దేవుని స్వర్గం

ఒక తల్లి వస్తుంది
మట్టిలో కలిసిపోతుంది
ఆమె కన్నీళ్లు మణులవుతాయి
ఆమె కడుపులోంచి ఒక చెట్టు వస్తుంది
అక్కడంతా అడవి మొలుస్తుంది
అడవి నీడల్లో జనం పుడుతుంది
వాళ్ళలోంచి తల్లి వస్తుంది
చిన్న పసికందు

అడవిలో రాళ్ళు బయలు దేరుతాయి
అడవి భూమి అవుతుంది
రాళ్ళ లోంచి ఒక దేవుడు వెలుస్తాడు
రెండు జాతులు ఏర్పడతాయి
దేవుడు మరింత పెరుగుతాడు
జాతులు ఎడమవుతాయి
దేవుడికి ఆకలి అవుతుంది
నోటిలో నెత్తురు పిండితే కానీ ఆకలి తీరదు అంటాడు.
అందరినీ రక్షించటానికి రోజుకో మనిషి గొంతులోకి దూకండి, నొప్పి లేకుండా మింగుతాను అని నమ్మబలుకుతాడు
జనం భయపడతారు
అది చావు అంటారు
కొందరు దేవుడి తరుపున చేరి అది స్వర్గం అంటారు
జనం నమ్ముతారు
దేవుడి నోట్లో పడిన జనం ఆయన పళ్ళ మధ్య నెత్తురు తునకలై, పిప్పై కడుపులో చేరతారు.

కాలం గడిచే కొలదీ దేవుడి ఆకలి మరింత పెరిగింది
భూమి కావాలి అన్నాడు.
భూమి లోపల మనులు తింటే కానీ శాశ్వత ఆకలి తీరదు అని చెప్పాడు.
దేవుడు తినగా మిగిలిన జనం అల్లకల్లోలం అయ్యారు.
ఇళ్ళను కాల్చుకొని హారతి పట్టారు
తలలు నరుక్కొని పాదాల వద్ద పడవేశారు.
ఇంకా బలి కావాలి అన్నాడు దేవుడు
లేత స్త్రీ దేహము అయితే మరింత ప్రియము అన్నాడు
పసికందుతల్లి వారి కంట పడుతుంది
ఆమె ఒంటిపై ఆకులను తెంపేసి దేవుడి ముందు ఉంచారు జనం
దేవుని చెంచాలు లేత స్త్రీనో కాదో అని పసికందుతల్లి మానాన్ని రమించి చూశారు
నగ్న పసికందును కౌగిలించుకొని
దేవుడు వికట్టహాసం చేశాడు

ఆ తల్లి కళ్ళలో నీళ్ళు రాలేదు
దేవుడు మింగిన జనులందరి నెత్తురంతటి ఎరుపు కనిపించింది
నేలలో బలి ఇచ్చిన తలల నుంచి మొక్కల చిగుర్లు వస్తున్నాయి
దేవుడు మట్టిలో మునిగిపోతూ
నేలపు స్వర్గాన్ని చేరుకున్నాడు.

Leave a Reply