దళిత జీవితానుభవాల కథనాలు: ఇనాక్ కథలు

కొలకలూరి ఇనాక్ గారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యాపకులుగా నాకు1977 నుండి తెలుసు.అప్పుడే ఎమ్మే పూర్తయి అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించి , పరిశోధన, విమర్శన ఆసక్తులతో ఉన్ననేను అనేక వేదికల నుండి ఆయనను వింటూ తెలుసుకొంటూ వచ్చాను. మొదట నన్నుఆకర్షించింది క్షేత్ర స్థాయి సమాచార సేకరణ మదింపులతో కూడిన ఆయన పిహెచ్ డి పరిశోధన గ్రంథం ‘వ్యాసపరిణామము’. 1974 లో ప్రచురించ బడింది.ఎన్ని గ్రంధాలయాలు గాలించారో, ఎన్ని పత్రికలు తిరగేశారో, ఎంతమందితో ఎన్నిసంభాషణలు చేసి ఆచూకీ రాబట్టారో… వేల కొద్దీ వ్యాసాలను, వ్యాస సంకలనాలను సేకరించి వర్గీకరించి, విశ్లేషించి తెలుగులో వ్యాస ప్రక్రియ పరిణామ వికాసాలను వివరించిన పుస్తకం ఇది. పరిశోధకులు ఎవరైనా సరే , పరిశోధన విషయం ఏదైనా సరే, సంప్రదించ వలసిన ఒక ముఖ్య రచనగా ఒక విలువను పొందిన పరిశోధన అది. స్త్రీల సాహిత్య సేకరణ అధ్యయనాలపట్ల ఆసక్తి ఉన్న నాకు బుద్ధిజీవులుగా స్త్రీల ప్రయాణం ఎక్కడ ప్రారంభమై ఎలా కొనసాగిందో తెలుసుకొనటానికి ఆ పుస్తకం ఎంతో ఉపకరించింది. అందువల్లే దాని పట్ల ప్రేమ , గౌరవం . ఆ పుస్తకం తో పాటు ఆయన వెలువరించిన సాహిత్య విమర్శ వ్యాసంగం ఎంతో ఉంది. వాటి గురించి ప్రత్యేకంగా చర్చించాలి. అంతకంటే ముందు ఆయన కథకుడు, నవలా రచయిత. కవిత్వం , నాటాకాలు వ్రాసాడు. ఈ సృజన సాహిత్యం గురించి ముందు మాట్లాడుకుందాం.

1939 లో గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామం మాదిగ పల్లెలో వీరమ్మ కన్న కొడుకు కొలకలూరి ఇనాక్. తండ్రి రామయ్య. చేపల చెరువు కాపలాదారుడి కొడుకుగా బాల్యంలోనే కుటుంబపు బతుకుతెరువు పనుల భారం పంచుకోక తప్పలేదు. అయినా ఉత్సాహాన్ని నింపుకొంటూ వేజండ్ల నుండి గుంటూరు దాకా ప్రయాణిస్తూ బడి చదువు కొనసాగించారు ఇనాక్ .గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆనర్స్ పూర్తి చేసి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా తీసుకొన్నారు. గుంటూరులో అధ్యాపక జీవితం ప్రారంభించి, చిత్తూరు, కాకినాడ అనంతపురం కాలేజీలలో పనిచేసి తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగువిభాగంలోకి ప్రవేశించి అక్కడి నుండి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగువిభాగంలో చేరి అనంతపురంలో స్థిరపడ్డారు. మళ్ళీ శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా వెళ్ళటం ఆయన అభివృద్ధి క్రమాన్ని సూచిస్తుంది. అర్ధశతాబ్దికి పైగా అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా , ఉపన్యాసకుడుగా, పనిచేసిన చోటనల్లా వివిధ అధికార పదవీ బాధ్యతలను నిర్వహిస్తూ తనదైన ముద్రను వేసిన కొలకలూరి ఇనాక్ పదవీ విరమణ పొంది హైదరాబాద్ లో స్థిరపడినా ఎనభై ఏళ్ల వయసులో ఇప్పటికీ రచనావ్యాసంగం నిత్యోత్సాహం తో కొనసాగిస్తూనే ఉన్నారు. తన సాహిత్య కృషికి గాను తొలి నుండి బహుమతులతో గౌరవించ బడుతూ వచ్చిన ఇనాక్ తరువాత తరువాత అందుకొన్నఎన్నో అవార్డులలో పద్మశ్రీ , మూతిదేవి, సాహిత్యఅకాడెమీ పురస్కారాలు ఉన్నాయి. ( మధుజ్యోతి “నాన్న”2014 & విహారి – అద్వితీయ 2019)

ఇంటర్ మీడియేట్ చదువుల కాలంలోనే జాషువా పద్యాలు వినటంతో ఇనాక్ లో సాహిత్య అభిరుచుల బీజావాపనం జరిగింది. కవిత్వం , కథలు వ్రాయటం మొదలు పెట్టారు. 1954 లో ప్రచురితమైన ‘ఉత్తరం’ కథను తన తొలి రచనగా చెప్పుకొంటారు ఆయన. ఆరేళ్లకల్లా ‘గులాబీ నవ్వింది’(1960)కథా సంకలనం వచ్చింది.1967 లో ఆయన రెండవ కథా సంపుటి ‘భవాని’ ప్రచురించబడింది. మరొక ఐదేళ్లకు 1972 లో ‘ఇదా జీవితం’ కథాసంకలనం రానే వచ్చింది. ఈ మూడు సంకలనాలు అలభ్యం.

1969 లో వచ్చిన ఊరబావి కథ ఆయన కథా సాహిత్య ప్రస్థానంలో ఒక మంచి మలుపు. అక్కడి నుండి అప్రతిహతంగా సాగిపోతున్న కథా సృజన యానం ఆయనది. 1966 నుండి 72 వరకు ఏడేళ్ల కాలం మీద వచ్చిన తొమ్మిది కథలతో ‘ఊరబావి’ 1983 లోను, 1996 – 1999 వరకు వచ్చిన 19 కథలతో ‘అస్పృశ్యగంగ’ 1999 లోనూ, 1996- 2006 మధ్యకాలంలో వచ్చిన కథలతో ‘కొలుపులు’ 2006 లోనూ సంకలనాలుగా వచ్చాయి. 2007లో ‘కట్టడి’, 2009లో ‘కాకి’ 2010లో ‘సూర్యుడు తలెత్తాడు’ కథాసంకలనాలు వెంటవెంటనే వచ్చాయి. మళ్ళీ 2019 లో ‘చలన సూత్రం’, మనూళ్లలో మన కథలు అనే రెండు సంకలనాలు ప్రచురించబడ్డాయి. మొత్తం మీద ఆయన కథలు 250 కి పైగా ఉన్నాయన్నది ఒక అంచనా( అద్వితీయ). ప్రస్తుతం అందుబాటులో ఉన్న కథా సంకలనాల ఆధారంగా చూసినా 135 కథలు అధ్యయనానికి అందుబాటులో ఉన్నాయి.ఇనాక్ కథా వస్తు రూప వైవిధ్యాన్ని, వైచిత్రిని అర్ధం చేసుకొనటానికి చాలినంత కథా సాహిత్యం వున్నట్లే.

ఇనాక్ కథలు జీవితంలోని భిన్నఅనుభవాల కథనాలు. ఒక దగ్గర ప్రారంభమై గతంలోకి వర్తమానంలోకీ సందడి సందడిగా పచార్లు చేస్తూ విస్తరిస్తాయి. ఒక ఘటన చుట్టూ ఉండటానికి వీలున్న అనేకానేక విషయాల పరామర్శ, ప్రదర్శన కథనంలో భాగం అవుతుంటాయి. పరిసరాలను, వృత్తులను, ప్రవృత్తులను సూక్ష్మ వివరాలతో చిత్రించటం, వర్ణించటం ఇనాక్ కు ఇష్టమైన విషయం. అది ఆయన కథలను విజ్ఞాన సర్వస్వాలుగా చేస్తుంది. ముఖ్యంగా ఆయన కథా సాహిత్యం ఆధారంగా దళిత జానపద వస్తు జీవన సంస్కృతికి సంబంధించిన ఒక పదకోశము రూపొందించవచ్చు. చిన్నచిన్నవాక్యాలతో సంభాషణ నడపటం కూడా ఆయన కథన పద్ధతులలో ఒకటి. కాలం అంత నిర్దుష్టంగా లేకపోయినా చాలావరకు కథలలో స్థల నిర్దేశం ఉంటుంది. ఎక్కువ భాగం కథలుతెనాలి చుట్టు పక్కల గ్రామాలలో ముఖ్యంగా ఆయన పుట్టి పెరిగిన వేజండ్ల గ్రామంలో ప్రవర్తిస్తాయి. కాకపోతే అనంతపురం వంటి సిటీలలో.

అధ్యయన సౌలభ్యం కోసం ఇనాక్ కథలను కౌటుంబిక కథలు, దళిత జీవిత కథలు అని వర్గీకరించవచ్చు. కౌటుంబిక కథలు అంటే సాధారణ కుటుంబ జీవితానికి సంబంధించినవే కాక ప్రత్యేకంగా స్వీయ కుటుంబానికి చెందినవి కూడా. ‘మనూళ్లల్లో మాకథలు’ ఈ రెండో కోవకు చెందినవి. వీటిని ‘ఆత్మ కథాత్మక కథానికలు’ అన్నారు. ఇనాక్ తో పాటు ఆయన తల్లి, తండ్రి బంధువులు, గురువులు, ప్రజలు పాత్రలుగా, పుట్టి పెరిగిన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామం, అందులోని మాదిగపల్లె కేంద్రంగా జీవితం లోని కష్టసుఖాలు, సౌందర్యం సమస్తం వస్తువై వచ్చిన కథలు ఇవి. ఇనాక్ బాల్యానికి సంబంధించిన అనుభవాల కథనాలు ఇవి. 2018 మే నుండి 2019 మే వరకు ఏడాదిపాటు ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. జీవితం పట్ల మమకారం ఇనాక్ వ్యక్తిత్వం. పరిమిత ఆర్ధిక వనరులు, అపరిమిత సామాజిక ఆంక్షలు, అవరోధాల మధ్య కూడా కుటుంబ సంబంధాలలోని ప్రేమ సూత్రాన్నిఆయన అందిపుచ్చుకున్నారు . అందు వల్లనే కష్టాలు ఏకరువు పెట్టటం, కడవలు కొద్దీ కన్నీళ్లు కార్చటం ఆయన కథలలో కనపడదు. పరిమిత జీవనావకాశాల నుండే అపరిమిత జీవనోత్సాహపు చెలిమలు తవ్వుకొనే తత్వం ఇనాక్ కథల ప్రధాన లక్షణం.

ఒంటి నిట్టాడి ఇంటి స్థానంలో రెండు నిట్ఠాళ్ల ఇల్లు కట్టుకొంటున్నప్పుడు తల్లి తండ్రి , కూలీలు, మేస్త్రీ అందరూ పడిన శ్రమ సంరంభం, కష్టపడి కట్టుకొన్న ఇంటిపట్ల తల్లి పెంచుకున్న మమత్వం అన్నీ ఇల్లు కథలో అందమైన దృశ్యాలుగా రూపు తీసుకున్నాయి. శరీర కష్టం, శ్రమ ఫలితం అంతా కుటుంబం కోసమే కూడబెడుతూ డబ్బును అతి జాగ్రత్తగా వాడే తల్లి జబ్బు చేసిన బిడ్డను కాపాడుకొనటానికి అదే డబ్బు పట్ల ఎంత నిర్మోహం ప్రదర్శించగలదో గవదబిళ్ళలు కథలో చిత్రించారు. తల్లికి తండ్రికి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని, అవగాహనను ఇనాక్ బాగా గుర్తించారు. దానిని మిగిలిన కథలలోనూ సూచిస్తూనే ఉన్నాసంపూర్ణంగా దానిని బహు అందం గా ఆవిష్కరించిన కథ ‘పసుపుతాడు’.మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఉదాత్త శృంగార కథ ఇది. భారతదేశానికి ఇంకా స్వాతంత్య్రం రాకముందు క్రైస్తవ మిషనరీల నుండి శిక్షణ పొంది మాదిగ పల్లెలకు మత గురువులుగా పంపబడిన వాళ్లు , ప్రత్యేకం మాల మాదిగ పల్లె పిల్లలను విద్యావంతులను చేయటానికి పూనుకొనేవాళ్ళు వాళ్ళను చేరదీసి చదువులు చెప్పిన చరిత్రను , పాలుగారే పసితనంలో పశువులను కాసే పోరగాండ్లుగా మారిపోయే పరిస్థితులను అధిగమిస్తూ పల్లె పిల్లలు చదువు బాటన సాగటానికి పడే ఆరాటం ‘ప్రకాశం పంతులుగారు’ , ఏడిస్తేనే ఆనందం వంటి కథలలో నమోదు చేశారు ఇనాక్.

అలుసు, రాయేలమ్మ , యావ, దీపావళి వంటి కథలు (చలన సూత్రం) కూడా వేజెండ్ల గ్రామ కథలే. అలుసు స్వీయ అనుభవ కథనం. తల్లిపాల కథ. బిడ్డ మీదతల్లికి ఉండే అలివిమాలిన వాత్సల్యం పాలు కుడపటంలో పొందే తన్మయత్వంలో ఉంటే, తల్లి మీద బిడ్డకు ఉండే హక్కు పాలు తాగటంలో పొందే పారవశ్యంలో ఉంది. అది బిడ్డకు తల్లితో దృఢపరిచే సత్య శివ సుంద రాత్మకమైన బంధం ఈ కథలో భాగంగా మనకు అర్ధం అవుతుంది. ఏళ్ళు గడుస్తున్నా పాలుమానని బిడ్డచేత పాలు మాన్పించడానికి ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కానిది తల్లి గర్భవతి కావటంతో సాధ్యమైంది. చెల్లి పుట్టాక మళ్ళీ తల్లి పాలకు ఆశపడ్డ కొడుకును ‘సిన్న తల్లికి ఇవ్వాలి కాదా నాయనా, అని ‘అవి సెల్లి పాలు, తాగుతుందో పారబోసుకొంటుందో దాని ఇష్టం. నీవి కావు. ఆశ పడ కూడదు’ అని వారించి వాడిని ఒక జీవిత వాస్తవానికి అనుగుణంగా సర్దుకు పోయేట్లు ఒప్పించిన సున్నిత అతి సుందర మాతృత్వ ఆవిష్కారం ఈ కథ ముగింపును వెలిగింప చేసింది. మిగిలిన మూడు కథలలో వేజెండ్ల మాదిగపల్లె మంత్రసాని రాయేలమ్మ పల్లెకు వూరికి మధ్య అస్పృశ్యతకు సంబంధించిన హద్దులను చెరిపివేసిన జీవితావసరం అయిన విషయాన్నిగుర్తించి చూపింది. యావ కథలో ఎంకియ్య సంసారం ముచ్చట, దీపావళి కథలో పండగ సరదాలకు, సంబరాలకు పరాయీకరింపబడిన పేద రైతు కూలీ బిడ్డ ఆవేదన, అంతరంగంలో కలిగిన కల్లోలం, వచ్చిన విధ్వంశకర ఆలోచనలు, మేల్కొన్న వివేకంవల్ల ద్వేషం నశించి ప్రేమోదయం కావటం విషయం. మొత్తం మీద ఈ కథలలో మాదిగపల్లె మనుషులు, వాళ్ళ మధ్య ప్రేమలు, అధికారాలు, వాళ్ళ పనిపాటల సంస్కృతి , ఆహార సంస్కృతి అన్నీ తెలిసి వస్తాయి.

కుటుంబం మనిషికి బలం అన్నది ఇనాక్ దృష్టి. కనుకనే ఆయన కథలలో భార్యాభర్తల సంబంధంలో గానీ, తల్లిదండ్రుల పిల్లల సంబంధాలలో గానీ అత్తాకోడళ్ల సంబంధంలో గానీ ఘర్షణ ప్రధానం కాలేదు. అందువల్లనే అవి నొప్పిని, బాధను కాక సంబంధాలలోని అనుబంధాన్ని, అందాన్నిప్రతిఫలించాయి. కొత్త ఇల్లు కథలో తొలిచూలు పురిటికి పుట్టింటికి వెళ్లిన భార్య కొడుకును ఎత్తుకొని తిరిగివచ్చే నాటికి నాటకాలు వేసే స్త్రీతో వెళ్ళిపోయి ఇరవై ఏళ్ల తరువాత ఆమె చనిపోయి ఒంటరి అయిన క్షణాన గుర్తుకు వచ్చిన భార్యను ,కొడుకును వెతుక్కొంటూ వూరు చేరిన చలమయ్యకు భార్య కోడళ్ల శ్రద్ధ, సేవ చలివేందిరమే అయ్యాయి.తన నుండి ఏమీ ఆశించ కుండానే ప్రేమను చూపే కుటుంబ సంబంధాల లోని మంచి అతనికి అర్ధం కావటం మొదలైనట్లు కథా గమనంలో మనకు బోధపడుతుంది. అయితే ఈ కుటుంబ వ్యవస్థలో భర్తృ పరిత్యక్తగా పేరమ్మ అనుభవించిన దుఃఖం, బాధ రచయితకు తెలియనివి కావు. కొడుకు కోసం పోలంపనులు చేసి మామ ఇచ్చిన రెండెకరాలకు మరొక రెండెకరాలు కొని కలిపింది. కొడుక్కు పెళ్లిచేసి కోడలిని తెచ్చుకున్నది. కొత్త ఇల్లు కట్టిస్తున్నది. “ఇంత జీవితం వెనుక భగవంతుడు నుదుటిమీది కుంకుమ బొట్టుకింద వ్రాసిన రాతలో తిరిగిన వంకర్ల మాటున సాఫీగా ఉన్నఅదృష్టం కాక ఆమెశరీరం కణం కణంగా స్రవించిన చెమటబొట్ల విలువ ఉంది” అని చెప్పగలిగిన అవగాహన ఆయనది. కుటుంబానికి, పిల్లల అభివృద్ధికి బాధ్యత వహించే స్త్రీల కష్ట సహిష్ణుత మీద, సహనం మీదనే కుటుంబాలు నిలబడి ఉన్నాయన్నది వాస్తవం. భర్తను ఎలా పలకరించాలో , మాట్లాడాలో కూడా తెలియని శూన్యం ఆవరించిన స్థితిలో ఉన్నపేరమ్మ, అతను ఆమె భర్త కాదు ఎవడోవస్తే ఇంట్లో పెట్టుకున్నదన్న ఊరివాళ్ల అపవాదు మోయాల్సిన పరిస్థితిలో కూడా, కొడుకుకు సంజాయిషీ చెప్పుకొనవలసిన సందర్భంలో కూడా ఆశ్రయం కోరి వచ్చిన భర్తను ఆదరించటానికే సిద్ధపడిందంటే అది కుటుంబానికి ఉన్న శక్తి అన్నది ఇనాక్ భావం.

భార్యాభర్తల సంబంధంలోని వెలుగునీడల చిత్రణ ఇనాక్ కథల ప్రత్యేకత. భర్త కు పరస్త్రీ తో సంబంధం ఏర్పడితే అతనిపట్ల తాను ఏర్పరచుకొన్న ప్రేమ , విశ్వాసం భగ్నమై అందువల్ల కలిగిన కసితో పిల్లలను చంపుకొన్నస్త్రీ అందుకు కారణమైన భర్త తో సహా బావిలోకి దూకి ఆత్మాహుతి చేసుకొనటం ‘రెండు కన్నీటిబొట్లు’ కథావిషయం అయితే భర్త మరొక పెళ్లి చేసుకొని రెండవ కాపురం పెట్టి తనను నిర్లక్ష్యం , అవమానం చేయటాన్ని గుర్తించిన స్త్రీ చదువుకొని తనకాళ్లమీద తాను నిలబడటానికి చదువుకోవాలని నిర్ణయించుకొనటం గమ్యం కథా విషయం. భార్యాభర్తల బంధంలో ఒకరు మరొకరుగా మారేంతగా ఉండే ప్రేమ సౌందర్యాన్నిరుచి కథలోచూపించారు ఇనాక్.ఒక శాకాహారి, ఒక మాంసాహారి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక ఒకరి రుచిని మరొకరు తమదిగా చేసుకొనే క్రమం అంత సులభమైనదేమీ కాదు. అలవాట్లు తొందరగా మారవు. మార్చుకొనటానికి సంసిద్ధత ఇద్దరిలోనూ సమానంగా ఉండటం సాధ్యం కాదు.అహాలు, ఆధిక్యతలు శాసిస్తుంటే ఆంతర బాహ్య సంఘర్షణలు అనివార్యం అవుతాయి. అయితే అటువంటిసంఘర్షణ ఏమీ లేకుండా శాకాహారి అయిన అమ్మాయి మాంసం వండటం నేర్చుకొనటం గానీ, రుచిని ఆస్వాదించటంగానీ, మాంసాహారి అయిన అబ్బాయి పచ్చళ్ళ రుచిని ఆస్వాదించటంగానీ ఒకరిపట్ల ఒకరికిఉన్నప్రేమవల్లనే సాధ్యం అయిందని భార్యాభర్తల బంధంలో ఉండవలసినది ఆప్రేమసూత్రమేనని నిర్దేశించి చూపారు రచయిత ఈకథలో.

భార్యాభర్తల సంబంధంలో ఉండరానిది అనుమానం. ప్రేమ ఉన్నచోట అందుకు తావులేదు. ప్రేమించటం తెలియని మగవాళ్లే భార్యల ప్రవర్తనలపై తీర్పులు ఇచ్చే దుస్సాహసానికి ఒడిగడుతుంటారు. తాగుబోతు దాసు ఆ కోవలోవాడే. భార్య తిండీ బట్ట సంగతి పట్టించుకోడు కానీ ఆమె కొత్త రైక తొడిగితే ఎవరికో కొంగు పరిచి సంపాదించిందని మాటలతో హింసించగలడు. కొట్టగలడు. అలాంటి భర్తను చెడిపోతున్న కొడుకును దారికి తెచ్చుకొనే తల్లిలా అదను చూసి అదిలించి చక్కదిద్దిన భార్య ప్రేమను పీడ కథలో చూస్తాం. పెళ్లి, కుటుంబం, ప్రేమ బంధం, పిల్లలు లేనిదే జీవితానికి పరిపూర్ణత లేదని ఇనాక్ కథలు చెప్తాయి. ‘బహుమతి’, ‘ఇది ఒప్పు’ వంటి కథల సారం అదే. ‘దైన్యం లేని జీవనం’ కథ భార్యాభర్తలైనా, తల్లి దండ్రులు పిల్లలు అయినా అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు అయినా ఒకరి కష్టసుఖాలను గురించి ఒకరు ఆలోచన , పట్టింపు కలవాళ్ళైతేనే కుటుంబం లో దైన్యానికి తావులేని జీవితం సాధ్యమవుతుందని సూచించారు ఇనాక్.

స్త్రీపురుష స్నేహానికి , ప్రేమకు, పెళ్ళికి పరమార్ధం సంతాన ప్రాప్తి , వాళ్ళ పెంపకంలో పొందే సాఫల్యం అని నమ్ముతారు ఇనాక్. చాలావరకు ఇలాంటి కథలను ఆయన సంతాన ప్రాప్తి సూచనతో ముగించటం చూడవచ్చు. ఇనాక్ ఆదర్శంగా చూపించిన కుటుంబం అనివార్యంగా మగవాడి అధికారం గల కుటుంబమే. యావ కథలో అటువంటి కుటుంబ స్వభావం నగ్నంగా దర్శనమిస్తుంది. ఎంకియ్య భార్య రాయేలు గురించి చెప్తూ ‘సంసారం చేద్దామంటే పక్కలోకి వచ్చినట్లే తంతాను రమ్మంటే రోటికాడికి పోతుంది’ అన్నమాట గమనించదగినది. సంసారమూ నిర్బంధమే . తన్నులూ మామూలే. ఆమె పొడవు అతను పొట్టి. తన్నటానికి అనువుగా తాను రోలెక్కి రమ్మంటే అక్కడికివచ్చి ఆమె తన్నులు తింటున్నదంటే ఆమెది ఎంత పరాధీన జీవితమో స్పష్టమే. ఆ హింసామాయ కాపురంలోనే ఆమె పన్నెండు మంది బిడ్డల తల్లి అయింది. వాళ్లకు పెళ్లిళ్లు అయి మనుమలు, మనుమరాళ్లు కూడా కలిగారు. కుటుంబంలో ప్రేమ రాహిత్యం , హింస స్త్రీకి అనుభవం అవుతున్న విషయం తెలుసు కనుకనే దానికి విరుగుడుగా ప్రేమపూరిత స్త్రీపురుష సంబంధాలను గురించి ఆయన సంభవించారు. జానపద కాల్పనిక స్నిగ్ధ ప్రేమ ఆయన కథలలో ఒక ఆకర్షణ.

కుటుంబానికి ఇంత ప్రాధాన్యత ఇస్తూనే ఒంటరి స్త్రీల మాతృత్వ ఆకాంక్ష పట్ల గౌరవం కనబరచడం ఇనాక్ గారి ప్రజాస్వామిక దృక్పథానికి గుర్తు. రమ నా కూతురు , బర్త్ సర్టిఫికెట్ కథలు పిల్లలను తండ్రి వారసత్వాన్ని బట్టి కాక కన్న తల్లుల వారసత్వంతో గుర్తించటానికి మద్దతుగా వ్రాసినవే.

ఇక కొలకలూరి ఇనాక్ కథలలో దళిత జీవిత చిత్రణా కథలను పరిశీలించవలసి వుంది.

(ఇంకా వుంది…)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply