దస్తఖత్

నేనిప్పుడు మాట్లాడుతుంది
దావూద్ ఇబ్రహీం గురించి కాదు
అబూసలేం ఊసు అసలే కాదు
వాళ్లంటోళ్ల శరీరాల కింద
మెత్తటి పరుపులై నలుగుతున్న
పింజారీ పీర్ సాయిబుల గురించి…
వివర్ణమైన బతుకుల్ని
రంగునీళ్ల తొట్లలో
తరతరాలుగా నానబెట్టుకుంటున్న
రంగ్రేజ్ రసూలన్న గురించి…
నిగిడిన ఖద్దరు చొక్కాల మధ్య
మడతలై నలుగుతున్న
దోభన్ బీబీజాన్ సంతు గురించి…
పందెపు గుర్రాల డెక్కల కింద
నాడాలై అరుగుతున్న
లద్దాఫ్ లతీఫ్ ఖాన్ ఖాందాన్ గురించి…
మతం మారితే
కులం మారితే
కన్నీళ్లు కరగవు కరీం భాయ్!
ఇప్పుడు నోట్లోకి వెళ్లే
నాలుగు ముద్దలే కాదు సమస్య
ఈ గడ్డ మీద నీ ఉనికే ఓ పోరాటం
కర్ణుడి కవచకుండలాలంత సహజంగా
పుట్టుకతో అబ్బిన వర్గాల బురఖాలనీ
మన అసమానత్వపు పరదాల్ని
చిరునవ్వుతో చీల్చుకుంటేనే కదా వూడిపడేది
ముస్లిములంటే సుల్తాన్లూ అమీర్లే కాదు
జారిపోయిన కండల్ని కూడ దీసుకుని
మార్కెట్టు రొచ్చులో
మాంసం కొట్టే ఖాదర్ కూడా సాయిబే
అకాలంగానో సకాలంగానో వచ్చే ఎన్నికలు
ఆపద్ధర్మపు మనుషుల్ని ఓటర్ల జాబితాలో వెదుకుతాయి
ఎజెండాలు రంగులద్దుకొని
కమానులకు తోరణాలవుతాయి
వరదలై పారే వాగ్దానాలకీ
గుప్పెడు అక్షరపు మెతుకులు పెట్టే హక్కులకీ
అలౌకిక రాజకీయమే కాదు
నమ్ముకున్న మతమూ అడ్డుగోడవుతుంది
జీ హుజూర్!
ఇప్పుడు దర్జీలుగా, ఖసాబ్ లుగా
గోర్కన్లుగా హజ్జాంలుగా
అంతరాల తలపాగాల్ని మోస్తున్న
గడ్డం సాయిబులే కన్పిస్తున్నారు
మదరసా గోడల మధ్య
బిక్కు బిక్కుమంటున్న
బాల బురఖాలే దోబూచులాడుతున్నాయి
ఎక్కడో మిగిలిన నమ్మకాన్ని
హరేక్ మాల్ బళ్లలో వేసుకుని
బొంగరాలై తిరుగుతున్న బడేమియాలే
గల్లీ గల్లీకి కన్పిస్తున్నారు
ఈ దేశపు దివాన్ కి
దళిత ముసల్మానుల ఆకలి తెలీదు
నా దేశంలో దళిత ముస్లిం
నిర్భయంగా నడిచే రోజుని స్వప్నిస్తున్నా!
బూబమ్మ ఇంటికి
బుక్కెడు బువ్వని తెచ్చే
శ్వేత రాయితీ పత్రం మీద
తొలి దస్తఖత్ నవుతున్నా!

(మన నాయకులకు విన్పించని వీధి బాలల నిరక్షర ఆర్తనాదాలు విన్పించుకున్న ఆ మూడో మనిషికి … సచార్ భయ్యా కి… షుక్రియా !) (22-8-2007)
‘వేకువ రాగం'(కవితా సంపుటి)

పుట్టింది ఏలూరు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్, డీ.కే.డబ్ల్యు కళాశాలలో విద్యాభ్యాసం. ఆంధ్ర విశ్వ విద్యాలయం/ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయాల్లో M.A, Ph.D, TCH (Teacher's Training), Diploma in Computer Application. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో అధ్యాపకురాలు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ గా పని చేశారు. 'అంతర్జాలంలో ని తెలుగు సాహిత్యం' అనే అంశం పై ప‌రిశోధ‌న చేశారు. వివిధ సాహిత్య అంశాలపై జాతీయ సెమినార్లలో 30 కి పైగా పత్ర సమర్పణలు చేశారు. తెలుగు మహిళా వెబ్ మాస పత్రిక 'విహంగ' 2011 జనవరిలో ప్రారంభించారు. 9 ఫిబ్ర‌వ‌రి, 2019న తుదిశ్వాస విడిచారు. ఆమె తేవాలనుకున్న ' వేకువ రాగంస‌( కవితా సంపుటి) , 'నీలికస‌ ( వ్యాస సంపుటి)ఆమె తదనంతరం ఆమె భర్త ఎండ్లూరి సుధాకర్, కూతురు మానస ఎండ్లూరి ప్రచురించారు.

Leave a Reply