తిప్పలు

బాప్ ఏక్ నెంబర్ అనుకుంటే
బేటా బేటీ దామాద్ దస్ నెంబర్

చిన్నంత్రరం లేదు పెద్దంత్రరం లేదు
నోటికి ఎంత అస్తే అంత
నరం లేని నాలిక
ఇమరస లేని ఏలిక
ఒల్సెన్ని మాటలు కాదు

జల్లెడ తోటి నీళ్లు తెచ్చినట్టు
సూది బెజ్జంల కెళ్ళి
ఏనుగును ఈగిచ్చినట్టు
బొంకిచ్చి బొర్లేసిండ్రు
పట్టపగలు చుక్కలు చూపించిండ్రు

నక్క ఇక మాంసం ముట్టనని
ప్రమాణం చేసింది
నియ్యతి త్యాగం మచ్చుకు కనబడదు
నికారస్ తెలంగాణవాది లైటేస్తే కనబడడు

కండ్లు నెత్తికెక్కిన అహం
ఒడ్డెక్కినంక తెప్పను తగలబెట్టే ఇహం

రాష్ట్ర గీతం లేని ఆత్మగౌరవం
అంగట్ల తెగ అమ్మబడ్డది
ఆశ పడ్డ తెలంగాణ తల్లి
మళ్లీ ఓసారి గోసల పడ్డది

పింఛన్ పెరిగింది
మద్యం ధర పెరిగింది
ఓటు ధర పెరిగింది
వెయ్యినొక్క తప్పు చేసిన
శిశుపాలుడు నాయకుడు చిరంజీవి

ఎవడు నోరెత్తడు పైగా అభివృద్ధొక
ఝూట మాట నాటకం
ప్రజల సొమ్ము తిన్నోడికి
తగులుద్ది మహా పాతకం

సత్య హరిశ్చంద్రుని తమ్ముళ్లు
శిబి చక్రవర్తి తోడ పుట్టిన వాళ్లు

భూముల్ని వాగులని
నదులని గుట్టలని చెర పట్టిండ్రు
పెయ్యికి తాగుడు చెద పెట్టిండ్రు

మరోసారి జరిగినై తప్పులు
మునిగిపోయే అప్పులు
ఇప్పట్ల తప్పేటట్టు లేదు
తెలంగాణ తిప్పలు

పుట్టింది కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి గ్రామం. కవి. కోపరేటివ్ విద్యుత్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రచనలు: చిలుక రహస్యం, తారంగం, ఒకరోజు పది గాయాలు, పిడికెడు కన్నీళ్లు దోసెడు కలలు, పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్ కామ్, బొడ్డుతాడు, తల్లి కొంగు, రాజపత్రం, చెట్టుని దాటుకుంటూ, పస, ఊరు ఒక నారు మడి.. 14 కవితా సంపుటాలు, 'వైఫణి'( నైపుణ్యం) కథల సంపుటి ప్రచురించారు.

Leave a Reply