దళిత మల్లయ్య ప్రశ్నతో… మార్పు చెందిన గ్రామం “నిరుడు కురిసిన కల” నవల

తెలంగాణా నవలా సాహిత్యంలో చాలా వరకు గడీల దొరల పాలన, ప్రజాపోరాటాలు, ఉద్యమాలు, ప్రజలపై దొరల ఆగడాలు, హింస చిత్రించబడ్డాయి. ఆ కోవలోనే వట్టికోట రాసిన ప్రజల మనిషి, గంగు, బొల్లిముంత శివరామకృష్ణ మృత్యుంజయులు, దాశరథి రాసిన చిల్లర దేవుల్లు, మోదుగుపూలు, జనపదం, మహీధర రామమోహన్ రావు “ఓనమాలు”, “మృత్యువు నీడల్లో”, పమిడి ముక్కల లక్ష్మీకాంతమోహన్ ‘సింహగర్జన’ ఇలా అనేక నవలలు వచ్చాయి. ఈ నవలల్లో తెలంగాణ సమాజం ఒక స్థిర బిందువుగా కాకుండా దాని గతిలో, పరివర్తనలో పరిణామం చిత్రించబడింది. ఆ కాలపు తెలంగాణాలో భూ సంబంధాలు, పోరాట క్రమం ప్రతిఫలనాలు వివరించబడ్డాయి. వీటన్నింటికి భిన్నమైన దొర గడీ పాలన. ఆ పాలన మార్పు గురించి వివరించిన నవల.

బి. మురళీధర్ గారు రాసిన “నిరుడు కురిసిన కల” నవల 1995 అక్టోబర్ నుండి జనవరి 1996 వరకు (14) భాగాలుగా ధారావాహికంగా ప్రచురించబడింది. ఆంధ్రప్రభ క్లాసిక్ వీక్లీ ప్రకటించిన నవలల పోటీకి పంపటం మొదటి బహుమతి గెల్చుకోవటం ఈ నవలకు దక్కిన గౌరవం ఈ నవల 2016లో ముద్రించబడింది.

ఆదిలాబాద్ జిల్లా సోనాలా గ్రామంలో పుట్టి పెరిగి గ్రామీణ రైతాంగంతో మమేకమయ్యే వృత్తిని ఎంచుకొని వ్యవసాయ శాఖ విస్తరణాధికారిగా 150 గ్రామాలకు పనిచేసి అపారమైన అనుభవాలతో రచనలు చేశారు రచయిత. 100 సం॥ల క్రితం రచయిత ప్రాంత గ్రామీణ వృత్తి కళాకారుడు తయారు చేసిన వారి ఇంటి జూను, ఇంటెద్దుల మూపుపై కప్పి అలంకరించే వస్త్ర విశేషాన్ని ముఖచిత్రంగా వేయటం, దాని గురించి వివరించి రాయటం రచయిత పరిశీలనకు, అవగాహనకు గొప్ప నిదర్శనంగా భావించవచ్చు.

రచయిత తండ్రి బి. లక్ష్మణ్ 1952లో ఉపాధ్యాయ వృత్తిలోకి చేరాడు. ఉపాధ్యాయ వృత్తిలోని అనుభవాలు, వారి జీవనశైలి, ప్రేరణ, తండ్రి జీవించిన కాల ప్రభావం రచయితపై చూపాయి. ఒక మారుమూల గ్రామానికి పనిచేయటం, నిరక్షరాస్యులైన ఆ గ్రామ ప్రజల వెనుకబాటు తనం, అమాయకత్వం, ఎలాంటి దౌర్జన్యం వారిపై జరిగినా మౌనం వహించిన ప్రజలు నిస్సహాయత ఇవన్నీ లక్ష్మణ్ గారిని కదిలించాయి. గాంధీజీ సిద్ధాంతాల ప్రభావంతో ఆదర్శప్రాయంగా వృత్తి ధర్మాలను మనసా వాచా, కర్మణా నిర్వహించిన ఉపాధ్యాయులలో లక్ష్మణ్ గారు ఒక్కరు. బడిలో పిల్లలతోనే కాకుండా, వూరి ప్రజలతో కూడా ఉపాధ్యాయులకు ప్రత్యక్ష సంబంధాలున్న రోజులవి. పిల్లలకే ఉపాధ్యాయుడుగా కాకుండా వూరి మొత్తానికి గురువుగా భావించే రోజులు.

అలాంటి రోజుల్లో బి. లక్ష్మణ్ వృత్తి జీవితంలో ఎదురైన అనేక సవాళ్ళను సమస్యలను ఎదుర్కొన్నదీ మురళీధర్ గారికి అప్పుడప్పుడు కథలుగా ముచ్చట్లను ఎంతో నాటకీయంగా చెప్పేవారు. దాంతో మురళీధర్ గారు ఉపాధ్యాయుడైన తన తండ్రినే పాత్రగా మలిచి వాస్తవ సంఘటనలకు కొంత కల్పనను, నాటకీయతను జోడించి ఈ నవలను రాసినట్టుగా రచయిత ముందే ప్రస్తావించారు. నైజాం పాలనలో విస్తృతాధికారాలు సంక్రమించిన దొరల నిరంకుశ పాలనలో అమాయక ప్రజలు పీడనకు, అణచివేతకు గురైన ఒక మారుమూల తెలంగాణా గ్రామాన్ని, దొర కబంధ హస్తాల నుండి విముక్తి చేయటమే కాకుండా దొరలో మార్పు తెప్పించిన ఒక ఉపాధ్యాయుడి చుట్టూ తిరిగిన ఇతివృత్తం ఈ నవల.

ఒక ఊరు అనేక రకాల కుల వృత్తులు. తమలో తాము పరస్పర ఆధారిత జీవన విధానం. కులాలకు అతీతంగా మామ, అక్క, బావ అని పిలుచుకునే ఆప్యాయపు పలకరింపులు. ఆ గ్రామ ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు, భూమి సమస్య ఈ నవలలో చిత్రించబడింది. నవల ప్రారంభం 15వ ఆగష్టు 1952లో పాఠశాలలో జరిగే జెండా వందనంతో ప్రారంభమైంది. పాఠశాల హెడ్మాస్టరు లక్షణరావు, స్వాతంత్య్రం వచ్చి ఐదు సంవత్సరాలైనా ప్రభాతభేరీ ఎప్పుడూ హరిజన వాడకి పోలేదు. తరగతి గదిలో హరిజన పిల్లలు విడిగా కూర్చునే పరిస్థితి నెలకొన్న రోజులు.అలాంటి పరిస్థితిలో వచ్చిన లక్ష్మణరావు ఆ రోజున గ్రామ ప్రజల్ని ఉద్దేశించి, స్వాతంత్య్రం సిద్ధి గురించి రాజ్యాంగం, ప్రజాతంత్ర్య లౌకికరాజ్యం గురించి, కుల మతాలు లేవని, మనిషికి తెలివిని బట్టే విలువ, గుణం ఉంటుందని ఇలా అనేకాంశాలు తన ప్రసంగంలో ప్రస్తావిస్తాడు. అవి విన్న మల్లయ్య దళిత వాడలో తన ఇంటికి వచ్చి చాయ్ త్రాగాలని సవాల్ చేస్తాడు. దాంతో అంటరాని తనం అంతగా వ్యాపించి ఉన్న ఆవూళ్ళో, హెడ్మాస్టర్ దళితవాడ కెళ్ళి చాయ్ తాగటమే కాకుండా, గ్రామంలో సహపంక్తి భోజనాలు చేయటం అనే సంఘటన రకరకాల ఆలోచనలు రేపింది. ఒక అత్యంత ప్రధానమైన మార్పుకి ఆ వూరిలో బీజం పడ్డది.
రావుసింగ్ సాబ్ దొర, అందరినీ శాసించిన దొరతనం. ఆ వూరి ప్రజల్ని భయపెడ్తూ భూముల్ని దొర స్వాధీన పర్చుకున్న తీరు, వారిని హింసించటం. దొరలుగా చలామణి అవుతూ గ్రామ ప్రజల్ని గుప్పిట్లో పెట్టుకున్న పరిస్థితులు ప్రస్తావించబడ్డాయి. అలాంటి పరిస్థితుల్ని అహింసా సిద్ధాంతంతో తారుమారు చేస్తూ ప్రజల్ని చైతన్యం చేసిన స్థితి. లక్ష్మణరావుని చూసిన తర్వాత ఆ వూరి ప్రజలకు దొర వలన కలిగే భయం మెల్లమెల్లగా కరిగిపోతుంది. మునుపెన్నడూ లేని భద్రతా భావం, భరోసా వారి మనసుల్ని ఆవహిస్తుంది.

గ్రామాల్లో ప్రజలు చేసుకునే పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పంట దినుసులులిలా అనేకాంశాలు ఈ నవలలో చర్చించబడ్డాయి. ఊళ్లో మైసమ్మ కోసం ‘మనిషికోడి దించడం’, పొలాల పండుగ, ఉప్పుల పండుగ, బరువులు దించుడు, జూనులు (వస్త్రాలంకరణ), దోరణం దెంపుడు, మంటెడ్ల పొలాల, పల్లెవాసుల యువతీయువకుల్లో అంతర్గతంగా దాగివున్న చైతన్యాన్ని, నిపుణతను, బొడ్డెమ్మ, బతుకమ్మ, అనేక పూల రకాలను, విజయదశమి, మొహరమ్ పండుగ, కందోరి, విదూషకుడి వేషాలు, ఎరుకలసాని సోది, అలాయి ఆట, హెూటల్లో చాయ్ పోయడానికి చూపించిన కుల వివక్ష, హరిజనవాడ నాస్ కోపరేషన్, పెళ్లిలో ఎన్నికులాల భాగస్వామ్యంతో జరుగుతుందనే వివరణ, ఎస్.సి., ఎస్.టి. ఆక్ట్ గురించి, బాకీ కింద ప్రజల భూములను దోచుకున్న దొర చేసిన మోసం, కులాంతర వివాహం జరపడానికి పడ్డ సంఘర్షణ, మద్యం సేవించటం వల్ల జరిగే నష్టాల గురించి, ఉగాది పండుగ ఉత్సవం, జడకొప్పు కోలాటం, సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే దొరికే జొన్నకంకి పిస్కుళ్ళు, ‘ఆముళ్లు’ కాముని పున్నమి ఇలా అనేక విషయాలు ఈ నవలలో చర్చించటం రచయిత గ్రామాలను, గ్రామ ప్రజల తీరుతెన్నులను, జీవన విధానాలను పరిశీలించిన తీరుకు నిదర్శనంగా చూడవచ్చు. తెలంగాణకు వారసత్వంగా లభించిన అద్భుతమైన జానపద కళారూపాలనీ, తమ చుట్టూ వున్న ప్రకృతి నుండి నేర్చుకున్న పల్లెవాసుల సృజనాత్మక నైపుణ్యాలని సందర్భోచితంగా సోదాహరణంగా నాటకీయంగా చెప్పారు.

ఈ నవలలో పాఠకులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన దొర మార్పు. గ్రామ ప్రజల్ని చైతన్య పరిచిన అంశం నుండి, భూముల కోసం దొర ఇంటి ముందు నిరసనకు దిగటం వరకు, జరిగిన అన్ని కార్యక్రమాలకు కారకుడైన లక్ష్మణరావు గారిని దొర భౌతికంగా నిర్మూలించడానికి అపనిందలకు గురిచేయడానికి, ఊరి నుండి ఉద్యోగ రీత్యా బదిలీ చేయడానికి, ప్రజల నుండి దూరం చేయడానికి ఇలా అనేక రకాల ఎత్తు గడలు, కుట్రలు, కుతంత్రాలు చేశాడు. ఇలాంటి ఏ విషయంలో దొర సఫలీకృతుడు కాలేకపోయాడు. చివరికి లక్ష్మణరావుని ఒక ఆదర్శప్రాయుడుగా భావించటం జరుగుతుంది.

ప్రజల నుండి దోచుకున్న భూముల్ని దొరనుండి స్వాధీనపర్చుకోడానికి దీక్షవహించిన ప్రజలు మౌనంగా గడీవైపు ముఖాలు పెట్టి కూర్చుంటారు. ఈ ఉద్యమానికి మూలకారకురాలైన ముసలామె పొచ్చమ్మ నోటికి దొర నిమ్మరసం గ్లాసు అందించాడు. ఈ విషయంలో రచయిత గాంధీగారు, బ్రిటిష్ వారిపై ప్రయోగించిన అహింసా అస్త్రంగా ప్రస్తావిస్తాడు. దొర స్వయంగా నిమ్మరసం తెచ్చి ఇవ్వటం, ఆ గ్రామ ప్రజలు తమ జీవితంలో కనీసం కలలోనైనా చూడలేని ఒక అద్భుతమైన దృశ్యంగా స్థానువులై చూశారని చెప్పబడింది. పాఠకులను కూడా ఒకింత ఆశ్చర్యానికి, అద్భుతానికి లోను చేస్తుంది.

మరొక అంశం ప్రేమ. భోజన్న బిడ్డ నీల, గొల్ల బాపన్న కొడుకు దేవన్న ప్రేమించుకుంటారు.కులాలు వేరు. ఎన్నో చర్చలు, కోపాలు, సంఘర్షణల తర్వాత లక్ష్మణరావు నచ్చజెప్పి వివాహం జరిపిస్తాడు. ఊర్లో మార్పువైపుకి ఒక కొత్త శకం మొదలైంది. హరిజనవాడ శుభ్రం పర్చుకోవటం, పొరుగూరి నుండి చదువుకోసం వచ్చే పిల్లలకు హాస్టల్ వసతి ఏర్పర్చటం. దొర హింస నుండి విముక్తి. దొర లాక్కున్న భూములు స్వాధీన పర్చుకోవటం, కులాంతర వివాహం జరిపించటం, ఊరిని ఆ దశకు తెచ్చిన ఊరు పెద్దలు లక్ష్మణరావు, మల్లయ్య, మారిన దొర, సంస్కర్తలు రోజూ చెట్టు కింద సమావేశం అవుతుంటారు. చిన్న చిన్న తగవులు పరిష్కరిస్తుంటారు. ఊరి పెద్దలు చూస్తుండగానే ముసలివారయ్యారని చెప్పే అంశాన్ని రచయిత చమత్కరించిన తీరు

బాగుంది. తమ ఊరుని చూసుకొని గర్వపడుతూ, మీసాలు దువ్వుకుంటూ వుండగానే కాలం వారిని మాటల్లో పెట్టి ముందుకురికింది. వారి మీసాలు తెల్లబడేటట్లు చేసింది అనటం. బోధివృక్షం లాంటి చెట్టు కింద రచ్చబండ మీద ఆ ముగ్గురూ ! తమ వారసత్వాన్ని రాబోయే తరానికి కట్టబెట్టాలని శాయశక్తులా ప్రయత్నించి ఆధునిక నాగరికతా జీవన ప్రవాహవేగానికి ఫెళ ఫెళమని కూలిపోయిన మానులు వాళ్ళు ! అంటాడు. వాళ్ళు ఎవరు ? అంటే 25 సం॥ల క్రితం తన గడీ ముందు నుండి చెప్పులు తొడుక్కొని తన ముందూ ఎవరూ తలెత్తుకొని నడువద్దని శాసించి, ఆ వూరినే గడగడలాడించిన శాసించిన దొరనీ, గడీని గడగడలాడించి ఆ దొరనే జన జీవనంలో కలిసిపోయేటట్లు చేసి ఆదర్శగ్రామానికి అర్థం చెప్పిన ఒకప్పటి హెడ్మాస్టరు లక్ష్మణరావు! లక్ష్మణరావు తల పెట్టిన మహాయజ్ఞాన్ని దుష్టశక్తుల బారి నుండి కాపాడి మార్పుని స్వీకరించడానికి తనవాళ్ళందరినీ సంసిద్ధులను చేసిన సాహసవీరుడు దళిత మల్లయ్య. ఇప్పుడు ఆ వూరికి గాని, యువతకు గాని ఆ ముగ్గురెవరో, వారి సాహసాలు గాని తెలియవు అంటాడు రచయిత.

ఇరవై అయిదేళ్ళ క్రితం అనటం వల్ల 1952 ఆగష్టు 15 నుండి నవలా ప్రారంభం అయినప్పుడు 1952+25=1977 సం॥లో ఆ ముగ్గురి సాహసాలు తెలియవు అనటంలో కొంత ఔచిత్యం కోల్పోయింది. ఎందుకంటే 1990-91 ఆర్థిక సరళీకృత విధానాలు రావటం చాలా అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కుర్రకారులో వెర్రితలలు మొదలయ్యాయి. పండుగలు పబ్బాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు ఒక్కటేమిటి అన్నింట్లో కొత్త పోకడలే వచ్చాయి. అవన్నీ ఇక్కడ చర్చించలేము. ఆ ముగ్గురి ఆదర్శాలతో, త్యాగాలతో, రంగుల చిత్రంలా వెలిగిన వూరు ఒక నిరుడు కురిసిన కలగా మిగిలిపోయిందని రచయిత ఆవేదన చెందుతాడు. ఇక్కడ నిరుడు అంటే పోయిన సంవత్సరం అని మనం అనుకుంటాం. నిరుడు గడిచిపోయిన కాలం కింద పరిగణనలోకి తీసుకోవాలి.సమాజ పరిణామక్రమంలో వచ్చిన మార్పులకి వారు తలవొగ్గక తప్పలేదు. ప్రేమతో నిర్మించుకున్న ఆదర్యాన్ని నిట్టనిలువునా కూల్చేసి సమాధి చేశాయి అంటాడు. అంటే ఎలాంటి మార్పునైనా మంచైనా,చెడైనా స్వీకరిస్తూ గుంపులో గోవిందలా బ్రతకటం అలవాటు చేసుకున్నారు. దొర నుండి విముక్తి చెందిన గ్రామం కుల, వర్గం,రాజకీయంగా, బాధ్యతారహితంగా అన్ని అలవాట్లకూ బానిసైన యువత, మద్యం, టి.వి. ఛానల్స్ వంటి విషబీజాల వల్ల గ్రామీణ జీవితం విధ్వంసం అయినట్టుగా ముగుస్తుంది. గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలనే బలమైన ఆకాంక్ష రచయిత వ్యక్తం చేస్తాడు.

ఆ వూరికి ఒకప్పుడు దొర ఒక్కడే దుష్టుడూ – నిరంకుశుడూ ప్రమాద కారిగా వున్నాడు. కాని ఇప్పుడూ దొరకొడుకులు పట్నంలో చదువులు చెడు సావాసాలు, విలాసాలు, తండ్రిని అనేకసార్లు కొట్టడం జరిగింది. లక్ష్మణరావు కొడుకులు పెద్ద చదువులు చదివినా లంచాలు ఇచ్చుకోలేక స్వశక్తిని నమ్ముకొని వ్యవసాయం, వ్యాపారం చేస్తూ బ్రతుకుతారు. మల్లయ్య కొడుకులు చెరొక రాజకీయ పార్టీలో చేరి కులానికి కేటాయించిన పదవుల్లో చేరి మనుషుల్ని కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజించి జనం కళ్ళల్లో దుమ్ముకొడుతూ సాగిపోతారు.అధికారం చేజారినప్పుడల్లా తిరిగి సంపాదించే ప్రయత్నంలో పది పది శవాలకి సామూహిక దహన సంస్కారాలు జరుగుతుంటాయి. ఆనవాయితీగా దళితులపై అత్యాచారాలు జరగటం, వూరి జనాలు రాజకీయ నాయకుల బహిరంగ సభలకు వెళ్ళటం చెమటోడ్చని డబ్బుపై మోజు పెరిగిపోవటం. ఊరి నడిబొడ్డన బార్ కమ్ రెస్టారెంట్లు, నిస్వేదపు సంపద ఎరులై పారటం, ఎంతో ఆశించి ఆ ముగ్గురు సంస్కర్తలు నాటిన ఫలవృక్షాలకు నేడు విషఫలాలు విరగకాస్తున్నాయి. ఇంతింతై పెరుగుతున్నాయి అని రచయిత ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు.

సుక్షేత్రమైన పవిత్ర భారతదేశంలో విషబీజాలు నిండా చల్లబడ్డాయి. ఆ ముగ్గురు కలల పంటలా నిర్మంచుకున్న ఊరు, ఇలా అనేక ఊళ్ళు కూడా ఒక నిరుడు కురిసిన కలలా మిగిలిపోనుందా ? అని ప్రశ్నిస్తూనే, లేదని అంటాడు. ఆ నిరుడు కురిసిన కల నిజమై తీరాలి అనే ఆశాభావాన్ని ఆకాంక్షను వ్యక్తం చేశాడు రచయిత, స్వతంత్ర సిద్ధికి అహింసా సిద్ధాంతమే పనిచేసినట్లుగా నవలలో చిత్రించబడింది. వెనుకాల ఉ ద్యమాలు, పోరాటాలు, స్వాతంత్య్ర పోరాటం, ప్రాణత్యాగాలు లేవా? అనే ప్రశ్న రాక మానదు.

పైన పేర్కొన్న విషబీజాలు అంతం కావడానికి అహింసా సిద్ధాంతమే, గడీ మార్పు జరిగినట్టుగా రచయిత అభిప్రాయం. నాడు వూరి మార్పుతోనే సమాజం మారుతుందని లక్ష్మణరావు ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు. దోపిడీకి ప్రతిరూపమైన గడీల కొనసాగింపే, రూపం మార్చుకొని, నేడు ప్రపంచీకరణలో గ్రామం ఒక కుగ్రామంగా మారి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసమైన తీరు అహింస సిద్ధాంతంతో సాధ్యమవుతుందా? అనే ప్రశ్న తలెత్తక మానదు.

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply