విప్లవోద్యమ పాటకు నాంది గీతం: నరుడో! భాస్కరుడా!

విప్లవోద్యమ సాహిత్యంలో ప్రతిపదం ఒక విశేషార్థాన్ని నింపుకుని అనేక అంతరార్ధాల్ని వెల్లడిస్తుంది. అదే ఒక కవితైనా, పాటయినా అయితే కొన్ని చారిత్రక సంఘటనల్ని గర్భీకరించుకుని రేపటి చరిత్రకు ప్రధాన ఆధారంగా మెరుస్తుంటుంది. విప్లవోద్యమ చరిత్రలోనైనా, సాహిత్య చరిత్ర రచనలోనైనా శివసాగర్ ఆచరణ, అక్షరం అలాంటి ప్రామాణిక గ్రంథంలాంటివి. శివసాగర్ ఒక చేతిలో గన్ను ధరించి విప్లవ పోరాట కార్యాచరణలోకి దిగిన వీరుడు. మరో చేతిలో పెన్ను పట్టుకుని తన రచన ద్వారా విప్లవవీరుల పుట్టుకకు కా ‘రణ’జన్మధారి అయ్యాడు. నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమపోరుబాటలో పాటను ఎరుపెక్కిన జెండాగా ఎగరేసిన కవియోధుడు శివసాగర్. 1931లో కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరలో గల శంకరపాడులో జన్మించిన కంభంజ్ఞాన సత్యమూర్తి విద్యార్థి దశనుండే ఉద్యమాలు, సాహిత్యంపట్ల ఆకర్షితుడైనాడు. అదే అంతిమలక్ష్యంగా చేసుకుని ఆయుధాన్ని, అక్షరాన్ని నమ్ముకుని విప్లవోద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగాడు. ఆ అడవిబాటలో నడుస్తూనే అజ్ఞాతవాసంలోంచే శక్తివంతమైన సాహిత్యాన్ని సృష్టించాడు. ఆ వరుసలో విప్లవసాహిత్యోద్యమ గుండెల్లో ప్రతిధ్వనించే పాట ‘నరుడో!భాస్కరుడా!’, విరసానికి పతాకగీతం లాంటి ఈ అద్భుతమైన, చారిత్రకమైన రెవల్యూషనరీ సాంగ్ను ఒక స్మృతిగీతంగా తలచుకుందాం.

“నర్రెంగ సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
కన్నెర్ర సేస్తివయ్యా నరుడో! భాస్కరుడా!
కన్నెర్ర సేసి నీవు నరుడో! భాస్కరుడా
కదనాన దూకితివా నరుడో! భాస్కరుడా!!”

ఈ పాట పుట్టుక వెనుక అనేక వాస్తవిక సంఘటనలు, చారిత్రక, సాంస్కృతిక విశేషాలు దాగివున్నాయి. ఈ పాట ప్రారంభంలోనే శివసాగర్ ‘భాస్కరుడా!’ అనే పేరుకున్న సంకేతార్థాన్ని వివరిస్తాడు. ‘‘భాస్కరుడు సర్వనామం కాదు. కాలేదు. నా దేశంలో వర్తమానాకాశంలో ఉదయిస్తోన్న నూతన మానవునికి మహోజ్వల సంకేతం భాస్కరుడు. భాస్కరుల్ని మింగిన రాహువులు నిజాన్ని దాస్తారు. ప్రజలు భాస్కరుని బాటనే పయనిస్తారు. భాస్కరుడు ఆచంద్రతారార్కం అజరామరం’’ అంటూ పాటలోకి ప్రయాణిస్తాడు. పాటలో ప్రతిచరణంలోనూ పునరావృతమయ్యే భాస్కరుడు నిజమైన విప్లవవీరుడు. ఉద్యమ క్షేత్రంలో కదనుతొక్కి కన్నుమూసిన క్రాంతికారుడు, అర్థాంతరంగా అస్తమించిన ఒక విప్లవసూర్యుడి వీరగాథాగానం ఈ ‘నరుడో!భాస్కరుడా!’ గీతం. భాస్కరుల్ని మింగిన ఖాకీ రాహువుల కుట్రను వెల్లడి చేసే ఉద్వేగభరిత గీతం ఇది.

‘‘బర్రెంక సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
బందూకు పడ్తివయ్య నరుడో! భాస్కరుడా!
బందూకు సేతబట్టి నరుడో! భాస్కరుడా!
బంధాలు తెంచ్తివయ్య నరుడో! భాస్కరుడా!
గొడ్డంకి సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
గొడ్డళ్ళు నూర్తివయ్య నరుడో! భాస్కరుడా!
గొడ్డళ్ళు నూరి నీవు నరుడో! భాస్కరుడా!
గుడ్డెలుగు కొడ్తివయ్య నరుడో! భాస్కరుడా!’’

ఈ పాటలోని భాస్కరుడు కామ్రేడ్ చాగంటి భాస్కరరావు. వృత్తిరీత్యా వైద్యుడు. విప్లవోద్యమాలే గమ్యంగా చేసుకున్న నిబద్ధ నాయకుడు. శ్రీకాకుళోద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విప్లవకారుడు. 1969 నవంబర్ 22న చాగంటి భాస్కరరావుతోపాటు తామాడ గణపతి మరియు మరో నలుగురు విప్లవకారులను పోలీసులు ఎన్కౌంటర్లో చంపివేశారు. శివసాగర్ ఆ చాగంటి భాస్కర్రావు త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ‘నరుడో భాస్కరుడా!’ గీతానికి పురుడుపోశాడు. ప్రజలబాణీలో విప్లవపాట సాగాలనే ప్రయత్నం ఈ పాటలో శక్తివంతంగా వ్యక్తమైంది. పీర్లపండుగనాడు తెలంగాణ ప్రాంతంలో యువకులు గుండం చుట్టూ ధూల ఆడుతూ పాడుకునే జానపదగీతం శైలిలో ఈ పాటను నడిపాడు శివసాగర్. తెలంగాణలోని మెదక్ పరిసర ప్రాంతాల్లో శివసాగర్ రహస్యజీవితం గడుపుతూ ఉండగా ఒక రోజు గ్రామప్రజలు ‘‘నరుడో నారపరెడ్డి’’ అనే పాటపాడుతూ ‘ధూల’ ఆడటం చూసి ఆ జానపదగీతంలోని రూపాన్ని సొంతంచేసుకుని ఈ గీతాన్ని రాశానని చెప్పుకున్నాడు. ఖమ్మంలో జరిగిన విరసం ప్రథమ మహాసభ సందర్భంగా ప్రచురించిన తొలికవితా సంకలనం ‘ఝంఝ’లో ఈ పాటను ప్రచురించారు. ‘ఝంఝ’ కవిత్వాన్ని అచ్చువేయించుకొని వచ్చిన శ్రీశ్రీ ఈ పాట పాడుతూనే ట్రెయిన్లోంచి దిగాడని చెప్పుకుంటారు. విరసం సభల్లో ఈ పాట మారుమ్రోగింది. దీన్ని శ్రీశ్రీ ‘టైంలెస్ సాంగ్’ అన్నాడు. రావిశాస్త్రి ‘ఆల్కహాలిక్ హైమ్’గా ప్రశంసించాడు. ప్రజల వ్యవహారంలో నలిగే మౌఖిక కళారూపానికున్న శక్తిని విప్లవ సాంస్కృతిక దళం గుర్తించిన బలమైన సందర్భం ఇది.

‘‘విప్పపూ సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
విల్లుసారించితివా నరుడో! భాస్కరుడా!
విల్లంబు సారించి నరుడో! భాస్కరుడా!
విజయమే అన్నావో నరుడో! భాస్కరుడా!
నీదు శౌర్యం సూసి నరుడో! భాస్కరుడా!
కళ్ళల్లో జిల్లెళ్ళు నరుడో! భాస్కరుడా!
కళ్ళల్లో జిల్లెళ్ళతో నరుడో! భాస్కరుడా!
నీ శిరసు తీస్తిరయ్య నరుడో! భాస్కరుడా!’’

శివసాగర్ ఈ పాటకు మూలమైన ‘నరుడో నారపరెడ్డి’ పాట గొప్పదనాన్ని వివరిస్తూ ‘‘ఈ పాటలో అద్భుతమైన కవిత్వం ఉంది. అనేక చెట్లపేర్లు తీసుకొని ఆ జానపదకవి తగిన రైమ్ కూర్చి ఎంతో అద్భుతంగా ఆ పాట రాశాడు. నేను కూడా ఆ ఉత్సవంలో పాల్గొని ఆ పాటవిని ఆ పాటలోవున్న టెక్నిక్ను స్వంతం చేసుకొన్నాను. అందులో ఎక్కువభాగం అడవిలోంచి తీసుకొన్న చెట్లు. ఆ పాటలోనే ఉన్నటువంటి అనేక పదచిత్రాలు తీసుకొని మన విప్లవానికి సరిపోయేటట్టుగా మలిచాను’’ అని నరుడో! భాస్కరుడా! గీతం ప్రత్యేకతను విప్పిచెప్పాడు.

ఈ పాటలోని నర్రెంగసెట్టు, బర్రెంకసెట్టు, గొడ్డంకిసెట్టు, విప్పపూ, జిల్లేళ్ళ చెట్లు గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఆ గ్రామాల్లోనే పీడిత ప్రజానీకం, ఉత్పత్తిదారులైన రైతులు నివసిస్తున్నారు. ఈ ప్రజా సముదాయాల శ్రామిక దోపిడీని నిలువరిస్తూ వారి విముక్తికోసమే ఈ పాట రాశాడు శివసాగర్. విప్లవోద్యమ శక్తుల సమీకరణను, పోరాటస్ఫూర్తిని పెంచుకోవడానికి పరిసర వాతావరణాన్ని పాటలోకి దింపి ప్రజలకు దగ్గరయ్యేందుకు కవిచేసిన ప్రయత్నం సఫలమయింది. మరోవైపు కవి ఆయుధాలు పట్టమనే పిలుపును అన్యాపదేశంగా ఆదేశిస్తాడు. గొడ్డళ్ళు, విల్లంబులు, బందూకూలు మొదలైన ఆయుధాల్ని వ్యవసాయ పనిముట్లలో భాగంగా చేర్చుకోమనే సూచన ధ్వన్యాత్మకంగా ఇస్తాడు. వ్యవసాయంతో పాటు జరగబోయే పోరాటానికి ఆయుధ శిక్షణలాంటి వాక్యాలు ఇవి. ఆధిపత్యశక్తులు, దోపిడీవర్గాలను ఎదిరిస్తూ విప్లవోద్యమం కోరుకునే రాజ్యాధికారదిశగా అడుగువేయాలనే తపన కవిలో కనిపిస్తుంది. చాగంటి భాస్కరరావు లాంటి విప్లవకారుల నెత్తుటి త్యాగాన్ని గుర్తుచేస్తూ ఈ పాటలో అనేక చరణాల్ని నెత్తుటితో నింపుతాడు.

సిందీన నెత్తురంత నరుడో! భాస్కరుడా! …
కారీన నెత్తురంత నరుడో! భాస్కరుడా! …
పారీన నెత్తురంత నరుడో! భాస్కరుడా! …
పేరీన నెత్తురంత నరుడో! భాస్కరుడా! …

ఈ పాటలోని పదహారు చరణాలు విప్లవోద్యమంలో పాల్గొని పోలీసు బూటకపు ఎదురుకాల్పుల్లో నెత్తుటి తర్పణం చేసిన విప్లవకారుల త్యాగాలను దుఃఖపూరితంగా దృశ్యీకరణచేస్తాయి. ప్రతి చరణంలో ఆరని నెత్తుటి తడివెచ్చగా తగులుతుంది. ప్రతి చరణంలో ఘనీభవించిన చెమటచుక్క గరుకుగా గుచ్చుకుంటుంది. ఈ చరణాలు విప్లవదారులన్నీ ఏవిధంగా నెత్తుటితో తడిసి ఎంత పచ్చిపచ్చిగా ఉన్నాయనే వాస్తవికతను బట్టబయలు చేస్తాయి. అందుకే కవి ఈ విధంగా కోరుకుంటున్నాడు.

‘‘మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!
కుట్రలే పన్నారో నరుడో! భాస్కరుడా!
నీవు సూపినబాట నరుడో! భాస్కరుడా!
మా దొడ్డ బాటయ్య నరుడో! భాస్కరుడా!
నీ బాటనే మేము నరుడో! భాస్కరుడా!
బందూకు పడ్తాము నరుడో! భాస్కరుడా!!’’

విప్లవోద్యమంలో కేవలం సిద్ధాంతాల ప్రసంగాలతో, నినాదాలతో, పాటలతో ప్రత్యక్ష ప్రయోజనం చేకూరదు. విప్లవకారుడి చేతిలోని ఆయుధం కార్యాచరణలో పాల్గొన్నప్పుడు మాత్రమే ప్రకంపనలు మొదలవుతాయి. మాటేసి కాటేసినప్పుడే రాజ్యం పునాదులు కదులుతాయి. వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. శివసాగర్ ఇక్కడ కవిగాను, ఆయుధం ధరించిన దళనాయకుడిగాను యుద్ధభేరి మోగిస్తున్నాడు. గెరిల్లాదాడులతో వర్గశత్రువుపై విరుచుకుపడమని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రత్యక్ష పోరుబాటలోకి దూకమని సైగచేస్తున్నాడు.
శివసాగర్ కవిత్వంలో స్పష్టమైన సైద్ధాంతిక తాత్వికత ప్రకటితమైంది. నిజాన్ని నిర్భయంగా చెప్పగల నిజాయితీ, ధిక్కారం, సాహసం వున్నటువంటివాడు కాబట్టి విప్లవోద్యమాన్ని సైతం బహిష్కరిస్తూ ప్రజాక్షేత్రంలో తన వాదాన్ని బలంగా వినిపించాడు. వర్గపోరాట చైతన్యాన్ని పాటలో ఎంత బలంగా వినిపించవచ్చనేది ‘నరుడో భాస్కరుడా!’ గీతం ద్వారా శివసాగర్కు అనుభవగతమైంది. ఏ ప్రాంతపు బాణిని తీసుకుంటామో ఆ ప్రాంత ప్రజల పలుకుబడిని ఆ పాటలో పొదిగాడు. విప్లవ కవితకు మార్మికత పనికిరాదనే సత్యాన్ని గుర్తించాడు. వచన కవితలోని సంకేత ప్రయోగాల్లోని సంక్లిష్టతను అర్థంచేసుకొన్న శివసాగర్ పాటలో సామాన్య ప్రజలకు చప్పున స్ఫురించే ప్రతీకను ప్రయోగించాడు. ‘నరుడో భాస్కరుడా’ గీతంలో శివసాగర్ శబ్దాలతో ఆటలాడుకున్నాడు. పాటలో ఒకే పదాన్ని, పదసముదాయాన్ని, సగం వాక్యాన్ని ఒక మకుటంలాగా పదేపదే పునరావృతం చేస్తూ చెప్పదలుచుకున్న విషయం గుండెల్లో ముద్రపడేలా పాడాడు శివసాగర్. వృత్యానుప్రాస, ముక్తపదగ్రస్త శబ్దాలంకారాలతో చెవుల్లో కవితావాక్యాలు ప్రతిధ్వనించేలా, నినాదమై వెంటాడేలా పాటను రూపొందిస్తాడు. మౌఖిక సంప్రదాయపు నాడిని పట్టుకుని ఆశు సాహిత్య ధోరణులను సందర్భానుసారంగా ఉపయోగించుకుంటూ నుడికారానికి ఎర్రెర్రని నెత్తుటి ఆవేశాన్ని తొడిగి పాటను గురితప్పని బాణంగా సంధించాడు శివసాగర్. ఈ పాట విరసానికి డైరెక్షన్ ఇచ్చిన పాటగానూ గుర్తింపు పొందింది.

‘‘విప్లవకారుడిగా రహస్యజీవితం, గ్రామాల నుంచి గ్రామాలు తిరగడం. ఈ లోపల విరసం ఏర్పడటం, విప్లవసాహిత్యం ఎలా ఉండాలి అని ఒక చర్చ ప్రారంభం కావటం. ఈ చర్చ జరుగుతున్న రోజుల్లోనే ఇలాగే ఉండాలని ‘నరుడో!భాస్కరుడా!’ పాట రాశానని శివసాగర్ ఒక ఇంటర్వ్యూలో ఈ పాటలోని మరో అంతర్గత నేపథ్యాన్ని తెలిపాడు. విప్లవోద్యమాల ఉత్తేజ, ఉద్వేగ చరిత్రతో పాటు అంతర్గత వాదాలను, ఆంతరంగిక విషయాలను కవిత్వంలోకి, పాటలోకి రికార్డు చేసిన కవి శివసాగర్. శ్రీశ్రీ తర్వాత విప్లవ కవిత్వంలో కొత్త డిక్షన్ను సృష్టించిన కవి శివసాగర్. కె.జి.సత్యమూర్తి చేతిలోని తుపాకీలో తూటాలు లేనప్పుడు పాటను తూటాగా చేసుకుని లక్ష్యాన్ని ఛేదించిన గురితప్పని వేటగాడు శివసాగర్. ఏనాటికీ పదును తగ్గని ఆయుధం లాంటి గీతం ‘నరుడో!భాస్కరుడా!’ గీతం.

పూర్తిపాట:

నర్రెంగ సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
కన్నెర్ర సేస్తివయ్యా నరుడో! భాస్కరుడా!
కన్నెర్ర సేసి నీవు నరుడో! భాస్కరుడా!
కదనాన దూకితివా నరుడో! భాస్కరుడా!

బర్రెంక సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
బందూకు పడ్తివయ్య నరుడో! భాస్కరుడా!
బందూకు సేతబట్టి నరుడో! భాస్కరుడా!
బంధాలు తెంచ్తివయ్య నరుడో! భాస్కరుడా!

గొట్టంకి సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
గొడ్డళ్ళు నూర్తివయ్య నరుడో! భాస్కరుడా!
గొడ్డళ్ళు నూరి నీవు నరుడో! భాస్కరుడా!
గుడ్డెలుగు కొడ్తివయ్య నరుడో! భాస్కరుడా!

విప్పపూ సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
విల్లుసారించితివా నరుడో! భాస్కరుడా!
విల్లంబు సారించి నరుడో! భాస్కరుడా!
విజయమే అన్నావో నరుడో! భాస్కరుడా!
నీదు శౌర్యం సూసి నరుడో! భాస్కరుడా!
కళ్ళల్లో జిల్లేళ్ళు నరుడో! భాస్కరుడా!
కళ్ళల్లో జిల్లేళ్ళతో నరుడో! భాస్కరుడా!
నీ శిరసు తీస్తిరయ్య నరుడో! భాస్కరుడా!
శింగేరి గట్టుకింద నరుడో! భాస్కరుడా!
నీ శిరసు తీసిరయ్య నరుడో! భాస్కరుడా!
నీ శిరసు తీసివారు నరుడో! భాస్కరుడా!
సిందులే వే సిరయ్యా నరుడో! భాస్కరుడా!

సిందీన నెత్తురంత నరుడో! భాస్కరుడా!
సీసా కెత్తిరయ్యా నరుడో! భాస్కరుడా!
సీసాల్లో ఏమిటన్న నరుడో! భాస్కరుడా!
సారాని సెప్పిరయ్యా నరుడో! భాస్కరుడా!

కారీన నెత్తురంత నరుడో! భాస్కరుడా!
కడవల్ల కెత్తిరయ్యా నరుడో! భాస్కరుడా!
కడవల్లో ఏమిటన్న నరుడో! భాస్కరుడా!
కల్లాని సెప్పిరయ్యా నరుడో! భాస్కరుడా!

పారీన నెత్తరంత నరుడో! భాస్కరుడా!
పీపా కెత్తిరయ్యా నరుడో! భాస్కరుడా!
పీపాల ఏమిటన్న నరుడో! భాస్కరుడా!
పాలాని సెప్పిరయ్యా నరుడో! భాస్కరుడా!

పేరీన నెత్తురంత నరుడో! భాస్కరుడా!
పేరిళ్ళ కెత్తిరయ్య నరుడో! భాస్కరుడా!
పేరిళ్ళ ఏమిటన్న నరుడో! భాస్కరుడా!
పెరుగాని సెప్పిరయ్యా నరుడో! భాస్కరుడా!
నినుసంపి మముసంప నరుడో! భాస్కరుడా!
మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!
మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!
కుట్రలే పన్నారో నరుడో! భాస్కరుడా!

నీవు సూపినబాట నరుడో! భాస్కరుడా!
మా దొడ్డ బాటయ్య నరుడో! భాస్కరుడా!
నీ బాటనే మేము నరుడో! భాస్కరుడా!
బందూకు పడ్తాము నరుడో! భాస్కరుడా!

బర్రెంక సెట్టుకింద నరుడో! భాస్కరుడా!
బందూకు పట్టాము నరుడో! భాస్కరుడా!
బందూకు సేతబట్టి నరుడో! భాస్కరుడా!
బంధాలు తెంచాము నరుడో! భాస్కరుడా!

(అక్టోబర్ 1970)

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “విప్లవోద్యమ పాటకు నాంది గీతం: నరుడో! భాస్కరుడా!

 1. సార్..
  విశ్లేషణ చాలా బాగుంది సార్…

  ఒక సందేహం…..?
  నినుసంపి మముసంప నరుడో! భాస్కరుడా!
  మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!
  మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!
  కుట్రలే పన్నారో నరుడో! భాస్కరుడా!
  … ఇందులో
  “మాటేసి కాటేయ నరుడో! భాస్కరుడా!” అంటే
  విప్లవ వీరులు.. వర్గ శత్రువులను మాటేసి కాటేయడానికి కుట్రలు పన్నాలని చెబుతున్నారా?
  లేక
  వర్గ శత్రువులు..విప్లవ వీరులను మాటేసి కాటేయడానికి కుట్రలు పన్నుతున్నారని చెబుతున్నారా?
  ఎట్లా అర్థం చేసుకోవాలి?

Leave a Reply