డెబ్భైయ్యవ దశకపు ఇనాక్ నవలలు

డెబ్భయ్యవ దశకంలో ఇనాక్ వ్రాసిన నవలలు మూడు. అవి – ఎక్కడుంది ప్రశాంతి? (1970) సౌందర్యవతి (1971) ఇరులలో విరులు (1972).

1960 లలో భారతదేశంలో ఏర్పడిన ఆహారధాన్యాల కొరత వలన, పెరిగిన ధరల వలన ప్రజా జీవితం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం నేపథ్యంగా నడిచిన నవల ఎక్కడుంది ప్రశాంతి. బర్మా భారతదేశం నుండి విడిపోయాక(1937), 1943 లో బెంగాల్ కరువు మిలియన్ల జనాన్ని పొట్టన పెట్టుకొన్న చేదు అనుభవం నుండి ఆహార కొరత ఒకతీవ్ర సమస్యగా ముందుకువచ్చింది. 1947 లో పాకిస్థాన్ విడిపోవటం,వర్షాలు లేక పంటలు పాడు కావటం ఇవన్నీ దానికి తోడయ్యాయి.అందువల్లనే వ్యవసాయ అభివృద్ధి, ఆహారధాన్యాలలో స్వయంసమృద్ధి లక్ష్యంగా మొదటి పంచవర్ష ప్రణాళిక రచన జరిగింది.ప్రారంభంలో ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నా 1955 నాటికి ఆహారధాన్యాల ధరలు పెరగటం మొదలైంది.59 నాటికి ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. వరి తగ్గించి గోధుమ వాడకం పెంచాలని ఆహారధాన్యాల వినిమయానికి పరిమితులు విధించటం జరిగింది. ఈ దేశీయ సామాజికార్ధిక నేపథ్యంలో ఎక్కడుంది ప్రశాంతి నవలలోని కథ రూపొందింది. మార్కా పురానికి పది మైళ్ళ దూరంలోని పల్లె రైతు రామయ్య తిండిగింజలు దొరకక, కటకట లాడుతున్న స్థితిలో పొలం, ఇల్లు, తోపు అన్నీ అమ్ముకొని నిండు నెలలతో ఉన్న భార్యను, మూడేళ్ళ కొడుకును తీసుకొని గుంటూరుకు మకాం మార్చటానికి కాలినడకన మార్కాపురం రైల్వే స్టేషన్ కు చేరటం దగ్గర మొదలవుతుంది నవల. తిండి గింజలిస్తే తప్ప బండి కట్టం అని బండ్లవాళ్ళు నిర్ణయించుకొనటం వల్ల చేతిలో డబ్బు ఉండి కూడా నిండు నెలల భార్యను నడిపించుకొంటూ రావలసిన గడ్డు కాలం అది. ఆకలి దాహంతో అలమటిస్తున్న భార్య కోసం , కొడుకు కోసం ఆరాటపడుతూ వాళ్లిద్దరూ ఎక్కవలసిన రైలు ఎక్కకుండానే తనకళ్లముందే మరణిస్తే పిచ్చి వాలకం పడిన రామయ్య ఊళ్లోకి, రైలు స్టేషనుకి వస్తూ , పోతూ ఏడుస్తూ గడిపిన నెలరోజులకు స్టేషన్ లో రైలు కింద పడబోయిన మూడేళ్ళ పిల్లవాడిని కాపాడి ఒక తండ్రి కృతజ్ఞతను పొందాడు . ఆ పిల్ల వాడి అక్క దయను పొందాడు.

ఆ తరువాత మనుషుల్లో పడి పల్లెకు తిరిగి వెళ్ళాడు. తాను ప్రేమించి పెళ్ళాడలేకపోయిన తనభార్యకు చెల్లెలు అయిన సుందరితో తన దుఃఖం పంచుకుందామని ప్రయత్నించాడు. సుందరిని పెళ్లాడాలన్న ఆలోచన లోలోపల అతనికి, బావను పెళ్లాడాలన్న కోరిక ఆమెకు , వాళ్లిద్దరూ పెళ్లిచేసుకొని ఊళ్ళోనే ఉండిపోతే బాగుండన్న ఆశ సుందరి తల్లికి లోలోపల ఉన్నా ఎవరూ పైకి తేలక , ఎదుటివాళ్ళకు ఇష్టం లేదేమో అనుకొంటూ ఎవరికివారు తాము బయట పడటం ఇష్టం లేక పడిన ఆంతరిక ఘర్షణలు కలిగించిన దుఃఖం మోసుకొంటూ రామయ్య వూరు విడిచి వెళ్ళిపోవటం నవలలో రెండవ ఘట్టం. ఇక్కడ కూడా తిండిగింజల కటకట , ఒకళ్ళు వొళ్ళు మరచి కడుపునిండా తింటే మరొకరికి తిండి లేని పరిస్థితిని చూపిస్తారు రచయిత.

పొలమూ, ఇల్లూ అమ్మిన డబ్బు సుందరికి ఇచ్చేసి గుంటూరు చేరిన రామయ్య కొత్తజీవితం పస్తులతో లాగుడుబండి కూలీగా మొదలైంది. గుంటూరు పట్టణం జూదాలు, తాగుడు, వ్యభిచారం, దొంగతనం మొదలైన సర్వ అవలక్షణాలతో కునారిల్లటం చూసాడు. ఆకలైనవాళ్లకు బువ్వలేని, అరగని వాళ్లకు అన్నం పుష్కలంగా ఉన్న అసమ వ్యవస్థ అర్థమైంది. వందల బస్తాల బియ్యం నిలువలు ఒకవైపు , తిండి దొరకని వాళ్ళు అనేకులు మరొకవైపు కనిపిస్తుంటే ఆవేదన పడ్డాడు. ఆకలి మీద చూసుకోకుండా తాను మొత్తం తినేస్తే తల్లికి ఏమిపెట్టాలో తెలీక తల్లడిల్లిన సుందరి అతనికి గుర్తుకువచ్చింది బియ్యంబస్తాల నిలువలు చూసినప్పుడు.

మార్కాపురం రైలు స్టేషన్లో తాను కాపాడిన పిల్లవాడి తండ్రి సుబ్బయ్య రామయ్యకు గుంటూరులో తటస్థపడ్డాడు. బియ్యం కోసం వేటలో ఉన్నాడతను. బియ్యం దొరకటం కష్టంగా ఉందని , దొరికినా కొనటం కష్టంగా ఉందని అతను చెప్పాడు. వాళ్ళకోసం ఊరంతా తిరిగి రహస్యంగా బియ్యం అమ్మే ఆచూకీ కనిపెట్టి కొనుక్కొచ్చి ఇస్తాడు. ఆజ్ఞాపకాలు, ఈ అనుభవాలు , జనం అవసరాలు అతనిని బియ్యం వ్యాపారంలోకి దించాయి. తెనాలి నుండి బియ్యం బస్తాలు గుంటూరు చేర్చి అమ్మటం చట్టప్రకారం నేరం. బియ్యం మూట కనబడితే పట్టుకొనే ఆ రోజుల గురించి, పోలీసుల కళ్లుగప్పి ధాన్యం చేరవేసే బడుగు జనం గురించి చాసో వంటి వాళ్ళు కథలు వ్రాస్తే ఆ కాలం రైతును బియ్యం అక్రమ రవాణాదారుగా ఎలా మార్చిందో ఈ నవలలో చూపారు ఇనాక్.

తెనాలి లో బియ్యం పట్టుబడకుండా తప్పించి గుంటూరు స్టేషన్ సమీపంలో గొలుసు లాగి రైలు ఆపి బియ్యం బస్తాలు కిందపడేసి తరువాత తాము దిగి తమ మూటలు ఎరుకల వాళ్ళ గుడిసెలదగ్గర వేసి అక్కడే అమ్మకం పూర్తిచేసి డబ్బు చేసుకొనే విద్య రామ్మూర్తిగా మారిన రామయ్యకు బాగా పట్టుబడింది.అది అతనికి వ్యాపారం మాత్రమే కాదు తిండిగింజల కరువు కాలంలో అవసరంలో ఉన్నవాళ్లకు వాటిని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ . కనుకనే మార్కాపురం నుండి బియ్యం కొనుక్కొనటానికి వచ్చే వాళ్లలో నమ్మకమైన మనిషికి వారానికి ఒక అరమూట బియ్యం ఇచ్చి సుందరికి పంపటం బాధ్యతగా తీసుకొన్నాడు. రైల్లో సహప్రయాణీకురాలు భర్త మంచంపట్టి తిండికి గడవని పరిస్థితిలో తిండిగింజలో , డబ్బో తెద్దామని పుట్టింటికి వెళ్లి భంగపడి వచ్చిందని, మూడురోజులనుండి తిండి లేక పిల్లాడికి పాలు ఇయ్యలేక ఏడ్చిన ఏడుపుకు కరిగి పోవటం, కనికరించి కొంచం బియ్యం ఇస్తే గంజి కాచుకు తాగుతానని ఆమె అడిగితే పోలీసులకు పట్టు పడినా సరే ఆమెకూ ఆమె బిడ్డకు మానవత్వం మీద విశ్వాసం పోకుండా ఉండాలంటే తాను ధాన్యం ఇచ్చి తీరాల్సిందే అనుకొనటం, ఆకలితో అలమటిస్తున్న ఒక పేదరాలికి సంచీడు బియ్యం ఇయ్యటానికి పది బస్తాల బియ్యం వదులుకొనటానికి , తాను నేరస్థుడుగా జైలుకు వెళ్ళటానికి సిద్ధపడటం – ఇదంతా బియ్యం అక్రమ రవాణా వ్యాపారంతో లాభాలు చేసుకొని ఎదగాలనుకొనే వ్యాపార తత్వం ఎంతమాత్రం కాదని స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అందుకనే అంత సులభంగా ఆ వృత్తిని వదిలేసి రైల్లో సహప్రయాణీకుడు మాధవయ్య తన సినిమాహాల్లో పని ఇస్తానంటే వెళ్లిపోగలిగాడు. ఇంతవరకు రామయ్య జీవితంలో ప్రశాంతత లేకపోవటానికి కారణం దేశ ఆర్ధికస్థితిగతుల ప్రభావం.

ఆతరువాత సుబ్బయ్య కూతురు సరోజను ఇష్టపడి పెళ్లిచేసుకొని బిడ్డను కన్నా,తల్లి మరణం తరువాత తనదగ్గరకు వచ్చి ఉన్న సుందరి పై కాంక్ష వదలకపోవటం వల్ల , తనకోరిక అంగీకారం కాక సుందరి గ్రామానికి వెళ్ళిపోవటం వల్ల , రోడ్డుప్రమాదంలో కూతురు మరణించటానికి కారణం సరోజ నిర్లక్ష్యమేనని అనుకొనటం వల్ల, ఆమె అతని తిరస్కారాన్ని భరించలేక ఉద్యోగం చేసుకొంటూ తనబతుకు తానుబతకటానికి వెళ్ళిపోయినప్పుడు ఏర్పడిన శూన్యాన్నిపూరించటానికి సుందరి ఇష్టపడక పోవటం వల్ల, సినిమాహాలు వ్యవహారాలను ఒక కొలిక్కి తేవటం లో ఏర్పడిన శతృత్వాలవల్ల జీవితంలో ప్రశాంతి లేకుండా పోయింది అతనికి. అనేక పాత్రలను, ఆకర్షణకు, ప్రేమకు సంబంధించిన వైరుధ్యాలతో కూడిన ఘటనలతో, అపార్ధాలు , పగలు, ద్వేషాలు, హత్యాప్రయత్నాలు మొదలైన నాటకీయ పరిణామాల తరువాత మూర్తి గ్రామానికి వెళ్లటం , అవసానదశలో ఉన్నసుందరిని చేరుకొనటం, ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు విడవటంతో ముగిసే ఈ నవల పరమార్ధం అనూహ్యం.

సౌందర్యవతి నవల తాను ఇష్టపడిన వరుడు తనఅక్క భర్త అయితే మానసిక సంక్షోభానికి గురి అయిన యువతి ఒక స్థిరత్వం లేక తొక్కిన భిన్న మార్గాల కథనం. స్త్రీని ఆమె ఆశలకు , ఆకాంక్షలకు అనుగుణంగా బ్రతకటానికి అవకాశం ఇయ్యక ఆమె బాగు కోరి అంటూ ప్రేమతోనే అయినా తల్లి తండ్రి , ఆప్తులు ఇచ్చే సలహాలు, పెట్టె ఒత్తిడులు వాళ్ళ జీవితాలను విఫల ప్రయోగాలుగా మార్చి విధ్వంస కారకమవుతాయని హెచ్చరించారు ఇనాక్ ఈ నవల ద్వారా.

ఇరులలో విరులు నవల కాలేజీ విద్యార్థుల ఆర్ధిక హార్దిక సంబంధాల చుట్టూ, ప్రేమవ్యవహారాల చుట్టూ అల్లబడింది. విశాఖపట్టణంలో ఆంధ్రా యూనివర్సిటీ కథా స్థలం. అక్కడికి చదువులకు వచ్చే వాళ్ళ సామాజిక ఆర్ధిక నేపధ్యాలు వేరువేరు. వాళ్ళ మధ్య సంబంధాలు, సంఘర్షణలు ఈ నవలకు ఇతివృత్తాన్ని సమకూర్చాయి. ప్రధానంగా కథ నడిచేది నలుగురు వ్యక్తుల మధ్య. వాళ్ళు రమ , జానకి, రామం, సుందరం.నలుగురూ యూనివర్సిటీలో సహవిద్యార్థులు. రమ, జానకి ఆడపిల్లల హాస్టల్ లో రూమ్ మేట్స్ కూడా. తండ్రి లేని రమ మెస్ బిల్ కట్టటానికి డబ్బులేక, ఇంటి దగ్గర ఉన్నతల్లి నుండి తెప్పించుకొనే అవకాశం లేక మూడు రోజుల నుండి పస్తులుండి, మంచి నీళ్లు తాగి ఆకలి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ డబ్బుకోసం రామం ను అడిగి , అతనింకా ఇయ్యకపోయేసరికి సుందరాన్ని అడిగితే అతను వచ్చి మెస్ బిల్లు కట్టి ఆమె సమస్య తీర్చటం దగ్గర కథ మొదలైంది.డబ్బు సర్దిన సుందరం రమ మీద ఏదో హక్కు ఉన్నట్లు హాస్టల్ కు రావటం , అతనితో అంతకు ముందే స్నేహం ఉన్న జానకి దానిని పునరుద్ధరించటానికి చొరవ చూపటం , ఇద్దరి మధ్యా శారీరక సంబంధం వరకు అది పోవటం , ఆమె గర్భవతి అని తెలిసాక అతను మొహం తప్పించటం, జానకిని రమ కనిపెట్టుకొని ఉండటం, ఆమె తండ్రి వచ్చి సుందరం తండ్రితో మాట్లాడి కూతురి పెళ్లి నిర్ణయించటం, రమ కు రామం కూ మధ్య ప్రేమ దృఢపడి పెళ్లి గురించి అనుకొనటం తో నవల ముగుస్తుంది.

స్థూలమైన ఈ కథా మంటపాన్ని కలిపే సూత్రం రాజేశ్వరి. యవ్వనోద్వేగ వాంఛలు, ఆకర్షణలు తొందరపాటు నిర్ణయాలకు కారణమై స్త్రీలపై వేసే ప్రభావాలు మానసిక వైక్లబ్యాలుగా మారి జీవితకాలం వెన్నాడుతూ ఉంటే ప్రవర్త నా రీతిలో వ్యక్తమయ్యే అపసామాన్యత కు సజీవ ఉదాహరణ ఆమె.ఆమె ఇంగ్లీషు విభాగంలో రీడర్.రమ , జానకి , రామం , సుందరం ఆమె విద్యార్థులే. ఆడపిల్లలు అతిగా అలంకరించుకొనటం, ఆడామగా కలిసి తిరగటం ఆమెకు నచ్చదు. జానకి సుందరం కలిసి తిరిగిన తొలినాళ్లలో వాళ్ళను మందలించి దూరం చేసిందీ, రమ ను రామం తో కలిసి తిరగవద్దని హెచ్చరించింది ఆమె. ఆమె ఈప్రవర్తన విద్యార్థుల హేళనకు, వెక్కిరింతలకు గురి అవుతుంటాయి. విద్యార్థులు ఆమెకు పెట్టుకొన్న మారుపేరు తాటకి. అయినా ఆమె ఎందుకీ బాధ్యత తీసుకున్నట్లు? కథాకాలానికి పాతికేళ్ల క్రితం ఇంటర్ చదువుతున్న రాజేశ్వరి జగన్నాధాన్నిప్రేమించి పెళ్లిచేసుకొని అతనువద్దంటున్నా బిఎలోచేరి, చదువుతూ భర్తసాధింపులు వేధింపులు భరిస్తూ మరొక పురుషుడి ఆకర్షణలో పడి మోసపోయి ఆతరువాత ఎమ్మె చేసి ఉద్యోగంలో స్థిరపడిన ఒంటరి రాజేశ్వరి తన జీవిత పరిణామాలు ఒకగుణ పాఠంగా అమ్మాయిలు అబ్బాయిలతో తిరగటాన్ని ఒకప్రమాదంగా భావిస్తుంది. నివారించే ప్రయత్నం చేస్తుంది. జానకి గర్భవతి అని తెలిసినప్పుడు ఆమెకు సహాయపడటానికి ముందు పడటంలోనూ ఆప్రభావమే ఉంది. అమాయకుడు అని తాను నమ్మిన సుందరమే జానకి గర్భానికి కారకుడని, పెళ్ళికి నిరాకరిస్తున్నాడని తెలిసినప్పుడు ఆమె వెళ్లి అతనిని కొట్టిన తీరులో తరతరాల మగవాళ్ల వంచనాపర లక్షణం మీద లోలోపల పేరుకున్న కసే పని చేసిందంటే అతిశయోక్తి కాదు.

ఈ నవల రచనాకాలమే కథాకాలం అనుకొనటానికి కథలో ఆధారాలు ఉన్నాయి. జానకి తండ్రి జానయ్య – రాబర్ట్ లూయీస్ జాన్ గురించి పరిచయం చేస్తూ రచయిత బ్రిటిష్ ప్రభుత్వకాలంలో క్రైస్తవం తీసుకొని జస్టిస్ పార్టీలో చేరిన వ్యక్తిగా , అమెరికా, ఇంగ్లాండ్ యాత్రలు చేసివచ్చినవాడు అని చెప్పి స్వాతంత్య్రం వచ్చాక పదిహేను సంవత్సరాలకు లక్షాధికారిగా తేలాడు అని చెప్తారు రచయిత. పదిహేను సంవత్సరాలు అంటే 1962 నాటికి ఆయన లక్షాధికారి. ఒక కొడుకు అమెరికాలో ఇంజనీరుగా , ఒక కొడుకు లండన్ లో డాక్టరుగా స్థిరపడ్డారు. చివరిది జానకి. అంతేకాదు ముప్ఫయ్ ఏళ్ళనాడు బ్రిటిషు వాళ్ళ పాలనలో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు అని అతని గురించి మరొక మాట కూడా అంటాడు. నవల రచనాకాలం 1972 ను ప్రమాణంగా తీసుకొని ముప్ఫయ్ ఏళ్ళు వెనకకు పోతే 1942 కావాలి. స్వాతంత్య్రం వచ్చాక పదిహేనేళ్ళు అంటే 1962 కు ముప్ఫయి ఏళ్ళనాడు బ్రిటిష్ పాలన అన్న మాటను బట్టి 1947 నుండి 30 ఏళ్ళు కలుపు కొంటే 1977కు మధ్య ఈ నవల లో కథ ప్రవర్తించింది అనుకోవచ్చు. నవల రచనాకాలం 1972 కనుక నవల జరిగిన విషయాన్ని, జరుగుతున్న విషయాన్నే చిత్రించగలదు కనుక 1972 తరువాతి జీవితం చిత్రించే అవకాశం లేదన్నది స్పష్టం. అందువల్ల నవల రచనాకాలమే కథాకాలం. అయితే ఈ కథకు ఆ డెబ్భయ్యవ దశకపు రాజకీయార్థిక పరిణామాలతో పెద్ద ప్రమేయం ఏమీ కనబడదు .

ఈ నవలలో సుందరం తప్పమిగిలిన ముగ్గురు రమ, రామం, జానకి హరిజనులు..హరిజన క్రైస్తవులు. అంతమాత్రాన వాళ్ళు సమానులు కారు. రమ స్కాలర్ షిప్ సరైన సమయానికి రాకపోతే మెస్సు బిల్లు కట్టలేని పేదఇంటి పిల్ల. తల్లి కూలీ నాలీ చేసి తనను తాను పోషించుకొనే శ్రమ జీవి. పసుపుకుంకుమల కింద తండ్రి ఇచ్చిన పొలం అమ్మి కూతురికి చదువు చెప్పిస్తున్నది. ఉండటానికి ఇల్లు తప్పమరేమీ లేదు. అ దైనా ఎండకు, వానకు నట్టిల్లే. పరిస్థితి చూసి రామం వంద రూపాయలు ఇస్తే గానీ ఇల్లు కప్పించుకోగల అవకాశం లేనివాళ్లు. జానకి లక్షాధికారి జానయ్య కూతురు. హరిజనులు, బీదవాళ్ళైన క్రైస్తవులు మాత్రమే అర్హులు అయిన సోషల్ వెల్ఫేర్ స్కాలర్ షిప్ కు తాను పేదవాడని ఒక సర్టిఫికెట్ పుట్టించి కూతురిని అర్హురాలిని చేసిన వాడతను. అతని కూతురుగా జానకి డబ్బు లేని బాధ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగింది. మనిషి అవసరాలను కనుక్కొని సహాయం చేయటం తెలియని మనిషి. తన అవసరాలకోసం ఎంతయినా ఖర్చు చేయటానికి వెనుకాడని మనిషి. రాజేశ్వరి మేడం మీద సుందరం నుండి తనను విడదీసింది అన్న కోపం తీర్చుకొనటానికి ఆడపిల్లలు మంచి చీరకట్టుకొని కాస్త అలంకరించుకొంటే చిరాకుపడే ఆమె బలహీనతను రెచ్చగొట్టటానికి రమ కు చీరలు కొనిపెట్టటానికి నిమిషం కూడా సందేహించక పోవటం అందుకు నిదర్శనం. రాజేశ్వరి మీద ప్రతీకారానికి రమ శరీరాన్ని మంచి చీరతో అలంకరించటం ఒక మార్గమనుకొన్న జానకి ఆ సమయంలో మెస్ బిల్లు కట్టలేక ఆకలితో ఉన్న తన స్థితిని గమనించలేకపోవటం రమ దృష్టిని దాటిపోలేదు. మెస్ బిల్లు కట్టి ఆమె మీద తనకేదో అధికారం ఉన్నట్లు హాస్టల్ కు వస్తూ , ఫోన్లు చేస్తూ ఉన్న సుందరాన్ని రమ మాట తలపెట్టకుండా చేసి తనవైపు తిప్పుకొనేవరకు జానకి ప్రవర్తించిన తీరు ఆమె వర్గస్వభావాన్ని సూచిస్తుంది. “ ఇద్దరిదీ ఒకేకులం.రమ హరిజనయువతీ.క్రైస్తవ మతం ఇష్టం! జానకి క్రైస్తవ యువతి. హరిజన విద్యార్ధినిగా స్కాలర్ షిప్ సంపాదించుకుంటుంది. కలవారి అమ్మాయి జానకి. లేనివారి అమ్మాయి రమ” అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరాన్ని సూచించటంలో రచయిత చైతన్యం వ్యక్తం అవుతుంది.

రామం హరిజన విద్యార్థి అని పరిచయం చేస్తారు రచయిత. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా స్వీకరించటం, తన సౌకర్యానికి ,సౌఖ్యానికి అనుగుణంగా ఆదర్శాలను ఏర్పరచుకొంటూనే మనుషులపట్ల బాధ్యతగా మెలగటం తెలిసిన వ్యక్తిగా అతను కనబడతాడు. మూడురోజులుగా పస్తులున్నానని మూడువందల కావాలని రమ అడిగినప్పుడు వెంటనే ఇయ్యటానికి అంత డబ్బు దగ్గర లేకపోయినా , స్నేహితులదగ్గర పుట్టకపోయినా ఇంటికి వెళ్లి మరీ తీసుకొనిరావటంలో ఆ బాధ్యతే ఉంది. క్రిస్మస్ సెలవులలో వూళ్ళో రమ ఎలా ఉందొ తెలుసుకొనాలని వెళ్ళినప్పుడు ఆ బాధ్యతతో పాటు ఆమె పట్ల ఆసక్తి కూడా వుంది. రమ ఇంటిని చూసి కప్పు సరిచేయించుకొనటానికి డబ్బు పంపుతాను అని చెప్పి ఒప్పించటంలోనూ ఆ బాధ్యతే ఉన్నది. మనుషుల కష్టాల పట్ల స్పందించే లక్షణం అది. జానకి పెళ్లి కాకుండానే గర్భవతి అయి సుందరం తనను పెళ్లాడటానికి నిరాకరించినప్పుడు ఆమె పక్షాన నిలబడి ఆమె తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించటంలోనూ సమస్యలలో ఉన్న మనుషులపట్ల చూపవలసిన శ్రద్ధ , సంస్కారమే కనిపిస్తాయి. అయితే అతనిలో స్వార్ధం లేకపోలేదు. స్త్రీ , డబ్బు రెండిటి పట్లా ఆశ ఉంది.జానకిని ఒకప్పుడు ఆమె ఆస్తిని, ఫారిన్ పోయే అవకాశాన్ని అందుకొనటానికి ప్రేమించి పెళ్లాడాలనుకొన్న విషయం బహిరంగంగా చెప్పగల తెగువ ఎంత ఉందొ, సుందరం చేత తిరస్కరింపబడిన గర్భవతి అయిన జానకిని, అమాయికంగా మోసపోయిన జానకికి అన్యాయం జరగకూడదు అని ఆమెను ఆ పరిస్థితులలో పెళ్లాడటానికి సిద్ధపడగల మానవీయత కూడా అతనిలో ఉంది. తాను ప్రేమిస్తున్న రమకు ప్రేమిస్తున్న రమకు అన్యాయంచేస్తున్నానేమో అని కాలం కూడా అనుమానం పడలేకపోయాడంటే అది రమ మీద ప్రేమ లేక కాదు, ఆమెను మోసం చేద్దామనీ కాదు.తన అండ తక్షణం అవసరమైన వ్యక్తి జానకి అన్న అవగాహన వల్లనే. సుందరం జానకిని పెళ్లాడటానికి అంగీకరించాడు అని తెలిసాక అంతే ఆర్తితో అతను రమను కోరుకున్నాడు.

పొగాకు వ్యాపారి ఏకైక కుమారుడిగా సుందరం లోనూ డబ్బు తెచ్చేఅధికారాన్ని ప్రకటించగల లక్షణం, స్త్రీల అభిమానాన్ని, ప్రేమను పొందగలనన్నఆశ ఉన్నాయి. శరీరం కోరింది కనుక స్త్రీలతో స్నేహం కావాలి. మూడువందలు ఇచ్చిన మర్నాడు తనను చూసి అతను నవ్విన నవ్వులో రమ ‘డబ్బు ఇచ్చిన నవ్వును, లెక్చరర్ స్టూడెంట్ ను చూచి నవ్వే నవ్వును , జడ్జి అపరాధినిచూచి నవ్వే నవ్వును, అధికారం వ్యక్తమయ్యే నవ్వును’ చూసిందని చెప్పటంలో రచయిత సుందరం వ్యక్తిత్వంలోని అధికార పోకడను, డబ్బుతెచ్చిన అహంభావాన్నిచూపించగలిగారు. అవి తెచ్చిన తొందరపాటు వల్లనే జానకి వ్యూహంలో పడగలిగాడు. రమ తనను తప్పించుకొని తిరుగుతున్నదని అపార్ధం చేసుకోగలిగాడు. పుట్టుకతోవచ్చిన బుద్ధులు అని ఆమె కులానికి నీచత్వాన్నిఆరోపించి నిందించ గలిగాడు. తన సౌఖ్యమే గానీ పరులకష్టం గురించి ఆలోచించలేని, బాధ్యత వహించలేని తత్వం వల్లనే జానకితో పెళ్ళికి నిరాకరించి, ఆమెను తిరస్కరించాడు. అమాయకుడనుకొన్న వాడు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తాడని ఊహించలేని రాజేశ్వరికి కలిగిన పట్టరాని ఆగ్రహంవల్లనే అతనిలోని ఆదుర్మార్గ లక్షణం దెబ్బకు దయ్యం వదిలినట్లు వదలింది. పశ్చాత్తాపంతో జానకిని పెళ్ళాడటానికి సిద్ధపడటం జరిగింది. ఆరకంగా నవల సుఖాంతం అయింది.

ఈ నవలలోని మరొక ప్రత్యేకత క్రైస్తవ మత నేపథ్యంలో నడవటం. సాధారణంగా తెలుగు నవలలన్నీ హిందూ సమాజ సంబంధాలను చిత్రించినవే.భారతదేశంలో తెలుగు సమాజాలలో క్రైస్తవ మత జీవనవిధానం ఒకటి ఉందన్న స్పృహ అసలు కనబడదు.దానికి భిన్నంగా ఈ నవలలో చర్చి క్రిస్మస్ పండగ, ఆసంబంధమైన సంస్కృతి ఇతివృత్త గమనంలో సహజభాగం అయినాయి.రమ బైబిల్ చదవటం, క్రీస్తు పటం ముందు మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్ధన చేయటం , ప్రతి ఆదివారం జానకితో కలిసి చర్చికి పోవటం చాల సహజంగా కథనంలో భాగం అయ్యాయి. చర్చికి వెళ్ళటం రమకు అత్యవసరం అయితే జానకికి అది గొప్ప అని చెప్పటం మరువలేదు రచయిత. డబ్బు మతవిశ్వాసాల విషయంలో నిర్వహించే పాత్ర గురించి ఆలోచించమంటారు. మత విశ్వాసాల విషయంలో తమకు అలవాటు లేనిదాన్ని అసహ్యంగా చూచే హిందూ బ్రాహ్మణీయ ఆధిక్యతను కూడా ప్రస్తావించటం గమనించవచ్చు. రమ కులాన్ని హీనం చేసి మాట్లాడిన సుందరమే చర్చిలో జరిగే హొలీ కమ్యూనియన్ గురించి అందులో క్రీస్తు శరీరం తిని , రక్తం తాగటం గురించి విని అదేమిటి అసహ్యంగా అని ఈసడించుకొన్నాడు . తప్పు అలా అనకూడదు అని రామం అతనిని సవరించవలసి వచ్చింది.

క్రిస్మస్ సెలవులకు విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ ఊళ్లకు బయలుదేరి వెళ్ళటం కోలాహలంగా వర్ణితమైంది ఈ నవలలో. తండ్రి జానయ్య చర్చికి హక్కుదారుడు కనుక జానకి చర్చ్ కార్యక్రమాలలో హక్కుగా పాల్గొన్నదని, రమ చర్చిలో ఫాదర్ చదవమంటే బైబిల్ చదివిందని , ఒక పాట పాడిందని ఇలాంటి చిన్న చిన్న అంశాలను, పరిశీలనలను కథాగమనంలో భాగం చేయటం ద్వారా నవల ఇతివృత్తానికి ఒక క్రైస్తవ వాతావరణాన్ని సమకూర్చారు రచయిత.

క్రైస్తవ భక్తి మార్గం అనే కాదు , ఏ భక్తి మార్గమైనా అది ఒక మూఢ విశ్వాసంగా , ఒక్కొక్కసారి అభివృద్ధికి సంకెలగా మారి కూర్చునే అవకాశం కొల్లలు. ఆ దిశగా క్రైస్తవం మీద ఒక విమర్శనాత్మక దృష్టిని ప్రసరింపచేయటానికి రామం పాత్రను చక్కగా ఉపయోగించు కున్నారు రచయిత. అతను హరిజనుడే కానీ అతని జీవితంలోకి క్రెస్తవం ప్రవేశించలేదు. రమ గ్రామంలో హరిజనులందరూ క్రెస్తవులే . పేరుకు క్రైస్తవులే అయినా వాళ్ళ జీవితాలు హైందవ ఆచారాలతో పెనవేసుకొని పోవటం , హిందువుల ఉగాది, దీపావళి వంటివి అన్నీ వాళ్లు పాటించే పండుగలు కావటం, వాళ్ళ పెళ్లిళ్లు హిందూ పద్ధతిలోనే జరగటం ఇవన్నీ రచయిత దృష్టిని దాటిపోలేదు. రామం క్రెస్తవుడు కాదు, కానీ చర్చికి పోతాడు. క్లాసుకు నోటుబుక్ కూడా తెచ్చుకోని వాళ్ళు చర్చికి బైబిల్ తో హిమ్ బుక్ తో బయలుదేరటం అతనికి వింతగా అనిపిస్తుంది. ఆదివారం అంటే చర్చికి వెళ్ళటానికి మగపిల్లలు సైతం సబ్బులుతో ముఖాలు కడిగి మంచిబట్టలు వేసుకొని బయలుదేరటం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. చర్చి ఈడైన వధూవరుల ఎంపిక వేదిక గా భావించ బడటం కూడా అతనికి సహించరానిదే. పవిత్రాత్మతో చర్చికి పోవలసిన వాళ్ళు ఇన్ని లౌకిక ప్రయోజనాల ఆపేక్షతో ఆలయంలోకి ప్రవేశించటం అతను భరించలేనిది.

స్త్రీపురుష సహజ ఆకర్షణలను సంబంధాలను పవిత్రం, అపవిత్రం అని విడదీసి చూడటం, ఆ మేరకు వాటిని తిరిగి పవిత్రీకరించుకొనటానికి చర్చి, ప్రార్ధన మాధ్యమా లనుకొనే వైఖరిని రామం తప్పు పడతాడు. స్త్రీపురుష ఆకర్షణ , సంబంధం అపవిత్రం అయితే ఆ పనే చేయకుండా ఉండాలి కానీ తీరా మలినం అయినతరువాత ప్రార్థనలతో ప్రయోజనం ఏముంటుంది అని ప్రశ్నను ఎక్కుపెట్టినవాడతను . తప్పులు చేస్తూ క్షమించమని దేవుణ్ణి అడిగి మళ్ళీ మరొక తప్పు చేయటానికి వెలుపలికి వెళ్ళటం తనకు ఇష్టం లేదని కూడా అంటాడు రామం. మన పనులు విలువల ప్రాతిపదిక మీద ఉండాలి కానీ విశ్వాసాల మీద ఆధారపడి ఉండకూడదని ఒక ఉన్నత జీవిత తాత్వికతను స్థాపించే దిశగా క్రైస్తవాన్ని ఇంత స్థాయిలో భాగం చేసి ఇనాక్ 70లలోనే నవల వ్రాయటం విశేషం.

(ఇంకావుంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply