నక్సల్బరీ ఆలోచనల ఆకాశం కింద నిగ్గుదేరిన కవి

బహుశా 2018 డిసెంబరులో అనుకుంటాను. ఒక రోజు మధ్యాహ్నం మహబూబ్ నగర్ మిత్రులు రాఘవాచారి నుంచి ఫోన్. వరవరరావుగారి కవిత్వం గురించి పాలమూరు అధ్యయన వేదిక ఏర్పాటు చేస్తూన్న సెమినార్లో పాల్గొనమని పిలుపు. ఈ అధ్యయన వేదికతో నాకు ఒక అనుబంధం వుంది. అంతకుముందు గోరటి వెంకన్న సాహిత్యంపై జరిగిన సదస్సులో నేను వక్తగా పాల్గొన్నాను. ఆ అనుభవంతో వేదిక సభ్యులకూ నాకూ మధ్య ప్రగాఢమైన అనుబంధం ఏర్పడింది. వాళ్ళు పిలవటం నేను వెళ్ళకపోవటం అనేది జరగదు. పైగా ఇది నేను ఎంతగానో ప్రేమించే కవి వి.వి. గురించిన సదస్సు. కానీ అనారోగ్యం కారణంగా వెళ్ళలేని పరిస్థితి. ఇదే విషయం రాఘవాచారి గారికి చెప్పాను. ఆయన ససేమిరా అన్నారు. అయినా ఏదో సర్ది చెప్పాను. నెల రోజుల తరువాత మళ్ళీ ఫోన్. సెమినార్ అనుకోకుండా వాయిదా పడింది. 2019 ఫిబ్రవరి 3వ తేదీకి మార్చాం, కాబట్టి మీరు తప్పనిసరిగా హాజరు కావాలి అన్నారు. విశాఖపట్నంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటు చేసిన సదస్సులో ఫిబ్రవరి 3వ తేదీన నేను మాట్లాడాలి. ఇది మూడు మాసాల క్రితం ఒప్పుకున్నది. తెలుగు సాహిత్యంలో ముస్లింల ఆనవాళ్ళను గురించి మాట్లాడాలి. నేనేం పెద్ద డిమాండు వున్న బిజీ వక్తను కానప్పటికీ పరిస్థితులు అలా వచ్చాయి. వి.వి. సదస్సులో పాల్గొనటం ఈసారికూడా కుదరలేదు. అయితే ప్రసంగ పాఠం రాసి పంపమన్నారు. ఈ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ వదులు కోకూడదని నిర్ణయించుకున్నాను. నా వలన ఎన్ని అసౌకర్యాలు ఏర్పడినప్పటికీ ఎంతో స్నేహభావంతో మిత్రులు రాఘవాచారి నా వెంటపడి నాతో ఈ ప్రసంగపాఠం రాయించారని చెప్పుకోవటం నాకు గర్వకారణం.

*

కవిత్వంలోనూ, జీవితంలోనూ వి.వి.ది జ్ఞానమార్గం.వి.వి. వంటి పెద్దల విషయం లో నాది పూర్తిగా భక్తిమార్గం.వి.వి.ని గురించి మాట్లాడే అవకాశం లభించటం నాకు ఒక పెద్ద ప్రివిలేజ్. ఇది కేవలం పాలమూరు అధ్యయన వేదిక మిత్రులు నాకు ఆయాచితం గా కల్పించిన ఒక అరుదయిన గౌరవంగా భావిస్తున్నాను. కారణాలు ఏమయినా కావచ్చు ను, అటు అకడమిక్ ప్రపంచంగానీ, ఇటు జనరల్ సాహిత్య ప్రపంచంగానీ వి.వి. సాహిత్య కృషిని అంచనా వేసే ప్రయత్నం ఏమీ చేయలేదనేది ఒక వాస్తవం. ప్రజల పక్షం వహిం చిన కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ చరిత్ర విస్మరించదు. అందుకు ఉదాహరణమే ఈ సెమినార్. పాలమూరు అధ్యయన వేదిక నిస్సందేహంగా ప్రజల వేదిక. వేదిక బాధ్యు లందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇపుడు నేను వి.వి. గురించి మాట్లాడాలి. అయితే ఏం మాట్లాడాలి అని ఆలోచించినపుడు ముందుగా నాకు 2008లో వెలువడిన ‘వరవరరావు కవిత్వం 1957-2007’కు స్వయంగా ఆయన రాసుకున్న ముందుమాట గుర్తుకు వచ్చింది. ఆయనలాగా ఆయన గురించి అంత చక్కగా వేరెవరూ రాయలేరని అనిపించింది. మరొకరిని గురించి రవంత తక్కువ చేసి చెప్పటంగానీ, తన గురించి రవంత ఎక్కువ చెప్పుకోవటంగానీ ఆయన చేయలేదు. నిజాయితీపరుడయిన కవికి నిజంగా ఇది కత్తి మీద సాము. ఎంతో నైతిక సంయమనం వుంటేతప్ప సాధ్యమయే విషయం కాదిది. అలాగే 1975లో ‘స్వేచ్ఛ ‘సంకలనానికి శివసాగర్ ముందుమాట రాస్తూ లూసన్ కవితలోని బాటసారితో పోలుస్తూ వి.వి.ని గురించి రాసిన మాటలకన్నా మించి ఇంకెవరయినా ఏమైనా చెప్పగలరా….‘సారే జహా సె అచ్ఛా హిందూసితా హమారా’ వంటి అజరామర గీతాన్ని ప్రపంచానికి అందించిన కవి ఇఖ్బాల్ ఒక సందర్భంలో… ఉఠాయే కుఛ్ వర్ఖ్ లాలే నె, కుఛ్ నర్గిస్ నె, కుఛ్ గుల్ నె చమన్ మే హర్ తరఫ్ బిఖరీ హుయీ హయ్ దాస్తా మేరీ అన్నాడు. తన జీవన పుటలను వివిధ పుష్పాలు చేగొనటంతో నందనవనంలో నలువైపులా వెదజల్లబడింది నా వృత్తాంతం అని చెప్పుకున్నాడు. వి.వి. అలా చెప్పుకోలేదు గానీ కవిగా, రచయితగా, మేధావిగా,వక్తగా, విప్లవ సాంస్కృతికోద్యమ కార్యకర్తగా, విప్లవోద్యమ కార్యకర్తల రూప శిల్పిగా, ఉద్యమ నిర్మాతగా ఆరు దశాబ్దాల భారత రాజకీయ సాంస్కృతిక చరిత్రలో, వర్తమానంలో వివిధ రూపాలుగా పరివ్యాప్తమైవుంది వి.వి. వ్యక్తిత్వం. ఇన్ని విధాలుగా విస్తరించివున్న ఆయన జీవితంలోని వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకుంటేనే తప్ప, వాటిని గురించిన విస్తృతమయిన అవగాహన వుంటేనే తప్ప సమగ్రమైన వి.వి.సాహితీ మూర్తిత్వాన్ని ఆవిష్కరించలేం.

ప్రజాస్వామ్యానికి ప్రబల శత్రువు మౌనం. ప్రస్తుతం మౌనం ఒక లౌకిక ఆచరణగా మారిపోతూ ఉండటం అమానుషమైన ఒక వాస్తవం. ఎటుచూసినా నలువైపులా ప్రతి ఒక్కరూ తమ తమ మౌనంలో తమదైన మంచినీ, స్వప్రయోజనాన్నీ మాత్రమే చూసుకుంటున్నారు. ఇది ఒక సామాజిక విషాదం. ఒక వ్యక్తి మౌనం ఆ వ్యక్తినో లేదా అతని కుటుంబాన్నో మాత్రమే కబళించగలదు. కానీ ఒక సామూహిక మౌనం మొత్తంగా ఒక తరాన్నీ, ఒక జాతినీ, దేశాన్నే మూగజీవిని చేయగలదు. దాదాపుగా మనం అటువంటి పరిస్థితులకు దరిదాపుల్లోనే ఉన్నాం. పూర్తిగా అవాంఛనీయమైన ఈ సాముదాయిక మౌనాన్ని ఛేదించటమే లక్ష్యంగా సవరించుకున్న శక్తివంతమైన మన కాలపు విప్లవ గళం వరవరరావు కవితాస్వరం. అందుకే సాధారణ కవితా ప్రమాణాలతో వి.వి.ని కొలవలేం.అయినప్పటికీ నాకున్న పరిమితమైన అవగాహన మేరకు వి.వి. సాహిత్యంలో నేను గుర్తించిన రెండు మూడు చిన్నిచిన్ని విషయాలను మీ ముందు వుంచే ప్రయత్నం చేస్తాను.

ఎవరైనా ఒక కవి శక్తిసామర్ధ్యాలను అంచనా వేయటానికి ఆ కవి తొలి కవితా సంపుటిని పరిశీలనలోకి తీసుకోవటం కూడా ఒక పద్ధతి. వి.వి. కవితల తొలిసంపుటి ‘’చలినెగళ్ళు.’ 1957-67 మధ్యకాలంలో రాసిన కవితల సమాహారం. పారిశ్రామిక పరిభాషలో ఒక మాట వుంది – ‘స్థాపిత సామర్ధ్యం.’ ఒక పరిశ్రమ పెట్టినపుడు దాని యంత్రసామాగ్రి తాలూకు వాస్తవ శక్తిసామర్ధ్యం. ఒక కర్మాగారం ప్రారంభ సమయంలో తన స్థాపిత సామర్ధ్యంలో 25 శాతమో, 30 శాతమో మాత్రమే వినియోగంలోకి తెచ్చుకుంటుంది. దశలవారీగా పెంచుకుంటూ తన స్థాపిత సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తెచ్చుకోగల స్థితికి చేరుకుంటుంది. ఇంగ్లీషులో దీన్ని ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటారు. ఇటువంటి స్థాపిత సామర్ధ్యం కవులు, రచయితలు, కళాకారులలోనూ వుంటుందని నా నమ్మకం. అత్యధిక స్థాపిత సామర్య్థం కలిగిన కవులు కేవలం ఒకే ఒక పక్రియని అనుసరించరు. తమ స్థాపిత సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తెచ్చుకునేందుకు రకరకాల పక్రియలను అనుసరిస్తారు. ఉదాహరణకు మన శీశ్రీ. అలాగే కవిగా వి.వి.లోని ఈ ఇన్స్టాల్డ్ కెపాసిటీ చాలా బలమైనదని తెలుసుకోవటానికి ‘చలినెగళ్ళు’లోని కొన్ని వాక్యాలు చాలు…

‘కారడవిలో పూవుకింది ఆకు ఈనెమీద ఈనిన వెన్నెల…’
…………..
‘గుడిసెలోన తడిసిన లేగదూడ
రాతిరి నింపుకొన్న వాన తలపులు నెమరేసెను.’
………………….
‘నీ ఊళ్లోనూ నా ఊళ్లో ఉదయించిన చంద్రుడు ఉదయిస్తాడని….’
…………………….
‘తొమ్మిది నెలల కలకి పాలు తాగిస్తున్నది తల్లి….’
…………………………..
క్షణం క్రితం కొమ్మల్ని చీల్చుకు వచ్చిన చివుళ్ళలాగా, గడియ క్రితం మొగ్గ తొడిగిన గులాబీ పువ్వుల్లాగా, మనసుల్ని మిరుమిట్లు గొలిపే నులివెచ్చని ఈ తాజా ఊహలు, ఆలోచనలు, పదాలు, ప్రతిమలు, పదచిత్రాలు… కవిత్వాన్ని ఆచితూచగల ప్రపంచంలోని ఏ సున్నితపు త్రాసులో పెట్టి పరీక్షించినా స్థిరంగా నిలబడి తన సత్తా ఏమిటో నిరూపించుకోగల కవితా వాక్యాలు/కావ్యాలను ఆరు దశాబ్దాలక్రితంసృష్టించిన ఒక సృజనశీలి అయిన కవికి వేరే ప్రమాణ పత్రాలు అవసరమా?

*

కవిత్వం సరే, కనీసం మంచి వచనం రాసేవాళ్లు పట్టుమని పదిమందికూడా లేని కాలంలో ఆయన ఎంతో సాంద్రతరమయిన వచన కవిత్వం రాశారు. తెలుగులో ఆధునిక వచన కవితా రూపం సుస్థిరంగా నిలబడటానికి కృషి చేసిన తొలితరం కవులలో వి.వి. ఒకరు. అప్పటినుంచీ ఇప్పటివరకూ అవిచ్ఛిన్నంగా, నిరంతరాయంగా రాస్తూవస్తూన్న వి.వి. కాలం తన భుజస్కంధాలపై మోపిన బాధ్యతని నిబద్ధతతో నిర్వర్తిస్తూ నిజంగానే ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా ఎదుగుతూ వస్తున్నారు. ఈనాటి ఆయన వ్యక్తిత్వం ముందు ఆయన రాసిన కవిత్వం సహజంగానే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కవి అనే పదం పరిధిలో ఏమాత్రం ఇమడనంతటి మహాకాయం ఈనాటి ఆయన వ్యక్తిత్వం.

*

వి.వి. మంచి వక్త. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన ప్రసంగాల్లో రెండు అంశాలు తరచుగా ప్రస్తావనకు వస్తుంటాయి. మొదటి అంశం-శిశువుకు దక్కని స్తన్యం అనే శీశ్రీ వాక్యం. రెండవది ఫ్రెంచ్ విప్లవం. శిశువుకు దక్కని స్తన్యం గురించిన ప్రస్తావన వెనక నిరంతరం వెంటాడే బలమైన ఒక బాల్యస్మృతి ఉందని ఆయన అమ్మ గురించి రాసిన కవితలు చదివినా, ‘ఎవరు రాసేరు రెండు యేభైలు’ శీర్షికతో రాసుకున్న ఆత్మ కథనాన్ని అర్థం చేసుకున్నా మనకు తెలిసిపోతుంది.

ఇకపోతే ఫ్రెంచి విప్లవం. వి.వి. జీవితానికీ, కవిత్వానికీ ఫ్రెంచ్ విప్లవం, ఆ విప్లవం ముందుకు తెచ్చిన ప్రజాస్వామ్య భావన, ఆ భావనకు ప్రాణప్రదమైన స్వేచ్ఛ, సమానత్వం, మానవ సౌభ్రాతృత్వం వంటి విలువలు మార్గదర్శకంగా పని చేశాయి. తొలిదశలో అదే ఆయనచేత నెహ్రూమీద కవిత రాయించింది. ఈ ప్రజాస్వామిక విలువలు తాను ఆశించిన రీతిలో తన చుట్టూవున్న సమాజంలో ప్రతిఫలించక పోవటాన్ని ప్రశ్నించటం, దాని వెనకవున్న కారణాల్నీ, దారుణాల్నీ వెలికి తీయాలనే ఆకాంక్షల ఉదాత్తమైన వ్యక్తీకరణలే నిజానికి ఆయన కవిత్వాలు. సద్దాం గురించి రాసినా, ఆదివాసీల గురించి రాసినా, అరబ్ ప్రజల గురించి రాసినా, దళితులను గురించి రాసినా, దక్షిణాఫ్రికా గురించి రాసినా, రోహిత్ వేముల గురించి రాసినా, రాజ్యహింస గురించి రాసినా, పాలస్తీనా గురించి రాసినా, పసిపిల్లల గురించి రాసినా, తన ఇంట్లో పని మనిషి గురించి రాసినా, అపార్ట్మెంట్లో పనిచేసే నైట్ వాచ్మేన్ చావును గురించి రాసినా, స్త్రీలను గురించి రాసినా, తాను తెలిసీ తెలియక చేసిన కొన్ని పద ప్రయోగాల విషయంలో తాను ఆత్మవిమర్శ చేసుకున్నా ఈ అసమానతలను గురించిన విమర్శ, సమానత్వాన్ని గురించిన ఆకాంక్షలే పని చేసినట్లు కనిపిస్తాయి. ‘సహచరులు’ పుస్తకంలోనూ ఈ విలువలను గురించిన తాత్విక చర్చ వుంది. అనంతర కాలంలో ఇటువంటి మౌలిక విలువలను ప్రతిష్ఠించగల మరింత మెరుగైన రాజకీయాల దిశగానే ఆయన ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళారేమోనని అనిపిస్తుంది. ఆ అవగాహనకు అనుకూలంగానే ఆయన తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దిశగా వి.వి. చేసిన ప్రయాణంలో భాగమే విప్లవ రచయితల సంఘం, సాంస్కృతిక, రాజకీయ విప్లవోద్యమాలతో అనుబంధం.

*

కవిత్వానికి పదం, అందులోనూ అర్థవంతమైన పదం పునాది. అర్థవంతమైన పదాన్ని ప్రయోజనకరంగా, శక్తివంతంగా ప్రయోగించటం వల్లనే సాహిత్యభాష ఉనికిలోకి వస్తుంది. భాష సాహిత్యానికి సాధనం, మాధ్యమం. భాష మన సామాజిక సంపద. మానవ జీవనపక్రియలో జ్ఞానానికీ, భావ వినిమయానికీ మాధ్యమం. మానవీయ కార్యకలాపాల సమన్వయ సాధనం. మానవ చైతన్యనిర్మాణంలో భాష పాత్ర కీలకం. క్రియాశీలమైన మనిషికీ, వాస్తవికతకీ మధ్య సంబంధాన్ని అభివ్యక్తం చేసే మాధ్యమం. క్రియాశీలమైన మానవ జీవితంతోనే అనగా ఆచరణ వల్లనే భాష అభివృద్ధి చెందింది. అంతేకాదు. ఆలోచనల ఆవిర్భావానికి ఆధారభూమీ, ఆలోచనల నిగ్గుతేల్చే గీటురాయీ కూడా ఆచరణే. మనిషి ఆలోచనాశీలి కావటంవల్లనో, అనుభూతిశాలి కావటంవల్లనో కాదు, కేవలం ఆచరణశీలి కావటంవల్లనే మనిషికి ఆలోచనలు, అనుభూతులు, భాష ఆవశ్యకత అనుభవంలోకి వచ్చింది. అనేక సందర్భాలలో భాష మానవీయ కార్యకలాపాలను సుసంఘటితం చేసే శక్తిగా పనిచేసింది. పదం ఆచరణకు ప్రేరణ కల్పించింది. ఆచరణ పదానికి అర్థాన్ని అందించే శ్రోతస్వినిగా నిలబడింది. భాష కేవలం సమాజం, వ్యక్తుల ఆచరణ, చింతన, అనుభూతులను వ్యక్తంచేసే సాధనం మాత్రమే కాదు. అది అనుభవం, చింతనల మాధ్యమం కూడా. మానవ చైతన్యానికి ఎంత చరిత్ర ఉందో భాషకుకూడా అంత చరిత్రా ఉన్నది. వ్యావహారిక చైతన్యానికి మరోపేరే భాష.

కవి ఏకకాలంలో ఆచరణను పదాలుగానూ, పదాలను ఆచరణగానూ మలచుకుంటూ ముందుకు వెళతాడు. వరవరరావు కవి, మేధావి మాత్రమే కాదు, ఒక విప్లవోద్యమ కార్యకర్త కూడా. మాటకీ-చేతకీ, పదానికీ-ఆచరణకీ మధ్యవుండే సంబంధం తాలూకు అన్ని పార్శ్వాలనూ సమగ్రంగా అర్థం చేసుకున్న కవి. అందువల్లనే ఆయన అలవోకగా పదాలను ఆచరణతో జోడిస్తూ, అనుసంధానం గావిస్తూ ముందుకు నడిచారు. పదాన్ని ఆచరణతో జోడించటం అంటే పదాన్ని అర్థంతో, సాహిత్యాన్ని జీవితంతో, చింతనని వాస్తవంతో, ఆలోచనా రంగాన్ని ఆచరణ రంగంతో, సాహిత్యాన్ని విప్లవంతో జోడించటం. కవిత్వంలోనూ, జీవితంలోనూ ఈ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించిన కవి వి.వి.

*

వి.వి. కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనిపించే ఒక విశేషం – దీర్ఘకవితా నిర్మాణం. వి.వి. ప్రధానంగా దీర్ఘకవితల కవి. ఈ ధోరణి ఆయనలో ‘చలినెగళ్ళు’ నుంచీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలుగులో వి.వి. రాసినన్ని దీర్ఘ కవితలు మరి ఏ ఇతర ఆధునిక తెలుగు కవీ రాయలేదు. ఆయన దీర్ఘ కవితగా ప్రకటించింది ‘సముద్రం’ ఒక్కటే. కానీ ‘ఊరేగింపు’, ‘ఐక్యత’, ‘లెనిన్నిజం’, ‘భవిష్యత్తు చిత్రపటం’, ‘ఏడుపాయల నది ఏమన్నది?’, ‘శ్రుతి’, ‘హోరు’, ‘సైరణ’, ‘డాఝావు’, ‘లాలిపాట’, ‘అదృశ్యం’, ‘అప్నా సూరత్ బొంబాయి’, ‘అంతస్సూత్రం’, ‘బాగ్దాద్ చంద్రవంక’, ‘మెరిట్’, ‘తెలంగాణ వీరగాథ’, ‘మా స్వప్నం మరో ప్రపంచం’, ‘బీజభూమి’ వంటి కవితలన్నీ నిజానికి దీర్ఘ కవితలే.

దీర్ఘకవిత తనదయిన ప్రత్యేకత కలిగిన ఒక స్వతంత్ర పక్రియ. చిన్న కవితకీ, దీర్ఘ కవితకీ మధ్య వుండే అంతరం కేవలం నిడివికి మాత్రమే సంబంధించినది కాదు. నిజానికి అది రెండు విభిన్నమైన కవితా సిద్ధాంతాల మధ్య అంతరంతో సమానం. చిన్న కవితకి గీతాత్మత కీలకం కాగా దీర్ఘ కవితకి నాటకీయత ప్రాణం. సామాజిక వాస్తవికత అనేది ఏకపొర జీవి కాదు. దాని లోపల అనేక పొరల దొంతరలు ఉంటాయి. విషయవస్తువుగా ఒక వాస్తవికతని తన అభివ్యక్తి ఆవరణంలోకి తెచ్చుకున్న తరువాతనే కానీ కవికి సైతం ఈ వాస్తవం అవగాహనలోకి రాదు. కవితావరణంలోకి అడుగుపెట్టిన తరువాతనే వాస్తవికత తన అసలు రూపాన్ని బయటపెట్టే ప్రయత్నాన్ని ప్రారంభిస్తుంది. పొరలు పొరలుగా వైనవైనాలుగా పదాలు పదాలుగా వాక్యాలు వాక్యాలుగా తననుతాను విప్పుకుంటూ ముందుకు పోతుంది. చిన్న కవిత అనుకున్నదల్లా ఒక సృజనాత్మక వివశత్వం కారణంగా అతిపెద్ద దీర్ఘ కవితగా రూపు దిద్దుకుంటుంది.

నిజానికి చిన్న కవిత పరిధిలో విస్తృతి కలిగిన అంశాలను ప్రస్తావించటం లేదా బలమైన ప్రభావాన్ని సృష్టించటం సాధ్యం కాదు. ఒకవేళ పెద్ద ప్రశ్నలను లేవనెత్తినా చిన్న కవిత పరిధి వాటిని స్థిరంగా నిలబెట్టజాలదు. అదే దీర్ఘకవిత పరిధిలో సామాజిక వాస్తవికతనీ, మారిపోతూన్న జీవితానుభవాల నూతన పార్శ్వాలను బహిర్గతం చేస్తూ ఒక విస్తృతమైన తాత్విక పర్యావరణాన్నీ సృష్టించటం సులభం అవుతుంది. ఈ కారణంగానే చిన్న కవితతో పోల్చినపుడు దీర్ఘకవిత నిర్మాణ పక్రియ పూర్తి భిన్నంగా వుంటుందని అర్థం అవుతుంది. ఉదాహరణకి ‘సముద్రం’ వంటి కవితలను వేరే పక్రియ ద్వారా అభివ్యక్తం చేయటం అసాధ్యం. విప్లవ కవిత్వం చరిత్రలో ‘భవిష్యత్తు చిత్రపటం’ రచనారూపం శక్తివంతమైన ఒక పెద్ద ప్రయోగం. ‘భవిష్యత్తు చిత్రపటం’తో సహా ఆయన డాక్యుమెంటరీలుగా పేర్కొన్న కవితలన్నీ అదనంగా దృశ్యకథన లక్షణాలను కలిగిన దీర్ఘకావ్యాలుగా గుర్తించవచ్చు.

సమకాలీనత అనేది చరిత్ర వెలుపల మాత్రమే సంభవమయే ఒక అంశం. కవిత్వం దానికి చరిత్ర ఆవరణంలోకి ప్రవేశం కల్పిస్తుంది. మన కళ్ళముందు చరిత్రగా రూపాంతరం చెందుతున్న మన కాలం తిరిగిన రకరకాల మలుపులే ఒక రకంగా వి.వి. రాసిన దీర్ఘకవితలు. కవిత్వంలో శిల్పమే సర్వస్వం అని విశ్వసించే చాలామంది రచనలతో పోల్చితే వరవరరావు అనుసరించిన శిల్పంలో వాళ్లందరికీ మించిన వైవిధ్యం వుంది. ఆధునిక వచన కవిత్వం ఆదిమధ్యాంతాల మర్మం తెలిసిన అతి కొద్దిమంది ఆధునిక తెలుగు కవులలో వి.వి ఒకరు.

ఒక కవిగా వి.వి. గురించి చెప్పుకోవలసినవి చాలానే వున్నాయి. వి.వి. వచన కవితల శైలీ శిల్పాలను గనుక మనం నిశితంగా గమనిస్తే మనకు కొన్ని వాస్తవాలు యెరుకలోకి వస్తాయి. కవిత్వం మీద వల్లమాలిన వాత్సల్యం వున్నప్పటికీ తాను కవిమాత్రుడుగా మిగిలిపోవాలని ఆయన ఎన్నడూ కోరుకోలేదు. విప్లవోద్యమంతో అనుబంధాన్ని పెంచుకుంటూ వెళ్తూన్న క్రమంలో కవిత్వం ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ఆగిపోతుందో అనతి కాలంలోనే ఆయనకు అర్థమైపోయింది. అందుకే తాను ప్రాతినిధ్యం వహించిన ఉద్యమ అవసరాల నిమిత్తం ఆయన పత్రికా రచన పద్ధతిని కవిత్వంలో అనుసరించారు. వార్తా రచన పత్రికా రచనలో భాగమే కానీ కేవలం వార్తా రచనే మొత్తం పత్రికా రచన కాదు. అయితే అప్పుడప్పుడూ ఆధునిక వార్తా కథన పద్ధతిని సయితం ఆయన తన కవితా రచనలో అనుసరించారు. ఆధునిక తెలుగు వచన కవిత్వంలో దీనిని వి.వి. ప్రత్యేకంగా సాధన చేసిన ఒక సరికొత్త సౌందర్యశిల్ప విశేషంగా గుర్తించవచ్చు.

నిజానికి మితకథనం ఆధునిక కవిత్వం ప్రధానలక్షణం. సాధారణంగా వి.వి. మితకథనం పాటించరు. ఆయన కవితల్లో వివరాల విస్తృతి విపరీతంగా వుంటుంది. తన చుట్టూవున్న ఉద్రిక్త వాతావరణాన్నీ, ఉద్విగ్నతనీ, అనుభూతి తీవ్రతనీ, మానవీయ సారాన్నీ కలిపి పదాలను చార్జ్ చేసి నడకలో ఒక మెరుపు వేగాన్ని తీసుకు వస్తారు. వి.వి. అనుసరించే ఈ మార్గానికీ, కొడవటిగంటి కుటుంబరావు కథనశైలికీ మధ్య లీలగా ఏదో పోలిక ఉన్నట్లు ఒక చిన్న అనుమానం. కొడవటిగంటి కుటుంబరావు తన ఎదుట రూపుదిద్దుకుంటున్న నూతన ప్రపంచంనుంచి తన కథలు, నవలలకు అవసరమైన వాస్తవికతను గ్రహించి దాదాపుగా వార్తాకథన శిల్పంలోనే సాదాసీదా భాషలో, సునిశితమయిన శైలిలో రాస్తారు. అయితే ఫక్తు వచన రచయిత అయివుండి కుటుంబరావు తన రచనలలో మితకథనం పాటిస్తారు. కానీ కవి అయివుండికూడా వరవరరావు తన కవిత్వంలో మితకథనం పాటించరు. అలాగే కవితల్లో ఈస్థటిక్స్ లేదా రాజకీయ చర్చలు చేయటం, తన స్వరం నుంచి మాత్రమేగాక భిన్న స్వరాలతో, చివరికి ఖల్ నాయకుని స్వరం నుంచికూడా కవితలను పలికించటం వంటివికూడా వి.వి.లోని కొ.కు.ని పట్టిస్తాయి.

పత్రికా రచనని ‘హిస్టరీ ఇన్ హర్రీ’ అంటారు. ఒక పత్రికా రచయితకు మించిన ‘హర్రీ’ ఉద్యమకారుడుగా వరవరరావు వ్యక్తిత్వంలో వుంది. ఆయన సాధారణ పత్రికా రచయిత కాదు. భీకరమైన యుద్ధక్షేత్రంలో పని చేస్తూన్న ప్రత్యేక పత్రికా ప్రతినిధిలాంటి కవి. అందుకే ‘చిరుతకూకటి నాటి’ ఆయన కవిత్వంలోని పద ఝంకారం అనంతర కాలపు కవిత్వంలో వినిపించదు. యుద్ధసంగీతం వంటి ఒక ధిక్కార స్వరసంగీతం మాత్రం వినిపిస్తుంది. కవిత్వంలో పత్రికారచన పద్ధతిని అనుసరించటం చిన్న విషయం కాదు. గత నాలుగయిదు దశాబ్దాల కాలంలో వివిధ సాహితీ పక్రియల మధ్య సరిహద్దు రేఖలు అంతర్థానం కావటం వెనుక అసలు కారణాన్ని గుర్తిస్తేనే తప్ప పత్రికారచన సాహితీ పక్రియలలో ఒకటిగా నిలదొక్కుకుంటూన్నదనే వాస్తవం మనకు బోధ పడదు. పత్రికారచనకీ, సాహితీరచనకీ మధ్య అగాధం ఏమీ లేదనే వాస్తవం మనకు తెలిసిరాదు. నిజమయిన పత్రికా రచయితా, సాహితీకారుడూ ఇద్దరూకూడా నూతన మానవసంబంధాలను అన్వేషించే పనిలో నిరంతరం నిమగ్నమై వుంటారు. ఇద్దరు మనుషుల మధ్య సంబంధాలలో వస్తూన్న మార్పులను పసిగట్టి వాటిని ఎప్పటికప్పుడు ప్రపంచం ముందు వుంచే ప్రయత్నం చేస్తారు. ఉద్దేశం ఇద్దరిదీ ఒకటే. ప్రకటించే పద్ధతిలో కొద్దిపాటి భేదం వుంటే వుండవచ్చు. అప్పటికే సంభవించిన వాస్తవికతను పత్రికారచయిత ఎక్కువగా పట్టించుకుంటే కవి లేదా రచయిత సంభావ్య వాస్తవికత మీద అదనంగా దృష్టిని కేంద్రీకరిస్తాడు. ఒక సంఘటన వెనుక నిగూఢమైన అర్థాన్ని సమగ్రతలో ముందుకు తెచ్చేందుకుగాను వి.వి. తన కవితలలో సృజనాత్మకంగా ఈ సంభావ్య వాస్తవికతను అభివ్యక్తం చేస్తారు. ఒక సంఘటన లేదా ఒక విషయం తాలూకు అర్థాన్ని ఆయన తన కవితలలో అభివ్యక్తం చేసే పద్ధతే ఆయనను ఒక బలమైన రాజకీయ కవిగా నిలబెడుతుంది.

*

శివసాగర్, వరవరరావులు తెలుగులో విప్లవ రాజకీయ కవిత్వానికి రాచబాట వేశారు. విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి పూర్వం రాజకీయాలకు ఇంత సమీపంగా కవిత్వం ఎన్నడూ రాలేదు. కవిత్వాన్ని నేరుగా సమాజంతో ముడివేసే సహజమైన నుడికారాలు సయితం రంగప్రవేశం చేయలేదు. తెలుగులో విప్లవ రచయితల సంఘం సాధించిన విజయాలు అనేకం. సాహిత్యంలోనూ, రాజకీయాలలోనూ అనిర్దిష్టత నుంచి నిర్దిష్టతకీ, సర్వనామాల నుంచి నామవాచకాలకీ ప్రయాణించటమే కాదు. అడవికీ, వెన్నెలకీ వున్న అర్థాలను పూర్తిగా తల్లకిందులు చేసింది విరసం. ఈ రెండింటినీ నూతన అవధారణలుగా ఆవిష్కరించింది. చాలామంది కంటికి ఆనక పోవచ్చునేమో గాని ప్రపంచ సాహిత్య చరిత్ర సయితం గుర్తించదగిన విశేషమైన పరిణామం ఇది. విప్లవోద్యమం, అందులో భాగంగా విరసం సృష్టించిన చరిత్రలో వి.వి. ప్రమేయం విస్మరించలేనిది. విరసం తన శాశ్వత చిరునామా అని ప్రకటించుకున్నాడు శీశ్రీ. కానీ అది వాస్తవం కాదు, ఒక అతిశయోక్తి. చిరునామాగా మాత్రమే కాదు, విరసమే తన సర్వస్వంగా జీవించిన వ్యక్తి వి.వి. ఇది అతిశయోక్తి కాదు, పచ్చి నిజం. నిజానికి వి.వి. విరసానికి తిరుగు లేని, ఎన్నటికీ చెరగిపోని ఒక శాశ్వత చిరునామా. ఇది అవాస్తవం కాదు. ఒక చిన్న అతిశయోక్తి. వి.వి. కవితల్లో చరిత్ర గతిని గురించీ, పక్రియను గురించీ, దిశను గురించిన ప్రస్తావన వుంటుంది. గత అర్ధ శతాబ్దపు భారతీయ సామాజిక చరిత్ర పరిణామాలు, దారుణాలు, విషాదాలు, కీలకమైన సంఘర్షణలు, సంఘటనల గురించిన అభివ్యక్తి కేవలం ఒకే ఒక కవిలో చూడాలని అనుకుంటే అది ఒక్క వరవరరావు కవిత్వంలో మాత్రమే లభించగలదని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం ఎనభయ్యేళ్ళ వయసులో మహరాష్ట్రలోని యరవాడ కారాగారంలో బెయిలు కూడా దొరకక నిర్బంధంలో వున్న వరవరరావును ఒక విధంగా ఎ పొయట్ ఆఫ్ ప్రిజన్స్ అనికూడా అనవచ్చునేమో. అతి సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపిన కవి. ఇనప వూచల వెనుక ఆయన అనుభవిస్తూన్న ఉద్విగ్నక్షణాల ఉద్రిక్తతని ఆయన మాటల్లోనే ఊహించుకున్నా ‘గుండె పొరమీద చెమట పడు’తుంది.
‘కళ్ళముందే పొంగిపోయిన పాలు
పొయిలో పడి టైమ్ అయిపోయిన వాసనొస్తుంది.’
‘నిరీక్షణ నిరాశలో చల్లారుతున్న చప్పుడు తెలుస్తుంది.’
విస్ఫోటనం చెందిన మౌనం వినిపిస్తుంది.

‘లాగరా హైలెస్సా’ పాట ప్రారంభంలో క్షణకాలం పాటు కొనకళ్ళ వెంకట రత్నం ‘రోడ్డురోలరు’ పాట మదిలో మెదిలినా మరుక్షణమే మన మూడ్ మారిపోతుంది. కవిత చదవటం ముగిసేసరికి జైలు గదిలో గడిపే ఒంటరి క్షణాల బరువును ఈడ్చలేని ఒక అశక్తత ఆవహించి పాఠకుని గుండె బరువెక్కి పోతుంది.
లాగరా కాలాన్ని లాగరా హైలెస్సా
లాగరా
కదలకున్నది కాలం
నిలువకున్నది మనసు లాగరా
అదలించి కాలాన్ని
అదుపు చేయర మనసు లాగరా
ఎక్కడున్నది స్వేచ్ఛ
ఎక్కడైనా ఖైదే లాగరా
ఎగరనీరా మనసు
విరగనీరా గొలుసు లాగరా
ఛేదించి సంకెలలు
చేదుకోరా స్వేచ్ఛ లాగరా….
ఊపిరి గతిని, మనస్థితిని ఎంతో అలవోకగా అక్షరాలలోకి అనువదించటంలో వి.వి. చూపించిన శిల్పం, పనితనం ఆయనలోని అభివ్యక్తి శక్తిని మాత్రమే కాదు, తెలుగు భాషమీద ఆయనకుగల సాధికారతకు కూడా సాక్షిగా నిలుస్తుంది.

రాజకీయ విమర్శ కోసం ఆయన తన కవిత్వంలో వ్యంగ్యాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించారు. తీక్షణమైన వ్యంగ్యంతోపాటు సున్నితమైన హాస్యం ఆయన స్వంతం.
‘ఇక్కడ తరిమెల నాగిరెడ్డి పెంచిన మామిడి చెట్టు
కొండపల్లి సీతారామయ్య పెంచిన నిమ్మచెట్టు పేచీ లేకుండా పెరుగుతున్నాయి’ అని రాశారు. ఇదీ జైలు అనుభవమే.

వి.వి. కేవలం వచన కవితల కవి మాత్రమే కాదు. ఉద్యమం డిమాండు చేసిన ప్రతి సందర్భంలోనూ పాటలు కూడా రాసిన కవి. నిజమైన అర్థంలో ప్రజల కవి. చాలామంది కవుల కవిత్వంలో ప్రజలు అనే భావన కేవలం ఒక కల్పన. కానీ వి.వి. కవిత్వంలోని ప్రజలు స్పష్టంగా పోరాడితే పోయేదేమీ లేని కష్టజీవులయిన పీడిత ప్రజలు, ‘కాస్తంత నమ్మకమి’చ్చేవాళ్ళు కానరాక చరిత్ర అట్టడుగున కనిపించకుండా పడివున్న ప్రజలు. అయితే ప్రతీ కవీ ప్రజల కోసమే రాస్తున్నానని అనుకుంటాడు. రచనలో రకరకాల పోకడలు పోతాడు. వస్తువు ప్రగతిశీలం, రూపం అత్యధునాతనం అయినపుడు అది శిష్టజన లేదా విశిష్టజన (ఎలీట్) కవిత్వం లేదా సాహిత్యం అవుతుందే తప్ప ప్రజల కవిత్వం, ప్రజల సాహిత్యం కాజాలదు. అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పును తీసుకువచ్చే పక్రియలో నిర్ణయాత్మకమైన పాత్రను నిర్వహించటం ద్వారా మాత్రమే కవిత్వం సార్ధకతను సాధిస్తుంది. సమాజంలో మార్పు అనేది కేవలం మన ఆకాంక్షల వల్లనో లేదా కవిత్వం వల్లనో సాధ్యమయేది కాదు. కేవలం రాజకీయాల మాధ్యమం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు పక్రియ ముందుకు సాగుతుంది. కవిత్వానికీ, రాజకీయాలకీ మధ్య బలమైన అనుబంధం అనివార్యమైన ఒక అవసరం. అధికార వ్యవస్థతోపాటు రాజ్యం నిజస్వరూపాన్ని ప్రజలముందు నిర్భయంగా బట్టబయలు చేయగల సాహిత్యమే నిజమైన అర్థంలో ప్రజల సాహిత్యం. సత్యాన్ని అన్వేషించటం కాదు. కళ్ళముందు కనిపిస్తూన్న సత్యాన్ని ‘ఉన్నదేదో ఉన్నట్లు’ చెప్పగల నైతిక సాహసం ఈనాటి అవసరం. అటువంటి నైతిక సాహసాన్ని వెన్నెముకగా ధరించిన ఒక రాజకీయ కవి వరవరరావు.

నేను విప్లవ కవిని అని వరవరరావు ఎక్కడా చెప్పుకోలేదు. కానీ సాహితీ ప్రపంచం ఆయనను అలానే గుర్తించింది. వాస్తవానికి వరవరరావు కేవలం విప్లవ కవిత్వం మాత్రమే రాయలేదు. ఎన్నో ప్రేమగీతాలు రాశారు, మరెన్నో ప్రణయ గీతాలు రాశారు. వియోగ గీతాలు (పొయిట్రీ ఆఫ్ లాస్) రాశారు. ఆయన వరంగల్ గురించి రాసిన కవిత్వం గొప్ప వియోగ గీతం. ప్యారిస్ గురించి బోదిలేరు, సెయింట్ పీటర్స్బర్గ్ గురించి పుష్కిన్, న్యూయార్క్ గురించి లోర్కా, బెర్లిన్ గురించి బ్రెహ్ట్, లండన్ గురించి ఎలియట్, ఢిల్లీ గురించి గాలిబ్ వంటి కవులకు వుండిన ఉద్వేగపూరితమైన సంబంధాలను ఈ కవిత గుర్తుకు తెస్తుంది. పరమ కఠినమైన ఇనుప తీగెలు, అతి మృదువైన పట్టు దారాలను కలిపి అల్లిన అసాధారణమయిన కవిత్వం అని అభివర్ణించాడు హిందీ కవి కేదార్నాథ్ సింగ్ అమరుడయిన పంజాబీ కవి అవతార్ సింగ్ పాష్ కవిత్వాన్ని పరామర్శిస్తూ. మన తెలుగులో ఈ మాటలు ప్రేమ, మానవత్వం, పోరాటం, వేదన, విప్లవాలను ఏకసూత్రంలో బంధించగల వి.వి. కవిత్వానికి నూటికి నూరు శాతం వర్తిస్తాయని చెప్పవచ్చు.

వి.వి. కవిత్వంలో నిరంతర చలనం తప్ప ఎక్కడా స్తబ్ధత కనిపించదు. ప్రవాహ గుణం తప్ప నిలువనీటి లక్షణం అసలు వుండదు. దాపరికం ఆయన కవిత్వం దరిదాపులను తాకదు. వి.వి. కవితలలో కనిపించని ఒక అశాంతి పద్యం విస్తరించినంత మేరా వ్యాపించుకుని ఉంటుంది. ఈ అశాంతితోపాటు ఒక అలజడి వుంటుంది. వీటి మిశ్రమం ఫలితంగా ఒక ఉద్రిక్తత ఊపిరిని అందుకుంటుంది. ఆ ఉద్రిక్తత మెలమెల్లగా పాఠకుని మనోమస్తిష్కాలను ఆవహిస్తుంది. జీవితంలోకి ఒరిగి చదువరిలో అంతకుముందు లేని ఒక నమ్మకాన్ని నిర్మిస్తుంది.

వరవరరావు, వరవరరావు కవిత్వం రెండూ వేరువేరు కాదు. పరస్పరం అవి పర్యాయ పదాలు. బాధ్యత ఎరిగిన, నిబద్ధత కలిగిన ఒక పెద్ద కవి కేవలం కవిత్వం మాత్రమే రాయడు. ముందు తరాల కవులకు అవసరమయిన పాఠాలను సయితం సంసిద్ధం చేస్తాడు. వి.వి. కవితలు కేవలం విప్లవ కవితలు మాత్రమే కాదు. రాబోయే తరాల విప్లవాలకు, విప్లవ కవులకు అత్యవసరమయిన పాఠ్యాంశాలు కూడా. ఆ విధంగా ఆయన ఒక మాస్టర్ పొయట్. పొయట్ మాస్టర్. విప్లవ కవి గురువు. నక్సల్బరీ ఆలోచనల ఆకాశం కింద నిగ్గుదేరిన కవి. ఒక అవిశ్రాంత పోరాటయోధుడు.

పాలమూరు అధ్యయన వేదిక బాధ్యులందరికీ మరోసారి మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

థ్యాంక్యూ…

*

“వరవరరావు ఆవేశపరుడు – కాని ఆలోచనా, ఆత్మవిమర్శా ఉన్నవాడు-విరసంలో కత్తిలాంటి చురుకైన మనిషి – మంచి వక్త-ప్రజాదరణ పొందుతున్న, ఆయుధాలు మొలుస్తున్న కంఠం యితనిది-ఈ కంఠానికే భయపడి ప్రభుత్వం మొన్న అక్టోబర్లో అతన్ని అరెస్టు చేసింది. కాని అతడు జైల్లో రక్త స్వప్నాలు కన్నాడు-కలాన్ని పదునుపెట్టుకున్నాడు-ఈయన మాటల్ని యీటెలుగా విసరగలడు. అవి శత్రువు గుండెలమీద విషాన్ని, ప్రజల గుండెల్లో అమృతాన్ని చిలుకుతాయి. అందుకే పోలీసులకు యీయన మాటలమీద, ఆలోచనలమీద నిఘా-తాను ప్రజల పక్షం ఉన్నంతకాలం తనకు ఢోకాలేదని నమ్ముతాడు.” -లోచన్ (1974)

(పాలమూరు అధ్యయనవేదిక ( మహబూబ్ నగర్ ) 2019 లో ప్రచురించిన ‘సముద్ర స్వరం వివి కవిత్వంతో ఒక రోజు’ సాహిత్య సభ ప్రసంగ వ్యాసాల సంకలనం నుండి )

Leave a Reply