మేకల చరిత్ర మేకలు రాసుకునే సందర్భం ‘దిక్కుమొక్కులేని జనం’ — ఆలూరి భుజంగరావు

దేశాన్ని ఒక ఆర్ధిక సంక్షోభం చుట్టుముడుతుంది. ఒక కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక ఉద్యమం ఒక జాతిని నడిపిస్తుంది. లక్షలమంది కదిలి జాతి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ఉద్యమిస్తారు. కోట్లమంది ప్రజలు వారికి అండగా వుంటారు. జీవనోపాధికోసం చేసే యుద్ధంలో ప్రతిరోజూ పోరాడుతూ వుంటారు. మధ్యతరగతి వాళ్ళు సరే. ఎంతో కొంత సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. విపత్తులను తట్టుకునే శక్తి ఎంతో కొంత ఉంటుంది.

కానీ పేద, దిగువ మధ్యతరగతి వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎలాటి మద్దతూ ఉండదు. పనిచేసేచోట గాయపడుతూ వుంటారు. అవమానాలు పడుతూనే వుంటారు. ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. గాయాలతో, అవమానాలతో పొట్టపోసుకోడానికి అనుక్షణం యుద్ధమే.

ఉద్యమాలు ఎంతోకొంత రికార్డవుతాయి. ఆ ఉద్యమాల మొత్తం స్వరూపాన్ని ఆ చరిత్ర పట్టుకుంటుందని కాదుగాని ఆ ఉద్యమాల broad contours తెలుస్తాయి. కానీ ఆయా ఉద్యమాలు జరుగుతున్నపుడు వాటికి సమాంతరంగా, లేదా జమిలిగా జరిగే బతుకు పోరాటాల గురించిన ఆనవాళ్లు దొరకబట్టడం చాలా కష్టం. అసలు సమాజపు ఆ పొరలో జరిగిన, జరుగుతున్న రక్తసిక్త పోరాటాల గురించి ప్రధాన స్రవంతి సాహిత్యంలో, చరిత్ర రచనలో కనబడదు.

ఉదాహరణకు స్వాతంత్య్ర ఉద్యమం తీసుకుందాం. ఇరవయ్యవ శతాబ్దపు మొదటి భాగం ప్రపంచానికి సంక్షుభిత సమయం. మనదేశానికి అదనపు బరువులున్నాయి — జాతి నవనాడుల్నీ పీల్చిపిప్పి చేస్తున్న కుల వ్యవస్థ, పేదరికం, నిరక్ష్యరాస్యత, విదేశీ పాలన. వీటికి తోడు రెండు ప్రపంచ యుద్ధాలు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో సామాన్యుని జీవనం ఎంత సంక్షుభితమై ఉంటుంది? ఎన్ని కోట్లమంది ఎంత వ్యథ చెంది వుంటారు? ఎంతమంది ఆకలిచావులకు బలై వుంటారు? ఎంతమంది వ్యవస్థీకృత నిచ్చెనమెట్ల హింసరచనకు బలై వుంటారు? ఎన్ని లక్షలమంది ధైర్యంగా నిల్చుని కొట్లాడి వుంటారు?

తమలాటి దిక్కులేని వారిని కూడగట్టి వ్యవస్థీకృత హింసని ఎదుర్కొని, నిలువరించి, పనిచేసే చోట కొంత ఊపిరిపీల్చుకునే వెసులుబాటుని సాధించుకుని వుంటారు? ఈ ప్రాసెస్ లో వారు ఎంత అణచివేతకు, ఎన్ని దాడులకు లక్ష్యమై వుంటారు? ఎన్నివేలమంది హత్యలకు గురైవుంటారు? అసలు అలాటి సంక్షుభిత కాలంలో సామాన్య ప్రజల దైనందినజీవితం ఎలా వుండివుంటుంది?

ఇలాటి ప్రశ్నలకు ఆలూరి భుజంగరావు గారి ‘దిక్కుమొక్కులేని జనం’లో సమాధానం దొరుకుతుంది. తెలుగు సాహిత్యంలో నాకు ఇష్టమైన రచయితల్లో ఒకరైన భుజంగరావుగారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్య్రానికి ముందు — సంధి సమయంలో — తెలుగు సమాజంలో కిందిమధ్యతరగతికి చెందిన హోటల్ వర్కర్ల గురించి రాసేరు.

కథాస్థలం తెనాలి. పాత్రలు దాదాపు అందరూ హోటళ్లలో పనిచేస్తున్నవారు, హోటల్ యజమానులు, వారి కుటుంబసభ్యులు. కథ సర్వర్ వాసుదేవన్ వైపు నుంచి నడుస్తుంది. కటిక పేద అయిన వాసుదేవన్ సర్వర్ ఉద్యోగం సంపాదించడం, పోగొట్టుకోవడం, దెబ్బలు తినడం, అవమానాలకు గురవ్వడం, మళ్ళీ జీవనోపాధికోసం ఎక్కేగడపా, దిగే గడపా.

వాసుదేవన్ వలెనే యానాది పిల్లలు. వాసుదేవన్ వలెనే చలపతి. వాళ్ళలాగానే తమిళనాడు నుంచి పొట్టచేతపట్టుకు వచ్చిన సర్వర్లు, వంటవాళ్లు. అందరి కథా ఒక్కటే — వారి శ్రమని మిగులుగా మార్చుకుంటున్న యజమానుల వ్యక్తిగత, సామూహిక దాడి.

ఈ హింసని ఎదుర్కోడానికి వర్కర్లతో కలిసిపోయి వాళ్ళకి విషయాలు అర్ధంచేయించి సంఘటిత పరిచే పనిలో వుంటారు విజయ్ కుమార్, కుటుంబరావులు. అంత శారీరక శ్రమలోనూ అధ్యయనాన్ని వదిలిపెట్టని వాసుదేవన్. (అంటే భుజంగరావుగారే కావచ్చని నా అంచనా; లేదా ఆయనతోపాటు కష్టాల కొలిమిలో మండుతూనే, అక్షరాలు నేర్చుకుని మంచి రచయితలుగా ఎదిగిన శారద (నటరాజన్), రావూరి భరద్వాజలు కావచ్చు.)

జీవిక కోసం పోరాడుతూ, చదువుకుంటూ, సమాజ సూత్రాలని అర్ధం చేసుకుంటూ, అసంఘటిత కార్మికుల్ని సంఘటిత పరుస్తున్న వారికి మద్దతుగా నిలుస్తూ — ఈ చిన్న పుస్తకంలో భుజంగరావుగారు 1940 నుంచి 1950 వరకూ మధ్య తెలుగు సమాజంలోని సామాజిక, ఆర్ధిక సంక్షోభం నేపథ్యంగా అప్పటి చరిత్రని మన కళ్ళముందర ఉంచుతారు. హోటళ్లలో ఉద్యోగాలు కులాలవారీగా ఎలా కేటాయింపబడేవో చెప్తారు. వ్యవసాయంలో మిగులు వ్యాపారాల్లోకి ఎలా ప్రవహించడం మొదలుపెట్టిందో, ఇలా రూపాంతరంచెందిన పెట్టుబడి తక్షణ లాభాలకోసం శ్రమ మిగులుని ఎలా పోగుచేసుకోవడం మొదలుపెట్టిందో, అందుకోసం యజమానులు ఎలా gang-up కాగలరో ఈ ప్రాసెస్ లో నలిగిన జీవితాలు, కొట్టుకుపోయిన జీవితాలు, ఇలాటి వారికి అండగా ఉండి వాళ్లకి ఎంతోకొంత ఊరట కలిపించడానికి వచ్చినవాళ్ళ గురించి — ‘దిక్కుమొక్కులేని జనం’లో రాస్తారు.

సంఘటితమవుతున్న కార్మికుల్ని చెదరగొట్టి వాళ్ళ ఐక్యమత్యాన్ని దెబ్బగొట్టి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియ్యడానికి దాడులు చేయిస్తారు యజమానులు. కానీ ప్రసార సాధనాలు, పోలీసు వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని బాధితుల్నే విలన్లుగా చిత్రీకరిస్తారు.

బహుశా అంత దుర్భర జీవితాన్ని ఎదుర్కొని నిలిచినవాడు కాబట్టి, సాహిత్యం పట్ల అపారమైన ప్రేమ వున్నవాడు కాబట్టి ఆ చరిత్రని ఒడిసిపట్టుకుని రికార్డు చెయ్యడం ఒక బాధ్యత అనుకుని రాసిన పెద్దకథ లేదా నవలిక ఇది. అత్యంత నిరాడంబరమైన, ఆకర్షణీయమైన శైలితో — “ఇది నేనైనా రాయగలను” అని పాఠకుడికి అనిపించేంత సులువైన శైలి భుజంగరావుగారిది.

అప్పటి ప్రజలు సామాజిక-ఆర్ధిక సంక్షోభాల్ని తట్టుకుని ఎలా బతికారని తెలుసుకోడానికి మాత్రమే కాదు, ఇప్పటి ప్రజలు ఎలా బతుకుతున్నారని, వాళ్ళు ఎదుర్కొటుంటున్న సామాజిక, రాజకీయార్థిక సంక్షోభాల్ని ఎలా రికార్డు చేయవచ్చునో తెలుసుకోడానికి ఈ పుస్తకం చదవాలి.

మేకల చరిత్ర మేకలు రాసుకోవాలి.

రచయిత, జర్నలిస్టు.

2 thoughts on “మేకల చరిత్ర మేకలు రాసుకునే సందర్భం ‘దిక్కుమొక్కులేని జనం’ — ఆలూరి భుజంగరావు

  1. మొదటి రెండు పేరాలు చాలా బావున్నాయి. ఈ నవల్ చదివిన కానీ గుర్తులేదు. ఇంకోసారి చదవాలె. కవర్పేజీ పై బొమ్మ పి.మోహన్ వేశాడనుకుంటా..

  2. . వ్యవసాయంలో మిగులు వ్యాపారాల్లోకి ఎలా ప్రవహించడం మొదలుపెట్టిందో, ఇలా రూపాంతరంచెందిన పెట్టుబడి తక్షణ లాభాలకోసం శ్రమ మిగులుని ఎలా పోగుచేసుకోవడం మొదలుపెట్టిందో, .??? This is contradicting marx primitive accumulation

Leave a Reply