తిరుపతక్క సువర్ణక్క

గోడెక్కి దశన్న పువ్వు
మొగ్గదీరి మల్లే
చెమ్మగిల్లిన వాకిలి
నువ్వు చూడింకా…
ఆ వచ్చేది ఖచ్చితంగా అక్కనే


తమ్ముడికచ్చే ఒక్కగానొక్క పండుగ
అక్కే!

చెక్కర కుడుకలో
రాఖీ పండుగో
తెచ్చిన మక్క గారెలూ పడిశం
ఇంటింటి రాజుల ఉత్సవం అక్కనే

అక్కంటే
రెండిండ్ల నడుమ ఎడతెగక పారే వాగు
వాడిపోని రాకపోకల పువ్వు

అక్కతోచెప్పి
బాపుతో కట్టిచ్చుకున్న ఉయ్యాల
ఇద్దరం ఊగీ ఊగీ కాకెంగిలి కథల్లో పడిపోతాం
బాల్యాన్ని చాటా గంపకెత్తి
నవ ధన్యాలను ఎండపొడ పోస్తాం
పెరటి తోటలో తవుటంబెట్టి
ఎల్లిమల్లపొంట రెండు ఉల్లి పూలమవుతాం
ఉప్పు చింతపండు పట్టుకుని
జామ చెట్టు మీద రామచిలుకలమవుతాం

ఎప్పట్లాగే ఇంటెనుక
యాపచెట్టు మీద కోయిల గొంతెత్తుతుందా
హత్తెరి… మా అక్కా తమ్మళ్ళను చూసి
ఇంకింత గొంతు చించుకుంటుంది

నాకింకా గుర్తే
నడిపోరోల్ల రేగ్గాయ చెట్టు
నందయ్యోల్ల పులి చింత చెట్టు
జెగ్గమ్మ వాకిట్ల కుంటుడు టెక్క
ఆరెల్ల సాయిలు పందిరి గిర్క
వాడ కట్టంతా రెస్సాటే

చిన్నప్పటి రైతుబిడ్డ పాటను
యాజ్జేసుకుంట – మల్లా
అక్క సింగులు జెక్కి ఆడుతుంటే
మట్టెల మోతకు అరుగు మద్దెలయ్యేది

ఇంటింటి బతుకమ్మతో ఊరేగింపై
హనుమాండ్ల గద్దె మీదికస్తంటే
నేను – రోలు రోకట్ల పొటాష్ పోసి ఢామ్మనిపించేది

సత్తుగట్టిన ముల్లె నా చేతికిచ్చి
పాడిన పాట పాడకుండ పాడుతుంటే
రాంబాయమ్మ సుత లేసి రాముని పాటందుకునేది

పొద్దూకిందా
వాకిట్ల నవారు ,నులక మంచాలేసి
పిల్లల కోన్ని దొరకబట్టేది

పుటుక్కు జర జర డుబుక్కుమే
అక్క నోట పొడుపు కథ ఊటలూరేది

“రాజు కేడుగురు బిడ్డలం
పొన్న పూవులకు పోయినం “
కథలల్లా పాటలు పాలువోసుకునేది

పద్యాల పోటీల పాటలు సొర్రి
లోల్లి లొల్లయ్యేది
లొల్లికి పెద్ద మనిషి అక్కయ్యేది

ప్రతీ రాత్రి
అక్క చనువుతో సాద మల్లె పందిరి
చుక్కల్తో పోటీ పడేది

అక్కంటనే
బోల్లాట
మొలకెత్తే మండే
బొక్కెన్లు బొక్కెన్లు చేది పోసిన చెయ్యి
ఊరెలుపు అల్లుకున్న రథం ముగ్గు
రెండు చేతులా అడుక్కచ్చిన హనుమాండ్ల పలారం
బర్ల గుడిసెకు పూసిన ముద్ద గౌరమ్మ గుమ్మడి పువ్వు
రోట్లే నూరి పెట్టుకున్న గోరింటాకు
కుచ్చి మెడలేయించిన పీరీల కుడుక
పూదిచ్చిన బోనం కుండ
చెరో పది పైసలేసి
షావ కిందికెల్లి రయ్య రయ్య
అటూ ఇటూ ఈగిన జ్ఞాపకం

కట్ట కర్కాస్, బట్ట బంగారం
నువ్వెన్నను
గుప్పి , కప్ప దుంకులు , పొయ్యి రాళ్ళు
పోకుంట ఆడే కచ్చకాయలు గుర్తస్తయి

రెండు పచ్చీసులు
ఒక త్రీసు‌ , దస్సు
నడుమ చౌదా
కొద్దులు దూగ
ఇగో నాలుగు పావులు
గొడ్డు పంజమెక్కించే పచ్చీసు గుర్తస్తది
మేడి మల్కేసి ఆడిన తాడాట గుర్తస్తది

తియ్యా పెట్టా
తనబ్బి అల్మారాల సప్పుడు
గడియ రికాముండని అలికిడి వినిపిస్తది

సోడు పల్లికాయ కొట్టి
కొనిచ్చిన ఐసుక్రేట్ గుర్తస్తది
బండెడు పెండను ఒక్క చేత్తో చేసిన పిడకలు
పిడక కుమ్మిల ఉడకబెట్టిచ్చిన కందగడ్డ
ఉరికురికి దున్నిన వడ్ల కల్లం
గుమ్ములు నింపిన గంపల లెక్క
కొప్పెర దించి పోసుకున్న ఉడుకుడుకు తానాలు
ఇడువని అక్క వాసనే గుర్తస్తది

సుట్టబట్ట – నీళ్ల బిందె
దవ్వ దవ్వ నడ్తంటే
నీళ్లు తొలికి తడిసిన అక్క ముఖం

నూకలు వడుతుంటే
ఇసుర్రాయి చుట్టూ పొడిచే సూర్యుడు

తంతెల మీద ముచ్చట పెట్టుకుంట తలంటితే
కండ్ల మీద కండ్లు తెరిచే నిద్ర దేవత

చింతపండు పులుసు పెట్టి
ఎండపొడ తానాలు జేయిస్తే
కడకడలు పోయే చిటపటలు
ఎన్ని గుర్తస్తయి !

నన్నెత్తుకొని కిల్ల కిల్ల నవ్విచ్చిన ఆటలు
ఎగిరెగిరి కొట్టిన అందని గుడిగంటలు
గోరు తోని గుచ్చి అల్లిన బంతిపూల రిక్కల దండలు
బొడ్డుమల్లె పూల రెక్కని నలిపి ఊదిన బుగ్గలు
అచ్చు కాయిదం లేకుండా గీపిచ్చిన బొమ్మలు
రాల్లేసి సాగనంపిన కాగితప్పడవలు
ఎట్ల మర్చిపోత

అటుకు మీంచి దూకే పిల్లి
బలుగాన్ని ఎంబడేసుకొని ఉరికచ్చే పిల్లలకోడి
అప్పజెప్పిన పని చేసే దుడ్డే మెడల గంట
పన్నట్టు నటించే కుక్క

దూరంగా ఎగిరే గద్ద
అక్కను అట్టిగ పసిగడుతై

ఇంట్ల మేమిద్దరముంటే
పక్కోల్లకిక మైకు సప్పుడే

బాలానందం పాటలు
విన్న ‘వాన వెలిసింది ‘ నాటికలు
నా వంతుకు దొంగై ఆడిన ఆటలు
పుస్తకాలకేసిన పుట్టలు
పుట్టల్ల రాలిన రెండు కన్నీటి బొట్లు గుర్తస్తయి

బండిని కడిగి
ఎడ్లకు దండలు గుచ్చి
కొత్త కొండ ఈరన్నకు జై
ఎములాడ రాజన్నకు జై
అక్కపొంటే కూసోని
ఎన్ని బండ్ల తీర్థాలు

మెడల కొనేసిన బచ్చీసల దండ
కండ్లకు పచ్చ కళ్ళద్దాలు
ఎక్కిన రంగుల రాట్నం
నోట్లే పీక
చేయి పట్టి తిప్పిన జాతరలు గుర్తస్తయి

పగటిపూట
అక్కనే అమ్మై ఉట్టి దింపి
చీమలు దులిపి తినిపించిన అన్నం ముద్ద
కల్లం కాంచి అమ్మ రానప్పుడు
పేను మీద బూడిద పోసి
ఇదిగో ఇటునుంచస్తుందని
అమ్మ బెంగ దీర్చే సముదాయింపు

సాగేదోలేకాడ
తమ్మీ పైలమని చెప్పి
చెమ్మను దాపెట్టుకోలేక భంగపడ్డ కళ్ళు
ఇప్పటికీ కండ్లల్ల కదులుతుంటై

అక్క
నా కాలికి గుచ్చిన ముల్లుకు
నిలువెత్తు కాంట
నా తోవ పొడుగునా వినిపిస్తున్న
మంగళహారతి పాట

అక్కంటనే
అరుసుకునే పుట్టెడు సారుగాలు
పోసే తీరు తీరు సకినాలు
రెండు చేతులా గొట్టే పల్లికాయ
ఒక సాలు వొలిచి
చేతికిచ్చిన మక్క జొన్న కంకి
గూటంబట్టి కొట్టిన గంపెడు చింతపండు
దోర్నమిప్పి లెక్క పెట్టి కుట్టిన
ఇస్తారాకుల కట్ట
ఒక చెయ్యేసి జెరాన్ని గుంజిన కనికట్టు

అసలుకు అక్కంటే
కొడవలి వంపు
కలుపుదీసే కొంక
సద్ది మోసే నడక
ఇత్తనపు సాల్లల్ల మొలక
బోదాట్ల కడిగిచ్చిన పల్లికాయ చెట్టు

అక్కంటే
ఇంటింటా ముట్టిచ్చే ఎక్క
ఎదురచ్చి బరువుదింపే చెయ్యి
గంపెడు మమకారాలు కురిసే మబ్బు
ఒక గంజు సర్వపిండి
ఒక నల్ల పూసల దారం
వెయ్యి పనులను మలుపు కచ్చే ప్రవాహం
పెండ్లి కొడుకును చేసే ఇచ్చంత్రం

అక్క రాక రాకచ్చిపోతుంటే
పారా చిన్న అంటూ
నన్నెంబడి పెట్టుకొని పోతది
గోడెక్కి తెంపి
కొంగుల నింపిన మల్లెమొగ్గల్ని
తలో నాలుగు పిన్నీసు మందం పెట్టుకుంట పోతుంటే
దారిలో ఎందరక్కలనీ..
ఒగక్కది ఒడువని దుక్కం
ఒకక్కది మీదేసుకున్న కట్టం
ఏ అక్క జూసినా మా అక్కలెక్కనే

ఎప్పుడచ్చినవు
మాల్యమే పోతున్నవు
ఆ కొద్ది సేపట్లనే…
కట్టుకోకుండనే చినిగిపోతున్న పట్టు చీరలు
పెట్టుకోకుండనే ఎండి పోయిన గోర్లపేంట్ సీసలు
కండ్లల్ల చెరువులు
కూడదీసుకున్న గుండె ధైర్యాలు

ఇప్పటికీ అక్కంటనే
వంటింట్లకు పోయే పంట కాలువ గుర్తస్తది
చిటికెలు కొడుతూ చెరిగే చాట గుర్తస్తది
మాటిమాటికి మానెడు పట్టే
గంజు గుర్తస్తది
మడుగుల గొట్టం గుర్తస్తది
పొయ్య కాడ గొట్టం
రెండు దిక్కుల పొయ్యి గుర్తస్తది
పెట్టిన పిక్క తొక్కు లెక్క
ఎర్రగ రగులుతూనే ఉంటది

అన్నదమ్ములు కూడుండాలనీ
అవ్యయ్యలను పట్టిచ్చుకోవాలనీ
వచ్చినప్పుడల్లా చెప్పే బుద్దిమాట
ఇంటింటి ఆకాశమ్మీద
నిత్తె పొద్దు పొడ్తనే ఉంటది
దావఖానల పడితే-
తినా అన్నం
పండా చెద్దరస్తది
ఆపతిసంపతికి
అక్కే ముందరస్తది

ఇప్పటికీ అక్కంటనే
పెంట పొన్క నుంచి వడ్ల బోరెం దాకా
రికాం లేకుండా నడిచే ఎడ్లబండి గుర్తస్తది
టీవీ ముందర
తనా-తనాడబిడ్డల పిల్లలు
వంటింటి చాకిరి గుర్తస్తది

మంచితనం మోతకోల్లతో
వశపడక తిట్టే గావురాల తిట్ల కింది
గోస గుర్తస్తది
బావ బాగు కోసం
గుండు కొట్టిచ్చుకున్న తిరుపతి మొక్కు
పల్లెటూరి మోటు భాష
ఆ బట్ట సంచులు
ఆ మట్టి కడుముంతలు
ఇంటికి వేళ్ళాడే ఎండిన మామిడాకుల తోరణం
సిగన ఉద్రాక్ష పువ్వు
నవ్వినా ఏడ్చినా పెద్దపెట్టున్నే

అక్క ఉత్త పిచ్చిదాన్లా కన్పిస్తది
ఎలిసిపోయిన బాసింగంలాగొడ్తది
చీకటి పడుతుంటే
ఒక్కతై మోసుకచ్చే గడ్డిమోపు
ముందట మూన్నాలుగు బర్లు
నోట్లే జానపదం
బొడ్ల సంచిల రూపాయిబండి
గౌరం చెరువు కట్ట మీంచి
నడిచే మోదుగ చెట్టు గుర్తస్తది

కడపల్ల ముగ్గు
పని దూగే చెయ్యి
మారాన్నం పెట్టుకోవాల్నని
కట్టడి చేసి పొందే తుర్తి
లచ్చిందేవి అక్కంటే

అక్క నదితో సాగుతుంటే
ఆ తీర నాగరికత కోల్పోయి
అపురూపంగా చదువుకుంటున్న చరిత్రంతా అసమగ్రమైందనీ

తమ్ముడి చదువుల వెనుక
వీణ తీగె తెగిన సరస్వతి దేవి అక్కంటే

కుటుంబం ఒక పక్కకు ఒరగకుండా
తన భుజం ఆన్చిన ఓపిక వంతురాలు
పార్వతీ దేవి అక్కంటే

అక్కకు పెండ్లై వెళ్ళిపోయాక
చింతిత్తు చెమ్మలు తయారవుతలేవు
మొత్తం పచ్చీసు కాయలు దొరుకతలేవు
ఓనగుంటల పెట్టే ఎటుదెంకపోయిందో
పంచపాల కళదప్పింది
బొట్టు పెట్టె..అయ్యో..
కై లెదు కుయి లేదు
ఆకుల గూజుడుకు బూజుపట్టింది
దీపం సెగకు చేసిన గాజుల దండ
ఎప్పుడు తెగిపోయిందో
పాతంగి లాగుల గుండీల డబ్బ
పత్తకు లేదు
తీరొక్క ఇత్తనం ముల్లెగట్టి దాచిపెట్టిన
జోడుసంచులు మూలకుపడ్డై
ఇల్లంతా పాసుట్టు

పెరట్ల దశన్న పూలచెట్టు
సక్కగ ఊగుతలేదు
ఊరపిచ్చుక సాదబాయి గిర్క మీంచి ఎగిరిపోయింది
పాడువడ్డ దొరోనిండ్లల్ల
గోరుమీడు వనం కాలిపోయింది
బాపు జోలె మంచంల పంటండు
అమ్మకు గోడల్తోనే ముచ్చట
‘ఆనిగెపు చేండ్ల దొంగలువడ్డరు
అడ్డం రాకురా బుడ్డోడ’… ఏది పాట
బాపమ్మ నెత్తిల తుంటకోక్కులు

ఇల్లు కళదప్పింది
వాడకట్టు చిన్నబోయింది

***

(పతాకం అమ్మలైన అక్కలందరికీ… అక్క గంగిపల్లి తిరుపతక్కకు, అక్క గంగిపల్లి సువర్ణకు)
(రచనా కాలం :2002 – 2003)

పుట్టింది కరీంనగర్ జిల్లా మానకొండూర్ గంగిపల్లి. కవి, అధ్యాపకుడు, చరిత్ర పరిశోధకుడు. కలం పేరు ఆర్క్యూబ్. రచనలు: 'పాలపిట్ట' , 'వాన కోయిల' (కవిత్వం). జనగామలో ఉంటున్నారు.

Leave a Reply