దిల్ కె ప్యారే

నువ్వెక్కడో ఒక చోట
క్షేమంగా ఉంటావనే నమ్మకం గుండె లయగా 
ఆమె నడుస్తూనే ఉంది

నీ అదృశ్యం తర్వాత ఆమె కూలిపోలేదు
ధగధగలాడే కాగడా పట్టుకున్న లిబర్టీలా నిలబడింది
స్వేచ్ఛ‌కు బేడీలు నజరాన సమర్పిస్తున్న దుష్టపాలనను 
సవాల్ విసురుతూ వెతుకులాటే జీవనవేదంగా కదులుతోంది 
తన చుట్టూ ప్రపంచాన్ని కదిలిస్తోంది

నిను తన రెప్పలమధ్యగా తడిగా 
నిను తన శ్వాసల మధ్య గాలిగా 
నిను తన నీడకు నకలుగా
నిను ప్రాణంలో ప్రాణంగా
తన గుండె గుహ మధ్య మిణుకు మిణుకుమనే దీపంగా 
నీ జ్ఞాపకాల దీప్తిని రెండు అరచేతుల మధ్య కాపాడుకుంటూనే ఉంది.

ఆమెకిప్పటికీ అర్థం కాలేదు
వాళ్ళెందుకు దేహాల వెనుక పడ్డారో
వాళ్ళెందుకు
దేహాల లోపలి ఆలోచనల అరణ్యాలను కూల్చడానికి ఆయత్తమౌతుంటారో 
పచ్చని చేలంటి ఆలోచనలంటే భయమెందుకో వారికి
నెత్తుటి కూడు మరిగిన సైతానులు రాజ్యాధికారం అలంకరించిన చోట
ఎవడి బతుకూ క్షేమం కాదని 
ఆమెకూ తెలిసిపోయింది
నిను వెతికేందుకు దేహాన్నే కన్నుగా మార్చుకుంది
ఆమె నిండు కదలిక ఇప్పుడు 
విశాల న‌యనాల విశ్వాసమే చూపుగా ఆమె


2.

ఆమె మౌనం వొదిలేసిన బాటసారి
నీకై కొత్తబాట కడుతున్న సంకల్పధారి

ఆమె కంటున్న కలల కావ్యాలకు 
నీ మీది అవ్యాజ్య ప్రేమే సిరా అని 
ఇప్పటికే ఈ దేశంలోని తల్లులందరికీ 
అర్థం అయి ఉంటుంది

రోహిత్
జిగ్నేష్
ఖలీద్
షీలా రషీద్ ల
తల్లులూ నీ అమ్మీలానే ధగదగలాడుతున్నారు 
రాజ్యం పై ఆగ్రహంగా ఉన్నారు

నిజం కోసం నిర్భయంగా అడుగేసే ప్రతి కొడుకూ 
ఈ రోజు ప్రమాదం సంకేతంగా పొందుతున్న వాడే
రక్షణ కరువైన వాడే నిరాయుధంగా త్రిశూలాలకెదురు ఛాతీలను ఆన్చిన వాడే

ఎందుకు కన్నారీ తల్లులు పిడుగుల్లాంటి ఈ పిల్లలనీ
కనడమే కాదు ధగధగలాడే కాగడాల్లా కటికచీకట్లను చీల్చే దీపధారులుగా నడుస్తుంటే మురిసి
“వెలుతురు లేని గూళ్ళలో వెలుగు కోసం వాడుకో దేశమా” అని దేశానికెందుకు అంకితం ఇచ్చేశారు?

ఉమ్మనీరు ఆరకముందే 
కన్నపేగు తెగకముందే
కడుపుతీపి తీరక ముందే వడి వడిగా ఎదిగి
వీరు దేశపు వీధుల గుండా మండేగుండెల్లా నినాదాలిచ్చుకుంటూ నడవండనే ప్రేరణే ప్రేమ కదా వారికి
ఎన్ని అవంతరాల గాయాలనైనా ఎదుర్కొనేలా 
వాళ్ళు చనుబాలలో ధైర్యం నూరిపోసారు 
అందుకే నజీబ్
మీరంతా హిమ్మత్ వాలాలయ్యారు

మీలాంటి యువతీ యువకులే
కశ్మీరు ఉద్యమ బావుటాలకు
పిడికిళ్ళుగా మారారు

దళితుల అంటరాని గుండెల చుట్టూ 
తప్పెట దరువులయ్యారు

సంఘ్ పరివార్ద్వేషం దర్జాగా తిరిగి
తగులబెట్టిన ముస్లీం వాడల 
శిధిల గొడలకు కనులయ్యారు
ఏ మసకలూ తగలని స్పష్టమైన చూపును 
ఈ దేశానికి ఇవ్వడానికి మీలాంటి పిల్లలు సిధ్ధమౌతున్నారు
దోపిడీ ర‌హ‌స్యాల‌ను ఛేదించే సమాధానాలౌతున్నారు

మీరిప్పుడు మశీదు నమాజులలో దువాలు
మీరిప్పుడు మురికివాడల ఇళ్ళకు బలమైన పునాదులు
మీరిప్పుడు హిందూ ముస్లీం ఐక్యతకు నిషానీ‌లు

మీరిప్పుడు నోరులేని పేదపిల్లలు దర్జాగా పలికే అఆలు
నడక ఆగిన వీధుల గుండా పరిగెత్తుతున్న యువపవనాలు
దేశానికి బంగారు భవిష్యత్ కల్పించే శ్రమైక సౌందర్యానికి
మౌలిక వనరు మీరు
మీరు ఈ దేశ చారిత్రక గతి తిప్పడానికి ఉద్దేశించబడిన ఆదర్శాలు

క్షుద్ర రాజకీయాల దుర్మార్గాలకు ప్రత్యామ్నాయాలుగా నిలబడిన అత్యాధునిక ఆలోచనలు 
మతోన్మాద రాజకీయాల కుట్రల పొట్టలను పేల్చే ఫిరంగులు 

ఇక దాగుడుమూతలాపు “ప్యారే” త్వరగా వచ్చేయ్
అమ్మ నీ కోసం ఎన్ని గోరుముద్దలు దాచిందో…
ఎన్ని చందమామ ఊహలతో నీలోని సున్నితమైన మనసుకోరుకునే కలల ఆహారం దాచిందో

ఆజా ప్యారే సాథ్ దేనేకో హామారే
అదిగో జోహర్ కోసం అజా పిలుపు వినిపిస్తోంది
నీ తల్లి నీ కోసం నింగిని టోపిగా కుట్టి ఎదురు చూస్తోంది..
ఆజా ప్యారే…నజీబ్ హమారే
దేశ్ కీ నీయత్ కే చాంద్ సితారే
ఆజా ప్యారే..
మిల్కే లడేంగే లడాయి
పాకే రహేంగే ఆజాది..

(నజీబ్ మరణించే ఉంటాడు కానీ నమ్మకం బలం కదా! నజీబ్ లాంటి పిల్లల కలలు మరణించవు ఆ బలమూ మరణించదనే బలమైన నమ్మకంతో..నజీబ్ తల్లి వెతుకులాటకు బాసటగా…)

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

3 thoughts on “దిల్ కె ప్యారే

  1. బలమైన దీర్ఘ కవిత…..కుడోస్ అహ్మద్ భాయ్💐💐💐💐💐

Leave a Reply