“దేశభక్తి”

ఒక్కోసారి దేశం చెట్టంతా
దేశభక్తి గాలిలో మొదలంటూ ఊగుతుంది
సానుభూతి పవనాల శయనాల మీద
కుర్చీ కుదురుగా కునుకు తీస్తుంది

ఒక్కోసారి దేశం కుంపటి
దేశభక్తి చలిమంటలై రాజుకుంటుంది
చూపుడువేళ్ళ శీతల గాలుల నుండి
అధికారం అరచేతులు చలి కాచుకుంటుంది

ఒక్కొక్కసారి దేశం సముద్రం నిండుగా
దేశభక్తి ఉప్పొంగి ఉరకలేస్తుంది
అనుకూల అలల మీద
పాలక పడవ హాయిగా నడిచెల్లిపోతుంది

రోడ్డు కాలువల నిండుగా
వలస నెత్తురు పారితే కారనీగాక
పనిముట్లు పడావుబడి
చెమట చేతుల చెలకల్లో కరువు మొలిస్తే మొలవనీగాక
చిరు వ్యాపారి
దిగులు దిగుట్లో ముడుచుకు చస్తే చావనీగాక
నిరుద్యోగి
ఆకలి కడుపు మీద చావుడప్పు మోగనీగాక
జనం ప్రాణదీపాలు
భయం గాలిలో కొట్టుమిట్టాడనీగాక
మొత్తంగా
దేశం దేహం ఆకలి నోరెళ్ళబెట్టి అరవనీగాక
ఆత్మనిర్బర్ చందమామని
మన అరచేతి అద్దంలో భలేగా అచ్చుగుద్దుతాడు వాడు

మనలో దేశభక్తి ఊటలు ధారలుగడుతుంటే
వాడు ధరల అడుగులు
ఒక్కోమెట్టు ఆకాశం మేడెక్కించే పనిలో ఉంటాడు
మనం దేశభక్తి శిగాలొచ్చి ఊగుతుంటే
పెట్టుబడి చుట్టాల నెత్తిమీది
వేలకోట్ల భారం గంప దింపే పనిలో ఉంటాడు వాడు

మన చూపుల దారాలు తెంపి పక్కకి ముడేస్తాడు వాడు
మన మనసు కాల్వను మళ్ళించి వాడి మడి తడుపుకుంటాడు

పచ్చగా మొలకెత్తే మన దేశభక్తి మాగాణుల్లో
భజనభక్తి కలుపు మొక్కలు పెంచి “దేశభక్తి” నామకరణం చేస్తాడు వాడు
అవసరం అనుకున్నప్పుడల్లా
బీరుపొంగుల్లాంటి పాలకభక్తి వరద పారిస్తాడు వాడు

ఔను, సరిహద్దుల మీద
శరీరం ఆయుధాన్ని నాటి
చూపుల బ్యారెల్లోంచి కాపల కాస్తుంటాడు దేశభక్తుడు

ఓట్లు మెదట్లో నాట్లేసుకొని
గాల్వన్ లో పొంగిన దేశభక్తిని గ్యాలన్లకొద్దీ వెదజల్లి
అధికారం పచ్చటి పైరు కలగంటాడు దేశబోక్తుడు

సిపాయీ నీకు సలామ్
పాలకా…
నువ్విక ఘెరావ్! ఘెరావ్!!

వరంగల్ జిల్లా నెల్లికుదురు నివాసం. కవి, గాయకుడు. ఎం. కామ్, బీఎడ్ చదివారు. రచనలు:  'అలలు', 'పూలు రాలిన చోట', 'గెద్దొచ్చే కోడిపిల్ల' అనే పేర్లతో మూడు కవితా సంకలనాలు ప్రచురించారు. 1996 నుండి విరసం సభ్యుడిగా ఉన్నారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడూ సమీక్షలూ, పాటలు రాస్తున్నప్పటికీ ప్రధానంగా కవిత్వమే ప్రధాన వ్యాపకం.

Leave a Reply