దస్రూతో కొన్ని మాటలు

“నేను పారిపోయింది నా ఊరినుండి కాదు, తుపాకి నుండి”, అన్నావు. కానీ, ఎక్కడికని పారిపోగలవు దస్రూ? నువ్వు గమనించలేదు కానీ, నీ నేలలో తుపాకులు మొలిచి చాలా కాలమైంది. పచ్చటి అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ, కొమ్మలకు ఊయలలూగుతూ పలాశ పుష్పంలా తేలిపోయే నీ వానోతో సరాగాలాడుతూ నువ్వు పాడే పల్లెపాటలా బతుకంతా గడిపేస్తానని అనుకున్నావ్! ఈ నేల, నీరు, అడవి అచ్చంగా నీవేనని కదా నీ నమ్మకం! ఆ స్టీల్ కంపెనీ అగర్వాల్ వచ్చి నీ కాళ్లకింది నేలను లాగేసుకుంటాడని నువ్వు ఊహించావా? నీ తాతముత్తాతలను తనలో దాచుకున్న ఈ నేలపై, నీ నివాస హక్కులను నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు చూపించమని వాళ్ళడిగితే నువ్వేకాదు, నీవాళ్లు కూడా నివ్వెరపోయారు. ఆ కంపెనీలకు దళారులుగా మీ జాతి మనుషులే ముందుకొచ్చి బెదిరిస్తున్న విపరీతానికి మరింత బెదిరిపోయారు.

సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఆదుకోటానికి అన్నలొచ్చారు. ఈ అడవిపై హక్కు మీదేనని భరోసా ఇచ్చారు. మీకు ద్రోహం చేస్తున్న వాళ్లను శిక్షించి తీరుతామని తేల్చి చెప్పారు. స్టీల్ కంపెనీకి దళారీగా మారిన ఆదివాసీ యువకుడు మాద్వీని ప్రజాకోర్టులో కొట్టి చంపారు. హక్కుల రక్షణ కోసం ఉద్యమంలో చేరావేగానీ నీకు రక్తపాతమంటే భయం. హింస-ప్రతిహింస అనే చర్చ నీకు తెలియదు. నిర్ణయం నీది కాకున్నా నీ చేతుల్లో ఒక మనిషి ప్రాణం పోవటం కుంగదీసింది.

పైగా, ఆ మాద్వి, నీ జాతి నుండే “ఎదిగి”వచ్చిన ఎం.పి బాబులాల్ కర్మ కొడుకు కాకపోయుంటే, కొడుకు చావుకు గుండె పగిలిన బాబులాల్ మరణించకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ, ఆ ఎం.పి భార్య ఫూలో కర్మ పగ తీర్చుకోటానికి రాజకీయాల్లో దిగింది. కేంద్ర ప్రభుత్వంలో తమ ఆదివాసీ సంస్థను భాగస్వామిని చేసింది. ఉద్యమకారుల నిర్మూలనకు కంకణం కట్టుకుంది. ఇక ఉద్యమం నుంచి, ఊరినుంచి పారిపోవటమే నీకు తోచిన మార్గం.

నీకు తెలిసిన జార్ఖండ్ అడవి నుంచి నువ్వెరుగని ముంబై జనారణ్యంలోకి పారిపోతే జీవితం శాంతిగా, సాఫీగా సాగుతుందని భ్రమ పడ్డావ్. నిన్నువెంటాడిన ఫూలో కర్మ నీ భార్యను హత్య చేయిస్తే ఆ నేరాన్ని నీ మీద మోపి వెంటాడే పోలీసుల నుంచి పారిపోవాల్సిన స్థితికి దిగజారింది జీవితం.

ఎవరి కారణాలు వాళ్లవే అయినా, అనుకున్న పనులు సాఫీగా సాగాలనే అందరి కోరికా! చట్టబద్ధంగా డ్యూటీ చేసే వీలుంటే నిరపరాధులను హింసించకుండా, తన మనస్సాక్షిని నొప్పించకుండా ప్రశాంతంగా బతికెయ్యవచ్చునని ఆ దళిత పోలీసు రత్నాకర్ భ్రమ! నిన్ను చంపవద్దని ఆదేశించి, చట్టబద్ధంగా అరెస్టు చేస్తే తాను ఒక పాపం నుండి విముక్తుడిని అవుతానని తపించాడే తప్ప, నీకు న్యాయం జరుగుతుందని గట్టిగా హామీ ఇవ్వలేక పోయాడు. ఎందుకంటే- ప్రజల హక్కుల రక్షణ కొరకు ఎన్ని చట్టాలున్నాయో, హక్కుల హననానికి కూడా అన్ని చట్టబద్ధ మార్గాలున్నాయని అతడికన్నా బాగా ఎవరికి తెలుసు?

చివరికి ప్రభుత్వానికి, కార్పొరేట్లకు, వారి దళారులకూ కూడా సాఫీగా, చేతికి మట్టి అంటకుండా వారి అభివృద్ధి నమూనా అమలయిపోతే బావుండుననే ఉంటుంది. గ్యాసు లైట్లు, చీరలు పంచిపెట్టిన ఔదార్యంతో “ప్రగతి నగర్” సెజ్ పునాదులను సుస్థిరం చేసుకుందామనీ, “ముండా మైన్స్”ను విస్తరించుదామనీ ఫూలో ముండాకు కూడా శాంతియుతమైన కోరికే. కానీ చట్టబద్ధంగానో, రహస్యంగానో జనం అలజడి పడుతూనే ఉన్నారు. హింస ఒక వ్యవస్థగా స్థిరపడిన కాలంలో శాంతి కోసం వెదకటం ఎంత వృథా ప్రయాస!

ఆరేళ్ల తర్వాత నీ ఊరికి తిరిగొస్తే, నీకు తెలిసొచ్చిన వాస్తవం కూడా ఇదేకదా దస్రూ! చేతుల్లో పసి పాపతో, నిలువెత్తు దిగులువై, ఎంతగా వెదుక్కున్నాహై టెన్షన్ వైర్లు, క్రేన్లు, పొక్లైనర్లు, తెగిపడిన వృక్షాలు తప్ప నీకు నీడనిచ్చిన చెట్లు, సేదదీర్చిన నదులు ఎక్కడు న్నాయని? నిరంతరంగా “వేట” సాగుతోంది. గొడ్డూ గోదా అమ్ముకుని వలస పోతున్నారు జనం. పొలాల్లో గింజలకు బదులు ఖనిజాలు పండుతున్నాయి. రైతుల ఇళ్ళు కూల్చి, గనులు తవ్వి పనులు కల్పించింది కొత్త అభివృద్ధి !

ఇంత ధ్వంసమైన అడవిలోనూ కొన్ని మోదుగలు పూలు పూస్తుంటే నీకేవో పాత జ్ఞాపకాలు కదిలాయి. అర్థాంతరంగా పారిపోయినందుకు పార్టీని క్షమాపణ కోరితే నీ పాపకు రక్షణ దొరుకుతుందని ఆశ. కొన్ని గుండెల్లో అన్నలపై గౌరవం ఉంది. కానీ ఊళ్ళో ఉండాలంటే దళారులో, ఇన్ఫార్మర్లో కావడం ఇప్పుడు ముందస్తు షరతు. “ఉద్యమం మనసుకు తృప్తినిచ్చింది. కానీ కడుపుకు తిండి పెట్టే పరిస్థితిలో లేదు”. నీ మిత్రుడే నిన్నుపట్టిచ్చే ప్రయత్నం చెయ్యటంకన్నా ఈ పరిస్థితికి వివరణ ఎందుకు?

ఈ కడగండ్ల ప్రయాణం పొడుగునా నీ వీపున మోస్తున్న నీ బిడ్డ- అది నిజానికి నీ అస్తిత్వానికి మిగిలిన ఆఖరి ఆధారం కదా! దాన్ని బతికించుకోటానికి ఇంత చోటుకోసం ఫూలో కర్మను యాచించటానికి సైతం సిద్ధపడ్డావు. ఆమె కూడా నీ జాతి మనిషనే నమ్మకం తప్ప, మీ ఇద్దరి నడుమ పెరిగిన గోడలను చూసే దృష్టిని నీ నిస్సహాయత కప్పి వేసిందేమో!

నీ ప్రాణం కోసం …అంతకన్నా ఎక్కువగా నీ ఉనికికే చిహ్నమైన నీ బిడ్డకోసం, నువ్వు వద్దనుకున్న తుపాకినే నమ్ముకున్నావు.”ప్రగతినగర్” భూభాగం నుంచి అడవిలోకి పరుగు తీశావ్!
* *
ఇంతటితో నీ ప్రయాణం పూర్తయినట్టేనా? నీ లక్ష్యాన్ని చేరుకున్నట్టేనా? ఏమో, నువ్వే చెప్పాలి దస్రూ! చిట్ట చివరి గమ్యాన్ని ముందుగానే నిర్ణయించుకుని నడక మొదలెట్టటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ నిశ్చయం ఉన్నవాళ్లు ఎలాగూ దృఢంగానే నిలబడతారు. వాళ్ళ సంఖ్య ఇప్పటికి పరిమితమే. అనివార్యంగానో, అగమ్యంగానో ఒక మార్గంలోకి అడుగు పెట్టిన నీవంటి వాళ్లే అత్యధికంగా ఉన్నారు కదా! ఏ ముగింపునైనా నిర్ణయించేది మీరే. నిజానికి దస్రు, అనబడే నువ్వు ఒకేఒక వ్యక్తివి కాదు. ఎందరో సామాన్యులకు ఒక గుర్తువి. మీ చుట్టూ ఎన్నోబతుకుభయాలు, ఒత్తిడులు, ప్రలోభాలు! వలస పోతున్నఆదివాసీ కూలీల్లో, “ఈ యూనిఫాం తొడుక్కోవటం నా నిర్ణయం కాదు, అనివార్యం” అన్న ఆ ఆదివాసీ కాన్స్టేబుల్ లో, నిన్ను పట్టివ్వకపోతే తన ముగ్గురు పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందంటూ విలపించిన ఆ చిరువ్యాపారిలో, ఫూలో ఇంటిముందు పడిగాపులు పడే ఆ నిరుపేదల్లో నువ్వున్నావు. వాళ్ళ నిస్సహాయతలో, అసంతృప్తుల్లో, అణిచిపెట్టుకున్న ఆగ్రహంలో కూడా నువ్వున్నావు. వీటన్నిటినీ ఏ రూపంలో నీలోకి తీసుకుంటావ్? నీ జీవితానుభవాలను నువ్వెలా అర్థం చేసుకుంటావ్? ఇప్పటికే వేసివున్న బాటలో నిస్సంకోచంగా నడిచి పోతావా? నీ భయాలకూ, సందేహాలకూ జవాబులు చెప్పే దిద్దుబాట్లను డిమాండ్ చేస్తావా? “బషాయి మార్గం” అనే ఒక కొత్త పోరాట పంథానే నిర్మిస్తానని అప్పుడెప్పుడో ప్రకటించిన బషాయి టుడు ఆకాంక్షను నిజం చేస్తావా? అడవిలోని నీ ఉద్యమ ఆవరణాన్ని మైదానాల దాకా విస్తరింప చేస్తావా? నువ్వే చెప్పాలి దస్రూ !

నాగేటిచాళ్ళ మీదుగా నడిచి వస్తావో, నగరాల వీధుల్లో పోటెత్తుతావో కానీ, పరుగులో అలసిన నీ ఊపిరి చప్పుడునూ, ఎండుటాకులపై నీ అడుగుల అలజడినీ వింటూనే ఉంటాం నీ రెండవ రాకడ దాకా!

( దేవాశిష్ మఖీజా కథ రాసి, దర్శకత్వం వహించిన “జోరం”లో దస్రూని చూశాక )

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

2 thoughts on “దస్రూతో కొన్ని మాటలు

  1. ఇది సమీక్ష కాదు: అంతరంగ ఆరాటం. ఒక బలమైన జీవనకాంక్షను అక్షరాల్లోకి వొంపడం.
    ‘నాగేటిచాళ్ళ మీదుగా నడిచి వస్తావో, నగరాల వీధుల్లో పోటెత్తుతావో కానీ, పరుగులో అలసిన నీ ఊపిరి చప్పుడునూ, ఎండుటాకులపై నీ అడుగుల అలజడినీ వింటూనే ఉంటాం నీ రెండవ రాకడ దాకా!’
    ఆశావహమైన యీ ముగింపు సమీక్షని సృజనాత్మకంగా మలిచింది కాథాయని గారూ!
    థేంక్స్ ఫర్ దిస్ రైటప్.

Leave a Reply