అనువాదం: శివలక్ష్మి
మేము తిరిగి రాలేము,
పై అంతస్తు కిటికీ లోంచి పిలిచే
“ఎలా ఉన్నావు?” అని అడిగే స్నేహితులను చూడటానికి తిరిగి రాలేము.
ఎందుకంటే ఆ కిటికీ ఇప్పుడు లేదు.
మేము తిరిగి రాలేము,
బడి నుండి ఇంటికి హుషారుగా పరిగెత్తుకొస్తున్న
పిల్లలను విని వాళ్ల కోసం ఎదురు చూడడానికి రాలేము
ఎందుకంటే ఆ బడి ఇప్పుడు లేదు.
మేము పనికి తిరిగి వెళ్ళలేము,
బుల్డోజర్ తిరిగిన చోటికి కూడా వెళ్ళలేము:
ఒక్క పుస్తకం, పనిముట్టు లేదా యంత్రం కూడా లేదు,
అన్నీ మాయమయ్యాయి.
మేము వారిని వదిలిపెట్టిన ఆసుపత్రి
శిథిలాల కింద మాయమైంది:
అది ఒక మరచిపోయిన, పురాతన సమాధి దిబ్బ.
దాన్ని మేమిప్పుడు చూడలేము.
ముక్కలైన మా మనసులతో ఎక్కడికి వెళ్ళాలి?
మమ్మల్ని వెలివేస్తారు, శని చుట్టుకున్నవాళ్ళమని శపిస్తారు.
అవమానం భారం మమ్మల్ని వెంటాడుతుంది. మేము ఎవరికీ కాకుండా పోతాము.
మీకు తెలుసు కదా, మేము ఇక ఎప్పటికీ వెనక్కి వెళ్ళలేము.
ఒక పాత చెట్టు కూలినప్పుడు,
కొత్త వెలుగు, నూతన నేల ఆవిర్భవిస్తాయి:
మరెన్నో ఇతర మహత్తర జీవాలు అక్కడ ఉద్భవిస్తాయి.
ఇక్కడ కూడా ఈ సత్యమే వర్తిస్తుంది!
కానీ ఇక్కడ మాకు సంబంధించినది ఏదీ లేదు,
మాకు తెలిసినది ఏదీ లేదు.
మీరు తెరపై కనిపించే ఒక ముఖం మాట వింటారు,
అది మీకు ఆ రోజు ప్రాముఖ్యతను వివరిస్తున్నప్పుడు ఆశ్చర్యంతో వింటారు.
కానీ దానికోసం మీకు సమయం ఉండదు…
ఆ కవిత్వం చెప్పాల్సింది చాలా ఉంది.
మీరు ఆ విధ్వంసాన్ని నమ్మలేక అవాక్కైపోవచ్చు.
లేదా, కేవలం ఉపశమనం కోసం ఆ బాధాకరమైన దృశ్యాలు చూడలేక తప్పించుకోవచ్చు:
కవిత్వం మీ దుఃఖాన్ని భరించగలదా? ఇంకించుకోగలదా?