తేలు కుట్టిన దొంగ

దొంగను తేలుగుడితే అమ్మో! అబ్బో! నాకు తేలుగుట్టిందని అరస్తాడా? అరవడు. సంతలో పిత్తినోడి మాదిరిగా జారుకుంటాడు. ఈడా అదే జరిగింది.

నేను పైట పొద్దుకాడ ఈదమ్మటా పోతా ఉండాను. మల్తేపుగోడు తాగి ఊగతా ఎదురుపడినాడు.
నేను “యాడికి?బొయ్యుంటిరా మావా! అని అడిగినాను.
వాడు “వోరి నీయమ్మా తోటి నా కొడకా! ఇంటికాడ ఏంజేస్తావుండావురా? అట్ట గ్రామున్సీపు ఇంటికాడ బొయ్యి సూడుబో’ జాతర జరిగినట్టుండాది. ఉడికే సియ్ కూర ఉడకతా ఉంటే, తినేవోళ్ళు తింటావుంటే, తాగే వోళ్ళు తాగతావుంటే, నేను మద్దేణం నించి కాసుకోనుంటే, “తాగరా! నియమ్మా”అని  నాకు రొండు సారాయి పొట్లాలు అంత కణితి కూర బెట్నారు. తాగి తినొచ్చినాన”ని సెప్పి, పడతా లేస్తా ఇంటికి పొయ్ నాడు, వాడూ మా బామార్దేలే.

సియ్ కూర తినే దాంట్లో గ్రామున్సీపు తరవాతనే ఎవ్వురైనా. పూటపూటకీ కౌసుకూర లేనింది ఆయనికి పొద్దుపోదు ముద్ద దిగదు. బాగ బల్సి కొవ్వుబట్టిన మేకపోతూ పొట్టేళ్ళనే పట్టకొచ్చి కోసితింటా ఉంటాడు. జివ్వాల మిందికి వొదిలిన మేకపోతో పొట్టేలో ఆయని కంట్లో పడిందనుకో, ఆ పొద్దిటితో వాటి ఆయువు అరించుకు పొయినట్టే లెక్క.ఆయన నోరు తెర్సి అడిగితే ఎవ్వురైనా అడ్డమాట సెప్పకుండా పట్టీయాల్సిందే.
కాదన్నోడికి ఆ పొద్దిట్నించీ కష్టాలు ఎంటాడినట్టే. అప్పిట్టకప్పుడు అడివి కావిలోళ్ళను పిల్సి పలానోడి మేకలు అడివిలో మేస్తావుండాయి మలేసుకొని పోండని పిల్సి సెప్పేస్తాడు. లేదంటే దేంట్లోనో వొక దాంట్లో ఇరికించి ఏడిక జూస్తాడు.

ఆయన దగ్గర వాళ్ళ పెద్దోళ్ళ కాలం నించీ నాటుతుపాకుండాది. దాన్ని సేతబట్టుకొని అప్పుడప్పుడు అడివికి యాటకు పోతా ఉంటాడు. కణితినో దుప్పినో యాటాడకొచ్చి, పెద్దపెద్దోళ్ళనంతా ఇంటికి రప్పించుకొని, వాళ్ళకు తాగిపించి తినిపించి ఏలకేలు ఖరుసు బెడతా ఉంటాడు గాని, మా పేదా సాదకు కూలిగింజలు గూడా సరిగ్గా ఇయ్యకుండా మా కడుపులు గొడతాడు. ఆయనంతా కాకుల్ను గొట్టి గెద్దలకేసే రెకం. పేదోళ్ళ కడుపులు గొట్టి పెద్దోళ్ళకు పెడతా ఉంటాడు.
వొకప్పుడు మేవు ఊళ్ళల్లో సచ్చిన గొడ్డూ గోదా తెచ్చుకోని తింటావుండే వోళ్ళం గాని ఇప్పుడు తినేదిలేదు. పేణాల్తో తెచ్చికోస్తే తింటావుండాము. ఇంగ మా పిలకాయలు సెయ్యే పెట్నంటారు. యట్టంటే వాళ్ళు సదువుకొని మంచీ సెడ్డా తెల్సుకుంటా ఇప్పుడిప్పుడే మార్తా ఉండారు. ఉద్దేగాలు సేసే వోళ్ళయితే తినేదేలేదు పొట్టేలు ‌మేకపోతు కూర్లయితేనే తింటావుండారు.

నన్ను శానామంది అడగతా ఉంటారు గొడ్డుకూరే మీరెందుకు తింటారని. గ్రామున్సీపైతే మమ్మల్ని గొడుకూర తినే నా కొడకల్లారా! గొడ్డుకూర తినే నా కొడకల్లారా! అని తిడతా ఉంటాడు. గాని ఈ పొద్దు మేం దాన్ని కొత్తగా తినేదేమీ లేదు పుట్టార్బం తింటానే ఉండాం. పైగా పొట్టేలు మేక పోతు కూర్లు వోపినంత రేట్లుజెప్తారు.

అంతంత రేట్లు పెట్టి తెచ్చి తినాలంటే మా బోటి పేదా సాద వొల్ల యాడైతింతి. తెచ్చినా నాలుగు ఎమకలు నాలుగు సిదర్లుండవు మాకేడ ఆటతాది. మేం సగం సంగటయితే సగం కూర తింటాం. అట్ట తినే దాని వొల్లే కష్ట పడతాం. అట్టగాక మెలీసుగా తింటే యాడ కష్ట పడతాం. కష్ట పడితేనే మాకు తిండి దొరకతాది. దాని వొల్లానే మేం గొడ్డుకూరను దాపిరకం లేకుండా తింటాం.

అదీ ముందు మాదిరిగా మాకు దొరికేది లేదు. ఎప్పుడైతే అందురూ తినమరిగి నారో అప్పుడే దానికి గిరాకి పెరిగి పొయింది.  ముందంతా కుప్పలేసి ఇచ్చేవోళ్ళు ఇప్పుడు తూకమేసి ఇచ్చేదానికి మరిగినారు. నేనే శానామందికి తెచ్చిస్తా ఉంటాను. అంతెందుకు వూర్లో సినబ్బరెడ్డి  పెండ్లాం ముత్తేలమ్మయితే తెచ్చిచ్చేదాక వొదల్దు. కోసే తావుకు పొయి సూడాల, కొంతమంది రెడ్లూ నాయుళ్ళు మూడో కంటికి తెలవకుండా జవరక పోతా ఉంటారు.

వాళ్ళట్ట అడుగు మార్సినారనుకో అదే పొట్టేలు కూరని సెప్పి తింటారు. తాటి సెట్టు కింద కూసోని నీళ్ళు తాగినా కల్లను కున్నట్టే  మేం పొట్టేలు కూర తెచ్చి తిన్నా గొడ్డుకూరే  అనుకుంటారు. అందరూ తెచ్చి తిన్నట్టే మేవూ తింటాం గాని మేం తింటే పాపమంటారు అందరికీ లేని పాపం మాకు మాత్రం యాణ్ణించి వొచ్చింది అట్ట పాపాన్ని గురించి సెప్పుకుంటా పోతే కోడి, మేక, గొర్రె, దేన్ని తిన్నా పాపమే గదా!

అన్నిటికీ అడ్డమొచ్చినట్టే, ఇప్పుడు మేం తినే తిండికీ అడ్డమొస్తా ఉండారు. పలాన తిండే తినాల, పలాన గుడ్డే కట్టాల‌, పలాని గుడికే పోవాలని కట్టుజేస్తా ఉండారు. మాకూ యిష్టాఇష్టాలుంటా యనుకోరు. అన్నీ వాళ్ళు సెప్పినట్టే సెయ్యాలంటే యాడవతాది వొక్కొక్క సారి చీ! యదవ బతుకు అనిపిస్తాది.
ఆ మర్సనాడు నేనేదో పనుండి గ్రామున్సీపు ఇంటి కాడికి పొయినాను.”దండాలు సావీ! అంటా. ఆయన నన్ను సూస్తానే “ఏవిరా సెంగల్రాయా! నిన్నంతా యాడికి పొయ్యుంటివి” రాలేదే అని అడిగినాడు.

నేను”కొంచిం పనుండి రాలేదయ్యా! ఏవన్నా ఇసోసమా” అని అడిగి నాను.
అయన “మొన్న మేం శానా మందిమి ఉత్తరపు అడివికి పొయ్యుండి కణితిని కాల్సి మెత్తని ఆయాలంతా ఆడనే వాడ్సి ఏంచి తినేసినాము. నువ్వొచ్చుంటే నీకూ దక్కుండేది రాలే మిగల్న కూర గూడా ఈ పొద్దు తలా కొంచిమిచ్చి మిగిలింది తినేసి అయిపాయ. ఆ గొడ్ల కొట్టంలో తోలుండాది, తీసకపొయి మాదిగ పెద్దోడికిచ్చి ఊనగట్టమని సెప్పు, కిరుకుజోళ్ళు కుట్టుకుందా మనుకుంటా వుండా” అన్నాడు.

కొండంత రెడ్డొచ్చి కొంగుబట్టుకొంటే కాదనే దానికి లేదని సామెతుండాది అట్ట, గ్రామున్సీపు సెప్పితే కాదనే దానికి లేదు. అందుకే గబగబా పొయి కొట్టంలో ఏలగట్టుండే తోల్ను ఇప్పి సూస్తే, అది కణితి తోలు గాదు దున్నపోతు తోలు. ఎంటనే పొయి ఎవురూ లేనింది సూసి గుసగుసా ఆయని సెవులో సెప్పినా అయా! అది కణితి తోలు గాదు దున్న పోతు తోలే” అన్నాను.

ఆ మాటినే కొద్దికి, ఆయనకు దగ్గోత్రంగా కోపమొచ్చేసి “దున్న పోతు కూర తినేదానికి నేను నీ మాదిరిగా మాల నాకొడుకనుకుంటిరా కణితికి దున్న పోతుకు తేడా తెల్దా నాకు” అన్నాడు.

నేను తలగీరుకుంటానే “అయా! తోలు జూసేది నాకీపొద్దు కొత్తా ఎన్నో సూస్తా ఉంటాను” అన్నాను.

ఆయన “పోరా! పోరా పంగ మాల్నిన నాకొడకా నీకు సెప్పినాను సూడు, నాదే బుద్ది తక్కవ అన్నాడు. నేను మారు మాటాడకుండా మల్లీ కొట్టంలోకి పొయి, ఇప్పిన తోలు సుట్టతా ఉంటే ఆయని సేద్దిగాడు మల్లిమొగ్గోడు వొచ్చినాడు.

నేను “ఏందిరా? మల్లిమొగ్గా! మీ ఓనరు ఇట్టాటోడుగా ఉండాడు. ఇది కణితి తోలు కాదనిందానికి నా మింద ఎగిరెగిరి పడతా ఉండాడు” అని అడిగినాను.
వాడు “సెంగల్రాయన్నా! నేను నిన్ననే గెవణించి నాను. ఇది దున్నపోతు తోలని సెప్పి ఆయని దగ్గిరెందుకు అమ్మలక్కల్ని అనిపించుకోవాలని గమ్మోనైపొయినాను” అన్నాడు.

నేను “నేనూ గమ్మోనై పొయ్యుంటే బాగుండును గాని ఇంతకూ యాడ? కాల్సినారంట దీన్న” అని అడిగినాను.

వాడు “సెంగల్రాయన్నా! నాకూ ఆయన్తో కూడా బొయినోళ్ళ సెప్పితే తెల్సింది. అడివంతా తిరిగినారంట యాడా ఏమీ దొరకలేదంట తిరిగొస్తావుంటే అడివి మొగుదాలలో మాంబేటోళ్ళ సేన్లకాడ కనబడితే కాల్సకొచ్చినారంట” అన్నాడు.

మేమిట్ట మల్లగుల్లాలు పడతా ఉంటే, మాంబేటి రావనాధ రెడ్డి గ్రామున్సీపును రెడ్డా! రెడ్డా! అని పిలస్తా వొచ్చి, రోండు దినాల్సించి మా దున్నకొర్రొకటి కనబల్లే మన సేన్లకల్లేమన్నా వొచ్చిందా రెడ్డా” అని అడిగినాడు.

అప్పుడు గ్రామున్సీపు మూతి సూస్తే సలసల కాగే సముర్లో ముంచి దేవిన అప్పళం మాదిరిగా ఆయని మూతి ముప్పైయారు వొంపులు తిరిగిపొయ్యుడాంది. ఇంగ ఆడనే ఉంటే దొరికి పోతామనుకున్నాడేమో, ఏవో నాకేం దెల్సు నాకేందెల్సంటా సంతలో పిత్తినోడి మాదిగా ఇంట్లోకి జారుకున్నాడు.

ఆయన మల్ల రావనాధరెడ్డి పొయిన కొంచేపుటికొచ్చి, ఎప్పుడూ మమ్మల్ని బారడు దూరంలో పెట్టి మాటాడేవోడు. అప్పుడు నా దగ్గరికొచ్చి నా కుడి సెయి పట్టుకొని యాడా సెప్పద్దురో అన్జెప్పి నా సేతిలో పది రూపాయల కాతికం పెట్టినాడు,నేనొద్దన్నా. ఆ పొద్దుట్నించీ మల్లెప్పుడూ గ్రామున్సీపు మమ్మల్ని గొడ్డుకూర తినే నా కొడుకులు అనకుండా ఆయని నోరు మూత బడిపొయింది.


                                    ****

Leave a Reply