మూడు నెలలు మకాం వేసే గొల్లలకు కొండంత అండ కరువవుతుంది. నల్లమల పొడవునా పారే కృష్ణా నది ప్రవహించినమేరా అణుధార్మిక ఆనవాళ్లను వదిలిపోతూ పెను ప్రమాదాలను పరివ్యాపితంచేయటం ఈ రోజు కంటికి కనబడక పోవచ్చు కానీ అది ఒక భీభత్సకరమైన భవిష్యత్తు.ఆ రకంగా అణుధార్మిక ప్రభావం తరతరాలకు, సుదూర ప్రాంతాలకు కూడా విస్తరిస్తూనే ఉంటుంది. కాలాంతర స్థలాంతరాలకు వ్యాపిస్తూనే ఉంటుంది.

ఇవేవీ తెలియకుండానే కేంద్రప్రభుత్వం 2030 నాటికి దేశఅవసరాలు తీర్చేంత స్థాయిలో అణుశక్తిద్వారా విద్యుత్పత్తిని లక్ష్యంగా ప్రకటించిందా? రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అన్ని అనుమతులూ ఇస్తూ పోతున్నదా? యురేనియం తవ్వకాలు, అణురియాక్టర్లు చేసే పర్యావరణ విధ్వంసం, జన నష్టం అనుభవానికి వచ్చిన దేశాలు ఇప్పుడు తమదేశాలలో ఆయా పరిశ్రమలను పాక్షికంగానైనా మూసివేయటానికి నిర్ణయించుకొని ఆ రంగాలలో తమ సాంకేతిక పరిజ్ఞానానికి , పెట్టుబడులకు భారతదేశాన్ని ప్రయోగశాల చేయటానికి ముందుకు వస్తుంటే ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొంటున్నది. సామ్రాజ్యవాద దళారీ పాత్రను నిర్వహిస్తున్నది. ఆయా పరిశ్రమలగురించిన వాస్తవ సమాచారం ప్రజలకు అందించటం, ప్రజల అభిప్రాయాన్ని సేకరించటం, వాళ్ళ సందేహాలను తీర్చటం, బ్రతుకుకు, భద్రతకు హామీ ఇయ్యటం వంటి ప్రజాస్వామిక ప్రక్రియలన్నిటికీ స్వస్తి చెప్పి మాయ మాటలతో భ్రమపెట్టో, బెదిరించో పని చేసుకొనిపోవటానికి అలవాటు పడ్డాయి ప్రభుత్వాలు. పెట్టుబడి , లాభం అనే వాటి ముందు ప్రజల ప్రాణాలు, ప్రయోజనాలు, పర్యావరణం పూర్తిగా పట్టనివే అయినాయి.

యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(UNDP)2015 లో 193 దేశాలతో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో2030 నాటికి సాధించాలని నిర్ధారించబడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో విద్యుత్తును అందరికీ అందుబాటులోకి తేవటం అనేది ఒక అంశం. సోలార్ తదితర స్వచ్ఛమైన వనరులనే అందుకు ఉపయోగించాలన్న మాటకూడా అందులో వుంది. అయితే దానిని భారత ప్రభుత్వం సౌకర్యవంతంగా విస్మరించి పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులతో చేయికలిపి అణువిద్యుత్ ఉత్పాదనకు అవసరమైన ముడి సరుకు సేకరణకు, యురేనియం తవ్వకాలకు తెగబడింది. ఇందువల్ల సంభవించే పరిణామాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పేర్కొనబడిన ఇతర లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయి అన్న విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

వాతావరణంలో, పర్యావరణంలో, సముద్రంలో, నేల మీద ఎదురయ్యే విపరీత పరిణామాలను సవాల్ గా స్వీకరించి జలచరాలను, జంతుజాలాన్ని, అడవులను కాపాడుకోవాలని UNDP చెప్పే మూడు లక్ష్యాలకు యురేనియం తవ్వకాలు గొడ్డలిపెట్టు అని వేరే చెప్పనక్కరలేదు. వీటితో పాటు ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించాలి, అందరికీ రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులోకి తేవాలి, అందరి ఆరోగ్యానికి, చక్కటి జీవితానికి హామీ ఇయ్యాలి అనే మరో నాలుగు లక్ష్యాలు సోదిలోకే రాకుండా పోతాయి. ఇక గౌరవకరమైన జీవనం సాధ్యమేనా?వర్ధమానదేశాలలో సుస్థిర అభివృద్ధికి అవకాశం మిగిలేనా ?

లక్ష్యాలను నిర్దేశించటంలో భాగమైన 193 దేశాలలో ఏ ఒక్కటి గానీ , నాయకత్వం వహించిన అమెరికా కానీ ఇలా జరగ కూడదని చెప్పవు. ఎందుకంటే అన్నీ సామ్రాజ్యవాద ఛత్రచ్ఛాయలో ప్రయోజనాలు పొందుతున్నవే కనుక. పెట్టుబడి ఒక వైపు మాహా విధ్వంసానికి- పర్యావరణ జీవ వైవిధ్య వినాశనానికి, మానవ హక్కుల హననానికి – కారణమవుతూ మరొకవైపు ఆ విధ్వంసానికి బాధపడుతున్నవాళ్లుగా , దానిని ఆపటానికి ప్రయత్నిస్తున్నవాళ్లుగా మాట్లాడుతూ, లక్ష్యాలను నిర్దేశిస్తూ ఆచరణకు సిద్ధం అన్నట్లుగా కపటనాటకం ఆడటం ఈ వ్యవస్థ లో ముందుకు వచ్చిన పెద్ద వైరుధ్యం. దానికి సాక్ష్యం UNDP లక్ష్యాలకు , వాటిని నిర్లక్ష్యంచేసే ఆచరణకు మధ్య ఉన్న అగాధం. ఈ రకమైన అంతర్జాతీయ వాతావరణంతో, వ్యాపార విలువలతో తలపడటం ఎట్లా అన్నది ప్రశ్న.

ఈ శక్తులను ఎదుర్కొనటానికి ప్రతిఘటన తప్ప మరొక మార్గమే లేదు. యురేనియం తవ్వకాలను ఆదిలోనే ప్రతిఘటించి ఆపివేసిన నల్లగొండ అనుభవం తెలంగాణాలో ఉంది. మేఘాలయలోని షిల్లాంగ్ లో ఖాసీ కొండలలో యురేనియం తవ్వనీయమని విల్లు, బాణాలతో అధికారులను వేటాడిన ఆదివాసీల వారసత్వం వుంది. పదిహేను పదహారేళ్ళ క్రితపు ఆ ప్రజాఉద్యమాల స్ఫూర్తి తో నల్లమల అడవులను, ఆదివాసీలను, వాళ్లతోపాటు నివసిస్తున్నమైదాన ప్రాంత ప్రజాసమూహాలను కాపాడుకొనటం ఈ నాటి అవసరం. వాళ్ళ ను కాపాడుకొనటం అంటే మనలను మనం కాపాడుకొనటమే. గౌరవప్రదంగా జీవించే హక్కు కోసం నిలబడటమే.

Leave a Reply