తొలితరం రచయిత్రుల కథల్లో జాతీయోద్యమ ప్రభావం

భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలకు తెగించి మడి, మాన్యాలు వదులుకొని సర్వం త్యాగం చేసిన నారీమణులెందరో నిస్వార్థ సేవ చేసిన తల్లులు ఎందరో ఉన్నారు. వందేమాతర ఉద్యమం స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. 1905లో రష్యా, జపాన్‌ చేతిలో చావుదెబ్బ తినడంతో భారతదేశంలో జాతీయవాదం ఊపందుకుంది. పాశ్చాత్య విద్యా విధానం, స్త్రీవిద్య, బాల్య వివాహాల నిర్మూలన, స్త్రీ స్వేచ్ఛ సమానత్వం, సంఘ సంస్కర్తల కృషి మహిళా సంఘాల స్థాపన, పత్రికల సానుకూల స్పందన వంటివి 1910`1947 నాటి సమస్యలకు సామాజిక సాహిత్యాల పరిష్కారాలు.

రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్య, బ్రహ్మ సమాజాల స్థాపన స్త్రీ పాఠశాలలు, కందుకూరి గురజాడల కృషి, 1927 అఖిలభారత మహిళా సంఘం స్థాపన, 1929 వ్యభిచార నిర్మూలన చట్టం 1930 శారదా వివాహ చట్టం, 1937 హిందూ స్త్రీల వారసత్వచట్టం పలు ఆంధ్ర మహిళా సభల నిర్వహణ ఈ కాలంలో వచ్చిన మహిళా ఉద్యమాలు, అహింసాయుత స్వాతంత్య్ర పోరాటం, భారతీయ సమాజపు లౌకిక దృక్పథం… వంటివి 1910`1947 నాటి సమస్యల పరిష్యారానికి రూపొందిన మార్గాలు. గత శతాబ్దంలో వచ్చిన ఉద్యమాలు, ఆంగ్ల విద్యా విధానం, శాస్త్రీయదృక్పథం స్త్రీని ఆలోచింప చేశాయి.

బండారు అచ్చమాంబ, చోరగుడి సీతమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, కందుకూరి రాజ్యలక్ష్మీ, కనుపర్తి వరలక్ష్మమ్మ, దువ్వూరి సుబ్బమ్మ వంటి మహిళలు నాటి సంఘసంస్కరణ, జాతీయోద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీజీ అహింసాయుత పోరాటానికి ప్రభావితులయ్యారు. మహిళా సభలను ఏర్పాటు చేశారు. స్త్రీ అసమానతల పట్ల నిరసన తెల్పారు. సమానత్వ ప్రాతిపదికన పోరాటాలు చేయడం వంటివి సాహితీ వస్తువులయ్యాయి. పలువురు రచయిత్రులు ఈ సమస్యలను కథా వస్తువుగా స్వీకరించి రచనలు చేశారు.

1910`1947 మధ్యకాలంలో ప్రధాన ఘట్టం జాతీయోద్యమం. 1857 సిపాయిల తిరుగుబాటు, 1906 విదేశీ ఉద్యమం, 1911 వందేమాతర ఉద్యమం, 1920 సహాయ నిరాకరణోద్యమం, 1928 సైమన్‌ కమిషన్‌పై తిరుగుబాటు, 1929 లాహోర్‌ పూర్ణ స్వరాజ్య తీర్మానం, 1931 గాంధీ ఇర్విన్‌ ఒప్పందం, 1930 ఉప్పు సత్యాగ్రహం, 1935 ఇండియా చట్టం, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం, 1946 తెలంగాణా ఉద్యమం, 1947 స్వాతంత్య్ర సంపాదన . . ఇవి జాతీయోద్యమంలోని ప్రధాన ఘట్టాలు. మహిళలు భారత రాజకీయ రంగం మీదికి రావడం భారత రాజకీయ రూపురేఖలు మారాయి. అనిబిసెంట్‌ హోంరూల్‌ ఉద్యమం, మాగంటి అన్నపూర్ణ ఖద్దరు ఉద్యమం, యామినీ పూర్ణతిలకం లాంటి మహిళలు గాంధీజీ ఉద్యమంలో చేరడం. పలువురు విప్లవకారిణిలుగా చేరడం, పలు మహిళా ఉద్యమాలు వంటివి భారత జాతీయోద్యమానికి పట్టునిచ్చాయి. ఈ అంశాలు కూడా కథా వస్తువులయ్యాయి.

1. గుమ్మడిదల దుర్గాబాయి రాసిన ‘నేద్యన్యనైతిని’ `1929

2. కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన ‘ప్రేమ ప్రభావము’ ` 1927

(2)ఐదుమాసముల ఇరువది దినములు (1931)

3. బసవరాజు వెంకటరాజ్యలక్ష్మి రాసిన ‘ఎవరిదదృష్టం’ 1931

4. తాడినాగమ్మ రాసిన ‘ఒక ముద్దు’ 1939

(2) ఇది కథగాదు’

5. చంద్రకాంతం ` ‘ప్రేమవేదిక మీది’

6. మైదవోలు పద్మావతి ` ‘త్యాగిని’

ఆరుగురు రచయిత్రులు రాసిన 8 కథలు తీసుకున్నాను. కనుపర్తి వరలక్ష్మమ్మవి రెండు, తాడినాగమ్మవి రెండు. ఈ ఎనిమిది కథలు జాతీయోద్యమ ప్రభావం, నేపథ్యంలో వచ్చాయి. జాతీయోద్యమంలో స్త్రీ క్రియాశీలక పాత్రను చిత్రించిన కథలుగా వాటికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు.

1920లో గాంధీ ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ ప్రచారం కోసం విరాళాలు పోగుచేయాలనే ఉద్దేశ్యంతో రాజమండ్రి వచ్చినపుడు బహిరంగసభలో ఆయన చేసిన ఉపన్యాసంలో ప్రభావితురాలైన వ్యక్తి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌.

ఆ చిన్నవయసులోనే గాంధీటోపి ఒకటి  సంపాదించి దాన్ని తిప్పి జోలెగా తయారుచేసి అందర్ని డబ్బులు అడిగి గాంధీజీకి అందజేసింది. అప్పుడు గాంధీ ఆ సంచీ తీసుకొని డబ్బులు బాగానే పోగుచేశావు మరీ నీ చేతికున్న గాజులు మాటేమిటి. అనగానే తన చేతికున్న బంగారు గాజులు తీసి జోలెలో వేసింది. బాల్యం గడిచి జాతీయోద్యంలోకి మహిళాభ్యుదయ దృష్టితో దూసుకువచ్చిన స్త్రీ దుర్గాబాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ కథను 1929లో వ్రాసింది.

బాలవితంతువైన శారదాబాయి సంప్రదాయాలను ధిక్కరించి పూనాకు వెళ్ళి చదువుకొని వచ్చి పాఠశాల స్థాపించి నడుపుతున్న చైతన్యశీలి. ‘నేధన్యనైతిని’ అన్నది ఈ కథలో ఆమె పలికిన అంతిమ వాక్యం. శ్యామసుందరుడు సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ సందర్భం నుండి జాతీయాద్యమంలో చురుకుగా పాల్గొంటున్న యువకుడు.

శ్యామసుందరుడు జాతీయోద్యమ క్రియా శీలత వల్ల పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడు. అది అతనిని పోషిస్తున్న అన్నగారికి కంటగింపు అవుతుంది. అన్నగారి ఆజ్ఞకన్నా మాతృదేశ రక్షణ ముఖ్యమన్న ఆలోచనలో అన్నగారి దౌష్ట్యం జాతీయోద్యమ వ్యతిరేకత సహించలేక ఇల్లువదిలి వెళ్ళిపోతాడు. ఆ వార్తను తెలుపుతూ అక్క శారదాబాయికి ఉత్తరం వ్రాస్తాడు.

శ్రీనివాసరావు కమలాబాయి దంపతుల పుత్రికలీల. జాతీయోద్యమ చైతన్యశీల స్వభావం. ఇంట్లో నూలు వడకటం జాతీయోద్యమ గీతాలు పాడటం ఆమెకు సహజంగా అలవడ్డాయి. లీల తండ్రి శ్రీనివాసరావు జబ్బుపడి మరణిస్తూ కూతురికి మాతృభూమిని మరువద్దు. భారతి ఋణం తీర్చు అని సందేశమిస్తాడు. ఆ తర్వాత లీల తల్లి మరణిస్తూ చదువుల తల్లిగా మారి, విద్యలేని దేశం ఎలా ఉంటుందో తెలియని భర్త  ఉన్నతాశాయాలకు ఆటంకం కల్గించి వృధా ప్రలాపాలతో కాలం గడిపి అవిద్యాంధకారంలో మునిగి తేలే స్త్రీలను ఉద్దరింపమని సందేశమిస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుని శారదాబాయి లీలను చేరదీస్తుంది. ఇల్లు వదిలిన శ్యామసుందరుడు అక్కగారి దగ్గరకు వచ్చి తన కార్యకాలపాలు కొనసాగిస్తుంటాడు. లీల శ్యామసుందరుల మధ్య అనురాగం పెరుగుతుంది. పరులకు చేయూతనిస్తూ స్వార్థరహితమైన సేవను అందిస్తూ ఫలాపేక్ష లేని దృక్పథం కలిగి, దేశభక్తి కలిగి, మానవసేవ చేయటంలోనే జన్మసార్థకత పొందుతుందని దుర్గాబాయి గారి భావన.

శారదాబాయి వితంతువై పూనాకు వెళ్ళి విద్యనభ్యసించి ఆంధ్రదేశానికి తిరిగివచ్చి, స్త్రీ విద్యకోసం పాఠశాల నడుపుతున్న ఆమె జబ్బుపడ్డప్పుడు తన తర్వాత తన ఆశయం కొనసాగటం గురించి కలిగిన సందేహానికి లీలా శ్యామసుందరుల ప్రవర్తన ఒక సమాధానమవుతుంది. తాను జబ్బుతో ఆశక్తురాలైతే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళిద్దరూ అతిసహజంగా చేపట్టారు.

శారదాబాయి స్త్రీ జీవిత ధన్వత్వం స్త్రీ విద్యా ఉద్యమ నిర్వహణలో స్త్రీల అభివృద్ధి కొరకైన కార్యాచరణలోనే ఉందని నమ్మింది. కనుకనే తాను జీవించినంత కాలం ఆ పనిలోనే వున్న తన మరణానంతరం తన ఆశయాన్ని ముందుకు తీసుకొనిపోగల యువతరం తయారు కావటం మరింత తృప్తినిచ్చింది. నేటికి నేను ‘ధన్యనైతిని’ అన్న ఆమె ఆఖరి మాటలో ఆ తృప్తే వ్యక్తమవుతుంది.

గాంధీజీ విజయవాడలో జరగనున్న అఖిలభారత కాంగ్రెస్‌ సమావేశానికి కలకత్తా నుంచి వస్తూ తెలుగుదేశంలోని అనేక పట్టణాలలో ప్రసంగించాడు. అందులో భాగంగానే మద్రాస్‌లో గాంధీజీ ఉపన్యసించాడు. విదేశీవస్త్రాలను బహిష్కరించమని పిలుపునిచ్చాడు. స్వరాజ్యస్థాపనకు దౌర్జన్య స్థాపనకు దౌర్జన్య రహిత సహాయ నిరాకరణమే శరణ్యమని అభిప్రాయపడ్డాడు. ఆ స్ఫూర్తితోనే కనుపర్తి వరలక్ష్మమ్మ 1927లో ‘ప్రేమ ప్రభావము’ అనే కథను వ్రాసింది.

లక్ష్మీ వెంకయ్యనాయుడు దంపతుల కొడుకు రామస్వామి చదువురీత్యా మద్రాస్‌లో ఉంటాడు. గాంధీజీ సహాయ నిరాకణోద్యమంలో భాగంగా మద్రాస్‌కు వచ్చి ఉపన్యసించినప్పుడు రామస్వామి ఆ ఉపన్యాస ప్రభావంతో సహాయ నిరాకరణోద్యమంలో చేరాలని నిశ్చయించుకుంటాడు. ఆ సంకల్పంతో చదువుకు స్వస్థిపలికి, నిర్ణయించుకున్న ప్రకారం స్వగ్రామం చేరతాడు. తండ్రికి    కొడుకు ఉద్యోగము చేయాలని, పెద్ద మొత్తం వరకట్నంతో అతినికి పెళ్ళిచేయాలని ఉంటుంది. కాని తండ్రి అభిప్రాయాన్ని రామస్వామి తిరస్కరిస్తాడు. కోపంతో తండ్రి కొడుకును ఇంట్లో ఉండొద్దంటాడు. తల్లి లక్ష్మి కొడుకు అభిప్రాయాన్ని అంగీకరించి ప్రోత్సహిస్తుంది. ఇల్లు ఒళ్ళు గుల్లయ్యే చదువెందుకు? పూర్వులు వ్యవసాయం చేసుకొని పాడిపంటలతో సుఖించలేదా? సొంతంగా రాట్నం మీద నూలు వడుక్కొని నేయించుకుంటె బట్టలు మన్నుతాయి. డబ్బువస్తుది. మా నాయనమ్మ వడికిన నూలుతో కోకలు నేయించుకుంటే మూడేళ్ళు కట్టేవాళ్ళము. సన్నచీరలు అని గొప్పేకాని మూడు నెళ్ళైనా ఉండవు. అని కాపురానికి వచ్చేటప్పుడు మా నాయనమ్మ కట్టెడు నూలు వడికి దుప్పటి నేయించి ఇచ్చింది. పాతికేండ్లయింది. ఇప్పటికి మాయలేదని ఖద్దరు గొప్పతనాన్ని తెలియపరుస్తుది. అయినా భర్త నిరాకరిస్తాడు.

గాంధీ మద్రాస్‌ సభలో చెప్పిన మూల సూత్రాలైన సత్యము, త్యాగము, అహింస, ఐకమత్యము అనే నాలుగు  సూత్రాలను గాంధీ ఆలోచనలను రామస్వామి హృదయంలో గాఢంగా నాటుకొని పోయాయి. దేశహితులైన చింతతో మనస్సాక్షి ప్రేరితుడై అతడు సహాయోద్యమమును చేపట్టినందుకు తండ్రి కోపిస్తాడు. తల్లి దు:ఖిస్తుంది. జననీ జన్మభూములు రెండు అతనికి సమాన గౌరవ పాత్రలుగానే ఉన్నవి. జన్మభూమి సేవింప నిశ్చయుడయ్యాడు. తల్లి సన్నిధికి చేరి ఉద్యమతత్వం బోధపరచాడు. తల్లి సమ్మతించింది. ఇల్లు వదిలి అసహాయోద్యమ ప్రచారకుడై రామస్వామి ఆంధ్రదేశమంతా పర్యటించాడు.

రామస్వామి జాతీయగీతాలు పాడుతూ స్వదేశీ వస్త్రాలు విక్రయిస్తుండగా పట్టుకొని కఠినశిక్ష వేసి జైలకు పంపుతారు. ఆ విషయం తెలిసి తండ్రి వెంకయ్యనాయుడు తన విలువైన వస్త్రాలను తీసి ఆవలపారేసి, అధికారం వదిలి తన రావుసాహెబ్‌ బిరుదు వద్దని తిరస్కరించి ఖద్దరు వస్త్రధారియై ఖద్దరు వస్త్రాలను విక్రయించడానికి వెళ్ళి జైలు పాలవుతాడు. సంవత్సరం తర్వాత రామస్వామి విడుదల రోజు పుష్పవర్షం కురిసి జయధ్వానాలు మారుమ్రోగాయి. తండ్రి దగ్గరికొచ్చి ప్రేమ పూర్వకంగా కౌగిలించుకొంటాడు.

రామస్వామి తండ్రి చరణాలపై ఆనంద బాష్పాలను వదిలి ఆనందిస్తాడు. దేశం మీద ప్రేమతో కంకణబద్ధుడు కావటమే కాకుండా తన తండ్రిలో కూడా దేశంపట్ల ప్రేమాంకురాన్ని మొలిపించాడు. ఈ కథ కనుపర్తి వరలక్ష్మ్మగారి జాతీయోద్యమ చైతన్యాన్ని సూచిస్తుంది. గాంధీ నిర్వహించిన చారిత్రక పాత్రను రచయిత్రి ఈ కథలో నమోదు చేయటం విశేషంగా చెప్పవచ్చు.

కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన మరోకథ ‘ఐదుమాసముల ఇరువది దినములు (1931) మహాత్మాగాంధీ పిలుపునందుకొని విదేశీవస్త్ర బహిష్కరణ ఉద్యమంలో గోపాలరావు చేరతాడు. అతని భార్య రుక్మిణి. ఆమె ఏడోనెల పురిటికి పుట్టింటికి వెళ్తుంది. అది మొదలు పిల్లవాడు పుట్టిన ఐదునెలల వరకు కూడా ఆమెను చూడలేకపోతాడు. కారణం తలమునకలుగా అతను సత్యాగ్రహోద్యమంలో పనిచేస్తుంటాడు. పిల్లవాడితో పుట్టింటినుండి వచ్చిన భార్య విదేశీ వస్త్రాలు ధరించి ఉండటం వల్ల గోపాలరావు ఆమెను పలకరించడు. ఆ రాత్రికి రాత్రే గోపాలరావును బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేస్తుంది. విదేశీ వస్త్ర వ్యతిరేక బోధ చేస్తున్నందుకు ఆరు నెలల కారగార శిక్ష విధించింది. ఈ సంఘటన చీరలు, నగలు జీవితమనుకునే ప్రపంచం నుంచి రుక్మిణి బయటికి వచ్చి దేశస్థితిగతుల గురించి ఆలోచించేటట్లు చేసింది. స్వదేశీ వస్త్రాలను ధరించమని భర్త ప్రబోధించటం నేరమైనందుకు ఆశ్చర్యపడ్తుంది. ఆలోచించే కొద్దీ విదేశీ వస్త్రాలలోని పరాధీనత, అవి ధరించిన తనపట్ల భర్త ప్రదర్శించిన ఉదాసీన వైఖరి అన్ని అర్థం చేసుకుంటుంది రుక్మిణి. భర్త ఆశయం అర్థమవుతుంది. స్వదేశీ ఉద్యమానికి మద్ధతుగా ఖద్దరు కట్టి, నూలు వడకటం  మొదలుపెడ్తుంది. సావిత్రిగారి నోముల నోచేందుకు తన ఇంటికి వచ్చే యువతులు ఖద్దరు వస్త్రాలనే ధరించాలని షరతు పెడ్తుంది. స్వదేశీ ఉద్యమం పట్ల ఆమె సంసిద్దురాలు కావటమే కాకుండా చుట్టూ ఉన్న స్త్రీలను సమీకరించి కార్యోన్ముఖుల్ని చేస్తుంది. భర్త జైలు నుండి వచ్చేసరికి అతని ఆదర్శాలకు అభిరుచులకు అనుగుణమైన ప్రవర్తనలతో తయారవుతుంది. రుక్మిణి భర్త జైలు కెళ్ళిన రోజు నుండి తిరిగి వచ్చే రోజు వరకు ‘ఐదుమాసముల ఇరువది దినములు’ ఈ కాలంలో స్వదేశీ ఉద్యమాన్ని ఆశయంగా చేసుకొని తాను నూలు వడకటానికి, భర్తకు అవసరమైన దుస్తులను తాను తీసిన నూలుతో నేయించి పెడ్తుంది. ఖద్దరు వస్త్రాలు ధరించిన స్త్రీలతో కలిసి, స్త్రీలు చేయదగినవిగా సమాజం నిర్దేశించిన నోములు, వ్రతాలు చేయటానికి ఆమె తనను తాను మార్చుకుంటుంది.

జాతీయోద్యమ ఆశయాలతో కార్యశీలురైన పురుషులకు దీటుగా సహాయకారులుగా వారి సహచరులు కూడా సుశిక్షుతులైనప్పుడే ఉద్యమం బలోపేతం కావటానికి వీలువుతుంది. కనుపర్తి  వరలక్ష్మమ్మ ఈ కథ రాసి స్త్రీలకు ఆదర్శంగా నిల్చింది. భర్తల ఉన్నతాశయాల తత్త్వమెరిగి నడుచుకోవటంగా నిరూపించింది. 

శ్రీమతి బసవరావు వేంకటరాజ్యలక్ష్మీరాసిన ‘ఎవరిదదృష్టం’ కథలో సరళ, కమల ఇద్దరు స్నేహితులు. బాల్య వివాహ నిరోధానికి పాటుపడతూ స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉండాలనే ఆలోచన కలిగిన తల్లిదండ్రుల బిడ్డ సరళ. నూతన సంప్రదాయ జీవనమార్గంలో నడిచే తల్లిదండ్రుల బిడ్డ కమల. ఆ నేపథ్యంలో వారి చైతన్యాలు కూడా ఆ రకంగానే వికసించాయి. తల్లితండ్రుల  ఇష్టానుసారం బాల్యంలోనే వివాహం చేసుకొని యుక్తవయస్సురాగానే చదువుమానేసింది కమల.  చదువు కొనసాగించి స్కూల్‌ ఫైనల్‌ ప్యాస్‌ అయింది సరళ. మద్రాస్‌ లో జరిగే టెన్నీస్‌ పందాలు చూడ్డానికి వెళ్ళి అక్కడ టెన్నీస్‌ ఆటగాడు బేగ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుటుంది. అందుకు తల్లిదండ్రుల ఆమోదం పొందగల్గిన స్వేచ్ఛ, స్వతంత్రాలను అనుభవించే స్థితిలో సరళ ఉంటుంది. ఐతే సరళ చేసుకొన్న మతాంతర వివాహం వరుడి పక్షం వాళ్ళకు సమ్మతం కాకపోవటంతో ఆమె వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగుస్తుంది. బాల్యవివాహం చేసుకున్న కమలదా అదృష్టం? తను చుదువుకొని కోరుకున్న పెళ్ళిచేసుకున్న సరళదా అదృష్టం? ప్రశ్నిస్తే రచయిత్రి బాల్యవివాహం చేసుకున్న కమలదిగా చూపించింది. కారణం బాల్యవివాహం చేసుకున్నప్పటికి కమల అత్తమామలకు, భర్తకు సేవచేస్తూ నూలు వడకటం పిల్లలందర్ని చేర్చుకొని హిందీ నేర్పటం వంటి జాతీయోద్యమ కార్యకలాపాలను సాగిస్తూ ఇంటిని భూలోక స్వర్గంలా చేసుకున్నది కమల అని రచయిత్రి అభిప్రాయం. బాల్యవివాహం తప్పు కాదనేది రచయిత్రి భావనగా కనబడుతుంది.

ఒకరోజు సరళ, కమల దగ్గరికి చేరి పరిస్థితి తెల్సి ‘నాగతి ఇలా అయింది’ అని తన మీద తానే జాలిపడటం మాటలను చూస్తే మతాంతర వివాహాల పట్ల కూడా రచయిత్రి విముఖత కనిపిస్తుంది. కమల భర్త దామోదం కూడా సరళను ఆదరిస్తాడు. ఇంతలో సహాయ నిరాకరణోద్యమంలో దామోదరం జైలుకు వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి సరళ, కమల ఆయన పనిని కొనసాగిస్తారు. సరళ ఇదివరకు పాశ్చాత్య వ్యామోహంతో కొన్న జపాను, బెంగళూరు సిల్క్‌ చీరలు అన్నీ అగ్నిలో దహనం చేస్తుంది. ఖద్దరు చీర ధరించి, ఖద్దరుకున్న గౌరవం విదేశీ బట్టలకు లేదని ప్రచారం చేస్తుంది. ఖద్దరు బట్టలమూట నెత్తినబెట్టుకొని ఖద్దరమ్ముతుంది.

సంసారంలో వైఫల్యం చెందిన స్త్రీలకు జాతీయోద్యమం ఒక ప్రత్నామ్నాయ ఆదర్శంగా కార్యక్రమం కావటం గమనించవచ్చు.

సరళ పేరు ప్రఖ్యాతులు ప్రతి పత్రికలో చదివి పశ్చాత్తాపంతో బేగ్‌ సరళను వెతుక్కుంటూ వస్తాడు. సరళ ‘ఇకరాను’ దేశమే  నాకు సంసారం. నీ కిష్టమైతే దేశసేవ చేయమని అంటుంది. మాతృదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాతే మనకు సంసారం అనటంతో ఆమె స్వాతంత్య్రకాంక్షను బలంగా చూపించింది రచయిత్రి. ఒక రోజు బెజవాడలో విదేశీ బట్టల దుకాణం దగ్గర పికెటింగ్‌లో అరెస్టయి ఆరునెలలు శిక్షతో రాయవేలూరు జైల్లో వేస్తే ఆహారనియమాలు పడక 21 రోజులు    ఉపవాసం ఉటుంది. దేశం కోసం ప్రాణాలు ధారపోయటం నా అదృష్టమని తల్లిదండ్రులకు, స్నేహితురాలికి తెలియజేస్తూ దేశసేవ మాత్రం ఏనాటికి మరువద్దని ఆఖరుమాటగా చెప్పి ప్రాణాలు పదులుతుంది. 

సరళ ఉన్నతాశయాల కొరకు పనిచేసి ప్రాణాలు వదలినందుకు కమల తన కూతురుకి సరళ అని పేరు పెట్టుకొంటుంది. సకాలంలో పెళ్ళి చక్కని సంసారం భర్త ఆశయాలకనుగుణమైన ఆశయాలు  ఆచరణ ఉన్న కమలదా అదృష్టం? సంసారం జీవితం, విఫలమైనా జాతీయోద్యమంలో సార్థకమైన జీవితం గడిపిన సరళదా అదృష్టం? అనే ప్రశ్న పాఠకులను వెన్నంటుతూనే ఉంటుంది. ఒకసారి ఒకవైపు మరొకసారి మరోవైపు మొగ్గుతుంది మనసు. ఆ ఇద్దరూ ఒకే వ్యక్తిత్వంలో భాగం కావటం రచయిత్రి ఆకాంక్ష.

జాతీయోద్యమంలో మహిళా కార్యకర్తల సహాయ సమయ స్ఫూర్తి తాడినాగమ్మ రాసిన ఇది కథకాదు’లో కథాంశం భర్త కోసం ఖద్దరు ఉద్యమంలో పాల్గొన్న మరో ఇల్లాలు రాధకథ చంద్రకాంతం రాసిన ‘ప్రేమ వేదిక మీది’ కథ. కన్నతల్లి పోషణార్థం జాతీయోద్యమానికి దూరమైన కుమారునికి కర్తవ్యం బోధించిన మాతృమూర్తి ఉద్భోధ మైదవోలు పద్మావతి రాసిన ‘త్యాగిని’ వృత్తాంతం.

జాతీయోద్యమం నేపథ్యం నుంచి వచ్చిన స్త్రీలు రాసిన కథలలో మరింత విలక్షణమైంది తాడినాగమ్మ రాసిన ఒక ముద్దుకథ. జాతీయోద్యమ కార్యకలాపాలలో చైతన్యంతో చొరవతో పాల్గొంటున్న స్త్రీల చరిత్రను ప్రస్తావిస్తూ సామాజిక రంగాలలోకి వచ్చే స్త్రీలు ఎదుర్కొనే సున్నితమైన సమస్యను మనముందు పెట్టింది ఈ కథ.

కథలో యువతకి 18 ఏళ్ళు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొంటూ స్వదేశీ వస్త్ర విక్రయం తనపనిగా చేస్తున్న యువతి. నేధన్యనైతిని’ కథలోని శారదాబాయి లాగ వితంతువు కాదు. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ఐదుమాసములు ఇరువది దినములు’ కథలోని రుక్మీణిలాగ ఇల్లాలు కాదు.  ఎవరిదదృష్టం కథలోని సరళలాగ విఫలమైన సంసారం కలది కాదు. పెళ్ళికాని యువతి. స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తి. స్వదేశీ ఉద్యమం వెనుక ఉన్న దేశీయ ఆర్థిక బలం గురించి తెల్సిన విద్యావంతురాలు మేధావి.

విదేశీ వస్త్రాల కొనుగోలు వల్ల సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరగుతుందని కొంతకాలం తర్వాత భారతీయులందరూ భిక్షాందేహీ అనే స్థితికి వస్తారని ఆవేదనతో స్వదేశీవస్త్రాలు మాత్రమే కొనమని ప్రజలను వేడుకుంటుంది. అప్పుడు ఆమె ఉపన్యాసం విన్న ధనమదాంధుడైన ఒక పురుషుడు ఒక ముద్దు ఇస్తే స్వదేశీ దీక్ష అవలంభిస్తానంటాడు.

సామాజిక ఉద్యమంలోకి ప్రవేశించే స్త్రీలకు మాత్రమే ఎదురయ్యే ప్రత్యేక అనుభవం ఇది. స్త్రీలను లైంగిక దృష్టితో చూడటానికి మాత్రమే అలవాటు పడ్డ పురుషుల నుండి ఉద్యమాలలోకి వచ్చే స్త్రీలకు ఎదురయ్యే సమస్యను తాడినాగమ్మ 1930లోనే  ఊహించటం గమనించదగింది. 

ఇక్కడ ఆ యువతి ఒక దేశభక్తురాలుగానో, మేధావిగానో ఆ పురుషుడికి కనబడలేదు. తన అనుభవానికి సిద్ధంగా ఉన్న తాను హేళన చేయటానికి అవమానించడానికి అనువుగా ఉన్న రెండవ స్థాయి పౌరురాలుగా మాత్రమే కనబడింది. అందువల్లనే ఒక ముద్దు ఇస్తే ఉద్యమానికి పని చేయగల్గుతానని అనగలిగాడు.

ఇలాంటి పరిస్థితులలో యువతులు అవమానంతో దు:ఖపడటం కాదు. ఆత్మ గౌరవంతో అలా అన్నవాళ్ళను ధిక్కరించగల్గాలి. ఈ కథలో యువతి చేసినపని అదే. ఆమె మొక్కవోని ధైర్యంతో ‘‘నా కిరువురు అన్నలుగలరు. ప్రతిరోజు నన్ను ముద్దాడుకొని ఆశీర్వదించి శాంతి సమరానికి పంపుచున్నారు. తరతరాల నుండి దాస్యాన్ని అనుభవిస్తున్న మాతృభూమి విముక్తికోసం విదేశీ వస్తువులనే విషానికి ఆహుతి అవుతున్న నీలాంటి సోదరున్ని రక్షించుకోవడానికి ఒక ముద్దు ఇవ్వలేనా? నీవు నా మూడవతోబుట్టువు. ఒకటి కాదు, ఎన్నైనా పొందమని’’ ఆమె తన సంసిద్ధతను వ్యక్తంచేసింది. ముద్దు అతని దృష్టిలో ఒక లైంగిక చర్య. ఆమె దృష్టిలో స్నేహాన్ని సానుభూతిని, ఆప్యాయతను వ్యక్తీకరించే చర్య. ముద్ధును దాని లైంగికత్వముద్రనుండి విముక్తం చేసి ఒక మానవీయ సంస్పందనగా నిలబెట్టటం ఆ యువతి వికాసానికి  ఔన్నత్యానికి గుర్తు. ఉద్యమాలలో స్త్రీల భాగస్వామ్యం  జాతీయోద్యమాన్ని, ఆత్మాభిమానాన్ని కల్పుకొని సాగాల్సిన స్థితి గురించి ఈ కథ చెప్పింది.

తాడినాగమ్మ రాసిన ‘ఒక ముద్దు’ కథలో దేశీయస్వాతంత్య్ర ఆకాంక్షతో పాటు, విదేశీ వస్తు బహిష్కరణ పెనవేసుకున్నాయి. స్త్రీలను జాతీయోద్యమంలోకి సమీకరించటమే కాక సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకించే చైతన్యాన్ని స్త్రీగా స్వతంత్ర వ్యక్తిత్వ చైతన్యాన్ని కూడా రచయిత్రి ఇందులో చూపించారు. 

ఈ విధంగా స్త్రీ కథలు జాతీయోద్యమ ఆదర్శాలను ఆయా ఉద్యమాలలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని చైతన్య చరిత్రను నమోదు చేశాయి.

ఉపయుక్త గ్రంథాలు :

1. తాగినాగమ్మ కథలు, రచనలు సం॥ సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్దండి శ్రీథర్‌

2. తెలుగు సాహిత్యంలో స్త్రీ వాద విమర్శకురాలు డా. కందాల శోభారాణి

3. తెలుగు సాహిత్య విమర్శ`స్త్రీల కృషి` డా. కందాల శోభారాణి

4. స్త్రీల కథలు`5  1901 – 1980` సం॥ డా.కె. లక్ష్మీనారాయణ

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply