ద రైటర్ ఆఫ్ ఆల్ ద టైమ్స్

‘నేను నా వచనాల ద్వారా సృష్టించబడ్డాను. నా కథల్లోని పాత్రలన్నీ నేనే.
నేనే మోహన సుందరాన్ని, నేనే లలితను, నేనే మోహినిని.
నా పాత్రల గుండెల్లోని resentment నేనే , nostalgia నేనే.
తన శరీరంపై తానే గాయాలు చేసుకుంటున్న కాలం నేనే.
నా కథల్లోని ప్రోటోగనిష్టులు నా లోపలి రిప్రెషన్ నుంచి, సందేహాల నుంచి, కోట్లాది భయాల నుంచి, చిటికెడంత ఆశనుంచి పుట్టుకొచ్చినవాళ్ళే’ -డా. వి. చంద్రశేఖరరావు

భౌతిక ప్రపంచం – స్వప్న ప్రపంచం యీ రెండింటి మధ్య అలుపులేని అన్వేషణలో సంచరించే వ్యక్తుల ఛిద్ర జీవితాలు అతని కథలు. భిన్న విశ్వాసాల మధ్య లుప్తమౌతున్న విలువలు, అనేక విధ్వంసాల మధ్య విచ్ఛిన్నమౌతున్న మానవ సంబంధాలు అతని కథలకు యితివృత్తాలు. ప్రేమ ద్వేషం, ఆశ నిరాశ, గెలుపు వోటమి, విధేయత విద్రోహం, నమ్మకం అపనమ్మకం, తిరుగుబాటు లొంగుబాటు, ఆనందం విషాదం… వంటి అనేక ద్వంద్వాల మధ్య, సదసత్సంశయాల మధ్య నలిగిపోతూ ఆధునికత నుంచి అత్యాధునికత వైపు నడుస్తున్న మనుషులు అతని పాత్రలు. చేతనాచేతన మస్తిష్కం లోపలి పొరల నుంచి తవ్వితీసిన పలవరింతల ధ్వని సంపుటాలు అతని వచనం. దయగల తల్లులు అతని అక్షరాలు. యెవరో కవి అన్నట్టు అవి కన్నీటి జడులలో తడిసిన దయా పారావతారాలు. రక్త కాసారంలో యీదులాడే రాజహంసలు అతని వాక్యాలు. అతని భాష హృదయ భాష. అది దు:ఖోద్విగ్నుల ఆర్తనాదం. క్రోధోద్రిక్తుల యుద్ధాక్రందన. మనిషి లోపలి బయటి లోకాల్నీ వాటి మధ్య నిరంతర సంఘర్షణనీ తనదైన శైలిలో ఆవిష్కరించడానికి భాషకున్న మార్మిక శక్తిని వుపయోగించుకున్న అరుదైన రచయిత అతను. తెలుగు కథకి కొత్త ముఖాన్ని, రక్త మాంసాల్ని సమకూర్చిన అతను : డా. వి. చంద్రశేఖరరావు.

స్వీయ జీవితానుభవ నేపథ్యం నుంచే చంద్రశేఖరరావు కథకుడిగా మొదలైనప్పటికీ (జీవని, ఎలీసా ఎలీసా, మదర్ అండ్ చైల్డ్ మొ.) తొలి నుంచీ వామపక్ష ప్రగతిశీల భావజాలమే అతని కథలకు ప్రాణవాయువుని అందించింది. విప్లవాల యుగంలో గోడమీద నినాదాల్ని చదువుకుని యెదిగిన విద్యార్థి జీవితం అతనిది. విరుద్ధ శక్తుల సంఘర్షణలోనే సామాజిక పరిణామాలు చోటుచేసుకుంటాయన్న గతి తార్కిక అవగాహన నుంచే చంద్రశేఖరరావు కథకుడిగా పరిణతి చెందాడు. తొలి సంపుటిలోని డియర్ కామ్రేడ్, మహాకవి మరణం వంటి కథలు అందుకు నిలువెత్తు తార్కాణాలు. ఎన్ని పరిణామాలు జరిగినా యీ ప్రాపంచిక దృక్పథం అతణ్ణి ఆజీవితం అంటిపెట్టుకునే వుంది. రూప పరంగా కథతో యెటువంటి ప్రయోగాలు చేసినా కడదాకా పీడితుల పక్షంలోనే అతను నిలబడ్డాడు. బాధితుల గొంతునే వినిపించాడు. అనేక ఆధిపత్యాల కింద నలిగిన శోషితుల దుఃఖమే రక్తమే కన్నీళ్ళే వ్యధే అతని కథలకు వస్తువైంది. వేట చరిత్రలో వేటగాడి వైపున గాక సింహాల వైపు నిలిచి చరిత్ర తిరిగి నిర్మించాలని అతని సంకల్పం. పరాజితుల పలవరింతలనే సాహిత్యీకరించాలని కడదాకా తీర్మానించుకున్నాడు. రహస్యోద్యమాల్లో ప్రాణాల్ని పణంగా పెట్టి పోరిన యోధులు అతని ఆరాధ్య హీరోలు. అయితే వుద్యమాలు మరింత నిర్దిష్టమౌతూ దళిత స్త్రీవాద ధోరణులుగా ప్రత్యేక అస్తిత్వాల్ని సంతరించుకునే సామాజిక సందర్భం చంద్రశేఖరరావుని విశిష్టమైన కథకుడిగా తీర్చిదిద్దింది. సాయుధ మార్క్సిస్టు లెనినిస్టు పంథాని, దాని గమనాన్ని అతను నిశితంగా చూశాడు. అనేక శిబిరాలుగా చీలిన విప్లవోద్యమం దగ్గర్నుంచి అస్తిత్వవాదోద్యమాల వరకూ భిన్న సామాజిక వుద్యమాల మధ్య పరస్పర విభేదాల్ని అంతర్గత వైరుధ్యాల్ని అతను యెంతో విమర్శనాత్మకంగా పరిశీలించాడు. వైరుధ్యాల పరిష్కారాలు ప్రజల నుంచే లభిస్తాయని అతనికి తెలుసు. కానీ తాను బలంగా నమ్మిన విశ్వాసాల మీద దాడి మొదలైనప్పుడు, ఆదర్శంగా స్వీకరించిన వ్యక్తులు రాజకీయ కెరీరిజంలో కూరుకుపోయి విద్రోహాల బాటలోకి మళ్ళినప్పుడు, సమాజాన్నీ ప్రజా జీవితాల్నీ ప్రభావితం చేసే వుద్యమాలు విఫలమవున్నప్పుడు, పౌర హక్కుల గొంతులు అణచివేతకి గురైనప్పుడు, దళిత స్త్రీవాద వుద్యమాల్లోంచీ ఎదిగినవాళ్ళు, ప్రజా సంఘాల్లో క్రియాశీల పాత్ర వహించినవాళ్ళు ఎన్జీవోలుగా కొత్త అవతారాల్లోకి మారుతున్నప్పుడు, మనుగడ కోసం – కేవలం బతకడం కోసం – తమ సమస్త శక్తులూ వొడ్డి అంచులకు నెట్టబడ్డ ప్రజా సమూహాలు అనునిత్యం సంఘర్షించే గ్లోబల్ సందర్భంలో వొక వూపిరాడని తనం నుంచి మానసిక కల్లోలం నుంచి అతనిలోని కథకుడు కొత్త వ్యక్తీకరణని యెంచుకున్నాడు. తాను అప్పటిదాకా రాస్తున్న శైలి నుంచి బయటపడి కొత్త తరహాలో కథలు రాయటం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో లెనిన్ ప్లేస్ (1998) మాయలాంతరు (2003) సంపుటాల నాటికి చంద్రశేఖరరావుకి తనదైన విశిష్ట రచనా శైలి ఏర్పడింది. దోహవృక్షం (2012) నాటికి అది అనితరసాధ్యం అన్నంతగా స్థిరపడింది. దానిలో మొనాటనీని చూసినవాళ్ళున్నారు. దాన్నుంచి అతను బయటపడనప్పటికీ కథా వస్తు స్వీకారంలో చూపిన వైవిధ్యం, విస్తృతి అతణ్ణి తిరుగులేని రచయితగా నిలబెట్టాయి.

సమాజంలో చోటు చేసుకున్న ప్రతి సన్నివేశం ప్రతి సంఘటన భిన్న ముఖాలతో సాంద్ర రూపంతో చంద్రశేఖరరావు చేతిలో కథగా పరిణమించింది. దాదాపు వొక యాభై యేళ్ళ తెలుగు సమాజపు చరిత్రకి అతని కథలు రాజకీయ వ్యాఖ్యానాల్లా, ఆకారాల్లా రూపొందాయి. సామాజిక సంక్షోభంలో కల్లోలానికి గురైన జీవితాల్ని కథీకరించడానికి అతను సంఘటనని నెపం చేసుకుంటాడు. దాని ద్వారా సమాజాన్నీ, సమాజాన్ని నడిపించే రాజకీయ సందర్భాన్నీ, దాన్ని శాసించే దృశ్యాదృశ్య శక్తుల్నీ లోతుగా విశ్లేషిస్తాడు. గమనించాల్సిన అంశం యేమంటే ఆ విశ్లేషణలో తార్కికత కన్నా వుద్వేగమే ప్రధాన భూమిక వహిస్తుంది. బాధితుల విషాదాన్ని తనదిగా భావించే సున్నిత వ్యక్తిత్వం అతనిది. యెవరో అన్నట్టు ప్రపంచపు బాధని తనలోని ‘దుఃఖపు అర’లోకి వొంపుకుంటాడు. అది అతణ్ణి లోపల దహిస్తూ వుండగా కథ చెప్పే క్రమంలో జీరబోయిన గొంతుతో మనతో సంభాషణకు వుపక్రమిస్తాడు. అణచి వుంచుకున్న/ దాచిపెట్టిన వుద్వేగాన్ని తీవ్ర భావావేశంతో మన ముందు గుమ్మరిస్తాడు. చాలా సందర్భాల్లో అది కవితాత్మకమైన జానపద పురాగాథలా మారిపోతుంది. అది పాములా జరజరా పాకుతూ అతని హృదయంలోంచి పాఠకుల హృదయాల్లోకి నేరుగా ప్రవేశిస్తుంది. ఉత్తుంగ జలపాతంలా దూకుతుంది. విద్యుత్తరంగంలా ప్రసారమౌతుంది. అయితే; చంద్రశేఖరరావు కథలో సంఘటనని యేక మొత్తంగా అఖండ సంఘటనగా గాక శకలాలుగా ప్రస్తావిస్తాడు. అందువల్ల అతని వచనం కూడా ముక్కలు ముక్కలుగా రూపొందుతుంది. వాచకం నిండా వొక భావ శబలత పరచుకుని వుంటుంది. అనేక భావాలు మూకుమ్మడిగా అతని హృదయంమీద దాడి చేసి వచనంలోకి చొచ్చుకొస్తాయి. పాత భావం సగంలో తెగి కొత్త భావం మొలుస్తుంది. అవి సముద్రపు అలల్లా నిర్విరామంగా వొకదాని వెంట మరొకటి తరుము కొస్తాయి. వొకటి వుపశమించే లోపు మరొకటి పుట్టుకొస్తుంది. అసంపూర్ణ వాక్య సముదాయాలని వొకచోట కుప్పబోసి కొల్లేజ్ చేసి అతను కథ నడుపుతాడు. ఈ ప్రయోగం అతనికే సొంతం. అది కేవల ప్రయోగంగా కొందరు భ్రమపడి వుండొచ్చు. కానీ పాత్రల మూడ్ నీ, దాని ద్వారా మొత్తం సమాజం మూడ్ నీ అతను తన విలక్షణమైన భాష ద్వారా అభివ్యక్తం చేస్తాడు. కవిత్వంలో బైరాగి మో లాంటి యే కొద్దిమందో చేపట్టిన యీ రచనా శైలిని చంద్రశేఖరరావు కథల్లో స్వీకరించాడు. నిజానికి కవి కావాల్సిన ఆందోళన జీవి కథకుడయ్యాడు.

***

కథ చెప్పడంలో చంద్రశేఖరరావుది విలక్షణమైన శైలి. ఈ శైలి సంప్రదాయ కథనరీతులకు భిన్నమైనది. కథలకి పేరు పెట్టడం దగ్గర్నుంచి ముగింపులా కనపడని ముగింపు వరకూ అది కనిపిస్తుంది. అందువల్ల అతని కథలు రూఢిగా ప్రచారంలో వున్న యే కథా సూత్రాల పరిధిలోకీ యిమడవు. అనేక సందర్భాల్లో అతని పాత్రలే అతని కథలు. పాత్రలు జ్ఞాపకాల పొరల్ని వొలుచుకుంటూ వచ్చే క్రమంలో కథ unfold అవుతుంది. పాత్రల సంభాషణల్లో కన్నా అశాంత స్వగతాల్లో, యేకాంతాల అలజడిలో పాత్రల ఆశలు ఆశయాలు ఆలోచనలు నిర్ధారణలు నిస్పృహలు వ్యక్తిత్వాలు ఆవిష్కారమౌతాయి. జీవితానికి చెందిన అనేక పార్శ్వాలు విశదమౌతాయి. అంతేకాదు; అవి జీవించిన స్థల కాలాలు సైతం యెరుకలోకి వస్తాయి. వాటి పరిణామాలు గోచరిస్తాయి. అప్పుడవి కేవలం జ్ఞాపకాలు కావు. గతం నుంచి తవ్వి తీసిన సామాజిక చరిత్ర శకలాలుగా అర్థమౌతాయి. ఆ శకలాలనుంచి వ్యక్తుల భగ్నమయ్యే కలల్ని పిండుకోవాలి. మానవ సమూహాల వేదననీ శిధిలమౌతోన్న విలువల్నీ గుప్పిట పట్టాలి. నిజానికి చంద్రశేఖరరావు పాత్రలు స్థల కాలాల్లో వొదిగి వుండటానికి నిరాకరిస్తాయి. స్వేచ్ఛగా అనూహ్యంగా అసాధారణంగా ప్రవర్తిస్తాయి. ఆ అసాధారణత్వం కారణంగా పాత్రల వ్యక్తిత్వం పాఠకులకు వెంటనే యేర్పడదు. సమాజంలోని అలజడిని పట్టుకోగలిగితేనే ఆ పాత్రలకి చేరువ కాగలం. భిన్న అస్తిత్వాలకు అస్తిత్వ వేదనలకు ఆకాంక్షలకు ఆయన పాత్రలు ప్రతీకలు అని సింపుల్ గా చెప్పొచ్చు; కానీ మరింత లోతుగా చూసినప్పుడు సమాజంలో సంభవించే అనేక పరిణామాలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. భిన్న భావజాలాలకు వాటి మధ్య చోటుచేసుకునే ఘర్షణలకీ వాటిలోని మార్ఫాలజీ ఆఫ్ హిస్టరీకి సెమెంటిక్స్ ఆఫ్ కల్చర్ కీ అవి ప్రతిఫలనాలుగా కనిపిస్తాయి. మోహనసుందరం లాంటి అనేక సుందరాలు, మోహనరావు మనోహర్లు, సత్యప్రకాశాలు, పూర్ణ మాణిక్యాలు, మోహిని, పార్వతి, మాలతులు… వీళ్ళంతా నల్లటి దుఃఖపు రంగు పులుముకున్న కాలం చీకటి అంచుల్లో నడిచినవాళ్ళే. గత వర్తమానాల సరిహద్దుల మధ్య తచ్చాడేవాళ్ళే. నమ్మిన ఆశయాలకో ఉద్యమ ఆకాంక్షలకో వాటి గమనాలకో సాఫల్య వైఫల్యాలకో వ్యక్తుల ఆశ నిరాశలకో స్వార్థాలకో ద్రోహాలకో మనుషుల ఔన్నత్యానికో నీచత్వానికో నిద్రపట్టని రాత్రులకో కూలిన స్వప్నాలకో వాళ్ళు నమూనాలుగా గోచరిస్తారు. గాయాలు మోసుకుంటూ మూలిగే కాలానికి చిహ్నాల్లా కదులుతూ వుంటారు. చరిత్రకి ప్రత్యక్ష సాక్ష్యాలుగా దర్శనమిస్తారు. అతను నిర్మించిన ప్రతి పాత్ర అది protagonist అయినా antagonist అయినా పాదరసంలా చాలా చలనశీలంగా వ్యవహరిస్తుంది. చాలా కథల్లో ఆ యా పాత్రల పేర్లు వొకటే గానీ వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు. లేదా వొకే వ్యక్తిలోని భిన్న పార్శ్వాలకు, అంతరాంతరాల్లో పేరుకుని వున్న వేర్వేరు పొరలకు మెటాఫర్లు. ఆ పాత్రల్ని నలుపు తెలుపుల ఫ్రేం ల్లోకి కుదించలేం. వాటిలోని వివిధత విభిన్నత విలక్షణత బహుళత సంక్లిష్టత మనల్ని అబ్బురపరుస్తాయి.

వొక సామాజిక బీభత్సం కావచ్చు, జీవన విధ్వంసం కావచ్చు లేదా విలువల పతనం కావచ్చు చంద్రశేఖరరావు చేతిలో పాత్ర రూపం ధరించి కథలుగా తర్జుమా అయ్యే అద్భుతం యేదో పాఠకుల్ని కనికట్టు చేస్తుంది. ఈ మాంత్రిక విద్యని దేన్నో రచయితగా చంద్రశేఖరరావు నిరంతరం సాధన చేశాడు. పాత్రల్లోకి మనం లీనమౌతామో పాత్రలు మనలోకి చొరబడతాయో తెలీదు; కానీ కథ చదువుతున్నప్పుడు యిది అని చెప్పలేని వొక పఠన మోహంలో కూరుకుపోతాం. ‘నా కథలు నా లోపలి నిశ్శబ్దాలు, సంచలనాలు, నిలువనీయని ఉద్వేగాలూ, నేను నడిచివచ్చిన కాలాన్ని, దాని నడకల్ని, మనుషుల్ని, మనుషుల కలల్ని, గాథల్ని, వాళ్ళ గాయాల్ని రికార్డు చేశాయి.’ అంటాడు చంద్రశేఖర రావు వొకచోట. తానేం రాస్తున్నాడో యేం చెబుతున్నాడో తన రచనని యెవరికోసం వుద్దేశించాడో అతనికి తొలినాటి జీవని కథల కాలం నాటినుంచి స్పృహ వుంది.

ఉద్వేగ భరితమైన అతని వ్యక్తిత్వమే అతని కథల్లోకి ప్రవహించింది. నిజమే; ఆ ప్రవాహ శైలే అతణ్ణి కథకులలో ప్రత్యేకంగా నిలబెట్టింది. పోయిన శతాబ్దం చివరి దశకంలో కథల బ్రష్షుతో అంతర్నేత్రానికి ఎర్రరంగు పెయింట్ అద్దుకొని తనను తాను కథకుడిగా క్లోన్ చేసుకున్న చంద్రశేఖరరావు మరణం అంటని ముగింపుని కలగంటూ కొత్త శతాబ్దాన్ని/ సహస్రాబ్దాన్ని నల్లటి ట్రాన్స్పరెంట్ చీకటితో వెలిగింపజేశాడు. నలుపు రంగు అతని కథల్లో తొలుత విషాదానికీ తర్వాత ధిక్కారానికి ప్రతీక అయ్యింది. సూర్యుని నలుపు రంగు రెక్కల కాంతి విప్లవ దళిత వుద్యమాల కవితాత్మక సమ్మిశ్రణమై నిర్నిద్ర సమయాలకు కొత్త కలల్ని పంచింది. కొత్త ఆకాంక్షలకు వూపిర్లు వూదింది.

చంద్రశేఖరరావు కథల్లో చిత్రితమయ్యే ఆదర్శాల సంఘర్షణ, అవకాశావాదాల విజయాలు, తిరుగుబాటుల పరాజయాలు, లొంగుబాటుల దిగుళ్ళు చదువరిని వూపిరి తీసుకోనివ్వవు. తెలీని ఆందోళనకి గురిచేస్తాయి. రాజకీయ నేరాల పట్ల బుద్ధిజీవుల మౌనం నిష్క్రియా పరత్వం ఆగ్రహం కలగజేస్తాయి. యిది యిలా జరక్కుండా వుంటే బావుణ్ణు అని బెంగటిల్లేలా చేస్తాయి. అయితే నగరంలో విశాలమైన రోడ్ల మీద అగమ్యంగా తిరుగుతూనో, యూనివర్సిటీ క్యాంపస్ లో దేని కోసమో అన్వేషిస్తూనో, లైబ్రరీ మెట్ల మీద కూర్చొని హాస్టల్ గది వరండాల్లో నిలబడో – గ్లోబలైజేషన్ ప్రభావంలో కన్నీరెడుతున్న పల్లెల గురించి కూలిన గుడిసెల గురించి, అణచివేతకి గురైన పోరాటాల గురించి, సబాల్ట్రన్ సంస్కృతి గురించి, సాంస్కృతిక వుద్యమాల ఖాళీల గురించి, ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడే యువతీ యువకులు గొప్ప స్ఫూర్తిని యిస్తారు. భవిష్యత్తుపై ఆశలకు పాదులు గడతారు. అతని కథల్లోని వస్తువే కాదు; కథా నిర్మితి కూడా నిద్రకు దూరం చేస్తుంది. లోతు అందని విషాద గాంభీర్యం అతని వచనంలో విడదీయరాని భాగమైంది. సమాజంలోని అలజడి అతని భాషలోకి ప్రవహిస్తుంది. అతని భాషలోని విరామ చిహ్నాలు కూడా కథ చెబుతాయి. ఫుల్ స్టాప్ లేని పేరాగ్రాఫ్ లు వంటి టెక్నిక్ లు కథకి వేగవంతమైన వాతావరణాన్ని నిర్మిస్తాయి. అతని కథలే కాదు; కథలో అసంపూర్ణ క్రియా పదాలు వాక్యాలు పేరాలు కూడా ఓపెన్ ఎండింగ్ గా పాఠకుల బుర్రకు మంచి పని పెడతాయి. మనోవ్యాపారం విస్తృతం కావడానికి దోహదం చేస్తాయి. పంక్తుల మధ్య పాఠకులు స్వేచ్చగా విహరించడానికి స్థలం, వెసులుబాటు వుంటాయి. అందుకు బద్దకించేవాళ్ళు చంద్రశేఖరరావు కథలకు దూరంగా వుండటమే మంచిది.

ఇటువంటి భాషా శైలీ రచనా పద్ధతి పాత్ర నిర్మితి – విదేశీ సాహిత్యం గురించి నాకంతగా తెలీదు – తెలుగులో త్రిపుర కథల్లోనూ కనిపిస్తుంది. అయితే చంద్రశేఖరరావు త్రిపురకు అభిమానే గానీ అనుకరణ కాలేదు. పై పెచ్చు త్రిపుర జీవితానికి అర్థం లేదనీ దానికి అర్థం వెదకడం కూడా వ్యర్థమనీ సంభావించాడు. చంద్రశేఖరరావు అర్థవంతమైన జీవితం కోసం ఆరాటపడ్డాడు. కడదాకా అన్వేషించాడు. ఆశగా నిరీక్షించాడు. కథల్లో యెంత గ్లూమీ వాతావరణం కనిపించినా విషాద స్వరం వినిపించినా కొత్తతరం వెలుతురు ప్రపంచాన్ని సృష్టిస్తుందనే విశ్వసించాడు. నిరంతరం దాన్నొక కలగా, కళగా సాధన చేశాడు. అందుకు తనదైన సొంత డిక్షన్ని నిర్మించుకున్నాడు. వొక సెమీ అర్బన్ రాజకీయ – సాహిత్య భాషని సానబట్టాడు. కొంతకాలం తన రచనా శైలితో తనే ప్రేమలో పడ్డాడు. దాన్నుంచి పూనికతో బయట పడ్డాడని చెప్పడానికి ఆకుపచ్చదేశం, నల్లమిరియం చెట్టు నవలల్ని, ముగింపుకి ముందు కథల్ని నిదర్శనంగా చూపొచ్చు. ఈ క్రమమంతటిలో త్రిపురకిలాగా చంద్రశేఖరరావుకి వొక స్కూల్ యేర్పడలేదు. ఏ వెంకట శిధారెడ్డి లాంటివాళ్ళో శైలీ విషయికంగా చంద్రశేఖరరావుని కొంత అనుసరించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రాపంచిక దృక్పథాలు భిన్నమైనవి.

***

చంద్రశేఖర రావు దృష్టిలో కథ రాయడమంటే పదునైన కాలపు కత్తిపై నడుచుకుంటూ వెళ్ళడమే. అందుకే అతడు కేవలం కథకుడు మాత్రమే కాదు. చరిత్రకారుడు కూడా. వ్యక్తుల అంతర్లోకాల్లో చోటుచేసుకునే కల్లోలానికి కారణమయ్యే బాహ్య పరిస్థితుల్ని చిత్రించడం కోసం చంద్రశేఖరరావు నిరంతరం సమకాలీనంగా జీవించాడు. కథ చెప్పడానికి యెన్నుకున్న శిల్పమే అతణ్ణి విలక్షణ కథకుడిగా నిలబెట్టింది. సంక్షుభిత కాలంలో వొడిసిపట్టిన కన్నీళ్లు, గాయపడ్డ ఆత్మలు, నెత్తుటి పాదముద్రలు, మస్తిష్కంలో ముక్కలు ముక్కలైన ఆలోచనలే విలక్షణ వాచకాలుగా రూపొందాయి. భిన్న ద్వంద్వానుభూతుల మధ్య ఘర్షణకు గురైన మనస్సు లోపలి పొరల్లో సుప్త చేతనలో దాగివున్న పదాలు వాక్యాలు వ్యాకరణాల సంకెళ్ళు తెంచుకుని జ్వరపీడితుని పలవరింతలా వెలికి దుంకడం మూలంగా వ్యక్తావ్యక్త కావ్య వచనం అతని కథల్ని వున్నతీకరించింది.

అయితే; సంఘటనలు వాటికవే కథలు కావు అనే స్పృహ పుష్కలంగా వున్న కథకుడు చంద్రశేఖరరావు. సామాజిక సంఘటనల్ని కళా రూపంలోకి తర్జుమాజేసే విద్య అతని సొంతం. సంఘటన చుట్టూ వున్న వాతావరణాన్ని అతను కథలోకి వొంపుతాడు. అందులోకి పాఠకుల్ని చేయిపట్టి గుంజుకుపోతాడు. ఆ ఆవరణకి లోపల బయటా సంభవించే సామాజిక ప్రకంపనలని పూనికతో రికార్డు చేస్తాడు. పాత్రల చుట్టూ వొక మిత్ ని అల్లుతాడు. మార్మిక ప్రతీకలని సృజిస్తాడు. వాటిని కాల్పనిక తలంలో వున్నతీకరిస్తాడు. కొన్నిసార్లు అమూర్త సంజ్ఞలతోనో నిర్దిష్ట సంకేతాలతోనో వొక అధివాస్తవిక చిత్రాన్ని నిర్మిస్తాడు. అందుకు తనదైన వ్యక్తీకరణనీ భాషా మధ్యమాన్నీ యెన్నుకుంటాడు. ఈ క్రమాన్ని అర్థం చేసుకోడానికి కథలో అంతర్లీనంగా కొన్ని సూచికలు అందిస్తాడు. ఆ సూచనలు అందుకోగలిగినప్పుడు మాత్రమే పాఠకులు కథని ఆస్వాదించగలుగుతారు. లేదంటే అర్థం కాలేదని పక్కన పెట్టేస్తారు. అందుకే అతణ్ణి రచయితల రచయితగా మేధావుల రచయితగా కొందరు భావించడం జరిగింది. ఒక విధంగా చూస్తే ‘చాలా స్పష్టంగా రూపురేఖలన్నీ కనిపించే వొక నలుపు తెలుపు చిత్రాన్ని రంగు రంగుల పెయింటింగ్ లా అదీ అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ లా’ మార్చాడతను. ఆ అబ్ స్ట్రాక్ట్ చిత్రంలో రూపాల్ని పోల్చుకోడానికి పాఠకులు ప్రయత్నం చేయాలి. ఆ రంగుల మేళవింపు మర్మాన్ని తెలుసుకోగలగాలి. లేదా a billion colour story ని మళ్ళీ నలుపు తెలుపుల్లోకి తర్జుమా చేసుకొని చూడాలి. అప్పుడు అతని కథల్లోని మాంత్రిక వాస్తవికత, మార్మిక అర్థాలు దృగ్గోచరమౌతాయి. అతను చిత్రించిన అనేక బీభత్స దృశ్యాల వెనక వున్న క్రూర శక్తుల్ని పసిగట్టగలుగుతాం. లేకుంటే అపార్థాలకు సైతం అవకాశమేర్పడుతుంది. ద్రోహ వృక్షం కథ వర్గీకరణకు వ్యతిరేకమని మాదిగ దండోరా వుద్యమకారులూ, H. నరసింహం ఆత్మహత్య కథ తెలంగాణాకు వ్యతిరేకమని ప్రత్యేక రాష్ట్ర వాదులూ భావించడానికి ఆస్కారమేర్పడింది. వొక పాఠ్యానికి అనేకార్థాలు స్ఫురించేలా రాయడంలో వచ్చిన అనర్థం యిది. వాచక అధ్యయన నిష్ణాతులైన విమర్శకులు అతని పాఠ్యానికి సూచ్యార్థాలు విశేషార్థాలు వివరించే దిశగా ప్రయత్నాలు చేయాలి. వ్యాఖ్యాతలు టీకా టిప్పణులు తయారుచేయాలి.

కొన్ని సందర్భాల్లో వొక ఘటన కాకుండా ఘటనల సమాహారంగా రూపొందిన చరిత్ర శకలం గానీ, రచయితలో ఘటన కల్గించిన స్పందన గానీ, కేవలం వుద్వేగానుభూతి గానీ కథగా రూపొందడం గమనిస్తాం. ఆ అనుభూతిని దృశ్యీకరిస్తూ మాటల్లోకి తర్జుమా చేయడం వల్ల చంద్రశేఖరరావు కథలు చదవేవి కాదు; అనుభవించేవి అవుతాయి. వాటిని పునః కథనాలుగా చెప్పడం కుదరదు. కథని తిరిగి చెప్పే అలవాటు వున్న విమర్శకులకు కూడా కొరుకుడు పడవు. మరో గమనించాల్సిన విషయం యేమంటే చాలా కథల్లో పరిచిత వ్యక్తులే అపరిచితంగా కనిపిస్తారు. అసాధారణంగా ప్రవర్తిస్తారు. అతిలోకంగా రూపుకడతారు. కవితాత్మకంగా మాట్లాడతారు. హావభావాల్ని డ్రమాటిక్ గా వ్యక్తం చేస్తారు. తెలిసిన యథార్థమే వొక వూహా ప్రపంచాన్నీ కొత్త లోకాన్నీ ఆవిష్కరిస్తుంది. వాస్తవం అధివాస్తవంగానో అతివాస్తవంగానో పరిణమిస్తుంది. యిదంతా చంద్రశేఖరరావు కథా నిర్మాణ కళా చాతుర్యం.

***

సామాజిక వాస్తవికతని సాహిత్య వాస్తవికతగా తీర్చిదిద్దే కళలో చంద్రశేఖరరావు కాలానుగుణంగా గొప్ప నైపుణ్యం సాధించాడు. తొలి కథ నైట్ డ్యూటీ (1990) జైలు శిక్షని తప్పించుకున్న వొక వుద్యకారుడిది. అది కేవలం వొక సంఘటన మాత్రమే. దానికి వస్తు పరంగా నర్సు చేసిన త్యాగాన్ని కథన పరంగా డ్యూటీ డాక్టర్ స్వగతాన్ని జోడించడం ద్వారా కథారూపం ధరించింది. జీవని సంపుటిలోని మహాకవి మరణం (1994) ముగింపుకి ముందు సంపుటిలోని సూర్యుని నలుపు రంగు రెక్కలు (2014) కథలు పరిశీలించినపుడు యిరవై సంవత్సరాల కాలంలో శిల్ప పరంగా చంద్రశేఖరరావు సాధించిన పరిణతి స్పష్టంగా గోచరమౌతుంది. శ్రీశ్రీ మరణం నేపథ్యంలో వచ్చిన తొలినాటి కథలో కుహనా అభ్యుదయ సాహిత్య వాతావరణమే కథగా మారింది. అప్పటికి దాని ఆ కథన పద్ధతి కొత్తగానే వుంది. శివసాగర్ మరణం నేపథ్యంలో వచ్చిన రెండో కథ విప్లవ దళిత సాహిత్య సాంస్కృతిక వుద్యమాలపై బలమైన రాజకీయ ప్రకటన. భావజాల వైరుధ్యాల గురించిన విమర్శనాత్మక వ్యాఖ్యానం. అయితే అందుకు మాత్రిక వాస్తవికతని సపోర్ట్ గా తెచ్చుకున్నాడు. రెండిటినీ తులనాత్మకంగా అధ్యయనం చేస్తే కథా రచయితగా చంద్రశేఖర్ పొందిన మెటామార్ఫసిస్ ని అర్థం చేసుకోగలం. అలా పరిశీలించినప్పుడు చిట్టచివరి రేడియో నాటకం (1997) లో సాంస్కృతిక విధ్వంసంలో పెట్టుబడి పోషించే పాత్ర బీభత్స దృశ్యంగా వొక తాత్విక స్థాయిలో సాక్షాత్కరిస్తుంది. అదే మోహ ఋతువు (2005) నాటికి ప్రపంచీకరణలో రాజకీయ వికృత క్రీడగా శిఖర స్థాయికి చేరుకుంటుంది. మోహనా మోహనా లో కారంచేడు నేపథ్యంగా వెల్లువెత్తిన దళితోద్యమ స్ఫూర్తి, అది విద్రోహాలకు గురైన చరిత్ర మోహన్రావు ఉత్థాన పతనాలకు విస్తృతమైన కాన్వాసుని సమకూర్చాయి.ఆ తర్వాత నల్ల మిరియం చెట్టు నవలలో అవే మరింతగా స్థల కాలాల్లోకి ముందుకీ వెనక్కీ వ్యాపించి రాజసుందరం రాజకీయ ప్రస్థానాన్ని చిత్రించడానికి వుపయోగపడ్డాయి. మాయలాంతరు కథలో రాజ్యహింస క్రూర స్వరూప స్వభావాల్ని బలంగా ఆవిష్కరించడానికి, వొక సెల్యూలాయిడ్ దృశ్యీకరణ రూపంలో, బెల్లి లలిత హత్యోదంత సంఘటన పునాదిగా దోహదం చేసింది. ప్రపంచీకరణ మానవసంబంధాలలో, స్త్రీ పురుష సంబంధాల్లో తెచ్చిన మార్పుల గురించి పరాయీకరణ రూపాల గురించి నిద్రపోయే సమయాలు ఆదివారం గృహోన్ముఖంగా వంటి అనేక కథల్లో చంద్రశేఖరరావు విపులంగా విశదీకరించాడు. ఆవు పులి మరికొన్ని కథలు లో దాని క్రూర సామ్రాజ్యవాద రాజకీయ పార్శ్వాన్ని, దానికి ప్రత్యామ్నాయాన్ని కూడా గొప్ప ప్రతీకాత్మకంగా చిత్రించాడు.

పగిలిన తలలు ఖండితావయవాలు ఛిద్ర దేహాలు నెత్తుటి గాయాలు మోసుకుంటూ తిరిగే మనుషులు, విరామమెరుగని వేదనతో వాళ్ళ మూల్గులు, చీకటి గదుల్లో ఖాళీ కడుపులతో వొంటరి జీవితాలు, రోడ్లపైన పట్టపగలు దొమ్మీలు, అర్థరాత్రి అపరాత్రి యిళ్ళ మీద పడి సోదాలు, హాస్టళ్ళ మీద ఆకస్మిక దాడులు, సజీవ దహనాలు, మనుషుల్ని అదృశ్యం చేయడాలు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, అడవుల్లో కూంబింగ్ లు, హైటెక్ ఎన్ కౌంటర్లు, కుళ్ళిన శవాలు… ఈ సామాజిక బీభత్సానికంతటికీ తొలి ముద్దాయి అంతిమ నేరస్తుడూ రాజ్యమేనని చంద్రశేఖరరావు తన కథల్లో ప్రస్ఫుటంగా చెప్పాడు. అంతమాత్రంచేత చంద్రశేఖరరావు కథలన్నీ విషాద బీభత్స భరితాలేనని తీర్మానించలేం. వాటి వెనక వున్నఆర్ధిక సూత్రాలని పొలిటికల్ హిస్టరీతో సహా రివీల్ చేయడమే అతని ప్రధానోద్దేశంగా కనిపిస్తుంది. తొలినాటి డియర్ కామ్రేడ్ (1993) దగ్గరనుంచి మృతుల భాష (1997) ఫాతిమా గది (2002) క్రానికల్స్ ఆఫ్ లవ్ (2008) ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సత్యప్రకాశం (2011) లాంటి కథల వరకూ దీన్ని స్పష్టంగా చూడగలం. వీటిని వొక క్రోనలాజికల్ క్రమంలో అధ్యయనం చేస్తే సామాజిక రాజకీయ చరిత్రని నికార్సుగా అంచనా కట్టొచ్చు.

ముగింపుల్లేని కొన్ని కథల్ని చంద్రశేఖరరావు కొత్త కథల్లోకి కొనసాగిస్తాడు. వొక భావజాలానికి ప్రత్యామ్నాయంగా మరో కథని సృజిస్తాడు. అతను – అతనిలాంటి మరొకడు (2006), బ్లాక్ స్పైరల్ నోట్ బుక్ (2016) కథలు రెండూ యూనివర్సిటీ నేపథ్యం నుంచి వచ్చినవే అయినప్పటికీ భిన్న రాజకీయ దృక్పథాల్లోని మిత్ర వైరుధ్యానికి ప్రతినిధులు. మొదటి కథలో ‘J’ లో ఉస్మానియా క్యాంపస్ ని ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ భావజాలంతో వుర్రూతలూగించి మతతత్వ హంతక రాజకీయాలకు బలైన న జార్జిరెడ్డిని(?) రెండో కథలో ‘R’ లో సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మితమైన వెలివాడలో ఆత్మహననం చేసుకున్న రోహిత్ వేములని(?) పోల్చుకోగలం. ఉద్యమాలకు నెలవైన క్యాంపస్ లు కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కి హబ్స్ గా మారి విద్యార్థుల్ని సామాజిక స్పందనల్లేని యంత్రాల్లా తయారుచేస్తున్న కుట్రని చంద్రశేఖరరావు యీ రెండు కథల్లోనూ చూపిస్తాడు. వామపక్ష భావజాలం నుంచి అంబేడ్కరిజం వైపు షిఫ్ట్ అవుతున్న విద్యార్థి చైతన్యాన్ని, అందుకు దోహదం చేసున్న వాతావరణాన్ని యీ రెండు కథలూ వర్ణించాయి. హిట్లర్ జ్ఞాపకాలు (2014) మరో క్యాంపస్ కథ. మత వాదుల అసహనాన్నీ ఫాసిస్టు రాజకీయాల్నీ వాళ్ళు చేసే సాంస్కృతిక విధ్వంసాన్ని గుండె లోతుల్నించీ అసహ్యించుకొంటూ రాసిన కథ యిది. సాంస్కృతిక జాతీయవాదంలోని విద్వేష రాజకీయాల్ని యీ కథలో బలంగా యెండగట్టాడు. మూడు కథల్లోనూ స్త్రీ పాత్రలు మినర్వా రాణి, శివకాంత, కరుణకుమారి చూపిన తెగువ తెలివి కరుణ నాయకత్వ స్ఫూర్తి క్యాంపస్ లో హత్యలకూ ఆత్మహత్యలకూ చోటు వుండదనే ధీమానిస్తాయి.

చంద్రశేఖరరావు స్త్రీ పాత్రలు సాధారణంగా వుదాత్తంగా వుంటాయి. ఎన్నో కథల్లో స్త్రీలు ప్రేమ రాహిత్యంతో బాధపడే, విలువలనుంచి పతనమయ్యే, జీవితం నుంచి జారిపోయే మగవాళ్ళని అధఃపాతాళాలనుంచి నరకకూపాల నుంచి వుద్ధరించే దేవతల్లా కనిపిస్తారు. వోటమిలో కుంగిపోయినవాళ్ళకి దయామయులైన తల్లుల్లా వోదార్పునిస్తారు. పురుషుల బలహీనతల పట్ల క్షమా గుణంతో ప్రవర్తిస్తూనే సరైన మార్గదర్శనం చేస్తారు. గొప్ప స్వేచ్చతో assertive గా హుందాగా ప్రవర్తించే స్త్రీలు శాంత సుందరమైన భవిష్యత్తుకి భరోసానిస్తారు. సత్య ప్రకాశం (ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సత్యప్రకాశం) పాత్రని దానికి ప్రతిగా రూపొందించిన పూర్ణమాణిక్యం (పూర్ణమాణిక్యం ప్రేమ కథలు) ని పక్కపక్కన పెట్టి చూసినప్పుడు మహోపాధ్యాయులు ఆకాంక్షించిన నూతన మానవావిష్కరణ స్త్రీల ద్వారానే సాధ్యమౌతుందన్న రచయిత ఆంతర్యం అర్థమౌతుంది. స్త్రీ పురుషుల మధ్య అసమ ఆధిపత్య సంబంధాన్ని చంద్రశేఖరరావు తిరస్కరించాడు. సహచరుల్ని ప్రేమ బంధంతోనే కట్టి వుంచగలమని విశ్వసించాడు.

***

పూర్ణ మాణిక్యం రెండో ప్రేమ కథలోని అర్షాద్ లాగా మనుషుల్ని కలవడం చంద్రశేఖరరావుకి యిష్టం. కలిస్తే చెప్పిన కథలు చెప్పాల్సిన కథలు పంచుకునేవాడు. అర్షాద్ లాగానే సమకాలీన సమాజంలో తనకు తారసపడిన ప్రతి మనిషినీ అనుభవించిన ప్రతి దుఃఖాన్నీ అతను కథ కట్టాడు. తనను కదిలించిన ప్రతి సంఘటననీ కథా మాధ్యమం ద్వారా శాశ్వతం చేశాడు. దాదాపు మూడు దశబ్దాల సాహిత్య జీవితంలో అతను రాసినవి మొత్తం డెబ్బై వొక్క కథలు. Present time అతని కథా వస్తువు. ఎప్పుడూ దాన్ని అధిగమించలేదు. Those are the stories of our times. కానీ వాటిలో ప్రకటించిన సమస్త జీవిత వుద్వేగాలు అన్ని కాలాల్లోకి ప్రవహిస్తాయి. ఘటనలు నిర్దిష్ట స్థల కాలాలకు చెందినవే అయినప్పటికీ అవి కథలుగా సాహిత్య రూపం ధరించి అన్ని స్థల కాలాల్లోకి పయనిస్తాయి. అతను సృజించిన/ గుర్తించిన పాత్రలు కూడా చిరంజీవులే. అందుకే ఆయన the writer of all times గా మిగిలిపోతాడు. అతను జీవించిన కాలంలో శ్వాసించినందుకు నాకు గర్వంగా వుంటుంది. తొందరపడి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు దుఃఖంతో పాటు కోపంగా వుంటుంది.

తన కాలంలో కళ్ళ ముందు జీవితాల్లోని అన్ని తలాల్లోకీ అనేక రూపాలలో క్రూరంగా చొచ్చుకొచ్చిన స్వార్థం శిరస్సుని కసితో గండ్ర గొడ్డలితో నరికీ నరికీ యిక నరకలేక యాష్టొచ్చి వెళ్లిపోయాడా? ఆత్మలోకంలో దివాలా తీస్తున్న మేధావుల మస్తిష్కాల్లోని ఖాళీలని నింపడానికి అనుక్షణం తపనపడి అశక్తుడై అలసిపోయి కలం మూసేశాడా? ఎరుపు నలుపుల కలనేత వస్త్రాన్ని నేస్తూ నేస్తూ యిక నేయలేక మగ్గం గుంతలోనే కూలిపోయాడా? ముఖాలకి దొరికిన రంగు పూసుకుని రకరకాల మాస్కులు తొడుక్కొని మనమధ్య తిరుగుతున్న మనుషుల మేకవన్నె మేకప్పులు తుడిచీ తుడిచీ యిక తుడవలేక అలిసిపోయి తాను కట్టిన వేషం సైతం విప్పేసి రంగస్థలం నుంచి అర్ధాంతరంగా దిగిపోయాడా? ‘సామాజిక సూత్రాలు పనికిరాని కాలంలో నమ్ముకున్న ఉద్యమాలు, విప్లవాలు తెరలు దించేసిన కాలంలోనూ కథకుడు జీవించి ఉంటాడ’ని చెప్పి మాట నిలుపుకోకుండా అకాలంగా నిష్క్రమించం – ఏమో, నాకైతే అస్సలు నచ్చలేదు.

ఫాసిస్టు మత శక్తులు కిరాయి హంతకులుగా మారి వీథుల్లో స్వైర విహారం చేస్తున్న మూకస్వామ్య సందర్భంలో ప్రశ్నించిన ప్రతి గొంతునీ దేశద్రోహుల జాబితాలో చేర్చి అణచివేస్తున్న అప్రకటిత అత్యాయిక పరిస్థితుల్లో ‘దేశం కోసం ధర్మం కోసం’ సామాజిక సంపదని కార్పోరేట్ వ్యక్తులకి కట్టబెడుతూ పాలకులు వాళ్ళ గేటు ముందు చోకీదార్ పాత్ర పోషిస్తున్న పాడు కీడు కాలంలో చంద్రశేఖరరావు కొత్త కథ తలుపు తడుతుందనో, ఫోనులో పలకరిస్తుందనో నేనైతే ప్రతి వుదయం యెదురుచూస్తూనే వున్నా. అతని సాహిత్య వారసత్వాన్ని యెవరైనా అందుకుని నా కోర్కె తీర్చగలరా?!

కథ అతణ్ణి పొత్తిళ్ళలో శిశువుని చేసి లాలించిన మాతృమూర్తి. అతనైతే ఆ తల్లి రుణాన్ని తీర్చుకునే వెళ్ళిపోయాడు. మనమే ఆ కథల పసి బాలుడి రుణం తీర్చుకోలేం. ‘మరణం అంటని కలగన్న’ అతని కలను కొనసాగిస్తూ అది సాకారమయ్యే దిశగా అడుగులు వేయడం ద్వారా మాత్రమే అతని బాకీ తీర్చగలం. అదే అతనికి మనం యివ్వగల నిజమైన నివాళి. రెడ్ సాల్యూట్ టూ యూ డియర్ కామ్రేడ్!

(ఏప్రిల్ 13 డా. వి చంద్రశేఖరరావు పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఆయనకు ప్రేమతో …)

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

4 thoughts on “ద రైటర్ ఆఫ్ ఆల్ ద టైమ్స్

  1. చాలా బాగుంది, వారి కథలు తక్షణమే చదవాలి అన్న కాంక్ష రేకెత్తేలా రాశారు. అసలు ఇంతవరకు చదవక పోవడమే నేరం అనిపించింది.

  2. చాలా బాగుంది. పరాయికరణ రూపాలు గా చెప్పిన పద్దతి నచ్చింది. కధన శైలి ని నూతనంగా దిద్దుకున్నారన్న విషయం కూడా. కలలు కూలిపోతున్న కధని కొనసాగించారన్న పాయింట్. ప్రభాకర్ గారి రాత పరిచయమవడం సంతోషకరం

  3. డా చంద్రశేఖర రావు గారి కధలను చాలా బాగా పరిచయం చేశారు ప్రభాకర్ గారు

  4. చంద్రశేఖర రావు కథల మీద లోతైన విశ్లేషణ చేసిన ప్రభాకర్ గారికి అభినందనలు. ఒకానొక కాలంలో సాహితీలోకాన్ని కుదిపేసి ఇట్టే కనుమరుగైన రచయితను ఇలా విశ్లేషించటం చాలా బాగుంది. ఇప్పటి తరానికి చాలా ఉపయోగం

Leave a Reply