తోటితనం

అందర్తో గూడా నేనూ సదివుంటే, ఏ అయ్యోరో గియ్యోరో అయ్యుండే వోడిని. అప్పుడు సదువుకోకుండా జేసినాను. ఇప్పుడు సదివుకునోళ్ళను సూస్తే దగ్గోత్తరంగా నా కడుపు కాలిపోతాది.

తూరుపు దిక్కు కమ్ముకోనుండిన సీగటి తొలిగి పొయ్యి ఎలుగు రేఖలు ఇచ్చుకున్నాయి. మంచు తెరలు తొలిగి, పొద్దు మొలపున పసుపు రంగుతో గూడిన ఎరుపు రంగు నిటారుగా ఆకాశింకేసి ఇరజిమ్మతా ఉంది. క్రమంగా మొబ్బులు తొలిగి పొయ్ కొంచేపుటికంతా ఎండొచ్చింది.

నేను రచ్చబండకాడ కూసోని ఈదిలో వొస్తా పోతావుంటే జనాన్ని సూస్తా ఉండాను. ఆడోళ్ళంతా కడవల్తో నీళ్ళు తెచ్చుకుంటావుంటే, డమ్మురెడ్డొచ్చి “ఏవే పొద్దుపుట్టే దాక మొగుళ్ళ పక్కన పణుకోపోతే తెల్లార్తో లేసి పన్లకు రావాలని తెల్దా అని” ఆడోళ్ళనంతా తిట్టిన తిట్టకుండా తిట్టి, పన్లకు పిల్సక పోతా ఉండాడు.

సెంగారెడ్డొచ్చి మా బుడ్డగోణ్ణి పనికి పిలస్తా ఉండాడు రమ్మని. వాడు “లేదు సావీ! ఈ పొద్దు గౌరుమెంటోళ్ళ ఇండ్ల పట్టాలిస్తా ఉండారు పోవాల” అంటా ఉండాడు.

ఆయిన “మీ బతుకులే మేల్ రా! నా కొడకల్లారా గవురు మెంటోడు సొత్తు తినే దానికైనా రైతులు సొత్తు తినేదానికైనా, దేనికైనా మీ మాలోళ్ళకు రద్దే” అంటా ఉండాడు.

ముసిలీ ముతక తీరుబాటుగా సేతిలో వొక్కాకు తిత్తులు పెట్టుకొని వొక్కాకు నమిలీ నమిలీ నడీదిలో తుపుక్కు తుపుక్కుమని ఊసి గలీజు గబ్బుజేస్తా ఉండారు.

ఇంకొంత మంది ఆడోళ్ళు పొరకా సేటలెత్తుకొని మొగిలయ్యోళ్ళది కళ్ళమని పోతా ఉంటే, నేను ఇంటికొచ్చి పై గుడ్డ బుజానేసుకొని కళ్ళానికి ఎలబారినాను. నేనాడికి పోయేకొద్దికే కళ్ళం కాడ మొగిలయ్య అల్లుడు ఉబ్బలాయనుండాడు. ఆ మనసి కళ్ళంలోకి ఎవుర్నీ రానియ్యకుండా సావదిట్టతా ఉండాడు. “మీయబ్బడాండ్లాలా! మిమ్మల్నెవురు రమ్మన్నారే కళ్ళానికి” అని. ఈళ్ళు అట్ట గాదని పొయినా మెడబట్టి తోసేస్తా ఉండాడు.

మాకు తోటి తనముండాది గాబట్డి నేను పోతే వొద్దనలేదు. పొయినాను గాని, వాళ్ళందర్నీ కాదని పోయేదానికి నాకు కొంచిం బాదగానే ఉండింది. కానీ, ఏం సేద్దుం కరువు. ఎవురాకిలి వాళ్ళది ఎవురి కడుపు నిండేది వాళ్ళు సూస్తారు. ఇంగొకరి ఆకిల్ని గురించి ఆలోసెన జేసే కాలం గాక పోయ.

అప్పిటికి వాళ్ళు పొన గూడా కొట్టలేదు. నేను పొయినాకనే పొనగొట్టి తూరుపాన బట్టినాము. మొత్తం వొబ్బిడై పొయినాక అయిన నన్ను పొలి తిరగమన్నారు. “నేనింత వరకు యాడా పొలి తిరగలేదయా! మీరే తిరగండి” అని నేనన్నాను.

అయినా వాళ్ళొదల్లేదు.”నువు కాబోయే తోటోడివిరా! నేర్సుకోక పోతే యట్ట” తిరుగు అన్నారు.

గెంగమ్మ పొలంటా మూడు సుట్లు తిరిగినాను. మల్ల గింజలన్నీ గంపల్లో పోసి ఇంటికి మోసినాను. వచ్చేటప్పుడు రొండు చాట్ల వొడ్ల గింజలేమో నా కొంగు పట్టమని పోసినారు.

అప్పుడు నేనడిగినాను “అయా! మేం తోటోళ్ళం గదా! సూసి పెట్టండి పొనగొట్టినాను వొడ్లన్నీ మోసినా”నని.

వాళ్ళు “అన్నీ సూస్తా ఉండావు అడగతావు గదరా! నాటింది పది గుంటలు దాంట్లో కొంచిం నీళ్ళు లేకుండా ఎండిపాయ. మిగిలింది మెగాలొచ్చి తినేసిపోయ. అయినా నువు తోటోడి వని అడక్కుండానే రొండు చాట్ల గింజలు పెట్నామ”ని, మల్లొక చాట గింజలేమో పెట్నారు. అయ్యి మూటగట్టి నెత్తిన బెట్టుకొని వొస్తావుంటే, గోపాలగోడు మణిగోడు నన్ను తొలగేసి సైకిళ్ళల్లో సర్రని పొయినారు. వొకడు మాంబేటిలో టీచరు ఇంగొకడు తిరప్తిలో పోలీసు.

నేను వాళ్ళతో గూడా సదివుంటే ఏ అయ్యోరో గియ్యోరో అయ్యుండే వోడిని ఇట్టా కళ్ళాల కాడికి పొయి వాళ్ళకు ఊడిగం జేసి వాళ్ళిచ్చే తిరిపం గింజలకోసం ఎదురు సూడాల్సిన పనుండేది గాదు. పండగా పబ్బాలకు వాళిండ్ల ముందు నిలబడి ” అమ్మా! తోటోణ్ణి తల్లీ! అని గోజారాల్సిన పనుండేది గాదు.

నా సదువు సగంలోనే సంకనాకి పోయేదానికి కార్నం మా అయ్యే అప్పిటికి మా సుక్లాసేరి మావ సెప్పతానే ఉండె.”కాలం మార్తావుంది నాలుగచ్చరాలు నేర్సుకొనే దాన్తో సమానం గాదు సదువుకొనే వోణ్ణి ఎందుకు నిలిపేస్తావ”ని.

మా అయ్య “నీకు తెల్దురా సుక్లాసేరి ఈ కాలం పిలకాయల్ని సదివించి నాలుగచ్చరాలు నేర్సుకొంటే మల్ల మన మాటినరు. మనకెట్టా ఇరవైయూళ్ళ తోటితన ముండాది సేసుకొంటే పోతాది. దానికి మించింది లేదు” అని నిలిపేసినాడు గాని ఇప్పుడు సదువుకొన్నోళ్ళను జూస్తే బాద గలిగితింది.

నా చిన్నప్పుడు నేను ఎంగల్రాజుకుప్పం ఎస్సీ ఆస్టల్లో సదవతా ఉండి ఎండాకాలం లీవులని ఇంటి కాడనే ఉండాను. పొద్దుబొయ్యు దీపాలు బెట్టేటప్పుడు మా అయ్య ముక్కల్దాకా తాగి పడ్తా లేస్తా ఇంటికొచ్చినాడు. మా యమ్మ “ఇంత మందికి సావొస్తా ఉంది మీ అయ్యకు రాలేదు గదరా! అంది.

ఆమాటకు మా అయ్య “నంజాముండా నన్ను సావమంతావే నువ్వు సావే” అని కొట్టను గూడా కొట్టినాడు ఆవె “నీ పాడిగట్టా నీ సేతిలో పుండుబుట్టా” అని సాపించింది ఇది మావూలే.

నేనడిగినాను మా యమ్మని “ఎందుకమా అట్టంటావాయన్ని” అని. మాయమ్మ “లేకపోతే సావుకు పొయి నీళ్ళు గూడా బోసుకోకుండా ఎవురన్నా! ఇంటికొస్తాడురా? అనింది.

ఆయిన “మాలోనికేవంటే అంట్లో బుట్టి అంట్లో పెరిగి అంట్లో తిరిగే వోడికి” అన్నాడు.

మల్ల కైపు దిగినాక నన్ను దగ్గరికి పిల్సి “వొరే అయ్యా నువు సదివింది సాలు గాని నిల్సిపొయి తోటి తనం తీసుకోరా నేనింక సెయ్ లేను” అన్నాడు.

నేను “లేదయో! నేను సదువు కోవాల” అన్నాను.

ఆయిన “మనకెందుకురా! సదువు తోటితనానికి మించిందా?” అని అంటావుంటే, నేను సెప్పా పెట్టకుండా ఎంగళరాజుకుప్పం పూడ్సినాను సదువుకొనే దానికని.

మల్లొక నాడు నేను అయ్యోరు పాటం జెప్పతా ఉంటే, కూసోని ఇంటా ఉండాను. మా దున్నగోడొచ్చి “వొరే మీ అయ్యకు నిండా బాగలేదు నిన్ను పిల్సక రమ్మన్నారంటే “వొచ్చేసినాను, యట్టుందో యేమోనని. కాని ఈడికొచ్చి సూస్తే తాగి పిట్లుగొట్టే గూటం మాదిరిగా కూసోనుండాడు. అడిగితే “నువ్వు రావని అట్టజెప్ప మన్నానురా తోటితనం తీసుకోవాల్సిందేన”ని పట్టుబట్టినాడు. నాకూ తీసుకోక తప్పలేదు.

తోటితనం అనే దానికి ప్రెదానం తోటికట్టి ఇది ఆరడుగుల పొడుగుతో కిందా పైన ఎండి తొడుగులేసి పూలు పూలుగా బచ్చిన పోసుంటారు. దీనికి పైన గెజ్జలు గూడా ఉంటాయి. రాజుకు రాజముద్రెంతో మాకీ తోటికట్టంత దాన్ని ఊన బొడుసుకొని పోతావుంటే గల్లుగల్లుమంటాది.

ఇది మా తాతలకాలం నించీ మాదగ్గిరుండాది. ఈ తోటి తనమనేది మాకు వొంశ పరంపరంగా వొస్తావుంది. ఊళ్ళల్లో రెడ్లూ, కర్నాలు, తళారోళ్ళెంతో,మేవూ అంతే. కాకపోతే వాళ్ళకు గవుమెంటోడు సమ్మళమిస్తాడు మాకు లేదు. అదొక్కటే తేడా వాళ్ళకూ మాకూ. గ్రేమాలల్లో మద్దిస్తాలు, పండగలు, పబ్బాలు, తిర్నాళ్ళు, జాతర్లు, సావులు, ఏది జరిగినా మేముండాల్సిందే మా సేత తోటికట్టీ వుండాల్సిందే.
ఊళ్ళల్లో సచ్చిన గొడ్డూ, గోదా, తెచ్చుకోవాల. మడిసి సచ్చిపోతే వాళ్ళకు కావాల్సి నోళ్ళకంతా కబురు సెప్పి, వాళ్ళిచ్చే రూపాయ, అద్దరూపాయ, తీసుకోవాల. పలకలు గొట్టి కొమ్ములూదాల. తరవాత తాగి ఆడతా పాడతా పీనిగని తీసకపొయి పూడుపంటే పూడుపు, కాలుపంటే కాల్చాల. ఆడగొట్టే టెంకాయొప్పులు పోరవ గుడ్డ తీసుకొవాల ఇదీ మా పని. ఈ సావులకు పొతే మాకు తవలపాకు తొటివంత గూడా మిగల్దు. తాగి తందనాలాడే దానికి తప్ప మిగిలి మిట్టన బడేదీ గూడాలేదు.

ఇది గాకుండా పండగలూ పబ్బాలకు పోతే వాళ్ళేసే కూడూ, కూరలు, జాతర్లలొ నరికే దున్నపోతు, కళ్ళాల కాడికి పోతే కొంగు పట్టమని వాళ్ళిచ్చే తిరిపెం గింజలు, ఇదీ మా కొచ్చే వొరుంబడి. వొక తోటోడుగా సచ్చినా బతికినా మేం వాళ్ళకు తోడుంటాం గాని, యాడ దగ్గోత్తరంగా కడుపు రగిల్దిందంటే వాళ్ళెప్పుడూ మమ్మల్ని మడుసులుగా సూడ్రు. కడపదాటి రానీరు, సెప్పులేసుకొని పోతే తీసి సేతబట్టక పోవాల్సిందే. తలగుడ్డ కట్టుకొని పోతే ఇప్పి సేతబట్టుకొని పోవాల్సిందే.

తాగే దానికి నీళ్ళడిగితే దోసిళ్ళు పట్టమని పోస్తారు లేదా? సూర్లో టెంకాయ సిప్ప దోపుంటారు, దాంట్లో పోస్తారు తాగమని. వాళ్ళకిట్ట అణిగి మణిగి ఉండినంత కాలం వాళ్ళకూ మాకూ వొరుపనేది ఉండదు. ఎదురు తిరిగి అడిగినామనుకో రంపూ రావిడి మొదులైనట్టే. అందుకని మనకు కాలం గాదని పోతా ఉంటాము.

వొకనాడు మా అయ్య నడిగినాను “అయా! నేనెట్ట బతకాల మనకు కయ్యా కాలవలేదు గొడ్డూగోద లేదు దుడ్లూ గిడ్లూ లేవు గదా” అని.

అందుకాయన వొకిటే మాటన్నాడు “కయ్యా కాలవ నీకెందుకురా? ఎర్రినాకొడకా! అయ్యన్నీ మన తోటితం ముందు బలాదూర్ ఎందుకూ పనికిరావ్. ఇది మన వొంశాచ్చారం తరతరాల్నించి వొస్తా ఉంది ఈ ఇరవై ఊళ్ళ తోటితం సాలు” అన్నాడు.

తోటితనం మా అయ్య నించి నా సేతికి మారే రోజు అదొక పెద్ద తతంగం. గేమాన్నంతా ఉడ్డజేర్సినాం తెల్లారే కొద్దికి నన్ను నీళ్ళు బోసుకొని రమ్మని పెద్ద మడుసుల సమచ్చంలో పెదపులి గెంగమ్మ ముందర నిలబెట్టి, మా అయ్య సేతిలో ఉండే తోటికట్టి నా సేతికిచ్చినారు. నేను వొక సేత్తో తోటికట్టి ఇంగొక సేత్తో యాటకత్తి పెట్టుకొని సల్లంగా సూడమని గెంగమ్మను ఏడుకొన్నాను.

వొక మేక పోతును పట్టకొచ్చి గంగెమ్మ ముందర నిలబెట్టి నన్ను ఏటకత్తితో నరకమన్నారు. నేను వొకే ఏటుకు తెగ కరికేసినాను. ఆ రగతం నా నొసట్న బెట్టి గెంగమ్మకు మొక్కోమంటే, నేను “తల్లీ! మహమ్మాయి నేను తోటితనం జేసే ఈ ఇరవై ఊళ్ళల్లో పుంజిగా వాన్లు గురిసి బంగారు పంటలు పండాల, జనాలకు రోగాలు రొష్టులు లేకుండా కాపాడాల.

గొడ్డూ గోదా యాయందులోనూ లోటు లేకుండా సూడాల. పరవాలేదు పలానా సెంగల్రాయుడు తోటోడైన యాళా ఇసేసం మాకు దేంట్లోనూ లోటు లేదని ఈ ఊళ్ళన్నీ సెప్పుకోవాల తల్లీ! అని “ఏడుకొన్నాను గాని, మా గురించి వొక్క మాట గూడా దేవుణ్ణి నేను ఏడుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మేం బాగున్నట్టే లెక్క.

మేకను కోసి కూర జేసి వొచ్చినోళ్ళకంతా కల్లూ సారాయి పోసి ఆ పొద్దు ఇందు జేసినాము. మర్సరోజు తెల్లారే కొద్దికి తోటికట్టెత్తుకొని ఊర్లమ్మిటా యలబారి నాను. నాతో గూడా మా అయ్య సుక్లాసేరి మావ, గుండుగోడు, పండుగోడు, గూడా వొచ్చినారు. ఇంటింటికీ పొయి నిలబడి నేను తోటికట్టి నేలకు బలంగా తాకించి గెజ్జలు గల్లని సవుండవతా వుంటే “అమ్మా! నేను కొత్తగా వొచ్చిన తోటోణ్ణి తల్లీ! అని కొంగు సాపినాను. వాళ్ళు దాంట్లో రూపాయేసేవోళ్ళు అద్దరూపాయేసేవోళ్ళ ఏసినారు. కొంతమంది గింజాగిట్ర పెట్నారు. ఇట్ట వొసూలయ్యిందంతా ఆ పొద్దు తాగుడుకే సరిపొయ్యింది.

పేరుకు నేనే తోటోడైనా మా అయ్య నన్నొదలకుండా వొచ్చేవోడు. సావులకొచ్చి పీనిగల్ని గుంతలో యేసి పూడ్సేటప్పుడూ కాష్టం మిందబెట్టి కాల్సేటప్పుడు జాతర్లల్లో దున్న పోతును నరికేటప్పుడు నేను బయపడ్తానని ఆయనే అన్నీ ముందుండి సూసుకొనే వోడు. ఆయన పొయినాక నేనే సూసుకుంటా ఉండాను.

2 thoughts on “తోటితనం

  1. మా సత్యం
    గోవింద్ మూరిశెట్టి గారు రాసిన
    ‘తోటి తనం’ కథ
    గత జ్ఞాపకాలకి సంబంధించిన సహజ సంఘటన దృగ్విషయం. నాస్టాల్జియా రూపంలో భావోద్వేగంతో ముడిపడి ఉంది.
    రాయలసీమ మండలికంలో రాయడం వల్ల కథకి ఒక ప్రత్యేకత ఏర్పడింది.
    కథ చివర్లో
    “అమ్మా! నేను కొత్తగా వొచ్చిన తోటోణ్ణి తల్లీ! అని కొంగు సాపినాను. వాళ్ళు దాంట్లో రూపాయేసేవోళ్ళు అద్దరూపాయేసేవోళ్ళ ఏసినారు.
    కొంతమంది గింజాగిట్ర పెట్నారు. ఇట్ట
    వొసూలయ్యిందంతా ఆ పొద్దు తాగుడుకే సరిపొయ్యింది”.
    పల్లె సీమలో నివసించే అట్టడుగు ప్రజల సామాజిక అస్తిత్వాన్ని ప్రతిబింబించింది.
    రచయితకు అభినందనలు

    1. సార్! కథ చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు

Leave a Reply