తడి తలంపు ఉండాలిగా!

ఆ గుండెకైన గాయమెప్పుడూ కనిపించాలంటే
పచ్చి గాయాల తడిని మోసే
తడి తలంపు మీలో ఉండాలిగా!
ఎవరు ఎన్నైనా చెప్పండి
మా మనసు లోలోతులను తాకే సహృదయాన్ని మీరెప్పటికీ సాధించలేరేమో!

రంగు దారప్పోగులను ప్రేమించినంతగా..
గొంగళి పురుగు కష్టాన్ని
ప్రేమించలేని మీకెప్పటికీ
ఆమె మనసు పడే వేదనే కాదు
కనీసం ఆ పురుటి నొప్పుల మట్టి వాసన కూడా
మీ ముక్కుపుటాలను తాకదు కాక తాకదులే!

ఎవరి చిరునామాను వారే మోసుకు తిరుగుతున్న
ఈ మాయా ప్రపంచంలో
అందరి మనుగడకు చిరునామాగా మిగిలిన
ఆమెకో శాశ్వత చిరునామా ఎప్పటికి దొరుకుతుంది?

తొడల మధ్య స్వర్గాన్ని మాత్రమే ఆశించే మీరు
ఏనాడైనా ఆమెను మీ హృదయ సింహాసనంపై కూర్చోబెట్టారా?

మీ మురికి మాటల చపలత్వానికి ఆమెను వందసార్లు తలచుకుని
మీ మైల తలంపులతో క్షణానికో వంద సార్లు అత్యాచారం చేసే మీరు
మీ ఉనికికి ఊపిరి పోసిందామేనని ఏనాడైనా గ్రహించారా?

మా కన్నీళ్లకు కొలతలుండవు
మా బాధ్యతలకు అంతముండదు
అయినా మా ఉనికెప్పుడూ ప్రమాదపు అంచులపైనే!

మీ ఆస్తుల చిట్టాల స్థిరాస్తిగానే మేమెప్పుడూ!

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

5 thoughts on “తడి తలంపు ఉండాలిగా!

  1. “తొడల మధ్య స్వర్గాన్ని మాత్రమే ఆశించే మీరు
    ఏనాడైనా ఆమెను మీ హృదయ సింహాసనంపై కూర్చోబెట్టారా?” ఎంత అద్భుతంగా వాస్తావ దృశ్యాన్ని….. ఆవిష్కరించారు. చాలా మంచి కవిత.

  2. మా ఉనికెప్పుడు ప్రమాద పు అంచుల మీద

  3. రంగు దారప్పోగులను ప్రేమించినంతగా..
    గొంగళి పురుగు కష్టాన్ని
    ప్రేమించలేని మీకెప్పటికీ
    ఆమె మనసు పడే వేదనే కాదు
    కనీసం ఆ పురుటి నొప్పుల మట్టి వాసన కూడా
    మీ ముక్కుపుటాలను తాకదు కాక

    ఒక సున్నిత జీవనాంశాలు వాస్తవికత ఈటెలతో స్పందించారు చాలా అద్భుతం….

    ఒక నిజానమైన modern poetry ని చదివిన అనుభూతి

    జి కుమార్

Leave a Reply