దూరం… దూరం…

”మీరు నర్మద గారాండీ” ముఖాన పచ్చటి పసుపు, నుదుటన ఎర్రని కుంకుమ… దానికి సరిగ్గా పైన పాపిటిలో మరో కుంకుమ బొట్టు, కళ్ళ నిండుకు కాటుక, చేతులకు ఆకుపచ్చ, ఎర్రని గాజులు, కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, ముక్కుకు ముక్కెర, సగం నెరసిన తల్లో చామంతులు, మొరవం దండ, ఎర్రని ఖాదీ చీర… ఆమెకి అరవై ఏళ్ళు ఉంటాయేమో… చేతిలో చిన్న సెల్‌ఫోన్‌, ఏదో ప్లాస్టిక్‌ కవర్‌ పట్టుకుని ఉంది. చీర చెరగు దోపి నడుముకు చుట్టి ఉంది.

పాదాలకు పాత ప్లాస్టిక్‌ చెప్పులు ఉన్నాయి. పాదాలకు పసుపు దట్టించి శుద్ధ బ్రాహ్మణ స్త్రీ వేషం వేసినట్లుగా ఉంది, మా అత్తయ్యలాగా, నా చిన్నప్పటి కాలనీలో సరస్వతీ ఆంటీలాగా. ”అవునమ్మా చెప్పండి” అన్నాను. ”మీకు వంట వాళ్ళు కావాలని తెలిసిందండీ అందుకే వచ్చానండీ… ఇక్కడే మీ కాలనీలోనే మా చెల్లింటికి వచ్చానండీ.”

”ఒద్దమ్మా అవసరం లేదు. ఉన్నామెనే తీసేసాము” అన్నాను. పెట్టుకోండి అమ్మగారూ మళ్ళా మాలాంటి వంటవాళ్ళం దొరుకుతామా” అంది ఆవిడ. ఆశ్చర్యం కలిగింది. మాలాంటి అంటే అర్థం ఏఁవిటో… ”ఒద్దమ్మా కరోనా కదా ఎవరినీ పెట్టుకోవటం లేదు చెప్పాగా ఉన్నామెనే తీసేసాము” అన్నాను ఆమెను పరీక్షగా చూస్తూ.

”నాకు కరోనా రాదు”… నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తన రెండు చేతుల మధ్య సెల్‌ఫోన్‌ను అటూ ఇటూ ఆడిస్తూ అంటోంది. ఆమె చెప్పే విధానానికి నిర్ఘాంతపోయాను. ఆమె గొంతులో కొద్ది కోపం… కరుకుదనం ఉన్నాయి. ఒక నిశ్చితత్వం, యుగాల నించీ పరిశోధన చేసి తేల్చి చాలా ఖచ్చితమైన నిర్ధారణకు నోచుకున్న విషయంలా చెప్పింది మామూలుగా కాదు. ఏం తనను తాను ఒక మనిషిగా అనుకోవటం లేదా ఎందుకు రాదీవిడకి కరోనా… అంత నమ్మకం ఏవిటో? ఎందుకో అదే అడిగేసాను ఆవిడని.

”ఏం… ఎందుకని రాదు మీకు కరోనా?” చెప్పద్దూ నాకు మహా ఆసక్తి కలిగింది ఆ విషయంలో. కరోనాతో ప్రపంచమంతా మృత్యువు విలయతాండవం చేస్తుంటే…

వాక్సిన్‌ కనుక్కోలేక శాస్త్రజ్ఞులు మల్లగుల్లాలు పడిపోతుంటే… ఈవిడకి కరోనా ఖచ్చితంగా రాదని ఎట్లా చెబుతోంది. ఆ రహస్యమేదో చెప్పేస్తే కోట్లమంది రక్షించబడతారుగా.

నాకప్పుడావిడ ఆక్స్‌ఫర్డ్‌ లాబ్‌రేటరీలోని సైంటిస్ట్‌కంటే గొప్పగా కనపడింది.

”ఎందుకంటే, మేం బ్రాహ్మలం అందుకే మాకు రాదు!”

గొంతులో ఎంత అతిశయం. కళ్ళలోంచి ఒక సాధికారపు చూపు నా వైపు గుచ్చుతూ నిశ్చలంగా అందామె.

మళ్ళా నిర్ఘాంతపోయాను. నేను సరిగ్గానే విన్నానా లేక నా చెవులు ఏమన్నా చెడాయా అర్థం కాలేదు.

”బ్రాహ్మలైతే ఏం?” వెర్రి మొఖం వేస్కొని అడిగాను. ఈ లోపల అత్తయ్య బయటకొచ్చింది.

ఆవిడ మొన్నే వూర్నించి వచ్చింది. పధ్నాలుగు రోజుల క్వారింటైన్‌ ప్రవాసం తర్వాత ఈ రోజే గది బయటకు వచ్చి నేరుగా వంటింట్లోకే వచ్చేసింది.

”అదేంటండీ అలా అంటారు మనం బ్రాహ్మలం… అంటూ… మడీ… శుద్ధీ… దూరం… మన బ్రాహ్మల కంటే ఎవరు బాగా పాటిస్తారు చెప్పండీ. అంటూ ముట్టు, దూరం లేండా ఎటంటే అటు పోయే తక్కువ కులాల వాళ్ళకే ఎక్కువగా వచ్చుద్దట కరోనా.. మనకి రాదండి” ముందుకు వంగి ఏదో రహస్యం చెబుతున్నట్లు గొంతు కొంచెం తగ్గించి, మా ఇంటి వైపే చూస్తున్న పక్కింటి వర్ధనమ్మను గమనించీ గమనించనట్లుగా కొనకంటితో చూస్తూ.. కొంచెం మెడ భుజాలు వంచుతూ చెబుతున్న రహస్యాన్ని గాల్లో రాస్తున్నట్లు చేతులు తిప్పుతూ చెబుతోంది వంటామె.

”మన బ్రాహ్మలట, పెట్టుకోరాదుటే… శుచీ, శుద్దీ ఉంటుంది… మళ్ళీ మళ్ళీ దొరుకుతారో దొరకరో. ఆ కిరస్తానీ ఆవిడ మరియంను పెట్టుకున్నావనే కదా నా బిడ్డ సూటుకేసు కూడ తెరవకుండా వచ్చింది వచ్చినట్లే మళ్ళీ వెళ్ళిపోయిందీ. నీ ఇంటికి మేం రావద్దనేగా నువిట్టా తక్కువ కులం దాన్ని వంటమనిషిగా పెట్టుకునేదీ…” అత్తయ్య గొంతు హెచ్చించి అంటుంది.

వంటామెకు వెయ్యేనుగుల బలం వచ్చేసినట్లు మొఖం వెలిగిపోయింది…. ‘ఛ అదేంటండీ బ్రాహ్మణ పుటక పుట్టి తక్కువ కులం వాళ్ళని వంటలోకెట్టుకోటం… ఎంత అపచారం… నైవేద్యం ఎట్టా పెడతారూ ఆ దేవుడికీ… ఎంత అరిష్టం? చక్కగా మడి గట్టుకుని చేస్తాను వంట నేను…” ఛీత్కారమూ, ఆశ్చర్యమూ చివరి మాటలో అతిశయమూ కలబోసి, అత్తయ్య మాటలతో దొరికిన బలంతో అంటోంది వంటామె. మరియం వంట చాలా బాగా చేస్తుంది. నా ఫ్రెండ్‌ అశ్విని చెబితే పెట్టుకున్నాను.

ఆమెను వంటకి పెట్టుకున్నా అని తెలిసినప్పటి నించీ మా అత్తయ్య ఫోన్లు చేస్తూ ఒకటే శాపనార్ధాలు… బ్రాహ్మణ పుటక పుట్టి మరియంని వంటకి పెట్టుకోటం ఏంటే… మన బంధువుల్లో నవ్విపోతారు. నీ ఇంటికి భోజనానికి రారు. నా బిడ్డ నీ ఇంట్లో తిన లేక వచ్చిన రోజే వెనక్కెళ్ళి పోయింది. మేమెవరవూ రావద్దనేగా ఇదంతాను? మర్యాదగా మరియంని తీసేసి మన బ్రాహ్మలలో ఎవరినైనా పెట్టుకో. అంతగా చాతకాకపోతే ఆ బ్రాహ్మల కేటరింగ్‌ వాళ్ళకు రోజూ కేరియర్లు తెచ్చి పడెయ్యమని చెప్పు,” అంటూ ఒకటే గొడవ.

అమ్మ బతికున్నప్పుడు కూడా చాలా సార్లు ఫోన్‌ చేసి ”మీ అమ్మాయికి చెప్పుకోండి… నా కొడుక్కి మడి కట్టకుండా ఏనాడు వంట చేసి పెట్టలేదు. హాస్టల్లో వాడి ఖర్మ… మరీ తక్కువ కులం దాన్ని వంటకి పెట్టుకోవడం ఏవిటి ఎంత వంటలో ఎక్స్‌పీరియన్స్‌ ఉంటే ఏవిట్ట కులవు కలవకపోతే?… మా వాడేదో ప్రేమించాడని చేసాం కానీ,” అంటూ మాట్లాడుతూనే ఉంటుంది. ఉన్నట్లుండి అమ్మకి గుండెపోటు వచ్చిపోయాక, ఆ అవకాశం పోయింది అత్తయ్యకి. నేరుగా నా మీదే పడసాగింది. కరోనాకి ముందు రమ్మంటే ”నువ్వావంటామెను తీసి పారేస్తేనే” వస్తానన్నది అత్తయ్య.

”నీ పెళ్ళాన్ని కులం, గోత్రం లేకుండా అందరితో ఊరేగమను. లోకంలో అందర్ని ఉద్ధరించమను వాళ్ళ ఇళ్ళలోనే ఉండమను, తినమను… యాఁవన్నా చేస్కోమను. నాకు సంబంధం లేదు. ఏదో పిల్ల పెద్ద చదువులు చదివింది, తల్లిది మన కులఁవే అనీ అనుకున్నాం కానీ ఇట్టా మరీ కులం మారినంతగా వ్యవహారాలు చేస్తుందనుకోలేదు. పద్మశాలీలు కూడా ఎక్కడా ఇంట్లో కిరస్తానీ దాన్ని వంటకి పెట్టుకోరు. ఇదిగో పృధ్వీ ఇప్పుడే చెవుతున్నా, ఆ కిరస్తానీ వంట మనిషిని తీసేస్తేనే నే వచ్చి నీతో ఉండేది ఆలోచించుకో” అంటూ మరియంని పృథ్వి ‘అమ్మ రావాలి కదా’ అని ఒద్దనే వరకూ సాధించింది అత్తయ్య. మరియం దళిత క్రిస్టియన్‌. వంటలు చాలా బాగా చేస్తుంది. ఎంతసేపూ నన్ను పద్మశాలీ అని కులం పట్టుకొని వెక్కిరించే అత్తమ్మ ప్రతి పండక్కీ, నోములు వ్రతాలు, బ్రాహ్మల మడి వంటలకు ఒంటినిండా చుట్టుకునే ధగధగా మెరిసిపోయే ఆ పద్మశాలీలు నేసే పట్టుచీరలు గానీ, కాటను చీరలు చుట్టేసుకున్నపుడు కానీ ధాన్యాలు, బియ్యమూ, పప్పులూ అన్ని రకాల కూరలు, పండ్లూ, నెయ్యి, పాలు, పెరుగు, వేస్కుని తింటున్నప్పుడు, దేవుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు వాటిని పండించే, ఈవిడ అనే ఈ తక్కువ కులం శ్రామికులు ఎందుకు గుర్తుకు రారు…

అవసరాలకేనా మడీ అంటు? మన్నూ మశానాలు… దొంగేషాలు కాకపోతే?

ఈ బట్టా, తిండీ లేకపోతే ఎట్లా ఉంటారు వీళ్ళు? మా నాన్న పద్మశాలీ, అమ్మ బ్రాహ్మిణ్‌. వర్ణ సంకరం, కుల సంకరం రెండూ అయిపోయాయి. ”పృధ్వీ ఎట్టారా, మన బ్రాహ్మల అమ్మాయిలు తక్కువయ్యారుటరా… ఒద్దురా బ్రాహ్మణవాడలో తలెట్టా ఎత్తుకోవాలిరా” అని గుండెలు బాదుకుని, అటు తరువాత పృధ్వి మొండితనం ముందు తలవంచింది.

‘వద్దు… మీరెళ్ళి రండి… మరో వంట మనిషి అవసరం లేదు…” నేను ఖచ్చితంగా అంటుంటే ”పోనీ మనకంటుకోకుండా కరోనా టెస్టు చేయించుకున్నాక పెట్టుకుందాము నర్మదా” అంటోంది అత్తయ్య. ”ఒద్దత్తయ్యా.. బయటెక్కడికీ వెళ్ళకపోయినా ఇప్పుడు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళ వల్ల కరోనా వస్తుందనే కదా మీరు సుజాతను, మరియంను మాన్పించేసిందీ… వద్దు” అన్నాను. కరోనా కంటే ఈ కుల గజ్జే అతిపెద్ద ఇన్‌ఫెక్షన్‌ అని మనసులో అనుకుంటూ. అత్తయ్య పని మాన్పించేసిన రోజు సుజాత ముఖం ఆరిపోయింది. సగం జీతం ఇస్తాను అని నేనన్నాక కొంత వెలిగింది.

”ఏఁవమ్మగారూ… మీరూ ఒద్దంటారూ…” అంటూ ఆ వంటావిడ మా అత్తయ్య వైపు తిరిగి నా దగ్గర తన పప్పులేవీ ఉడకవని అర్థమై వెలుగారిన ముఖంతో, ”నీది కాదా నడిచేది ఇంట్లో పెత్తనం” అన్నట్లుగా రెచ్చగొడుతున్న చూపులతో అడిగింది.

”ఏవో నాకేఁవి తెల్సు వద్దంటుందిగా నాదేవుందీ… పాడు కాలం పాడు కాలమానీ” అనుకుంటూ అత్తయ్య ముఖం ముడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వంటామే నా వైపు ఓడిపోయి, లొంగిపోయిన చూపొకటి విసిరి, అలాగే నిటారుగా నిలబడింది.

”మీరెంతమంది ఇంట్లో చేస్తున్నారు” అని అడిగినామెను… ”ఎన్నీ లేవమ్మా రెండిళ్ళే. మీ ఇంటెనకాల శాస్త్రులు వారు లేరూ వారింట్లోనూ… ఎనిమిదో వీధిలో ఆ కడా ఇల్లు లేదూ, ఆఁ… శంకరం పంతులు గారింట్లోనూ చేస్తున్నాను” అంది ముఖమింత చేస్కుంటూ.

”అలాగా, శంకరం పంతులు గారు మరి పెద్ద పూజారి. రోజూ గుళ్లలో పూజలు, బయట శ్రాద్ధకర్మలూ, శని పూజలూ, వాస్తు దోష నివారణ పూజలు, కరోనా నివారణ హోమాలూ, ఉపనయనాలూ లాంటివి చేస్తూ, జనంలో ఉంటూ, దూరాలు అవీ పాటించకుండా పని చేసి ఇంటికొస్తున్నారు. ఇక శాస్త్రులు గారు రోజూ వందలమంది వచ్చిపోయే మినిష్టర్‌ పేషీలో పని చేస్తూ ఉంటారు. వీళ్ళింట్లో బోలెడు నౌకర్లు మరి వాళ్ళిళ్ళల్లో పని చేసి, మీరు మా ఇంటికొస్తే మాకంటుకోదూ కరోనా? మాకొద్దండీ” ఏకబిగిన అనేసాను. తెల్లబోయి, కోపంతో విసురుగా వెనక్కెళ్ళి పోతున్న ఆమెని ‘ఆగండి’ అని ఆపి ఆమె కో మాస్కు, శానిటైజర్‌ కవర్‌లో పెట్టి ఇచ్చి ”కాస్త అంటు, దూరం పాటించాలి మరి. మీరు ఎక్కడికెళ్ళినా బయట తిరిగేవారు కదా. చూడండమ్మా మనిషికున్న కుల పిచ్చి కరోనా వైరస్‌కి లేదండీ. దానికి బీద గొప్ప… కులం, మతం, గోత్రం పిచ్చి లేదు. ఎవరినైనా కాటేస్తుంది జాగ్రత్త.. మీవల్ల ఇంకోళ్ళకి ఇన్ఫెక్షను అంటకూడదు మరి” అన్నాను. నా గొంతులో వ్యంగ్యం పసిగట్టి, విసురుగా నా చేతిలో ఉన్న కవర్‌ను లాక్కుని ఏదో గొణక్కుంటూ వెళ్ళిపోయిందావిడ. నేను లోపలికి నడిచాను.

”పనికి రాదన్న బ్రాహ్మణాచారమే, మానవాళికి నేడు మకుటమయ్యే… తగులబెట్టదమన్న తత్వంబు ధర్మంబు విశ్వమునకే ప్రాణబిక్షయ్యే… దూరంబు, దూరంబు… దూరంబుండుడన్న మాటయే… అపమృత్యు మంత్రమయ్యే”. టీవీలో నాలుగు రోజుల నించి మారుమ్రోగుతున్నదీ పద్యం. ”ఏఁవిటన్నారనీ జొన్నవిత్తుల వారూ, అంతా చేరి మరీ అంతలా ఆడిపోస్కుంటున్నారూ. మరీ చోద్యం కాకపోతే…” అత్తయ్య టీవీ ఛానల్‌ చూస్తూ విస్తుబోతోంది. టీవీలో కుల, హక్కుల సంఘం నాయకులతో చర్చ నడుస్తోంది. ‘అంటరానితనం, భౌతిక దూరం ఒక్కటే అని ఎట్లా చెబుతారు, అని వాళ్ళు విరుచుకుపడుతున్నారు. క్షమాపణ చెప్పి తీరాలి ఆ పద్యాన్ని విరమించుకోవాలి” అని కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ లోపల ఫోన్‌ మోగింది. సరస్వతి ఆంటీ! ”బాగున్నావా నర్మదా, ఎన్ని రోజులైందే నిన్ను చూసి మీ అమ్మే గ్నాపకం వచ్చిందనుకో, మొన్న జనవరిలో జరిగిన పెళ్ళిలో నిన్ను చూసాక…? అవునే… గుమ్మం ఆవలే కూర్చునే దాన్ని దూరంగా… లోపలికి వచ్చే దాన్నా యాఁవన్నా చెప్పూ… ఛఛ కాదే భలేదానివే ప్రతీ రోజూ ఎవరన్నా ముట్టవుతారుటే జోకులు భలే వేస్తావుగానీ… అంతేనే… మేం అంతే నిష్ఠగా ఉంటాం. ఎందుకట్టా అంటే మేం బ్రాహ్మలఁవే… ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు కూర్చునే కుర్చీల్లో, సోఫాల్లో కూర్చోం… ఆ బట్టలూ అవీ తాకం. మీ అమ్మ మరీను. అందర్నీ కావలించుకుంటుంది. అంతెందుకు నేను మీ ఇంటికొచ్చినా అంతే కదుటే… మీ అమ్మ కాలేజీకెళ్ళి పాఠాలు చెప్పి వస్తుందా? వచ్చేప్పుడూ పోయేప్పుడూ బస్సుల్లో… కాలేజీలో వాళ్ళనీ వీళ్ళనీ తాకుతుందా. ఇంటికొచ్చాక మరి ఇన్ని నీళ్ళు నెత్తి మీద పోస్కోవచ్చు కదా. చెప్పినా వినదే? అయినా మీ అమ్మ అన్నీ వదిలేసింది. మేం మంచి ఫ్రెండ్సే అనుకో… అయినా ఏదో మీ అమ్మ బాధపడుతుందని ఆ టీ ఒఖ్కటీ తాగుతాననుకో… అయినా అంకుల్‌ కోప్పడేవారు సుమీ. అట్టా తాగద్దనేవారు. అంకుల్‌ సంగతి తెలుసుకదా? ఎంతో నిష్టగా రోజూ గాయత్రీ మంత్రాలూ, సంధ్య వార్చడాలు అవీ చేస్తారు ఇప్పటికీను. గుళ్ళోనూ అంతే… ఎంతైనా మనం బ్రాహ్మలం, కరోనా పుణ్యమాని మన బ్రాహ్మలకి మంచి రోజులొచ్చాయి. మళ్ళీ మన మడీ, ఆచారాలూ, శుచీ, శుభ్రాలూ తిరిగి అంతా చేస్తున్నారు. కరోనా వచ్చి ఒకందుకు మంచిదే అయ్యిందిలే. మనం దూరం పెడతాఁవని ఓఁ ఇదైపోయి, ఆడిపోసుకునేవాళ్ళే ఇప్పుడు దూరాలు పాటించేస్తున్నారు చూసావా చోద్యం కాకపోతే? మన బ్రాహ్మల నియమ నిష్టలే ఇప్పుడు లోకమంతా పాటిస్తున్నారు. మన కెట్టావస్తుందీ కరోనా. రాదుగాక రాదు… అవునూ నేనే ఏదో వాగుతూ ఉన్నా ఎప్పుడొస్తావు, అయినా కరోనా కదా ఏం వస్తావులే తగ్గాకే కలుద్దాం”… సరస్వతి ఆంటీ ధారాళత ఆగకుండా కొనసాగింది.

మధ్య మధ్యలో నా మాటలు ప్రశ్నలు అన్నీ తెంచేస్తూ తనే మాట్లాడింది. ‘మేం అంతే… మీ ఇంట్లోకి ఎప్పుడొచ్చినా కిందేగా కూర్చునేదీ”… ఈ మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి. ఇక ఆంటీని చూడ్డానికైనా వెళ్ళాలని అన్పించలేదు. చిన్నప్పటి నాస్టాల్జియా సరస్వతి ఆంటీ. ఛామన ఛాయ కంటే కొంచెం ఎక్కువ తక్కువ కాని నలుపు రంగులో… కాటన్‌ చీరల్లో ముక్కుకు ఎర్రరాయి ముక్కెరతో, కొంచెం ఎత్తు పళ్ళతో ఉండేది. ఎప్పుడూ మా కాలనీ సందుల్లో అందరి ఇళ్ళ గమ్మాల్లోనూ తనే కనపడేది. మెట్ల మీద కూర్చోవడం తప్ప లోపలికి వచ్చేది కాదు. చాలా కాలం తను ఆమె నెలసరిలో ఉందేమో అనుకునేది కానీ కాదు. అమ్మ చెప్పింది ఆమె బ్రాహ్మణ స్త్రీట భర్త గుళ్లో పూజారి అనీను.

మనుషులెవర్నీ ముట్టరుట వాళ్ళు. ఎప్పుడు చూడూ అందర్నీ ‘అశుంట… అశుంట’ అని దూరం జరగడమే చూసింది తను.

”నువ్వట్టా ఏవిటో చూడకండా అలగాజనం అందర్నీ కలుపుకుంటావు, ఇంట్లోకి రానిచ్చి కుర్చీల్లో, మంచాల మీదా కూచోపెట్టుకుంటావు. నాకు రావాలన్పించదే వర్ధనీ… కొంచెం దూరాన పెట్టాలే వాళ్ళనీ, నీ ఉద్యోగం కాదు కానీ. ఇట్టా అయితే నేనెట్టా రాను లోపలికి… రమ్మంటావు గానీ” అంటూ అమ్మ పిలిచినా లోపలికి వచ్చేది కాదు. గుమ్మానికావల మెట్టుమీద కూర్చునేది. అమ్మ ఇచ్చిన టీ మాత్రం ఇష్టంగా తాగేది. ”దానికి లేదా మరి అంటు ముట్టు” అని నాన్నగారు కోపంగా అనేవారు. “ఎందుకట్టా బతిమిలాడతావు లోనకి రమ్మని, వద్దు మన ఇంటికి వచ్చి మనల్నే అంటరాని వాళ్ళల్లా చూట్టం ఏవిటి రానియ్యబాకు. ఎప్పుడంటే అప్పుడు అప్పులిస్తావనే కదా నీతో స్నేహం? ”మేవు నేసిన బట్టలే కదా వాళ్ళు మడి బట్టలు చేస్కునేది వంటింట్లోనూ, గుళ్ళోనూ, అన్నీ వెధవ్వేషాలు కాకపోతే?” అనేవారు చిరాకుగా. ”పండగలకీ, పూజలకైనా మడికట్టుకోవే వర్ధనీ” అనేది అమ్మని. కానీ అమ్మ అవేవీ పాటించేది కాదు. పొద్దున్నే లేచి స్నానం చేసి, దేవిడికంత దీపం పెట్టి మా ముగ్గురు పిల్లలకు, నాన్నకు, నానమ్మకీ టిఫిన్లు, అన్నం కూరలు వండి తాను బాక్సులో పెట్టుకుని తినీ తినకుండా బస్సెక్కడ మిస్‌ అవుతానో అని పరిగెత్తేది అమ్మ. పైగా అమ్మకి చిన్నప్పట్నించీ ఈ మడీ, ఆచారాలు నచ్చేవి కావట. ముఖం ముందు వీళ్ళకి దండాలు పెడుతూ, వెనక వాళ్ళ అంటరానితనాలను అసహ్యించుకునే ఊరి జనం బాగా తెలుసు అమ్మకు. కమ్మరి, కుమ్మరి, మాల మాదిగలు, చాకిలి, మంగలి వాళ్ళతో నిత్యం అవసరాలు తీర్చుకుంటూ కూడా వాళ్ళను దూరం పెట్టటం చాలా అన్యాయంగా అనిపించేదిట అమ్మకి.

అమ్మా నాన్న పోయాక చాలా ఏళ్ళకి ఒక పెళ్ళిలో సరస్వతి ఆంటీ కనపడ్డది. పుట్టింటి వైపు పోయి చాలా ఏళ్ళైంది. ఆమెను చూడగానే పుట్టింటి మమకారం పొంగుకొచ్చింది. ‘అటువైపొచ్చినపుడు రావే మా ఇంటికీ’ అంది. చిన్నప్పుడు వాళ్ళింట్లో బాగా తిరిగే దాన్ని. బ్రాహ్మల పిల్లల్ని మహ బాగా ఇంట్లోకి రానిచ్చేది. ఎంత సేపూ మడి, పూజలు అంటూ గోలగోలగా ఉండేది. వంటిల్లెప్పుడూ తడే… నాచు నాచుగా జారుడుగా ఉండేది. మూర్తి అంకుల్‌ దానిమీద జారిపడి, కాలు ఫ్రాక్చర్‌ అయ్యి ఆర్నెల్లు మంచాన పడ్డారు కూడాను. నాన్నాగారూ, మూర్తి అంకుల్‌ ఫ్రెండ్స్‌. ‘లోపల అంత మురికి చేర్చుకుంటే, నాచు బట్టి జారకుండా ఎట్టా ఉంటారు? కాలు విరక్కుండా ఎట్టా ఉంటుందీ? తడి అనేది మడి బట్టల్లో, వంటింటి, పూజగది జారుడు బండల్లో కాదు, హృదయంలో ఉండాలి. ఆ మడి బట్టలైనా కాస్త ఎండల్లో ఆరేస్కోండోయ్‌ మూర్తీ లేకపోతే ఫంగస్‌ చేరి చర్మ వ్యాధులొస్తాయి మరి” అని మూర్తి అంకుల్‌ని చూడ్డానికి వెళ్ళిన నాన్నగారు ఛలోక్తి విసిరారు వ్యగ్యంగా. సరస్వతి ఆంటీ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మడి చీరలోనే ఉండేది… దూరం… అశుంట, అశుంట అనే మాటలే తప్ప వేరే మాటలు వినపడేవి కావు వాళ్ళింట్లో. పనమ్మాయి సరళ తోమిన గిన్నెల మీద పసుపు నీళ్ళు చిలకరించడం, ఆమె నడిచిన దారంతా గేటు దాకా పసుపు నీళ్ళు చల్లడం చేసేది సరస్వతి ఆంటీ. ”అవమానంగా ఉంటుందమ్మా… మానేస్తాను, ఒకసారి గొడవ పడ్డాను కూడా మీ మురికి అంట్లు మీరే తోముకోండని” సరళ అమ్మతో బాధగా అనడం ఎన్నోసార్లు విన్నా. ”మానెయ్యి సరళా, వెనక వీధిలో సౌజన్య గారికి పనికి కావాలిట చెప్తాను చేరుదువుగానీ” అంది అమ్మ ఓదార్పుగా. ”అసలు పసుపు నీళ్ళు వాళ్ళ మీద గుమ్మరించుకోవాలి. ఇంత అశుద్ధంగా ఆలోచిస్తే ఎట్లా ఛఛ” అన్నారు నాన్నగారు. ”నన్ను మీ ఇంటికి రమ్మంటావు కానీ సరూ, నేనెళ్ళిపోయాక నేను కూర్చున్న చాప మీద, నడిచిన గచ్చు మీదా పసుపు నీళ్ళు చిలకరిస్తావటే, సరళతో చేసినట్లు” అని అమ్మ సరస్వతి ఆంటీని కడిగిపారేసింది.

”ఛ… విడ్డూరంగా మాట్టాడమాకు, నీకెందుకు అట్టా చేస్తాను మనవూ… మనఁవూ ఒహటి కాదేంటీ” అని నవ్వి పడేసేది సరస్వతి ఆంటీ ఏ మాత్రం బాధా, సిగ్గు లేకుండా. సరస్వతి ఆంటీని, సరళ కోసం దులిపి పారేస్తూన్న అమ్మను చూస్తే నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఆ సంవత్సరమే సావిత్రీబాయి ఫూలే పాఠం చదివానేమో, చెప్పద్దూ మా అమ్మ నాకు సావిత్రి బాయి ఫూలేలాగే కనపడింది.

ఇన్నాళ్ళకు మళ్ళీ ఫోన్‌ సంభాషణలో, చిన్నప్పుడు నాన్న కులం వేరని తెల్సి కావాలని ఇంట్లోకి వచ్చేది కాదని తెలిసాక మనసులో ఆమె ఇంటికెళ్ళాలన్న ఇష్టం పోయింది. ఆంటీ మీద ప్రేమ పోయింది. అమ్మది బ్రాహ్మణ కులం అని మా ఇంటికి వచ్చేది. లోపలికి మాత్రం వచ్చేది కాదు. అదీ అమ్మ కాలేజీకి పోతుందనీ, వచ్చిన వెంటనే మళ్ళీ సాయంత్రం స్నానం చేయదనీ, మడి కట్టుకుని వంట చేయదనీ, అన్ని కులాల వాళ్ళతో కలిసిపోతుందనీ అమ్మ మీద కోపం… పదేళ్ళ స్నేహం అందుకని వచ్చేది కానీ, గుమ్మంలోనే కూర్చుని, కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయేది. ఇక ఈమె మిగతా కులాల వాళ్ళతో ఎలా ఉండచ్చు?? నాన్నగారు కన్పిస్తే లేచి నించొని భుజాల నిండా కొంగు చుట్టేసుకొని లేని వినయం నటిస్తూ ‘బాగున్నారా అన్నయ్యగారూ’ అనేది పళ్ళన్నీ కన్పించేలా నవ్వుతూ. నాన్న కళ్ళల్లో కోపం, అసహ్యం ఆమెను భయపెట్టేవి. నాన్న వైపు బెదురుగా పక్క చూపులు చూసేది. ”చెప్పవే నర్మదా ఎప్పుడొస్తావు?” సరస్వతి ఆంటీ అటువైపు నుంచి అడుగుతుంటే, ‘చెప్తా ఆంటీ అత్తయ్య పిలుస్తున్నారు’ అంటూ ఫోన్‌ కట్‌ చేసేసాను. నా బాల్యపు వీధుల్లోకి వెళ్లి విహరించాలన్న నా కలను భగ్నం చేసింది ఆమె.


”అమ్మా… వరుణ్‌ ఈస్‌ వాచింగ్‌ హిస్‌ మమ్స్‌ ఫ్యునరల్‌ ఇన్‌ లైవ్‌, కాంట్‌ కన్‌సోల్‌ హిమ్‌. ఫీలింగ్‌ హెల్ప్‌లెస్‌” (అమ్మా, వరుణ్‌ వాళ్ళ అమ్మ దహన సంస్కారాలు లైవ్‌లో చూస్తూ ఏడుస్తూనే ఉన్నాడమ్మా. వాడిని ఓదార్చడం మా వల్ల కావట్లేదు.) వాట్సప్‌ మేసేజ్‌ ధృతి నించి. కొంచెం సేపట్లో పాప ఫోన్‌. ”అమ్మా… వరుణ్‌కి రెస్టిల్‌ టేబ్లెట్‌ వేయచ్చా భరించలేకపోతున్నాడు. ఉండీ ఉండీ గుండెలు బాదుకుంటూ అరుస్తున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు.

అన్నం తినడం లేదు గదిలో ఒంటరిగా ఉంటాడు, నిద్రపోడు ఎట్లా అమ్మా?” ధృతి అమెరికా నించి ఫోన్‌లో ఏడుస్తున్నది. ”రెస్టిల్‌ టాబ్లెట్‌ వేయమ్మా కోలుకోడానికి టైం పడ్తుంది… చాలా పెద్ద ట్రామా కదా. ఒంటరిగా మాత్రం ఒదలకండి” అంటూనే ఉన్నా ”అమ్మా… వరుణ్‌ ఫెయింట్‌ అయిపోయాడు కాల్‌ యూ లేటర్‌” గాభరాగా అంటూ ఫోన్‌ పెట్టేసింది ధృతి.

వరుణ్‌ వాళ్ళమ్మ హైద్రాబాద్‌లో కరోనాతో చనిపోయింది మొన్ననే… వరుణ్‌, వాళ్ళ అన్న అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ముందు వరుణ్‌ వాళ్ళ నాన్నకు కరోనా వచ్చింది. ఇంట్లో భార్యా, అమెరికా నుంచి పిల్లలూ ఎంత చెప్పినా వినకుండా ఖళ్ళు ఖళ్ళుమని దగ్గతూ, మాస్క్‌ వేస్కోకుండా, తన గదిలోనే క్వారంటైన్‌ కాకుండా తిరిగాడు. అప్పటికీ పాపం ఆమెకు మోషన్స్‌ విపరీతంగా అయ్యి నీరసపడిపోయినా ఆయనకు అన్నీ అమర్చి పెట్టేది.

”వద్దు నాన్నా గది బయటకు రాకు. అమ్మకు షుగరు ఉంది. కరోనా వస్తే ప్రమాదం” అన్నా వినలేదు… ఆమె తనకు ఫోన్‌ చేసింది. నీరసంగా ఉందని, మోషన్స్‌ అవుతున్నాయనీ. వెంఠనే ఇద్దర్నీ హాస్పిటల్లో అడ్మిట్‌ అవమన్నా… మోషన్స్‌ కూడా కరోనా లక్షణమేనని నిర్లక్ష్యం చేయవద్దనీ చెప్పా. మా హాస్పిటల్లో బెడ్స్‌ ఛార్జీ లక్షల్లో ఉందనీ… మా ఫ్రెండ్‌ హాస్పిటల్‌లో రోజుకి ముప్పై వేలని చేరిపొమ్మన్నాను. నాకు తెలుసు ఒక రోజుకి ఇద్దరికి అరవై వేలు కట్టలేరు కనీసం భార్యనన్నా చేర్పించమన్నా. పోనీ గాంధీలో అన్నా చేరిపోమన్నా అయినా వినలేదు. ”ఇంట్లో హాయిగా ఉంది. గాంధీలో ఫుడ్డు బాగుండదు, భార్య మంచి ఫుడ్డు చేసి ఇస్తుంది. అందుకే తనకి ఇమ్యూనిటీ పెరిగి, కరోనా తగ్గిందంటాడు. హాస్పిటల్‌ అడ్మిషన్‌ వద్దంటాడు. ”మీకు తగ్గిపోయింది. కానీ ఆమెకి బాలేదు. ఆమె ఇంట్లో ఉంటే ప్రమాదం వెంటనే హాస్పిటల్లో చేర్పించండి” అన్నా. ”లేదండీ ఆమెకి కరోనా లక్షణాలేవీ లేవు. నీరసం తప్ప. అయినా నాకు ఫుడ్‌కి కష్టమండీ” అంటాడు. ”మీకు వండి పెట్టడం కోసం ఆమె ప్రాణాలతో ఆడుకుంటారా” అరిచాను నేను.

నేనో కార్పోరేట్‌ హాస్పిటల్లో ఏ.ఓ.గా పని చేస్తున్నా. ఒక రోజు ఉన్నట్లుండి ధృతి ఫోన్‌, ”అమ్మా, ఆంటీకి ఆక్సిజన్‌ సాట్యురేషన్‌ 93కి పడిపోయింది. ఎక్కడన్నా హాస్పిటల్లో బెడ్‌ ఇప్పియ్యమ్మా” దాదాపు ఏడుస్తూ అంటోంది. రాత్రి మూడు వరకూ అన్ని హాస్పిటల్స్‌ ట్రై చేసినా దొరకలేదు. ఆఖరికి వాళ్ళకి సిటీ శివార్లలో కార్పోరేట్‌ హాస్పిటల్‌లో బెడ్‌ దొరకలేదు కానీ, కాజువాలిటీలో చేర్పించుకున్నారు. కానీ రెండు రోజులకే ఆమె తీవ్రమైన న్యుమోనియాతో చనిపోయింది. సడన్‌ హార్డ్‌ ఎటాక్‌ వచ్చింది. రెండు ఊపిరితిత్తులూ నిమ్ముతో నిండిపోయాయి. చనిపోయే ముందు ఇద్దరు కొడుకులతో వీడియో కాల్‌లో మాట్లాడింది. ”బాగుంది… తగ్గిపోయాక మీ దగ్గరకు వచ్చేస్తా, మీ నాన్నతో ఉండలేను. తీసుకు పొండిరా నన్ను, మీ నాన్న ఒఠ్ఠి స్వార్థపరుడు” అందిట. ”నేనొచ్చి తీస్కెళ్ళిపోతా అమ్మా ఫైట్‌ టికెట్స్‌ కోసం ట్రై చేస్తున్నా. నిన్ను నాన్న దగ్గర ఉంచనే ఉంచను” అన్నాడు వరుణ్‌. కానీ, అమెరికా నించి వరుణ్‌ అతని అన్న రానే లేదు విమానాలు ఆపేసారు. ”అమ్మ దహన సంస్కారాలు ఆపమనండి ట్రై చేస్తున్నాం రావటానికి” ఏడుస్తూ బ్రతిమిలాడతారు. కానీ సాధ్యం కాలేదు. కరోనా పేషంట్‌ను మార్చ్యురీలో కూడా ఉంచమన్నారు. ఆఖరికి పెదనాన్న కొడుకుల సమక్షంలో గవర్నమెంట్‌ వాళ్ళే దహన సంస్కారాలు చేస్తుంటే అమెరికా నుంచి లైవ్‌లో చూస్తూ గుండెలు పగిలేలా ఏడ్చారు వరుణ్‌, అతని అన్నా. ఒక పక్క అమ్మ శవం కాలుతుంటే, మరోపక్క వాన్లలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్న కరోనా శవాలు చూస్తూ భయంతో వణికిపోయారు. ధృతి కూడా వాళ్ళతో సమానంగా దుఃఖపడింది. మా కోసం భయపడింది. చివరికి వరుణ్‌ అమ్మ అస్థికలు లాకర్‌లో పెట్టారు.

నాన్న మొఖం చూడనంటున్నాట్ట వరుణ్‌. ”తన సుఖం తను చూస్కున్నాడు. నాన్న స్వార్థపరుడు. చిన్నప్పటి నుంచీ చూస్తున్నా అమ్మనెంత వేధించాడని… గ్రీన్‌కార్డ్‌ వచ్చి అమెరికాలో స్థిరపడ్డాక అమ్మను తీస్కెళ్ళి పోదామనుకున్నా. ఎప్పుడూ అవమానాలే… తన్నులే. అమ్మ అందుకే ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోయి… గుళ్ళూ గోపురాలు పిచ్చిగా తిరిగేది. అమ్మని చావు కూడా శాంతంగా చావనీయలేదు. నాన్నే అమ్మను చంపేసాడు” అంటూ వరుణ్‌ ఒకటే ఏడుపు. నాన్నతో మాట్లాడడు, వీడియో కాల్లో మొఖం తిప్పుకుంటున్నాడు తండ్రిని చూడకుండా.

ధృతి… నా పాప ఎప్పుడొస్తుందో? కరోనాతో రేపు పృధ్వికి నాకు ఏమైనా అయితే పాపని కూడా చూడకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోతామా? నా గుండె వణికింది. వరుణ్‌ వెక్కిళ్ళ శబ్దం నా గుండె శబ్దంతో కలిసి ప్రతిధ్వనించింది.


”అట్లా కాదు నాన్నగారిది కాకుండా, మనం సంపాదించిన ఆస్తి ధృతి పేరు మీద రాసెయ్యండి. మనకేమైనా అయితే కరోనాతో ఇద్దరమూ పోతే బంధువులు మోసం చేస్తే…” వణుకుతున్న కంఠంతో పృథ్వి గుండెలమీద పడి వెక్కెక్కి ఏడుస్తున్న నన్ను ”పిచ్చీ ఏడవకు మనకేం కాదు, కరోనా వచ్చినా ఇమ్యూనిటి ఉంది తగ్గిపోతుంది.”

మొన్ననే కరోనా వచ్చి చనిపోయిన తన స్నేహితుడు రవి గుర్తొచ్చి భయం కనబడనీయకుండా దాచి పెట్టుకుంటూ అంటున్నాడు పృథ్వి. ”రాసెయ్యి పృధ్వీ.. హాస్పిటల్లో రోజు రోజుకీ కేసులు ఎక్కువవుతున్నాయి” అన్నా మళ్ళీ. చాలా మంది స్నేహితులు, బంధువులు చనిపోతున్న వార్తలు ఎక్కువవుతూ బతుకు పట్ల అభద్రత పెరుగుతున్నది.

మరోపక్క మరదలు భాను, ప్రతి ఒక్క వస్తువూ ఇల్లు వాకిలీ, కళ్ళద్దాలు, తన ఆఫీస్‌ బ్యాగ్‌, వాలెట్‌, ఏ.టి.ఎమ్‌ కార్డ్‌, షూస్‌ అన్నీ ఒకటికి రెండు సార్లు సానిటైజ్‌ చేస్తుంది. కూరగాయలు ఉప్పులో నానబెట్టి కడిగి ఫాన్‌ కింద ఆరబెడుతున్నది. కిరాణ సరుకులు పాకెట్లపైనే సబ్బుతో రుద్దేస్తుంది. అవి రెండు రోజులు బయటే బాల్కనీలో ఉంటాయి. పేపర్‌ మాన్పించేసింది. ఆఖరికి మందులు కూడా డెట్టాల్‌ నీళ్ళలో ముంచేసి, ఫాన్‌ కింద పెట్టేస్తుంది. ఎక్స్‌పైరీ డేట్‌ మొత్తం మాయమవుతుందన్నా వినదు. ”చూసాలే అక్కయ్యా ఇంకో రెండేళ్ళు ఉంది. రాసుకున్నాలే బుక్కులో” అంటుంది పుస్తకం తెరిచి తాను రాసుకున్న మందుల లిస్టు చూపిస్తుంది.

రాకేష్‌కీ, భానుకి ఈ విషయంలో గొడవలవుతున్నాయి. బయట నుంచి రాగానే ఇంటి బయట ఉన్న బాత్రూంకి వెళ్ళిపోయి ముందే తను పెట్టిన సర్ఫ్‌ డెట్టాల్‌ కలిపిన వేడి నీళ్ళల్లో బట్టలు, మాస్క్‌ వేసేసి ఉతికేసాక స్నానం చేసాక కానీ ఇంట్లోకి రానియ్యదు. ఈ లోపల తను పానిక్‌ అయిపోతూ అతని వాచ్‌, వేలెట్‌, కళ్ళద్దాలు, ఫోన్‌, బ్యాగ్‌ అన్నీ బయటే సానిటైజ్‌ చేసేసి ఇంకోసారి స్నానం చేయాల్సిందే. రాత్రి పూట కూడా… చలి వణికిస్తున్నా రాకేష్‌ కోసం ఎవరైనా వస్తే ఇంటి బయట కుర్చీల్లోనే కూర్చోవాలి. వాళ్ళకి నీళ్ళు, టీ ఇచ్చిన కప్పులు, గ్లాసులు సర్ఫ్‌ నీళ్ళల్లో వేసేస్తుంది. వాళ్లెల్లాక వాళ్లు కూర్చున్న సోఫాలు, కవర్లు మొత్తం సానిటైజర్‌తో స్ప్రే చేసి ఎండలో వేసేస్తుంది. కొన్నిసార్లు వాషింగ్‌ మెషీన్లో వేస్తుంది. చేతులకు గ్లౌవ్స్‌ వేస్కుని మరీ. ఎవరైనా బంధువులు ఇంటికొస్తామన్నా లేమని, రావద్దనీ అర్థం చేస్కోమనీ చెబుతున్నది. రోజూ ఇంటికి ఆన్‌లైన్‌లో మాస్కులు, సానిటైజర్లు, గ్లౌవ్స్‌లు, మందులు కుప్పలు, కుప్పలుగా వస్తూనే ఉంటాయి. అన్నీ గేట్‌కి కట్టిన రెండు వెదురు బుట్టల్లో పడతాయి. మాస్కూ, గ్లౌవ్స్‌ వేస్కుని, వాటిని తెరిచి శానిటైసర్‌ స్ప్రే చేస్తుంది. తను మళ్ళీ స్నానమో, భుజాల దాకా ఇరవై సెకన్లు లెక్కబెడుతూ సబ్బుతో కడగడమో చేస్తుంది. బయటి వాటిని సానిటైస్‌ చేసేటప్పుడు, అదొక యజ్ఞంలా చేస్తుంది. హడావుడి పడిపోతుంది. ఇంటిబయటి ఆ క్లీనింగ్‌ జోన్‌లోకి ఎవరినీ రానివ్వదు. దూరం, దూరం అని అరుస్తూ మాస్క్‌పై నుంచి కళ్ళతో బెదిరిస్తూంటుంది.

భాను కొడుకు, ఇంటర్‌ చదువుతున్న విక్రంని కూడా ఇంటి బయటే స్నానం, శుభ్రత అన్నీ ముగించి రమ్మంటుంది. రోజులో ఎన్నిసార్లు బయటకు వెళ్ళొస్తే అన్ని సార్లూ స్నానం చేయాల్సిందే. వెంటేసుకు వెళ్ళిన వస్తువులు, వెంట తెచ్చినవి అన్నీ సానిటైజ్‌ చేయాల్సిందే. గడియారాల మీద కూడా సానిటైజర్‌ స్ప్రే చేస్తుంది. మొన్నోసారి కూరగాయల్ని డెట్టాల్‌ వేసి కడిగేస్తుంటే తను కోప్పడింది. ఏది ముట్టుకున్నా భయపడిపోతూ చేతులు సబ్బుతో పదే పదే కడుక్కుంటుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుందని, పెద్ద గంగాళమంత గిన్నె నిండా కషాయం కాచి ప్రతి ఒక్కళ్లకి ఇస్తుంది. తాగే దాకా వదలదు. కానీ రోజుకి రెండుసార్లు తాగాల్సిందే. అసిడిటీ, మోషన్స్‌ అన్నా వదలదు. ఇక గొంతు పుక్కిలించాల్సిందే. గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి… రోజుకి ఒకసారన్నా ఆవిరి పట్టాలి. కరోనా ఇంకా రాలేదు కదా అంటే వినదు.

ఇంట్లో అందరికీ భాను పెద్ద సమస్య అయిపోయింది. ఇంట్లో అందరి శుభ్రత, ఆరోగ్యం గురించి తను ఆందోళన పడిపోతూ, విపరీతమైన స్ట్రెస్‌కు గురి అవుతున్నది.

అంతేనా, రోజూ కరోనా గురించిన సమాచారం ఏయే డాక్టర్లు ఏం చెబుతున్నారో యూట్యూబ్‌ ఛానల్స్‌లో పిచ్చిదానిలా వెతకడం… బాగా చెప్పారని సబ్‌స్క్రైబ్‌ చేయడం, వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేయడం… కొత్త సమాచారం భయం కలిగించేదిగా ఉంటే పానిక్‌ అయిపోవడం ”కరోనా మోగిస్తూన్న మరణ మృదంగం” లాంటి భయంకర హెడ్‌లైన్స్‌ టీవీ ఛానల్స్‌లో టీఆర్‌పీ రేట్ల కోసం వస్తే… ఆందోళన పడిపోవడం. అర్థ రాత్రిళ్ళు పిచ్చిదానిలా ఏడవడం, తను చనిపోతే రెండో పెళ్ళి చేస్కోని పిల్లలకి అన్యాయం చేయద్దని భర్త రాకేష్‌తో ప్రామిస్‌లు తీస్కోవడం, ఇమ్యూనిటీ పెంచే కషాయాలు, సూపులు, వంటలు నేర్చుకోవడం ఫ్రెండ్స్‌కి, బంధువులకి పంపుకోవటం, ఫోన్లో కరోనా చావు కబుర్లు విని భయపడిపోవడం, తన తల్లికి ఫోన్‌ చేసి నేపోతే నువ్వే నా విక్రంని పెంచాలి అని ఏడుస్తుంది. కోలుకున్న వాళ్ళెలా కోలుకున్నారో, కోలుకోని వాళ్ళెలా చచ్చారో ఎంక్వైరీలు చేయడం. అంతేకాదు, రకరకాల మందులు వేలల్లో పెట్టుకోవడం… క్లోరోక్విన్‌, ఆంటీ వైరల్‌ మందులు, హోమియోపతీ, ఆయుర్వేదం మందులు ముందే కొని స్టాక్‌లో పెట్టుకోవడం, సానిటైజర్స్‌, మాస్కులైతే విపరీతంగా కొనెయ్యడం… భానుకెలా ఎంతలా కౌన్సిలింగ్‌ ఇచ్చినా మారటం లేదు. కరోనా కంటే, భాను పరిస్థితి మెల్లగా మానసిక సమస్యలోకి మారడం ఆందోళనగా ఉంది.

ఇంటి ముందు ఈవెనింగ్‌ వాక్‌కి వెళ్లొచ్చే మామగార్ని కూడా రాత్రిపూట స్నానం చేయమని బట్టలు బయటే విడిచి రమ్మని పోరు పెడుతుంది. ”మీకు వయసెక్కువ, ఇమ్యూనిటీ తక్కువ. పైగా షుగరు, బీపీ ఉంటే కరోనా త్వరగా వస్తుంది. మీ నుంచి అత్తయ్యకూ, మాకూ వస్తుంది, బాధ్యతగా ఉండాలిగా?” అని అరుస్తుంది. ఆయన్ని ఇంట్లోకి రానివ్వదు… డెబ్భై ఏళ్ళ మామగారు నిస్సహాయంగా తల బాదుకుంటూ మళ్ళీ స్నానం చేసి వస్తారు. ఇక ఇట్లా కాదని, తను డాబా మీదే ఆయన్ని ఆ కొద్ది స్థలంలోనే వాకింగ్‌ చేస్కోవడానికి ఏర్పాటు చేసింది. భాను లోపల భయం, రోజు రోజుకీ ఎక్కువైపోతుంది. రోజూ మామగారికి తమకు రావాల్సిన ఆస్తి వాటా రాసిచ్చేయమని పోరు పెడ్తున్నది. ”మేం ఇంకా చావలేదు కదే” అని అత్తయ్య ఏడుస్తుంది. భాను భర్త రాకేష్‌కి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ఉద్యోగం లక్ష రూపాయల జీతం వస్తుంది. అది కాస్తా కరోనా పుణ్యమా అని ఊడిపోయింది. రాకేష్‌ దాదాపు పిచ్చివాడు అయిపోయాడు. ఇంట్లో ఎవరికీ తెలీకుండా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ప్లాట్లు, కారు కొనడమే కాదు, ఈ మధ్య ”ఇంత పెద్ద ఇల్లుంది కదరా ఎందుకు ఇంకో ఇల్లు? విడివడి ఉంటం ఎందుకురా” అని అత్తయ్యా, మామయ్యా ఎంత మొత్తుకున్నా వినకుండా హౌస్‌ లోన్‌ తీస్కుని కొత్త ఇల్లు మొదలుపెట్టాడు. కరోనా వలన అంతా ఆగిపోయింది.

రాకేష్‌ రెండేళ్ల క్రితమే భానుతో కంపెనీలో చిట్‌ఫండ్స్‌లో ఉద్యోగం రిసైన్‌ చేయించాడు. ఇద్దరూ డిప్రెషన్‌లో కూరుకుపోయారు. ఎంత కౌన్సిలింగ్‌ ఇచ్చినా మారటం లేదు. రాకేష్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాల కోసం రోజు వెతుకుతూనే ఉంటాడు. సిగరెట్లు ఎక్కువైపోయాయి. పైగా అసలే ఒత్తిడిలో ఉన్న రాకేష్‌, కరోనా భయంతో పిచ్చి చేష్టలు చేస్తూ సతాయిస్తున్న భానుతో విసిగిపోయి, కోపంతో ఆమెను కొట్టేస్తున్నాడు. ఇద్దరి మధ్యా విపరీతంగా గొడవలు అవుతున్నాయి. వాళ్లను చూస్తూ అత్తయ్య కన్నీళ్లు కారుస్తుంది. పృథ్వికి, తనకు మంచి జీతాలు, మామయ్యకి పెన్షన్‌ సేవింగ్స్‌ ఉండబట్టి సరిపోయింది. పైగా అత్తయ్య సుజాతను పని మాన్పించేసింది. ‘మనమే చేస్కుందాం ఎన్ని ఇళ్ళల్లో చేస్కోస్తోందో మనకు కరోనా అంటిస్తుందేమో’ అని. ‘మేం ఎట్టా బతకాలి అమ్మగారూ మీ ఇల్లు… పక్కిల్లు తప్ప నేను వేరే ఇల్లు పట్టుకోను తెలుసు కదా… మా ఆయనకూ పని దొరకటం లేదు. హోటలు మూతబడి అంతా రోడ్డున పడ్డాం…’ అంటూ సుజాత భోరున ఏడ్చింది. ‘కరోనా తగ్గేదాక సగం జీతం నీ అకౌంటులో వేస్తా దిగులుపడకు… తగ్గాక నువ్వే వద్దు గానీ’ అని రహస్య ఒప్పందం చేస్కున్నా సుజాతతో. అట్లాగే వంట మనిషి మరియంని మాన్పించేసింది ఊర్నించి వచ్చీ రాంగానే. కరోనా అని తెల్సిన వెంఠనే పృథ్వీ వెళ్ళి అత్తయ్య, మామయ్యలను తనతో పాటు ఇంటికి తెచ్చేసుకున్నాడు. మొదట్నించే కుల పట్టింపు ఎక్కువగా ఉన్న అత్తయ్య ‘మరియంను మాన్పిస్తేనే వస్తా’ అని షరతు పెట్టింది. ఐదేళ్ల నుంచి మా ఇంట్లో వంట చేస్తున్న తనని పనిలోంచి తియ్యద్దని అత్తయ్యను పాదాల మీద పడి వేడుకుంది మరియం. అత్తయ్యది కరకు గుండె. మరియం కళ్ళు చెమరిస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ శెలవు పుచ్చుకుంది. మరియం భర్త కేటరింగ్‌ సెంటర్‌లో పని చేస్తాడు. అది మూతబడింది. మరియం ఉద్యోగమూ పోయింది. ఇద్దరు పిల్లలతో మరియం జీవితం రోడ్డున పడింది. మా ఇంట్లో పని మాన్పించడానికి ఆమె కులం, తీసుకున్న క్రిస్టియన్‌ మతం కారణం అయితే బయట ఇంకో నాలుగు ఇళ్ళల్లో కరోనా కారణం అయ్యింది. నేను పనిలోంచి ససేమిరా తియ్యను అని నమ్మకం మరియం, సుజాతలకు.. కానీ అత్తయ్య రాగానే వాళ్ళ నమ్మకాలు పోయాయి. ”తీసెయ్యబాకండమ్మా మీ ఒక్క ఇల్లైనా చేస్కుంటూ ఎట్లాగైనా నడిపేస్తాం బతుకుబండి” అని ఏడ్చింది మరియం. అత్తయ్య కరగలేదు. అట్లా వాళ్ళిద్దరి జీతాలు పదిహేను వేలు మిగిల్చింది అత్తయ్య. అందరం కలిసి చేస్కుందాం అంటుంది కానీ అరవై ఐదేళ్ళ అత్తయ్య పని చేసే స్థితిలో లేదు. మోకాళ్ళ నొప్పులు, షుగర్‌ రెండూ ఉన్నాయి. భానుకి ఎంతసేపూ కడిగిందే కడగడం, సర్దిందే సర్దడం… రోజూ రెండుసార్లు స్నానం చేయడం అందర్నీ చేయమని తరిమి తరిమి చేయించడం, చేతులు మాటి మాటికి కడుక్కోడం అత్తయ్య మామయ్యలతో ఆస్తి కోసం తగూలాడ్డం దీంతోనే సరిపోతుంది. ఇక ఇంటి పనంతా తన మీదే పడింది. నెలకి పదిహేను వేలు మిగిలాయని సంబర పడుతుంది అత్తయ్య కానీ, సర్ఫ్‌లు, సానిటైజర్లు, కషాయం కోసం, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచీలు, మందుల కోసం విపరీతంగా ఖర్చు పెట్టిస్తుంది భాను. ఎంతసేపూ వాటిలోనే మునిగి తేలడమాయే. భానుతో పాటు రాకేష్‌ కూడా ఊళ్లో పొలాలు అమ్మి డబ్బిలిస్తే ఇల్లు పూర్తి చేస్తా, అప్పులు తీరుస్తా లేకపోతే ఛస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు. మామయ్యకు బీపీ పెరగనారంభించింది. ఒక రోజు బాగా తాగేసి వాంతులు చేస్కుని, మామయ్యని తిట్టి తిట్టీ స్పృహ కోల్పోయాడు రాకేష్‌. ”నాన్నగారూ వాడికి ముందు డబ్బు సమకూర్చండి. లేకపోతే వాడు మనకు దక్కడు” అని పృథ్వి మామయ్యకి నచ్చచెప్పాడు. ‘అంతేకాదు మా పేరు మీదో యాభై లక్షలు ఫిక్స్‌డ్‌ వెయ్యండి లేకపోతే మేం ఎట్లా బతుకుతాం’ అంటూ భాను ఏడుస్తూనే అరిచింది. ”కరోనా ఏఁవీ శాశ్వతంగా ఉండబోవటం లేదు. ఇంకో ఆర్నెల్లో తగ్గు ముఖం పడ్తుంది. అందరూ ఎవరి పనుల్లో, వ్యవహారాల్లో వాళ్ళు పడిపోతారు. వాడిదేం శాశ్వత నిరుద్యోగం కాదు. మేం కోటీశ్వరులం కాము. నీ అమ్మా వాళ్లను అడుక్కో ఫో” అత్తయ్య అర్చింది కోపంగా.


“వెళ్ళి తీరాలా” అత్తయ్యా, పృథ్వీ అడుగుతుంటే “లేదు వెళ్ళాలి హాస్పిటల్లో ఏదో గొడవ జరుగుతున్నది. రమ్మంటున్నారు జాగ్రత్తగానే వెళ్ళతాను అంబులెన్స్‌లోనే వెళ్తాను” అంటూ మాస్క్‌ వేస్కుని పరిగెత్తాను.

కొస ప్రాణంతో కొట్టుకు లాడుతున్నది గర్భిణీ స్త్రీ కారు లోపల. పక్కనే వీధిలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ వాళ్ళు లోపలికి రానివ్వలేదుట. అంతకు ముందు చాలా హాస్పిటల్స్‌ చుట్టూ ఉదయం నించీ తిరుగుతూనే ఉందిట. తల్లిదండ్రులు కాబోలు ఏడుస్తున్నారు, వాచ్‌మాన్‌ని బ్రతిమిలాడుతున్నారు. ”నై, కరోనా టెస్ట్‌ కర్వాకే ఆనా నైతో అడ్మిషన్‌ నై” (కరోనా టెస్ట్‌ చేస్కుని రావాలి లేకపోతే అడ్మిషన్‌ లేదు) అంటున్నాడు. తను అంబులెన్స్‌ దిగేప్పటికి ఇదీ పరిస్థితి. కారులోపల గర్భిణీ స్త్రీ నిస్త్రాణగా నొప్పు లాగిపోయి ఉంది… గుండె చెదిరిపోయింది. వెంఠనే ఫోన్‌ చేసి డ్యూటీ డాక్టర్‌ని పిలిపించి చెక్‌ చేయమన్నాను. ‘మేడం ఎం.డీ. గారొద్దన్నారుగా” అంటున్నాడు డా|| చరణ్‌తేజ్‌. కరోనా హాస్పిటల్లో పని చేస్తున్నాడని ఇంటి ఓనర్లు అర్ధరాత్రి సామాన్లు బయటపడేస్తే భార్యా పిల్లలతో నడిరోడ్డు మీద నిలబడి ఏడుస్తూ నాకు ఫోన్‌ చేస్తే… రాత్రికి రాత్రి అతని కాలనీలోనే మా బాబాయి వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటే మాట్లాడి పంపించి తర్వాత మా హాస్పిటల్లో ఉద్యోగం వేయించా డ్యూటీ డాక్టర్‌గా. మనుషుల్లో అంత అమానవీయత చూసిన డా|| చరణ్‌ తేజ్‌, ఎం.డి వద్దంటున్నాడని అంటున్నాడు అంతే అమానవీయంగా. నాకేమీ వినపడ్డం లేదు. అన్నీ తెల్సు కానీ దుఃఖంతో వణికిపోతున్న ఆ ముసలి తల్లిదండ్రుల్ని, బిడ్డను కోల్పోయే స్థితిలో కళ్ళు తేలేసి బట్టలు రక్తసిక్తమైపోయి పడి ఉన్న ఆ గర్భిణీ స్త్రీని అలా వదిలి పెట్టాలనిపించలేదు. ”ప్లీస్‌ చెక్‌ హర్‌” అర్చినంత పని చేసా… గైనిక్‌ నర్స్‌ ఇంకో డ్యూటీ డాక్టర్‌ ఇద్దరూ పరిగెత్తుకు వచ్చి చెక్‌ చేసారు. ఇంకో ఎ.ఓ. కిరణ్‌ ”నో… డోంట్‌ డూ… లోపల వద్దు బయటే చెయ్యండి” అని అరుస్తూ పరిగెత్తుకు వచ్చాడు… “మేడం, మదర్‌ అండ్‌ బేబీ బోత్‌ డైడ్‌” (”మేడం, తల్లీ, బిడ్డలిద్దరూ చనిపోయారు”) అంది గైనిక్‌ నర్సు నా దగ్గరికొచ్చి గుసగుసగా. నిస్సహాయంగా, వెర్రిచూపొకటి చూసాను, పెనుకేకలు పెడ్తున్న తల్లిదండ్రులవైపు. “నీలోఫర్‌కి తీస్కెళ్ళండి మా తోటి కాదు. ఇంత క్రిటికల్‌ అయ్యాక తీస్కొచ్చారు ప్లీజ్‌” డా|| చరణ్‌ తేజ్‌ బతిమిలాడుతున్న ధోరణిలో అంటున్నాడు. అప్పుడే కారు దిగిన ఎం.డీ… తన దగ్గరికి పరిగెత్తుకెళ్ళిన కిరణ్‌ చెప్పిందంతా వింటూ ”ఓహ్హ్‌… వియ్‌ ఆర్‌ సేఫ్‌ థాంక్‌ గాడ్‌” అన్నాడు ఎం.డీ నా వైపు ఒకింత కోపంగా చూస్తూ. అరగంట నుంచి వాచ్‌మేన్‌ని బతిమిలాడుతున్నారట వాళ్ళు. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ”క్లోస్‌ ద గేట్‌” ఎం.డీ. పిచ్చెక్కినట్లు గావుకేక పెట్టాడు. కారు తల్లీ బిడ్డల శవాల్ని మోసుకెళ్ళిపోయింది.

‘కోవిడ్‌ ఫ్రీ హాస్పిటల్‌’ బోర్టు పెట్టించెయ్యాలి. వెంటనే బోర్డు ఆర్డర్‌ ఇవ్వండి” ఎం.డీ కిరణ్‌కి చెబుతున్నాడు. ”అండ్‌ సీ నర్మదా మేడమ్‌, ఇది మీ హాస్పిటల్‌ కాదు రూల్స్‌ క్రాస్‌ కావద్దు” అన్నాడు ఎం.డీ నాతో కోపంగా.

ఇంటికొచ్చిన వెంటనే రెండు బకెట్ల నిండా భాను నింపిన వేడి నీళ్ళతో స్నానం చేసినా ఆందోళనా, దుఃఖం, తలనొప్పి తగ్గలేదు. కారులో రక్తపు బట్టల్లో కళ్ళు తేలేసిన గర్భిణి స్త్రీనే కళ్లముందు కదులుతున్నది ”పోనీ లేవే… కాలం ఇట్టా దాపురించింది. ఇంక తల్చుకో మాకు.. వేడి కాఫీ తాగి పడుకో” అంది అత్తయ్య చేతికి వేడి కాఫీ గ్లాసు అందిస్తూ. మరోపక్క లాక్‌డౌన్లో పనులు లేక పొట్ట చేత బట్టుకుని… పిల్లా పాపల్ని ఎత్తుకుని మైళ్ళకొద్దీ నడుస్తూ.. తమ ఊర్లకు చేరాలని మైళ్ళ దూరాలు నడుస్తూన్న వలస కూలీలను రోడ్లమీద జంతువుల్లా కూర్చోబెట్టి సానిటైజర్‌ కలిపిన నీటి కేనన్లతో శుద్ధి చేస్తున్న యూపీ ప్రభుత్వ దాష్టీకం చూపిస్తున్నారు. మరోపక్క నడవలేక ప్రాణాలు విడిచిన పన్నెండేళ్ళ పసిది, లక్ష్మి శవాన్ని పట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న రోజు కూలీలైన తల్లిదండ్రులను చూపిస్తున్నారు. మరోపక్క మైళ్ళకొద్దీ నడిచి నడిచీ పాదాలు చిట్లిపోయి, తోలు ఊడిపోయి రక్తాలు కారుతోన్న గర్భిణీ స్త్రీ పాదాలు జూమ్‌ చేసి మరీ చూపెడుతున్నారు. ఆ తల్లి ఒడిలో, గుక్కపెట్టి పాలకోసం ఎండిన తల్లి రొమ్ములు తడుముతూ ఏడుస్తున్న సంవత్సరం పాపని చూపిస్తూన్నారు. వీళ్ళ టీ.ఆర్‌.పీ. రేట్ల యావ కరోనాని మించిన విషంలా ఉంది. అత్తయ్య వెంటనే ఛానల్‌ మార్చింది.

ఢిల్లీ ఎయిమ్స్‌లో కరోనా రోగులతో పనిఒత్తిడి పెరిగి ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ సచిన్‌… పెద్ద అక్షరాలతో టీవీ స్క్రీన్‌ మీద డాక్టర్‌ శవంతో సహా చూపిస్తున్నారు. మరో పక్క పని ఒత్తిడితో అలసిపోయిన డాక్టర్లు ఏడుస్తూ.. అరుస్తూ సుదీర్ఘమైన పనిగంటలు తగ్గించాలని, కుటుంబాలతో కలిసి నెలలు అవుతున్నదని, కరోనా నించి రక్షించే పీపీఈ కిట్ల లాంటివి తమతోపాటు నర్సులకూ పెంచాలని చెబుతున్నారు. కరోనా పేషంట్‌ సమాధి మీద అలసిపోయి నిద్రపోతున్న హాస్పిటల్‌ స్టాఫ్‌ మీద, ఆత్మహత్య చేసుకున్న డాక్టర్‌ సచిన్‌ శవం మీద, ఘోరంగా ఏడుస్తున్న ఆయన భార్యాపిల్లల, తల్లిదండ్రుల మీద కెమరా జూమ్‌ చేసి చూపిస్తున్నారు. ”కరోనా వచ్చాక ఇది ఆరవ ఆత్మహత్య. డాక్టర్లే ఇలా చేస్తే ఎలా” అంటూ ఏంకర్‌ గొంతు చించుకుంటున్నాడు. రెణ్ణెల్ల ముందు ఇదే ఎయిమ్స్‌లో ఒక దళిత డాక్టర్‌ని ఠాకూర్‌ కులానికి చెందిన సీనియర్‌ డాక్టర్‌, ప్రొఫెసర్లు కోటా సరుకని, గవర్నమెంట్‌ అల్లుళ్ళని అవమానిస్తూ వేధిస్తుంటే హాస్పిటల్‌ టెర్రస్‌ మీద నించి దుంకి ఆత్మహత్య చేస్కుంటే ఇదే మీడియా ఎందుకు ఫోకస్‌ చేయలేదు? గుండె చెదిరిపోతున్నది నాకు… తెలీకుండా కన్నీళ్ళు కారసాగాయి. ”ఇంత సున్నితమైతే ఎట్టా నర్మదా ఊరుకో” అంటోంది అత్తయ్య.


రోజులు అలా గడిచిపోతున్నాయి. కరోనా రోజు రోజుకీ ఎక్కువైపోతున్నది. రోజూ ధృతితో వీడియో కాల్లో మాట్లాడ్తాను. రోజూ మాట్లాడి అమెరికాలో పరిస్థితి ఎలా ఉందో కనుక్కుని జాగ్రత్తలు చెబితే కానీ మనశ్శాంతి ఉండదు. ధృతి ఒక్కోసారి బోరున ఏడ్చేస్తుంది. తనకు తెల్సిన స్నేహితులు తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా చనిపోతే ”అమ్మా నువ్వూ నాన్న జాగ్రత్త. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఇక్కడ ఒంటరిగా ఉంటాను” అని వెక్కెక్కి ఏడుస్తుంది. గుండెల్లో దుఃఖాన్ని అణుచుకుని ధృతికి ధైర్యాన్ని చెబుతాను. ”నాన్నని బయటకు వెళ్ళద్దను! నువ్వెందుకు వెళ్ళావు హాస్పిటల్‌కి… మొన్న భాను పిన్ని చెప్పింది. ఒద్దమ్మా రిస్క్‌ తీస్కోకు ప్లీస్‌” అని మళ్ళీ ఏడ్చేసింది. నచ్చ చెప్పి ఊర్కోపెట్టాను. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మాస్కులు వేస్కోము, లాక్‌డౌన్‌ ఎత్తేయ్యాలి అనే హక్కు కోసం ఉద్యమాలు చేస్తున్నారట. బాధ్యత లేకుండా కొంత మంది. ”అమెరికా ఇంత డెవలెప్‌ అయ్యిందా అమ్మా… మెడికల్‌ సర్వీసెస్‌ మాత్రం నిల్‌ అనుకో. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు” ధృతి చెబుతూ పోతున్నది. ”ఎన్నికలు ముందు పెట్టుకొని కూడా ట్రంప్‌ కరోనా ప్రివెంటివ్‌ స్టెప్స్‌ తీస్కోవట్లేదు. వీడికింత కాన్పిడెన్స్‌ ఏంటో… మొన్నే జార్జిఫ్లాయిడ్‌ హత్య తర్వాత, మరో ఆఫ్రికన్‌ – అమెరికన్‌ హత్య జరిగిందా… అయినా వీడిట్లా చేస్తున్నాడు. ఎంత సేపూ ఇండియన్స్‌ హెచ్‌-1 వీసాలు ఆపేస్తే అమెరికన్స్‌ ఓట్లు పడిపోతాయనుకుంటాడు. ఇండియాలో మోడీలాగా అన్నమాట. యూఎస్‌లో ఏవో కుట్రలు చేస్తాడు. కరోనా నివారించగలిగితే చాలు మరేమీ చెయ్యఖ్కర్లా. కానీ ఈ మూర్ఖుడుకి వెలగట్లేదు.” ధృతి మాటల ప్రవాహంలో నేను కొట్టుకుపోయాను.

”అమ్మా, నువ్వు జాగ్రత్త. మీ ఇద్దరి గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్రే పట్టటం లేదు. ప్రామిస్‌ చేయమ్మా.. వరుణ్‌ అమ్మ కరోనాతో పోయి ఈ రోజుకు పదిహేను రోజులు. ఈ పదిహేను రోజులూ నేను నిద్రపోలేదమ్మా. ఒకవేళ నిద్రపట్టినా నీ మీద, నాన్న మీద పీడకలలు వస్తున్నాయి” ఎర్రబడ్డ కళ్ళనిండా కన్నీళ్ళు పొంగి తొణుకుతున్నాయి ధృతికి… ఎంత ఒత్తిడి అభద్రతలో ఉంది నా బిడ్డ? ఒక్క ధృతేనా ఎంత మంది బిడ్డలు ఇట్లా ఈ కరోనా సమయంలో పరాయి దేశాల్లో ఒంటరితనం అనుభవిస్తున్నారు. ”ఏడవకు రెస్టిల్‌ టాబ్లెట్‌ వేస్కోని పడుకో నాన్నా” మెల్లిగా అన్నాను. ”అమ్మా నీకు తెలుసా… ఇక్కడ యూఎస్‌లో లౌక్య, వివేక్‌, సంజయ్‌, శ్వేతల జాబ్స్‌ పోయాయి కరోనా వలన… నాదీ అంతంత మాత్రంగానే ఉంది. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ డౌన్‌ అయిపోయింది. ఉద్యోగాలు పోయి ఎవరూ రెంట్లు కట్టలేకపోతున్నారు. కొత్త ఇళ్ళు కట్టించుకోవడం లేదు, కొంటం లేదు. కంపెనీ లాస్‌లో ఎంప్లాయిస్‌ని తీసేస్తున్నది. రేపు నా జాబ్‌ కూడా పోవచ్చు.. పోతే మటుకు నువ్వు పానిక్‌ కావద్దు… నాకు సేవింగ్స్‌ ఉన్నాయి. ఓకేనా? అమ్మా నాన్నను జాబ్‌ మానెయ్యమను. నేను పంపిస్తా డబ్బు… నాకు సేవింగ్స్‌ ఉన్నాయని చెప్పాగా… అమ్మా… వింటున్నావా? బయటకు వెళ్ళద్దిద్దరు ఫ్లీజ్‌… అమ్మా నిన్నంతా నాన్నతో మాట్లాడా. అయినా సరే, మీరిద్దరూ బయటకెళ్ళేది మాత్రం వెళతారు… అమ్మా ఫ్లీజ్‌…” దుఃఖంతో గొంతు రుద్ధమవుతుంటే ధృతి మాట్లాడుతూనే ఉంది. మెక్సికో, కాలిఫోర్నియాలో ఉద్యోగం పోయి, కట్టుకున్న ఇంటికి వాయిదాలు కట్టలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసిన నా ఫ్రెండ్‌ విజిత కొడుకు అరవింద్‌, ఆ మాట నాకు చెప్తూ భోరుమని ఏడ్చిన విజిత గొంతూ గుర్తుకు వచ్చి గుండె ఒణుకుతుంటే ఊఁ కొడుతున్నా. అక్కడ ఫ్రెండ్స్‌ కాపాడుకున్నారు అరవింద్‌ను. ఇక్కడ విజిత, ఆమె భర్త అక్కడికి పోలేక, ఇక్కడ ఉండలేక పడ్డ నరకం గుర్తుకు వచ్చింది. ”ఏం చెయ్యనే, ఎట్టా బతకను? అక్కడ వాడు బాత్రూం క్లీనర్‌ తాగేసి స్పృహ తప్పి పడి ఉన్నాట్ట… నేనిక్కడ ఇట్టా ఏం చాతకాక పడి ఉన్నా నర్మదా… మరోపక్క శ్వేతకి నెలలు దగ్గర పడుతున్నా అక్కడ డాక్టర్లు సరిగా దొరకరు… చూడరు తెలుసుకదా… ఐదో నెలలో బ్లీడింగ్‌ అయ్యి కుట్లేసి బెడ్‌రెస్ట్‌ తీస్కోమన్నారట. ఈ సమయంలో యూఎస్‌లో బిడ్డ దగ్గరికినే వెళ్ళి ఉండాలి కదా… నర్మదా అమ్మా భయం వేస్తుంది… ఆబార్షన్‌ అవుతుందేమో అని ఒకటే ఏడుపు అది. దాని స్నేహితులుండి చూస్తున్నారనుకో అయినా… ఈ బాధెట్టా ఓర్చుకోనే… భరించలేనే నేను చచ్చిపోతా. రెక్కలుంటే ఎంత బాగుండునే నర్మదా, విమానాలతో పని లేకండా పిల్లల దగ్గరికి ఎగిరెళ్ళిపోవచ్చు” ఫోన్‌లో వెక్కెక్కి ఏడుస్తున్న విజిత గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంది. ధృతిని రమ్మందామన్నా, నేను, ఫృథ్వి వెళ్దామన్నా ఏమీ చేయలేని స్థితి. ఫ్లైట్స్‌ రద్దు చేసేసారు. విజిత అన్నట్లు మనిషికి రెక్కలుంటే ఎంత బాగుండు. ఈ పాటికి విదేశాల్లో ఉన్న తమ పిల్లల దగ్గరికి వెళ్ళే తల్లి దండ్రులతో ఆకాశమంతా నిండిపోయేది.


”అయ్యో ఎందుకు… అంకుల్‌ ఎందుకులా చేసాడు?” పృథ్వి కళ్ళల్లోంచి కన్నీళ్ళు కారిపోతున్నాయి. ‘ఏమైంది?’ ఆందోళనగా అడిగాను. ‘దశరథ రామయ్య అంకుల్‌ ఊరేసుకుని ఆత్మహత్య చేస్కున్నాడు’ పృథ్వీ బలహీనంగా అన్నాడు. ‘అయ్యో ఎందుకు’ అన్నా గాబరాగా. ”కరోనా పాజిటివ్‌ వచ్చిందట ఊర్లో ఉన్న డాక్టర్‌ లింగయ్య చూడను పొమ్మన్నాట్ట. ఊరంతా ఒక్కటై ఊరు విడిచి ఎటైనా పొమ్మని తీర్పు ఇచ్చిందట. సిటీలో ఉన్న కొడుకు దగ్గరికి పొమ్మన్నారంట. కొడుకు రావద్దన్నాడు. అక్కడే ఎట్లాగో ఉండు అన్నాట్ట. భార్య ఎటూ లేదు. ఊరు ఉండనివ్వలేదు. ఏం చేస్తాడు? రాత్రికి రాత్రి ఉరేసేస్కున్నాడు. రామకృష్ణకు ఇంత దయ లేదు, ఎట్లా పాడయ్యాడు వీడిట్లా?” బాధగా అంటున్నాడు పృథ్వి. దశరథ రామయ్య కొడుకు రామకృష్ణ హైదరాబాదులోనే ఉంటాడు. పృథ్వి, రామకృష్ణ బాల్య స్నేహితులు.

వెంటనే ఫోన్‌ చేసి తిట్టేసాడు పృథ్వి రామకృష్ణను… ఫోన్‌ కట్‌ చేసాడు రామకృష్ణ ఇంకో కాల్‌ చేసి తన బాల్య స్నేహితుడు డా|| లింగన్నను నిలదీసాడు పృథ్వి… ‘అంకుల్‌కి కరోనా పాసిటివ్‌ వస్తే ధైర్యం చెప్పి గాంధీకి పంపాలి కానీ అలా క్లినిక్‌లో కాలు పెట్టదంటావా మనిషివేనా నువ్వు?” అని…

”చాల్లేరా పృథ్వీ… మమ్మల్నెప్పుడైనా మనుషుల్లా చూసార్రా మీరు? మీకేం చాలా మాట్లాడుతారు. మమ్మల్నే కాదు, ‘అశుంట.. అశుంట…’ అంటూ మా ఎనుములను కూడా ‘మాదిగోడి ఎనుములియ్యి తరమండిరా, చంపండ్రా’ అని ఊరి చివరి దాకా తరిమిన మనిషి… ఆ దశరథ్‌ రామయ్య టీచర్‌. ఆయన నన్ను ఎనిమిదో క్లాసు దాకా తరగతి బయటే కూర్చోబెట్టిన పెద్ద మనిషి. బ్లాక్‌ బోర్డు మీద కూడా రాయనియ్యక పోయేవాడు. నన్ను చెంప మీద అచ్చులు పడేలాగా కొట్టి, నా కన్నీళ్ళు అంటినందుకు తన చేతినే కడుక్కున్న మనిషాయన. నేను రిస్క్‌ తీస్కొని అతనికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చేంత సౌజన్యం నాకు లేదు. బాల్యమంతా ఆర్కే నాన్నలాంటి పెద్ద మనుషులు చేసిన గాయాలింకా రక్తం కారుస్తూనే ఉన్నాయి. అయినా నేనే కాదు, ఎవరూ అడ్మిట్‌ చేస్కోలేదు. అలా నేను కూడా అడ్మిట్‌ చేస్కోలేదు. అయినా నేనేదో పాపం చేసినట్లు మాట్లాడుతున్నావేంట్రా? డాక్టర్‌ అయ్యాక కూడా ఇంత గౌరవం లేదు నా మీద మన ఊరి బలిసిపోయిన కులఁవాళ్ళకు. ‘ర్రేయ్‌ లింగన్నా దొర పిలుస్తున్నార్రా. ఇంటికొచ్చి ఇంజీషను ఇచ్చి పోరా’ అని అంటారు. నేనే కాదు, ప్రాణాలు కాపాడే నా ఆసుపత్రి కూడా అంటరానిదే వాళ్ళకు. ఈ ఆర్‌.కే తండ్రే కదూ, మాదిగోడి క్లినిక్కి నేను పోనని ఎకసెక్కాలాడి నలుగురిలో నవ్వింది? ఈ రోజు ఏం మొఖం పెట్టుకుని వచ్చాడ్రా నా క్లినిక్కి? ఏం అంటూ ముట్టూ మీకేనా? మాకు లేవా? అయినా స్వంత కొడుక్కే కనికరం లేకుండా పోయింది. నా ఇంటికి రా… చూడోసారి, ఎనభై ఏళ్ళ నా అవ్వా, అయ్యా ఇంకా నాతోనే ఉన్నారు.” డా|| లింగన్న మాటల్లోని కాఠిన్యాన్ని భరించలేక ఫోన్‌ పెట్టేసాడు పృథ్వి. అవన్నీ పచ్చి నిజాలే అని తెలుసు పృథ్వికి. తర్వాత రామకృష్ణ తండ్రి శవాన్ని చూడడానికి కూడా ఊరు వెళ్ళలేదని, మున్సిపాలిటీ వాళ్లే మూక దహన సంస్కారాలు చేసారనీ తెలిసింది.

కాలం… మరణ వార్తలతో వేగంగా, భయంగా, ఆందోళనగా, ఖంగారు, ఖంగారుగా పరిగెడుతున్నది. వద్దన్నా వినకుండా పృథ్వి యాభై వేలు పెట్టి పోర్టబుల్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ ఆమెజాన్‌లో ఆర్డర్‌ ఇచ్చి తెప్పించాడు. రామకృష్ణ తండ్రి చనిపోయినప్పట్నించీ పృథ్విలో తెలీని మార్పు వచ్చింది. పైగా అత్తయ్యగారి చెల్లెలు, పృథ్వికి పిన్ని అవుతుంది, ఆసుపత్రిలో ఆక్సిజన్‌ దొరక్క చనిపోయినప్పట్నించి పృథ్విలో ఆందోళన భయం ఎక్కువైపోయాయి. ఇంట్లో అందర్ని కంటికి రెప్పలా చూస్కోసాగాడు. ధృతికి రోజూ ఫోన్‌ చేయడమే. రోజూ ఒకసారి వీడియో కాల్‌ చేసి బిడ్డను కళ్ళారా చూస్తే కానీ మనశ్శాంతి లేని పరిస్థితి.

మనుషులు… స్నేహితులు, స్నేహితులకు స్నేహితులు, బంధువులు, బంధువులకు దూరపు బంధువులు, కాలనీ వాళ్ళు, హాస్పిటల్‌ కొలీగ్స్‌, కూరగాయలు అమ్మే నారయ్య, చాకలి కిష్టమ్మ, పాలమ్మే శివన్న… నా దగ్గరి స్నేహితురాలు, మా ఆసుపత్రి ఏ.ఓ. కిరణ్‌, నర్సు జబీన్‌ అంతా పోతున్నారు. ఏ.ఓ. కిరణ్‌న్ని ఎం.డి. గాంధీకి తరిమేసాడు. అన్యాయంలోనూ ఒకటే నీతి పాటించడం కరోనాతోనే మొదలయ్యింది కాబోలు. ఒకరి తర్వాత ఒకరు కరోనాతో చనిపోతుంటే, గుండెలు గుబగుబ లాడుతున్నాయి. పృథ్వి నన్ను వారానికి ఒక రోజు కూడా ఆసుపత్రికి పోనివ్వటం లేదు. భానుకి కరోనా భయం కాస్తా అబ్సెసివ్‌ కంపెల్సివ్‌ డిసార్డర్‌గా మారిపోయింది. చేతులు రోజుకో ముప్ఫై సార్లన్నా శానిటైజర్‌తో కడుగుతుంది. అర చేతులు పొట్టు తేలి పుళ్ళైనాయి. రోజుకో నాలుగు సార్లు స్నానం చేస్తుంది. మా ఆసుపత్రి సైకియాట్రిస్ట్‌తో వర్చువల్‌ అప్పాయింట్‌మెంట్‌ కౌన్సిలింగ్‌ ఇప్పించాను. మందులు వేస్తున్నాను. భానుకి, రాకేష్‌కి ఇద్దరికీ. భాను కొడుకు విక్రమ్‌ తల్లిదండ్రులను చూసి బెంగటిల్లిపోతున్నాడు. ముందే వాడికి ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కావటం లేదు. అంత బాధలోనూ తన స్కూలు బస్సు డ్రైవరు కొడుకు నవీన్‌కి తన తండ్రి సంవత్సరం క్రితం కొన్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇప్పించి ఆదుకున్నాడు.

మామయ్య రాకేష్‌ మీద ఆందోళనతో, పృథ్వి చెప్పినట్లు వెంటనే ఊర్లో పొలాల అమ్మకానికి ఊరి సర్పంచుతో ధరల ఆరా తీస్తున్నారు. కరోనాతో భూమి ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి మరి. మొన్న పెద్దమ్మ ఫోను చేసింది. చిన్న కూతురు దివ్యకి కరోనాకి ముందే జనవరిలోనే పెళ్ళి చేసింది. కరోనా వచ్చాక దివ్య భర్తను ముట్టుకోనివ్వడం లేదని ఆరు నెల్లు భరించి మొన్న చేయి చేసుకున్నాట్ట అల్లుడు. దివ్య కోసం కరోనా టెస్టు కూడా చేయించుకున్నాట్ట. నెగటివ్‌ వచ్చినా ఇదే గొడవ. వాళ్ళ ఫ్రెండ్‌కి భర్తనించి కరోనా వచ్చి సీరియస్‌ అయిపోయినప్పట్నించీ దివ్యది ఇదే వరస. ”సెక్స్‌ కోసం నన్ను కొడతాడా, వీడితో ఉండను గాక ఉండనంతే, నాకు డైవర్స్‌ కావాలి” అంటూ పుట్టింటికి వచ్చేసింది. ”నువ్వు రా నర్మదా… దీని కాపురం సరిదిద్దు” పెద్దమ్మ భోరుమని ఏడుస్తూనే చెబుతోంది. ”దివ్య అనేది నిజఁమే కదా పెద్దమ్మా. భయం పోగొట్టే ప్రయత్నం చేయాలి కానీ అలా కొట్టటం తప్పు కదా?” కోపంగా అన్నాను నేను.


స్పర్శలో, శ్వాసలో, మాటలో, యాసలో, భాషలో, చూపులో, నడకలో, భావంలో, కదలికలో కరోనా తప్ప ఇంకేమీ మిగల్లేదు. మనిషికి సంబంధించి అన్నీ ఆగిపోయాయి. మనిషి నడక ఆగిపోయింది. నడక వంకరైంది. దారి తప్పింది. చూపు చావు వైపు స్థంభించింది. చూపు వెర్రిదైపోయింది. మాట తడబడిపోతుంది. తిరగబడుతోంది. మనుషులు కొన్ని మాటలు మాత్రమే పదే పదే మాట్లాడుతున్నారు. ఒకే భాషలో… ఒకే యాసలో… ఒకే భావంలో… మాట్లాడుతున్నారు. ఒకే దృశ్యంలో కనిపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు.

కరోనా తగ్గదుట కదా, రూపం మారిందిట కదా, ఏవో కొత్త లక్షణాలు వచ్చాయిట కదా ఇప్పుడు మూడు రోజుల్లోనే పోతున్నారట కదా. రెండో రోజునే గుండె ఆగిపోద్దట కదా… వాక్సీన్‌… వాక్సీన్‌… ఎప్పుడొస్తుందండీ… ఎప్పుడండీ…? ఫలానా వాళ్ళు చచ్చారట కదా… చావబోయి బతికారుట కదా… ముఫ్ఫై లక్షలు అయ్యిందిట. అమ్మో… దూరం… దూరం… దూరం… సోషల్‌ డిస్టెన్స్‌ తెలీదా అలా దగ్గరగా వెళతారేం. మాస్కులు… మాస్కులు… సానిటైజర్లు బిజినెస్సు కోట్లలో పెరిగిపోయిందిటగా… మాస్కులు ఇరవై నాలుగ్గంటలూ వేస్కుని ఆక్సిజన్‌ అందక… ఇర్రిటెట్‌ ఆయిపోతున్నారటగా జనం.

వేస్కోపోతే ఎట్టా కరోనా చంపేస్తుంది మరి… ఒకటే భాష… కరోనా… చావు… భయం… భయం… కరోనా… చావు… మాస్కులు… దూరాలు… శానిటైజర్లు… నిలువెల్లా భయం… మనిషి కరోనా కంటే భయాన్ని ఎక్కువగా అంటించేస్తున్నాడు. మనిషే మొత్తంగా కరోనా వైరస్‌గా రూపాంతరం చెందుతున్నట్లు అయిపోతున్నాడు. కరోనా కంటే… కరోనా అంటించే తోటి మనుషుల్ని ద్వేషిచించేస్తున్నాడు. విచిత్రంగా కరోనాని ప్రేమించడం, దేవతను చేసి పూజించడం చేస్తున్నాడు. కానీ… కరోనా కంటే కౄరంగా తయారవుతున్నాడు. మనుషులు వెర్రి వాళ్ళల్లాగా వాక్సీన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. రాదేమోనని ఆందోళనతో నలిగిపోతున్నారు. ఆ డాక్టరు గారు చెబుతున్నారుగా స్టీరాయిడ్‌ టాబ్లెట్లు, ఏస్ప్రిన్‌ టాబ్లెట్లు పెట్టుకోండి… కరోనా రాంగానే వేసేసుకోండని, రక్తం పలచబడదటండీ గుండె పోటు రాదుటండీ… నేను తెప్పించేసాను.

ఆక్సీమీటరు ఇప్పుడు వెయ్యి రూపాయల్లో వచ్చేస్తుందండీ. మీకు తెల్సా ఆస్తులండీ… ఆస్తులు పిల్లలు ఆస్తులు రాసేయ్యమంటున్నారు. వాళ్ళ బాధ పడలేక మొన్న పిల్లలిద్దరి పేరా సమానంగా రాసేసానండీ… నాకూ, నా భార్యకు కూడా ఉంచుకున్నా కొద్దిగా…

ఏవిటీ బ్రాహ్మలకు రాదుటండీ కరోనా… మరి ఆ పాటలు పాడే బాలసుబ్రహ్మమణ్యం బ్రాహ్మడేగా ఎట్టా వచ్చిందంటారూ తప్పండీ.. కరోనా అందరికీ వచ్చుద్ది… అది కాదండీ స్లమ్ముల్లో ఉన్నాళ్ళకి రావట్లేదుట కదా కరోనా… మురికికి ఆళ్ళకి ఇమ్యూనిటి పెరిగిపోతుందిట. మనమూ పోదామంటారా స్లమ్ములకి… అన్నీ తీస్కునే పోదాం, ఫ్రిడ్జీలు, టీవీలు, కంప్యూటర్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు, వర్క్‌ ఫ్రం హోం చేస్కోవద్దూ మరీ… అన్నీ తీస్కునే వలస పోదాం స్లమ్ములకి. ఏం ఆళ్ళు పోవటంలా అట్టా… ఆళ్ళ వలసలూ, మన వలసలూ ఒఖ్ఖటి కాదంటారూ… సర్లెండి, అవును కానీ ఊర్లల్లో ఇంటికి దూరంగా గుడిశెలేసేసి తరిమేస్తున్నారుట కరోనా పేషంట్లని పక్కింటి పిన్నిగారు… ఎదురింటి రామనాథం… రెండో వీధి శాస్త్రి, వెనకింట వెంకటరెడ్డి… ఆలోచనలు మారిపోతున్నాయి. కొత్త పలుకులతో మనుషులు వెర్రెత్తి పోతూ పిచ్చి కూతలు కూస్తున్నారు. మెల్లగా కరోనా తగ్గుతూ మరణాలు తగ్గుతూ ఉన్నా జనం అదే వెర్రిలో ఉన్నారు.


కరోనా వచ్చి ఎనిమిదో నెల. కొద్దిగా జనంలో భయం తగ్గింది. మొన్న ఇంట్లో ఉంటం విసుగు అన్పించి అలా పక్క వీధిలో వాకింగ్‌ చేద్దామని భాను కళ్ళు గప్పి వెళ్లా. ఆ వీధిలో నాకు ఇద్దరు స్నేహితురాళ్ళున్నారు. వనజ, కమల, విజయ. వీధులన్నీ కర్ఫ్యూ ఉన్నట్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. వెళ్ళేప్పటికి. వనజ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుంది గేటు దగ్గరగా నిలబడి. నన్ను చూసి గుర్తు పట్టీ, పట్టనట్లు, ఫోన్‌ మాట్లాడుతూనే లోనకి వెళ్ళి తలుపేసేస్కుంది. మనసు కలుక్కుమంది. ఈ వనజకేనా తనంత సాయం చేసింది? ఎప్పుడంటే అప్పుడు మా ఆసుపత్రిలో డాక్టర్ల అపాయింట్‌మెంట్లు, ట్రీట్‌మెంట్‌ ఛార్జీలలో డిస్కౌంట్లు, సాంపిల్‌ మందులు అన్నీ ఇస్తూ… కరోనా జాలి, దయ, కరుణే కాదు సంస్కారాన్ని కూడా చంపేసిందా? అయినా ఇది పిచ్చిది… దూరాన్న నిలబడి మాట్లాడితే కూడా కరోనా వచ్చేస్తుంది అనుకుంటుంది కాబోలు? తన లోపలి రంగు బయటేసుకుంది కానీ. నేనేఁవన్నా లోనికి వస్తానన్నానా? మెల్లిగా వనజ ఇల్లు దాటి విజయ ఇంటి వైపు నడిచా… బయటే నిలబడి ‘విజయా బయటకు రా… దూరాన నిలబడి మాట్లాడుకుందామని” ఫోన్‌ చేసా. విజయ పరిగెత్తుకుంటూ వచ్చింది… సంతోషంగా ‘రా నర్మదా లోనకు రా’ అంది. ‘చాలు, ఇది కదా స్నేహమంటే?’ అన్పించింది. ”ఒద్దు లేవే ఇదిగో ఇలా దూరాన నిలబడే మాట్లాడుకుందాం చాలా కాలం అయ్యింది కదా అని చూడాలన్పించింది. అందుకే ఇలా వచ్చా” అన్నా. ”మంచి పని చేసావు” అంది నవ్వుతూ విజయ. ”కమలెట్లా ఉందీ” అన్నా. కమల నాకు కాదు కానీ విజయకే బాగా దగ్గర. ”కమల అస్సలు తలుపు తీయటఁవే లేదు. మొగుణ్ణి బాగా సతాయిస్తా ఉందట… శానిటైజ్‌ చేస్కోమని… మొన్న ఆవు మూత్రం తాగితే కరోనా తగ్గుతుంది అని రామ్‌దేవ్‌ బాబా చెప్పాడని ఆన్‌లైన్‌లో తెప్పించి తాగమని సతాయించింది. వాళ్ళ మేనత్త అల్వాల్‌ల్లో ఉంటుంది తెలుసు కదా… మంత్రాలు, తంత్రాలూ చేస్తుంటుంది. మంత్రగాడిని పిలిపించి యుగాంతం వచ్చింది అంతా చచ్చిపోతారు. అందుకే కరోనా వచ్చింది అని చెప్పి, ఇంట్లో నల్ల మేకని బలిచ్చి ఆ పచ్చి రక్తం తాగితే కరోనా రాదని హోమియోపతి మందులు వేసే సీసాల్లో మేక రక్తం అందరికీ నింపి ఇచ్చిందిట. నల్ల మేక వెంట్రుకలు తావీదుల్లో కట్టి ఇచ్చిందిట ముంజేతికి కట్టుకోమని. ఇంక కమల భర్తా, పిల్లల వెంట పడిందిట తాగమని. మేం తాగమని వాళ్ళు ఖచ్చితంగా చెబితే వినకుండా బలవంతాన పిల్లల నోళ్ళల్లో ఆ పచ్చి రక్తాన్ని నింపబోయిందిట. అంతే… వాళ్ళ ఆయనకు కోపంతో పూనకం వచ్చినట్లై కమలను కొట్టేసాట్ట. కమల కింద పడిపోయి హిస్టీరియా వచ్చినట్లు కాళ్ళు చేతులు కొట్టేసుకుందట. వాళ్ళాయనా, పిల్లలూ భయపడిపోయారుట. కొద్ది సేపయ్యాక నార్మల్‌ అయ్యిందనుకో. కానీ ఆ రక్తపు సీసాలు మాత్రం భద్రంగా ఫ్రిడ్జిలో దాచిందిట. రోజూ వాళ్ళకు తెలీకుండా కూరల్లో కలిపి ఇస్తుందిట. దీనికి పిచ్చి బాగా ముదిరింది. ఎంత చెప్పినా వినదు ఇది ఇంక నాలుగు నెల్ల క్రితం మోడీగారు పిలిపిచ్చారుగా చప్పట్లు, గంటలు మోగించమని. ఇది ఇప్పటికీ ప్రతి శుక్రవారం కాళికా దేవికి పూజ చేసి మేడపైకి వెళ్ళి అరగంట సేపు గణగణ మోగిస్తూ కరోనా హతం అంటూ మంత్రాలు చదువుతుంది… కాలనీలో దానికో భక్త బృందం ఏర్పడింది. అంతా కలిసి ప్రతి శుక్రవారం ఇదే తంతు. ఏంటో ఎంత చెప్పినా వినదు ఇది” విజయ దిగులుగా కమల ఉన్న పక్కింటి పై ఫ్లోర్‌ వైపు అక్కడేదో కమల నిలబడి తన వైపు చూస్తున్నట్లు చూస్తూ అంటోంది.

నాకు మా భాను గుర్తుకు వచ్చింది. భాను కూడా టీవీలో బీజేపి వాళ్లు చూపిస్తున్న ఆపు పేడ స్నానాలు, ఆవు మూత్రం పానాలు తెగ చూసేస్తుంది. ఇక మా అందరితో ఆవు మూత్రం తాగించేస్తుందా ఏంటి అని అందరం భయపడి పోతున్నాం. ”అమ్మా ఆవు యూరిన్‌లో చాలా బాక్టీరియా, వైరస్‌ ఉంటాయే… ఒద్దే” అన్నాడు విక్రం భయంగా ఆన్‌లైన్‌ సెర్చ్‌ చేస్తున్న తల్లితో. అంతకు ముందు రోజే ఫామిలీ వాట్సాప్‌ గ్రూపులో కాషాయపార్టీ వాళ్ళు నేరుగా ఆవు ఉచ్ఛ పోస్తుంటే తాగే వీడియో… పెండ నీళ్ళు కొన్ని నోట్లో పోస్కొని పెండ నీళ్ళ తొట్టి స్నానాల వీడియోలు చూసి విక్రం, తల్లి ఎక్కడ చూస్తుందో అని తెగ భయపడిపోయి ఉన్నాడు. అదే చెప్పా విజయతో. పడీ పడీ నవ్వింది.. నేనూ నవ్వా చాలా రోజుల తర్వాత. ఇద్దరం బోల్డెన్ని కబుర్లు చెప్పుకున్నాం. విజయవాడలో వాళ్ళ బాబాయికి కరోనా వస్తే ఏదో ఫైవ్‌స్టార్‌ హోటల్‌నే హాస్పిటల్‌గా మార్చారుట. దాంతో ఇరవై రోజులకి ఇరవై ఐదు లక్షలు ఖర్చయినాయట. దానికోసం ఉన్న నాలుగెకరాలూ అమ్మేసారట. ”పిన్ని ఒంటి మీద బంగారవూ అమ్మేసారు నర్మదా… ఇప్పుడు వాళ్ళకే ఆధారవూ లేదు. కొడుకు అంత ఖర్చు పెట్టినందుకు కొట్లాడాడంట నాకేం మిగల్చరా అని వాడిపుడు పిన్నీ బాబాయిలను వృద్ధాశ్రమానికి వెళ్ళిపొమ్మని వేధిస్తున్నాట్ట. మొన్న పిన్ని ఫోన్‌ చేసి ఏడుస్తూ చెప్పింది” అని విజయ మాట్లాడుతోంది. విజయ కూడా ఒక్కతే అయిపోయింది. తనకీ షుగరే. కొడుకు విదేశాల్లో ఉంటాడు. రూమ్మేట్లు అంతా వదిలి వెళ్ళిపోయారట. అతనుండే ప్లేసులో భూకంపాలు తరుచూ వస్తూనే ఉంటాయట. కరోనాకి తోడు భూకంపాల భయం. మొన్నోసారి అర్ధరాత్రి భూకంపం వస్తే అందరితో పాటు రోడ్డు మీదకు పరిగెట్టాట్ట. సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి తీస్కెళ్ళి సేఫ్‌ ప్లేస్‌లో ఒక రోజంతా ఉంచి, మరునాడు వాడి ఇంటి దగ్గర వదిలేరుట. అక్కడే ఉన్న ‘పిన్ని ఇంటికి వెళ్ళరా’ అంటే ‘ఒద్దమ్మా వాళ్ళంతట వాళ్ళు పిలవాలి ఈ మధ్య ఫోన్లు ఎత్తడం లేదు. మెస్సేజీలకు సమాధానం ఇవ్వటం లేదు. ఇష్టం లేదులా ఉంది. వాళ్ళ భయాలు వాళ్ళవి. చంటి పిల్లలున్నారుగా. అయినా నేనెందుకు వాళ్ళను ఇబ్బంది పెట్టాలి? నేను పోను ఏం కాదు. నువ్వు నిమ్మళంగా ఉండు” అన్నాట్ట. విజయ కళ్ళ నిండుగా కన్నీళ్ళు… నేను ధృతి గురించి చెప్పాను. గొంతు రుద్దమవుతుంటే… ‘ఏం చేస్తాం ఉరుకో యాడవకు” అంది.

ఇవన్నీ తరచూ మేం ఫోన్లలో మాట్లాడుకునేవే. కానీ ఎనిమిది నెలల తర్వాత ప్రత్యక్షంగా కలవడం వలన మళ్ళీ అన్నీ కొత్తగా చెప్పుకున్నాం. కరోనా కంటే ముందు కనపడగానే ఆత్మీయంగా చేతులు పట్టుకునేది విజయ. ‘రా… నర్మదా లోనికి’ అంటూ తీస్కెళ్ళేది కరోనా… స్నేహితురాలి స్పర్శను కూడా దూరం చేసింది.

‘సరే వెళతాను. మా భాను ఫోన్‌ చేస్తున్నది, వెళ్ళకపోతే, రెయిన్‌కోట్‌ లాంటి పీపీటి వేస్కొని తనే వచ్చేస్తుంది. కొంచెం కమలను చూసుకో నేనూ ఫోన్‌ చేసి మాట్లాడుతుంటాను” అని దిగులుగా విజయకు వీడ్కోలు చెప్పి బయలుదేరా ఇంటివైపు. దార్లో జాస్మిన్‌ కనపడింది. మా ఇంటికి రెండు వీధుల చివర ఉంటుంది. ఎవరితోనో ఖంగారుగా ఫోన్లో మాట్లాడుతూ, నన్ను చూసి ఆగాగు అన్నట్లు చెయ్యి ఊపుతూ ‘అవునా అరె ఎట్లా ఎప్పుడూ…. అరెరె” అంటోంది. నేను ఆమెకు మూడడగుల దూరాన నిలుచున్నా… ఫోను ఆపి ”నర్మదా ఎట్లా ఉన్నావు? విన్నావా ఈ వార్త ఇప్పుడే తెల్సింది మన కుక్‌ మరియం భర్త జేమ్స్‌ సూసైడ్‌ చేస్కున్నాట్ట. తన ఉద్యోగం పోయింది కదా. పోనీ మరియం తన కష్టంతో బతుకుదావంటే.. మనమంతా ఆమెనకు వంట పని నుంచి తీసేసాం. ఆ జీసస్‌ క్షమించడు నన్ను” అంది మ్లానమైన మొఖంతో కుడిచేత్తో రెండు భుజాల మీదా, నుదుట మీద శిలువ గుర్తు వేస్కుంటూ ఖంగారుగా.

‘మీ ఒక్క ఇంట్లో పని ఉన్నా, నా భర్తకు ఉద్యోగం పోయినా ఎట్టాగో బతికేస్తాం, అమ్మా పన్లోంచి తీయమాకండి కావలిస్తే నర్మద మేడమ్‌… పెద్దమ్మగారి కాళ్ళ మీద పడతాను. ఈ నెల పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఇన్‌స్టాల్‌మెంట్లో సెల్‌ఫోను కొన్నాను. అవీ కట్టుకోవాలి. కట్టకపోతే ఫోన్‌ గుంజుకుంటారు. పిల్లల చదువాగిపోతుంది” కన్నీళ్ళతో వేడుకుంది మరియం. క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనకపోతే విషం తాగి చస్తానన్నాడు తొమ్మిదో క్లాసులో ఉన్న మరియం కొడుకు. ”దూరం… దూరం అట్టా అంటేసుకుంటావేమే. నేనేం మీ నర్మదమ్మను కాదు… ఏఁవొద్దు నీ చేతి వంట తిని మైలపడిపోయి, ఇంత కాలవూ ఇంత నిష్టగా బతికి, ఈ వయస్సులో పంచ మహాపాతకాలూ చుట్టుకొని నరకానికి వెళ్ళలేను. ఒద్దు గాక ఒద్దు మీ కులంలో, మతంలో వెతుక్కో పని’ అంటూ తన పాదాలు తాకిన మరియం చేతులను విషపురుగు అంటినట్టు చటుక్కున విదిల్చుకుంది అత్తయ్య.

‘అయ్యో’ అన్నాన్నేను కన్నీళ్ళు చిప్పిల్లుతుంటే, ”వెళతాను నర్మదా మనసు బాగోలేదు మరియం భర్త జేమ్స్‌ కేటరింగ్‌ సెంటర్లో పని పోయాక రోజూ కూలీ కని సిటీలో బాగా తిరుగుతున్నాడని… అతన్నించి మరియంకీ… ఆమెనించీ మనకీ అంటుకుంటుంది అని రాధిక చెప్పింది. ఆమెతో పాటు నేనూ భయపడి మరియంని పన్లోంచి తీసేసాను. బాగా ఏడ్చింది నర్మదా” అంటూ జాస్మిన్‌ గొంతు ఒణుకుతుంటే ఖంగారుగా ‘కలుస్తా మళ్లీ’ అని పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది. పాప క్షమాపణ కోరుతూ దైవ ప్రార్థన చేస్కుంటుంది కాబోలు?

మరి నేనేం చేయాలి?

ఇంటికొచ్చాక అత్తయ్య మొఖం చూడాలన్పించలేదు. కానీ నా ముందే నిలుచుంది… భారీ విగ్రహం ఆవిడది. శుక్రవారం కాబోలు తలారా స్నానం చేసి వయసు వల్ల ముదిరిపోయిన ముఖమంతా పసుపు దట్టించి, రూపాయి కాసంత ఎర్రెని కుంకుమ బొట్టుతో… అత్తయ్య… మొన్న డిస్కవరీ ఛానల్‌ల్లో చూపించిన ప్రపంచంలోకల్లా భయంకరమైన ఒళ్ళూ మొఖమూ పొలుసులతో నిండిన రంపపు పాములా కనపడింది. వెన్నులోంచి వణుకు సర సరా పాకింది. ఈ పాములు ఆరడుగుల దూరంగా నిలబడే విషం చిమ్ముతాయట. అది పడ్డ జంతువైనా, మనిషైనా క్షణాల్లో ఊపిరాడక చచ్చిపోతారట… అత్తయ్య చిమ్మిన విషానికి జేమ్స్‌ కూడా ఉరేస్కుని ఊపిరాడక చనిపోయాడు!

‘అక్కయ్యా స్నానం… స్నానం’ అంటూ వెంటబడ్తున్న భానుని తప్పించుకుని నా గదిలోకెళ్ళి తలుపేసుకున్నా. ‘అయ్యో అక్కయ్యా లోపలి బాత్రూంలో అన్నా స్నానం చెయ్యి’ అంటూ అరుస్తున్న భాను మాటలు పట్టించుకోకుండా మంచం మీద వాలిపోయి అలసటగా కళ్ళు మూసుకున్నా. కళ్ళ ముందు అత్తయ్య కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్ళతో పనిలోంచి తీయద్దని వేడుకుంటున్న మరియం ప్రత్యక్షమైంది. హృదయం వణికింది. ఓనాడు మరియంని తీస్కెళ్ళడానికి తమ ఇంటికి వచ్చిన జేమ్స్‌ తన కొడుకుని లాయర్‌ చేస్తానని తనతో అన్న మాట… ఆ మాటలన్నప్పుడు జేమ్స్‌ కళ్ళల్లో పొంగిపొర్లిన మెరుపుల కాంతులు ఎప్పటికీ మర్చిపోలేదు తను. ఈ పాడు లోకంలో తనకు న్యాయం దొరకదనుకున్నాడో ఏమో.. కొడుకుని లాయర్‌ చేద్దామనుకొన్నాడు కాబోలు. ఇప్పుడా కళ్ళు మెరుపులతో పాటు సమాధిలో కూరుకుపోయి ఉంటాయా?” మరియం వాళ్ళు సిటీలో పనులు పోయి పిల్లల్ని వెంటేసుకుని ఊరికెళ్ళిపోయారు. మరియం అత్తగారు ఒకటే గునిగిందిట ”వెళ్ళిపోండి, మీ బతుకు మీరు బతకండి. అసలు కరోనా ఉండగా మా ఇంటికెలా వచ్చారు ఫోండి… ఫోండి” అని కనికరం లేకుండా ఇంటి బయటున్న షెడ్డుకి తరిమిందట. జేమ్స్‌కి ఆమె సవతి తల్లి. ఊర్లో పని దొరక్క ఆదరించే వాళ్లు లేక మళ్ళీ సిటీకొచ్చారు. సిటీలో ఏ పనులూ దొరకలేదు వాళ్ళకి. ఆఖరికి, పిల్లల్ని భార్యను ఆకలితో అల్లాడుతూంటే చూడలేక పక్కింట్లో దొంగతనం చేసి పట్టుబడి దెబ్బలు తిన్నాట్ట జేమ్స్‌. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటే ఇంటాయిన తెలిసిన వాళ్ళని బుద్ధిగా ఉండమని పోలీస్‌ కంప్లైంట్‌ చేయలేదుట.

దొంగతనం బయటపడి, దెబ్బలు అవమానం తట్టుకోలేక ఉరిపోస్కున్నాట్ట మరియం భర్త జేమ్స్‌.

ఇద్దరు పిల్లలతో మరియం ఏం కావాలిప్పుడు?

అత్తయ్య రాకుండా ఉంటే మరియంని తనే పెట్టుకుని ఉండేది. జేమ్స్‌ బతికి ఉండేవాడా? మనసులో పెద్ద అలజడి… తుఫాను… అసలు అత్తయ్యనే పంపేసి మరియంని ఉంచుకోవాల్సింది. తన చేతుల్లో ఉందా ఇది? మరియంతో తమకి వంట చేయించుకొంటూ… అత్తయ్యకి విడిగా తనే చేసి పెట్టాల్సింది… ఎందుకు చేయలేకపోయింది? మరియం, జేమ్స్‌ ముఖాలు వేగంగా కళ్ళముందు తిరగాడుతూ నరాలు ఛిట్లిపోతాయేమో అన్నంత బాధ, ఒత్తిడి, లేదు మరియంని కలవాలి… తనకి ఏదైనా చేయాలి. అంతే!

మాగన్నుగా మగత కమ్మింది.

అదేదో పెద్ద లేబొరేటరీలా ఉంది. మనుషులంతా గావుకేకలేస్తూ, ఉండలు చుట్టుకుపోతూ ఉన్నారు. వాళ్ళ చేతుల, కాళ్ళ వేళ్ళు పొడవాటి ముళ్ళలా మారిపోయినాయి. అరె, వాళ్ళంతా ఆ మనుషులంతా కరోనా వైరస్‌లుగా మారిపోతున్నారు కళ్ళెదుటే… అయితే అందరూ కాదు, అత్తయ్య, జేమ్స్‌ సవతి తల్లి, జేమ్స్‌ని మందలించిన ఇంటి యజమాని, ఎమ్‌డి, ఏజి. కిరణ్‌, డా|| చరణ్‌ తేజ, భాను, రాకేష్‌, భార్యను చంపిన వరుణ్‌ తండ్రి. బ్రాహ్మణ వంటామె. సరస్వతీ ఆంటీ, మూర్తీ అంకుల్‌… అవును మరియంను వంటలోంచి తీసేసిన తను, రాధిక, జాస్మిన్‌ అంతా కరోనా వైరస్‌లుగా మారిపోయి, ఒకరినొకరు ఢీ కొడుతూ పెనుకేకలు వేస్తూ మరియంని, జేమ్స్‌నీ, కారులోనే చనిపోయిన గర్భిణీ స్త్రీని ఆమె గర్భంలోని పిండాన్ని… అదిగో స్లమ్ములోంచి ఫాక్టరీల్లోంచి, పొలాల్లోంచి, హోటల్ల నుంచీ, బళ్ళనించి వలసెళ్ళి పోతున్న అభాగ్యజీవుల్ని తరుముతూ… ”మేడం స్కూలు మూసేసారు. తల్లిదండ్రులు ఫీసులు కట్టటం లేదు.. ఉద్యోగంలోంచి పీకేసారు.. ట్యూషన్‌ ట్యూషన్‌ చెబుతాను మేడం. మీ కాలనీలో పిల్లలకు. మేడం ఒక పది మంది పిల్లలని ట్యూషన్‌కి ఇప్పియ్యండి. ఇంటిల్లిపాదీ బతికేస్తాం మేడం ఇదిగో వాట్సప్పుల్లో, ఫేసుబుక్కుల్లో ట్యూషన్లు కావాలని పెట్టేసా మేడం.. ఫ్లీజ్‌ మేడం.. కాంచన తన ముందు నిలబడి తను వైరస్‌గా మారిపోయాక కూడా గుర్తుపట్టేసి, నా మొఖంలో మొఖం పెట్టేసి, నా కళ్ళల్లో తన కళ్లు గుచ్చేస్తూ… కన్నీళ్ళతో దీనంగా… హీనంగా అడుక్కుంటుంటే… ఛత్‌… ఫో… ఫో అంటూ తాను విదిలించేసుకుంటోంది… తనేనా? తనేనా… నో… నో… అరిచేస్తోంది తను… ఇదంతా కలా… ఎంత భీకరంగా ఉంది. హమ్మయ్య తను మనిషిలాగే ఉంది.. కరోనా వైరస్‌గా మారిపోలేదు…

ఇంతలో ఫోన్‌ మోగింది. సరస్వతి ఆంటీ… “నర్మదా… ఎట్టా ఉన్నావు? ఈ నెల పదిహేన్న గాయత్రీ పెడుతున్నానే భయపడమాకే దూరంగా ఉండే చదువుకుందాం రా మరి… చూడాలని ఉంది. మీ అమ్మ బాగా గుర్తుకు వస్తుంది. వస్తావు కదా?” సరస్వతి ఆంటీ… ”దూరం… దూరం… ఇదిగో మరి అంటవాఁకు మడి, మడి అశుంట… అశుంట” అని నా చిన్నపుడు మా అమ్మను, నాన్నను మొత్తం మా కుటుంబాన్ని, కాలనీలో బ్రాహ్మలు కాని వాళ్ళందర్నీ గడపవతల నిలబెట్టిన… మా గడపలవతల నిలబడిన సరస్వతి ఆంటీ. గలగలా పారే గోదారి ధారాళతతో మాట్లాడే సరస్వతి ఆంటీ… నా మధురమైన బాల్యగ్నాపకం… మా అమ్మలాంటి సరస్వతి ఆంటీ… మరియం భర్త జేమ్స్‌ని చంపిన పసుపు పచ్చని, రంపపు పొలుసుల విషపు పాములాంటి, గరుకు గరుకు చర్మం మీద, ఎర్రెర్రటి కుంకుమ బొట్టు లాంటి, రక్తం చిందే కళ్ళున్న పొలుసుల పాములాంటి, మా అత్తయ్యలాంటి… సరస్వతి ఆంటీ నన్ను మళ్ళీ తన దగ్గరికి రా రమ్మని పిలుస్తుంది.

“వస్తాను ఆంటీ… వస్తే నన్ను ఎక్కడ కూర్చోపెడతావు. నీకు దూరంగా గడపవతలా… ఇవతలా ఎక్కడ ఆంటీ…” అడుగుతున్న నా గొంతులోని కాఠిన్యానికి సరస్వతీ ఆంటీ టక్కున మాట ఆపేసి… ‘అదేంటే అట్టాంటావు? మనం మనం బ్రాహ్మలం… మీ అమ్మ సంగతి ఒదిలిపెట్టు… నువ్వైతే బ్రాహ్మల ఇంట్లోనే పడ్డావని తెలిసింది, మీ అత్తయ్యగారూ నాలాగే చాలా నిష్టగా ఉంటారుట కదా… మా గోత్రఁవేట కదా… అసలు నిన్ను గడపవతలే ఎట్టా కూర్చోబెడతానే, గడపివతలే కూర్చుందువులేవే… కాకపోతే కరోనా కాదూ… మన జాగ్రత్తలో మనం ఉండద్దుటే… దూరంగానే కూర్చొని గాయత్రి చదువుకుందాం వస్తావుటే… మరీ మీ అత్తయ్య గారినీ తీసుకురావే ఈసారి… మహా మృత్యుంజయ హోమం పెట్టుకుందాం… ఇప్పటికి రెండు సార్లు అయిపోయింది. అందుకే మాకేఁవీ కాలేదు కరోనా ఏఁవీ చేయలేకపోయింది. ఈ లోపల నువ్వే రోజూ స్నానం చేసేసి పూజగదిలో కూర్చుని ఈ అపమృత్యు భయం పోవటానికి చక్కగా
”ఓం త్రయంబకం యజామహే సుగంధిం
పుష్టి వర్ధనం… ఉర్వారుకమివ
బంధనాన్‌ మృత్యోర్‌ముక్షీయ
మామృతాత్‌” అంటూ ఏంటి.. నూట ఎనిమిది సార్లు చదివేసుకుంటు ఉండు. ఆ తర్వాత అంకుల్‌ చేసే మహామృత్యుంజయ హోమానికి వద్దూ గానీ ఏం… అసలు నర్మదా చెప్పొద్దూ… అంటూ ఏదో మంత్రోచ్ఛారణలా చెబుతూనే ఉంది. అపమృత్యుభయం కరోనా వైరస్‌ వల్ల కాదని ఈ ఆంటీకెలా తెలుస్తుందీ? చెవుల్లో వంద పొలుసుల పాములు బుసకొడుతున్న ధ్వని హోరెత్తి పోయి… గుండె గుభిల్లుమంది. నేను టక్కున ఫోన్‌ కట్‌ చేసేసాను. ఆమె మాటలతో నాకంటిన మైలకి నిజంగానే వెళ్ళి షవర్‌ కింద నిలబడి తలారా స్నానం చేద్దామని ఎవరో తరిమినట్లే బాత్రూంలోకి పరిగెత్తాను.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

2 thoughts on “దూరం… దూరం…

  1. Excellent story on karona and utter foolishness amd stupid caste distinctions.

Leave a Reply