తూర్పూ పడమర

ఓయ్… నిన్నే పిలుస్తూంటా..
నాగరికపు సొగసునద్దుకున్న పైమెరుగా… ఓ పాలిటు రావోయ్

చలువ అద్దాల మేడలోకి మారిన మనుషుల్ని
చలువ చేసిన గదుల్లోకి జారిన తనువుల్ని
పొట్ట చేత పట్టి
తరలి పోయిన ఆధునికతలోంచీ వచ్చి
ఆనవాలు లేని మూలాల్ని కాసేపయినా తడుముకుందాం

దమ్మచేను దగ్గర పాడే వరినాట్ల పాటని వదిలేసాక
కంప్యూటర్లో చేసే ప్రోగ్రామ్ నీకు గొప్పైతే కానివ్వు
కోత కోసి కుప్పనూర్చి ఆకలి తీర్చే ప్రకృతి రీసెర్చి మాటేంటంటావ్?

అంగట్లోంచీ ఆకలి తెలియని రుచులన్నీ కంచంలోకొచ్చాక
చేటల్లో తూర్పోతలేమి అగుపడతాయ్!!
కాలికి మట్టంటని దారుల్లో నడిచాక కాయకష్టం విలువ మరుపేనా

తాత పేగులరుపులరిచాక తిన్న పచ్చడి ముద్ద రుచి నీకెప్పుడైనా తెలిసుంటే
అడవులు కొట్టి నగరాలు కట్టిన జనారణ్యపు దారుల్లో క్షణమైనా నిలవలేవు
కట్టడాలు తప్ప పట్టణాల్లో ఉన్నది నిస్తేజపు నవ్వులని నీకు మాత్రం తెలియదా

కాలుష్యానికి రాచబాట పరచిన టౌను గాలి ఊపిరి కూడా ఉసురుమంటూ
పచ్చని పొలాన్నుంచొచ్చే పైరగాలి… చెట్ల కొమ్మలు వీచే చిరుగాలి స్పర్శంతా
హాయిగా బిడ్డని సాకే కమ్మని అమ్మౌతుంది
అమృతమిస్తుంది.

మర్లపాలెం, గన్నవరం మండలం కృష్ణా జిల్లా. కవయిత్రి. మనసు స్పందించినప్పుడల్లా అక్షర ప్రయాణంలో ఆనంద విహారం చేయడం ఇష్టం. కవిత్వం వివిధ పత్రికల్లో అచ్చయింది. సాంస్కృతీ సమాఖ్య సంస్థ నుండి ఉగాది వెలుగు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుండి జ్ఞాన జ్యోతి, ఉషోదయ సాహితీ వేదిక నుండి గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం, నెల్లూరు గ్రీన్ ఇండియా ట్రస్ట్ నుంచి అడవి బాపిరాజు స్మారక ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.

2 thoughts on “తూర్పూ పడమర

  1. ఆనవాళ్లు లేని మూలాల్ని కాసేపైనా తడుముకుందాం

  2. చక్కని కవిత. .. పల్లెపై పడగలెత్తుతున్న..ఆధునికత ముసుగు. .ను చక్కగా ఆవిష్కరించారు. అభినందనలు

Leave a Reply