దుఃఖ రాత్రి

ఈ రోజు కూడా దుఃఖ రాత్రే

ఉదయపు మలుపు తిరగగానే
ఏ విషాద వార్త తలుపు తడుతుందోనని
భయం భయంగా ఉంది.

ఏదో ఓ మృత్యు శిఖరపు
పాదాల వద్ద
మరణ బీభత్స దృశ్యాలు చూడలేక
వొరిగిపోయిన పిరికి శిలను.

అందుకు కారణం మరేదో కాదు
ప్రతి పరిచయంలో కూడా
రవ్వంత మకరందాన్నైనా జుర్రుకోవాలనే ప్రేమ పరితాపం..
ఏ సరిహద్దులూ చెరిపెయ్యలేని
శోక బంధం!

పారే దుఃఖ నదీ తీరపు గట్టున
గుబులు గువ్వనై
గుండె సెలిమెలో ఊరుతున్న
వేదనను చల్లుకుంటూ కూర్చున్నాను.

అయినా ఎంత తోడినా
ఊరుతూనే ఉంది ఏదో ఒక ఒంటరితనం.
నులిపెడుతున్న హృదయపు
రెమ్మల్లో ప్రతి ఆకు అంచూ
మబ్బుపట్టి వొరుపెత్తుతూనే ఉంది.

ఎదుటి వాళ్ల ముఖంలో
నా ముఖ ప్రతిబింబాన్ని చూసుకోక,
అవతలి వాళ్ల మునివేళ్ళ కొసలలో
నా చేతి మునివేళ్ళని ముంచుకోక,
మాటల తటాకంలో మనసు నావను విడిచి
అది మోసుకచ్చే మమతకై తీరం వద్ద పడిగాపులుకాయక
ఇలా ఎన్ని గడియలు గడిచిపోయాయో!

నాలోని నిర్మానుష్య పెనుగులాటలో
రాజుకునే నిశ్శబ్దంతో
ఎన్ని చీకటి రాత్రులు దగ్ధమయ్యాయో!

మరోపక్క
సమూహ సంద్రంలో అర్ధాంతరంగా తెగిపడుతున్న
అలలు రాల్చే కలల చుట్టూ
ఎన్నెన్ని ఆత్మీయ ఆలింగానాల దేవులాట!

అయినా ఇక్కడే ఆగిపోము కదా!
ఈ మట్టిలో మనిషిగా మొలకెత్తెడమే మహాద్భుతం…
ఎంతెంత వలపోత తలపోసుకున్నా
వసంతం తిరిగొస్తుందని అడవికి తెలుసు.
వనమంతా మళ్లీ ప్రేమ చిగురుల విరహంలో పడిపోతుంది
మట్టి పొత్తిళ్ళలో వేర్లు తిరిగి పారాడటం మొదలవుతుంది
పిడికెడు పుప్పొడి మాటల కోసం మళ్లీ
నేనో తుమ్మెదనై అడవిలో రెమ్మ రెమ్మనూ గాలిస్తాను.

రాయలసీమ. కవి, రచయిత.  పనిచేసేది కంప్యూటర్ తెర పై. అయినా పుస్తకాలతో పెనవేసుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటాడు. ఇప్పటి వరకు 'పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం', 'నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు', 'అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష'... ఇలా ఓ పిడికెడు పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు మొత్తం మీద ఏడెనిమిది వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాస పత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో  ‘కతల సేద్యం’ చేసే పనిలో ఉన్నాడు.

3 thoughts on “దుఃఖ రాత్రి

  1. ఎన్ని చీకటి రాత్రులు దగ్ధమయ్యా యో

Leave a Reply