దీపంలా జీవించిన సార్థక జీవి పడాల బాలజంగయ్య

సున్నిత మనస్కుడు, సహృదయుడు వృత్తిలో ప్రవృత్తిలో కళాత్మకంగా స్మృజనాత్మకంగా జీవించిన పడాల బాలజంగయ్య జులై 30, 2022 సాయంత్రం 5-05 ని॥లకు చివరి శ్వాస వదిలాడు. సహచరి మనోహరమ్మ కన్నపిల్లలు రవికిరణ్, స్ఫూర్తి, శశికిరణ్ చెల్లెండ్లు కవిత, లక్ష్మి మేనల్లుడు డాక్టర్ రమాకాంత్ ఇతర మిత్రులంతా చేయగల సపర్యలు చేస్తూ ఉండగానే ఆయన ప్రాణాలు వదిలారు. దీపంలా జీవించి వెళ్లిపోయాడు. 20 జూలై 1962న పడాల రాములమ్మ, బాలయ్యల ముద్దుల బిడ్డగా ఈ భూమి మీద కళ్లు తెరిచి బాధిత ప్రజల బిడ్డగా ఎదిగి స్నేహాస్పదమైన ప్రజాస్వామిక మానవీయ విలువల వ్యాప్తిలో, అన్యాయాల మీద, వ్యవస్థీకృతం చేసిన హింస మీద అంటరానితనం మీద, దోపిడీ మీద ఎడతెగని పోరాటం చేసి అనేక అనుభవాల్ని వెలిగించి వెళ్లిపోయాడు. బాలజంగయ్య కన్నా ముందు ఇద్దరు పిల్లలు పుట్టి మరణించిన దుఃఖంలో వున్న తల్లిదండ్రుల ముద్దుల బిడ్డగా అతను పుట్టాడు. ఇంటి దేవత, జంగడిపీర్ల పేరు కలిసేలాగా బాలజంగయ్య అని పేరు పెట్టుకున్నామని ఆడ పిల్లలకూ తొలుత ఇలాగే పేరు పెట్టామని పడాల బాలయ్య చెప్పేది.

1960లు ఎంతగా పోరాటాల కాలమో అంతగా కరువు కాటకాల కాలం కూడా. పడాల బాలయ్య అప్పటికే నాగార్జున సాగర్ నిర్మాణపనుల్లో, హైదరాబాదు హోటళ్లలో వలస కూలీగా పనిచేసి వున్నాడు. బల్మూరి పటేళ్ల దగ్గర కట్టుబానిసలా గొడ్డు చాకిరీ చేసినా పూటగడవని దుస్థితిని అనుభవించివున్నాడు. ఆ కష్టకాలంలో వారి కుటుంబం రాయలసీమ నందికొట్కూరు దగ్గర పగిడాలకు నడిచి వలస పోయింది. కాలు చేయి గట్టిపడని బక్కపలుచటి పొట్టి మనిషి బాలజంగయ్య కొంతసేపు తల్లిదండ్రుల వెంట పరుగులాగా నడిచి మరికొంత సేపు తండ్రి భుజాల మీద ప్రయాణం చేస్తూ బయటి ప్రపంచం చూశాడు. అ ప్రయాణం సౌందర్యం చూడటానికి కాదు. బ్రతికి ఉండటానికి మాత్రమే. ఆ వేసవులు ఆ ఎండలు, ఆ కరువు బారి నుండి మమ్మల్ని సాదటానికి మా తల్లిదండ్రులు తమ నెత్తురు ధారపోశారని చెమ్మనిండిన కళ్లతో బాలజంగయ్య చెబుతుండేవాడు. ఆ గడ్డు కాలంలో ఇక వలస పోకూడదని, పటేండ్ల దగ్గర గాసమూ మానాలని ఎంతకష్టమైనా తమబిడ్డలను చదివించాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. కలిమికింద, కులం బలిమి కింద చెమటా నెత్తురు కన్నీళ్ళుగా బతుకుతున్న అంటరాని సమాజంలోని తనబిడ్డడు చదువుకుని శిఖరాలకెదగాలని ఆ తండ్రి కలగన్నాడు. చదివించాడు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో, నల్లమలలో పనిచేసిన శంకరమ్మ దళం అందించిన స్ఫూర్తి అనుబంధం ఆ తండ్రి అనుభవంలో వున్నాయి. అతను తమ బల్మూరులో రైతయ్యాడు. జీవనతత్వాలు, కరువు కడగండ్లు, పోరాటాల అనుభవాలు పాడుతూ స్వీయగౌరవ పతాకయ్యాడు. నేను బాల జంగయ్యను తన జీవితం రాయమని కోరినప్పుడల్లా తన తండ్రి జీవితం రాస్తాను అనిచెప్పేవాడు.

బాలజంగయ్య ప్రాథమిక విద్య నల్లమల అడవి అంచు తమ సొంతూరు బల్మూరులో మొదలైంది. బడిలోకి ప్రవేశం ఉండేది కాదు. తరగతి తలుపుల ముందర కూర్చుని పాఠాలు వినవలసి వచ్చేది. బోర్డుమీద రాసినది ఏదీ కనపడేది కాదు. సార్ నోటి మాట వింటూ రాసుకునేవాడు. ఎప్పుడు బడికడిగినా నీళ్ళు తెచ్చి గనుమ ముందర పెడితే ఇతర విద్యార్థులు ఆ నీటితో బడి కడిగేవారట. మా ఉపాధ్యాయులు మంచివాళ్ళే కానీ వాళ్లు కులం అనే క్యాన్సర్ బారిన వున్నట్లు క్రమంగా తనకు అర్థం అయిందన్నాడు. ఎవరు తన పట్ల కేవలం కులం, పేదరికం వల్ల అవమానకరంగా ప్రవర్తించినారో వారందరూ తరువాతి రోజుల్లో తన విజయాలకు మురిసిపోయారని తడినిండిన కళ్ళతో చెప్పేవాడు. బాల జంగయ్య ఉన్నత పాఠశాల విద్య నాగర్ కర్నూల్ లో పుట్టపాగ మహేంద్రనాథ్ గారు ఏర్పరచిన జాతీయోన్నత పాఠశాలలో నిండు ఎమర్జెన్సీ కాలంలో సాగింది. అటు నుండి మహబూబ్ నగర్ చేరి పట్టభద్రుడై ఉపాధ్యాయ వృత్తి అర్హతలు సాధించాడు. ఈ చదువుల ప్రయాణంలో అతనికి సొంతూర్లో భూస్వామ్య దాష్టికం, తీవ్ర అంటరానితనం, తొలి తెలంగాణ ఉద్యమ నినాదాలు అనుభవంలోకి వచ్చాయి. నాగర్ కర్నూల్ లో ఎమర్జెన్సీ చీకట్లు, ఇరవై సూత్రాలు తెలిశాయి. మహబూబ్ నగర్ లో విప్లవకర భావాలు ఆయనను ఆకర్షించాయి. బాల జంగయ్య చేతిలో అక్షరాలు వన్నెపోసుకుంటాయి. తాను చూసినవి, స్వప్నించినవి మాత్రమే కాక మీరో నేనో చేసిన ఊహలను సైతం చిత్రించేవాడు. అవసరాల కోసం బ్యానర్లు రాసేది. భావవ్యాప్తికోసం గోడలను తన అందమైన అక్షరాలతో అలంకరించేవాడు. అవి రాడికల్స్ ను వెలుగు దారిగా చూపిస్తుండేవి.

అన్ని ఊర్లలాగే బల్మూరు పైకులాల వాళ్లు దళితులను వినాయకుని దగ్గరికి రానిచ్చేవారు కాదు. బాల జంగయ్య పూనికతో దళితయువకులు తాము వినాయక విగ్రహం చేసి ఊరేగించారు. ఆ మృణ్మయ విగ్రహ శిల్పి బాలజంగయ్యే తప్పెట దరువులతో ముందునడవాల్సిన వాళ్లు తమ ఊరేగింపు తామే జరుపుకోవటం పై కులాల వాళ్లకి జీర్ణం కాలేదు. ఈ ధిక్కార స్వభావం స్వతంత్ర ఆలోచనా శక్తి, స్వీయ గౌరవం కోసం ఎంత దూరమైన సాగిపోగల చైతన్యం సమస్త పీడిత జన విముక్తిని ఆలోచించే కార్యక్షేత్రంలోకి బాలజంగయ్యను కదిలించింది. అతని అడుగులకు నిర్దిష్టత, శాస్త్రీయత వచ్చింది. పరిచయాలకు, స్నేహాలకు పరిమితులు లేవు, విధించుకోలేదు. ఆచరణకు వ్యవస్థను మౌలికంగా మార్చటమే లక్ష్యం. ఆర్థిక అసమానతలను నానాటికీ తీవ్రం చేస్తూ పితృ స్వామ్య, కుల, మత బంధనాల ఉచ్చుబిగిస్తూ మానవచరిత్ర పురోగతిని నిరోధించే దోపిడీ వ్యవస్థ స్థానంలో సమానత ప్రాతిపదికన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య మానవీయ నూతన వ్యవస్థను నిర్మించటమే లక్ష్యం. గత చరిత్రలోని దౌష్ట్యాన్ని ఎత్తిచూపుతూ వర్తమానంలోను అలా కుదరదని తొలిరోజులలోనే బల్మూరులో అంబేద్కర్ విగ్రహస్థాపన కృషి చేశాడు.

కొనసాగుతున్న గత అవశేషాలను, హింసను వ్యతిరేకిస్తూ సామాజిక శాస్త్రాల అధ్యాపకుడుగా చరిత్రను, రాజకీయాలను, పాలనాశాస్త్రాన్ని గొప్పగా బోధించాడు. అభివృద్ధి మాయాజాలపు రాజకీయాల ముసుగు తొలగించి చూపి విద్యార్థులను మేల్కొలిపాడు. గత చరిత్ర జండర్, కులం ప్రాతిపదికన ప్రజా బాహుళ్యాన్ని విద్యకు దూరం చేసింది. వర్తమాన చరిత్ర అసమాన పాఠశాలలతో విద్యార్థులకు సమాన విద్యావకాశాలను దూరం చేస్తూ మానవ సంబంధాలను విచ్ఛిన్నంచేస్తున్నది. అశాస్త్రీయ సిలబస్ తో చరిత్రను అమానవీయంగా హింసాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ దుస్థితి మార్చటానికి విద్యార్థి, ఉపాధ్యాయ దళిత, ప్రజా ఉద్యమాలు పాటు పడాలని పదేపదే కోరేవాడు.

1980 తొలి సంవత్సరాలలో బి.ఎ, బి.ఎడ్ చదువుతూ ఆయన రాడికల్ విద్యార్థి ఉద్యను ప్రభావంలోకి వచ్చాడు. బీఎడ్ తరువాత పబ్లిక్ కాంట్రిబ్యూషన్ పోస్టులో నియామక ఉత్తర్వుల కోసం డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో నిరీక్షిస్తూ పరిచయంలోకి వచ్చాడు. ఆ పరిచయం గాఢమైన స్నేహమైంది. గద్వాల విద్యార్థి ఉద్యమ నాయకుడు సుదర్శన్ రెడ్డి పరిచయం, తరువాతి రోజుల్లో అతని మరణం బాల జంగయ్యను బాగా వేధించింది. ఎమర్జెన్సీ కాలపు దుర్ఘటన, భూమయ్య, కిష్టాగౌడ్ ల ఉరితీత ఆయనను కలచివేసింది. ఈ ప్రభావం వల్ల తన పిల్లలను సూర్య చంద్రులుగా ఫీల్ చేసి వాళ్లకి రవికిరణ్, శశికిరణ్, స్ఫూర్తి అని పేర్లు పెట్టుకున్నాడు. తమ ముగ్గురు పిల్లలు పీహెచ్డీ కోర్సులు చేస్తుండడం తనకు చాలా సంతోషం అన్నాడు. వాళ్లు పట్టాలు తీసుకునే సందర్భం చూడకుండానే వెళ్లిపోయారు.

విద్యకు మాత్రమే కాక విద్యారంగ ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకి బాలజంగయ్య దోహదం విలువైనది. నేర్చుకోదగినది. 1983లో జిల్లాలో ఎపిటిఎఫ్ ఏర్పడేనాటికి అతను పట్టభద్రుడు. వృత్తిలోకి రాగానే తుమ్మన్ పేటలో, ఆకుతోట పల్లిలో పనిచేస్తూ సభ్యుడుగా గౌరెడ్డిపల్లి, బల్మూరు, కొండనాగుల, తుమ్మాన్ పేట, ఉప్పునుంతల పాఠశాలలలో పనిచేస్తు నాయకుడుగా తన చేయూతతో ఎపిటిఎఫ్, డిటిఎఫ్ లను నడిపే కృషిలో భాగమైనాడు. అచ్చంపేట మండల పరిషత్ లో జరిగిన అవినీతి, అక్రమాలు, లూటీమీద నడిపిన పోరాటంలో అతనిది గొప్ప పాత్ర. “నేను పొట్టివాణ్ణి కావచ్చు కానీ గుండె గట్టివాణ్ణి, సత్యం మా వెంట వుంది. మీరెవరూ ఏమీ చేయలేరు “అని ప్రకటించాడు. ఆ రోజుల్లో జిల్లా అంతటా ఎక్కడికక్కడా అనేక ఉద్యమాలు చేలరేగినవి. కష్టపడే ఉపాధ్యాయ ఉద్యమ మిత్రులు తిరుమల రామచంద్ర అనువాదం చేసిన చిరస్మరణ నవలలోని అప్పు చిరకండల వలె గొప్పగా అనిపించేవారు. విద్యారంగం భూస్వామ్య బంధనాలలో వుండేది. ఆ కట్లు తెంచే పోరాటాలు నడిపాం.

కరువు కాటకాల జీవితానుభవం వల్ల 1994ల నుండి కరువు వ్యతిరేక పోరాట కమిటీ నిర్వహించిన ఉద్యమంలో, నిర్మాణంలో బాలజంగయ్య చాలా క్రియాత్మకంగా పనిచేశాడు. సభలు, ర్యాలీలు, ధర్నాలు ప్రచారయాత్రలతో బాధిత రైతాంగాన్ని. వలస బాధితులను, అసహజ మరణాల బాధిత కుటుంబాలను కలవటం, కరపత్రాలు, కార్టూన్లు, పోస్టర్లు వేయటం ఇలా అనేక రూపాలలో మహబూబ్ నగర్ గాధను దంతకథగా ప్రజలలో చర్చకు తెచ్చాం. ఓట్లడుగవచ్చే నేతలను నిలదీయాలనే ప్రచారాన్ని ఉద్యమంగా నడిపాం. తక్షణ కరువు నివారణ చర్యలుగా పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్తు, సాగునీరు, విద్య, వైద్యరంగాల మెరుగుదల, మద్యనిషేధం అమలుకోసం పోరాడాం. అంటరానితనం, దళితులపై దాడులు, స్త్రీల పై అత్యాచారాలు, హింస ఈ అన్నింటిపై పోరాటంలో అతని కృషి చిరస్మరణీయం, పాలమూరు గోస సభలో ప్రదర్శించిన ఆయన కార్టూన్లు “పాలమూరు గోస” పుస్తకంలో వేశాము.

దళితులపై తీవ్రమవుతుండిన దాడులు, అగ్రకుల హింస కుల నిర్మూలన ఉద్యమం ప్రత్యేకంగా నిర్వహించవలసిన అవసరాన్ని ముందుకు తెచ్చిన ఆ రోజుల్లో 1998లో కుల నిర్మూలన పోరాట సమితి ఏర్పడి ఉద్యమం మొదలు పెట్టింది. మా చర్చను సూచనను స్వీకరించి ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యులుగా బాల జంగయ్య కుల నిర్మూలన పోరాటాలలో ప్రశంసార్హమైన కృషిచేశాడు. తన చుట్టూ వుండే మిత్రులలో తాను ప్రయత్న పూర్వకంగా కలిసే ప్రజలలో కుల నిర్మూలన అవశ్యకతను బలంగా చర్చకు పెట్టేవాడు. శ్రామిక వర్గ విముక్తి పోరాటాలలో భాగంగా కాకుండా కుల వివక్షను విడిగా రూపుమాపలేమని అస్తిత్వ వాదులతోను వామపక్ష శిబిరంతోను మాట్లాడేవాడు. రాష్ట్ర ప్రభుత్వం హంతక ముఠాలను ప్రేరేపించినపుడు ఆ బెదిరింపులకు తాను గురయ్యాడు. ప్రజాస్వామిక చలనాలు నిరోధించినప్పుడు కలవరానికి, ఆందోళనకు గురైనా తేరుకున్నాడు. ఆ చీకట్లలోనే మహబూబ్నగర్ జిల్లా “దళితులు, మానవ హక్కులు” అనే పరిశోధన పత్రం రాసి అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిప్లమా కోర్సుకి సమర్పించాడు. ఈ పరిశోధనను పాలమూరు అధ్యయన వేదిక ప్రచురించింది.

గడిచిన నాలుగు దశాబ్దాలలో వివిధ ప్రజా సంఘాలు నిర్వహించిన చరిత్రలో బాలజంగయ్య క్రియాత్మక భాగ స్వామి. నామాల బాలస్వామి సజీవ దహనం ఘటన అతని పుస్తక ముఖ చిత్రం. అది ఆయనే గీశాడు. అమ్రాబాద్ బల్మూరులకు జల సాధన కోసం చాలా కృషి చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నల్ల మల ఉద్యమ తొలి అడుగుల నుండి తాను జిల్లా నలు మూలలా ఉద్యమ నిర్మాణ కృషిలో ఆయన తన మనసు మేధ భౌతిక శక్తులు,వనరులు అర్పించి కృషి చేశాడు. ఆయన ఆచరణ దృష్టి చాలా గొప్పది. మలి దశ తెలంగాణ పోరాటంలో జరిగిన దీక్షా శిబిరాల లో చైతన్యం వెలిగించే ఉపన్యాసాలు చేసేవాడు. అందరికీ పండుగ దినాలు ఇంట్లో జరుగుతుంటే ఆయన తండ్రితో పాటు కుటుంబమంతా అచ్చంపేట దీక్షా శిబిరంలో పాల్గొనేది. ఆయన ఆచరణలో నిలిచి మార్గదర్శి అయ్యాడు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లాగా పడమటి మహబూబ్ నగర్ కోసం షాద్ నగర్ ఎత్తి పోతల పథకం కోసం పోరాటం ప్రారంభించాం. కాల క్రమంలో అది పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకంగా ప్రాచుర్యం పొందింది. ఈ పథకం సాధనకోసం జిల్లా అంతటా, హైదరాబాద్ లో వివిధ రూపాల్లో అనేక పోరాటాలు నడిపాం. పాత పల్లి పోరాటం, యురేనియం వ్యతిరేక పోరాటం, డిబీర్స్ వ్యతిరేక పోరాటం, పాలమూరు – డిండి రద్దు సాధన పోరాటం, నిర్వాసితులకు న్యాయ సాధన పోరాటాల్లో నాయకత్వం అందించి పాల్గొనటం మాత్రమే కాక తన పరిచయస్తుల నందరినీ కదిలించే వాడు. మాటల కన్నా చేతలకు, సమష్టి ఆచరణకు, నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాడు. అందరి బాధలు తనవిగా బయటి పనులలో వృత్తి పనులలో తలమునకలు గా వుండే వాడు. కుటుంబానికి సమయం ఇవ్వలేక పోయేవాడు.

2007 నుండి బాలజంగయ్య పాలమూరు అధ్యయన వేదికలో భాగమై పనిచేస్తున్నారు. ఈ కాలపు సాహిత్య, సామాజిక రాజకీయార్ధిక కృషిలో ఒక కార్యకర్తగా పాల్గొనటమే కాక జిల్లాల విభజన తరువాత నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ గా నాయకత్వం అందించాడు. 2017లో అతను ప్రొస్టేట్ గ్లాండ్ క్యాన్సర్కు గురయ్యాడు. అయినా మొక్కవోని ధైర్యంతో వేదిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అయిదేండ్లు అనారోగ్యాన్ని జయిస్తూ గొప్ప విశ్వాసం ఇచ్చాడు. క్యాన్సర్తో పోరాటంలో బాల జంగయ్య కన్నా వైద్యరంగం ఓడిపోయింది. అతనెంత విశ్వాసంతో పనిచేసేవాడంటే ప్రతిరోజూ వేసుకునే మందులు వేసుకుంటూనే, నెలనెలా నిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్లు తీసుకుంటూనే అన్ని కార్యక్రమాలలో పాల్గొనేవారు. కరోనా గడ్డుకాలంలో అడవి లోతట్టు చెంచు పెంటలు తిరిగి ఆహారపదార్థాలు పంచారు. గత నెలరోజులుగా బంధువులు, మిత్రులు, సహచరులు ఆయనను కలుస్తూ అతని జీవితం అర్థవంతమైందనే సంతృప్తిని అందించారు. అచ్చంపేట పట్టణం, నల్లమల మిత్రులందరు 30-7-2022న గొప్ప ప్రదర్శనతో చివరి వీడ్కోలు పలికారు. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ అతని కోరికను స్వాగతించి శరీరాన్ని పరిశోధనలకు తీసుకుంది. ఆ ప్రాంగణమంతా బాలజంగయ్య అమర్ రహే నినాదాలతో మారుమ్రోగింది. కన్నీళ్లు లేని ప్రపంచాన్ని కలగని ఆ కృషిలో జీవించిన బాల జంగయ్య కోసం వేలాది హృదయాలలో కన్నీళ్ళు ప్రవహించాయి. వీడ్కోలు యాత్రలో జరిగిన సభలలో అచ్చంపేటలో, మహబూబ్ నగర్ లో మిత్రులు ఉద్యమ సహచరులు అర్ద్ర హృదయాలతో బాలజంగయ్యతో పెనవేసుకున్న అనుబంధం పంచుకున్నారు. ఆ కుటుంబంలోని అందరికందరు ఇంటికి వచ్చిన ఎవరినైనా ఆకలి దప్పులు తెలుసుకుని కడుపునింపి చాలా ప్రేమతో సాగనంపేవారని ఆ కుటుంబ అతిధ్యాన్ని చర్చించుకున్నారు. తేది 23 ఆగస్టు 2017న అతని తండ్రి మరణానంతరం ఆ పెద్ద మనిషి శరీరాన్ని కూడా అదే కాలేజీకి ఇచ్చిన విషయాన్ని అక్కడందరూ మరోసారి గుర్తుచేసుకున్నారు.

జంగయ్య ఈ అరవై ఏండ్ల కాలం బల్మూరులో, అచ్చంపేటలో నివాసం ఉన్నాడు. కుటుంబం, బాల్య మిత్రుల నుండి కాలం వెంట ప్రయాణంలో పరిచయంలోకి వచ్చే అందరికీ ఆప్తమిత్రుడయ్యాడు. వివిధ ఉద్యమాలలో కార్యాచరణ రీత్యా అతని స్థలం అచ్చంపేటకు ఉమ్మడి మమబూబ్నగర్ జిల్లాకు, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు మాత్రమే పరిమితమైంది. కానీ అతను కాలం వెంట నడిచాడు. కఠినమైన పరీక్షలను తట్టుకుంటూ, ఎదుర్కొంటూ నడిచాడు. వ్యక్తులుగా భూస్వాములు వారి గుండాలు చేసే అరాచకాలను, పార్టీలలో వారు పొందే రక్షణను వ్యవస్థ స్వభావంలో భాగంగా చూశాడు. ప్రజల మీద, ప్రజాస్వామిక వాదుల మీద హింసలో రాజ్యప్రమేయం పెరుగుతూ వచ్చిన దుర్మార్గాన్ని పౌర, ప్రజాస్వామిక హక్కుల దృక్పథంలో అర్థంచేసుకున్నాడు. ఏ సంస్థలో పనిచేసినా భావజాల పరంగా ప్రతిధ్వనులు నిర్మించే కృషిచేశాడు. ప్రభావశీలంగా జీవించాడు. మెడికల్ కాలేజీ ముందు చివరి వీడ్కోలు సభలో రవికిరణ్ మాట్లాడుతూ “ఇంటగెలిచి రచ్చ గెలవమంటారు కదా! మేం ఇంటి గెలిచే పనిచూసుకుంటాం. మీ సమయాలు రచ్చ గెలిచే పనికి ఇవ్వమని అమ్మా మా నాయినను బయటి సమాజంలోకి పంపించింది. ఆయన గెలిచిన దృశ్యం మీ అందరి హృదయాలలో కనిపిస్తుంది” అన్నాడు. నిజంగానే ఆయన ఏయే ఉద్యమాలలో భాగమయ్యాడో అక్కడ అందరూ ఆయనను అక్కున చేర్చుకున్నారు. గౌరవించారు. వృత్తి నిర్వహణలో సంబంధాలలో విద్యార్థుల, సహఉపాధ్యాయుల, తల్లిదండ్రుల స్నేహ గౌరవాలు పొందాడు.

ఆనారోగ్యమేదో వేధిస్తున్నదని తేల్చుకోవటానికి వైద్య పరీక్షల కోసం వెళ్లినపుడు మిత్రులం వెంటవున్నాం. క్యాన్సర్ సోకిందని తెలిసింది. ఆ క్షణాన చాలా ఘర్షణకు లోనయ్యాం. బాలజంగయ్య కంట తడి పెట్టుకున్నాడు. ఇట్లెందుకు జరిగిందో అని బాధపడ్డాడు. వైద్యంలోకి చికిత్సలోకి దిగింతరువాత అంతే దృఢంగా ఎదుర్కొన్నాడు. ఈ కాలం అంతా కుటుంబం ఎంతగా కాపాడుకుందో సన్నిహిత మిత్రులు ప్రొఫెసర్ జి.హరగోపాల్, సుధీర్, స్వామి, నారాయణ, కృష్ణ, పాలమూరు అధ్యయన వేదిక, ఇతర సంఘాల మిత్రులం అంతగా తోడున్నాం. తాను అనారోగ్య బాధితుణ్నని కనిపించిన అందరికీ తెలుపకుండానే ఆయన సమకాలీన సామాజిక సంఘర్షణలో తన పాత్రను ప్రగతిదాయకంగా నిర్వహించాడు.

పాలక వర్గాలు, ప్రభుత్వాలు ప్రజల ప్రజాస్వామిక వాదుల చరిత్రను చర్చలో లేకుండా చేయాలనుకుంటారు. తొల గించాలని అనుకుంటారు. దేశమంతటా జరుగుతున్న అలాంటి మూర్ఖ ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. చారిత్రిక స్పృహ లేని వాళ్లు, ప్రజా ఉద్యమాల ప్రభావాల లోతును చూడలేని పాలక వర్గ బుద్దులు కూడా ప్రజా ఉద్యమ కారుల చరిత్ర అనామకంగా మిగిలి పోతుందని కూడా అంటారు. కానీ కొనసాగుతున్న చరిత్ర మూలాలు తవ్వుకుని ముందడుగు వేస్తున్నది. ప్రజా ఉద్యమాలకు ప్రజల్లో చరిత్ర లేకుండా పోతే కదా అలాంటి భ్రమలకు భయాలకు స్థానం దొరికేది. బాలజంగయ్య చరిత్ర ప్రజల మధ్య నిర్మాణ మైన చరిత్ర. అది వర్త మానం లోనే కాదు. భవిష్యత్తు లోనూ కొనసాగే చరిత్ర.

పాలమూరు అధ్యయన వేదిక ఈ కొద్ది నెలలలో ఆలోచనలలో, ఆచరణలో క్రియాశీలమైన ఇద్దరు సహచరుల్ని కోల్పోయింది. చాలా దు:ఖంగా ఉంది. వైద్యరంగ అభివృద్ధికి, శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యత లేని, సమాజాన్ని రోగగ్రస్తం చేసే విద్వేషాలు పెచ్చరిల్లే విధంగా పాలనాధికారాలు విధానాలు చలాయించే ప్రభుత్వాలకు ఇలాంటి అసహజ మరణాలతో సమాజం ఏం కోల్పోతున్నదో అర్థమవుతున్నదా ? మన బాలజంగయ్య మరణం మరోసారి ఈ సవాలు విసురుతున్నది.

3 thoughts on “దీపంలా జీవించిన సార్థక జీవి పడాల బాలజంగయ్య

  1. అద్భుతమైన జీవితం!🙏🙏… వారికి ఘనమైన నివాళి!… ఇందులో ప్రకటించినట్టు ప్రజల చరిత్ర ఇలాగే నిర్మాణం అవుతుంది… మున్ముందు కూడా!👍👍

  2. 3 తారీఖు లేదా 30 తారీఖు ?!… సవరణ అవసరమా చూడగలరు!

Leave a Reply