కొ.కు – ‘దిబ్బమతం’

స్కైడైవింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. విమానంలోంచి దూకి, ప్రీఫాల్‌ను అనుభవించి, తర్వాత పేరాచూట్ విచ్చుకున్నాక, ఎంతో అరుదుగా లభించే విహంగ వీక్షణ సౌలభ్యానికి మురిసిపోతూ కింద కనిపించే దృశ్యాన్ని కళ్లు విప్పార్చుకుని చూసి, వింతలూ విడ్డూరాలను ఆకళింపు చేసుకుంటూ, వాటిని తనకి తెలిసిన దృశ్యాలతో అన్వయం చేసుకుని – అంతలో కాళ్లు నేలకి తాకడం గుర్తించి, ఆ వేగానికి తగ్గ పరుగు పెడుతూ పెడుతూ ఆయాసంతో ఆగిన వ్యక్తిని ఊహించుకోండి. ఈ కథని చదవడం పూర్తి చేసిన ప్రతీసారీ నా పరిస్థితి అలాగే ఉంటుంది. కొకు పరిశీలనలూ, ప్రతిపాదనలూ, వ్యాఖ్యానాలూ – ఈనాటి పరిస్తితులలో వాటి ప్రాసంగికతా – అంతా కలిసి నన్ను గుక్క తిప్పుకోలేకుండా చేస్తాయి. కథలో ప్రస్తావించిన మౌలిక అంశాలు – మతం, కులం, రాజకీయం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, దేవుడు, వేదాలు – ఒక్కోటీ ఒక్కో వ్యాసంలో చెప్పాలన్నంత ఉక్కిరిబిక్కిరి అవుతుంది. చేతనయినంత వరకూ కొన్నింటినైనా సావధానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.

కథలోకి ప్రవేశించే ముందు కొన్ని ప్రాధమిక వివరాలను – allusions అంటారు, పరోక్ష సూచన అనవచ్చేమో తెలుగులో, అవి అందరికీ తెలిసేవే అయినా ఒక్కసారి ఆపదాలను చెప్పుకోవడం మంచిదనుకుంటా – కథాకాలం 1952 కనక అప్పటికి నాలుగేళ్ల క్రితం జరిగిన రక్తయజ్ఞం అంటే దేశవిభజన. దిబ్బదేశమంటే మన దేశమే. దిబ్బ మతం అంటే హిందూ మతం. దేశభక్తుల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ.

“దేశభక్తుల పార్టీ భయం మాకెన్నడూ లేదు, కాని ప్రజల అజ్ఞానాంధకారం మాకు పెట్టని గోడగా ఉంది. అయిదేళ్ల క్రితం జరిగిన రక్త యజ్ఞంతో ప్రజలు క్షాళన అవుతారని ఆశించాం. కాని అట్లా జరగలేదు. కాని మాకు తొందరలేదు. దిబ్బమతం అచంచలమైనది, అజేయమైనది.” ఈ వాక్యాల ప్రాసంగికతను వివరించడానికి దశాబ్దాల చరిత్రను తైపారు వెయ్యాల్సి ఉంది. సౌలభ్యం కోసం దానిని 3 భాగాలుగా చేస్తున్నాను.

***

1.‘దేశభక్తుల పార్టీ భయం మాకెన్నడూ లేదు’ : మతం కులం పెనవేసుకుని చిక్కుముడి పడిన మన దేశ పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి కొద్దిగా లోతుగా వెళ్లక తప్పదు. ఇక్కడ మనం గుర్తించవలసిన మరొక అంశం ఏమిటంటే – మతవాదం నినాదంగా కలిగిన పార్టీతో పాటూ లౌకికవాదం నినాదంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మతవాద సమస్యలో భాగమే. కులం దానిని మతాతీతంగా మారనివ్వదు. ఎందుకంటే – పదవీ, పరపతి, పలుకుబడీ, సాంఘికగౌరవం –చేజిక్కించుకోగలిగిన అగ్రవర్ణాల గుప్పిటిలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని మనం మర్చిపోకూడదు. రాత్రి పూట చడీ చప్పుడూ లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసే పనులనే బిజేపీ పగటిపూట నిర్బయంగా చేస్తోందని. ఒకటి డెమోక్రటిక్ పార్టీ లాటిదీ , మరొకటి రిపబ్లికన్ పార్టీ లాటిదనీ అంత కంటే తేడా లేదని ఈ కాషాయం దేశవ్యాపితం ఇంకా కాకముందు, గుజరాత్‌ని చూసి 2014లోనే అరుంధతీ రాయ్ చెప్పింది.

2. ‘కాని ప్రజల అజ్ఞానాంధకారం మాకు పెట్టని గోడగా ఉంది. అయిదేళ్ల క్రితం జరిగిన రక్త యజ్ఞంతో ప్రజలు క్షాళన అవుతారని ఆశించాం. కాని అట్లా జరగలేదు’:

ఈనాటి పరిస్థితిని మనం – హద్దులు మీరి, ప్రజాస్వామ్యాన్ని అతిక్రమించిన మతవాద నియంతృత్వం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడే మొదలయిందా, పదేళ్ల కితం మొదలయిందా, లేక ఇంకా ముందా అని ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు కళ్లు కప్పేసేంత పెనువేగంతో వీస్తున్న ఈ తుఫాను గాలులు – స్వాతంత్ర్యానికి ముందే దుమారాన్ని రేపేయి. కానీ మతవాదంతో మనుషులని పోలరైజ్ చెయ్యడం అప్పుడు విజయవంతం కాలేదు. దానికి కారణం భారతదేశపు ప్రత్యేక పరిస్థితి. అదేమిటో – కథలోనే మరో చోట కొకు చేసిన ప్రతిపాదన వివరిస్తుంది: ‘మిగిలిన మతాలకూ దిబ్బ మతానికీ గల పెద్ద తేడా – అవన్నీ రోజుకు కొద్ది నిముషాలు ఆచరించవచ్చు. దిబ్బ మతం అనుక్షణ ఆచరణీయం. దీన్నుంచి పుట్టనివాళ్లూ, చచ్చిన వాళ్లూ, నిద్రితులూ సయితం తప్పించుకోలేరు. ఆచరణలో అదే వ్యక్తమవుతున్నది.’

ఏమిటి ఆ అనుక్షణ ఆచరణీయమైన ఆ అంశం అని ఆలోచిస్తే – కులం తప్ప నాకు మరేదీ తోచదు. కులాలను కలిగి ఉండడం తప్ప తనదంటూ మరే ప్రత్యేక ఏకీకృత నిర్వచనమే లేని వింత మతం ఈ హిందూ మతం. దాని పేరు చెప్పి ఆనాడు కదిలించగలిగేది – అగ్రవర్ణాలను మాత్రమే. కనకనే హిందూ మతం అనే సెంటిమెంటుని వాడి ఒక్క పెట్టున దేశప్రజలని చేరలేకపోయారు.

‘కాని మాకు తొందరలేదు. దిబ్బమతం అచంచలమైనది, అజేయమైనది.’:

ఇది భవిష్యద్దర్శనం చేసి, మతవాదం చేతులు ముడుచుకు కూర్చోదని, ఏదో రూపంలో బయటపడుతుందనీ ఊహించి కొకు రాసిన వాక్యం. జరిగినదీ అదే! కుల విభజన వల్ల మొదటి నుండి పరాయిగానే ఉన్న కులాలలో హిందూ మతాభిమానం తగినంతగా విస్తరించలేదు గాని, క్రమేణా ఆ విభజనని మరింత తీవ్రం చేసి ఒక్కో చోట ఒక్కో ఉపవిభన ఫార్ములాతో రాజకీయం – ఈ అగ్రవర్ణేతరుల ఐక్యతని దెబ్బ తీయగలిగింది. మరో పక్క ‘మనమంతా హిందువులం’ అనేది చెప్పి ఒప్పించలేకపోయింది గానీ తగిన సమయం చూసి ‘అదుగో వారు ముస్లిములు, వారందరూ మన శత్రువులు’ అని కొందరినైనా ఒప్పించడంలో మతవాదం కొంత విజయాన్ని సాధించింది.

***

కనక ఈనాడు ఈ మతవాద ఫాసిజాన్ని ఎదుర్కోవాల్సిన మనం – దీని మూలాలను అర్ధం చేసుకోడం అత్యావశ్యకం. దిబ్బ ప్రభువు నూతన మంత్రివర్గానికి ఇచ్చిన విందులో ‘మతవాది’ దిబ్బమత ప్రవీణులుండడం చూస్తే – దేశం రిపబ్లిక్‌గా మారాక కూడా రాజకీయంగా శక్తివంతమైన స్థానాల్లో హిందూ మతం ఉండేదనీ, దాని ప్రాధాన్యతలను అది కాపాడుకునేదనీ మనకి సూచనప్రాయంగా తెలుస్తుంది. అర్ధ దశాబ్దం కిందట, వామపక్షం బలంగా ఉన్న రోజుల్లోనే, రాజ్యాంగంలో మతం ఎలా తిష్ట వేసుకు కూచుందో వివరించే ప్రశ్నలు సంధిస్తారు కథలో, మచ్చుకు రెండు:

  1. రాజ్యాంగంలో మత ప్రాముఖ్యం తగ్గిందా, హెచ్చిందా?
  2. అన్ని మతాలకూ సమాన గౌరవం ఉండేటట్టా లేక దేనికి తగిన గౌరవం దాని కుండేటట్టా?

దిబ్బ మతం రాజ్యాంగంలో ఎలా స్థిర పరచబడిందో కొన్ని దృష్టాంతాలనిస్తారు: దిబ్బ రాజ్యాంగాన్ని దేవుడి భాషలోకి తర్జుమా చేశారు, రాజకీయ తతంగాలన్నిటికి, దిబ్బ మత సంబంధమైన మంత్రాలు చదువుతారు, దిబ్బ అధ్యక్షుడు దిబ్బ మత చిహ్నాలను ధరించిగాని పదవీ స్వీకారం చెయ్యడు, ఎవరైనా దిబ్బ పౌర ప్రముఖులు చస్తే దిబ్బ రేడియోలలో దిబ్బ మత గ్రంధ పఠనం జరుగుతుంది. ఇతర మతాలకి చెందిన వారు అధ్యక్షులైతే, ఆచార ప్రకారం దిబ్బ మతానికి సంబంధించిన మంత్రాలు చదవవలసి వస్తే – అతను అభ్యంతరం చెప్పగలడా?

దిబ్బ శాసనాల్లో దిబ్బమతం ఉంది, దిబ్బ జాతీయ భాషలోనూ, జాతీయ పతాకాలలోనూ దిబ్బ మతం ఉంది.

ఆసక్తికరమైన ప్రతిపాదన ఒకటి చేస్తారు కొకు: అన్యమత విద్వేషం గురించి !

మనకన్నా అవతలవాడు బలవంతుడైనప్పుడూ, వాణ్ని సందేహించే అధికారం మనకు లేనప్పుడూ ద్వేషిస్తాం. దిబ్బ మతానికి అటువంటి దుర్దశ లేదు. మన పరమత సహనం గురించి అనేక ప్రశంసలు వింటూ ఉంటాం. దాని మూలం నిజంగా మనుషులంతా సమానమనే అచంచల విశ్వాసంలో ఉందా, లేక అన్య మతాలేవీ మనకు సాటి రావన్న అహంకారంలో ఉందా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని ప్రోత్సహిస్తుంది ఈ ప్రతిపాదన. నిజంగానే సర్వమానవ సమానత్వాన్ని నమ్మే జాతి అయితే కులం ఎందుకు పాతుకుపోయింది మనలో? మన దేశంలోకి వచ్చి చేరిన మతాలకి సైతం కులజాడ్యాన్ని అంటించాం కద!

మొన్ననే ఒక నినాదం విన్నాను – భారత దేశం అంతా ఒకే మతం ఉండేలా చేస్తామన్న ప్రణాళికకు సవాలుగా – చాతనయితే దేశమంతా ఒక కులం ఉండేలా చెయ్యమని. వినగానే కొకు వేసిన ఈ ప్రశ్నలే గుర్తుకొచ్చాయి: ఇప్పుడున్నది దిబ్బమతమా కాదా? – ప్రాచీన గ్రందాలలో చెప్పబడని ఈ కులాలను ఉంచడమా, మానిపించటమా? ఈ ప్రశ్నలు వేస్తేనే మతం అసలు రంగు బయటపడేది – వాటికి జవాబులు తనకు తెలీదని కథలో ప్రవీణులు తప్పుకుంటాడు కానీ ఆ మొహమాటం లేని గరికపాటి నరసింహారావు వంటి ఈ కాలం ‘ప్రవీణులు’ కులాలుండాల్సిందేనని వాదిస్తున్నాడు. అతని వాదం ప్రకారం కులద్వేషం పనికిరాదు గానీ, కులం ఉండవలసిందేనట. కులం మతం చెట్టపట్టాలు వేసుకుని కొత్త నడకలు నడుస్తున్నాయని చెప్పడానికి ఇంతకంటే ఏం ఉదాహరణ ఉంటుంది?

***

మతాన్ని, ప్రత్యేకించి హిందూ మతాన్ని – ఎదిరించవలసిన అవసరాన్ని చెప్పాక – విద్యావంతుల మధ్య మతాన్ని సవాలు చేయడం, దైనందిన సంభాషణలలో చర్చలను భాగం చేయడం అవసరం అని కూడా కొకు భావించారు. ఆ చర్చలకి దారితీసే అనేక ఆలోచనలని ఈ కథలో పొందుపరిచారు.

వేదాల ప్రామాణికత మీద – ఆలయాలూ, విగ్రహారాధనలూ, మంత్రోచ్ఛారణలూ, వ్రతాలూ, పుష్కరాల వంటి సామూహిక సంస్కృతులూ – అనేకం ఆధారపడి ఉన్నాయి. వేదాలకు సంబంధించిన అనేక పురాణకథలు – వాటిని హిందూమతం అంతర్బాగాలుగా చూపిస్తూ ఉంటాయి. కానీ – హిందూమతం లోని దైవభావనకూ, వేదాలకూ ఎంతటి అంతరం ఉందో వివరిస్తారు: ప్రాచీన దిబ్బగ్రంధాలలో కొన్ని భాగాలలో – నదుల ప్రార్దనలూ, సూర్యోదయ వర్ణనలూ అవీ ఉన్నాయి. వాటిని రాసింది దేవుడే అయితే ఈ దేవుడు పశువులను కాసినట్టూ, పంటలు పండించినట్టూ, ప్రకృతిని చూసి భయపడ్డట్టూ కనిపిస్తాడు. ఈ ప్రపంచాన్ని తానే సృష్టించానన్న జ్ఞానం ఈ దేవుడికున్నట్టు కనపడదు.

నిజమే, సర్వేజనా సుఖినో భవంతు అనే స్వస్తి మంత్రాలని చూపించి – హిందూ మతం పరమ శాంతమతం అని చెప్తూ ఉంటారు. అయితే ఏవి వేదాలు? – పశువులని కాసుకుంటూ, పంటలు పండించుకుంటూ – గడిపిన ఆ ప్రాచీనకాలపు ‘స్మృతుల’ సంగ్రహాలా లేక కులాధిక్యాన్ని సంరక్షించుకోడానికి ఏర్పరుచుకున్న మను’స్మృతుల’ వంటి శిక్షల సమాహారాలా? పరవశంతో చేసిన ప్రకృతి వర్ణనలా లేక బ్రాహ్మణాధిక్యతను సుస్థిరం చేసే స్తోత్రాలా? వాస్తవం ఏమిటంటే – రెండూను. చరిత్రకారులు వాటిని వేర్వేరు కాలాల చరిత్రకి రుజువులుగా విభజించారు కూడా. హిందూ మత సానుభూతి పరులలో ఒక మేధావి వర్గం ఈ వైరుధ్యాన్ని తెలివిగా వాడుకుని – వేదవాంగ్మయం సెక్యులర్ అని వాదిస్తుంది. మతానికి సంబంధించిన ముఖ్యమైన ఈ భేదాన్ని ఎత్తి చూపుతూ ఉండాలి, అప్పుడే మతం ఎప్పుడు మతవాదంగా పరిణమిస్తోందో పసిగట్టగలుగుతాం.

***

ఇంత సీరియస్ చర్చ జరిపిన ఈ ‘దిబ్బమతం’ గురించి ఒక అనుమానం రాక తప్పదు – అసలు ఇది కథా లేక కథ అన్న ముసుగు లోని వ్యాసమా అని. కథా లక్షణాలేమిటి, అవి ఈ కథకి ఉన్నాయా అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం కానీ, ఒక ఒక దిశలో సాగుతున్న భావాలని, ఒక్కసారిగా మలుపు తిప్పిన ఈ వాక్యాలు చదివితే నాకు ఇది కథేనని నమ్మకంగా అనిపిస్తుంది.

‘దిబ్బ సంప్రదాయం ఏమిటి? దిబ్బమతం మనిషిని ఉద్ధరిస్తుందా లేక మనిషి మతాన్ని ఉద్ధరిస్తాడా ఇంతకు పూర్వం దిబ్బమతం అచంచలమైనది, అజేయమైనది అన్నారు. ఇప్పుడు దిబ్బమతం ఉద్ధరించబడాలంటున్నారు. ఇందులో ఏది నిజం? ’

అంత వరకూ ఏకపక్షంగా ప్రవీణుల వాదానికి ఎదురు లేనట్టు సాగిన కథనంలో ఉన్న లొసుగు ఇక్కడ బయటపడుతుంది. మతం రాజకీయంగా ఎలా మార్చబడుతుందో ఇక్కడ తెలుస్తుంది. మతాన్ని పాటించండి, మిమ్మల్ని అది ఉద్ధరిస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి అని ప్రవచనకర్తలు జనాలను కూడగడతారు. ఇదిగో మీ మతానికింత అవమానం జరిగింది, మీరంతా కలిసి దానికి తగిన ప్రతీకారం చెయ్యాలి, అని మతవాదం వారిని రెచ్చగొడుతుంది.

దానికి తాజా ఉదాహరణ జగ్గీ వాసుదేవ్. ఈశా ఫౌండేషన్ పేరుతో ప్రైవేట్ నగరాన్ని నడుపుతూ, ఇంగ్లీషులో ఆథ్యాత్మిక చర్చలు చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా జనాదరణని పొందుతున్నాడు. ఈ దేశంలో పౌరసత్వహక్కు ఎవరికుండాలో, ఎవరికి ఉండకూడదో మేము నిర్ణయిస్తామని, మతాల వారీ లెక్కలు గట్టి విభజిస్తామని బయలుదేరిన చట్టాలకు మద్దతును ప్రకటించాడు ఈ వాసుదేవ్. దానిని ప్రధాని తన ప్రచారంలో వాడుకుంటున్నాడు. ఇంత స్పష్టంగా మతం మతవాద రాజకీయానికి సహకారిగా మారిపోయిన ప్రకరణం మన ముందు కనిపిస్తోంది కదా, మతానికి విరోధం ప్రకటించడానికి మనం సంశయిస్తే ఎలా?

గడిచిన కొన్ని వారాల్లో యువత ఈ మతవాదాన్ని నిరోధించడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోడానికి ఏకం అవుతున్న ఈ సందర్భంలో – ఈకథలో లేవనెత్తిన అంశాల మీద చర్చ జరిగితే, ఎంతో ప్రయోజనం ఉంటుందనిపిస్తోంది. ముందుముందుకి నిజంగానే మనం పూర్తి స్థాయిలో సెక్యులర్ దేశంగా మారిననాడు, దానిని కొనసాగించుకోడానికి ఏయే అంశాలని దృష్టిలో ఉంచుకోవాలో, ఎక్కడ చెక్‌లు పెట్టుకోవాలో – అని ఆలోచించే దిశగా మనల్ని ఈ కథ నడిపిస్తుంది అని నా విశ్వాసం.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

One thought on “కొ.కు – ‘దిబ్బమతం’

  1. శారదా నదికి వరదలు ఏదో పెద్ద తుఫాను వచ్చినప్పుడు తప్పా మొకాలు దాటి ప్రవహించదని విన్నా.
    ఈ వ్యాసం చదివాకా మెదడు మోకాళ్ళల్లో పెట్టుకుని రాసే వారు ఒక విషయం మీద సమగ్ర చేసేటప్పుడు విషయాన్ని సహేతుకంగా వివరణలతో చెయ్యని మూర్ఖులంతా విజ్ఞులయ్యిపోతారని, కేవలం ఉద్వేగాలతో అసంబద్ధాలు అబద్ధాలు కలిపి విషం కక్కినంత మాత్రాన్నా అరచేతులతో హిందూ ధర్మం ఉద్ధారణ ని ఆపలేరని నేను మీ మీద విరుచుకు పడను. ఒక వ్యాసానికి ఉండవలసిన విషయ పాండిత్యం కన్నా కట్టలు తెచ్చుకుంటున్న మేధో ఉద్వేగపు మూఢత్వమే …ఈ దిబ్బ మతం ఆరోపణలన్నీ…సూటిగా ప్రవర్తించే వారిని నమ్మొచ్చు..ఇలా ముసుగులేసుకుని కేవలం తమ అస్తిత్వ ఆవిష్కరణమే ఒక ఉద్యమంగా మలుచుకునే వారు ఎంతో మంది పుట్టారు గిట్టారు…కానీ ప్రజలే నిర్ద్వందంగా తీర్పు చెప్పారని ఒప్పుకోలేని వారిని మెతావులనే అంటారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఘోరాలు మైనార్టీల ముసుగులో చుట్టు పక్కల దేశాల్లో ఉన్న మెజారిటీ ప్రజల వలసని అడ్డుకునే చట్టాన్ని అర్ధం చేసుకోలేని మూర్ఖులకి కనీసం ఒక బిల్లు చదివి అందులో లోపాలని సరిగ్గా చూపించలేని నిరక్షరాస్యులని ..అక్షరాస్యులని చెయ్యడం మానేసి మరింత అగ్నికి ఆజ్యం పోసే అహంకారులు ఎక్కువ కాలం తమ ప్రస్థానాలు కొన సాగించ లేరు..

Leave a Reply