దిగూట్లో దీపం వెలుగుతుంది

మురికి వాడల్లో
పూరి గుడిసెల్లో
ఎన్ని దేహాలు చిదృపల్ చిదృపలైనాయో
ఆహాకారాల నడుమ
ఎన్ని ప్రాణాలు గతించాయో
ఇంకెన్ని గాలిలో కలిసి పోయాయో
కనీసం గమనింపయినా లేకుండా

దయలేని చంద్రుడు
వెన్నెల కురిపిస్తూనే వున్నాడు

వూరు పక్క నదీ
కాలనీలో మురిక్కాలువా
ప్రవహిస్తూనే వున్నాయి

కాలువొడ్డున కాల్జేతులు
దగ్గరగా ముడుచుకుని
ముంజేతుల్లో తల దాచుకుని
ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నారనే
ధ్యాసయినా లేకుండా

‘మౌనం’ గంభీరంగా రాజ్యమేలుతుంది
‘రాజ్యం’ మౌనంగా తల పంకిస్తుంది

కాలం గడుస్తుంది
దేహంపై గాయాలు మానతాయి

మనుషుల్ని పోగొట్టుకున్న దుఃఖం
మనసుల్లో గడ్డ కట్టుకుంటుంది

నాకు తెలుసు
ఎప్పటికయినా
రాళ్ళల్లో తడి పుడుతుంది
కాళ్ళ కింది భూమి కదిలిపోతుంది
సముద్రం కల్లోల పడుతుంది

దట్టమయిన మబ్బుల్ని చీల్చుకుని
ఉదయపు వెలుగూ
రాతిరి వెన్నెలా కురుస్తాయి

దిగూట్లో దీపం వెలుగుతుంది
వాకిట్లో పూలు విరబూస్తాయి

అర్థవంతమయిన సినిమాలూ, సాహిత్యం ఇష్టం. నాలుగు దశాబ్దాలు ఫిల్మ్ సొసైటి ఉద్యమంలో పని చేసారు. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి సొంత ఆడిటోరియం నిర్మాణం లో ప్రధాన భూమిక పోషించారు. సినిమాలపైన ‘నవ్యచిత్ర వైతాళికులు’, ’సినీ సుమాలు’, ’24 ఫ్రేమ్స్’, ’ బాలల చిత్రాలు’, 'బంగారు తెలంగాణలో చలనచిత్రం’, 'తెలంగాణ సినిమా దశ-దిశ’ పుస్తకాలు రాసారు. కవితా సంపుటులు మనిషి లోపల, అక్షరాల చెలిమె, ముక్తకాలు, గుల్జార్ కవితానువాదం 'ఆకుపచ్చ కవితలు' వెలువరించారు. ఆనంద్ కవిత్వం ఇంగ్లీష్ లో  ‘Signature of Love', తమిళంలో ‘అన్ బిన్ కైచందు’ పేర సంకలనాలుగా వెలువడ్డాయి. కన్నడానువాదం ప్రచురణకు సిద్ధంగా వుంది. ఆయన పలు డాక్యుమెంటరీ ఫైల్మ్స్ కి దర్శకత్వం వహించారు. అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.   

Leave a Reply