తెంచేసిన నేల నుంచీ కంచెల్ని తెంచుతోన్న యువస్వరాలు…

అప్పుడే రెండేళ్ళు… కాలగమనంలో రెండేళ్లంటే యే మాత్రం చిన్న సమయం కాదు. ముఖ్యంగా హృదయాలు వేదనతో, దుఃఖంతో, చీకటితో నిండివున్న వారికి క్షణమొక యుగం. యెటు చూసినా పరుచుకొన్న ఆకుపచ్చని లోయలు… శ్వేతశిఖరాలు… నిర్వచనకి అందని ఆ సౌందర్యం ఆ నేలని దూరం నుంచి చూసేవారికి. కానీ ఆ భూమి మీద శ్వాసించే వారికి అక్కడి నిశ్శబ్దం యేమి చెపుతోంది?! అక్కడ అలికిడి లేకుండా మొలకెత్తుతున్న లేత పచ్చిక యేమి మాటాడుతోంది? ఆ పచ్చిక చివర మౌనంగా మెరుస్తోన్న మంచుకొండలు యే స్వరాలకు పురుడు పోస్తున్నాయి?

“కవిత్వం విలాసవంతమైనది కాదు. అది మన వునికికి సంబంధించిన వొక కీలకమైన అవసరం. అది మన చుట్టూ వున్న కాంతిని మరింత మెరుగ్గా వుండేలా చేస్తుంది. కవిత్వంతోనే మన ఆశలు, కలల మనుగడ, మార్పులని నమోదు చేస్తాం” అని అంటారు ఆఫ్రికన్ అమెరికన్ కవి, హక్కుల కార్యకర్త ఆడ్రే లార్డ్.

వాస్తవానికి విరుద్ధమైన వార్తలు మాత్రమే వినబడుతున్నప్పుడు, లేదా అసలు వార్తలే లేనప్పుడు ఆ అంతరాల్ని పూరించడానికి కవిత్వం రాస్తున్నామని కాశ్మీరీ కవులు చెపుతున్నారు. కవిత్వం నుంచి మనం తెలుసుకునేవి వార్తల నుంచి తెలుసుకునేవాటి కంటే యెప్పుడూ చాల భిన్నంగా వుంటాయి.

ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి చిక్కుకోడానికి ఆరునెలలకి ముందే కాశ్మీర్ లాక్ డౌన్ లో చిక్కుకొంది. ఆగస్ట్ 5 2019 నాడు ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీరుని రెండుగా విభజించి, అక్కడ ప్రజలందరినీ లాక్ డౌన్ లోకి నెట్టివేశారు. నిస్పృహ, అశాంతి, భయం, దుఃఖం, చెల్లాచెదురైన కథనాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించిన నిశ్శబ్దపు తివాచి కింద కాశ్మీర్ గత రెండేళ్ళుగా కప్పబడి వుంది.

వొకప్పుడు “భూలోకపు స్వర్గం” గా ప్రశంసలు అందుకొన్న కాశ్మీర్ ని భూలోకం మీద అత్యంత నరకంగా మార్చేసిన పరిస్థితులేమిటి? జీలం సరస్సు మీద హంసల్లా తేలియాడే పడవలు, ఆకాశాన్నంటే చినార్ వృక్షాల బారులు, కుంకుమ పువ్వులు, మంచు కొండలూ, తులీప్ పువ్వుల తోటలు, ప్రేమలు ప్రధాన సంగతులుగా తొణికిసలాడిన రొమాంటిక్ సాహిత్యం స్థానంలోకి ప్రతిఘటనా సాహిత్యం చొచ్చుకురావడానికి కారణాలేమిటి? మూడున్నర దశాబ్ధాల కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మాయం చెయ్యబడటమో, నిత్యమారణ హోమంతోనో, విస్తరిస్తోన్న సమాధుల మధ్యనో, ధైర్యంతో, ధిక్కారంతో అక్కడ ప్రజలెందుకలా నిలబడి వున్నారు?

కాశ్మీర్ 70 యేళ్ళకు పైగా వివాదంలో వున్న భూమి. 1947 లో బ్రిటీష్ వలస రాజ్యాన్ని భారత, పాకిస్తానులుగా విభజించినప్పుడు స్వతంత్ర దేశంగా వున్న కాశ్మీర్ ని భారత్ లోనో పాకిస్తానులోనో చేర్చడానికి కాశ్మీర్ మహారాజా యిష్టపడలేదు. కానీ విభజన జరిగిన వెంటనే పాకిస్తాన్ గిరిజనులు కాశ్మీర్ పై దాడి చేసారు. ముస్లిమ్ ఆధిపత్యంగా వున్న కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ లో విలీనమవుదామనే అందోళన చేపట్టారు. కాశ్మీర్ మహారాజా సాయం కోసం భారత్ ను అర్థించారు. చొరబాటుదారుల తొలగింపు తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజల స్వయంప్రతిపత్తికి అంగీకరిస్తామని విలీన వొప్పంద పత్రాలపై సంతకం చేసిన భారత ప్రభుత్వం యిప్పటి వరకూ ఆ ప్రజాభిప్రాయసేకరణనే జరపలేదు. అప్పటి నుంచి కాశ్మీర్లో అశాంతి చెలరేగుతూనే వుంది. 1947 నుంచి యిప్పటి దాక భారత్ , పాకిస్తాన్ ల మధ్య కాశ్మీర్ కోసం మూడు యుద్ధాలు జరిగాయి. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే డిమేండ్ తో అక్కడ ప్రజలు ఆందోళన చేస్తూనే వున్నారు. ప్రజలు ‘ఆజాదీ’ నినాదంతో వుద్యమించటం మొదలు పెట్టారు. కాశ్మీర్ లో మైనార్టీలుగా వున్న పండిట్స్ యెక్కువ శాతం మంది ప్రజాభిప్రాయ సేకరణ వైపే మొగ్గారు. 5 ఆగస్టు 2019లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 A లని రద్దు చేసి కాశ్మీర్, లడక్ లుగా ఆ నేలను రెండుగా విభజించారు.

కాశ్మీర్ సమస్యని యెలా చూడాలనేది మొదటి నుంచి భారతదేశ ప్రజల్ని కలిచివేస్తోన్న ప్రశ్నే. కాశ్మీరుని వో భారతీయ గౌరవంగానో, వో పాకిస్తానీ జాతీయ అహంకారంగానో, వో అమెరికా ప్రేరేపిత సవాలుగానో చూస్తూ వస్తూన్నారే తప్పా, ప్రజాస్వామ్యానికి సంబంధించిన వో ముఖ్యమైన సమస్యగా చూడటం లేదు. ప్రతీ పరిణితి చెందిన దేశపు చరిత్ర అది దాని ప్రజల ఆకాంక్షలతో, జాతి వుద్యమాలతో యెంత సున్నితంగా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించింది అనేదానిమీదే ఆధారపడి నిర్ణయించబడుతుందని ప్రతి వొక్కరూ తెలుసుకోవాలి. కాశ్మీర్మీ ప్రజల “ఆజాదీ” అర్ధమేమిటో అరుంధతీ రాయ్ స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పారు. “ఆజాదీ అంటే స్పష్టంగా ఆలోచించగలగటం. స్వేచ్ఛ గా మాటాడగలగటం. నిర్భయంగా వినగలగటం.”

2008లో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన కాశ్మీరీ కవి ‘రెహమాన్ రాహీ’ ఆ అవార్డ్ ని అందుకొంటూ “నేను సంతోషంగానూ, విచారంతోనూ వున్నాను. సంతోషమెందుకంటే నేను గౌరవించబడ్డాను. విచారమెందుకంటే నా ప్రజలు దుర్భరమైన బాధల్లో వున్నారు” అని చెప్పారు. యీ వొక్క వాక్యం చాలు. వర్తమాన కాశ్మీరీ సాహిత్వాన్నివిశ్లేషించుకోడానికి, అర్ధం చేసుకోడానికీ. 2019 ఆగస్ట్ కి ముందు, తరువాతగా కాశ్మీరు సమస్తమూ విడదీయబడినట్టే అక్కడ సాహిత్యం సైతమూ విడదీయబడింది. అరకొర వసతులూ, యింటర్నెట్, సమస్త మాధ్యమాలూ బందిఖానాలో చిక్కుకుపోయిన నేపధ్యంలో ఆ చీకట్లను చీల్చుకొంటూ అక్కడ చిగురిస్తోన్న ఆ లేత గొంతుకలే భవిష్యత్ కాశ్మీరు చరిత్రను లిఖించనున్నాయి. కాశ్మీర్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన వాస్తవికతకు కాశ్మీర్‌లోని యువ కవులు యెలా స్పందిస్తున్నారో చూద్దాం!

ఆగష్టు 5, 2019 వరకు, బరియా హమీద్ అనే కాశ్మీర్ యువతి ప్రకృతి, అందం వంటి అంశాల మీద చిన్నచిన్న కవితలు రాసేవారు. న్యూఢీల్లీలోని జామియా మిలియా యిస్లామియా విశ్వవిద్యాలయంలో లిటరేచర్ ని ప్రధాన సబ్జెక్ట్ గా విద్యనభ్యసిస్తున్న యీ 24 యేళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ రాసే కవిత్వం పూర్తిగా మారిపోయిందిప్పుడు. కాశ్మీర్ నుంచి బలమైన కవిత్వం రాసే కవుల్లో యిప్పుడామె వొకరు.
“యిది నా కవిత్వంలో వొక మలుపు. కవిగా నేనెలా వున్నాను, నేనేమి చేస్తున్నాను, నేను నిజంగా యేమి చేయాలి?” అనే ప్రశ్నలు, స్పష్టత మొదలయ్యాయని ఆమె చెబుతున్నారు.

కశ్మీర్ లోయలోని యీ పరిస్థితిని తన తొలి రాజకీయ కవితలో హమీద్ ఆగస్టు 5, 2019 కి ముందు వొక రాత్రి దృశ్యాలను గురించి రాశారు.
“రాత్రి యిక నిశ్శబ్దంగా లేదు,
పెదవులు ఆశతో ప్రార్థనలు చేస్తాయి,
చర్మం భయానక స్థితితో వణుకుతుంది”

నెలల తరబడి కాశ్మీరీలు తమ యిళ్లకు మాత్రమే పరిమితమయ్యారు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల గురించి యే సమాచారం తెలియదు. తమకు దగ్గరగా వున్న యెవరైనా మరణించారనే విషయం కర్ఫ్యూలో వున్న ప్రజలు తెలుసుకోవడానికి రోజులు లేదా వారాలు పట్టేది. యిళ్ళ నుంచి యువకుల్ని, పిల్లల్ని వేలసంఖ్యలో అరెస్ట్ చేసి భద్రతా దళాలు యెక్కడ వుంచారో, అసలు వుంచారో లేదో కూడా తెలియని నిస్సహాయ పరిస్థితి నెలకొంది.

“మీరు నా కేకలు వింటారు
కానీ ఫోన్లు, యింటర్నెట్
యికపై పనిచేయవు.
మందులు, ఆహారం, మరి కొన్ని నిత్యావసరాల్ని కొనాలి
కాని కర్ఫ్యూలు అన్నింటినీ మూసివేసాయి.

నేను నెలల తరబడి వుక్కిరిబిక్కిరయ్యాను
నేను యెవర్నీ చూడటం లేదు
తెంచేయబడిన యీ భూమిలో,
నేను యింకా వూపిరి పీల్చుకుంటున్నానో,
లేదో కూడా మీకు తెలియదు”

యీ పద్యం చివరి చరణంలో, హమీద్ కాశ్మీరీలను గృహాల లోపలే వుంచడం గురించి విలపిస్తారు. వారు సజీవంగా వుంటే ఆశ్చర్యపోతారు.

“గోడలు అరుస్తుంటే నేను కూర్చొని చూస్తుంటాను.
రాత్రి భయానక పోరాటాలు, పగటి వేధింపులు
రోజులు, నెలల తరబడిగా విస్తరించి వున్నాయి.
నా ప్రజలను నేను మళ్ళీ చూస్తానా?
యింకా వారు జీవించే వున్నారా?”

ఆమె మరొక కవిత సంక్షోభంతో పోరాడటానికి కావాల్సిన ప్రేమ, శక్తిని గురించి మాట్లాడుతున్నారు.

“ఖననం చేసిన స్మశానవాటిక నా హృదయం,
యిక్కడే మన రహస్యం వుంది,
చెప్పని కథలు, ఆశల పాటలు వున్నాయి
పడటం, మేల్కొనడం నుండి గాయాలు
అక్కడ పడుకోండి, అది పీడకలల్ని తెచ్చిపెట్టింది.

ప్రేమా, యెట్టకేలకు వచ్చావా!
యిప్పుడు యేమి మిగిలి వుంది,
మీ ఆలోచనలను భద్రం చేయండి
నేను మీ గుండెలో వొక పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తాను

వోహ్! యిక్కడ సమాధులను పుణ్యక్షేత్రాలు అని కూడా పిలుస్తారు!”

హమీద్ కాశ్మీర్ లో కొత్తగా తయారవుతున్న, చెల్లాచెదురుగా వున్న కవులు ,రచయితల బృందంలో వో భాగం. వారు కాశ్మీర్ పరిస్థితిపై తమ కళ్ళకు శిక్షణని యిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేయడంపై కాశ్మీర్ సాహిత్య స్పందన అంతగా బయట ప్రపంచానికి తెలియదు. అయితే, ఆగస్టు 5, 2019 నిర్ణయం యీ యువతరం కవుల గుర్తింపు, నిస్సహాయత, భవిష్యత్తు వంటి స్టార్కర్ యితివృత్తాల వైపు మళ్లడం మొదలైంది.

యీ యువ కవులు పెద్దగా సాహిత్య ప్రపంచానికి తెలియక పోయినా త్వరలోనే తప్పక వెలుగులోకి వస్తారు. చాలామందిలా కాకుండా, వారు ఆహ్వానాలు వున్నప్పటికీ ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు హాజరుకారు. వారిలో కొందరు తమ కవితల్లో అధికారులను వ్యతిరేకించడం వల్ల కలిగే పరిణామాలేమిటో వారికి తెలుసు. అయినప్పటికీ, కాశ్మీర్ పద్యంలో రాయకుండా వారినెవరూ ఆపలేరు.

***

“వొక కవి తన కాల పరిస్థితిని ప్రతిబింబించకపోతే, అతన్ని బహిష్కరించాలని వొక ప్రసిద్ధ సామెత వుంది” అని వుత్తర కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాకు చెందిన 28 యేళ్ల వుర్దూ కవి అకీల్ మొహియుద్దీన్ అంటున్నారు. 2018 నుండి, కాశ్మీర్ సాహిత్య సన్నివేశంలోని శూన్యతను పూరించడానికి మొహియుద్దీన్ తన వంతు కృషి చేస్తున్నారు.

“కాశ్మీర్లో సమకాలీన కవిత్వం చాలావరకు వాస్తవికతలను ప్రతిబింబించదు” అన్నారాయన. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయిన నేపథ్యంలో, మునుపటి రాష్ట్రాన్ని పరిపాలించే చట్టాలలో మార్పుల నేపథ్యంలో సాహిత్యం పూర్తిగా నిశ్శబ్దంగా వుంది. దీనికి చాలా కారణాలు వున్నాయని మొహియుద్దీన్ అభిప్రాయం.

“మీరు బహిరంగంగా రాజకీయ లేదా ప్రతిఘటన కవితలు రాస్తుంటే, మీరు యెప్పటికీ ప్రభుత్వంతో గుర్తించ బడరు. అలాగే భయం కూడా వొక అంశంగా వుంటుంది. మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన కవి కాకపోతే డబ్బు, కీర్తి రాదు. అందువల్ల కవులు, రచయితల్లో యెక్కువ మంది గ్రౌండ్ రియాలిటీలని రాయడం మానేస్తారు” అని అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన మొహియుద్దీన్ స్టాటిస్టిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ . వారు ప్రత్యామ్నాయ కవితా సంస్కృతిని యెన్నుకున్నారు. ఆయన రాసే కవిత్వం ఆయనకి జీవనోపాధిని కానీ, యెలాంటి గుర్తింపుని, గౌరవాన్ని కానీ తెచ్చిపెట్టదని తెలిసిన మొహియుద్దీన్ “యిది నాకు అభిరుచి, బాధ్యత, కానీ అదే సమయంలో యిది వొక భారం, నా జీవనోపాధి కోసం నేనింకేమైనా చేయవలసి వుందని నాకు తెలుసు, కాని నేను రాస్తూనే వుంటాను” అని స్పష్టంగా చెపుతున్నారు.

మోహియుద్దీన్ కవిత్వం వివిధ వనరుల నుండి వచ్చింది. 2020 లో కాశ్మీర్‌పై ఆయన రాసిన గజల్‌ను చూస్తే జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) యెన్నికలలో స్థానిక ప్రజలు పాల్గొనడం పట్ల అది నిరసనని వ్యక్తం చేస్తుంది. ఆగస్టు 5, 2019 నిర్ణయం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో నిర్వహించిన మొట్టమొదటి యెన్నికల తంతు అది. జమ్మూ కాశ్మీర్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ మూడవ స్థాయిని పూర్తి చేయడానికి యెన్నికలు జరిగాయి. మొహియుద్దీన్ తన గ్రామంలోని వోటర్ల పొడవైన క్యూలని చూసి కాశ్మీర్ తన సొంత ప్రజలను పారదోలిన పరిస్థితి నెలకొందని తన గజల్‌లో రాశారు.

“అందరూ దీనిని వారసత్వంగా భావించారు
వోహ్! నా కాశ్మీర్ అమ్ముడైంది.

మేము అక్కడ కులం, మతంపై పోరాడుతూనే వున్నాము
భట్, షేక్ , మీర్ అమ్ముడయ్యారు.”

నిరంతర హింసతో బాధపడుతున్న ప్రదేశంలో తాను జీవిస్తున్నట్లుగా మొహియుద్దీన్ కవిత్వం రాస్తారు. అది ఘోరీల దృశ్యం, విధ్వంసం, మరణాలతో నిండి వుంటుంది.

జనవరి 2021 లో రాసిన మరో గజల్ కోసం తాను వుపయోగించిన ఆలోచనను ఆయన వివరిస్తూ “కాశ్మీరీ తన మాతృభూమి గురించి అడిగినప్పుడు బయటి నుండి వచ్చిన వ్యక్తికి యేమి చెబుతుంది?”

“మీ చిత్తుర్వు బాగుంది, మీరొక పువ్వును గీశారు
మేము అగ్ని, సీతాకోకచిలుకలు, బూడిద, కాలిన యీకను గీస్తాము.
మీరేమి సాధించారని యెవరైనా అడిగితే –
సమాధానంగా నేను నా పలక మీద పెద్ద సున్నాని గీస్తాను.

మీ మాతృభూమి అర్థమేమిటి అని అడిగితే
నేను రక్త నివాసాన్ని, చీలిన హృదయాన్ని చూపెడతాను”.

***

కానీ ఆగస్టు 5, 2019 కొత్త కవిత్వానికి పూర్తిగా ఏకైక ట్రిగ్గర్ కాదు. కొంతమందికి కవిత్వం రాయడం అప్పటికే నిరంతర సంఘర్షణ కారణంగా వారి కష్టాన్ని తీర్చడానికొక మార్గం. 2016 లో పోలీసు కాల్పుల్లో మరణించిన తన స్నేహితుడిని కోల్పోయినట్లు డాక్యుమెంట్ చేయడానికి 23 యేళ్ల కవి ఆసిఫ్ తారిక్ భట్ రాసిన గజల్‌లో వొక ద్విపద భాగమిది.

“మరణం చేతిలో మోసపోయిన స్నేహితుడి గురించి నాకు తెలియదు,
అతని కోసమే నేను రక్తంతో తడిచిన వార్తాపత్రికని చదువుతాను”

“యిది వ్యక్తిగత స్థాయిలో అణచివేతతో కూడిన మొదటి చిత్రం. యీ సంఘటన వొక వ్యక్తిగా నాపై చెరగని గుర్తును మిగిల్చింది.” అని అంటున్నారు మధ్య కాశ్మీర్‌లోని గాండర్‌బల్ జిల్లాలో నివసిస్తున్న భట్.

భట్ తన స్థానిక కాశ్మీరీ భాషలో కవిగా గుర్తింపు పొందారు. ఆధ్యాత్మికత, సామాజిక ప్రవర్తన అనే యితివృత్తాలపై కవితలు రాశారు. “కానీ నా పనిలో యెక్కువ భాగం సంఘర్షణ, దాని ప్రభావం ప్రతిఘటనపై దృష్టి పెడుతుంది” అనే యీ వొక కవి తొలుత తన చుట్టూ వున్న సంఘటనలను పట్టించుకోలేదు.

2019 ఆగస్టు తరువాత రాసిన తన వొక కవితలో, భట్ తన ప్రజలు లేకుండా వొక కాశ్మీర్‌ను వూహించుకుంటారు. వారు అదృశ్యమై వేరే ప్రదేశానికి వెళ్ళారు. ప్రఖ్యాత జీలం నదిని వొక రూపకంగా వుపయోగించి, భట్ వొక వొడ్డుకు స్వరం యివ్వడానికి ప్రయత్నం చేస్తారు. యిది కాశ్మీర్ లో అదృశ్యమైన ప్రజల కథను నది గుండా పయనిస్తున్న కొత్త పడవ మనిషి గురించి చెబుతుంది.

“యీ రోజు నేను జీలం వొడ్డున కూర్చున్నప్పుడు
ప్రవాహం దాని ధోరణితో విసుగు పుట్టించింది
నదిలో రక్తం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది.”

పద్యం స్వరం సున్నితమైనది, నిరాశపరిచేది. యిది సుందరమైన అందం, హౌస్ బోట్లు వంటి సుందరమైన చిత్రాలను చూపించదు. బదులుగా, పద్యం జీలం నదికి యిప్పటిస్థితిని కళ్ళ ముందుంచుతుంది.

“కాంతి యిక్కడ నివసించలేదు లేదా చీకటిగా లేదు
నా నివాసం శిధిలావస్థకు చేరుకుంది
జీలం యెప్పుడూ యేడుస్తూనే వుందని
తెలివిలేనివారికి యెలా చెప్పాలి?”

విస్తృతంగా రచనలు చేసినప్పటికీ, యిప్పటి వరకూ ఆ రచనల్ని ప్రచురించని భట్ , తన పనిని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం వుందని అంటారు. “పాఠకుడికి న్యాయం చేయాలనుకుంటున్నాను. నా కవిత్వం వొక నిర్దిష్ట ప్రమాణానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ప్రచురణకు వెళ్ళే ముందు రచన గురించి తెలుసుకోవాల్సింది యింకా చాలా వుంది” అని భట్ గారి అభిప్రాయం.

***

ప్రసిద్ధ యువ వుర్దూ కవులలో వొకరైన 26 యేళ్ళ సయ్యద్ జీషన్ జైపురి ఆగస్టు 5, 2019 కి ముందు అసలు యిలాంటి కవిత్వమే రాయలేదు. ఆగస్టు 2019 సంఘటనలు అప్పటిదాకా ఆయన అనుసరిస్తున్న శైలి నుంచి మార్పుకి దారితీసాయి.

“నా మునుపటి కవిత్వంలో నేను ఆశ, ప్రతిఘటన మార్గాలు, సామూహిక ప్రతిస్పందనలని మాట్లాడే వాడిని కాదు. యిప్పుడు, నన్ను నేను వో విరిగిన వ్యక్తిగా చూస్తున్నాను. కాశ్మీరీలకు యిప్పుడు యే గుర్తింపు లేదని చెప్తున్నాను, అటువంటప్పుడు నేనెందుకు అలాంటి కవిత్వం రాయాలి. యీ అర్ధంలేని విషయాలు నా రచనలో కూడా మోసపోతున్నాయి. కవిత్వంలో కొత్త భాషను కనుగొనడానికి ప్రయత్నిస్తూ, నా వ్యక్తీకరణలను బలంగా చెప్పగలిగే వాటి కోసం చీకటి, రాత్రి, రక్తం, వధ, మరణం వంటి యితివృత్తాలతో రాసే నా కవిత్వం కరుకుగా మారిపోయింది. విచారం, వేరుపడటం లేదా నష్టం గురించైనా గజల్ రూపం విషయానికి యెల్లప్పుడూ తీపినే అద్దుతుంది. మృతదేహాన్ని గజల్‌లో వొక రూపకంగా చూడలేరు. అది పాఠకుడిని కదిలించలేదు” అనే జైపూరి రాసిన ప్రక్రియని చూద్దాం.

“శిరచ్ఛేదం, నేను తడిసిపోయాను, రక్తంతో కప్పబడి వున్నాను,
వో! నన్ను నిద్రపోనివ్వండి.

నేను యింటికి వచ్చాను కబేళాల నుండి నేరుగా,
వో! నన్ను నిద్రపోనివ్వండి.

ప్రతి తోటా యెడారిలాగా మారిపోతుంది
యీటెకి గుచ్చి నేను నా తలని తెస్తాను,
వో! నన్ను నిద్రపోనివ్వండి.

శవాలు, చనిపోయిన సమాధులు, పువ్వులు,
పొడిగా వున్న మొగ్గలు,
వున్మాద హృదయాలు భయభ్రాంతులకు గురయ్యాయి.
నేను యివన్నీ చూశాను.
వో! నన్ను నిద్రపోనివ్వండి.”

కాశ్మీర్లో ఆరునెలల పాటు కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ సందర్భంగా, లోయలో నెలకొన్న వాతావరణం గురించి “ఆల్ అరౌండ్” అనే గజల్లో యింటికి యెలా తిరిగి వెళ్ళాలో తెలియని స్థితిలో బయట నివసిస్తున్న కాశ్మీరీలు అనుభవించిన ఆందోళనని యిలా చిత్రించారు.

“నిషేధించబడింది! యిది నిట్టూర్పు లాగా కూడా వుంది,
యిది భయం కళ్ళెం చుట్టూ తిరుగుతుంది

అన్ని సీతాకోకచిలుకలు చనిపోయాయి,
అన్ని తోటలూ దుఃఖం చుట్టూ తిరుగుతున్నాయి.

సాయంత్రం చివరి వరకు ద్రోహపు జాడలు చుట్టూ
నేను తిరుగుతూనే వున్నాను.

వొక స్నేహితుడు శత్రువుకు స్నేహితుడు,
అంతులేని ప్రదర్శన చుట్టూ తిరుగుతున్నాడు.

పిచ్చి హృదయమా! కొద్దిసేపు నిశ్శబ్దంగా వుండు –
పొగమంచు ఆకాశం చుట్టూ తిరుగుతుంది.”

“యీ గజల్‌ను స్థానిక కాశ్మీరీ గాయకుడు అలీ సఫుదిన్ పాటగా మార్చారు. కానీ యింటర్నెట్ పై కట్ నిషేధం వుండటంతో కాశ్మీర్ నుంచి ఆ వీడియోను అప్‌లోడ్ చేయలేక, ఆ వీడియోను పెన్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి ఢీల్లీకి పంపించాము. కాశ్మీర్ వెలుపల నివసిస్తున్న కాశ్మీరీలకు మేము కవిత్వం రాస్తున్నామని, మేము సజీవంగా వున్నామని చెప్పాలనే ఆలోచన యిది” ” అని ప్రఖ్యాత కాశ్మీరీ వుర్దూ కవి సయ్యద్ అక్బర్ జైపురి మనవడు జీషన్ జైపురి అంటున్నారు.

యీ జైపురి 2019 నుండి జమ్మూ కాశ్మీర్‌లో సమూలమైన రాజకీయ మార్పులను, ప్రతిస్పందనల నడుమ కాశ్మీర్ సాహిత్య సన్నివేశాన్ని నిశితంగా అతను గమనిస్తున్నారు. కానీ కాశ్మీరీ సాహిత్య ప్రముఖులు అతడ్ని నిరాశపరిచారు. కొద్దిమంది మాత్రమే యీ సంఘటనలను వారి కలాలతో నమోదు చేశారని జైపూరీ చెపుతున్నారు.

2020 లో, జైపురి కవుల బృందంతో కలిసి, వర్ధమాన కవులు, రచయితలకు వొక వేదికను అందించడానికి “సాహిత్య బ్యాంకును సృష్టించాలనే ఆలోచనతో, మరీ ముఖ్యంగా, ప్రతిఘటన సాహిత్యానికి గౌరవాన్ని యివ్వాలని, యిక్కడేం జరిగిందో నమోదు చేసిన కొంతమంది వ్యక్తులు వున్నారని మేము భవిష్యత్ తరాలకు చెప్పాలనుకుంటున్నాము.” అంటున్న జైపూరి వొక సాహిత్య వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

***

5 ఆగస్టు 2019 కాశ్మీర్ చాలా ప్రతిఘటనాత్మక యువ స్వరాలని తయారుచేసింది. వారు తమ కవిత్వంతో సరికొత్త కాశ్మీర్ చరిత్రని రికార్డ్ చేస్తున్నారు. యీ కింది కవిత్వం రాసిన కవులంతా 16 -28 యేళ్ళ మధ్య వయస్సున్నవారే !

కొన్ని తాజా యువగళాల్లో ప్రతిధ్వనిస్తోన్న కాశ్మీర్ తో కరచాలనం చేద్దాం.

1.

విరిగిన హృదయం…
(గజల్)
-జలీస్ హైదర్

విరిగిన హృదయాన్ని చక్కదిద్దడానికి,
మనమందరం చివరివరకు ప్రయత్నిస్తాము

ఆశ మైదానంలో అమ్మే అతికించే జిగురుని
మనమందరం కొనుగోలు చేస్తాము

హృదయాల విజ్ఞప్తికి దేవుడు చివరికి సమాధానం యిస్తాడా?
సంచారి చివరికి సినాయ్ పర్వతాన్ని అధిరోహిస్తాడా?

గుండె నొప్పంటే యేమిటో తెలుసుకోవడానికి
గుండె చప్పుళ్లే అత్యంత కీలకం

మనమందరం మన పాఠాలు నేర్చుకుంటాం,
కాని చివరికి యెందుకు వుపయోగపడతాయవి?

చిరునవ్వంటే మనం యెవరి నుంచో మన మనసుని
కప్పివుంచేందుకు ధరించే దుస్తులు

మనం నగ్నంగా యీ ప్రపంచంలోకి వచ్చాము,
చివరికి నగ్నం చేయబడి యేడుస్తాము

గుండె భారాలు భూమిపై మనుషులను వుంచుతాయి
యీక వలె తేలికగా వుండే విషయాలు చివరికి యెగురుతాయి

విధికి చిక్కిన మీ సహచరులను నమ్మవద్దు
మీ నీడ కూడా చివరికి గూఢచారిగా మారుతుంది

ప్రపంచంలోకి కాదు, మీలోకి ప్రవేశించండి
మట్టి ముద్ద కూడా చివరికి ఆకాశంగా మారుతుంది

మోగే మరతుపాకులు వారి ప్రతిజ్ఞలను మీకు గుర్తు చేస్తాయి
వొకే వాగ్దానం చేస్తూ, వారు చివరికి అన్నింటిని తెంచేసారు

కొన్ని సమయాల్లో నిజం ప్రవాసం కార్ఖానాగా మారుతుంది
ప్రేమికుల నిజాయితీ కూడా చివరి వరకూ వుంటుంది

ప్రపంచంలో పడిపోయినవారికి అంధత్వం వొక వరం
వారు చివరికి మనస్సు కంటి నుండి సత్యాన్ని చూడగలిగితే

జలీసా, నేను ముసుగులతో యెందుకు అలంకరించకూడదు?
జీవిత యుద్ధరంగంలో చివరికి మనం చనిపోలేదా?

2.

స్మశానవాటికలో వొక రాత్రి
-షుజాత్ హుస్సేన్

అతని తరువాత, ఆమె నిద్రపోతోంది
అతని సమాధి పక్కనే పడుకుని
ఆమె శాశ్వతత్వం గురించిన పాటలు పాడటం
నాకు గుర్తుంది
ఆ చమత్కారమైన కళ్ళ లోపల
సమాధి చీకటి వెంట్రుకలు,

కఠినమైన దుఃఖంలో విభజన చిరిగిపోతోంది
వాటిలో అమాయకత్వం
తన కప్పబడిన శరీరాన్ని పైకి లాగుతుంది

ఆమె కారుస్తున్న నిర్మలమైన కన్నీళ్ళు
హైసింత్‌ పూలని తడిపివేస్తున్నాయి
సమాధి-తవ్వినవాడే ఆ మొక్కని నాటాడు

ఆమె ప్రియమైన వొడిలోకి,
అతనిని కోరుతూ యేడుస్తుంది-
అది వుద్దేశపూర్వకంగా, ఆమెను చంపడం.
ఆ అగ్నిలాగే తోట గుండా
నిశ్శబ్దం అనుసరిస్తున్నప్పుడు,

అలా సమాధిపై పడుకున్న మహిళ,
కళ్ళు విశాలంగా తెరిచే వున్నాయి.
యిప్పుడు పైకి చూస్తోంది
చంద్రుని వద్దా అలాంటి శవమే.

నెలవంకను చూస్తూ,
కోకిలల్ని పాడనివ్వండి
‘నిద్రను ప్రేరేపించే పాటలు…’

సమాధి తవ్వేవారిని తవ్వనివ్వండి
‘అతని వొడిలో ఆమె బాధాకరమైన సమాధి…’

3.

పాత పర్వత శ్రేణులచే
కప్పబడిన వో రహస్యం జ్ఞాపకార్థం!

-అలజ్న్ ఖైసర్

నేను బిగ్గరగా, స్పష్టంగా నా గొంతును పెగుల్చుకొని అరిచాను
పర్వతాలు ప్రతిస్పందించడానికి, నా గొంతులోని వణుకుని అనుకరించటానికి వేచి వున్నాయి.

నేను కంకర రహదారి గుండా నడుస్తున్నాను,
యిద్దరు వ్యక్తులు వెడల్పుగా పక్కపక్కనే నడుస్తున్నారు

తాజాగా కత్తిరించిన గడ్డి మందమైన వాసనను
నేను దాటవేసి వూపిరి పీల్చుకునేటప్పుడు
ఆవపిండి మొక్కలు నన్ను పలకరిస్తున్నాయి,

రాబోయే క్రూరమైన శీతాకాలం కోసం
పశువులకది సంతోషకరమైన, తీపి వంటకం.

వంటింటిచిమ్నీల నుండి వచ్చే పొగ సుపరిచితమైన రుచుల కోసం
నేను నా మెడను కొంగలా చాపుతాను.

సమీపంలోని గుడిసెలలో
సాయంత్రం భోజనం కోసం సన్నాహాల సంకేతం,
మొక్కజొన్న రొట్టెతో అలంకరించబడిన విందు

మొక్కజొన్న రొట్టె, యింట్లో తయారుచేసిన వెన్న,
పశువులు బహుమతిగా యిచ్చే తాజాగా వడకట్టిన మజ్జిగ
అందమైన బంగారు తేనె మధ్యాహ్నం గులాబీ టీ తో పాటు వడ్డిస్తారు.

రోజుకు విశ్రాంతి యివ్వడానికి
కరాకోరం శ్రేణి శక్తివంతమైన శిఖరాల వెనుక
సూర్యుడు దాక్కున్నప్పుడు,
పర్వతాలు ఆశ్రయం పొందిన లోయపై నీడను పరుస్తాయి
ఆమె భారీ సరిహద్దుల్లో ఆశ్రయం పొందిన
తన పిల్లలను రక్షించమని వాగ్ధానం చేయించుకుంది.

పిల్లలు రాత్రి సమీపిస్తున్న కొద్దీ యింటి లోపలకి
కర్రలతో టైర్లను తోసుకుంటూ వస్తారు
యెత్తైన శిఖరాల మీదుగా యెక్కడం,
పగుళ్లలోకి చొప్పించడం లోయను మెత్తగా కిందకి జార్చడం.

నేను రాత్రిపూట ఆకాశంలో చూపులను దొంగిలించాను,

ఆడంబరం వుపయోగించిన పిల్లవాడు
తన పూర్తి సృజనాత్మకతను విప్పినట్లుగా
చాలా ప్రకాశవంతమైన నక్షత్రాలలో మచ్చలు.

నేను ఆకాశం మీదుగా వెళుతున్నప్పుడు,
అద్భుత సంగ్రహావలోకనం వద్ద
నా ఆశ్చర్యకరమైన ఆలోచనలు
సుదూర గుడ్లగూబ అరుపులు
కిషన్గంగా నది నిరంతర ప్రవాహాపు హోరుకి
అంతరాయం కలిగిస్తాయి.

హిమానీనదాలను కరిగించడం
వేడి గీజర్‌ల నీటిని ఆశ్రయించడం.

చీకటి ప్రతి యింటిని కప్పేటట్లు
పచ్చటి పచ్చిక బయళ్లను నిశ్శబ్దపు దుప్పట్లుగా చేస్తుంది.

పర్వతాల మధ్య తమ మార్గాన్ని కోల్పోయే
దూరపు గొర్రెపిల్లలు చూపరులకు వొక వినోదం.

ముళ్ల తీగలతో గుర్తించబడిన యీ స్వర్గానికి,
నేను నా చివరి శ్వాసను యిస్తాను.

తులీప్స్ రెక్కల్ని లాగి ప్రతీ మనస్సాక్షిని మేల్కొల్పుదాం
పర్వతాల మధ్య లోయ వద్ద పూర్తి దృష్టితో వాటిని లాగండి.
మనం గెలుస్తాం!

4.

అందమైన జైలు
-సాకిబ్ మంజూర్

నమ్ము బిడ్డా!
వొకప్పుడు వారు దీనిని స్వర్గం అని పిలిచేవారు.
“స్వర్గం!”
యీ తేనె లోయ,
రక్త లోయగా మారిందా?

నిజానికి
స్వర్గం అనిపించిన వొక సమయం వుంది.
దాల్, జీలం, వులర్ కంటికి ఆకర్షణీయంగా
కనిపించిన వొక సమయం వుంది.

వాటి కీర్తి, అందం అంతా,
యిప్పుడు రక్తంతో నిండి వున్నాయి
అమాయకుల రక్తంతో.

చెవుల వెనుక తడిచిన వారు.
అవును, నిజానికి వారు నిద్రపోరు.
తల్లుల వొడిలో వున్న ఆ వొక్క క్షణమే వారికి సంతోషకరమైనది.
యిప్పుడు వారు అస్పష్టమైన సమాధులలో పడుకున్నారా?
విచారకరంగా వారి తల్లులు అనారోగ్యం, యేడుపు.

వొకరిమీదొకరు మంచు బంతుల్ని విసురుకోవడం
యిది ప్రతిచోటా సాధారణమైనదా?
నేను మాత్రం దాన్ని
ప్రేమ, శాంతి ఆట అని పిలిచాను.

అయ్యో! నాటకీయ తీవ్రమైన పునఃస్థాపన వచ్చింది,
రేజర్-షార్ప్ బుల్లెట్లు మంచు బంతుల స్థానంలోకి వచ్చాయి.
అయితే ద్వేషం, యుద్ధంలోనే ప్రేమ, శాంతి వుంది.

నన్ను నమ్ము బిడ్డా!
నేను చూడాలనుకుంటున్నాను,
పాత రోజుల్లోలాగా
మౌజీ తన కొడుకును తరుముతూ
మంచు బంతుల్ని విసరడాన్ని.

యిది నా అద్భుతమైన నేల
నేను దీన్ని నా మాతృభూమి అని పిలుస్తాను,
యిది చెడు మనుషులచే ఆక్రమించబడింది.

అవును, నా ప్రియమైన బిడ్డా!
యిది అందమైన జైలు.

యిప్పుడు రాత్రి వస్తుంది
ప్రజలు నిద్ర వొడిలో చేరతారు
అలా రోజును విస్మరించడం
వొట్టి అణచివేత, నిరాశ.

నిండు చంద్రుడు ఆకాశ సముద్రంలో
యిళ్ళనీ, నిస్పృహనీ అణచివేసే పురుషులపై
లేత కాంతిని విరజిమ్ముతాడు.

వీధులు యెడారిలా వున్నాయి
వాటిపై వారు తప్ప యెవరూ నడవరు
మొరిగే కుక్కలు, సాయుధ పురుషులు,
రాత్రి నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తూ వారి భయంకరమైన అలికిడి.

కుక్కలు చూసి మొరిగే,
సాయుధధారుల వికారమైన చిత్రం
దుండగుల భయం.

వారు అందమైన యిళ్ళలోకి ప్రవేశించడం
యీ ప్రశాంతమైన రాత్రిని
‘యె నైట్ ఆఫ్ హర్రర్’ చేస్తుంది.

అర్ధరాత్రి నూనెను కాల్చి
కొందరు తమ వూహల ప్రపంచాన్ని బహిర్గతం చేస్తున్నారు.
అందుకే మీరు, నేను, నిద్ర వొడిలో వున్న స్నేహితుడు
రాత్రి కూలిపోయినట్లుగా!

5.

సామాజిక దూరం
-జీషన్

యీ పిచ్చి ‘సామాజిక దూరం’ ముగిసిన తరువాత
(అది యిప్పటికే వుంది ముక్కలైన భూమికి తగినంతగా)
మేము రహస్యంగా వాణిజ్యం చేస్తాం
మచ్చల చేతులకు గోరింటాకు చుక్కలు,
ప్రతిఫలంగా విశ్వాలు
ప్రకాశవంతమైన యెరుపుతెలుపుల చిన్న పూల నమూనాలు.

నల్లని మైదానాలకు వ్యతిరేకంగా,
నిశ్శబ్దపు కన్నీటి చుక్కలు, రాళ్లు అద్దాలుగా మారిపోయాయి
సమయం ముందు ఆశ్రయం కోసం
సూది లాంటి సరళతలో వుంది-
(అర్ధమే లేదు)

మేము సంభాషించినప్పుడు
పలకలేని భాషని
ప్రజలు అర్థంచేసుకుంటారు
లేకపోతే
గాలి విసిరే మందమైన కొరడా,
లేదా దొంగిలించబడిన హృదయ స్పందనలతో
రూపొందించిన సందేశాలను యెవరు చదువుతారు?

కానీ మా ద్వారా మాకు మాత్రమే
మా క్షణం మీరు వెల్లడించినప్పుడు.
మీ ముఖం, మెడపై పుట్టుమచ్చలు
దేవునికి యెన్ని తెలుసు?!
మీరు యిప్పటికీ రోజూ గుర్తుంచుకోండీ.

విధిని అది మారుస్తానని వాగ్దానం చేసినప్పుడు
బాకులాగా, మన ముందు కడిగివేయబడదు
తుఫాను వాతావరణం కోసం విరామం తీసుకుంటుంది.
(తరగని అర్థం? )

తరువాత యేమిటి?
యీ దిగ్బంధం కాని అభివ్యక్తి
మా దీర్ఘకాల కోరిక
‘అలస్ట్’ నుండి దేవుడు ఆజ్ఞాపించాడు:
‘మీ పూర్వీకులు –
అదే కుటుంబవృక్ష త్యాగ సామరస్యం
వొక ధర కోసం మరణాన్ని అధిగమిస్తుంది.
అది సాధ్యమేనా?’
మా చేతులు, మా బలహీనమైన వేళ్లు
మాలోకి ముడుచుకుపోతాయి.
మా చక్రాలు కరుగుతున్నాయి
విధిలోకి, అమర యుగంలో వలె.

ప్రతి వొక్కరికి మనం యెంతసేపు పాడుతూ వుండాలి
నిశ్శబ్దపు రాత్రి, మనలోకి విషం పాకుతుంది.
భవిష్యత్తు గతం లాగానే యెదురుచూస్తోంది
రక్తాన్ని క్షీణిస్తున్న చంద్రకాంతిలో కడుగుతారు
లేత పసుపు సూర్యుడు అని ప్రవచించే ముందు.

మండక తప్పని
సమయం చివరి అంకంలో మేము కలుస్తాము.

6.

నా వితంతు లోయ
-షేక్ మహీరుఖ్

మళ్ళీ ఆకాశపు వొడిలో విలపించింది
నా నివాసం యిప్పుడు శిధిలాలుగా మారింది

నేను యిప్పుడే దేశద్రోహిగా మారిపోయాను,
నా భూమి వితంతువుగా మారిన క్షణానే.
నా యవ్వనం సమస్తం ముడతలు పడిపోయింది
వో నిరంకుశుడా!
నా నిట్టూర్పులలో మీరేమి కనుగొన్నారు?

నా తల్లి తన రక్తాన్ని పోషిస్తుంది,
వివాహం కాని సోదరి తన బంజరు చేతులతో వుంది.

నా ఆకాశం నుండి బుల్లెట్ల వర్షం కురుస్తోంది.
వసంతం కొత్త కత్తిలా వికసిస్తుంది
భూమి యెముకల మైదానంగా మారిపోయింది.

నా ప్రియమైనవారిని యెక్కడ ఖననం చేశాను?
మాకూ జ్ఞాపకార్థపు వేడుకల రోజులు వుంటాయి.

మేము కాశ్మీర్ పేరును
మా సార్వభౌమాధికారిగా సమర్థించాము.

మన విధిలో యే సంబరం కనిపించదు
దౌర్జన్యం మా నుదురు మీద చెక్కబడింది.

ప్రతి సంవత్సరం యువత రక్తస్రావం
యెవరి మరణానికి మనం దుఃఖించవలసి వుంటుంది?

తల్లులు పెద్దపెద్ద కన్నీళ్లతో విలపిస్తున్నారు
కొడుకుల అంత్యక్రియలకు తండ్రులు నాయకత్వం వహిస్తారు.

ప్రవాహాల శబ్దాలతో మిళితమైన
కాశ్మీర్ అరుపులను యెవరు విడదీస్తారు?
పర్వతాల భారంతో యేకీకృతమైన
కాశ్మీర్ బాధను యెవరు విప్పుతారు?

మట్టి, నీరు కలిసిపోయి బురద యేర్పడుతుంది
ఆ విధంగా మీరు మీ దేశాలను తయారు చేస్తారు.

మాకు కన్నీళ్లు, రక్తం మాత్రమే వున్నాయి
యింటి పచ్చికను తేమగా మార్చడానికి!

7.

నా భూమి వధువు
-బారియా హమీద్

మీ రక్తస్రావ గాయాలు మిగిలి వుంటే,
నేను ప్రతిసారీ వాటిని ముద్దు పెట్టుకోవాలి.

మీ అందరినీ నయం చేసే వరకు
అది మా అందరినీ గాయపరుస్తుంది.
వాటిని యెప్పటికీ నా హృదయానికి చేరువుగా వుంచుతాను.
రక్తం నా చేతులకి గోరింటలాగా మెరుస్తుంది.

మీ జ్ఞాపకాల శకలాలు యేవైనా మిగిలి వుంటే,
నేను వాటిని వొక్కొక్కటిగా యేరుకోవాలి.
వారు నా వేళ్లను నరికి రక్తస్రావం చేస్తారు
నేను వాటిని నగలుగా అలంకరించాలి.

మన అవశేషాలకు నేను వధువుగా వుండాలి.
మీ నీడలు మిగిలి వుంటే,
నేను యెప్పటికీ యీ సురక్షితమైన స్వర్గంలోనే నివసించాలి.
మీరు వదిలేస్తారు
ఆ ప్రేమ రంగుల్ని.
నేనీ పెళ్లి రంగులో వధువునవుతాను.

నేను వధువుగానే వుండాలి
శుభాకాంక్షల అవశేషాలను మోయడానికి
నా సమాధిలో.
మీలో మిగిలి వున్నవేమైనా వుంటే వాటితో నింపండి
నా యీ ఖాళీ హృదయాన్ని.

8.

ప్రవాహాలు వున్న ప్రదేశం
-షకీర్ షఫిక్ ఖాద్రి

మీరు మీ వీడ్కోలు చెప్పారు
పాత స్నేహితుడా!
నేను నా మార్గంలో వెళ్ళాను.
ప్రేమ ప్రవహించిన ప్రదేశాన్ని
కనుగొనే తపనతో
నేను వెతకడానికి ప్రయత్నించాను.

ప్రవహించే నదుల ఆశల పర్వతాలను కిందికి దించి
ప్రాణం పోసుకున్నాయి
ప్రశాంతత, పచ్చని పొలాలు.
పంటలు ఆప్యాయతతో నృత్యం చేస్తాయి.

యెక్కడ అభిమానపు అమృతం
బయటకు వస్తుందో అక్కడ
సాన్నిహిత్యం పర్వతాల నుంచి పగిలిపోతుంది.

నేను యీ భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు,
నా పాత స్నేహితుడ్ని
కనుగొననే లేదు.
ఆ యేమీలేని దానిలో
నేను చూడటానికి లోపల యేముంటుంది?

నేను గుళికని కనుగొన్న చోట,
నేను వెతుకుతున్న స్థలం.

యిక్కడ నేను
యీ వుదాహరణను ఆస్వాదిస్తున్నాను
మీ సమాధిపై వాలి.

నా పాత స్నేహితుడా!
నేను మీకు స్థలాన్ని కనుగొన్నాను,
నువ్వు యెక్కడికెళ్ళావ్?

ఆ వీడ్కోలు తరువాత మీరు నాతో యేo చెప్పారు?

9.

యెర్ర చంద్రుడు
-అడిలా హమీద్

యేమీ వృద్ధి చెందని సమయంలో
ప్రపంచం వొక్క క్షణం సరైన అనుభూతిని ఆపివేసినప్పుడు,
నొప్పి, భయానక పట్టులో గట్టిగా పట్టుకుని
కలలు కరిచిన కత్తులు
కత్తులు వంటి శరీరాలను నరికివేస్తాయి.

యే వొక్క ఆశ కూడా లేదు,
యేదీ ఆత్మను మిగిల్చలేదు.
మరచిపోయిన లక్ష్యాల సమాధులను కప్పిపుచ్చడానికి
యెవరికీ స్వంతం కాని విశ్వాసపు భాగమిది.

ప్రతి వొక్కరూ వారి విరిగిన యెముకల వైపే మొగ్గు చూపారు.
వొక కాంతి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది
ప్రశాంతమైన తుఫానులు, మేఘాలు
మార్గాన్ని సుగమం చేశాయి.
క్షితిజాల వెనుక నుండి ప్రకాశవంతమైన
యెరుపు రంగు మంటలు వినిపించాయి
దానికి తోడు తోడేళ్ళు అరిచాయి.

యెర్ర చంద్రుడు మచ్చల ముఖంతో పెరిగాడు
ప్రజల భూమిని, వారి నొప్పిని చూశాడు
ఆ సమయం వచ్చింది, అది క్షీణించలేదు
వెలుతురు కిరణాలు ప్రతి గొలుసునీ తెంచివేస్తాయి.

అప్పుడు నేను కన్నీళ్లతో
యిప్పటివరకు అందుబాటులోకి రాని చంద్రుని వైపు చూసాను
నా జీవితంలో వుల్లంఘించిన బాధల్ని పంచుకొన్నాను
నా ప్రేమ, నా నిశ్శబ్దాన్ని, నా యేడుపులని విన్నవించాను.

యెర్రబడిన దృశ్యంలోకి పెరిగినప్పుడు
ఆ శరదృతువు చంద్రునికి
నేను నా స్నేహితుల, శత్రువుల రహస్యాలను యిచ్చాను
నా హృదయం పిత్తాశయం నుండి బయటపడింది.

చంద్రుడు నాతో యేదో చెప్పాడు,
అందువల్ల అన్యాయపు బాధలు, భయానక పరిస్థితులు
ముగియబోతున్నాయని నేను భరోసా యివ్వగలను.
మీ ఆనందం, శాంతి తుది పిలుపుపై విజయం సాధిస్తుంది.

10.

యుద్ధం నుండి…
-బారియా హమీద్

అగ్ని, ధూళి, బూడిద, మసి
స్థిరపడ్డాయి చివరికి
మీ రాకను అలంకరించడానికి నేను మీకోసం
నాటిన యెరుపు రంగు పూలరేకుల మీద.
కాని, ప్రేమ – యుద్ధం నా భూమిని తయారు చేస్తుంది.
తెలియని సమాధులకు పైకప్పులను,
గుర్తింపులను తొలగించడం చేస్తుంది.

నాతో నడవండప్పుడు,
నిరాశ నిండిన యీ ప్రాంతాలలో
మీరు వసంతపు బంజరును చూడగలరా?
రక్తం, మాంసం, శవాలు నిండిన
యీ దారుల్లోకి పరిగెత్తండి,
మీ రాక కోసం నేను అలంకరించాను
అనేక రంగుల పూలమొక్కల్ని.

కానీ, ప్రేమ – హృదయం స్మశానవాటికల మధ్య
నేను యెలాంటి వృత్తిలో జీవిస్తున్నానో చూడటానికి
యిక్కడ అడుగు పెట్టండి.
మీరు చీకటి నిట్టూర్పులు,
రోజుల దుఃఖాలను వినగలరా?

మేము స్వేచ్ఛ కోసం వొక ప్రియమైన యుద్ధంలో వున్నాము.
యింకా సయోధ్య కోసం,
ద్వారాల వద్ద నాకోసం వేచి వుండండి
మేము చేతితోనే ప్రతి గాయాన్ని కుట్టుకుంటాం
యుద్ధం జరిగినప్పుడు తిరిగి మేము కలుస్తాము.

11.

పతనానికి
-గజన్ఫర్ తహూర్

పతనానికి స్వాగతం
యిది కవుల రుతువు

ప్రతి ఆకు దాని చివరి పిలుపు కోసం వేచివుంటుంది
మారువేషంలో వచ్చి ఆశీర్వదించడానికి.

చినార్ తన నమ్రతని కోల్పోతుంది,
కవులు హృదయాల సున్నితత్వానికి తోడుగా.

యీ యుద్ధం తరువాత నేనిక్కడ వుండను
మీతో నా వునికిని తుంచివెయ్యడానికి
మిమ్మల్ని చాలా దూరం చేసుకోడానికి.

పతనం కంటే యిది ఆలస్యం కాదా?

12.

రాత్రి వేళ (గజల్)
-మంజూర్ బట్

యీ చీకటి యేమిటి? రాత్రి యే చట్టాలను నియంత్రిస్తుంది?
నిశ్శబ్దంగా జారిపోయే మీ జ్ఞాపకాలు, దుఃఖాలలోకి రాత్రి నిండుతుంది.

ప్రేమికుల సమయం నుండీ మేఘాలు చంద్రుడ్నిదాచిపెడతాయి.
రాత్రిపూట వారి హృదయాలు యెందుకు కాంతివంతం కాకూడదు?

“ప్రభూ, నా చీకటి కన్నీరు పెట్టడానికి ముందే నన్ను తన నుంచి విడదీయండి!”
వొక అవిశ్వాసి వింటే, రాత్రి సమయంలో దర్విష్ గుహను తగలెడతాడు.

ఆ వెలుగు నెలవంక చుట్టూ నక్షత్రాల దండను నేస్తుంది.
యే కళని మోసగించడానికి – నా హృదయం రాత్రి కళల్ని నేర్చుకుంటుంది?

“సంపద శిధిలావస్థలో దాగి వుంది.” రహస్యాలు నిశ్శబ్దంగా వున్నాయి.
మీ నిశ్శబ్దాన్ని అర్థంచేసుకోవడానికి, నేను రాత్రి వొక తాత్కాలిక నివాసంలోకి ప్రవేశించాను.

చెవిటి లోయలో విరిగిన సంబంధాలు, వినని పిలుపులు.

వొక వృద్ధుడు తిరిగి వచ్చి పావురాలను విక్రయించాలని యోచిస్తున్నాడు.

***

“యుద్ధం బాల్యాన్ని మాయం చేస్తుంది” అనడానికి యీ కవితలు వొక వుదాహరణగా నిలుస్తున్నాయి.

అందమైన కలలు, లేత ప్రేమలు, ఆశలు, శ్వాసలు బదులు వాళ్ళు తాము కోల్పోయిన భూమి మీది యుద్ధాన్నీ, కన్నీటినీ, ఖననాల్ని గురించి కరుకెక్కిన స్వరాలతో రాస్తున్నారు. సరికొత్త కాశ్మీర్ ఆవిష్కరిస్తున్నారు – కాశ్మీర్! తుజే సలాం!

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

18 thoughts on “తెంచేసిన నేల నుంచీ కంచెల్ని తెంచుతోన్న యువస్వరాలు…

 1. బ్బ! ఒక భయంకర ప్రపంచాన్ని చూపించారు. ఇది మనం నివశిస్తున్న నేలేనా అనిపిస్తున్నది చదువుతుంటే. ప్రజాస్వామ్యం అనే గొప్ప మాయ లో బతుకుతున్నాం… కదండీ! బతికే వున్నామన్న ఉనికిని చాటుకోవడానికి పెన్ డ్రైవ్ ని ఢిల్లీకి పంపి అప్ లోడ్ చేయించే దుస్థితి అత్యంత అమానవీయ సమాజంలో ఉన్నామనడానికి నిదర్శనం. గొప్ప సమాచారం తెలుసుకున్నాను మేడమ్! ధన్యవాదాలు

  1. థాంక్యూ జగదీశ్ మల్లిపురం గారు.

 2. ఈ ప్లానెట్ పై మనుష్యులదో లోకం..మిగిలిన అన్ని జంతుజాలాలది ఒక లోకం. ఈ రెండు లోకాలూ తమ ప్రపంచాల్లోకి ఎవరినీ ట్రెస్ పాస్ చేయనివ్వవు. కానీ, మనిషి తన లోకంలో తానే ట్రెస్ పాస్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తుంటాడు.. జంతులోకం లోకి వెళ్లి అక్కడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాడు.. ఈ మానవ నైజం కారణంగా ఈ ప్లానెట్ పైన మనిషి నే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ…హింసిస్తూ.. వేదనకు గురిచేస్తూ వస్తున్నాడు.. అలాంటి ఒక దుర్మార్గ మానవ నైజాన్ని కశ్మీర్ లో మనం స్పష్టంగా చూస్తుంటాము.. అక్కడ సందర్భాన్ని మీరు భుజానికి ఎత్తుకొని, ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న కవుల్ని, అక్కడ జరిగే అక్షర పోరాటాన్ని ఒక గొప్ప వ్యాసాన్ని అందించారు.. ఈ వ్యాసానికి ఆ టైటిల్ ఒక అద్భుతం. ఇక ఆ పోయెమ్స్ ను మీరు అనువాదించిన తీరు ప్రశంసనీయం.. అభినందనలు.. అద్భుతం. ఎంత గొప్ప వ్యాసాన్ని అందించారో!! ఒక్కో అనువాదం ఒక్కో పాఠం. ప్రతి కవి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మీ వ్యాసాలు చదివిన ప్రతిసారీ నాలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది.. ఇలా రాయాలి అనిపిస్తుంది.. మీ అసాధారణ ప్రతిభ కు నమస్సులు.. ఇంకా ఎంతైనా రాయొచ్చు మీ వ్యాసం పై. …ప్రత్యేక అభినందనలు..కుడొస్ కవియత్రి..

  1. సురేష్ గారు,
   సమస్యని విశ్లేషిస్తూ మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

 3. రాజ్యం ప్రజల విశ్వాసాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత వారి ఆకాంక్షలకు ఇవ్వదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు స్వేచ్ఛను కాంక్షిస్తాయి. విశ్వాసాలు మాత్రం స్వచ్చందంగా సంకెళ్లను కొరుతాయి. స్వేచ్ఛాకాంక్ష అంటే రాజ్యానికి అభద్రత. విశ్వాసాల ద్వారా ప్రజలను సులభంగా నియంత్రించవచ్చు. కాని స్వేచ్ఛాకాంక్ష నియంత్రణకు లొంగదు. ప్రజలను భౌతికంగా నియంత్రించవచ్చు. కాని వారి sprit అనియంత్రిత ఆకాశంలో స్వేచ్చగా విహరించడాన్ని ఏ రాజ్యం ఆపలేదు.

  అద్భుతమైన కవితలు అందించారు. రాజ్యం తీసుకునే నిర్ణయాలు సున్నితమైన యువ హృదయాలను ఎలా చిధ్రం చేస్తాయో వివరిస్తాయి ఈ కవితలు.

  అవేదన, నిస్సహాయత, తాజాదనం నిండిన ఈ అద్భుతమైన కవితల్ని ఎంతో శ్రమ తీసుకొని అందంగా అనువదించి మాకు అందించినందుకు, రగిలే సమస్య పట్ల మీ వాణిని వినిపించినందుకు, మనిషి ఎప్పుడూ నిస్సహాయుల పక్షంలో మాత్రమే ఉండి తీరాలని, ఏ పక్షంలో నైతికంగా నిలవాలో అర్థం చేసుకోలేని ప్రజలకి తెలియజేసినందుకు ధన్యవాదాలు🙏

 4. శ్రీరామ్ గారు,
  నమస్తే.
  ఆ కవితల్ని తప్పకుండా అందించాలని వీలైనంత శ్రద్ధగా అనువదించాను. మరో రెండు కవితలూ వున్నాయి అనువాదం చేసినవి. వీలున్నప్పుడు వాటిని పోస్ట్ చేస్తాను.
  థాంక్యూ అండి.

 5. కాశ్మీర్ వేదన , 70 సంవత్సరాల క్షోభ , పాలకుల అరాచకం
  కళ్ళ ముందు పరిచారు కుప్పిలి పద్మగారు . గాయపడిన హృదయాలు , నెత్తురోడిన కవిత్వం , మాయం అయిపోతున్న మనుషులు …గడ్డకట్టిన కన్నీరులా కాశ్మీర్ లోయ . ఓపికతో కవితలు అనువదించడమే కాదు , ఆ మానసికొద్వేగాన్ని చాలా బాగా తెలుగు చేశారు . పద్మగారి వ్యాసం చదవడం పూర్తి అయ్యేసరికి చీకటి తెర లాంటి బాధ గుండెని చుట్టుకుంటుంది . పరిష్కారం కానరాని భయనమైన రాజకీయ సమస్య పై కాశ్మీరీ కవులు గొప్పగా తిరగబడ్డారు . అద్భుతమైన వ్యాసం ఇది .
  పద్మగారి అభినందనలు .

  1. ప్రకాష్ గారు,
   నమస్తే.
   అనుభవజ్ఞులై జర్నలిస్టు మీరు.
   మీకు నచ్చినందుకు బోలెడంత సంతోషం.
   థాంక్యూ అండీ.

  2. ప్రకాష్ గారు,
   నమస్తే.
   అనుభవజ్ఞులై జర్నలిస్టులు మీరు.
   మీకు నచ్చినందుకు బోలెడంత సంతోషమేసింది.
   హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

 6. “కవిత్వం విలాసవంతమైనది కాదు. అది మన వునికికి సంబంధించిన వొక కీలకమైన అవసరం. అది మన చుట్టూ వున్న కాంతిని మరింత మెరుగ్గా వుండేలా చేస్తుంది. కవిత్వంతోనే మన ఆశలు, కలల మనుగడ, మార్పులని నమోదు చేస్తాం” —- ఆడ్రే లార్డ్.
  కాశ్మీర్ ని ఒక గౌరవ(కుహనా) చిహ్నంగా చూసే వాళ్ళకి అక్కడి ప్రజల ప్రజాస్వామ్యకాంక్ష ఆత్మ తెలుసుకొనే చిత్తశుద్ధి ఉండాలి.
  ఇందుకు మొదలుగా పాలకుల రాజకీయ ప్రయోజనాల,ఎత్తుగడల మాయాజాలంనుండి దూరంగాజరిగి చరిత్రని , చరిత్ర నడిచిన తీరుని కాస్త సహానుభూతితో వినగలగాలి. అప్పుడే కాశ్మీరీ ప్రజలు నినదిస్తున్న “ఆజాదీ” భావం అర్ధమవుతుంది.
  ““ఆజాదీ అంటే స్పష్టంగా ఆలోచించగలగటం. స్వేచ్ఛ గా మాటాడగలగటం. నిర్భయంగా వినగలగటం.”–అరుంధతీ రాయ్
  సమూహాల ఉద్వేగాలను ,ఆవేదనలను,ఆకాంక్షలను నమోదుచేయడం కవిత్వానికి అనివార్యం.
  “కవిత్వం నుంచి మనం తెలుసుకునేవి వార్తల నుంచి తెలుసుకునేవాటి కంటే యెప్పుడూ చాల భిన్నంగా వుంటాయి.”
  కాశ్మీర్ ని ఓ భౌగోళిక ప్రాంతంగా మాత్రమే చూసే చూపుని దిద్దుకోవడానికి , ఆ కవిత్వం, ఈ పరిచయం అవసరం .
  thank you for this , పద్మ గారు.

  1. నమస్తే ప్రసాద్ గారు.
   మీరు మీ అభిప్రాయం పంచుకోవటం యెంతో సంతోషంగా వుంది. థాంక్యూ సర్.

 7. చాలా గొప్ప కవితలను అందించారు మేడం కవిత్వం ఓ సామాజిక బాధ్యత అని బాగా చెప్పారు

 8. కాశ్మీరీల ఆకాంక్షల్ని, ఆత్మఘోషల్ని సానుభూతితో అర్థం చేసుకున్న వ్యాసం. “వాస్తవానికి విరుద్ధమైన వార్తలు మాత్రమే వినబడుతున్నప్పుడు, లేదా అసలు వార్తలే లేనప్పుడు ఆ అంతరాల్ని పూరించడానికి కవిత్వం రాస్తున్నామని కాశ్మీరీ కవులు చెపుతున్నారు. కవిత్వం నుంచి మనం తెలుసుకునేవి వార్తల నుంచి తెలుసుకునేవాటి కంటే యెప్పుడూ చాల భిన్నంగా వుంటాయి” – ఇవి సారం, వాస్తవం ఉన్న వాక్యాలు. వార్తాపత్రికలు వాస్తవాలు రాసేటట్లుంటే ఇంకేముంది కవులకు వాళ్ళ కలాలకి అంత పని కూడా ఉండేది కాదు. అవాస్తవాలు, అక్రమాలు, అణచివేతలు అంతవరకూ ప్రణయకవిత్వమో ప్రకృతికవిత్వమో రాసుకుంటున్న కవుల్ని ఉద్యమాల వైపు నడిపిస్తాయి. ఈ వాస్తవాన్ని చెప్పడం చాలా ఉత్తేజకరంగా ఉంది. నమస్తే మేడం.🙏

 9. కుప్పిలి పద్మగారు రాసిన వ్యాసం “తెంచేసిన నేల నుంచీ కంచెల్ని తెంచుతోన్న యువస్వరాలు…” చాలా బావుంది
  కాశ్మీర్ లాక్ డౌన్ లో చిక్కుకొంది. ఆగస్ట్ 5 2019 నాడు ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీరుని రెండుగా విభజించి, కాశ్మీర్ , దౌర్జన్యంగా రాష్ట్రమంతా పోలీస్ , మిలిటరీ , పాలన మొదలు పెట్టింది. పద్మగారు మనందరికీ (భక్తులకు తప్ప) అర్ధమయ్యే భాష లో కాశ్మీర్ చరిత్ర 70 ఏళ్ల నుంచి చెప్పారు. 1947 లో దేశ విభజన జరిగి నప్పుడు, భారత దేశం అక్కడ ప్రజల స్వయంప్రతిపత్తికి అంగీకరిస్తామని విలీన వొప్పంద పత్రాలపై చేసిన భారత ప్రభుత్వం యిప్పటి వరకూ ఆ ప్రజాభిప్రాయసేకరణనే జరపలేదు. అప్పటినుంచి అక్కడ “స్వయంప్రతిపత్తి” చేయమని కాశ్మీర్ ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు పద్మ గారు ఉదహరించినట్టుగా , “కాశ్మీర్మీ ప్రజల “ఆజాదీ” అర్ధమేమిటో అరుంధతీ రాయ్ స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పారు. “ఆజాదీ అంటే స్పష్టంగా ఆలోచించగలగటం. స్వేచ్ఛ గా మాటాడగలగటం. నిర్భయంగా వినగలగటం.”

  ఈ దౌర్జన్యం మధ్యలో అక్కడి సాహిత్యం చాలా వరకూ మూసివేయబడింది. ఆవిడ చెప్పినట్టు అరకొర వసతులూ, యింటర్నెట్, సమస్త మాధ్యమాలూ బందిఖానాలో చిక్కుకుపోయిన నేపధ్యంలో ఆ చీకట్లను చీల్చుకొంటూ అక్కడ చిగురిస్తోన్న ఆ లేత గొంతుకలే భవిష్యత్ కాశ్మీరు చరిత్రను లిఖించనున్నాయి. కాశ్మీర్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన వాస్తవికతకు కాశ్మీర్‌లోని యువ కవులు యెలా స్పందిస్తున్నారో ఈ వ్యాసం లో చూపించారు.
  చాలామంది రాసిన కవితలు పద్మ గారు అనువదించి కాశ్మీర్ లో జరుగుతున్న దారుణ దౌర్జన్యం మనకి కళ్ళకి, మెదడుకి హత్తుకునేలా చూపించారు. “బరియా హమీద్ అనే కాశ్మీర్ యువతి ప్రకృతి, అందం వంటి అంశాల మీద చిన్నచిన్న కవితలు రాసేవారు. న్యూఢీల్లీలోని జామియా మిలియా యిస్లామియా విశ్వవిద్యాలయంలో లిటరేచర్ ని ప్రధాన సబ్జెక్ట్ గా విద్యనభ్యసిస్తున్న యీ 24 యేళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ రాసే కవిత్వం పూర్తిగా మారిపోయిందిప్పుడు. కాశ్మీర్ నుంచి బలమైన కవిత్వం రాసే కవుల్లో యిప్పుడామె వొకరు.”
  ఆ విద్యార్దిని రాసిన ఈ కవితలో ఆఖరిలో ఇలా అంటున్నారు:
  “గోడలు అరుస్తుంటే నేను కూర్చొని చూస్తుంటాను.
  రాత్రి భయానక పోరాటాలు, పగటి వేధింపులు
  రోజులు, నెలల తరబడిగా విస్తరించి వున్నాయి.
  నా ప్రజలను నేను మళ్ళీ చూస్తానా?
  యింకా వారు జీవించే వున్నారా?”
  పద్మగారు ఆశిస్తునట్టు “యీ యువ కవులు పెద్దగా సాహిత్య ప్రపంచానికి తెలియక పోయినా త్వరలోనే తప్పక వెలుగులోకి వస్తారు. చాలామందిలా కాకుండా, వారు ఆహ్వానాలు వున్నప్పటికీ ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు హాజరుకారు. వారిలో కొందరు తమ కవితల్లో అధికారులను వ్యతిరేకించడం వల్ల కలిగే పరిణామాలేమిటో వారికి తెలుసు. అయినప్పటికీ, కాశ్మీర్ పద్యంలో రాయకుండా వారినెవరూ ఆపలేరు”

  1. సుబ్రహ్మణ్యం గారు, మీరు వివరంగా విషయాల్ని పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

 10. కశ్మీరి కాలమాన పరిస్థితులని, కవి ప్రాంతీయ సామాజిక దృష్టిని చాలా మంచి కవిత్వాన్ని కవులని వారి మనో భావాల్ని సున్నితంగా విషధికరించారు మేడం

Leave a Reply