దారి పొడవునా కవిత్వమే …‘దుర్గాపురం రోడ్’

‘ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’ ఇరవై ఏళ్ల క్రితం, తెలుగు కవిత్వ ప్రేమికులు హత్తుకున్న దేశరాజు తొలి కవిత్వ సంపుటి. తొలి సంపుటిలో సామూహిక స్వప్నాన్ని ఆవిష్కరించిన కవి, ఇరవై ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత తన రెండవ కవిత్వ పుస్తకం ‘దుర్గాపురం రోడ్’ ను తెలుగు కవిత్వ ప్రేమికుల చేతుల్లో పెట్టాడు.

ఒక మనిషి జీవితంలో ఇరవై ఏళ్ళ కాలం చాలా పెద్దది. అటువంటిది, ఒక కవి జీవిత కాలంలో ఇరవై ఏళ్ళ కాలం ఇంకా పెద్దది. ఏ కవికైనా కవిత్వం పుస్తకం రూపంలో రావడమన్నది ఒక ప్రమాణం కాదు. అతడు కవిత్వంతోనే వున్నాడా లేక, తన ఇతరేతర వ్యాపకాల పట్ల ప్రేమ తొలి ప్రాధాన్యత లోకి వొచ్చి, కవిత్వం పట్ల ప్రేమ ఆ ఖాళీ కాలంలో కనుమరుగయిందా అన్నదే లిట్మస్ పరీక్ష. ఈ ఇరవై ఏళ్ల కాలంలో జీవితం కవిత్వానికి ఎడంగా సాగి వుంటే అది పెద్ద కాలం గానీ, ‘కవిత్వమై జీవించాలి’ అని విశ్వసించిన కవికి, ‘కొంచెం సులువు తెలిస్తే /ప్లాస్టిక్ పూల పరిమళాన్నీ గ్రోలవచ్చు / కొంచెం మ్రుదుత్వముంటే / కంకర్రోడ్డు పైనా సునాయసంగా జారోచ్చు’ (ఆరెంజ్ రాగా) అని కవిత్వంతో జీవితాన్ని ఆస్వాదించడమెట్లాగో/అధిగమించడమెట్లాగో తెలిసిన కవికి అది ఒక ఖాళీగా చూడవలసిన కాలం అసలే కాదు.
Love After Love కవిత ఆఖరున Derek Walcott అనే వెస్టిండీస్ కవి ఇట్లా అంటాడు –
‘the photographs, the desperate notes,
peel your own image from the mirror
Sit. Feast on your life’

దేశరాజు ఈ ‘దుర్గాపురం రోడ్’ నిండా తన ఇరవై ఏళ్ళ జీవితాన్ని, జీవితం లోని ఆవేశాలనూ, ఆగ్రహాన్నీ, ప్రేమ(ల)నూ, సంతోషాలనూ అడ్డం నుండి చీల్చిన ప్రతిబింబం వలె పరిచాడు.
అందుకే, ‘అతుక్కోవాలి, అతుకులు కనబడకుండా / అందుకెంత ప్రేమ కావాలి ?’ అని మథనపడి 2000 సంవత్సరంలో దుర్గాపురం బయల్దేరిన క్షణాలను ఎట్లా కవిత్వం చేసాడో, 2016 లో ‘ప్రియురాలు బహువచనమని గ్రహించిన వాడు / నిత్య యవ్వనుడు / యవ్వనం ఒక ఋతువు / అది మళ్ళీ మళ్ళీ వస్తుంది’ అన్న తన కొత్త గ్రహింపునీ అట్లానే కవిత్వం చేసాడు.

‘కటిక ఏకాంతపు ఒంటరి చీకటి రాత్రి /కడుపుకి కావొచ్చు దేహానికి కావొచ్చు /ఆదర్శాలకంటే ఆకలే తక్షనావసరమై పోయింది’ (సాము సడలని రాత్రి) అని తన అశక్తతను ఎట్లా తిట్టుకున్నాడో, మేధావుల ఆచరణల లోని డొల్లతనాన్ని ‘తెలిసో తెలియకో /యవ్వనంలో తొక్కిన అడుసును /అమెరికాలో కడుక్కోగల మేధావులు మీరు’ (డెత్ నోట్) అని అట్లా ఆక్షేపించాడు.

మొత్తం 77 కవితలున్న ‘దుర్గాపురం రోడ్’ లో కవి తన 20 లలో 30 లలో ప్రేమల గురించీ, పోరాటాల గురించీ కవిత్వం రాసుకుంటే, 40 లలో ఎదిగే పిల్లల (‘ముంగిట ముత్యము వీడూ’, ‘రెక్క విప్పే పిట్ట’,’సన్ రైస్’) గురించీ, వాళ్ళ పేచీల (‘రేంజర్ రాజా’) గురించీ, ఉద్యోగానికీ కుటుంబానికీ నడుమ సతమతమయే జీవితం (‘రోలర్ కోస్టర్’, ‘ది బెల్ రింగ్స్’) గురించీ, రాజ్య స్వరూపం (‘ఒకానొక సర్జికల్ సందేహం’) గురించీ కవిత్వం రాసుకున్నాడు. చివరికి, ‘క్షమించండి / మేం కొంచెం సర్దా పడతాం / మేం కొంచెం పుచ్చుకుంటాం / పలకరించే చేతుల్ని కాక / అంతరాత్మల్ని వెతికే పిశాచులం’ (తెగిన చంద్రుడు) అని రాసుకోవడానికీ సందేహించలేదు.

ఈ కవితలన్నిటి నడుమా, తెలంగాణ ఉద్యమ కాలంలో దేశరాజు రాసిన దాదాపు ఆరేడు కవితలు (‘విడిది’, ‘కొత్త ఉపాధ్యాయులు’, ‘అంతిమ పరిష్కారం’ వగయిరా) ప్రత్యేకంగా కనిపిస్తాయి. ‘రంగమెటియా కొండలు రంగు మార్చుకునే రంగం సిద్ధమయిందట /ఎల్దమొస్తరా’ (యుద్ధం పుట్టెనంట) అని పలికిన ఉత్తరాంధ్ర స్వరం కాబట్టే, ‘నగర హృదయపు ఔదార్యం ఎంత గొప్పదైనా / అనుబంధం ఎంతగా పెనవేసుకున్నా / అతిథికి ఎప్పుడూ విడిది సొంతం కాదు’ (విడిది) అని స్వచ్చ స్వరంతో పలికాడు. కడుపు చేత పట్టుకుని వచ్చిన వాళ్ళను కడుపులో పెట్టి చూసుకునే తెలంగాణతనం తెలిసిన వాడు కాబట్టి, తెలంగాణ ఉద్యమ స్వరంతో మమేకమై ‘కూలిన విగ్రహాలంత స్పష్టంగా / కుళ్ళిన హృదయాలు కనిపించవు’ (అంతిమ పరిష్కారం) అని మీనమేషాలు లెక్కపెట్టని కవితా వాక్యం రాసాడు.

ఒక్క తెలంగాణ నేపథ్యంలో రాసిన కవితలే కాకుండా దేశరాజు పలు కవితలు, అతడు ప్రజా ఉద్యమాల వైపు నిలబడి, నిశితమైన చూపుతో వాక్యం రాసే కవి అని స్పష్టం చేస్తాయి. భయంతో విలవిలలాడే అక్షరాలా పట్ల, విదూషక వేషం విప్పని వాక్యాలు పట్ల నిరసన వాక్యం రాయడానికి కూడా వెనుకాడని కవి, దేశరాజు.

కొన్నిసార్లు దేశరాజు కవిత్వం, రాత్రి పూట దీపాలేవీ లేని ఒక పెద్ద భవంతి ముందు ఒక టార్చి లైటు పట్టుకుని నిలుచున్నట్టుగా వుంటుంది. ఒక్కసారి లోనికి అడుగు పెట్టిన తరువాత ఒక్కొక్కటిగా దీపాలన్నీ వెలిగి ఒక ఆశ్చర్యానికి గురి చేసే భవంతిలా ఆ కవిత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ఉదాహరణకు, ‘ఆఖరి సన్నివేశం’ అన్న ఈకవిత ‘తప్పుని కప్పి పుచ్చుకోవడం కాదు / సాహసవంతంగా చేయడమే / హీరోయిజం అవుతున్న వేళ’ అంటూ మొదలై, ప్రపంచీకరణ అనేక కీలక రంగాలను, అనేకానేక జీవితాలను ఎట్లా ధ్వంసం చేస్తూ పోయిందో శక్తివంతమైన వాక్యాలతో చెబుతూ వెళుతుంది. చివరికి, ఒక పెద్ద రహస్యపు వెలుగులో మనల్ని వొదిలి వెళుతుంది.

దుర్గాపురం రోడ్ లోని కొన్ని కవితలు William Wordsworth కవిత్వం గురించి చెప్పిన ‘“Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility” మాటలను గుర్తు చేస్తాయి.

‘మూగపాట’ అన్న ఈ కవిత చదవండి. ‘ముందు మనం మనుషులుగా విడిపోయాం / ప్రక్రుతి మరణ శాసనానికి / అది ఆరంభ వాక్యమయింది’ అని మొదలైన కవిత మనం ఎన్నెన్ని విధాలుగా విదిపోయామో చెబుతూ, చివరన ‘ చివరాఖరికి మనం విడివిడిగా మిగిలాం / అది ముక్త కంటపు చరమగీతమయింది’ అని ముగుస్తుంది.

మొత్తమ్మీద, ప్రేమని వెతుక్కుంటూ దుర్గాపురం రోడ్ కు వెళ్ళిన కవి, తన దుర్గాపురం రోడ్ కవిత్వం ప్రేమలో మనల్ని పడవేస్తాడు. పుస్తకం ముందుమాటలో నగ్నముని గారు చెప్పినట్టు, దేశరాజు కవిత్వంలో వాస్తవికత, అతివాస్తవికతలు కలిసి, ఓ మనో వాస్తవికతగా దృశ్య రూపంలో బయటికి వొస్తుంది.

తెలుగు కవిత్వ ప్రేమికులందరూ కొని దాచుకోవలసిన పుస్తకం ఈ ‘దుర్గాపురం రోడ్’.

[దుర్గాపురం రోడ్ – దేశరాజు కవిత్వం; ప్రచురణ : చాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్, 98480-23384; ప్రతులకు: అనల్ప బుక్ కంపెనీ హైదరాబాద్ 70938-00678]

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply