తీతువు పిట్టలు పాటలెత్తుకున్నాయ్ ..

ప్రకాశ వంతమైన
ఆలోచనలతో
సాగిన అడుగుల
అలుపెరుగని ఆ దినాలు
మరుపెలా వస్తాయి..

నవ యవ్వనం
తొణికిసలాడే
ఆ ఘడియల్లో
వెతికి వెతికి చదివిన
అమరుల జీవిత చరితలు..

ఎదకు
హత్తుకు పోయిన
ఆ త్యాగాల
స్ఫూర్తి గాధలు
ఈ చెలిమి మైదాన
స్మృతి పథంలోంచి
ఎలా వీడుతాయి ..

నిన్నటి రాత్రీ పగలూ
నెత్తుటి జడివానలో తడిసి
పోటెత్తిన నదీ ప్రవాహాలూ..
పదునెక్కిన అడవుల
తడి ఆరని నేల పొరలూ..

దూసుకొచ్చిన శత్రువు
విద్రోహ దొంగ దెబ్బలకు
రాలి పడిన చిగురాకుల
రేగిన గాయాలు చూసీ..

ఇగురు మానక
చిగురులు తొడిగి
నిదుర వీడిన
వెదురు వనాలై ..

కుదెం ఇడిసి
కుదురుకున్నామని
చెప్పమంటున్నాయి..

అదును దాటక ముందే
నీలాకాశ మేఘాల
మెరుపు మిరుమిట్ల
చిరుగాలి సితారా
చినుకు పిలుపుల కోసం..

చెట్టూ పుట్టా
సేనూ సెలిమా
వాగూ వంకా
బెదురు లేకుండా
ఎదురు చూస్తున్నాయనీ

పొడిచే పొద్దునే
సజీవ సాక్ష్యం గా
చూపమంటున్నాయనీ

ఇప్ప పొదల్లో
గుంపులుగా జేరి
తీతువు పిట్టలు
తెల్లారక ముందే
పాటలెత్తుకున్నాయ్…

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply