చెక్క బల్ల ఆ రోజుకు పాతిక సార్లు
ఉమ్మనీరు ఊరి చెమ్మబారుతుంది.
తడి, చిత్తడి,
అరకొర వెలుగు.
తడుముకునే చేతి కి సూది ఆనవాలు.
నిశ్శబ్దం లోకి జారే చినుకులా స్రవించే ద్రవం
మళ్ళీ వచ్చే నొప్పి కెరటానికి
పళ్ళు బిట్టగరిచి, ఊపిరి కడబట్టాల్సిందే.
పురిటి గది సంద్రంలో
సుడిగుండాల మాయ విడినపుడు
ప్రాణం రూపు కడుతుంది.
“అమ్మా!” అనే కేక మోగుతుంది.
ఒక్క తల్లికే జన్మనివ్వడం తెలుస్తుంది.
“పాత గుడ్డ తెండి” ఆయమ్మ అరుపు
“తల్లికి బిడ్డకి ఒకే నెంబర్ ఇవ్వాలి” హెచ్చరిక జారీ
స్పష్టాస్పష్ట సందిగ్ధం అలలై కమ్ముకునే మైకం లో
బ్రహ్మాండం బద్దలైన క్షణమే,
చెవులు పగిలే కాంతి,
చిమ్మ చీకటిలో చిరు దీపమౌతుంది.
నొప్పి చిరునవ్వై,
బాధ వరమైన క్షణం
మానం పగిలి వచ్చే
ఒక చిన్నారి మానవాద్భుతం,
ఆ రోదన ఊరించే చనుబాల చేపు కోసం,
తొమ్మిది నెలల ఎదురు చూపు
తొలి ఊపిరి పోసే సృష్టి రహస్యం.
చెక్క బల్ల చెక్కు చెదరకుండా
చాలా బావుంది మేడం,సహజంగా మీ వృత్తిలో సంవత్సరాల తరబడి చూస్తున్న దృశ్యాలు ఈ కవితగా మారయేమో!తాత్వితంగా రాసే మీ శైలితో,మనసుని మరింత స్పర్శిస్తుంది!
మీకే సాధ్యమైన కవితా వస్తువులుగా రాయడం — ఆశ్చర్యమే కాదు, ఆనందాన్ని కూడా ఇస్తుంది. బహుశా శిల్పం వల్ల కూడా కావొచ్చు. బాగుంది