తరగతి

రక్తమోడుతున్న దేశ ముఖచిత్రాన్ని
తరగతిలో గీస్తాను తరుచుగా
హృదయమంతటితో
విస్తారంగా చూస్తారు వాళ్ళు

వారం వడ్డీలా పోగుపడుతున్న ఆకలిని
సవతి తల్లి కూడా కాలేని మాతృదేశాన్ని
నా నరాలతో గానం చేసినప్పుడు
వాళ్ల కడుపులో రేగిన అశాంతిని
ద్వంద్వoగా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు పిల్లలు

విసిరి వేయబడ్డ జీవితాలను
సనాతన హత్యాచార ధారను
వాళ్ల మెరుపు కండ్లలోకి అసంకల్పితంగా మళ్ళీస్తాను
దగ్ధహృదయ సన్నివేశాలై
ఎర్ర బారిపోతారందరు…

వాళ్లేమీ పిల్లలు కాదిప్పుడు
అలిశెట్టిని, అంటరానివసంతాన్ని
నేర్పుగా అనువాదం చేసుకుంటారు…

వేమనను వీరబ్రహ్మాన్ని
అగ్రహారపు వెలుగులో కాదు
అట్టడుగునుంచి లెక్కిస్తారు…

తరగతిలో శ్రోతలు కాదు వాళ్ళు
చిప్పిల్లే జ్ఞానంతో పరిమళంగా
వర్తమానాన్ని రాస్తారు.
శ్రమలోనుంచి సౌందర్యంగా
రేపటిని కలగంటారు…

Leave a Reply